కరోనా: మనుషుల చర్మంపై 9 గంటలు సజీవంగా.. | Japan Kyoto University Latest Research Revealed | Sakshi
Sakshi News home page

కరోనా: మనుషుల చర్మంపై 9 గంటలు సజీవంగా..

Published Sat, Oct 10 2020 7:19 AM | Last Updated on Sat, Oct 10 2020 7:19 AM

Japan Kyoto University Latest Research Revealed - Sakshi

న్యూఢిల్లీ: మనుషుల చర్మంపై కరోనా వైరస్‌ 9 గంటల దాకా బ్రతికే ఉంటుందని తాజాగా వెల్లడైంది. ఇన్‌ ఫ్లూయెంజా ‘ఏ’వైరస్‌ (ఐఏవీ)తో సహా ఇతర వైరస్‌లు 2 గంటల్లోపే నాశనమవుతుండగా, కోవిడ్‌ కారక సార్స్‌–సీవోవీ–2 మాత్రం 9 గంటల పాటు జీవించి ఉంటుందని జపాన్‌ కు చెందిన పరిశోధన సంస్థ తాజాగా స్పష్టం చేసింది. ఇతరులకు కరోనా వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదం కూడా ఎక్కువేనని హెచ్చరించింది. సార్స్‌–సీవోవీ–2 వైరస్‌ వ్యాప్తి నిరోధానికి చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం అత్యంత అవసరమని పేర్కొంది. 

ఉపరితలాలపై దీర్ఘకాలం... 
చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, ఎప్పటికప్పుడు కడుక్కోవడం, శానిటైజ్‌ చేసుకోవడం ద్వారా ఈ వైరస్‌ వ్యాప్తిని తగ్గించే అవకాశం ఉందని సూచించింది. సాధారణ ఫ్లూ వైరస్‌తో పోలి్చతే కరోనా వైరస్‌ మనుషుల చర్మంతో సహా వివిధ ఉపరితలాలపై దీర్ఘకాలం చురుకుగా ఉంటున్నట్లు తేల్చారు. అయితే చర్మంతో పోలిస్తే స్టీలు, గాజు, ప్లాస్టిక్‌ వంటి వాటిపై త్వరగా నశిస్తోందన్నారు. అంతేకాదు చర్మంపైన ఉండే వైరస్‌కు లాలాజలం, చీమిడి, చీము.. లాంటివి తోడైతే కరోనా వైరస్‌ 11 గంటల పాటు సజీవంగా ఉంటుందని తేల్చారు.   (కరోనా మా దగ్గర పుట్టలేదు: చైనా)

ఇదీ క్యోటో వర్సిటీ పరిశోధన... 
జపాన్‌ క్యోటో పర్‌ఫెక్చురల్‌ వర్సిటీ ఆఫ్‌ మెడిసిన్‌ నిర్వహించిన తాజా పరిశోధన అంశాలు ఆక్స్‌ఫర్డ్‌ అకడమిక్, ద జర్నల్‌ క్లినికల్‌ ఇనెఫెక్షియస్‌ డిసీజెస్‌ల్లో ప్రచురితం అయ్యాయి. పోస్ట్‌మార్టం చేసిన శవాల నుంచి సేకరించిన చర్మంపై ఈ అధ్యయనం నిర్వహించారు. సాధారణంగా శరీరంలోని ఇతర అవయవాలతో పోల్చితే చర్మం నెమ్మదిగా క్షీణిస్తుంది. అందుకే చనిపోయి ఒకరోజు గడిచిన మృతదేహాల నుంచి సేకరించిన చర్మంపై ఈ పరిశోధనలు జరిపారు.  

ఇథెనాల్‌ శానిటైజర్‌తో 15 సెకన్లలోనే... 
చనిపోయి 24 గంటలు గడిచాక కూడా ఆ చర్మం ‘స్కీన్‌ గ్రాఫ్టింగ్‌’కు ఉపయోగపడుతుందని, చనిపోయాక కొంత సమయం దాకా చర్మం వినియోగించవచ్చు అన్న దానికి ఇంత కంటే నిదర్శనం అవసరం లేదని పరిశోధకులు పేర్కొన్నారు. అందుకే మృతదేహాల చర్మంపై నుంచి వైరస్‌కు సంబంధించి తీసుకున్న రీడింగ్స్‌ కచ్చితంగా ఉంటాయని నిర్ధారించామన్నారు. 80 శాతం ఇథెనాల్‌ ఉన్న హ్యాండ్‌ శానిటైజర్లు వాడితే కరోనా వైరస్‌తో సహా ఇన్‌ ఫ్లుయెంజా సెల్స్‌ కూడా 15 సెకన్లలోనే నాశనమైపోతాయని వారు తెలిపారు.

అంతేకాదు.. సబ్బుతో 20 సెకన్ల పాటు చేతులను కడుక్కుంటే ఈ వ్యాధి వ్యాప్తిని ఆపవచ్చని, 60 శాతం ఆల్కాహాల్‌ ఉన్న శానిటైజర్‌ వాడినా ఉపయోగం ఉంటుందని సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ ఇదివరకే సూచించింది. అధిక శాతం మందిపై కరోనా వైరస్‌ కొద్ది మేరకే ప్రభావం చూపుతోందని.. దీంతో దగ్గు, జలుబు, జ్వరం వంటివి వచ్చి కొద్ది రోజులకు తగ్గిపోతున్నాయని పేర్కొంది. అయితే వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వృద్ధులపై తీవ్ర ప్రభావం చూపుతుండటంతో వారి పరిస్థితి విషమించడం, చివరకు మరణించడం జరుగుతోందని ఈ పరిశోధకులు పునరుద్ఘాటించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
 
Advertisement