కర్నూలు(హాస్పిటల్): మానవ శరీరంలో మెదడు కీలక అవయవం. శరీర నిర్మాణం, వ్యవహారం మొత్తం నడిచేది అక్కడి నుంచే. అలాంటి మెదడులో అలజడి రేగితే శరీరం మొత్తం స్తంభించి పోతుంది. ఇక మెదడులో వచ్చే కణితులు ఇంకా ప్రమాదం. ఈ సమస్య పట్ల జాగ్రత్తగా ఉండకపోతే చాలా ప్రమాదం. ప్రజలకు ఈ కణితులపై అవగాహన కల్పించేందుకు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ ఏటా జూన్ 8న వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా బ్రెయిన్ ట్యూమర్‌పై ప్రత్యేక కథనం.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం ప్రతి లక్ష మందిలో ఏడుగురు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. అంటే జిల్లాలో 350 మంది దాకా ఈ జబ్బుతో సతమతమవుతున్నట్లు అంచనా. 20 ఏళ్ల క్రితం జిల్లాలో ఒకే ఒక్క న్యూరోసర్జన్ డాక్టర్ డబ్ల్యూ సీతారామ్ ఉండేవారు. మెదడు, కేంద్రనాడీ మండలానికి వచ్చే వ్యాధులకు ఆయనే చికిత్స అందించేవారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఆయన వద్ద చికిత్స తీసుకునేందుకు రాయలసీమ జిల్లాలన్నింటితో పాటు తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల నుంచి సైతం వచ్చిన పేషెంట్లు నెలల తరబడి వేచి చూసేవారు.
దేశవ్యాప్తంగా వైద్యకళాశాలలు, సూపర్‌స్పెషాలిటీ సీట్లు పెరిగిన కారణంగా ఇటీవల సూపర్‌స్పెషలిస్టుల కొరత తీరింది. ప్రతి విభాగానికి పది మందికి పైగా స్పెషాలిటీ వైద్యులున్నారు. ఈ మేరకు న్యూరోసర్జరీ విభాగంలోనూ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోనే ఐదుగురు డాక్టర్లు ఉండగా, ప్రైవేటుగా మరో 10 మంది దాకా వైద్యులున్నారు. వీరితో పాటు అంతే సంఖ్యలో న్యూరోఫిజీషియన్లూ సేవలందిస్తున్నారు. వీరందరి వద్దకు బ్రెయిన్ ట్యూమర్ బాధితులు చికిత్స కోసం వస్తున్నారు. ఇలాంటి వ్యాధులకు శస్త్రచికిత్సలను కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలతో పాటు నగరంలోని నాలుగైదు ఆసుపత్రుల్లో మాత్రమే నిర్వహిస్తున్నారు.
మెదడు కణితులు, రకాలు?
మెదడులోని కణజాలాల్లో ఏర్పడే ముద్దను మెదడు కణితి అంటారు. ఇవి రెండు రకాలు. ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్, సెకండరీ బ్రెయిన్ ట్యూమర్. ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్‌ను నాలుగు విభాగాలుగా విభజించారు. సెకండరీ బ్రెయిన్ ట్యూబర్లు శరీరంలో వివిధ భాగాల్లో సోకుతాయి. అవి రక్తంలో ప్రవేశించి మెదడుకు చేరతాయి. దీని ద్వారా మెదడులో కణితులు ఏర్పడతాయి. కొన్ని రసాయనాల బారిన పడటం, రేడియేషన్ ఎక్కువగా ఉండటం, ఎక్స్‌టీమ్ వైరస్ బారిన పడటం వల్ల ఈ కణితులు ఏర్పడతాయి.
లక్షణాలు
మెదడు కణితుల లక్షణాలను రెండు రకాలుగా విభజించవచ్చు. మొదటిది జనరల్ లక్షణాలు. రెండవది ప్రత్యేకమైనది. జనరల్ లక్షణాలు కణితి పరిమాణాన్ని బట్టి వస్తాయి. తలనొప్పి, వాంతులు, చూపు మందగించడం, ఒత్తిడి పెరగడం, స్పృహకోల్పోవడం వంటివి. ఇక రెండవది మెదడులో కణితి ఏర్పడిన స్థానాన్ని బట్టి వస్తాయి. మెదడు ముందు భాగం, మధ్యభాగం, వెనుక భాగంలో ఆయా స్థానాలను బట్టి లక్షణాలు ఉంటాయి. అందులో మాట తడబడటం, చూపు మబ్బుగా కనిపించడం, చెవులు వినిపించకపోవడం, మూతి వంకరపోవడం, ఫిట్స్ రావడం, మాట తడబడటం, పక్షవాతం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ప్రతి తలనొప్పిని కణితికి కారణం అని చెప్పలేము. ఈ లక్షణాలు ఉన్నప్పుడు వైద్యులు తప్పనిసరిగా కలవాలి.
నిర్ధారణ ఇలా..
మెదడులో కణితులు ఉన్నాయా లేదా అనేది నిర్ధారించడానికి మూడు రకాల పరీక్షలు ఉన్నాయి. మొదటిది క్లినికల్, రెండోది రేడియాలజీ, మూడోది సర్జికల్ ద్వారా నిర్ధారిస్తారు. ఇందులో సీటీస్కాన్, ఎంఆర్‌ఐ స్కాన్‌లో తేలిపోతుంది. కానీ కొందరిలో సర్జికల్ ద్వారా కూడా నిర్ధారణ చేయవచ్చు. ఈ స్కాన్‌లలో కణితులను నిర్ధారణ చేసుకున్న తర్వాత చికిత్స ప్రారంభిస్తారు.
మెదడు కణితులను బట్టి చికిత్స
మెదడులో ఏర్పడిన కణితులను గ్రేడ్ 1, 2, 3, 4 విభాగాలుగా విభజించి చికిత్స అందిస్తాం. అలాగే కణితుల స్థానంపై కూడా ఆధారపడి చికిత్స ఉంటుంది. గ్రేడ్ 1, 2లలో ఉన్న కణితులు మూడు సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉంటే రేడియేషన్ ద్వారా తగ్గించవచ్చు. దీని ద్వారా వారి సాధారణ జీవితాన్ని కొనసాగించవచ్చు. అయితే గ్రేడ్ 3, 4 కణితులు ఉంటే జీవితకాలం జీవించే అవకాశం తక్కువగా ఉంటుంది. రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ వంటి అత్యాధునిక చికిత్స అందుబాటులో ఉన్నాయి. ఈ కణితులను త్వరగా గుర్తించి చికిత్స అందిస్తే మంచింది. – డాక్టర్ ఎన్.సుమంత్‌కుమార్, న్యూరోసర్జన్, కర్నూలు
Comments
Please login to add a commentAdd a comment