Brain Tumor
-
అంతటి నొప్పిని ఎలా తట్టుకుందో.. కంటతడి పెట్టిస్తున్న కీర్తి సురేష్ మాటలు
సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ తన స్నేహితురాలిని గుర్తు చేసుకుని చాలా ఎమోషనల్ అయింది. ఈమేరకు సోషల్ మీడియాలో ఆమె ఒక పోస్ట్ చేసింది. ఇటీవల బ్రెయిన్ ట్యూమర్‌తో మరణించిన తన బెస్ట్ ఫ్రెండ్ మనీషా గురించి కీర్తి పలు విషయాలను పంచుకుంది. తన స్నేహితురాలితో ఉన్న బంధాన్ని సుదీర్ఘ పోస్ట్‌తో తెలిపింది. ఆసుపత్రిలో మనీషాను చూసినప్పుడు ఎలా ఏడ్చిందో గుర్తుచేసుకుంది. అలా తన స్నేహితురాలి గురించి షేర్ చేసిన పోస్టు అందరినీ కంటతడి పెట్టిస్తోంది.కీర్తి సురేష్ ప్రాణ స్నేహితురాలు మనీషా కొద్దిరోజుల క్రితమే బ్రెయిన్ ట్యూమర్‌తో చనిపోయింది. ఇదే విషయాన్ని ఆమె పుట్టినరోజు సందర్భంగా కీర్తి ఇలా గుర్తు చేసుకుంది. ' కొన్ని వారాలుగా నేను చాలా బాధను అనుభవిస్తున్నాను. నా చిన్ననాటి స్నేహితురాలు మనీషా ఇంత త్వరగా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లుతుందని అనుకోలేదు. ఈ సంఘటన నమ్మశక్యంగా లేదు. 21 ఏళ్ల వయసులో తీవ్రమైన బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న ఆమె గత నెల వరకు దాదాపు 8 ఏళ్ల పాటు పోరాడింది. గతేడాది నవంబర్‌లో ఆమెకు మూడో సర్జరీ జరిగింది. అంతటి బాధను తట్టుకునే శక్తి ఆమెకు ఎలా వచ్చిందో.. అలాంటి సంకల్ప శక్తి ఉన్నవారిని నేను ఇప్పటి వరకు చూడలేదు. కానీ ఒక్కోసారి నొప్పిని భరించలేకపోతున్నానంటూ ఆ బాధను తట్టుకుంటూనే కన్నీళ్లు పెట్టుకునేది. ఆ సమయంలో ఆసుపత్రి కారిడార్ వద్ద నేను కూడా ఏడ్చేశాను. కన్నీటితో నిండిన ఆ సంఘటన నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఈ ప్రపంచాన్ని వదిలేసి పోయింది. ఆమె అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు నేను చివరిసారిగా కలిశాను. చిన్నవయసులోనే ప్రాణాలు కోల్పోయిన నా స్నేహితురాలు భవిష్యత్‌పై ఎన్నో కలలు కనేది. బతాకాలనే ఆశతో నా మనీషా చివరి శ్వాస వరకు పోరాడింది. కానీ దేవుడు దయ చూపలేదు. ఆమె దూరమై సరిగ్గా నెలరోజులు అవుతుంది. తన గురించి ఆలోచించకుండా ఒక్కరోజు కూడా గడవడం లేదు. మనీషా లేకుండానే తన పుట్టినరోజు జరుపుకోవాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు.' అని తన ప్రాణస్నేహితురాలి మరణం గురించి కీర్తి చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
బ్రెయిన్‌కు ట్యూమర్ ముప్పు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఇటీవల కాలంలో బ్రెయిన్ ట్యూమర్ బాధితులు పెరుగుతున్నారు. విజయవాడలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు ప్రతి నెలా 40 మంది వరకూ బ్రెయిన్ ట్యూమర్ బాధితులు వస్తున్నారు. తీవ్రమైన తలనొప్పితో వచ్చిన బాధితులకు వైద్యులు బ్రెయిన్ స్కాన్ చేసి వ్యాధిని నిర్ధారించి, అవసరమైన చికిత్సలు, శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. ఒకప్పుడు ఎక్కువగా 50 ఏళ్లు పైబడిన వారిలో బ్రెయిన్ ట్యూమర్లు వచ్చేవని, ఇప్పుడు 15 ఏళ్ల చిన్నారులు, 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు వారిలోనూ బ్రెయిన్ ట్యూమర్స్ చూస్తున్నామని వైద్యులు పేర్కొంటున్నారు. బ్రెయిన్ ట్యూమర్స్ రావడానికి అనేక కారణాలు ఉంటాయని, చిన్న పిల్లల్లో జన్యుపరమైన లోపాలే కారణంగా వివరిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యాధికి అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొంటున్నారు. నాలుగు దశల్లో వ్యాధి బ్రెయిన్ ట్యూమర్‌కు నాలుగు దశలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. మొదటి దశలో తలనొప్పి, వాంతులు, తలతిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రెండోదశలో తీవ్రమైన తలనొప్పి, అకారణంగా వాంతులు, తలతిరగడం ఎక్కువగా ఉంటాయి. మూడో దశలో బ్రెయిన్లోని ట్యూమర్ ఇతర అవయవాలకు వ్యాప్తి చెందుతుంది. ఊపిరితిత్తులు, వెన్నుపూసలకు విస్తరిస్తుంది. లక్షణాలు కూడా తీవ్రంగా ఉంటాయి. నాలుగోదశలో ట్యూమర్ కణాలు శరీరంలోని రక్తంలో కలిసి అంతా వ్యాప్తి చెందుతుంది. ఈ దశలో రోగి మరింత క్షీణిస్తాడు.నిర్ధారణ ఇలా.. తలనొప్పితో వచ్చిన రోగికి సీటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్లు చేయడం ద్వారా బ్రెయిన్ ట్యూమర్‌ను నిర్ధారిస్తారు. ఒకప్పుడు బ్రెయిన్ ట్యూమర్‌ను నాలుగో దశ వచ్చే వరకూ గుర్తించే వారు కాదు. వ్యాధి నిర్ధారణ కాకముందే మరణించినవారు కూడా ఉన్నారు. ఇప్పుడు అత్యాధునిక డయాగ్నోస్టిక్ సేవలు అందుబాటులోకి రావడంతో తొలిదశలోనే గుర్తించగలుగుతున్నారు. ప్రస్తుతం ఎంఆర్ఐ, సీటీ స్కాన్ సౌకర్యాలు, విస్తృతంగా స్కానింగ్ పరికరాలు అందుబాటులోకి రావ డంతో తొలిదశలో గుర్తించగలుగుతున్నారు. చికిత్సలు ఇలా.. బ్రెయిన్ ట్యూమర్ దశ బట్టి చికిత్సలు అందిస్తారు. కొందరికి మందులు ఇస్తూ ట్యూమర్‌ను తగ్గిస్తారు. మరికొందరికి శస్త్ర చికిత్స ద్వారా ట్యూమర్‌ను తొలగిస్తారు. రేడియేషన్ థెరపీ, శస్త్ర చికిత్స తర్వాత కీమోథెరపీ వంటి చికిత్సలు అందిస్తారు. ప్రస్తుతం ఆధునిక చికిత్సలు, అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి రావడంతో బ్రెయిన్ ట్యూమర్ రోగులకు మెరుగైన సేవలు అందుతున్నాయి. కారణాలు ఇవీ.. జన్యుపరమైన లోపాలు. తీసుకునే ఆహారం. రేడియేషన్ ప్రభావం. పొగ, మద్యం తాగడం. తీవ్రతను బట్టి వైద్యం నెలలో 20 నుంచి 30 మంది వరకూ బ్రెయిన్ ట్యూమర్ రోగులు వస్తున్నారు. ఎక్కువగా రెండో దశలోనే వస్తున్నారు. వారి పరిస్థితిని అంచనా వేసి మందులు ఇవ్వడమా, శస్త్ర చికిత్స చేయడమా అన్నది నిర్ధారిస్తాం. తీవ్రమైన తలనొప్పితో వచ్చిన వారికి సీటీ, ఎంఆర్ఐ స్కాన్ చేయడంతో ట్యూమర్‌ను నిర్ధారిస్తున్నాం. ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో స్కానింగ్‌లు అందుబాటులోకి రావడంతో వ్యాధిని త్వరగా గుర్తించగలుగుతున్నాం. – డాక్టర్ గొల్ల రామకృష్ణ, న్యూరోసర్జన్, విజయవాడకచ్చితమైన నిర్ధారణ బ్రెయిన్ ట్యూమర్లను కాంట్రాస్ట్ సీటీతో కచ్చితమైన నిర్ధారణ చేస్తాం. బ్రెయిన్లో ఏదైనా గడ్డ ఉంటే అది ట్యూమరా, ఇంకేమైనానా అని తెలుసుకోవచ్చు. ఏ ప్రాంతంలో ట్యూమర్ ఉంది అనేది చెప్పవచ్చు. ఒకప్పుడు నాలుగో దశలో వ్యాధిని గుర్తించేవారు. ఇప్పుడు అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ సరీ్వసెస్ అందుబాటులోకి రావడంతో మొదటి, రెండో దశలోనే గుర్తించగలుగుతున్నాం. లక్షణాలను బట్టి స్కాన్ చేసి వ్యాధిని నిర్ధారణ చేయొచ్చు. – డాక్టర్ ఎన్.దీప్తిలత, రేడియాలజిస్ట్, విజయవాడ -
AIIMS Delhi: అయిదేళ్ల చిన్నారికి బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్య నిపుణు లు అరుదైన ఘనత సాధించారు. బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న అయిదేళ్ల బాలి కకు విజయవంతంగా శస్త్ర చికిత్స పూర్తి చేశా రు. అయిదేళ్ల చిన్నారి మెలకువ స్థితిలో ఉండగానే ఇలా ఆపరేషన్ చేయడం ప్రపంచంలోనే మొట్టమొదటిసారని చెప్పారు. ఒకటో తరగతి చదువుకునే అక్షిత అనే అయిదేళ్ల చిన్నారి మూర్ఛలతో బాధపడుతోంది. పరిశీలించిన ఎయిమ్స్ వైద్యులు ఆమెకు ఎంఆర్ఐ స్కాన్ చేయించి మెదడులో మాట/భా షను నియంత్రించే చోట కణితి(ట్యూమర్) ఉన్నట్లు గుర్తించారు. ఈ నెల 4న న్యూరో సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ దీపక్ గుప్తా సారథ్యంలోని న్యూరోసర్జన్ల బృందం శస్త్రచికిత్సకు ఉపక్రమించింది. చిన్నారి మెలకువ స్థితిలోనే ఉంచింది. దీనిద్వారా కణితిలను పూర్తిగా తొలగించేందుకు, నరాల సంబంధిత లోపా లను తగ్గించడానికి తోడ్పడుతుందని డాక్టర్ గుప్తా చెప్పారు. నొప్పి కూడా కనీస స్థాయిలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. చిన్నారికి ప్రత్యేక నిపుణులు మత్తు మందు ఇ వ్వడం సహా సర్జరీకి ప్రక్రియకు దాదాపు 3 గంటలు పట్టింది. సర్జరీ సమయంలో తాము చూపిన ప్రధాని మోదీ ఫొటోను చిన్నారి గుర్తు పట్టిందన్నారు. శస్త్రచికిత్స ఆసాంతం పూర్తయ్యేదాకా అక్షిత మెలకువ స్థితిలోనే ఉందన్నారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోందని, సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేస్తామని డాక్టర్ దీపక్ గుప్తా చెప్పారు. మెలకువగా ఉన్న పరిస్థితుల్లో బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ చేయించుకున్న ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలిగా అక్షిత పేరు ఉంటుందని డాక్టర్ గుప్తా తెలిపారు. -
చిన్నారుల్లో బ్రెయిన్ ట్యూమర్లు! అది ప్రీమెచ్యుర్ చిన్నారుల్లోనే ఎక్కువ ఎందుకు?
ఇటీవల చిన్నారుల్లో బ్రెయిన్ ట్యూమర్ల (మెదడులో గడ్డల) కేసులు చాలా ఎక్కువగా వస్తుండటం అటు తల్లిదండ్రులు, ఇటు వైద్యులు... ఇలా అన్ని వర్గాల్లోనూ బెంబేలు పుట్టిస్తోంది. మరీ ముఖ్యంగా మన దేశంలో నెలలు నిండకుండానే పుట్టిన బిడ్డల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా వస్తుండటం వైద్యవర్గాల్లో ఆందోళన పెంచుతోంది. మామూలుగానైతే బిడ్డ తన తల్లి కడుపులో 37 వారాలు పెరగాలి. తల్లి కడుపులో అంతకంటే తక్కువగా ఉన్న పిల్లల్లో కొన్ని శారీరక వ్యవస్థలు పూర్తిగా ఎదగకుండాపోయే ప్రమాదముంటుంది. ఇలాంటి చిన్నారుల్లోనే మెదడు గడ్డలు ఎందుకు ఎక్కువగా వస్తున్నాయనే అంశంపై వైద్యవర్గాలు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరిస్తున్న ఈ తరుణంలో... చిన్నారుల్లో మెదడు గడ్డల సమస్యపై అవగాహన కోసం ఈ కథనం. చిన్నారులు తమ తల్లి కడుపులో ఉండాల్సిన వ్యవధి కన్నా తక్కువ కాలం ఉండటం వల్ల... ప్రీ–మెచ్యుర్ బేబీస్‌లో కొన్ని అవయవాలు పూర్తిగా ఎదగకపోవచ్చు. మిగతా అవయవాల సంగతి ఎలా ఉన్నా, అన్ని అవయవాల్లోకెల్లా మెదడు ఎదుగుదల చాలా కీలకం. కాబట్టి అదొక్కటి ఎదగకపోవడం వల్ల చాలా వ్యవస్థలు ప్రభావితం అయ్యే అవకాశముంటుంది. ప్రీమెచ్యుర్ బేబీస్కీ, అవయవాల పెరుగుదల లోపాలకీ సంబంధమేమిటంటే... కడుపులో పూర్తికాలం లేకపోవడం వల్ల మెదడు సహా, కొన్ని అవయవాలు పూర్తిగా ఎదగకపోవడం ఒక ముప్పు (రిస్క్ ఫ్యాక్టర్)కాగా... మెదడులో గడ్డలు రావడం, క్రమేణా అవి పెరగడం, దాంతో... కొన్ని వ్యవస్థలను నియంత్రించే సెంటర్లను ఆ పెరిగే గడ్డలు నొక్కేయడంతో ఈ ముప్పు మరింత పెరుగుతుంది. కడుపులో పూర్తిగా ఎదిగిన బిడ్డలతో పోలిస్తే... ప్రీ–టర్మ్ చిన్నారుల్లో ఈ ముప్పు పెరిగేందుకు ఈ అంశాలు దొహదపడతాయి. దానికి తోడు జన్యుపరమైన సమస్యలతో పుట్టుకతోనే (కంజెనిటల్గా) వచ్చే ఆరోగ్య సమస్యలూ, పర్యావరణ కారణాలతో వచ్చే ఆరోగ్యలోపాలూ... ఇవన్నీ కలిసి ప్రీ–మెచ్యుర్ బేబీల రిస్క్‌ను మరింతగా పెంచేస్తాయి. లక్షణాలు మెదడులో గడ్డలున్న పిల్లల్లో కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. అవి... ఎంతకూ తగ్గని తలనొప్పి... ఇది నిరంతరమూ చిన్నారులను వేధిస్తుంటుంది. కారణం తెలియకుండా కనిపించే వాంతులు ∙పిల్లల ప్రవర్తనలో తేడాలు, మెదడులో గడ్డలు ప్రభావితం చేసే చోటు (సెంటర్)ను బట్టి కొన్నిసార్లు పిల్లలు వింతగా ప్రవర్తించవచ్చు. అలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో కారణం వెంటనే తెలియకపోవచ్చు. చిన్నారుల ఎదుగుదల ఆలస్యం కావడం (డెవలప్మెంటల్ డిలే) సమస్యను గుర్తించడం, త్వరగా నిర్ధారణ చేయడమెలా... పిల్లలు తమ సమస్యను పెద్దవారిలా చెప్పలేరు. పైగా మెదడులో గడ్డలు ఉన్నప్పుడు పిల్లల్లో కనిపించే లక్షణాలు కూడా మామూలు పిల్లల్లోనూ ఏదో ఒక సమయంలో కనిపించేవే. ఈ అంశం కూడా సమస్యను గుర్తించడం, త్వరగా నిర్ధారణ చేయడంలో సమస్యగా మారుతుంది. ఇక నిర్ధారణ కోసం లక్షణాలను బట్టి ఈఈజీ, అల్ట్రాసౌండ్ లేదా ఎమ్మారై స్కాన్‌లాంటి మెదడు స్కానింగ్ ప్రక్రియలతో పాటు మరికొన్ని పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. చిన్నారుల్లోని మెదడులో గడ్డలు ఉన్నట్లుగా ఎంత త్వరగా గుర్తిస్తే... చికిత్సకు అంతగా మేలు చేస్తుంది. నిజానికి ఈ అంశమే చికిత్సలో చాలా కీలకం. అందుకే తల్లిదండ్రులు మాత్రమే కాకుండా... పిల్లల స్కూలు టీచర్లు, ఇతరత్రా వారికి సేవలందించేవారు, సహాయకులు (కేర్ గివర్స్), డాక్టర్ల వంటి హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ అందరూ చిన్నారుల మెదడులో గడ్డలున్నప్పుడు కనిపించే లక్షణాలు, ఇతరత్రా అంశాలూ, సవాళ్లపై అవగాహన కలిగి ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఎన్నో కొత్త పరిశోధనలు ఇటీవల మెదడులో వచ్చే రకరకాల గడ్డలు... అందునా మరీ ముఖ్యంగా నెలలు నిండకుండానే పుట్టిన చిన్నారుల్లో వచ్చే మెదడు గడ్డల విషయంలో చాలా కీలకమైన పరిశోధనలు జరుగుతున్నాయి. మరిన్ని అధునాతన పరిశోధన ఫలితాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఉదాహరణకు మెదడు సర్జరీల్లో ‘న్యూరోనావిగేషన్’, ‘న్యూరోమానిటరింగ్), అలాగే కోత తక్కువగా ఉండే విధానాలు. ఈ పద్ధతుల్లో చేసే శస్త్రచికిత్సలో మెదడులోని అత్యంత సంక్లిష్టమైన భాగాలను 3–డీ ఇమేజ్‌లో గడ్డ నిర్దిష్టంగా ఎక్కడ ఉందో చూస్తూ, సర్జన్ సరిగ్గా అక్కడికే చేరడానికి వీలవుతుంది. తక్కువ కోతతో శస్త్రచికిత్స చేయడం వల్ల నొప్పి బాగా తగ్గడంతో పాటు, కోత కూడా తక్కువ కావడంతో బాధితులైన చిన్నారులు చాలా త్వరగా కోలుకుంటారు. మెదడులోని అత్యంత సున్నితమైన భాగాలకు చేరే సమయాల్లో కలిగే రిస్క్‌లను అంచనా వేసి, మిగతా భాగాలకు ఎలాంటి విఘాతం లేకుండా గడ్డ ఉన్న చోటికి చేరడానికి ఇప్పుడు అందుబాటులో ఉన్న అత్యాధునిక సునిశిత పరికరాలు బాగా తోడ్పడతాయి. అందువల్ల గతంతో పోలిస్తే ఇప్పుడీ సమస్య పట్ల అంతగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. చికిత్స ఒకసారి సమస్య నిర్ధారణ జరిగాక చికిత్స అన్నది కేవలం ఒక స్పెషలిస్టు డాక్టరుతో కాకుండా అనేక రకాలుగా (మల్టీ డిసిప్లినరీ అప్రోచ్) జరగాల్సిన అవసరం ఉంటుంది. మందులతో పాటు మెదడులో గడ్డ ఉన్న ప్రాంతాన్ని బట్టి... కొన్ని సందర్భాల్లో కీమోథెరపీ, రేడియేషన్ వంటి చికిత్సలూ అవసరమవుతాయి. ఒకవేళ శస్త్రచికిత్స చేయాల్సి వస్తే... మెదడులో గడ్డ ఎలాంటి ప్రాంతంలో ఉంది, దానికి శస్త్రచికిత్స చేసే సమయంలో ఏయే వ్యవస్థలు ప్రభావితమయ్యే అవకాశముంది...లాంటి అనేక అంశాను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు సునిశితమైన, అనుభవజ్ఞులైన పీడియాట్రిక్ ఆంకాలజీ కేర్ స్పెషలిస్టుల ఆధ్వర్యంలో చికిత్స జరగాల్సి రావచ్చు. అందుకే ఇలాంటి పిల్లల తల్లిదండ్రులకూ... ఈ సమస్యలపై ప్రత్యేక అవగాహన ఉండటం చాలా అవసరం. --డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ న్యూరో అండ్ స్పైన్ సర్జన్ (చదవండి: గురకతో వచ్చే ఆరోగ్య అనర్థాలు ఎన్నో? ఒక్కోసారి మరణానికి దాతీయొచ్చు!) -
Brain Tumor: బ్రెయిన్ ట్యూమర్ గుర్తించడం ఇలా.. కారణాలివే..
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఇటీవల కాలంలో బ్రెయిన్ ట్యూమర్ బాధితులు పెరుగుతున్నారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రికే ప్రతినెలా 20 నుంచి 30 మంది వరకూ బ్రెయిన్ ట్యూమర్ బాధితులు వస్తుండగా, ప్రైవేటు ఆస్పత్రుల్లో మరికొంతమంది చికిత్స పొందుతున్నారు. తీవ్రమైన తలనొప్పితో వచ్చిన వారికి బ్రెయిన్ స్కాన్ చేసి వ్యాధిని నిర్ధారించి, అవసరమైన చికిత్సలు చేస్తున్నారు. ఒకప్పుడు ఎక్కువగా 50 ఏళ్లు పైబడిన వారిలో బ్రెయిన్ ట్యూమర్లు చూసేవారమని, ఇప్పుడు 15 ఏళ్ల చిన్నారులు, 30–40 ఏళ్ల మధ్య వయస్సు వారిలోనూ బ్రెయిన్ ట్యూమర్లు చూస్తున్నామని వైద్యులు చెబుతున్నారు. బ్రెయిన్ ట్యూమర్లు రావడానికి అనేక కారణాలు ఉంటాయని, చిన్న పిల్లల్లో జన్యుపరమైన లోపాలే కారణంగా పేర్కొంటున్నారు. ప్రస్తుతం అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చినట్లు చెపుతున్నారు. కారణాలివే.. ► జన్యుపరమైన లోపాలు ► తీసుకునే ఆహారం వలన ► సెల్‌ఫోన్ రేడియేషన్ ► స్మోకింగ్, ఆల్కాహాల్ తీసుకునే వారిలోనూ రావచ్చు. గుర్తించడం ఇలా... బ్రెయిన్ ట్యూమర్‌కు నాలుగు దశలు ఉంటాయని వైద్యులు చెపుతున్నారు. మొదటి దశ : తలనొప్పి, వాంతులు, తల తిరగడం. రెండోదశ : తీవ్రమైన తలనొప్పి, అకారణంగా వాంతులు అవడం, తలతిరగడం ఎక్కువగా ఉంటుంది. మూడో దశ : బ్రెయిన్లోని ట్యూమర్ ఇతర అవయవాలకు వ్యాప్తి చెందుతుంది. ఊపిరితిత్తులు, వెన్నుపూసలకు విస్తరిస్తుంది. లక్షణాలు కూడా తీవ్రంగా ఉంటాయి. నాలుగోదశ : ట్యూమర్ కణాలు శరీరంలోని రక్తంలో కలిసి అంతా వ్యాప్తి చెందుతుంది. ఈ దశలో రోగి మరింత క్షీణిస్తాడు. చికిత్సలు ఇలా.. బ్రెయిన్ ట్యూమర్ దశను బట్టి చికిత్స అందిస్తారు. కొందరికి మందులు ఇస్తూ ట్యూమర్‌ను తగ్గిస్తారు. మరికొందరికి శస్త్ర చికిత్స ద్వారా ట్యూమర్‌ను తొలగిస్తారు. రేడియేషన్ థెరపీ, శస్త్ర చికిత్స తర్వాత కీమోథెరపీ వంటి చికిత్సలు అందిస్తారు. ప్రస్తుతం ఆధునిక చికిత్స, అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి రావడంతో బ్రెయిన్ ట్యూమర్ రోగులకు మెరుగైన సేవలు అందుతున్నాయి. నిర్ధారణ ఇలా.. తలనొప్పితో వచ్చిన రోగికి సీటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్లు చేయడం ద్వారా బ్రెయిన్ ట్యూమర్‌ను నిర్ధారిస్తారు. ఒకప్పుడు బ్రెయిన్ ట్యూమర్‌ను నాలుగో దశ వచ్చే వరకూ గుర్తించే వారు కాదు. వ్యాధి నిర్ధారణ కాకముందే మరణించినవారు కూడా ఉన్నారు. ఇప్పుడు అత్యాధునిక డయాగ్నోస్టిక్ సేవలు అందుబాటులోకి రావడంతో తొలిదశలోనే గుర్తించగలుగుతున్నారు. ప్రభుత్వాస్పత్రిలో సైతం రెండు సీటీ స్కానింగ్ యంత్రాలతో పాటు, ఒక ఎంఆర్ఐ పరికరం అందుబాటులో ఉంది. ప్రైవేటులో సైతం విస్తృతంగా స్కానింగ్ పరికరాలు అందుబాటులోకి రావడంతో తొలిదశలో గుర్తించగలుగుతున్నారు. (క్లిక్ చేయండి: చలికాలం మెదడుకు ముప్పు.. జాగ్రత్త..!) ఎక్కువగా రెండో దశలోనే వస్తున్నారు ప్రభుత్వాస్పత్రిలోని న్యూరాలజీ ఓపీకి నెలకు 20 నుంచి 30 మంది వరకూ బ్రెయిన్ ట్యూమర్ రోగులు వస్తున్నారు. ఎక్కువగా రెండో దశలోనే వస్తున్నారు. వారి పరిస్థితిని అంచనా వేసి మందులు ఇవ్వాలా, శస్త్ర చికిత్స చేయాలా అనేది నిర్ధారిస్తాం. తీవ్రమైన తలనొప్పితో వచ్చిన వారికి సీటీ, ఎంఆర్ఐ స్కాన్ చేయడంతో ట్యూమర్‌ను నిర్ధారిస్తున్నారు. అందుకోసం ప్రభుత్వాస్పత్రిలో రెండు సీటీ స్కాన్లు, ఒక ఎంఆర్ఐ స్కానింగ్ పరికరం అందుబాటులో ఉంది. – డాక్టర్ దార వెంకట రమణ, న్యూరాలజీ విభాగాధిపతి, జీజీహెచ్, విజయవాడ కచ్చితమైన నిర్ధారణ బ్రెయిన్ ట్యూమర్లను కాంట్రాస్ట్ సీటీతో కచ్చితమైన నిర్ధారణ చేస్తాం. బ్రెయిన్లో ఏదైనా గడ్డ ఉంటే అది ట్యూమరా, ఇంకేమైనా ఉందా అనేది తెలుసుకోవచ్చు. ఏ ప్రాంతంలో ట్యూమర్ ఉంది అనేది చెప్పవచ్చు. ఒకప్పుడు నాలుగో దశ వరకూ తెలుసుకునే వారు కాదు. ఇప్పుడు అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ అందుబాటులోకి రావడంతో. మొదటి, రెండో దశలోనే గుర్తించగలుగుతున్నారు. తలనొప్పితో వచ్చిన వారికి లక్షణాలను బట్టి స్కాన్ చేస్తే ట్యూమర్ ఉంటే నిర్ధారణ చేయొచ్చు. – డాక్టర్ ఎన్.దీప్తిలత, రేడియాలజిస్ట్ -
World Brain Tumor Day: మెదడులో కల్లోలం.. లక్ష మందిలో ఏడుగురికి
కర్నూలు(హాస్పిటల్): మానవ శరీరంలో మెదడు కీలక అవయవం. శరీర నిర్మాణం, వ్యవహారం మొత్తం నడిచేది అక్కడి నుంచే. అలాంటి మెదడులో అలజడి రేగితే శరీరం మొత్తం స్తంభించి పోతుంది. ఇక మెదడులో వచ్చే కణితులు ఇంకా ప్రమాదం. ఈ సమస్య పట్ల జాగ్రత్తగా ఉండకపోతే చాలా ప్రమాదం. ప్రజలకు ఈ కణితులపై అవగాహన కల్పించేందుకు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ ఏటా జూన్ 8న వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా బ్రెయిన్ ట్యూమర్‌పై ప్రత్యేక కథనం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం ప్రతి లక్ష మందిలో ఏడుగురు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. అంటే జిల్లాలో 350 మంది దాకా ఈ జబ్బుతో సతమతమవుతున్నట్లు అంచనా. 20 ఏళ్ల క్రితం జిల్లాలో ఒకే ఒక్క న్యూరోసర్జన్ డాక్టర్ డబ్ల్యూ సీతారామ్ ఉండేవారు. మెదడు, కేంద్రనాడీ మండలానికి వచ్చే వ్యాధులకు ఆయనే చికిత్స అందించేవారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఆయన వద్ద చికిత్స తీసుకునేందుకు రాయలసీమ జిల్లాలన్నింటితో పాటు తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల నుంచి సైతం వచ్చిన పేషెంట్లు నెలల తరబడి వేచి చూసేవారు. దేశవ్యాప్తంగా వైద్యకళాశాలలు, సూపర్‌స్పెషాలిటీ సీట్లు పెరిగిన కారణంగా ఇటీవల సూపర్స్పెషలిస్టుల కొరత తీరింది. ప్రతి విభాగానికి పది మందికి పైగా స్పెషాలిటీ వైద్యులున్నారు. ఈ మేరకు న్యూరోసర్జరీ విభాగంలోనూ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోనే ఐదుగురు డాక్టర్లు ఉండగా, ప్రైవేటుగా మరో 10 మంది దాకా వైద్యులున్నారు. వీరితో పాటు అంతే సంఖ్యలో న్యూరోఫిజీషియన్లూ సేవలందిస్తున్నారు. వీరందరి వద్దకు బ్రెయిన్ ట్యూమర్ బాధితులు చికిత్స కోసం వస్తున్నారు. ఇలాంటి వ్యాధులకు శస్త్రచికిత్సలను కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలతో పాటు నగరంలోని నాలుగైదు ఆసుపత్రుల్లో మాత్రమే నిర్వహిస్తున్నారు. మెదడు కణితులు, రకాలు? మెదడులోని కణజాలాల్లో ఏర్పడే ముద్దను మెదడు కణితి అంటారు. ఇవి రెండు రకాలు. ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్, సెకండరీ బ్రెయిన్ ట్యూమర్. ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్‌ను నాలుగు విభాగాలుగా విభజించారు. సెకండరీ బ్రెయిన్ ట్యూబర్లు శరీరంలో వివిధ భాగాల్లో సోకుతాయి. అవి రక్తంలో ప్రవేశించి మెదడుకు చేరతాయి. దీని ద్వారా మెదడులో కణితులు ఏర్పడతాయి. కొన్ని రసాయనాల బారిన పడటం, రేడియేషన్ ఎక్కువగా ఉండటం, ఎక్స్టీమ్ వైరస్ బారిన పడటం వల్ల ఈ కణితులు ఏర్పడతాయి. లక్షణాలు మెదడు కణితుల లక్షణాలను రెండు రకాలుగా విభజించవచ్చు. మొదటిది జనరల్ లక్షణాలు. రెండవది ప్రత్యేకమైనది. జనరల్ లక్షణాలు కణితి పరిమాణాన్ని బట్టి వస్తాయి. తలనొప్పి, వాంతులు, చూపు మందగించడం, ఒత్తిడి పెరగడం, స్పృహకోల్పోవడం వంటివి. ఇక రెండవది మెదడులో కణితి ఏర్పడిన స్థానాన్ని బట్టి వస్తాయి. మెదడు ముందు భాగం, మధ్యభాగం, వెనుక భాగంలో ఆయా స్థానాలను బట్టి లక్షణాలు ఉంటాయి. అందులో మాట తడబడటం, చూపు మబ్బుగా కనిపించడం, చెవులు వినిపించకపోవడం, మూతి వంకరపోవడం, ఫిట్స్ రావడం, మాట తడబడటం, పక్షవాతం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ప్రతి తలనొప్పిని కణితికి కారణం అని చెప్పలేము. ఈ లక్షణాలు ఉన్నప్పుడు వైద్యులు తప్పనిసరిగా కలవాలి. నిర్ధారణ ఇలా.. మెదడులో కణితులు ఉన్నాయా లేదా అనేది నిర్ధారించడానికి మూడు రకాల పరీక్షలు ఉన్నాయి. మొదటిది క్లినికల్, రెండోది రేడియాలజీ, మూడోది సర్జికల్ ద్వారా నిర్ధారిస్తారు. ఇందులో సీటీస్కాన్, ఎంఆర్ఐ స్కాన్‌లో తేలిపోతుంది. కానీ కొందరిలో సర్జికల్ ద్వారా కూడా నిర్ధారణ చేయవచ్చు. ఈ స్కాన్లలో కణితులను నిర్ధారణ చేసుకున్న తర్వాత చికిత్స ప్రారంభిస్తారు. మెదడు కణితులను బట్టి చికిత్స మెదడులో ఏర్పడిన కణితులను గ్రేడ్ 1, 2, 3, 4 విభాగాలుగా విభజించి చికిత్స అందిస్తాం. అలాగే కణితుల స్థానంపై కూడా ఆధారపడి చికిత్స ఉంటుంది. గ్రేడ్ 1, 2లలో ఉన్న కణితులు మూడు సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉంటే రేడియేషన్ ద్వారా తగ్గించవచ్చు. దీని ద్వారా వారి సాధారణ జీవితాన్ని కొనసాగించవచ్చు. అయితే గ్రేడ్ 3, 4 కణితులు ఉంటే జీవితకాలం జీవించే అవకాశం తక్కువగా ఉంటుంది. రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ వంటి అత్యాధునిక చికిత్స అందుబాటులో ఉన్నాయి. ఈ కణితులను త్వరగా గుర్తించి చికిత్స అందిస్తే మంచింది. – డాక్టర్ ఎన్.సుమంత్‌కుమార్, న్యూరోసర్జన్, కర్నూలు -
అకస్మాత్తుగా వాంతి ,ఫిట్స్ రావడం జరుగుతుందా.. ఆలస్యం చేయకండి
గడ్డ దేహంలో ఎక్కడ వచ్చినా అంత పెద్దగా సమస్య ఉండకపోవచ్చు గానీ... మెదడు నిర్వహించే కీలకమైన విధుల రీత్యా అక్కడ గడ్డలు వస్తే ప్రమాదంగా పరిణమించవచ్చు. అది క్యాన్సరస్ గడ్డ అయితే మరీ ప్రమాదం... కానీ ఒకవేళ అది క్యాన్సరస్ గడ్డ కాకపోయినప్పటికీ ఏదైనా అవయవాన్ని నియంత్రించే భాగాన్ని అది నొక్కివేస్తే... మన శరీరంలోని ఆ భాగం విధుల నిర్వహణలో తేడాలు రావచ్చు. దాంతో అవయవం ఆరోగ్యవంతంగా ఉన్నప్పటికీ... మెదడులో ఏర్పడ్డ గడ్డ కారణంగా దాని కదలికలు మందగించడం, అది చచ్చుబడిపోయినట్లుగా కావడం, పూర్తిగా పనిచేయకుండానే పోవడం జరుగుతుంది. మెదడులో గడ్డల వల్ల ఎదురయ్యే సమస్యలు, అందుబాటులో ఉన్న చికిత్సలను తెలుసుకుందాం. అసాధారణంగా పెరిగే కణజాలం ఓ గడ్డ ఆకృతి దాలుస్తుంది. ఆ గడ్డలే మెదడులో పెరిగితే వాటిని మెదడులో గడ్డల (బ్రెయిన్ ట్యూమర్స్)ని అంటారు. స్థూలంగా వీటిని రెండు రకాలుగా చెప్పవచ్చు. మొదటివి హానీ చేయని గడ్డలు (బినైన్). రెండోవి ప్రమాదకరమైన క్యాన్సర్ (మెలిగ్నెంట్) గడ్డలు. బినైన్ గడ్డల వల్ల సాధారణంగా మెదడుకు ప్రమాదం ఉండదు. మెల్లగా పెరుగుతాయి. గడ్డ ఏ మేరకు పెరిగిందనే విషయానికి తెలుసుకోడానికి వీలుగా దానికి స్పష్టమైన అంచులు ఉంటాయి కానీ క్యాన్సరస్ (మెలిగ్నెంట్) గడ్డలు నిర్దిష్టంగా ఫలానా చోటే అంతమైనట్లుగా స్పష్టమైన అంచులుండవు. పెరుగుదల వేగం కూడా చాలా ఎక్కువ. దాంతో అంచులు గుర్తించడానికి వీల్లేకుండా చుట్టుపక్కల కణజాలంలోకి చొచ్చుకుపోయేలా పెరుగుతాయి. బ్రెయిన్ ట్యూమర్ల పెరుగుదలకు సాధారణ కారణాలు... నిజానికి బ్రెయిన్ ట్యూమర్లు ఎందుకు పెరుగుతాయని చెప్పేందుకు నిర్దిష్టమైన కారణాలు లేకపోయినా... కొన్ని అంశాలు ట్యూమర్ పెరిగే ముప్పును పెంచుతాయి. అవి... రేడియేషన్: తరచూ రేడియోషన్‌కు ఎక్స్పోజ్ అయ్యేందుకు ఆస్కారం ఉన్న వృత్తుల్లో / పరిసరాల్లో ఉన్నవారికి మెదడులో గడ్డలు వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు చికిత్స కేంద్రాల్లో, వైద్య పరీక్ష కేంద్రాల్లో పనిచేసేవారికి, రేడియేషన్ వెలువడే పారిశ్రామిక ప్రాంతాల్లోని వారికి ఈ ముప్పు ఉంటుంది. జన్యుపరమైనవి: క్రోమోజోముల్లో వచ్చే కొన్ని మార్పులు మెదడులో గడ్డల పెరుగుదలను ప్రేరేపించవచ్చు. మానవుల్లో 23 జతల క్రోమోజోములు ఉంటాయన్న విషయం తెలిసిందే. వీటిల్లో... 1, 10, 13, 17, 19, 22 క్రోమోజోముల్లో ఏవైనా మార్పులు ఏర్పడినప్పుడు మెదడులో గడ్డలు వచ్చే ఆస్కారం ఎక్కువ. ఉదాహరణకు... 22వ క్రోమోజోములో మార్పుల వల్ల మెనింజియోమా తరహా గడ్డ ఏర్పడుతుంది. అయితే ఈ గడ్డ హానికరం కాదు. అయితే... 1, 19 క్రోమోజోముల్లో మార్పులొస్తే ఆలిగోడెండ్రోగ్లియోమా అనే క్యాన్సర్ గడ్డలు వచ్చే అవకాశం ఎక్కువ. కొన్ని రకాల జన్యుపరమైన లోపాలు ఉదాహరణకు న్యూరోఫైబ్రోమటోసిస్, వాన్ హిప్పెల్ లాండువా డిజీస్ వంటివి మెదడులో కణుతులకు కారణం కావచ్చు. మెదడులో ఏయే ప్రాంతాల్లో... ఎలాంటి సమస్యలు? మెదడులో గడ్డ వచ్చే ప్రాంతాన్ని బట్టి సమస్యలూ మారుతుంటాయి. ఉదాహరణకు... ఫ్రంటల్ లోబ్‌లో గడ్డలతో : కదలికల్లో లోపాలు తార్కికత లోపాలు ప్రవర్తనాలోపాలు జ్ఞాపకశక్తి మందగించడం నిర్ణయం తీసుకోలేకపోవడం వ్యక్తిత్వ లోపాలు ప్రణాళికలో లోపాలు విషయాలను సరిగ్గా అంచనా వేయలేకపోవడం తరచూ మారిపోయే మూడ్స్. పెరైటల్ లోబ్‌లో గడ్డలతో : విషయాలు సరిగా వివరించలేకపోవడం లెక్కలు సరిగా చేయలేకపోవడం స్పర్శజ్ఞానలోపం చదవలేకపోవడం రాయలేకపోవడం టెంపోరల్ లోబ్‌లో గడ్డలతో : భాషను అర్థం చేసుకోలేకపోవడం వినికిడి లోపాలు భావోద్వేగ పరమైన మార్పులు పిట్యూటరీ గ్రంథి ప్రాంతంలో గడ్డలవల్ల : హార్మోన్లలో మార్పులు ఎదుగుదల లోపాలు ప్రత్యుత్పత్తి లోపాలు / వంధ్యత్వం ఆక్సిపెటల్ లోబ్‌లో గడ్డలతో : చూపు మందగించడం సెరిబెల్లమ్ ప్రాంతంలో గడ్డలతో : శరీరాన్ని నిటారుగా ఉంచలేకపోవడం తూగుతూ నడవడం కొన్ని కండరాలపై నియంత్రణ కోల్పోవడం. బ్రెయిన్ స్టెమ్ ప్రాంతంలో గడ్డల వల్ల : శ్వాస సంబంధమైన లోపాలు రక్తపోటులో మార్పులు గుండె స్పందనల్లో మార్పులు మింగడంలో, మాట్లాడటంలో ఇబ్బందులు శస్త్రచికిత్స : బాధితులకు శస్త్రచికిత్స సిఫార్సు చేసే సందర్భాలు. వీలైనంత వరకు గడ్డను తొలగించేందుకు అవకాశం ఉండటం. గడ్డ ఏ తరహాకు చెందినదనే అంశం స్పష్టంగా, నిర్ధారణగా తెలిసిపోవడం. గడ్డను తొలగించడం అక్కడి ఒత్తిడి (ఇంట్రాక్రేనియల్ ప్రెషర్) తగ్గి మంచి ఉపశమనం లభిస్తుందని తెలిసినప్పుడు లేదా మిగతా గడ్డను రేడియేషన్ / కీమోథెరపీతో తేలిగ్గా నిర్మూలించగలమని తెలవడం. మైక్రోన్యూరోసర్జరీ : ఇటీవల అందుబాటులోకి వచ్చిన అధునాతన ఇమేజింగ్ (లోపలి గడ్డలను ఫొటో తీసి చూసే ప్రక్రియ), మైక్రోస్కోపిక్ విధానాలు, మ్యాపింగ్‌లతో న్యూరోసర్జన్లు అతి సూక్ష్మమైన గడ్డలను తొలగించగలుగుతున్నారు. గతంలో శస్త్రచికిత్స ద్వారా చేరలేని ప్రదేశాల్లోకి చేరుకుని సైతం కొన్ని గడ్డల తొలగింపు ఇప్పుడు సాధ్యమవుతోంది. రేడియేషన్ థెరపీ : మెదడులోని కొన్ని రకాల క్యాన్సర్ గడ్డలనూ / క్యాన్సర్ తరహాకు చెందని గడ్డలను తొలగించడానికి రేడియేషన్ థెరపీ మంచి మార్గం. ఇందులో గడ్డను పూర్తిగా నిర్వీర్యం చేయడంతో పాటు పెరుగుదలనూ అరికట్టవచ్చు. కీమో థెరపీ : చిన్న తరహా హానికరమైన గడ్డలూ (మెలిగ్నెంట్ ట్యూమర్స్)కు కీమోథెరపీ బాగా పనిచేస్తుంది. ఇక కొన్ని రకాల క్యాన్సర్ గడ్డలు రేడియేషన్ తో పాటు కీమోథెరపీ ఇస్తేనే చికిత్సకు బాగా లొంగుతాయి. కొన్నిసార్లు నేరుగా గడ్డలోకి మందు వెళ్లేలా కూడా కీమోథెరపీ ఇస్తారు.\ నిర్ధారణ కోసం చేసే వైద్య పరీక్షలు... సీటీ స్కాన్ : మెదడులో గడ్డలు ఉన్నట్లుగా అనుమానిస్తే తొలుత అవసరమైన పరీక్ష సీటీ స్కాన్. ఎమ్మారై : మెదడులో గడ్డ ఏ ప్రాంతంలో ఉంది, అది ఏ తరహాకు చెందినది, సైజు, అది మెదడులో ఏ మేరకు చొచ్చుకుపోయింది వంటి అంశాలపై స్పష్టంగా తెలిసే సమాచారంతో శస్త్రచికిత్స ప్రక్రియలో కూడా ఎమ్మారై టెక్నిక్ చాలా ఉపయోగపడుతుంది. పెట్ స్కాన్ : వాస్తవ గడ్డలకూ, గడ్డలుగా కనిపించేవాటికి (ట్యూమర్స్కూ, నాన్ట్యూమర్స్కు) మధ్య తేడాలు తెలిపేందుకు ఉపయోగపడే పరీక్ష. లక్షణాలు గడ్డ మెదడులోని ఏ ప్రాంతంలో వచ్చిందన్న అంశంపై ఆధారపడి ఈ లక్షణాలు మారుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మెదడులో గడ్డ ఉన్నప్పటికీ బయటకు ఎలాంటి లక్షణాలూ కనిపించకపోవచ్చు.సాధారణ లక్షణాలివి... నలభై ఏళ్లకు పైబడిన వారిలో లేదా ఆరేళ్లలోపు వారిలో తీవ్రమైన తలనొప్పి అకస్మాత్తుగా వాంతి కావడం ∙ఫిట్స్ రావడం మెదడులో గడ్డ వచ్చిన ప్రదేశాన్ని బట్టి... స్పర్శజ్ఞానం కోల్పోవడం లేదా ఏదైనా అవయవపు కదలికల్లో మార్పులు చూపు మసగ్గా మారడం మాట ముద్దగా రావడం లేదా మాటలో స్పష్టత లేకపోవడం డిప్రెషన్ ప్రవర్తనలో మార్పులు..హార్మోన్ స్రావాల్లోనూ మార్పులు (ఎండోక్రైన్ డిస్ఫంక్షన్). మందులతో చేసే చికిత్స గడ్డ ఉన్న ప్రాంతంల్లోని వాపు తగ్గించడానికి కొన్నిసార్లు స్టెరాయిడ్స్‌తో చికిత్స అందిస్తారు. దీనివల్ల రోగికి తలనొప్పి వంటివాటితో పాటు ఇతర భౌతిక లక్షణాలూ తగ్గుతాయి.గడ్డల కారణంగా ఫిట్స్ వస్తే వాటిని తగ్గించేందుకు మందులు ఇస్తారు. -
అనారోగ్యంతో సాక్షి ఫొటోగ్రాఫర్ మృతి
ముషీరాబాద్ (హైదరాబాద్): సాక్షి దినపత్రిక స్టాఫ్ ఫొటోగ్రాఫర్ ఎం.రవికుమార్ (42) ఆదివారం రాత్రి మృతి చెందారు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రవి అంత్యక్రియలు సోమవారం మధ్యాహ్నం తన స్వగ్రామం జడ్చర్లలో జరిగాయి. మూడేళ్ల కిందట ఆయనకు బ్రెయిన్లో ట్యూమర్ ఏర్పడడంతో మొదట ఆపరేషన్ చేశారు. ఒక సంవత్సరం ఆరోగ్యంగా ఉన్న రవి కుమార్.. మళ్లీ ట్యూమర్ పెరగడంతో రెండవసారి ఆపరేషన్ చేయించుకుని ఇంటి దగ్గరే మందులు వాడుతున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో కొద్ది రోజుల కిందట ఆయన్ను స్వగ్రామం జడ్చర్లకు తీసుకువెళ్లారు. కాగా, ఆదివారం ఆరోగ్యం విషమించి మృతిచెందారు. మొదట సూర్య దినపత్రికలో పనిచేసిన ఆయన.. 11 ఏళ్లుగా సాక్షి దినపత్రికలో ఫొటోగ్రాఫర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. తెలంగాణ సమాచార శాఖ ఫొటోగ్రఫీ డే సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ఆయన పలుమార్లు రాష్ట్రస్థాయిలో ప్రథమ, ద్వితీయ బహుమతులు గెలుచుకున్నారు. రవికుమార్ మృతి పట్ల పలువురు నాయకులు సంతాపం తెలిపారు. -
బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పారు..
మా నాన్నగారి వయసు 52 ఏళ్లు. ఈమధ్య తరచూ కాళ్లూ–చేతులు తిమ్మిర్లెక్కుతున్నాయని విపరీతంగా బాధపడుతున్నారు. ఒక్కోసారి నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. దాంతో ఏ పని మీదా దృష్టిపెట్టలేకపోతున్నారు. మందులు వాడినా ఫలితం లేకపోవడంతో విజయవాడ పెద్దాసుపత్రిలోని ‘న్యూరో’ డాక్టరుకు చూపించాం. వారు పరీక్షలన్నీ చేసి బ్రెయిన్ ట్యూమర్ ఉందని చెప్పారు. వీలైనంత త్వరగా సర్జరీ చేయించుకొమ్మని చెప్పారు. ఆ కుటుంబంలో అందరమూ బెంగపడుతున్నాం. బ్రెయిన్ సర్జరీ అంటే ప్రాణాపాయం ఉంటుందని, ఏవైనా అవయవాలు కోల్పోవచ్చని చెబుతున్నారు. కొద్దికాలం కిందట ‘బ్రెయిన్ ట్యూమర్’కు ఏదో శస్త్రచికిత్స అందుబాటులోకి వచ్చిందని, అది చాలా సురక్షితమని, అవయవాలు పనిచేయకుండా పడిపోయే పరిస్థితి రాదనే విషయాన్ని తాను పేపర్లో చదివానని ఒక ఫ్రెండ్ చెప్పాడు. అంతకు మించి వివరాలేమీ ఇవ్వలేకపోయాడు. అదేం సర్జరీయో వివరంగా చెప్పండి. అది ఖరీదైనదేమోననే ఆందోళన కూడా ఉంది. ఈ సర్జరీలోని రిస్క్ ఏమిటో, ఫలితాలెలా ఉంటాయో కూడా దయచేసి వివరించండి. మీరు లేఖలో రాసినదాన్ని బట్టి చూస్తే... బహుశా మీ ఫ్రెండ్ ‘ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్ బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ’ గురించి పేపర్లో చదివి ఉంటారు. అదే విషయాన్ని మీకు చెప్పి ఉంటారు. మెదడులో గడ్డలు అనేక సమస్యలు తెచ్చిపెడతాయి. తలనొప్పి మొదలుకొని... శరీరంలోని వివిధ అవయవాల పనితీరు దెబ్బతీసేలా చేయడం వరకు రకరకాల ఇబ్బందులు తలెత్తుతాయి. అవయవాలు పనిచేయకపోవడం లాంటి తీవ్రమైన పరిణామాలు తలెత్తితే అది ఆ వ్యక్తి జీవననాణ్యతపై ప్రభావం చూపడంతో పాటు, తన సాధారణ జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది.ఇక ఈ అధునాతన సర్జరీ విషయానికి వస్తే... ఇందులో మంచి కచ్చితత్వం ఉంటుంది. ఈ ఇంట్రా ఆపరేటివ్ 3టి ఎమ్మారై (ఐఎమ్మారై) శస్త్రచికిత్స ప్రక్రియలో మళ్లీ మళ్లీ ఆపరేషన్ చేయాల్సిన అవసరం రాకుండా గడ్డలను సమూలంగా తొలగించేందుకు అవకాశం ఉంటుంది. దీని సహాయంతో సర్జన్లు కేంద్రనాడీమండలం (సీఎన్ఎస్)లో ఏర్పడే గడ్డలను మూలాల వరకు గుర్తించి కూకటివేళ్ల నుంచి తొలగించడానికి వీలవుతుంది. ఒక వ్యక్తి శరీరంలోని అన్ని అవయవాలను మెదడు నియంత్రిస్తుందన్న విషయం తెలిసిందే. అందుకే మెదడుకు శస్త్రచికిత్సలంటే అది ఏ అవయవాన్నైనా దెబ్బతీస్తుందేమోననే ఆందోళన ఉండటం సహజమే. అయితే ఆధునిక న్యూరోసర్జరీ వైద్యవిభాగంలో మైక్రోస్కోప్‌లు ప్రవేశించడం వల్ల ఇప్పుడు అవే శస్త్రచికిత్సలను చాలా సురక్షితమైన రీతిలో చేయడం సాధ్యమవుతుంది. సాధారణంగానైతే సర్జన్ మైక్రోస్కోప్ ద్వారా లోనికి చూస్తూన్నప్పుడు మెదడులోని భాగాలను ఊహించగలడు గానీ... లోపలి భాగాల్లోకి ప్రవేశించడం కష్టంగానూ, ప్రమాదాలతో కూడుకున్న రిస్కీ పనిగానూ ఉంటుంది. అయితే మనం సాధారణంగా వాడే జీపీఎస్లాగే... ఈ ఆపరేషన్‌లోనూ ముందుగానే న్యూరోనావిగేషన్ పద్ధతి ద్వారా మెదడులోని అంతర్గత భాగాలనూ విస్పష్టంగా గుర్తించడం ఇప్పుడు సాధ్యమవుతోంది. నిమ్ ఎక్లిప్స్ వంటి ఇంట్రా ఆపరేటివ్ న్యూరోమానిటరింగ్ను ఉపయోగించుకొని, మెదడులోని ఫంక్షనల్ ప్రాంతాలను... అంటే ఏదైనా అవయవాన్ని నియంత్రించే భాగాలను గుర్తించి, శస్త్రచికిత్స సమయంలో వాటికి ఎలాంటి నష్టం జరగకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకునేందుకు ఇప్పుడు అవకాశం ఉంది. మామూలుగానైతే శస్త్రచికిత్స చేస్తున్న ప్రదేశాన్ని ఒక మైక్రోస్కోపు... న్యూరోనావిగేషన్తో కలిసి కొన్ని భాగాలను కాంతిమంతంగా చూపించగలగుతుంది. కానీ అది మెదడులోని సాధారణ, అసాధారణ కణాల మధ్య వ్యత్యాసాన్ని చూపించలేదు. దాంతో కొన్ని రకాల గడ్డలను మైక్రోస్కోప్ కింద చూసినప్పుడు అవి కూడా మెదడు కణజాలంలాగే కనిపిస్తాయి. ఈ సమస్యను ఎదుర్కోవడంలో న్యూరో నావిగేషన్ సదుపాయం కొంతవరకు సహాయపడుతుంది. అయితే మెత్తని కణజాలంతో కూడిన మెదడు... సర్జరీ సమయంలో స్థిరంగా ఉండదు. కదలికలకు (షిఫ్ట్స్కు) గురవుతుంటుంది. దీనివల్ల శస్త్రచికిత్స ప్రారంభానికి ముందు న్యూరోనావిగేషన్ ద్వారా అందిన చిత్రాలు... ఆపరేషన్ కొనసాగించే సమయంలో అంతగా ఉపయోగపడవు. అందువల్ల స్పష్టత లేకుండానే తమ ఊహమేరకు సర్జన్లు శస్త్రచికిత్స కొనసాగించాల్సి రావడంతో చాలా సందర్భాల్లో మెదడులోని గడ్డలో కొంతభాగం అలాగే మిగిలిపోవచ్చు. అలా మిగిలిపోయిన ఆ భాగం మళ్లీ పెద్ద గడ్డగా పెరిగేందుకు అవకాశం ఉంది. ఈ కారణంగానే మెదడు గడ్డల తొలగింపు ఆపరేషన్లలో చాలా సందర్భాల్లో మళ్లీ మళ్లీ సర్జరీ చేయాల్సిన పరిస్థితులు తలెత్తుతుంటాయి. ఇలాంటి పరిస్థితిని నివారించడంలో ఇంట్రా ఆపరేటివ్ ఎమ్మారై కీలక పాత్ర పోషిస్తుంది. శస్త్రచికిత్స సమయంలో మెదడు కదిలిపోయే పరిస్థితిని ఎప్పటికప్పుడు అది తెలియజేస్తూ ఉంటుంది. శస్త్రచికిత్స కొంత పూర్తయిన తర్వాత ఇంకా గడ్డ భాగం ఏదైనా మిగిలి ఉందా, దాని అంచులు ఎంతమేరకు విస్తరించి ఉన్నాయి... వంటి అంశాలను అది స్పష్టంగా చూపిస్తుంటుంది. అందువల్ల ఈ సౌకర్యాన్ని ఉపయోగించి శస్త్రచికిత్స చేయించుకుంటే మళ్లీ మళ్లీ మెదడు సర్జరీలు చేయించాల్సిన అవసరం రాదు. మొత్తం ట్యూమర్‌ను ఒకేసారి తొలగించవచ్చు. కాకపోతే కాస్తంత సమయం ఎక్కువగా పడుతుందంతే. ఈ ఎమ్మారై ఎలా సహాయపడుతుందంటే... ఎమ్మారై (మాగ్నెటిక్ రిజొనెన్స్ ఇమేజింగ్) సహాయంతో మన శరీర అంతర్భాగాల్లోని అవయవాలను స్పష్టమైన చిత్రాలుగా తీయవచ్చన్న విషయం తెలిసిందే కదా. ఇప్పటివరకూ బ్రెయిన్ ట్యూమర్ వ్యాధిగ్రస్తుల్లో శస్త్రచికిత్సకు ముందుగా ఈ ఎమ్మారై పరీక్ష చేస్తుంటారు. ఆపరేషన్ నిర్వహించాక... రెండో రోజున పేషెంట్‌ను మళ్లీ ఎమ్మారై గదికి తరలించి, మరోసారి పరీక్ష చేసి, ట్యూమర్‌ను ఏ మేరకు తొలగించామని పరిశీలిస్తుంటారు. ట్యూమర్ ఇంకా కొంత మిగిలి ఉన్నట్లు గమనిస్తే... మళ్లీ సర్జరీ చేస్తారు. దీంతో ట్యూమర్ మొత్తాన్ని తొలగించడానికి... ఈ విధంగా చాలాసార్లు సర్జరీలు చేయాల్సి వస్తుంటుంది. అదే ‘ఇంట్రా ఆపరేటివ్ ఎమ్మారై’ శస్త్రచికిత్స సమయంలోనే స్కాన్‌ను నిర్వహిస్తూ ఉంటే... ఇక్కడికక్కడే అప్పటికప్పుడే శస్త్రచికిత్సలో అవసరమైన మార్పులు చేయడానికి వీలవుతుంది. అంటే దీనిద్వారా పదే పదే సర్జరీలు చేయాల్సిన అగత్యం తప్పుతుందన్నమాట. ఈ తరహా శస్త్రచికిత్స చేస్తున్న సమయంలో ఇంట్రా ఆపరేటివ్ ఎమ్మారైను సర్జన్లకు అందుబాటులో ఉంచే విధంగా ఆపరేషన్ థియేటర్‌ను ప్రత్యేకంగా రూపొందించాల్సింటుంది. దీనికి తోడుగా మైక్రోస్కోప్, న్యూరోనావిగేషన్ వ్యవస్థలనూ ఏర్పాటు చేస్తారు. ఈ అత్యాధునిక పరికరాల సహాయంతో ఆపరేషన్ కొనసాగుతుండగానే నిమిషనిమిషానికీ ఎప్పటికప్పుడు మెదడు చిత్రాల(ఇమేజెస్)ను చూసే వీలుకలుగుతుంటుంది. ఈ ఇమేజెస్ అందుబాటులో ఉండటం వల్ల సర్జన్లు ట్యూమర్ పరిమాణాన్ని, విస్తరణను విస్పష్టంగా చూడగలుగుతారు. ఫలితంగా మూలాల నుంచి గడ్డను తొలగించగలుగుతారు. అంతేకాదు... ఆ శస్త్రచికిత్స జరిగే క్రమంలో మెదడులోని వివిధ కీలకప్రాంతాలకు ఏమాత్రం నష్టం జరగకుండా చూస్తారు. దాంతో అవి అదుపుచేసే శరీర భాగాల పనితీరు దెబ్బతినకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. కణితి ఉన్న ప్రదేశం వరకు పక్కాగా మార్క్ చేసి, మెదడులోని ఇతర కీలక భాగలు, ప్రధాన అవయవాలను నియంత్రించే వ్యవస్థలను ఎంతో జాగ్రత్తగా న్యూరో మానిటరింగ్ సిస్టమ్‌తో పర్యవేక్షిస్తూ... ఏ అవయవాన్నీ కోల్పోకుండా, దెబ్బతినకుండా జాగ్రత్తపడుతూ ఈ ‘ఇంట్రా ఆపరేటివ్ న్యూరోమానిటరింగ్’ సహాయంతో సర్జరీ చేయవచ్చు. ఈ సర్జరీలు 90 శాతానికి పైగా విజయవంతమవుతున్నాయి. ఇక ఖర్చు విషయానికి వస్తే మామూలు సర్జరీలతో పోలిస్తే కేవలం 20 నుంచి 30 శాతం వరకు మాత్రమే అదనంగా ఖర్చవుతుంది. అయితే మళ్లీమళ్లీ సర్జరీ చేయాల్సిన పరిస్థితులను నివారించే అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇది పెద్ద ఖర్చుగా భావించనక్కర్లేదు. ట్యూమర్ ఉన్న ప్రదేశం, సైజును బట్టి ఉండే రిస్క్ ఎలాంటి సర్జరీలలోనైనా ఉండనే ఉంటుంది. కాబట్టి మీరు నిరభ్యంతరంగా ఈ ఆధునిక పద్ధతిని ఉపయోగించుకొని శస్త్రచికిత్స చేయించుకోవచ్చు. - డాక్టర్ ఆనంద్ బాలసుబ్రమణియం, సీనియర్ న్యూరోసర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
వయసు 16.. ఎత్తు 7.4 అడుగులు
డెహ్రడూన్ : సాధరణంగా ఇంటర్ చదివే కుర్రాడు అంటే.. 5 - 5.5 అడుగులు ఎత్తు.. ఎక్కడో ఓ చోట కొందరు 6 అడుగులు ఎత్తుతో.. ఓ మోస్తరు బరువుతో ఉంటారు. కానీ ఉత్తరాఖండ్‌కు చెందిన మోహన్ సింగ్ మాత్రం ఏకంగా ఏడున్నర అడుగుల ఎత్తుతో.. 113 కిలోగ్రాముల బరువుతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. కొడుకు భారీగా ఎదగడాన్ని చూసి సంతోషించిన తల్లుదండ్రులు అందుకు బ్రెయన్ ట్యూమర్ కారణం అని తెలిశాక ఆశ్చర్యపోతున్నారు. మోహన్ సింగ్ తలలో ఏర్పడిన ఓ ట్యూమర్ వల్ల అతను ఇంత భారీగా పెరిగాడని వైద్యులు నిర్థారించారు. ఆపరేషన్ చేసి ట్యూమర్‌ని తొలగించారు. ఈ సందర్భంగా మోహన్ సింగ్ తండ్రి మాట్లాడుతూ.. ‘చిన్నప్పుడు మోహన్ కూడా అందరి పిల్లలానే సాధరణ ఎత్తు బరువుతో ఆరోగ్యంగా ఉండేవాడు. కానీ ఓ ఐదేళ్ల నుంచి అతని శరీరాకృతిలో విపరీమైన మార్పులు చోటు చేసుకున్నాయి. అనూహ్యంగా ఎత్తు, బరువు పెరగడం ప్రారంభించాడు. ఇంటర్‌కు వచ్చే సరికి అతని ఎత్తు 7.4 అడుగులు కాగా బరువు 113 కిలోగ్రాములు. 4ఎక్స్ఎల్ సైజు దుస్తులు అతనికి సరిపోయేవి. చెప్పులు ప్రత్యేకంగా డిజైన్ చేయించే వాళ్లం. మంచం కూడా ప్రత్యేకంగా తయారు చేయించాం. ఈ ఐదేళ్లలో మోహన్ ఎక్కడికివెళ్తే అక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవాడు. జనాలు అతనితో సెల్ఫీ తీసుకునేందుకు ఎగబడేవారు’ అన్నారు. ‘మేం కూడా అతను సాధరణంగానే ఎత్తు పెరుగుతున్నాడనుకున్నాం. కానీ ఓ ఐదు నెలలుగా మోహన్ విపరీతమైన తలనొప్పితో బాధపడుతున్నాడు. దాంతో లోకల్ వైద్యుల దగ్గరకి తీసుకెళ్లాం. వారు ఎమ్ఆర్ఐ స్కానింగ్ చేయించాల్సిందిగా సూచించారు. స్కానింగ్ రిపోర్టులో మోహన్ తలలో ఓ ట్యూమర్ ఏర్పడిందని వచ్చింది. దాంతో వారు ఎయిమ్స్‌కు తీసుకెళ్లమని సూచించారు. మోహన్ రిపోర్టులు పరిశీలించిన ఎయిమ్స్ వైద్యులు అతని పిట్యూటరి గ్రంథికి ట్యూమర్ వచ్చిందని.. ఫలితంగానే ఇంత ఎత్తు, బరువు పెరిగాడని తెలిపారు. ఎండోస్కోపిక్ సర్జరీ ద్వారా ట్యూమర్‌ని పూర్తిగా తొలగించవచ్చని పేర్కొన్నారు. ఫలితంగా కొద్ది రోజుల్లోనే మోహన్ బరువు తగ్గుతాడని.. కానీ ఎత్తు మాత్రం అలానే ఉంటాడని తెలిపారు’ అన్నాడు. మోహన్‌కు సర్జరీ చేసిన వైద్యులు మాట్లాడుతూ.. ‘ఇది జన్యు సంబంధిత సమస్య కాదు. పెరుగుదల హర్మోన్లలో వచ్చే లోపం వల్లే ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి.ముగ్గురు వైద్యులు దాదాపు మూడు గంటల పాటు శ్రమించి ఈ ట్యూమర్‌ని తొలగించారు’ అని పేర్కొన్నారు. -
మెదడులోని గడ్డలు మళ్లీ మళ్లీ వస్తాయా?
నా వయసు 40 ఏళ్లు. విపరీతమైన తలనొప్పితో బాధపడుతున్నాను. హాస్పిటల్లో చూపించుకుంటే టెస్ట్‌లన్నీ చేసి, మెదడులో గడ్డ ఏర్పడినట్టు గుర్తించారు. బ్రెయిన్ ట్యూమర్లకు సర్జరీ చేయించుకున్నా అవి పూర్తిగా పోవని విన్నాను. నిజమేనా? ఈ గడ్డలను నిర్మూలించడం సాధ్యం కాదా? దయచేసి వివరంగా తెలియజేయండి. మీరు బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ గురించి ఈ రోజుల్లో ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అందుబాటులో ఉన్న అత్యాధునిక చికిత్సలతో ట్యూమర్ శస్త్రచికిత్స చాలా సురక్షితమే. మెదడులోని గడ్డలను సమూలంగా తొలగించవచ్చు. మెదడులో ట్యూమర్లు రెండు రకాలుగా ఉంటాయి. అవి బినైన్ ట్యూమర్లు, మెలిగ్నెంట్ ట్యూమర్లు. ఇవి కేంద్ర నాడీమండలం (సీఎన్ఎస్)లోని పలురకాల కణాల నుంచి ఏర్పడతాయి. మెదడు గడ్డల్లో బినైన్ ట్యూమర్లు మెదడులో లోతుగా పాతుకుపోయి ఉండవు. ఈ రకమైన ట్యూమర్లు క్యాన్సర్ కారకమైనవి కావు. అందువల్ల బినైన్ ట్యూమర్లు ఉన్న ప్రాంతంలో శస్త్రచికిత్స చేయడం సులువు. పైగా వీలైతే వీటిని తేలిగ్గా పూర్తిగా తొలగించి వేయగలగడం సాధ్యమే. అయితే ఒక్కోసారి వీటిని సర్జరీ చేసి తీసివేసినా మళ్లీ అవి తిరిగి పెరిగే అవకాశం మాత్రం ఉంటుంది. ఈ గడ్డలు చురుకైనవి కావు. అందువల్ల మెదడులోని ఇతర భాగాలలోని కణజాలానికి విస్తరించే అవకాశం ఏమీ ఉండదు. కానీ ఈ బ్రెయిన్ ట్యూమర్లు శరీరంపైన తీవ్రమైన ప్రభావాన్ని చూపించేవిగా, కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా కూడా మారగలవు. మెదడులోని వివిధ భాగాలు వేర్వేరు బాధ్యతలను నిర్వర్తిస్తూ, శరీరంలోని భిన్న అవయవాలను నియంత్రిస్తుంటాయి. అందువల్ల ట్యూమర్ ఏర్పడిన భాగం మెదడు తన విధులను నిర్వహించడంలో లోటుపాట్లు ఏర్పడతాయి. అందువల్ల మెదడులో గడ్డ ఏర్పడిన ప్రదేశాన్నిబట్టి, ఆ ట్యూమర్ రకాన్ని బట్టి దాని ప్రభావం శరీరంలోని వివిధ భాగాలపై (అంటే అది నియంత్రించే భాగంపైన) కనిపిస్తూ ఉంటుంది. మెదడులో గడ్డలను బట్టి కొన్ని లక్షణాలు బయటపడుతుంటాయి. కొందరిలో అది వినికిడి శక్తిని ప్రభావితం చేస్తే, మరికొందరిలో కంటి చూపును దెబ్బతీయవచ్చు. ఈ విధంగా జరిగినప్పుడు మెదడులో ఒకవైపు ఏర్పడిన బినైన్ ట్యూమర్లను తొలగిస్తే మళ్లీ మరోవైపు ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే గత దశాబ్ద కాలంలో ట్యూమర్ల చికిత్స అభివృద్ధి చెందింది. గడ్డ ఏర్పడిన మెదడు భాగానికి ఏమాత్రం నష్టం కలిగించకుండా, ఫలితంగా మెదడులోని ఆ భాగం అదుపు చేసే అవయవాల పనితీరు దెబ్బతినకుండా ట్యూమర్‌ను తొలగించివేయగల వైద్యసాంకేతికత అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు అందుబాటులో ఉన్న 3 టెస్లా ఇంట్రా ఆపరేటివ్ మాగ్నెటిక్ రిసోనెన్స్ ఇమేజింగ్ (3 టీ ఎమ్మారై) మెదడులో గడ్డల తొలగింపు ఆపరేషన్‌లో గణనీయమైన మార్పు తెచ్చింది. అప్పటి రోజుల్లో ఎక్స్–రే, ఆ తర్వాత అల్ట్రాసౌండ్, ఆపైన ఎమ్మారై... ఇప్పుడు కాలం గడుస్తున్న కొద్దీ వైద్యసాంకేతిక రంగంలో వచ్చిన మార్పుల కారణంగా శరీరం లోపలి భాగాల్లో అతి చిన్న మార్పునూ పసిగట్టి చూపగల నిర్ధారణ పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇలాంటిదే తాజాగా అందుబాటులోకి వచ్చిన ఐఎమ్మారై (ఇంట్రా ఆపరేటివ్ ఎమ్మారై). అది మరో అడుగు ముందుకు వేసి ఆపరేషన్ చేస్తున్న సమయంలోనే శరీరంలోపలి అవయవాల స్పష్టమైన చిత్రాలను తీస్తుంది. దీని సహాయంతో న్యూరో వైద్య నిపుణులు మెదడులోని గడ్డలను తొలగించే విషయంలో చాలా నైపుణ్యాన్ని, కచ్చితత్వాన్ని సాధించగలిగారు. ఈ సాంకేతికతల కారణంగా ఇప్పుడు గడ్డలన్నింటిని దాదాపుగా కూకటివేళ్లతో సహా తొలగించడానికి వీలవుతోంది. అలాగే పార్కిన్సన్స్ డిసీజ్, వణుకుడు (ఎసెన్షియల్ ట్రెమర్స్) వ్యాధులకు సంబంధించిన సంక్లిష్టమైన శస్త్రచికిత్సలను సైతం మెదడులోని ఆరోగ్యకరమైన కణజాలానికి ఏమాత్రం నష్టం జరగకుండా అత్యంత సురక్షితంగా చేయడానికి వీలవుతోంది. అందువల్ల మీరు ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా మీ డాక్టర్ సలహా మేరకు శస్త్రచికిత్స చేయించుకోండి. పార్కిన్సన్స్ వ్యాధి అంటే ఏమిటి? మా పెద్దన్న వయసు 63 ఏళ్లు. ఇటీవల ఆయన తరచూ అనారోగ్యానికి గురవుతున్నాడు. చాలా బలహీనంగా ఉన్నాడు. చేతులు, కాళ్లు, తల తరచూ వణుకుతున్నాయి. మాట్లాడేటప్పుడు వణుకు వస్తోంది. ఇదివరకు ఎప్పుడూ చిరునవ్వుతో సంతోషంగా ఉండేవాడు. అలాంటిది ఇప్పుడు ఆయన చాలా గంభీరంగా ఉంటున్నాడు. తిండి కూడా సయించడం లేదు. ఏం పెట్టినా రుచీపచీ లేని తిండి పెడుతున్నారంటూ చిరాకు పడుతున్నాడు. డాక్టర్‌కు చూపిస్తే పార్కిన్సన్స్ వ్యాధిగా నిర్ధారణ చేశారు. పార్కిన్సన్స్ వ్యాధి అంటే ఏమిటి? ఇది ప్రమాదకరమా? ఎందుకు వస్తుంది? చికిత్స ఏమిటి? దయచేసి వివరించండి. మీరు చెబుతున్న మీ అన్నగారి లక్షణాలను బట్టి అది పార్కిన్సన్స్ (వణుకుడు) వ్యాధిగానే అనిపిస్తోంది. పార్కిన్సన్స్ అనేది నరాలకు సంబంధించిన వ్యాధి. మెదడులో డోపమైన్ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేసే నాడీకణాలు దెబ్బతినడం, క్షీణించడం కారణంగా ఇది వస్తుంది. డోపమైన్ మెదడులోని వివిధ భాగాలకూ... శరీరంలోని నాడీవ్యవస్థకు మధ్య సమాచార మార్పిడి (కమ్యూనికేషన్)కి తోడ్పడే కీలకమైన రసాయనం. దీనికి తయారుచేసే కణాలు క్షీణించడం వల్ల మెదడు దేహంలోని అవయవాలను అదుపుచేయగల సామర్థ్యాన్ని కోల్పోతుంది. దాంతో శరీరభాగాలు ప్రత్యేకించి చేతులు, కాళ్లు, తల వణుకుతుంటాయి. శరీరంలోని కండరాలు బిగుతుగా తయారవుతాయి. మాట్లాడే విధానంలో తీవ్రమైన మార్పులు వస్తాయి. వ్యక్తి బలహీనంగా తయారవుతాడు. ఈ వ్యాధి నెమ్మదిగా పెరుగుతూ తీవ్రస్థాయికి చేరుకుంటుంది. సాధారణంగా అరవై ఏళ్లకు పైబడ్డవారే ఎక్కువగా పార్కిన్సన్స్ వ్యాధికి గురవుతుంటారు. కొన్ని కుటుంబాల్లో మాత్రం ఇది వంశపారంపర్యంగా వస్తూ, చిన్న వయసులోని వారిలోనూ కనిపిస్తుంటుంది. మన దేశంలో దాదాపు కోటికి పైగా మంది దీనితో బాధపడుతున్నారు. సరైన సమయంలో డాక్టర్‌ను సంప్రదించి ఆధునిక సౌకర్యాలు ఉన్న పెద్ద ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవడం ద్వారా దీన్ని అదుపు చేయడానికి వీలుంటుంది. పార్కిన్సన్స్ వ్యాధి చికిత్స ఇటీవల సమూలంగా మారిపోయింది. ఈ వ్యాధిగ్రస్తులు తమను వేధిస్తున్న లక్షణాలను అదుపు చేసుకొని, సాధారణ జీవితం గడిపేందుకు ఇదివరకు ఎన్నడూ లేని స్థాయిలో వైద్యపరమైన ఔషధాలు, సర్జికల్ చికిత్సలు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. పార్కిన్సన్స్ వ్యాధి మధ్యస్థాయిలో ఉండి శరీరక పరిమితులు ఎదుర్కొంటున్న వ్యక్తుల్లో వ్యాధి లక్షణాలను అదుపు చేయటంతో పాటు వాడుతున్న మందుల నుంచి గరిష్ఠప్రయోజనం పొందేందుకు ఇప్పుడున్న ఆధునిక చికిత్సలు తోడ్పడుతున్నాయి. చికిత్సవ్యాధి తీవ్రత, రోగి ఆరోగ్యపరిస్థితి, శరీరతత్వాన్ని దృష్టిలో పెట్టుకుని చికిత్స చికిత్స వ్యూహాన్ని రూపొందించాల్సి ఉంటుంది. ఇందుకు మందులు, ఫిజియోథెరపీ, అవసరాన్ని బట్టి శస్త్రచికిత్స ఉపయోగపడతాయి. దాదాపు నాలుగు దశాబ్దాల కిందట కనిపెట్టిన ‘ఎల్ డోపా’ అనే ఔషధం వణుకుడు వ్యాధికి సమర్థంగా పనిచేస్తున్నది. శక్తిమంతమైన ఈ మందును డాక్టర్ల పర్యవేక్షణలోనే వాడాల్సి ఉంటుంది. లేనిపక్షంలో మోతాదులో ఏవైనా లోటుపాట్లు జరిగితే మొత్తంగా మెదడు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఇది మెదడులోని ముఖ్యమైన నాడీకణాలకు సహాయపడుతూ డోపమైన ఉత్పత్తి జరిగేట్లు చేస్తుంది. దాంతో అవయవాలు బిగుసుకుపోవడం, వణుకుడు తగ్గుతుంది. పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సకు సంబంధించి మరో శక్తిమంతమైన చికిత్స డీబీఎస్ (డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్). ఈ శస్త్రచికిత్స వ్యాధి పెరుగుదలను నియంత్రిస్తుంది. గుండె పనితీరును మెరుగుపనిచేందుకు పేస్ మేరక్ అమర్చినట్లుగానే ఈ సర్జరీ ద్వారా మెదడులో ఎలక్ట్రోడ్లను అమర్చుతారు. మెదడులోని కొన్ని కణాలను తొలగించడం, మరికొన్ని భాగాలకు ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వడం ద్వారా వ్యాధి ముదరకుండా చేయగలుగుతారు. డోపమైన తయారీ పునరుద్ధరించగలగడం సాధ్యమవుతుంది. డాక్టర్ ఆనంద్ బాలసుబ్రమణియం సీనియర్ న్యూరోసర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
‘ఐఓఎన్ఎమ్’ అంటే ఏమిటి?
మా మనవడి వయసు 9 ఏళ్లు. చిన్నతనం నుంచి తరచూ ఫిట్స్‌తో బాధపడుతున్నాడు. హైదరాబాద్‌లో పెద్దహాస్పిటల్లో చూపించాం. ‘బ్రెయిన్ ట్యూమర్’ అని చెప్పారు. చూపు, వినికిడి ఎఫెక్ట్ అయ్యేలా ట్యూమర్ ఉందన్నారు. అయితే ఇటీవల బ్రెయిన్ ట్యూమర్ సర్జరీలో కొత్తగా ‘ఐఓఎన్ఎమ్’ పద్ధతిలో ట్యూమర్ తొలగించారని పేపర్లలో చదివాం. మా బాబు చాలా చిన్నవాడు. ట్యూమర్ కారణంగా వాడి చూపుకు, వినికిడికి లేదా ఏదైనా ముఖ్య అవయవానికి లోపం జరిగితే వాడికి జీవితాంతం శాశ్వతమైన ఇబ్బంది ఏర్పడుతుందనే ఆందోళన ఉంది. దయచేసి మాకు ఐఓఎన్ఎమ్ పద్ధతి అంటే ఏమిటో విపులంగా వివరించి, మా మనవడి గురించి సలహా ఇవ్వండి. మీ మనవడి ట్యూమర్ మెదడులో ‘చూపు, వినికిడి’ నియంత్రించే భాగానికి ఆనుకొని ఉన్నట్లు తెలిపారు. మీరు ఆందోళన చెందకండి. ఇలాంటి సంక్లిష్టమైన బ్రెయిన్ సర్జరీలకు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఇలాంటి న్యూరో సర్జరీలు, స్పైన్ సర్జరీలు ఇప్పుడు ఐఓఎన్ఎమ్ సర్జరీ ప్రక్రియతో విజయవంతమవుతున్నాయి.ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్ అనే మాటలకు సంక్షిప్త రూపమే ఐఓఎన్ఎమ్. మెదడు ఆపరేషన్లలో కొన్ని చాలా సంక్లిష్టంగా ఉంటాయి. మెదడులోని మాటలు, చూపు, కదలికలు, వినికిడి, రుచి, స్పర్శ... వంటి ముఖ్యమైన జ్ఞానేంద్రియాలూ, అవయవాలకు సంబంధించిన ప్రాంతాల్లోని గడ్డలను/ట్యూమర్లను తొలగించడం చాలా రిస్క్‌తో కూడికున్న పని. ఎందుకంటే గడ్డలను తొలగించే ప్రయత్నంలో ఆయా ప్రాంతాలకు దెబ్బ తగిలితే, సంబంధిత అవయవం ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అయితే అత్యాధునికమైన ఇమేజ్ గైడెన్స్, ఇంట్రా 3టీ ఎమ్మారైతో కూడిన ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్ (ఐఓఎన్‌ఎం) విధానం... సంక్లిష్టమైన శస్త్రచికిత్సలను సురక్షితంగా చేసేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మిగతా మెదడు కణజాలం దెబ్బతినకుండా కేవలం ట్యూమర్ వరకు మాత్రమే తొలగించడానికి ఈ ప్రక్రియ దోహదం చేస్తుంది. ఆపరేషన్ జరుగుతున్న సమయంలోనే డాక్టర్లు మొత్తం నాడీ వ్యవస్థను నిరంతరం పరిశీలిస్తూ, మిగతా భాగాలకు ఎలాంటి హానీ జరగకుండా పర్యవేక్షిస్తుంటారు. ఐఓఎన్ఎమ్ పద్ధతిలో సర్జరీ నిర్వహించే సమయంలో ఆపరేషన్ చేసేటప్పుడు ట్యూమర్‌ను పూర్తిగా తొలగించామా, లేదా అనే విషయాన్ని ఆపరేషన్ థియేటర్లోనే నిర్ధారణ చేసుకొని, విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేయవచ్చు. అందువల్ల మన జీవితంలో ఎంతో కీలకమైన... మాటలు, చూపు, కదలికలు, వినికిడి, రుచి, స్పర్శ... వంటి ప్రధాన కార్యకలాపాలు దెబ్బతినకుండా, కోల్పోకుండా రోగికి సంపూర్ణ చికిత్స అందించవచ్చు. ఫలితంగా చాలా సందర్భాల్లో బ్రెయిన్ సర్జరీల్లో రీ–డూ (మళ్లీ మళ్లీ చేయాల్సిన ఆపరేషన్లు) చేయాల్సి అవసరం రాకుండానే విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేయవచ్చు. మొత్తం గడ్డను/ ట్యూమర్‌ను ఒకేసారి తొలగించవచ్చు. కాబట్టి మీ మనవడి విషయంలో మీరు ఎలాంటి ఆందోళన చెందకుండా... ఆ సౌకర్యాలు ఉన్న పెద్ద హాస్పిటల్స్‌లో ఒకసారి సంప్రదించండి. నడుముకు శస్త్రచికిత్స అంటున్నారు... ఆందోళనగా ఉంది నా వయసు 40 ఏళ్లు. నాకు ఇద్దరు పిల్లలు. ప్రతి రోజూ ఆఫీసుకు వెళ్లడానికీ, అక్కడ్నుంచి రావడానికి అంటూ దాదాపు 60 కి.మీ. పైనే బైక్ మీద తిరుగుతుంటాను. ఈమధ్య నడుము నొప్పి చాలా ఎక్కువగా వస్తోంది. డాక్టర్‌ను సంప్రదించాను. ఆయన నడుముకు శస్త్రచికిత్స చేయాలన్నారు. నాకు చాలా ఆందోళనగా ఉంది. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. ఈమధ్య కాలంలో చాలా మందిని ఈ సమస్య పట్టి పీడిస్తోంది. వివిధ రకాల ఒత్తిడి, జీవన విధానంలో మార్పులు, అధిక బరువులెత్తడం చాలాసేపు ఒకే భంగిమలో ఉండటం, ముందుకు ఒంగి పనిచేయడం, రోజూ చాలా దూరం బైక్‌పై ప్రయాణం చేయడం వంటి కారణాలతో వెన్నెముక మీద ఒత్తిడి ఏర్పడి ఈ సమస్య తలెత్తుతోంది. మీరు ఇటు ఇంట్లో పని చేసుకుంటూ ఆపై ఆఫీసుకు బండి మీద వెళ్లి అక్కడ కూడా శ్రమపడుతున్నారు. అంటే మీరు శారీరక ఒత్తిడికి అధికంగా లోనవుతున్నట్లు అర్థమతువోతంది. మీరు వెన్ను ఎమ్మారై తీయించారా? ఆ పరీక్ష ఫలితాలను చూసి డాక్టర్ మీకు సర్జరీ చేయించమని సలహా ఇచ్చినట్లయితే మీరు ‘స్పాండిలోలిస్తెసిస్’ అనే సమస్యతో తీవ్రంగా బాధపడుతున్నట్లు నిర్ధారణ చేయవచ్చు. ఈ సమస్యతో బాధపడుతున్నవారిలో కొంతమందికి మందులతోనే నయమైతే, మరికొందరికి నడు కింది భాగంలో బెల్ట్ పెట్టుకోవాల్సి వస్తుంది. అవసరాన్ని బట్టి వైద్యులు వాకింగ్, యోగా లాంటి వ్యాయామాలు సూచిస్తారు. అప్పటికీ తగ్గకపోతే శస్త్రచికిత్స నిర్వహించి, వెన్నుపూసలోని నరాలపై ఎక్కడ ఒత్తిడి పడుతోందో గుర్తించి, వెన్నుపూస లోపల జారిపోయిన ఎముకను సాధారణ స్థితికి తీసుకువచ్చి స్క్రూస్, రాడ్స్ బిగించి, నరాలు ఒత్తిడికి గురికాకుండా చేస్తారు. ఈ విషయంలో మీరు ఆందోళనపడాల్సిందేమీ లేదు. వెన్నుకు ఆపరేషన్ చేసే విధానాలలో సురక్షితమైన శస్త్రచికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. వెన్నెముక సమస్య ఎక్కడ ఉందో తెలుసుకొని, మిగతా భాగాలు దెబ్బతినకుండా మినిమల్లీ ఇన్వేసివ్ విధానంలో తక్కువ కోతతో ఆపరేషన్ నిర్వహించగలుగుతారు. ఈ విధానంలో వెన్నుపాముకి ఒక అంగుళం లేదా అంతకన్నా తక్కువ పరిమాణంలో ఒక చిన్న రంధ్రం పెడతారు. దీన్నే కీ–హోల్ అంటారు. శరీరంపై చిన్న కోత మాత్రమే ఉంటుంది కాబట్టి గాయం త్వరగా మానిపోతుంది. శస్త్రచికిత్స నిర్వహించిన రోజున లేదా మర్నాడే రోగిని ఇంటికి పంపించేస్తారు. మొదట మీరు మీ ఎమ్మారై, ఇతర రిపోర్టులతో న్యూరోసర్జన్‌ను సంప్రదించండి. వారు ఇప్పుడు అందుబాటులో ఉన్న వైద్యవిజ్ఞానంతో మిగతా భాగాలకు ఎలాంటి లోపం/వైకల్యం రాకుండా శస్త్రచికిత్స చేయగలరు. కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చంటి పాపాయిలను ఘనాహారం వైపు మళ్లించడం ఎలా? తల్లి పాలు తాగుతూ ఉండే చిన్నారులకు నాలుగో నెల రాగానే అన్నప్రాశన చేసి, వారు మెల్లగా ఘనాహారం తీసుకునేలా అలవాటు చేస్తుంటారు. ఇలా పిల్లలను క్రమంగా ఘనాహారం వైపు మళ్లించడాన్ని ‘వీనింగ్’ అంటారు. ఇలా వీనింగ్ తర్వాత పిల్లల వికాసం కోసం వాళ్లలో కణజాలం, టిష్యూల అభివృద్ధి కోసం మెుదటి ఏడాదిలో ఇవ్వాల్సిన ఆహారం విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. నాలుగు నుంచి ఆరు నెలల వయసప్పుడు క్రవుంగా చిన్నారులను ఘనాహారం అలవాటు చేయాలి. వీనింగ్ సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి వీనింగ్ ప్రక్రియలో కొన్ని ఆహారాపు అలవాట్లను అవాయిడ్ చేయాలి. ►గిన్నెలో ఉన్నది పూర్తికావడం కోసం వాళ్లు వద్దంటున్నా బలవంతంగా పెట్టకండి. ►వాళ్ల దినచర్యకూ, వాళ్లు తీసుకుంటున్న ఆహారానికి వుధ్య సవుతౌల్యం (బ్యాలెన్స్) ఉండేలా చూసుకోండి. ►వాళ్లకు ఏదైనా బహువూనంగా ఇవ్వదలచుకుంటే అది ఆహారపదార్థాలై ఉండకుండా జాగ్రత్తపడండి. (కొందరు అదేపనిగా ఫలానాది చేస్తే చాక్లెట్లను బహువూనంగా ఆశపెడుతుంటారు. ఈ అలవాటు మంచిది కాదు). పిల్లలను వురీ ఎక్కువ తియ్యగా ఉండే మిఠాయిలకూ, ఉప్పగా ఉండే చిప్స్ వంటి పదార్థాలకు అలవాటు చేయకండి. మంచి స్వాభావికమైన ఆహారపదార్థాలైన కూరగాయలు, ఆకుకూరలు, పళ్లను పిల్లలకు అలవాటయ్యేలా చూడండి. డాక్టర్ ఆనంద్ బాలసుబ్రమణియం సీనియర్ న్యూరోసర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
బంగ్లా క్రికెటర్‌కు బ్రెయిన్ ట్యూమర్
ఢాకా : బంగ్లాదేశ్ స్పిన్నర్ ముషారఫ్ హుస్సేన్ బ్రెయిన్ ట్యూమర్‌తో బాధ పడుతున్నాడు. దీనికి చికిత్స తీసుకోవడం కోసం త్వరలోనే సింగపూర్ వెళ్లనున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. ఆరోగ్యం బాగోలేదని ఢాకాలోని ఓ ఆస్పత్రికి వెళ్లిన ముషారఫ్ హుస్సేన్‌కు.. అక్కడి వైద్యులు బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు గుర్తించారు. అయితే, ఇది ప్రారంభ దశలోనే ఉండడంతో సింగపూర్ వెళ్లి సర్జరీ చేయించుకోవచ్చని సూచించారు. దీంతో అతడు వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన ప్రక్రియ జరుగుతోంది. ఇది పూర్తయిన వెంటనే సింగపూర్ విమానం ఎక్కనున్నాడు. ముషారఫ్ హుస్సేన్ సర్జరీకి దాదాపు రూ. 40 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు వెల్లడించారు. ‘నాకు ట్యూమర్ ఉన్నట్లు తెలిసిన వెంటనే నేను, నా కుటుంబం చాలా ఆందోళనకు గురయ్యాం. అయితే, ఇది ప్రారంభ దశలోనే ఉందని తెలియగానే మాకు కొంత ఉపశమనం కలిగింది. నా ఆరోగ్య పరిస్థితి గురించి బంగ్లా క్రికెట్ బోర్డుకు చెప్పాను. అందరూ నన్ను ఆందోళన చెందొద్దని చెబుతున్నారు. నేను కూడా ధైర్యంగా ఉండడానికే ప్రయత్నిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. బంగ్లాదేశ్ జట్టు తరపున ఐదు అంతర్జాతీయ వన్డేలు ఆడాడు. 2008 అంతర్జాతీయ అరంగేట్రం చేసిన హుస్సేన్.. 2016లో చివరిసారి వన్డే ఆడాడు. 112 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అతడు.. 3000కు పైగా పరుగులు చేయడంతో పాటు, 392 వికెట్లను పడగొట్టాడు. -
మీ పిల్లలకు తరుచూ తలనొప్పా.. జాగ్రత్త
జైపూర్ : మీ పిల్లలకు తరుచుగా తలనొప్పి వస్తోందా? అయితే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుని సంప్రదించడం మంచిది. మెదడులోని కణితుల వల్ల కూడా తరుచుగా తలనొప్పి వచ్చే అవకాశం ఉందని న్యూరోసర్జన్లు అంటున్నారు. ప్రతి సంవత్సరం దాదాపు 2500 మంది పిల్లలు బ్రెయిన్ ట్యూమర్(మెదడులోని కణితులు)తో బాధపడుతున్నారని పేర్కొన్నారు. చిన్న పిల్లలు ఎక్కువగా మొబైల్ ఫోన్లను వాడటం వల్ల కూడా ట్యూమర్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు. జైపూర్‌కు చెందిన ప్రముఖ న్యూరోసర్జన్ డా.కేకే.బన్సాల్ మాట్లాడుతూ.. జన్యు సంబంధ అంటువ్యాధుల కారణంగా చిన్న పిల్లలలో ట్యూమర్లు వస్తున్నాయని అన్నారు. పిల్లలు తల్లి కడుపులో ఉన్నపుడు.. ఆమె గర్భం ధరించిన మొదటి మూడు నెలల వరకు తీసుకున్న మందులు, కాన్పుకు మూడు నెలల ముందు తీసుకున్న మందుల ప్రభావం ఉంటుందన్నారు. ముఖ్యంగా రేడియేషన్ వల్ల కూడా జన్యు సంబంధ అంటువ్యాధులు వస్తాయన్నారు. గర్భిణిలు సెల్‌ఫోన్ వాడకాన్ని చాలా వరకు తగ్గించాలని సూచించారు. పిల్లలలో ఈ బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు పుట్టిన కొన్ని సంవత్సరాల తర్వాత కనబడతాయని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల కారణంగా పిల్లలలో ఈ వ్యాధి మరింత పెరిగిందని అన్నారు. ప్రస్తుతం ట్యూమర్లను తొలగించడానికి రెండు రకాల పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. మామూలు ట్యూమర్లను సర్జరీ ద్వారా తొలగించవచ్చు. మరి కొన్ని ట్యూమర్లను గామా నైఫ్ థెరపీ పద్దతి ద్వారా తొలగించవచ్చు. -
బ్రెయిన్ ట్యూమర్ల చికిత్సలో కొత్త విప్లవం
సాక్షి, హైదరాబాద్: మానవ శరీరంలోని అన్ని అవయవాలనూ నియంత్రించే శక్తి ఒక్క మెదడుకే ఉంటుంది. మారిన జీవనశైలి వల్ల అనేక మంది చిన్న వయసులోనే బ్రెయిన్ ట్యూమర్ల బారిన పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.75 లక్షల కేసులు నమోదవుతున్నా యి. భారత్‌లో రోజుకు సగటున 500 బ్రెయిన్ ట్యూమర్ టెస్టులు జరుగుతున్నాయి. మెదడులో ఏర్పడిన కణితుల తొలగింపు చికిత్స కష్టమైంది. సర్జరీ సమయంలో వైద్యుడు అజాగ్రత్తగా వ్యవహరించినా.. మెదడులోని ఇతర నరాలు తెగిపోయినా రోగి కాళ్లు, చేతులు చచ్చుబడి పోయే ప్రమాదం ఉంది. సర్జరీ చేసి గడ్డను తొలగించినా.. ఒక్కోసారి ఆ గడ్డ తాలూకు కణజాలంలోని కొంతభాగం అలాగే ఉండిపోతుంది. ఇది కొన్నాళ్ల తర్వాత మళ్లీ పెద్దదిగా మారి రెండో సర్జరీకి వెళ్లాల్సి వస్తుం ది. సర్జరీ పేరుతో కపాలాన్ని రెండుసార్లు కట్ చేసి తెరవడం వల్ల ఒక్కోసారి రోగి ప్రాణాలకే ప్రమాదం. సీటీ, ఎంఆర్ఐ ద్వారా గుర్తించలేని అతి సూక్ష్మమైన కణాలను సర్జరీ సమయంలోనే గుర్తించి, దాన్ని పూర్తిగా తొలగించే ఆధునిక ‘ఇంట్రా ఆపరేటివ్ 3టి ఎంఆర్ఐ’ సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశంలోనే తొలిసారిగా నగరంలోని యశోద ఆస్పత్రి అందుబాటులోకి తెచ్చింది. బుధవారం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ‘3టి ఎంఆర్ఐ’ పనితీరును వైద్య బృందం వివరించింది. వందకుపైగా చికిత్సలు పూర్తి.. ఇప్పటి వరకు వందకుపైగా చికిత్సలను విజయవంతంగా పూర్తి చేసినట్లు యశోద ఆస్పత్రి యాజమాన్యం ప్రకటించింది. రెండో సర్జరీ అవసరం లేకుండా తొలి సర్జరీలోనే ఎంఆర్ఐ తీసి మిగిలిపోయిన గడ్డల తాలూకు అతిసూక్ష్మమైన కణాలను పూర్తిగా తొలగించగలిగినట్లు తెలిపింది. మిగిలిన కణాల నిర్మూ లనలో రేడియేషన్ సహా ఖరీదైన మందులు అవసరం లేకపోగా.. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావంతో పాటు రోగి త్వరగా కోలుకునేందుకు అవకాశం లభించిందని ఆస్పత్రి ఎండీ డాక్టర్ జీఎస్ రావు, న్యూరోసర్జన్ డాక్టర్ ఆనంద్ బాలసుబ్రమణ్యం, డాక్టర్ బీజే రాజేశ్ డాక్టర్ వేణుగోపాల్, డాక్టర్ శ్రీనివాస్ బొట్లతో కూడిన వైద్యబృందం తెలిపింది. 3టి ఎంఆర్ ఐ సాయంతో చేసిన చికిత్సల్లో వందశాతం సక్సెస్ రేటు సాధించామని పేర్కొంది. -
ప్రాణం కోసం.. పన్నెండేళ్ల పోరాటం
జూలపల్లి(పెద్దపల్లి): వైద్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులు తమ బిడ్డ ప్రాణాలను కాపాడతాయని 12 ఏళ్లుగా ఆ తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. ఆస్పత్రుల చుట్టూ తిరిగి చేతిలో ఉన్నకాడికి ఖర్చు చేసి వైద్యం చేయించారు. అయి నా తగ్గని వ్యాధి తమ కుమారుడిని ఎక్కడ పొట్టనపెట్టుకుంటుందోనని ఆ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. జూలపల్లికి చెందిన వడ్లూరి చంద్రమౌళి– స్వరూపలకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు రాహుల్(16)కు 12 ఏళ్ల క్రితం బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి సోకింది. అప్పట్లో అప్పు లు తెచ్చి లక్ష రూపాయలు ఖర్చు చేసి ఆపరేషన్ చేయించారు. డాక్లర్లు 12 ఏళ్లపాటు మందులు వాడి తిరిగి పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. కొంత మేరకు దాతల సహకారం అందడంతో మందులు వాడుతూ వచ్చారు. అప్పట్లో చేసిన అప్పులు నేటికి తీరకపోగా వారి వద్ద ప్రస్తుతం చేతిలో చిల్లిగవ్వ లేదు. వైద్య పరీక్షలకు వెళ్లక పోవడంతో నెల రోజుల నుంచి బాలుడు తీవ్ర అస్వస్థతకు గురై నడవలేని పరిస్థితికి వచ్చాడు. మలమూత్రాలు సైతం మంచంలోనే సాగుతున్నాయి. పరీక్షలకు కనీసం రూ.30 వేలు అవసరం ఉంటాయని, కూలీ చేసుకుని జీవనం సాగించే తమవద్ద ఆ డబ్బులు లేకపోవడంతో నిస్సహాయ స్థితిలో ఉన్నామని అతని తల్లిదండ్రులు దీనంగా చెప్పారు. బ్రెయిన్ ట్యూమర్ సోకిన తమ 16 ఏళ్ల కుమారుడికి వైద్యం చేయించుకోలేని స్థితితో ఆ నిరుపేద కుటుంబం ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తోంది. దాతలు స్పందించి తమ కుమారుని ప్రాణాలు కాపాడాలని వారు వేడుకుంటున్నారు. దాతలు సెల్: 7799816260కు సంప్రదించగలరు. -
పాపం పసివాడు..!
పేద కుటుంబానికి పెద్ద కష్టమే వచ్చింది. కొడుకు పుట్టాడని మురిసిపోయిన ఆ తల్లిదండ్రులు ఇప్పుడు కొడుకు ఆరోగ్యం కోసం మొక్కని దేవుడంటూ లేడు. చిన్న వయస్సులో బ్రెయిన్ ట్యూమర్ రావడంతో కన్నవాళ్లు పడుతున్న కష్టాలు వర్ణణాతీతం. కూలీ చేసుకుంటేనే నాలుగేళ్లు నోట్లోకి వెళ్లే దుస్థితి వారిది. కొడుకు ఆరోగ్యం కోసం ఇప్పటికే లక్షలాది రూపాయల అప్పులు చేసి సహాయం కోసం పేద దంపతులు ఎదురు చూస్తున్నారు. జగదేవ్‌పూర్(గజ్వేల్): మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన రాగం బాల్‌రాజు, రమాదేవి దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. కొడుకు భానుప్రసాద్ గ్రామంలోనే 4వ తరగతి, కూతురు నందిని 1వ రతగతి చదువుతుంది. చిన్న కూతురు ఇంటి దగ్గరనే ఉంటోంది. వీరికి గల ఎకరం భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కూలీ పనులు నిర్వహించుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. బతుకుబండి సాఫీగా కొనసాగుతున్న ఆ కుటుంబానికి పెద్ద కష్టం వచ్చి పడింది. కొడుకు ఉన్నట్టుండి అనారోగ్యంబారిన పడ్డాడు. తల్లిదండ్రులు కొడుకు భానుప్రసాద్‌కు హైదరాబాద్‌లోని లోటస్ ప్రైవేట్ దవాఖానలో ఇటీవల వైద్య పరీక్షలు చేయించారు. బాబుకు బ్రెయిన్‌ట్యూమర్ ఉందని వైద్యులు నిర్ధారించారు. వెంటనే వైద్యుల సూచనల మేరకు సికిందరాబాద్‌లోని యశోద హాస్పిటల్‌లోని వైద్యం కోసం వెళ్లారు. బాబుకు వైద్యం పరీక్షలు నిర్వహించిన అనంతరం సుమారు రూ.20 లక్షల వరకు ఖర్చు వస్తుందని వైద్యులు చెప్పారు. వెంటనే తల్లిదండ్రులు కొంత డబ్బు చెల్లించి ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వైద్యం కొనసాగుతోంది. మా బాబుకు ప్రాణం పోయండి.. మా బాబు భానుప్రసాద్‌కు ప్రాణభిక్ష పెట్టండి... అంటూ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. తమకు ఎకరం భూమి మాత్రమే ఉందని, బాబు వైద్యం కోసం ఇప్పటికే రూ.12 లక్షలు చెల్లించాం. గ్రామంలోనే తెలిసివాళ్ల దగ్గర అప్పులు చేసి వైద్యం కోసం ఖర్చు చేస్తున్నాం. ఇంకా ఐదారు లక్షల వరకు ఖర్చు వస్తుందని డాక్టర్లు చెప్పుతున్నారు. ఇక అప్పులు పుట్టే పరిస్థితి లేదు. సహాయం అందించి బాబుకు ప్రాణభిక్ష పెట్టండి.. అంటూ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. ప్రభుత్వం ఆ కుటుంబానికి సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
సకాలంలో చికిత్స అందిస్తే పక్షవాతాన్ని నియంత్రించవచ్చు!
న్యూరో కౌన్సెలింగ్ మా అమ్మగారి వయసు 45 ఏళ్లు. ఇటీవల ఆమెకు పక్షవాతం వచ్చింది. అయితే ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లడం ఆలస్యమైంది. ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయిస్తే మా అమ్మగారికి బ్రెయిన్లో రక్తం క్లాట్ అవ్వడంతో స్ట్రోక్ వచ్చిందని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం మా అమ్మగారు మాట్లాడలేకపోతున్నారు. ఆమెను క్రమం తప్పకుండా ఆసుపత్రికి తీసుకెళ్ల చికిత్స అందిస్తున్నాం. పక్షవాతం వస్తే అది పూర్తిగా నయం కాదా? ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారకుండా ఉండటానికి ఎలాంటి చికిత్సను అందించాలో దయచేసి తగిన సలహా ఇవ్వగలరు. - కళ్యాణి, చిత్తూరు శరీరంలోని అన్ని అవయవాలను నియంత్రించేది మెదడు ఒక్కటే. శరీరానికి బ్రెయిన్ ఒక కంట్రోల్ రూమ్ లాంటిది అలాంటి మెదడులో క్లాట్ ఏర్పడటం అంటే అది శరీరంలోని అవయవాలపై నేరుగా ప్రభావం చూపడమే. ఈ సమస్య వల్ల కొన్ని అవయవాలపై మెదడు తన నియంత్రణను కోల్పోతుంది. అయితే మెదడులో క్లాట్ ఏర్పడటం అరుదైన విషయమేమీ కాదనే చెప్పాలి. వయసు, స్ట్రెస్, మానసిక ఆందోళన, జీవనశైలి, డయాబెటిస్, స్థూలకాయం, బీపీ, జన్యుపరమైన ఇతరత్రా కారణాల వల్ల ఈ సమస్య బారిన పడే అవకాశం ఉంది. పక్షవాతం బారిన పడటానికి ముందస్తుగా ప్రతి ఒక్కరిలో కొన్ని లక్షణాలు బయటపడతాయి. ఈ ప్రమాద ఘంటికలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదిస్తే చాలా వరకు సమస్యలను అధిగమించవచ్చు. మెదడులో రక్తసరఫరా ఆగిన చోటును బట్టి లక్షణాలు ఆధారపడి ఉంటాయి. మూతి వంకరపోవడం, ముఖం, చేతులు బలహీనపడటం, నడకలో తేడా రావడం, అస్పష్టంగా కనిపించడం, మాట్లాడటంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. హెచ్చరికల్లాంటి ఈ లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. అలా కాకుండా స్ట్రోక్ వచ్చి ఆలస్యమైనప్పటికీ ఎలాంటి ఆందోళనకు గురికాకుండా అన్ని వైద్య సదుపాయాలున్న ఆసుపత్రిలో నిపుణులైన న్యూరోసర్జన్ లేదా న్యూరాలజిస్ట్లను సంప్రదిస్తే మంచి ఫలితం ఉంటుంది. మీ అమ్మగారి చికిత్స విషయంలో మీకు ఎలాంటి భయాలూ అవసరం లేదు. వైద్యశాస్త్రంలో వచ్చిన అధునాతనమైన సాంకేతిక పురోగతితో మీ అమ్మగారి సమస్యను కరెక్టుగా గుర్తించి న్యూరో నావిగేషన్, మినిమల్లీ ఇన్వేజిక్, అవేక్ సర్జరీ లాంటి అత్యాధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మెరుగైన వైద్యాన్ని అందించి, ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారకుండా కాపాడుకోవచ్చు. అలాగే బ్రెయిన్ ట్యూమర్, బ్రెయిన్ హ్యామరేజి, మల్టిపుల్ క్లాట్స్, బ్రెయిన్ ఎన్యురిజమ్స్ లాంటి తీవ్రమైన మెదడుకు సంబంధించిన ప్రాణాపాయ వ్యాధులను సమర్థంగా ఎదుర్కొనే అవకాశమూ ఉంది. మీకు ఎలాంటి భయాందోళనలూ అవసరం లేదు. అలాగే మీ అమ్మగారికి పక్షవాతం వచ్చింది కాబట్టి మీరు, మీ తోబుట్టువులు కూడా మరింత జాగ్రత్తగా ఉండాలి. మీకు గానీ, మీ తోబుట్టువులకు గాని డయాబెటిస్, రక్తపోటు, స్థూలకాయం (ఒబేసిటీ) లాంటి సమస్యలు ఉంటే వాటిని అదుపులో ఉంచుకోవడం అవసరం. - డాక్టర్ ఆనంద్ బాలసుబ్రమణ్యం, సీనియర్ న్యూరో సర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ పీసీఓడీని నయం చేయవచ్చా? హోమియో కౌన్సెలింగ్ మా అమ్మాయి వయసు 26 ఏళ్లు. తనకు నెలసరి క్రమంగా రాదు. బరువు కూడా పెరుగుతోంది. ఇంకో 2 నెలల్లో వివాహం చేయాలనుకుంటున్నాం. డాక్టర్‌ను సంప్రదిస్తే అన్ని పరీక్షలు చేసి పీసీఓడీ అని చెప్పారు. దీని గురించి మాకు అవగాహన లేదు. అంతేకాదు... ఆ టాబ్లెట్లు వేసుకుంటున్నప్పటి నుంచి బరువు మరింతగా పెరిగిపోతోంది. దీనికి హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా? - సంతోషమ్మ, విజయవాడ అండాశయంలో ద్రవంతో నిండిన చిన్న చిన్న నీటి బుడగల్లాంటి సంచులు వస్తాయి. అవి అండం విడుదలకు అడ్డుపడటం వల్ల వచ్చే సమస్యను పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ అంటారు. కొన్నిసార్లు అవి 1 నుంచి 12 వరకు ఉండవచ్చు. లక్షణాలు అండం విడుదల ఆగిపోవడం వల్ల నెలసరి సరిగా రాకపోవడం లేదా 2 - 3 నెలలకు ఒకసారి రావడం నెలసరి వచ్చినా తక్కువ రక్తస్రావం కావడం కొన్నిసార్లు పూర్తిగా ఆగిపోవడం వల్ల గర్భం దాల్చే పరిస్థితిక కూడా ఉండకపోవచ్చు సాధారణంగా ఈ సమస్య ఉన్న కొందరిలో అవాంఛిత రోమాలు, ముఖంపై మొటిమలు, జుట్టు ఊడటం, బరువు పెరగడం వంటివి కనిపిస్తాయి దీనివల్ల ఆత్మవిశ్వాసం తగ్గి ఒత్తిడికి లోనవుతారు. లక్షణాలు అందరిలోనూ ఒకేలా ఉండకపోవచ్చు. కొందరిలో సాధారణ స్థాయిలో ఉంటే మరికొందరిలో తీవ్రస్థాయిలో ఉండవచ్చు. కొందరిలో అసలు ఏ విధమైన లక్షణాలూ కనిపించకపోవచ్చు. ఈ వ్యాధి వల్ల కలిగే ఇతర సమస్యలు పీసీఓడీ వ్యాధి ఉన్నా హార్మోన్లపై అది ప్రభావం చూపనప్పుడు దీనివల్ల ఎలాంటి ఇబ్బందీ ఉండదు. అయితే ఈ వ్యాధి హార్మోన్లపై ప్రభావం చూపినప్పుడు హార్మోన్ల అసమతుల్యత కలిగి సమస్యలు మొదలవుతాయి. వాటిలో ముఖ్యంగా డయాబెటిస్ నెలసరి ఇబ్బందులు సంతాన సాఫల్య సామర్థ్యం తగ్గిపోవడం అవాంఛిత రోమాలు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు బరువు తగ్గాలి. కానీ అదే సమయంలో కడుపు మాడ్చుకోకూడదు. కేవలం మంచి ఆహార నియమాలు పాటిస్తూ ఆరోగ్యకరంగా బరువు తగ్గాల్సి ఉంటుంది. అలా జరగకపోతే చికిత్స తీసుకున్నా ప్రయోజనం ఉండకపోగా సమస్య అధికమయ్యే అవకాశం ఉంటుంది అవాంఛిత రోమాలను నివారించేందుకు వాక్సింగ్, హెయిర్ రిమూవల్ క్రీమ్‌లు వాడకపోవడం మంచిది నెలసరి రావడం కోసం అధికంగా హార్మోన్ ట్యాబ్లెట్లు వాడకపోవడం మంచిది ఒకవేళ గర్భం దాల్చినట్లయితే క్రమం తప్పకుండా డాక్టర్ పర్యవేక్షణలో ఉండాలి. లేదంటే గర్భస్రావం అయ్యేందుకు అవకాశాలు ఎక్కువ. చికిత్స హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా రోగి శారీరక, మానసిక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స ఇస్తారు. దీనివల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి, హార్మోన్ల సమతౌల్యత సాధారణ స్థాయికి వచ్చి వ్యాధి తగ్గుతుంది. - డాక్టర్ ఎ.ఎం. రెడ్డి సీనియర్ డాక్టర్, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
హెల్ప్‌మీ!
► ఆపన్నహస్తం కోసం పేద కుటుంబం ఎదురుచూపు ► బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న అమ్మాయి ► వైద్యం కోసం రూ.5లక్షలు ఖర్చు అవుతాయన్న వైద్యులు రోజూ పనిచేస్తేనే పూట గడవని పరిస్థితి ఆ దంపతులది.. కుటుంబాన్ని పోషించుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.. ఇంతలో ఆ పేద కుటుంబానికి పిడుగులాంటి వార్తతో కన్నీరుమున్నీరవుతున్నారు. బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న కూతురును ఎలా కాపాడుకోవాలని ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. - పాన్‌గల్ పాన్‌గల్ మండలం వల్లభాపూర్ గ్రామానికి చెందిన రాజ్‌కుమార్, రాజేశ్వరి దంపతులది పేద కుటుంబం. వీరికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. వనపర్తి డివిజన్ కేంద్రంలోని రైస్‌మిల్‌లో రాజ్‌కుమార్ గుమాస్తాగా పనిచేస్తున్నారు. రాజేశ్వరి టైలర్‌గా జీవనం సాగిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వారి పెద్ద కుమార్తె మంజుల ఇంటర్ (ఓపెన్) వరకు చదువుకున్నది. ఈనెల 17న ఇంట్లో నిద్రిస్తూ కోమలోకి వెళ్లింది. గమనించిన తల్లిదండ్రులు వెంటనే కర్నూలు ఆస్పత్రికి తరలించారు. వారం పాటు అక్కడి ఆపోలో ఆస్పత్రిలో రూ.2లక్షల వరకు ఖర్చుచేసి చికిత్స చేయించారు. ఎలాంటి మార్పు రాలేదు. అక్కడి నుంచి హైదరాబాదు నిమ్స్‌కు తరలించడంతో అక్కడ చికిత్స పొందుతోంది. ఈ విషయమై డాక్టర్లు బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి లక్షణాలు ఉన్నాయన్నారు. చికిత్స కోసం రూ.5 లక్షల వరకు ఖర్చు అవుతుందన్నారు. దీంతో ఏమి చేయాలో అర్థం కాక ఆ కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. కూతురును కాపాడుకోవాలని ఉన్నా ఆర్థిక స్థోమత లేక ఆపన్న హాస్తం కోసం ఎదురుచూస్తున్నారు. మా కూతురు జీవితాన్ని కాపాడండి: తల్లిదండ్రులు పేద కుటుంబం మాది. పూట గడవని మాలాంటి వారికి పెద్ద కష్టం వచ్చింది. మా కూతురును కాపాడుకోవడానికి నానా కష్టాలు పడుతున్నాం. ఇప్పటికే రూ.2లక్షల వరకు అప్పులు చేసి వైద్యం చేయించినా ఫలితం కనిపించడంలేదు.ఇంకా వైద్యం కోసం రూ. 5లక్షలు అవసరమవుతాయని వైద్యులు చెబుతున్నారు. మానవతాదృక్పథంతో దాతలు సహకరించి సహాయం చేస్తే మా కూతురు జీవితం కాపాడుకుం టామన్నారు. సహాయం కోసం 7702569116, 9963002727 నంబర్లను సంప్రదించాలని కోరారు. -
ఉదయం వేళలో ఎక్కువగా తలనొప్పి..!
న్యూరో కౌన్సెలింగ్ మా బాబు వయసు 12 ఏళ్లు. ఈమధ్య వాడికి ఉదయం పూట తీవ్రమైన తలనొప్పి వస్తోంది. దాంతోపాటు వాంతులు కూడా అవుతున్నాయి. రోజురోజూకూ నొప్పి పెరుగుతోంది. ఇంటి దగ్గర డాక్టర్‌కు సంప్రదిస్తే మందులు రాసిచ్చారు. వాడాము. కానీ ఏమాత్రం తగ్గలేదు. దీంతో స్పెషలిస్ట్‌ను కలిశాం. పిల్లాడికి బ్రెయిన్ ట్యూమర్ ఉందేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. మాకు విపరీతమైన బెంగ పట్టుకుంది. బ్రెయిన్ సీటీ చేయించమని సలహా ఇచ్చారు. రిపోర్ట్స్ బట్టి నిర్ధారణకు రాగలమని అంటున్నారు. అసలు బ్రెయిన్ ట్యూమర్ ఎందుకు వస్తుంది? అది నయం చేయలేని వ్యాధా? ఒకవేళ మా బాబుకు బ్రెయిన్ ట్యూమర్ అని తేలితే వాడి భవిష్యత్తు ఏమిటి? దయచేసి మాకు తగిన సలహా ఇవ్వండి. - జయలక్ష్మి, సోమాజీగూడ మీరు చెబుతున్న లక్షణాలు కొంచెం ఆందోళనకరంగానే ఉన్నాయి. మీరు ఎంతమాత్రమూ ఆలస్యం చేయకుండా బ్రెయిన్ సీటీ తీయించుకని డాక్టర్‌ను కలవండి. ఈమధ్యకాలంలో బ్రెయిన్ ట్యూమర్ అనేది పిల్లల్లో కూడా చలా ఎక్కువగా మనకు కనపడుతోంది. ఈ ట్యూమర్ కణజాలం మెదడులో అసాధారణంగా పెరుగుతూ దాని పనితీరును అడ్డుకుంటుంది. దానివల్ల మెదడుపై ఒత్తిడి పెరిగి అది తలనొప్పి రూపంలో బయటపడుతుంది. క్రమేణా మెదడుపై ఒత్తిడి తీవ్రమవుతున్న కొద్దీ తలనొప్పి భరించలేనంతగా పెరుగుతుంది. అంతేకాకుండా దీనికి వాంతులు కూడా తోడవుతాయి. బ్రెయిన్ ట్యూమర్ బారిన పడ్డవాల్లకు మీరు చెప్పిన లక్షణాలు ఉదయం పూట ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇలాంటి సమయంలో వెంటనే డాక్టర్‌ను సంప్రదిస్తే వారు తగిన పరీక్షలు చేయించి, బాబుకు అందించాల్సిన చికిత్స విషయంలో తగిన నిర్ధారణకు రాగలుగుతారు. మీరు ఆందోళన చెందుతున్నట్లుగా బ్రెయిన్ ట్యూమర్ అనేది అంత భయపడాల్సిన వ్యాధి కాదు. కాకపోతే మెదడులో ట్యూమర్ ఉన్న స్థానం, దాని పరిమాణం అనే అంశాలను బట్టి చికిత్స, ఫలితాలు ఉంటాయి. అన్ని ట్యూమర్లూ ప్రాణాంతకమైనవి కావు. క్యాన్సర్ కారకాలు కావు. మీ అబ్బాయికి ట్యూమర్ మొదటి దశలోనే ఉంటే, దానిని సమూలంగా తొలగించవచ్చు. ఇప్పుడు అందుబాటులో ఉన్న అత్యాధునిక బ్రెయిన్ సర్జరీ ప్రక్రియలతో, నిపుణులైన న్యూరో సర్జన్ ఆధ్వర్యంలో శస్త్రచికిత్స జరిగితే మీ బాబుకు వచ్చిన సమస్యనూ పూర్తిగా నయం చేయవచ్చు. మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. - డాక్టర్ పి.రంగనాథమ్ సీనియర్ న్యూరో సర్జన్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ కిడ్నీ కౌన్సెలింగ్ నా వయసు 35 ఏళ్లు. నాకు ఏ విధమైన ఇబ్బందులూ లేవు. కానీ జ్వరం వచ్చినప్పుడు ఒకసారి డాక్టర్‌కు చూపించుకుంటే బీపీ 170 / 120 అని చెప్పి, మందులు వాడాలన్నారు. మందులు వాడకపోతే భవిష్యత్తులో కిడ్నీ సమస్య వచ్చే అవకాశం ఉందా? - రవిందర్, పాల్వంచ ఈ వయసులో ఏ కారణం లేకుండా బీపీ రావడం చాలా అరుదు. ముఫ్ఫై ఏళ్లలోపు బీపీ ఇంత ఎక్కువగా ఉన్నప్పుడు కిడ్నీ సమస్య ఏమైనా ఉందేమోనని చూడాలి. మీరు ముందుగా యూరిన్ టెస్ట్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్, క్రియాటినిన్‌తో పాటు కొన్ని ఇతర పరీక్షలు చేయించుకోండి. ఏ లక్షణాలూ లేనప్పటికీ బీపీ నియంత్రణలో ఉండటానికి మందులు వాడాలి. లేకపోతే భవిష్యత్తులో కిడ్నీ దెబ్బతినే అవకాశం ఉంది. మందులు వాడటమే కాకుండా, ఆహారంలో ఉప్పు తగ్గించడం వంటి జీవనశైలికి సంబంధించిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. రోజూ క్రమం తప్పకుండా ఒక గంటకు తగ్గకుండా వాకింగ్ చేయాలి. బరువు ఎక్కువగా ఉన్నట్లయితే, మీ ఎత్తుకు తగినట్లుగా దాన్ని నియంత్రించుకోవాలి. పొగతాగే అలవాటు ఉంటే తప్పనిసరిగా మానేయాలి. నా వయసు 32 ఏళ్లు. గత ఐదేళ్ల నుంచి అప్పుడప్పుడు మూత్రం ఎర్రగా వస్తోంది. ప్రతిసారి రెండు మూడు రోజుల తర్వాత తగ్గిపోతోంది. నొప్పి ఏమీ లేదు. ఇలా రావడం వల్ల భవిష్యత్తులో నాకు ఏదైనా సమస్య వస్తుందా? ఈ లక్షణాలు కనిపిస్తున్నాయంటే కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉందా? - అప్పారావు, నరసన్నపేట మీరు చెప్పినట్లుగా మూత్రంలో చాలాసార్లు రక్తం పోతూ ఉంటే, ఏ కారణం వల్ల అలా జరుగుతోందన్న విషయాన్ని తెలుసుకుని, దానికి అనుగుణంగా చికిత్స తీసుకోవాలి. ఇలా జరగడానికి కిడ్నీలో రాళ్లు గానీ, ఇన్ఫెక్షన్ గానీ, లేదా కిడ్నీ సమస్యగానీ ఉండటం కారణం కావచ్చు. ఒకసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్‌తో పాటు మూత్రపరీక్ష చేయించుకోండి. కిడ్నీలో రాళ్లుగానీ, ఇన్ఫెక్షన్గానీ లేకుండా ఇలా రక్తం పోతూ ఉంటే మూత్రంలో ప్రోటీన్ పోతుందేమో అని పరీక్ష చేయించుకోవాలి. రక్తంతో పాటు ప్రోటీన్లు కూడా మూత్రంతో పాటు పోతూ ఉంటే, కిడ్నీ బయాప్సీ చేయించుకొని, ఆ రిపోర్టులను బట్టి కిడ్నీలు దెబ్బతినకుండా మందులు వాడాల్సి ఉంటుంది. - డాక్టర్ విక్రాంత్‌రెడ్డి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ పల్మునాలజీ కౌన్సెలింగ్ మా అబ్బాయి వయసు 12 ఏళ్లు. అతడు ఎప్పుడూ పొడి దగ్గుతో బాధపడుతున్నాడు. గత రెండు నెలలుగా కొద్దిపాటి జ్వరం ఉంటోంది. వాడికి శ్వాస సరిగా ఆడటం లేదు. మాకు దగ్గర్లోని డాక్టర్‌ను సంప్రదించి మందులు వాడినా సమస్య తగ్గడం లేదు. మావాడి సమస్యకు పరిష్కారం చెప్పండి. - సీతారామయ్య, కొత్తగూడెం మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ అబ్బాయి కాఫ్ వేరియంట్ ఆస్తమాతో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. ఇది ఆస్తమాలోనే ఒక రకం. ఇది వచ్చిన వారిలో తెమడ వంటివి పడకుండా పొడిదగ్గు వస్తూ ఉంటుంది. పిల్లికూతలు లాంటి లక్షణాలు కూడా మొదట్లో ఉండవు. దీన్నే ‘క్రానిక్ కాఫ్’ (దీర్ఘకాలిక దగ్గు) అని కూడా అంటారు. రాత్రీ పగలూ తేడా లేకుండా దాదాపు రెండు నెలలపాటు దగ్గుతుంటారు. దాంతో రాత్రివేళ నిద్ర కూడా పట్టదు. ఈ రోగులు తమకు సరిపడని ఘాటైన వాసనలు, దుమ్ము, ధూళి వంటి వాటికి ఎక్స్పోజ్ అయితే ఆ అలర్జెన్స్ ఆస్తమాను మరింతగా ప్రేరేపిస్తాయి. కాఫ్ వేరియెంట్ ఆస్తమా సమస్య ఎవరికైనా, ఏ వయసులోనైనా రావచ్చు. ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఇది ఎక్కువ. ఇది ఆ తర్వాత సాధారణ ఆస్తమాకు దారితీస్తుంది. అంటే శ్వాస అందకపోవడం, పిల్లికూతలు వంటి లక్షణాలు తర్వాతి దశలో కనిపిస్తాయి. సాధారణ ఆస్తమా లాగే కాఫ్ వేరియెంట్ ఆస్తమాకు కూడా కారణాలు అంతగా తెలియవు. కాకపోతే సరిపడని పదార్థాలు, చల్లగాలి దీనికి కారణాలుగా భావిస్తుంటారు. కొందరిలో అధిక రక్తపోటు, గుండెజబ్బులు, హార్ట్‌ఫెయిల్యూర్, మైగ్రేన్, గుండెదడ (పాల్పిటేషన్స్) వంటి జబ్బులకు వాడే మందులైన బీటా-బ్లాకర్స్ తీసుకున్న తర్వాత ‘కాఫ్ వేరియెంట్ ఆస్తమా’ మొదలు కావచ్చు. కొందరిలో గ్లకోమా వంటి కంటిజబ్బులకు వాడే చుక్కల మందులోనూ బీటా బ్లాకర్స్ ఉండి, అవి కూడా ఆస్తమాను ప్రేరేపిస్తాయని కూడా అధ్యయనాలు చెబుతున్నాయి. కొందరిలో ఆస్పిరిన్ సరిపడకపోవడం వల్ల కూడా దగ్గుతో కూడిన ఆస్తమా రావచ్చు. కాఫ్ వేరియెంట్ ఆస్తమాలో కేవలం దగ్గు తప్ప ఇతర లక్షణాలేమీ కనిపించకపోవడం వల్ల దీని నిర్ధారణ ఒకింత కష్టమే. ఎందుకంటే కాఫ్ వేరియెంట్ ఆస్తమా విషయంలో సాధారణ పరీక్షలైన ఛాతీఎక్స్‌రే, స్పైరోమెట్రీ వంటి పరీక్షలూ నార్మల్‌గానే ఉంటాయి. మీరు వెంటనే మీకు దగ్గర్లో ఉన్న ఛాతీ నిపుణుడిని కలవండి. వారు కొన్ని వైద్య పరీక్షలు చేయించి, వ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాత తగిన చికిత్స సూచిస్తారు. - డా. రమణ ప్రసాద్ ..కన్సల్టెంట్ పల్మునాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్ కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ మా చిరునామా: వైద్యసలహా కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్- 34. ఈ మెయిల్: asksakshidoctor@gmail.com నిర్వహణ: యాసీన్ -
శ్రీవారిని దర్శించుకున్న చిన్నారి శ్రీజ
సాక్షి,తిరుమల: బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతూ కోలుకున్న చిన్నారి శ్రీజ గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఖమ్మం జిల్లా పాల్వాంచ మండలానికి చెందిన శ్రీజ బ్రెయిన్‌ట్యూమర్‌తో బాధపడుతున్న సమయంలో హీరో పవన్‌కల్యాణ్‌ను చూడాలని కోరుకుంది. ఆమె విజ్ఞప్తి మేరకు పవన్ ఆసుపత్రికి వచ్చి త్వరగా కోలుకోవాలని ఆశీర్వదించారు. అప్పటికి ఆమె స్పృహలో కూడా లేదు. ప్రస్తుతం శ్రీజ కోలుకుంది. ఈ నేపథ్యంలో గురువారం కుటుంబ సభ్యులతో కలసి శ్రీవారిని దర్శించుకుంది. -
ప్రముఖ కార్టూనిస్టు సుధీర్ తైలంగ్ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతూ ఇప్పటికే రెండుసార్లు సర్జరీ చేసుకున్న ప్రముఖ రాజకీయ కార్టూనిస్ట్ సుధీర్ తైలంగ్(56) గుర్గావ్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. 30 సంవత్సరాలుగా వేసిన కార్టూన్లను ఢిల్లీలో 2014లో ప్రదర్శించిన ఆయన... చివరిగా మాజీ ప్రధాని మన్మోహన్పై కార్టూన్ల పుస్తకాన్ని తీసుకొచ్చారు. కొన్నేళ్ల పాటు వివిధ జాతీయ దినపత్రికల్లో కార్టూనిస్ట్‌గా పనిచేసిన సుధీర్ తైలంగ్‌కు 2004లో పద్మశ్రీ అవార్డు వరించింది. తైలంగ్ పూర్వీకులు తెలంగాణకు చెందినవారని, తెలంగాణగా ఉన్న పేరు తైలంగ్‌గా మారిందని ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. రాజస్తాన్‌లోని బికనూర్‌లో పుట్టిన సుధీర్ తైలంగ్ ప్రముఖ రాజకీయ నేతలపై కార్టూన్లు వేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. విరివిగా వివిధ జాతీయ చానళ్లలో జరిగిన చర్చాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆయన మృతి కార్టూన్ రంగానికి తీరని లోటు అని ఫోరమ్ ఫర్ పొలిటికల్ కార్టూనిస్ట్స్ హైదరాబాద్ సంతాపం వ్యక్తం చేసింది. -
బ్రెయిన్ ట్యూమర్‌కు ఆపరేషన్ తప్పదా?
హోమియో కౌన్సెలింగ్ మా అమ్మగారి వయసు 56. గత కొద్దికాలంగా ఆమె మెడ నొప్పితో బాధపడుతున్నారు. డాక్టర్‌కు చూపిస్తే ఆమెకు సర్వైకల్ స్పాండిలోసిస్ ఉందని చెప్పి, కొన్ని సూచనలు చేసి, మందులు రాశారు. ఆ సూచనలు పాటిస్తూ, మందులు వాడుతున్నారు. కాని అంతగా ఫలితం కనిపించడం లేదు. హోమియోలో ఈ జబ్బుకు శాశ్వత పరిష్కారం ఉందా? - బి.అమరవాణి, పిడుగురాళ్ల మారుతున్న జీవన శైలి కారణంగా సుమారు 90 శాతం మంది ప్రతి ఒక్కరూ 60 సంవత్సరాలు వచ్చేసరికి కొద్దిపాటి స్పాండిలోసిస్ సమస్యతో బాధపడతారని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఈ సమస్య ఇటీవలి కాలంలో యుక్తవయస్కుల్లోనూ కనిపిస్తోంది. దీనికి గల కారణాలు అనేకం. సర్వైకల్ స్పాండిలోసిస్ లేదా మెడనొప్పి ముఖ్యంగా గంటల తరబడి కూర్చొని పని చేయడం, సరియైన వ్యాయామం లేకపోవడం, అధిక బరువులు ఎత్తడం, పెరుగుతున్న పని ఒత్తిడి ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఏమిటి? మానవ శరీర వ్యవస్థలో వెన్నెముక ఒక మూలస్తంభం లాంటిది. వెన్నుపూస పలు విభాగాల సమ్మేళనం. వెన్నెముకకు తోడుగా కండరాలు, డిస్కులు, లిగమెంట్లు ఉంటాయి. ఇవి సులభంగా వంగడానికి, శరీరంలోని కదలికలకు తోడ్పడతాయి. వెన్నెముకలోని ప్రతి రెండు పూసల మధ్య మృదువైన పదార్థం ఉంటుంది. దీనినే డిస్క్ అంటారు. వెన్నుపాము (స్పైనల్ కార్డ్) నుండి అసంఖ్యాకమైన నరాలు వెళుతుంటాయి. మెడభాగం నుంచి వెళ్లే నరాలు చేతుల్లోగుండా, నడుం భాగం నుండి వెళ్లే నరాలు కాళ్లల్లో గుండా వెళుతుంటాయి. వెన్నెముక మెడ, నడుము భాగాల్లోని డిస్కులే ఎక్కువగా దెబ్బతింటాయి. కాని మెడ దగ్గర ఎక్కువగా రావడం వల్ల దీనిని సర్వైకల్ స్పాండిలోసిస్ అని పిలుస్తారు. కారణాలు: వెన్నెముకకు దెబ్బ తగలడం, అధిక బరువులు ఎత్తడం, గంటల తరబడి కూర్చొని పని చేయడం, సరైన పద్ధతులు పాటించకుండా ఎక్కువగా డ్రైవింగ్ చేయడం, వయసు పెరిగే కొద్దీ వెన్నుపూసల మధ్య ఉండే డిస్క్ అరుగుదలకు గురి కావడం, కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల కూడా సర్వైకల్ స్పాండిలోసిస్ వచ్చే అవకాశం ఉంది. లక్షణాలు: మెడనొప్పి, మెడ బిగుసుకుపోవడం, నొప్పి మెడ ప్రాంతంలో ప్రారంభమై భుజాల్లోకి, చేతుల వరకు వ్యాపించడం, తిమ్మిర్లు, చేతి కండరాలు బలహీనపడటం, భుజాలు, చేతివేళ్లలో స్పర్శ తగ్గిపోవడం, తలనొప్పి, కళ్లు తిరగడం, వాంతులు నిర్థారణ: ఎక్స్‌రే సర్వైకల్ స్పైన్, ఎమ్మారై, సీబీపీ, ఇ.ఎస్.ఆర్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ చికిత్స: హోమియో కేర్ ఇంటర్నేషనల్‌లో జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ వైద్యపద్ధతి ద్వారా మెడనొప్పి తగ్గించడమే కాకుండా వెన్నుపూసలను దృఢంగా చేయడం ద్వారా మెడ, వెన్ను సమస్యలు తిరగబెట్టకుండా స్పాండిలోసిస్ సమస్యలను సంపూర్ణంగా నయం చేయవ చ్చు. - డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ న్యూరోసర్జరీ కౌన్సెలింగ్ నా వయసు 45 ఏళ్లు. నాకు ఇటీవల బ్రెయిన్లో ట్యూమర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. బ్రెయిన్ ట్యూమర్‌కు తప్పనిసరిగా ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉంటుందా? ఆపరేషన్ అంటే నాకు చాలా భయం. ముఖ్యంగా బ్రెయిన్‌కు ఆపరేషన్ చేస్తే తర్వాత మాట పడిపోతుంది, పక్షవాతం వస్తుందేమో అని చాలా భయంగా ఉంది. మందులతో బ్రెయిన్ ట్యూమర్ నయం అయ్యే అవకాశం లేదా? ఆపరేషన్ కాకుండా ఇంకా వేరే చికిత్సలు ఏమైనా అందుబాటులో ఉన్నాయా? ఆపరేషన్ పట్ల ఆందోళనతో డాక్టర్ వద్దకు వెళ్లాలంటేనే భయంగా ఉంది. దయచేసి నా సమస్యకు సరైన పరిష్కారం చూపించగలరు. - కళ్యాణి, గుంటూరు మీకు బ్రెయిన్ ట్యూమర్ నిర్ధారణ అయినట్లు తెలిపారు. అయితే మీకు మెదడులో ఏర్పడిన కణితి పరిమాణం, కణితి రకాన్ని బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. అన్ని రకాల బ్రెయిన్ ట్యూమర్లకు ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉండదు. కణితి పరిమాణం మూడు సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉంటే ఆపరేషన్ లేకుండా రేడియో సర్జరీ ద్వారా సురక్షితంగా కణితిని తొలగించవచ్చు. ఒకవేళ కణితి పరిమాణం మూడు సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉంటే ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. ముందు మీరు ఆపరేషన్‌పై ఉన్న భయాన్ని పోగొట్టుకోండి. ఒకవేళ మీకు ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి తలెత్తినా భయపడకండి. బ్రెయిన్ ట్యూమర్‌కు ఆపరేషన్ చేయించుకుంటే మాటపడిపోతుందనీ, పక్షవాతం వస్తుందనేది కేవలం అపోహ మాత్రమే. ప్రస్తుతం అత్యాధునిక శస్త్రచికిత్స విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఎలాంటి దుష్ర్పభావాలు తలెత్తకుండా సురక్షితంగా అపరేషన్ చేయవచ్చు. ఆపరేషన్‌కు భయపడి వైద్యుల వద్దకు వెళ్లకుండా ఉంటే సమస్య మరింత క్లిష్టంగా మారుతుంది. మీకు, మీ కుటుంబ సభ్యులకు అర్థమయ్యేలా కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాతనే ఆపరేషన్ చేస్తారు. ఆపరేషన్ తర్వాత మళ్లీ మీరు సాధారణ జీవితం గడపగలుగుతారు. - డాక్టర్ ఆనంద్ బాలసుబ్రమణ్యం సీనియర్ న్యూరో సర్జన్, యశోద హాస్పిటల్స్,సికింద్రాబాద్ స్లీప్ కౌన్సెలింగ్ మా అమ్మాయి వయసు 12 ఏళ్లు. నిద్రలోంచి ఉలిక్కిపడి మేల్కొంటోంది. కెవ్వున అరుస్తోంది. ఆమె ప్రవర్తన చాలా భయంగొలిపేదిగా ఉంది. మా అమ్మాయి విషయంలో తగిన సలహా ఇవ్వండి. - సురేశ్‌కుమార్, నల్గొండ నిద్రలో ఉలిక్కిపడి లేవడం, భయపడటం, ఆందోళన పడటం, కెవ్వున అరవడం ఇవన్నీ నిద్రకు సంబంధించిన ఒకరకం సమస్య. దీన్నే ‘స్లీప్ టై’ అంటారు. నిద్రలో ఉండగానే ఇవన్నీ చేస్తారు. నిద్రలోని ఒక దశ అయిన... కనుపాపలు చలించని స్థితి (నాన్ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్-నాన్ ఆర్ఈఎమ్) దశలో కనిపించే సమస్య ఇది. నిద్రలో నడవడం కూడా ఈ తరహా సమస్య కిందికే వస్తుంది. ఏదైనా ఒక సమస్య గురించి తీవ్రంగా ఆలోచిస్తూ అది తాము పరిష్కరించలేని సమస్య అని బాగా ఆందోళనపడ్డప్పుడు ఒక్కోసారి ఇలా ప్రవర్తిస్తుంటారు. అలాంటి సందర్భాల్లో వాళ్లు లేచి, ఈ నైట్టై దశలో 1-2 నిమిషాలు ఉంటారు. తర్వాత మళ్లీ నిద్రలోకి జారుకుంటారు. వాళ్లకు సాంత్వన కలిగిస్తే ఈ పరిస్థితి క్రమంగా తగ్గిపోతుంది. అలాంటి స్థితిలో ఉన్న పేషెంట్‌ను చూసి, తల్లిదండ్రులు ఆందోళనపడటం చాలా సాధారణం. అయితే మీరు ఆందోళన పడాల్సిందేమీ లేదు. చాలామంది పిల్లల్లో ఈ సమస్య యుక్తవయసు రాగానే తగ్గుతుంది. వాళ్లు ఒకప్పుడు అలా ప్రవర్తించారన్న అంశమే వాళ్లకు గుర్తుండదు. అలాంటి వాళ్లలో అదేమీ మానసిక రుగ్మత కాదు. ఆరుగురిలో ఒక్కరికి మాత్రమే పెద్దయ్యాక కూడా ఈ పరిస్థితి వస్తుంటుంది. యుక్తవయస్కుల్లో కూడా ఈ సమస్య వస్తుందంటే... బహుశా వాళ్లు యాంగ్జైటీ లేదా డిప్రెషన్‌తో బాధపడుతూ ఉండవచ్చు. ఒక్కోసారి నిద్రలేమి, తీవ్రమైన ఒత్తిడి, దీర్ఘకాలికంగా ఉండే మైగ్రేన్, స్లీప్ఆప్నియా వంటి సమస్యలు కూడా ఈ పరిస్థితికి కారణం కావచ్చు. మీపాప ఏదైనా సమస్య గురించి ఆందోళన పడుతున్నా, ఏదైనా పరిస్థితి గురించి భయపడుతున్నా... ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగలమనే భరోసాను ఆమెకు ఇవ్వండి. మీరు స్లీప్ స్పెషలిస్ట్‌ను సంప్రదించండి. - డాక్టర్ రమణ ప్రసాద్ కన్సల్టెంట్ పల్మునాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్,కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్ -
క్లైవ్ రైస్ కన్నుమూత
నిషేధం తొలగిన తర్వాత దక్షిణాఫ్రికాకు తొలి కెప్టెన్ కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ క్లైవ్ రైస్ బ్రెయిన్ ట్యూమర్‌తో మంగళవారం మృతి చెందారు. ఆయన వయస్సు 66 సంవత్సరాలు. సుదీర్ఘ కాలంగా ఈ వ్యాధితో బాధపడుతున్న రైస్ ఈ ఏడాది మార్చిలో భారత్‌కు వచ్చి బెంగళూరులో రొబోటిక్ రేడియేషన్ చికిత్స కూడా చేయించుకున్నారు. కెరీర్లో ఎదుగుతున్న సమయంలో జాతి వివక్ష కారణంగా దక్షిణాఫ్రికా జట్టును అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిషేధించడంతో దాదాపు 20 ఏళ్ల పాటు రైస్ కెరీర్ దేశవాళీ క్రికెట్‌కే పరిమితమైంది. 1991లో దక్షిణాఫ్రికాపై నిషేధం ఎత్తివేసిన తర్వాత భారత్‌తో జరిగిన తొలి వన్డే సిరీస్‌కు కెప్టెన్‌గా రైస్ ప్రపంచ క్రికెట్‌కు చిరపరిచితుడు. 42 ఏళ్ల వయసులో ఆ సిరీస్‌లో ఆడిన మూడు వన్డేల అనంతరం ప్రపంచకప్ జట్టుకు ఎంపిక కాలేకపోవడంతో రైస్ అంతర్జాతీయ కెరీర్ ముగిసింది. ఠ 1971-1991 మధ్య ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ప్రపంచంలోని మేటి ఆల్‌రౌండర్లతో సమానంగా రైస్ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారు. వివాదాస్పద కెర్రీ ప్యాకర్ వరల్డ్ సిరీస్‌లో కూడా ఆయన పాల్గొన్నారు. ఠ మొత్తం 482 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన క్లైవ్ రైస్ 40.95 సగటుతో 48 సెంచరీలు సహా 26,331 పరుగులు చేశారు. తన పేస్ బౌలింగ్‌తో 22.49 సగటుతో 930 వికెట్లు పడగొట్టారు. -
పిఠాపురం ఎమ్మెల్యే కుమార్తె మృతి
పిఠాపురం: తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ కుమార్తె కావ్య (21) అనారోగ్యంతో మృతిచెందింది. హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో ఇంజనీరింగ్ చదివిన కావ్య బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నట్టు కుటుంబ సభ్యుల కథనం. తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న ఆమెను సోమవారం రాత్రి స్థానికంగా ఉండే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా... పరిస్థితి విషమంగా ఉండడంతో అర్ధరాత్రి కాకినాడలోని మరో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కావ్య మృతి చెందింది. వర్మకు ఓ కమారుడు కూడా ఉన్నారు. అనారోగ్యంతో చిన్న వయసులో కావ్య మృతి చెందడంతో కుటుంబసభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.