మా మనవడి వయసు 9 ఏళ్లు. చిన్నతనం నుంచి తరచూ ఫిట్స్‌తో బాధపడుతున్నాడు. హైదరాబాద్‌లో పెద్దహాస్పిటల్‌లో చూపించాం. ‘బ్రెయిన్ ట్యూమర్’ అని చెప్పారు. చూపు, వినికిడి ఎఫెక్ట్ అయ్యేలా ట్యూమర్ ఉందన్నారు. అయితే ఇటీవల బ్రెయిన్ ట్యూమర్ సర్జరీలో కొత్తగా ‘ఐఓఎన్‌ఎమ్’ పద్ధతిలో ట్యూమర్ తొలగించారని పేపర్లలో చదివాం. మా బాబు చాలా చిన్నవాడు.
ట్యూమర్ కారణంగా వాడి చూపుకు, వినికిడికి లేదా ఏదైనా ముఖ్య అవయవానికి లోపం జరిగితే వాడికి జీవితాంతం శాశ్వతమైన ఇబ్బంది ఏర్పడుతుందనే ఆందోళన ఉంది. దయచేసి మాకు ఐఓఎన్‌ఎమ్ పద్ధతి అంటే ఏమిటో విపులంగా వివరించి, మా మనవడి గురించి సలహా ఇవ్వండి.
మీ మనవడి ట్యూమర్ మెదడులో ‘చూపు, వినికిడి’ నియంత్రించే భాగానికి ఆనుకొని ఉన్నట్లు తెలిపారు. మీరు ఆందోళన చెందకండి. ఇలాంటి సంక్లిష్టమైన బ్రెయిన్ సర్జరీలకు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఇలాంటి న్యూరో సర్జరీలు, స్పైన్ సర్జరీలు ఇప్పుడు ఐఓఎన్‌ఎమ్ సర్జరీ ప్రక్రియతో విజయవంతమవుతున్నాయి.ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్ అనే మాటలకు సంక్షిప్త రూపమే ఐఓఎన్‌ఎమ్. మెదడు ఆపరేషన్లలో కొన్ని చాలా సంక్లిష్టంగా ఉంటాయి. మెదడులోని మాటలు, చూపు, కదలికలు, వినికిడి, రుచి, స్పర్శ... వంటి ముఖ్యమైన జ్ఞానేంద్రియాలూ, అవయవాలకు సంబంధించిన ప్రాంతాల్లోని గడ్డలను/ట్యూమర్లను తొలగించడం చాలా రిస్క్‌తో కూడికున్న పని.
ఎందుకంటే గడ్డలను తొలగించే ప్రయత్నంలో ఆయా ప్రాంతాలకు దెబ్బ తగిలితే, సంబంధిత అవయవం ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అయితే అత్యాధునికమైన ఇమేజ్ గైడెన్స్, ఇంట్రా 3టీ ఎమ్మారైతో కూడిన ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్ (ఐఓఎన్‌ఎం) విధానం... సంక్లిష్టమైన శస్త్రచికిత్సలను సురక్షితంగా చేసేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మిగతా మెదడు కణజాలం దెబ్బతినకుండా కేవలం ట్యూమర్ వరకు మాత్రమే తొలగించడానికి ఈ ప్రక్రియ దోహదం చేస్తుంది. ఆపరేషన్ జరుగుతున్న సమయంలోనే డాక్టర్లు మొత్తం నాడీ వ్యవస్థను నిరంతరం పరిశీలిస్తూ, మిగతా భాగాలకు ఎలాంటి హానీ జరగకుండా పర్యవేక్షిస్తుంటారు.
ఐఓఎన్‌ఎమ్ పద్ధతిలో సర్జరీ నిర్వహించే సమయంలో ఆపరేషన్ చేసేటప్పుడు ట్యూమర్‌ను పూర్తిగా తొలగించామా, లేదా అనే విషయాన్ని ఆపరేషన్ థియేటర్‌లోనే నిర్ధారణ చేసుకొని, విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేయవచ్చు. అందువల్ల మన జీవితంలో ఎంతో కీలకమైన... మాటలు, చూపు, కదలికలు, వినికిడి, రుచి, స్పర్శ... వంటి ప్రధాన కార్యకలాపాలు దెబ్బతినకుండా, కోల్పోకుండా రోగికి సంపూర్ణ చికిత్స అందించవచ్చు. ఫలితంగా చాలా సందర్భాల్లో బ్రెయిన్ సర్జరీల్లో రీ–డూ (మళ్లీ మళ్లీ చేయాల్సిన ఆపరేషన్లు) చేయాల్సి అవసరం రాకుండానే విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేయవచ్చు. మొత్తం గడ్డను/ ట్యూమర్‌ను ఒకేసారి తొలగించవచ్చు. కాబట్టి మీ మనవడి విషయంలో మీరు ఎలాంటి ఆందోళన చెందకుండా... ఆ సౌకర్యాలు ఉన్న పెద్ద హాస్పిటల్స్‌లో ఒకసారి సంప్రదించండి.
నడుముకు శస్త్రచికిత్స అంటున్నారు... ఆందోళనగా ఉంది
నా వయసు 40 ఏళ్లు. నాకు ఇద్దరు పిల్లలు. ప్రతి రోజూ ఆఫీసుకు వెళ్లడానికీ, అక్కడ్నుంచి రావడానికి అంటూ దాదాపు 60 కి.మీ. పైనే బైక్ మీద తిరుగుతుంటాను. ఈమధ్య నడుము నొప్పి చాలా ఎక్కువగా వస్తోంది. డాక్టర్‌ను సంప్రదించాను. ఆయన నడుముకు శస్త్రచికిత్స చేయాలన్నారు. నాకు చాలా ఆందోళనగా ఉంది. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి.
ఈమధ్య కాలంలో చాలా మందిని ఈ సమస్య పట్టి పీడిస్తోంది. వివిధ రకాల ఒత్తిడి, జీవన విధానంలో మార్పులు, అధిక బరువులెత్తడం చాలాసేపు ఒకే భంగిమలో ఉండటం, ముందుకు ఒంగి పనిచేయడం, రోజూ చాలా దూరం బైక్‌పై ప్రయాణం చేయడం వంటి కారణాలతో వెన్నెముక మీద ఒత్తిడి ఏర్పడి ఈ సమస్య తలెత్తుతోంది. మీరు ఇటు ఇంట్లో పని చేసుకుంటూ ఆపై ఆఫీసుకు బండి మీద వెళ్లి అక్కడ కూడా శ్రమపడుతున్నారు. అంటే మీరు శారీరక ఒత్తిడికి అధికంగా లోనవుతున్నట్లు అర్థమతువోతంది. మీరు వెన్ను ఎమ్మారై తీయించారా? ఆ పరీక్ష ఫలితాలను చూసి డాక్టర్ మీకు సర్జరీ చేయించమని సలహా ఇచ్చినట్లయితే మీరు ‘స్పాండిలోలిస్తెసిస్’ అనే సమస్యతో తీవ్రంగా బాధపడుతున్నట్లు నిర్ధారణ చేయవచ్చు.
ఈ సమస్యతో బాధపడుతున్నవారిలో కొంతమందికి మందులతోనే నయమైతే, మరికొందరికి నడు కింది భాగంలో బెల్ట్ పెట్టుకోవాల్సి వస్తుంది. అవసరాన్ని బట్టి వైద్యులు వాకింగ్, యోగా లాంటి వ్యాయామాలు సూచిస్తారు. అప్పటికీ తగ్గకపోతే శస్త్రచికిత్స నిర్వహించి, వెన్నుపూసలోని నరాలపై ఎక్కడ ఒత్తిడి పడుతోందో గుర్తించి, వెన్నుపూస లోపల జారిపోయిన ఎముకను సాధారణ స్థితికి తీసుకువచ్చి స్క్రూస్, రాడ్స్ బిగించి, నరాలు ఒత్తిడికి గురికాకుండా చేస్తారు. ఈ విషయంలో మీరు ఆందోళనపడాల్సిందేమీ లేదు. వెన్నుకు ఆపరేషన్ చేసే విధానాలలో సురక్షితమైన శస్త్రచికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. వెన్నెముక సమస్య ఎక్కడ ఉందో తెలుసుకొని, మిగతా భాగాలు దెబ్బతినకుండా మినిమల్లీ ఇన్వేసివ్ విధానంలో తక్కువ కోతతో ఆపరేషన్ నిర్వహించగలుగుతారు.
ఈ విధానంలో వెన్నుపాముకి ఒక అంగుళం లేదా అంతకన్నా తక్కువ పరిమాణంలో ఒక చిన్న రంధ్రం పెడతారు. దీన్నే కీ–హోల్ అంటారు. శరీరంపై చిన్న కోత మాత్రమే ఉంటుంది కాబట్టి గాయం త్వరగా మానిపోతుంది. శస్త్రచికిత్స నిర్వహించిన రోజున లేదా మర్నాడే రోగిని ఇంటికి పంపించేస్తారు. మొదట మీరు మీ ఎమ్మారై, ఇతర రిపోర్టులతో న్యూరోసర్జన్‌ను సంప్రదించండి. వారు ఇప్పుడు అందుబాటులో ఉన్న వైద్యవిజ్ఞానంతో మిగతా భాగాలకు ఎలాంటి లోపం/వైకల్యం రాకుండా శస్త్రచికిత్స చేయగలరు. కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
చంటి పాపాయిలను ఘనాహారం వైపు మళ్లించడం ఎలా?
తల్లి పాలు తాగుతూ ఉండే చిన్నారులకు నాలుగో నెల రాగానే అన్నప్రాశన చేసి, వారు మెల్లగా ఘనాహారం తీసుకునేలా అలవాటు చేస్తుంటారు. ఇలా పిల్లలను క్రమంగా ఘనాహారం వైపు మళ్లించడాన్ని ‘వీనింగ్’ అంటారు. ఇలా వీనింగ్ తర్వాత పిల్లల వికాసం కోసం వాళ్లలో కణజాలం, టిష్యూల అభివృద్ధి కోసం మెుదటి ఏడాదిలో ఇవ్వాల్సిన ఆహారం విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. నాలుగు నుంచి ఆరు నెలల వయసప్పుడు క్రవుంగా చిన్నారులను ఘనాహారం అలవాటు చేయాలి.
వీనింగ్ సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి
వీనింగ్ ప్రక్రియలో కొన్ని ఆహారాపు అలవాట్లను అవాయిడ్ చేయాలి.
►గిన్నెలో ఉన్నది పూర్తికావడం కోసం వాళ్లు వద్దంటున్నా బలవంతంగా పెట్టకండి.
►వాళ్ల దినచర్యకూ, వాళ్లు తీసుకుంటున్న ఆహారానికి వుధ్య సవుతౌల్యం (బ్యాలెన్స్) ఉండేలా చూసుకోండి.
►వాళ్లకు ఏదైనా బహువూనంగా ఇవ్వదలచుకుంటే అది ఆహారపదార్థాలై ఉండకుండా జాగ్రత్తపడండి. (కొందరు అదేపనిగా ఫలానాది చేస్తే చాక్లెట్లను బహువూనంగా ఆశపెడుతుంటారు. ఈ అలవాటు మంచిది కాదు). పిల్లలను వురీ ఎక్కువ తియ్యగా ఉండే మిఠాయిలకూ, ఉప్పగా ఉండే చిప్స్ వంటి పదార్థాలకు అలవాటు చేయకండి. మంచి స్వాభావికమైన ఆహారపదార్థాలైన కూరగాయలు, ఆకుకూరలు, పళ్లను పిల్లలకు అలవాటయ్యేలా చూడండి.
డాక్టర్ ఆనంద్ బాలసుబ్రమణియం
సీనియర్ న్యూరోసర్జన్,
యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్
Comments
Please login to add a commentAdd a comment