హెల్ప్‌మీ!
► ఆపన్నహస్తం కోసం పేద కుటుంబం ఎదురుచూపు
► బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న అమ్మాయి
► వైద్యం కోసం రూ.5లక్షలు ఖర్చు అవుతాయన్న వైద్యులు
రోజూ పనిచేస్తేనే పూట గడవని పరిస్థితి ఆ దంపతులది.. కుటుంబాన్ని పోషించుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.. ఇంతలో ఆ పేద కుటుంబానికి పిడుగులాంటి వార్తతో కన్నీరుమున్నీరవుతున్నారు. బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న కూతురును ఎలా కాపాడుకోవాలని ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. - పాన్‌గల్
పాన్‌గల్ మండలం వల్లభాపూర్ గ్రామానికి చెందిన రాజ్‌కుమార్, రాజేశ్వరి దంపతులది పేద కుటుంబం. వీరికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. వనపర్తి డివిజన్ కేంద్రంలోని రైస్‌మిల్‌లో రాజ్‌కుమార్ గుమాస్తాగా పనిచేస్తున్నారు. రాజేశ్వరి టైలర్‌గా జీవనం సాగిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వారి పెద్ద కుమార్తె మంజుల ఇంటర్ (ఓపెన్) వరకు చదువుకున్నది. ఈనెల 17న ఇంట్లో నిద్రిస్తూ కోమలోకి వెళ్లింది. గమనించిన తల్లిదండ్రులు వెంటనే కర్నూలు ఆస్పత్రికి తరలించారు. వారం పాటు అక్కడి ఆపోలో ఆస్పత్రిలో రూ.2లక్షల వరకు ఖర్చుచేసి చికిత్స చేయించారు. ఎలాంటి మార్పు రాలేదు. అక్కడి నుంచి హైదరాబాదు నిమ్స్‌కు తరలించడంతో అక్కడ చికిత్స పొందుతోంది. ఈ విషయమై డాక్టర్లు బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి లక్షణాలు ఉన్నాయన్నారు. చికిత్స కోసం రూ.5 లక్షల వరకు ఖర్చు అవుతుందన్నారు. దీంతో ఏమి చేయాలో అర్థం కాక ఆ కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. కూతురును కాపాడుకోవాలని ఉన్నా ఆర్థిక స్థోమత లేక ఆపన్న హాస్తం కోసం ఎదురుచూస్తున్నారు.
మా కూతురు జీవితాన్ని కాపాడండి: తల్లిదండ్రులు
పేద కుటుంబం మాది. పూట గడవని మాలాంటి వారికి పెద్ద కష్టం వచ్చింది. మా కూతురును కాపాడుకోవడానికి నానా కష్టాలు పడుతున్నాం. ఇప్పటికే రూ.2లక్షల వరకు అప్పులు చేసి వైద్యం చేయించినా ఫలితం కనిపించడంలేదు.ఇంకా వైద్యం కోసం రూ. 5లక్షలు అవసరమవుతాయని వైద్యులు చెబుతున్నారు. మానవతాదృక్పథంతో దాతలు సహకరించి సహాయం చేస్తే మా కూతురు జీవితం కాపాడుకుం టామన్నారు. సహాయం కోసం 7702569116, 9963002727 నంబర్లను సంప్రదించాలని కోరారు.