గడ్డ దేహంలో ఎక్కడ వచ్చినా అంత పెద్దగా సమస్య ఉండకపోవచ్చు గానీ... మెదడు నిర్వహించే కీలకమైన విధుల రీత్యా అక్కడ గడ్డలు వస్తే ప్రమాదంగా పరిణమించవచ్చు. అది క్యాన్సరస్ గడ్డ అయితే మరీ ప్రమాదం... కానీ ఒకవేళ అది క్యాన్సరస్ గడ్డ కాకపోయినప్పటికీ ఏదైనా అవయవాన్ని నియంత్రించే భాగాన్ని అది నొక్కివేస్తే... మన శరీరంలోని ఆ భాగం విధుల నిర్వహణలో తేడాలు రావచ్చు. దాంతో అవయవం ఆరోగ్యవంతంగా ఉన్నప్పటికీ... మెదడులో ఏర్పడ్డ గడ్డ కారణంగా దాని కదలికలు మందగించడం, అది చచ్చుబడిపోయినట్లుగా కావడం, పూర్తిగా పనిచేయకుండానే పోవడం జరుగుతుంది. మెదడులో గడ్డల వల్ల ఎదురయ్యే సమస్యలు, అందుబాటులో ఉన్న చికిత్సలను తెలుసుకుందాం.
అసాధారణంగా పెరిగే కణజాలం ఓ గడ్డ ఆకృతి దాలుస్తుంది. ఆ గడ్డలే మెదడులో పెరిగితే వాటిని మెదడులో గడ్డల (బ్రెయిన్ ట్యూమర్స్)ని అంటారు. స్థూలంగా వీటిని రెండు రకాలుగా చెప్పవచ్చు. మొదటివి హానీ చేయని గడ్డలు (బినైన్). రెండోవి ప్రమాదకరమైన క్యాన్సర్ (మెలిగ్నెంట్) గడ్డలు. బినైన్ గడ్డల వల్ల సాధారణంగా మెదడుకు ప్రమాదం ఉండదు. మెల్లగా పెరుగుతాయి. గడ్డ ఏ మేరకు పెరిగిందనే విషయానికి తెలుసుకోడానికి వీలుగా దానికి స్పష్టమైన అంచులు ఉంటాయి కానీ క్యాన్సరస్ (మెలిగ్నెంట్) గడ్డలు నిర్దిష్టంగా ఫలానా చోటే అంతమైనట్లుగా స్పష్టమైన అంచులుండవు. పెరుగుదల వేగం కూడా చాలా ఎక్కువ. దాంతో అంచులు గుర్తించడానికి వీల్లేకుండా చుట్టుపక్కల కణజాలంలోకి చొచ్చుకుపోయేలా పెరుగుతాయి.
బ్రెయిన్ ట్యూమర్ల పెరుగుదలకు
సాధారణ కారణాలు...
నిజానికి బ్రెయిన్ ట్యూమర్లు ఎందుకు పెరుగుతాయని చెప్పేందుకు నిర్దిష్టమైన కారణాలు లేకపోయినా... కొన్ని అంశాలు ట్యూమర్ పెరిగే ముప్పును పెంచుతాయి. అవి...
రేడియేషన్: తరచూ రేడియోషన్‌కు ఎక్స్‌పోజ్ అయ్యేందుకు ఆస్కారం ఉన్న వృత్తుల్లో / పరిసరాల్లో ఉన్నవారికి మెదడులో గడ్డలు వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు చికిత్స కేంద్రాల్లో, వైద్య పరీక్ష కేంద్రాల్లో పనిచేసేవారికి, రేడియేషన్ వెలువడే పారిశ్రామిక ప్రాంతాల్లోని వారికి ఈ ముప్పు ఉంటుంది.
జన్యుపరమైనవి: క్రోమోజోముల్లో వచ్చే కొన్ని మార్పులు మెదడులో గడ్డల పెరుగుదలను ప్రేరేపించవచ్చు. మానవుల్లో 23 జతల క్రోమోజోములు ఉంటాయన్న విషయం తెలిసిందే. వీటిల్లో... 1, 10, 13, 17, 19, 22 క్రోమోజోముల్లో ఏవైనా మార్పులు ఏర్పడినప్పుడు మెదడులో గడ్డలు వచ్చే ఆస్కారం ఎక్కువ. ఉదాహరణకు... 22వ క్రోమోజోములో మార్పుల వల్ల మెనింజియోమా తరహా గడ్డ ఏర్పడుతుంది. అయితే ఈ గడ్డ హానికరం కాదు. అయితే... 1, 19 క్రోమోజోముల్లో మార్పులొస్తే ఆలిగోడెండ్రోగ్లియోమా అనే క్యాన్సర్ గడ్డలు వచ్చే అవకాశం ఎక్కువ. కొన్ని రకాల జన్యుపరమైన లోపాలు ఉదాహరణకు న్యూరోఫైబ్రోమటోసిస్, వాన్ హిప్పెల్ లాండువా డిజీస్ వంటివి మెదడులో కణుతులకు కారణం కావచ్చు.
మెదడులో ఏయే ప్రాంతాల్లో... ఎలాంటి సమస్యలు?
మెదడులో గడ్డ వచ్చే ప్రాంతాన్ని బట్టి సమస్యలూ మారుతుంటాయి. ఉదాహరణకు...
ఫ్రంటల్ లోబ్‌లో గడ్డలతో :
కదలికల్లో లోపాలు
తార్కికత లోపాలు
ప్రవర్తనాలోపాలు
జ్ఞాపకశక్తి మందగించడం
నిర్ణయం తీసుకోలేకపోవడం
వ్యక్తిత్వ లోపాలు
ప్రణాళికలో లోపాలు
విషయాలను సరిగ్గా అంచనా వేయలేకపోవడం
తరచూ మారిపోయే మూడ్స్.
పెరైటల్ లోబ్‌లో గడ్డలతో :
విషయాలు సరిగా వివరించలేకపోవడం
లెక్కలు సరిగా చేయలేకపోవడం
స్పర్శజ్ఞానలోపం
చదవలేకపోవడం
రాయలేకపోవడం
టెంపోరల్ లోబ్‌లో గడ్డలతో :
భాషను అర్థం చేసుకోలేకపోవడం
వినికిడి లోపాలు
భావోద్వేగ పరమైన మార్పులు
పిట్యూటరీ గ్రంథి ప్రాంతంలో గడ్డలవల్ల :
హార్మోన్‌లలో మార్పులు
ఎదుగుదల లోపాలు
ప్రత్యుత్పత్తి లోపాలు / వంధ్యత్వం
ఆక్సిపెటల్ లోబ్‌లో గడ్డలతో : చూపు మందగించడం
సెరిబెల్లమ్ ప్రాంతంలో గడ్డలతో :
శరీరాన్ని నిటారుగా ఉంచలేకపోవడం
తూగుతూ నడవడం
కొన్ని కండరాలపై నియంత్రణ కోల్పోవడం.
బ్రెయిన్ స్టెమ్ ప్రాంతంలో గడ్డల వల్ల :
శ్వాస సంబంధమైన లోపాలు
రక్తపోటులో మార్పులు
గుండె స్పందనల్లో మార్పులు
మింగడంలో, మాట్లాడటంలో ఇబ్బందులు
శస్త్రచికిత్స : బాధితులకు శస్త్రచికిత్స సిఫార్సు చేసే సందర్భాలు.
వీలైనంత వరకు గడ్డను తొలగించేందుకు అవకాశం ఉండటం.
గడ్డ ఏ తరహాకు చెందినదనే అంశం స్పష్టంగా, నిర్ధారణగా తెలిసిపోవడం.
గడ్డను తొలగించడం అక్కడి ఒత్తిడి (ఇంట్రాక్రేనియల్ ప్రెషర్) తగ్గి మంచి ఉపశమనం లభిస్తుందని తెలిసినప్పుడు లేదా మిగతా గడ్డను రేడియేషన్ / కీమోథెరపీతో తేలిగ్గా నిర్మూలించగలమని తెలవడం.
మైక్రోన్యూరోసర్జరీ : ఇటీవల అందుబాటులోకి వచ్చిన అధునాతన ఇమేజింగ్ (లోపలి గడ్డలను ఫొటో తీసి చూసే ప్రక్రియ), మైక్రోస్కోపిక్ విధానాలు, మ్యాపింగ్‌లతో న్యూరోసర్జన్లు అతి సూక్ష్మమైన గడ్డలను తొలగించగలుగుతున్నారు. గతంలో శస్త్రచికిత్స ద్వారా చేరలేని ప్రదేశాల్లోకి చేరుకుని సైతం కొన్ని గడ్డల తొలగింపు ఇప్పుడు సాధ్యమవుతోంది.
రేడియేషన్ థెరపీ : మెదడులోని కొన్ని రకాల క్యాన్సర్ గడ్డలనూ / క్యాన్సర్ తరహాకు చెందని గడ్డలను తొలగించడానికి రేడియేషన్ థెరపీ మంచి మార్గం. ఇందులో గడ్డను పూర్తిగా నిర్వీర్యం చేయడంతో పాటు పెరుగుదలనూ అరికట్టవచ్చు.
కీమో థెరపీ : చిన్న తరహా హానికరమైన గడ్డలూ (మెలిగ్నెంట్ ట్యూమర్స్)కు కీమోథెరపీ బాగా పనిచేస్తుంది. ఇక కొన్ని రకాల క్యాన్సర్ గడ్డలు రేడియేషన్ తో పాటు కీమోథెరపీ ఇస్తేనే చికిత్సకు బాగా లొంగుతాయి. కొన్నిసార్లు నేరుగా గడ్డలోకి మందు వెళ్లేలా కూడా కీమోథెరపీ ఇస్తారు.\
నిర్ధారణ కోసం చేసే వైద్య పరీక్షలు...
సీటీ స్కాన్ : మెదడులో గడ్డలు ఉన్నట్లుగా అనుమానిస్తే తొలుత అవసరమైన పరీక్ష సీటీ స్కాన్.
ఎమ్మారై : మెదడులో గడ్డ ఏ ప్రాంతంలో ఉంది, అది ఏ తరహాకు చెందినది, సైజు, అది మెదడులో ఏ మేరకు చొచ్చుకుపోయింది వంటి అంశాలపై స్పష్టంగా తెలిసే సమాచారంతో శస్త్రచికిత్స ప్రక్రియలో కూడా ఎమ్మారై టెక్నిక్ చాలా ఉపయోగపడుతుంది.
పెట్ స్కాన్ : వాస్తవ గడ్డలకూ, గడ్డలుగా కనిపించేవాటికి (ట్యూమర్స్‌కూ, నాన్‌ట్యూమర్స్‌కు) మధ్య తేడాలు తెలిపేందుకు ఉపయోగపడే పరీక్ష.
లక్షణాలు
గడ్డ మెదడులోని ఏ ప్రాంతంలో వచ్చిందన్న అంశంపై ఆధారపడి ఈ లక్షణాలు మారుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మెదడులో గడ్డ ఉన్నప్పటికీ బయటకు ఎలాంటి లక్షణాలూ కనిపించకపోవచ్చు.సాధారణ లక్షణాలివి...
నలభై ఏళ్లకు పైబడిన వారిలో లేదా ఆరేళ్లలోపు వారిలో తీవ్రమైన తలనొప్పి
అకస్మాత్తుగా వాంతి కావడం ∙ఫిట్స్ రావడం
మెదడులో గడ్డ వచ్చిన ప్రదేశాన్ని బట్టి... స్పర్శజ్ఞానం కోల్పోవడం లేదా ఏదైనా అవయవపు కదలికల్లో మార్పులు
చూపు మసగ్గా మారడం
మాట ముద్దగా రావడం లేదా మాటలో స్పష్టత లేకపోవడం
డిప్రెషన్ ప్రవర్తనలో మార్పులు..హార్మోన్ స్రావాల్లోనూ మార్పులు (ఎండోక్రైన్ డిస్‌ఫంక్షన్).
మందులతో చేసే చికిత్స
గడ్డ ఉన్న ప్రాంతంల్లోని వాపు తగ్గించడానికి కొన్నిసార్లు స్టెరాయిడ్స్‌తో చికిత్స అందిస్తారు. దీనివల్ల రోగికి తలనొప్పి వంటివాటితో పాటు ఇతర భౌతిక లక్షణాలూ తగ్గుతాయి.గడ్డల కారణంగా ఫిట్స్ వస్తే వాటిని తగ్గించేందుకు మందులు ఇస్తారు.
Comments
Please login to add a commentAdd a comment