Brain cancer
-
మొబైల్ ఫోన్‌తో బ్రెయిన్ క్యాన్సర్ రాదు
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ వినియోగిస్తే బ్రెయిన్ క్యాన్సర్ సోకుతుందున్న ఆందోళన ప్రపంచవ్యాప్తంగా చాలా ఏళ్లుగా ఉంది. అయితే, ఇది అపోహ మాత్రమేనని, ఎంతమాత్రం నిజం లేదని అధ్యయనాలు చెబుతున్నాయి. ఫోన్‌కు, బ్రెయిన్ క్యాన్సర్‌కు మధ్య ఎలాంటి సంబంధం లేదని పేర్కొంటున్నాయి. ఈ అంశంపై జరిగిన 5 వేలకుపైగా అధ్యయనాలను ఆ్రస్టేలియన్ రేడియేషన్ ప్రొటెక్షన్, న్యూక్లియర్ సేఫ్టీ ఏజెన్సీ(అర్పాన్సా) ఆధ్వర్యంలో అంతర్జాతీయ పరిశోధకుల బృందం నిశితంగా సమీక్షించింది. ఇందులో 63 అధ్యయనాల వివరాలు 1994 నుంచి 2022 వరకు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. గత రెండు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా వైర్లెస్ టెక్నాలజీ వినియోగం విపరీతంగా పెరిగింది. కానీ, బ్రెయిన్ క్యాన్సర్ కేసులు మాత్రం పెరగలేదని పరిశోధకులు గుర్తించారు. అధ్యయనాల్లో తేలిన ఫలితాల ఆధారంగా వారు ఈ నిర్ధారణకు వచ్చారు. ఇది తగిన సాక్ష్యాధారాల ఆధారంగా జరిగిన చాలా సమగ్రమైన విశ్లేషణ అని చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) సూచనతో జరిగిన ఈ విశ్లేషణ వివరాలను ఎన్విరాన్మెంట్ ఇంటర్నేషనల్ పత్రికలో ప్రచురించారు. ఫోన్ వాడకంతో తలకు, మెడకు సైతం క్యాన్సర్ సోకుతున్నట్లు ఆధారాలు లేవని వెల్లడించారు. ఒక వ్యక్తి మొబైల్ ఫోన్‌ను పదేళ్లు, అంతకంటే ఎక్కువ కాలం ఉపయోగిస్తే బ్రెయిన్ క్యాన్సర్ సోకుతుందని చెప్పలేమని స్పష్టంచేశారు. సాధారణంగా ఫోన్ల నుంచి రేడియో తరంగాలు వెలువడుతాయన్న సంగతి తెలిసిందే. ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని మాట్లాడుతుంటాం కాబట్టి బ్రెయిన్ క్యాన్సర్ సోకుతుందన్న ప్రచారం దశాబ్దాల క్రితమే మొదలైంది. దీనిపై ప్రజల్లో రకరకాల భయాందోళనలు ఉన్నాయి. ఇదిలా ఉండగా, ఫోన్ల నుంచి వెలువడే రేడియో తరంగాల వల్ల బ్రెయిన్ క్యాన్సర్ వస్తుందంటూ కొన్ని అధ్యయనాలు సైతం చెప్పాయి. 2011లో డబ్ల్యూహెచ్ఓ అనుబంధ విభాగమైన ఇంటర్నేషన్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్(ఐఏఆర్సీ) సైతం ఇదే విషయం వెల్లడించింది. అయితే, ఈ సంస్థ చాలా పరిమితమైన సమాచారంపై ఆధారపడి ఈ నిర్ధారణకు వచ్చిందని, సమగ్రమై అధ్యయనం చేయలేదని అంతర్జాతీయ పరిశోధకులు తాజాగా తేలి్చచెప్పారు. ఫోన్లతో క్యాన్సర్లు వస్తాయన్న ఆపోహ వీడాలని సూచించారు. -
స్మార్ట్‌ఫోన్ యూజర్లకు ఊరట: బ్రెయిన్ కేన్సర్‌తో సంబంధం లేదు!
స్మార్ట్‌ఫోన్ వాడకంతో బ్రెయిన్ కేన్సర్ వస్తుందని ఇప్పటిదాకా చాలా భయపడ్డాం. సెల్‌ఫోన్ రేడియేషన్ దుష్ర్పభావానికి సంబంధించి పలువురు నిపుణులు హెచ్చరించారు కూడా. అయితే తాజా అధ్యయనం మాత్రం స్మార్ట్ఫోన్లకు, బ్రెయిన్ కేన్సర్ కు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. సాధారణంగా స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడినా, ముఖ్యంగా పడుకునేటపుడు దిండుకింద మొబైల్ పెట్టుకుని పడుకున్నా, పసిపిల్లలకు దగ్గరగా ఉంచి, రేడియేషన్ ప్రభావం ఉంటుందిని, తీవ్రమైన ప్రమాదకరమైన జబ్బులొస్తాయనే ఆందోళన ఇప్పటివరకు ఉండేది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక అధ్యయనంలో కొన్ని కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొబైల్ ఫోన్ వినియోగానికి, మెదడు కేన్సర్ ప్రమాదానికి ఎటువంటి సంబంధం లేదని వెల్లడింది. వైర్లెస్ టెక్నాలజీ వినియోగంలో భారీ పెరుగుదల ఉన్నప్పటికీ, మెదడు కేన్సర్‌లో పెరుగుదల లేదని మంగళవారం ప్రచురించిన ఒక రివ్యూలో తెలిపింది. సుదీర్ఘ ఫోన్ కాల్స్ చేసే వ్యక్తులకు లేదా ఒక దశాబ్దం కంటే ఎక్కువ కాలం పాటు మొబైల్ ఫోన్లను ఉపయోగించిన వారికి కూడా ఇది వర్తిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ప్రచురితమైన అనేక రీసెర్చ్ పేపర్లను సైతం అధ్యయనం చేసి ఈ విషయం వెల్లడించినట్లు అధ్యయనం పేర్కొంది. కాగా డబ్ల్యూహెచ్ఓ , ఇతర అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు మొబైల్ ఫోన్లు ఉపయోగించే రేడియేషన్ నుంచి వచ్చే ప్రతికూల ఆరోగ్య ప్రభావాలకు ఖచ్చితమైన ఆధారాలు లేవని గతంలో చెప్పాయి, అయితే మరింత పరిశోధన కోసం పిలుపునిచ్చాయి. ఈ నేపత్యంలో తాజా స్టడీ ఆసక్తికరంగా మారింది. -
వైద్యుడి ఘనత! తాను కనిపెట్టిన వైద్యంతో బ్రెయిన్ కేన్సర్‌ని జయించాడు!
కేన్సర్ అంటేనే.. ఎలాంటి వాళ్లు అయినా ఒక్కసారిగా ఉలిక్కిపడతారు. ఏ స్టేజ్‌లో ఉందో? నయం అవుతుందో? లేదా? అన్న భయాలు మొదలైపోతుంటాయి. ఎంతటి వాడినైనా కుదేలయ్యిపోయేలా చేస్తుంది. అలాంటి కేన్సర్ మహ్మమ్మారిని తను కనిపెట్టిన వైద్య విధానంతో స్వీయ చికిత్స తీసుకుని జయించి చరిత్ర సృష్టించాడు ఓ వైద్యుడు. తన జీవితాన్ని పొడిగించుకున్నందకు సంబరపడిపోతున్నాడు.ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. ప్రముఖ ఆస్ట్రేలియా వైద్యుడు ప్రొఫెసర్ రిచర్డ్ స్కోలియర్ బ్రెయిన్ కేన్సర్ ఉన్నట్లు వైద్య పరీక్షల్లో నిర్థారణ అయ్యింది. అప్పుడు ఆయనకు 57 ఏళ్లు. నిజానికి ఈ వ్యాధి వచ్చిన వాళ్లు 12 నెలలకు మించి బతకరు. దీంతో ఈ వ్యాధిపై అవగాహన ఉన్న రిచర్డ్ ..తన స్నేహితుడు ప్రొఫెసర్ జార్జినా లాంగ్ సాయంతో కొత్త చికిత్సా విధానాన్ని అభివృద్ధి చేశారు. దాన్ని తనపైనే ప్రయోగం చేసుకున్నాడు రిచర్డ్. ఈ చికిత్స విధానం సర్జరీ రహితం. ఆశ్చర్యకరంగా ఆ చికిత్స బాగా పనిచేసి మెదడులోని కణుతులన్నీ మాయమైపోయాయి. తాజాగా ఎమ్మారై తీయగా కణితులు కనిపించకపోవడంతో రిచర్డ్ ఆనందం వ్యక్తం చేశారు. తానిప్పుడు చెప్పలేనంత భావోద్వేగానికి గురవ్వుతున్నానని అన్నారు. తన జీవితకాలాన్ని పొడిగించుకున్నాని, తన భార్య, పిల్లలతో కలిసి మరికొంత కాలం కలిసి జీవించే అవకాశం లభించిందని సంతోషం వ్యక్తం చేశారు రిచర్డ్. ఈ చికిత్స విధానం సుమారు మూడు లక్షల మందికి ఉపయోగపడుతుందని చెప్పారు. సర్జరీ లేకుండా చేసే ఈ "ఇమ్యూనో థెరపీ' పెద్ద సంఖ్యలో ఉపయోగడుతుందని ధీమాగా చెబుతున్నారు. అంతేగాక ఈ చికిత్సలో మరిన్ని విప్లవాత్మక మార్పులు తెచ్చి మరింతగా అభివృద్ధి చేయడమే గాక విస్తృతమైన క్లినకల్ ట్రయల్స్ నిర్వహించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సి ఉందని జార్జిన్ లాంగ్ అన్నారు. (చదవండి: 'ఇడియట్ సిండ్రోమ్' అంటే ఏంటీ..? ప్రమాదకరమా..?) -
బ్రెయిన్ కేన్సర్‌తో గిరిజన విద్యార్థిని మృతి
గుమ్మలక్ష్మీపురం: బ్రెయిన్ కేన్సర్‌తో గిరిజన విద్యార్థిని హిమరిక ప్రమీల(13) విశాఖపట్నంలోని కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి.. కొమరాడ మండలంలోని గాజులగూడకు చెందిన ప్రమీల గుమ్మలక్ష్మీపురం మండలం, రేగిడి గ్రామంలోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఈ నెల 13వ తేదీన జ్వరం రావడంతో పాఠశాల సిబ్బంది కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి, వైద్యసేవలు అందజేశారు. అయినా జ్వరం తగ్గకపోవడంతో మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడ కూడా నయం కాకపోవడంతో ఈ నెల 14వ తేదీన విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించగా, ప్రమీలకు బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో శస్త్రచికిత్స చేసేందుకు వైద్యులు సిద్ధం కాగా, ప్రమీల శరీరం సహకరించడం లేదు. అలా చికిత్స అందిస్తుండగా, ఒకానొక దశలో ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో ఐసీయూకి తరలించి, ఆక్సిజన్ సదుపాయం కల్పించినా ఫలితం లేదని, చికిత్స పొందుతూ మృతి చెందిందని ఏటీడబ్ల్యూవో సురేష్‌కుమార్ తెలిపారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. -
ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవం.. ప్రత్యేకం
జూన్ 8, ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవం.. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా "ఒత్తిడిని తగ్గించుకోండి - మిమ్మల్ని మీరే కాపాడుకోండి" అనే థీమ్ తో ప్రపంచవ్యాప్తంగా ఈ ట్యూమర్లపై అవగాహన కల్పించడానికి మీ ముందుకొచ్చింది. బ్రెయిన్ ట్యూమర్.. అది ప్రమాదకరమైనది కావచ్చు, ప్రమాదం లేనిది కావచ్చు... మెదడులో ట్యూమర్ అంటూ వచ్చిందంటే ధృడమైన పుర్రె భాగం అడ్డుగా ఉంటుంది కాబట్టి అది లోపలి భాగాన్ని నొక్కి పెడుతూ దాని పరిమాణాన్ని పెంచుకుంటూ ఉంటుంది. దీని కారణంగా అనేక లక్షణాలు బయట పడుతూ ఉంటాయి. అసాధారణ లక్షణాల ఆధారంగా మెదడు పనితీరులో మార్పులను గమనించి వెంటనే అప్రమత్తమై డాక్టర్లను ఆశ్రయించి ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రాణహాని లేకుండా బయట పడవచ్చు. ఆలస్యం చేస్తే మాత్రం ట్యూమర్ కణాలు వాటి సంఖ్యను పెంచుకుంటూ పోతాయి. ఫలితంగా ట్యూమర్ సైజ్ పెరిగి ప్రమాదకరంగా మారుతుంది. అందుకే బ్రెయిన్ ట్యూమర్ అవగాహనలో భాగంగా ట్యూమర్లను తరచుగా తలనొప్పి రావడం, జ్వరం రావడం, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించడం, ఆకలి తగ్గిపోవడం, ఏమి తిన్నా వాంతులు అవ్వడం, అవయవాల పనితీరు దెబ్బతినడం వంటి చిన్న చిన్న లక్షణాల ఆధారంగా ముందుగానే గుర్తించమని చెబుతున్నారు ద్వారక HCMCT మణిపాల్ హాస్పిటల్ న్యూరో విభాగాధిపతి డా.అనురాగ్ సక్సేనా. బ్రెయిన్ ట్యూమర్లను తొందరగా గుర్తించడం వలన ప్రయోజనాలు: ట్యూమర్ సైజ్ నియంత్రించవచ్చు: ట్యూమర్ పెరిగేకొద్దీ మెదడు లోపలి భాగాన్ని బాగా నొక్కిపెడుతుంది కాబట్టి సరైన ట్రీట్మెంటును ఆశ్రయిస్తే ముందు దాని సైజ్ పెరగకుండా నియంత్రించవచ్చు. లక్షణాలను బట్టి నియంత్రిచవచ్చు: బ్రెయిన్లో ట్యూమర్ వచ్చినప్పుడు విపరీతంగా తలనొప్పు రావడం, కళ్ళు తిరుగుతుండటం, మూర్ఛపోవడం, ఇంద్రియాల పనితీరు దెబ్బతినడం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. లక్షణాల ఆధారంగా ట్రీట్మెంట్ అందిస్తే పేషేంట్ తొందరగా కోలుకునే అవకాశముంటుంది. నరాల వ్యవస్థ దెబ్బతినకుండా కాపాడుకొవచ్చు: మెదడులో ఏర్పడిన ట్యూమర్లు చుట్టుపక్కల ఉన్న కణజాలాన్ని బాగా దెబ్బతీస్తుంది. ఫలితంగా నరాల వ్యవస్థ కూడా దెబ్బ తింటుంది. ముందుగా గుర్తించడం వలన నరాల వ్యవస్థ అస్తవ్యస్తం కాకుండా, కొన్ని దీర్ఘకాలిక సమస్యల బారిన పడకుండా జాగ్రత్తపడవచ్చు. ట్యూమర్ గుర్తించే సమయాన్ని బట్టి ట్రీట్మెంట్: ముందుగానే వీటిని గుర్తిస్తే సర్జరీ ద్వారా తొలగించే అవకాశముంటుంది. మరికొన్ని సందర్భాల్లో కీమో థెరపీ, రేడియేషన్, ఇమ్యునో థెరపీ, టార్గెటెడ్ థెరపీ ఇలా అనేక రకాల ట్రీట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మెరుగైన వైద్యంతో వీటినుండి తొందరగా ఉపశమనం పొందవచ్చు. ప్రాణహాని లేకుండా బయటపడవచ్చు: తొందరగా గుర్తించడం వలన డాక్టర్లు అవసరాన్ని బట్టి సర్జరీ చేసి ట్యూమర్ ను తొలగించే వీలుంటుంది. ఆలస్యం చేసేకొద్దీ ట్రీట్మెంట్ జటిలంగా మారుతూ ఉంటుంది. ఒక్కోసారి అవసరాన్ని బట్టి సర్జరీ తోపాటు కీమో థెరపీ, రేడియేషన్ ట్రీట్మెంట్లు కూడా చేయాల్సి ఉంటుంది. ఫలితంగా ట్యూమర్ల సమస్యను సులభంగా అధిగమించవచ్చు. -
YSR Kadapa: చిన్న పాపకు పెద్ద జబ్బు.. గొప్ప మనసుతో ఆదుకోండి
సాక్షి, జమ్మలమడుగు: గాలిపోతుల పావని. కేవలం పదేళ్ల వయసు గల పాప. ప్రైవేట్ పాఠశాలలో చదువుతూ ఉన్న పాపను.. తల్లి గాలిపోతుల సునీత ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించింది. ప్రస్తుతం బాలికల ఉన్నత పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. ఇటీవల గాలిపోతుల పావనికి జ్వరం రావడంతో.. తిరుపతికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. అక్కడ రక్త పరీక్షలు చేసి బ్లడ్ క్యాన్సర్ అని గుర్తించారు. కొంత కాలం హైదరాబాద్‌లోని బసవతారకం ఆసుపత్రిలో చికిత్స చేయించారు. పాప కోలుకుందంటూ తిరిగి జమ్మలమడుగు వచ్చేశారు. పాపకు బాగుంది అనుకునేలోపే తిరిగి అనారోగ్యానికి గురి కావడంతో మళ్లీ బసవతారకం ఆసుపత్రిలో చూపించారు. బ్రెయిన్ క్యాన్సర్ అని గుర్తించారు. దీంతో తల్లి గాలిపోతుల సునీత ఎటూపోలేక పాపకు చికిత్స చేయించలేని ఆర్థిక పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. భర్త ఉన్నా తప్పని కష్టాలు గాలిపోతుల సునీతకు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని చాగలమర్రి మండలం చింతలచెరువు గ్రామవాసి అయిన బాబుతో వివాహం జరిగింది. ఆయన బేల్దారి పని చేస్తూ వచ్చిన డబ్బుతో మద్యం తాగుతూ కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశారు. దీంతో రెండేళ్ల నుంచి సునీత తనకున్న ఇద్దరు పిల్లలను పోషించుకుంటూ వస్తోంది. తన బిడ్డకు ఆరోగ్యం సక్రమంగా లేకపోవడంతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతుండటంతో.. చింతల చెరువులోని అంగన్వాడీ కేంద్రంలో ఆయాగా ఉన్న సునీతను తొలగించేశారు. దీంతో అక్కడ సునీతను, పిల్లలను పట్టించుకునే వారు లేకపోవడంతో పుట్టినిల్లు అయిన జమ్మలమడుగుకు వచ్చి చేరింది. అయితే ఇక్కడ కూడా నిరాదరణకు గురైంది. దీంతో తన బిడ్డను కాపాడుకునేందుకు నానా ఇబ్బందులు పడుతోంది. తన పాప పావనిని కాపాడాలంటూ తల్లి సునీత వేడుకుంటోంది. సాయం చేయదలచిన వారు సెల్ నంబర్: 9121393846ను సంప్రదించాలని ఆమె కోరుతోంది. -
అకస్మాత్తుగా వాంతి ,ఫిట్స్ రావడం జరుగుతుందా.. ఆలస్యం చేయకండి
గడ్డ దేహంలో ఎక్కడ వచ్చినా అంత పెద్దగా సమస్య ఉండకపోవచ్చు గానీ... మెదడు నిర్వహించే కీలకమైన విధుల రీత్యా అక్కడ గడ్డలు వస్తే ప్రమాదంగా పరిణమించవచ్చు. అది క్యాన్సరస్ గడ్డ అయితే మరీ ప్రమాదం... కానీ ఒకవేళ అది క్యాన్సరస్ గడ్డ కాకపోయినప్పటికీ ఏదైనా అవయవాన్ని నియంత్రించే భాగాన్ని అది నొక్కివేస్తే... మన శరీరంలోని ఆ భాగం విధుల నిర్వహణలో తేడాలు రావచ్చు. దాంతో అవయవం ఆరోగ్యవంతంగా ఉన్నప్పటికీ... మెదడులో ఏర్పడ్డ గడ్డ కారణంగా దాని కదలికలు మందగించడం, అది చచ్చుబడిపోయినట్లుగా కావడం, పూర్తిగా పనిచేయకుండానే పోవడం జరుగుతుంది. మెదడులో గడ్డల వల్ల ఎదురయ్యే సమస్యలు, అందుబాటులో ఉన్న చికిత్సలను తెలుసుకుందాం. అసాధారణంగా పెరిగే కణజాలం ఓ గడ్డ ఆకృతి దాలుస్తుంది. ఆ గడ్డలే మెదడులో పెరిగితే వాటిని మెదడులో గడ్డల (బ్రెయిన్ ట్యూమర్స్)ని అంటారు. స్థూలంగా వీటిని రెండు రకాలుగా చెప్పవచ్చు. మొదటివి హానీ చేయని గడ్డలు (బినైన్). రెండోవి ప్రమాదకరమైన క్యాన్సర్ (మెలిగ్నెంట్) గడ్డలు. బినైన్ గడ్డల వల్ల సాధారణంగా మెదడుకు ప్రమాదం ఉండదు. మెల్లగా పెరుగుతాయి. గడ్డ ఏ మేరకు పెరిగిందనే విషయానికి తెలుసుకోడానికి వీలుగా దానికి స్పష్టమైన అంచులు ఉంటాయి కానీ క్యాన్సరస్ (మెలిగ్నెంట్) గడ్డలు నిర్దిష్టంగా ఫలానా చోటే అంతమైనట్లుగా స్పష్టమైన అంచులుండవు. పెరుగుదల వేగం కూడా చాలా ఎక్కువ. దాంతో అంచులు గుర్తించడానికి వీల్లేకుండా చుట్టుపక్కల కణజాలంలోకి చొచ్చుకుపోయేలా పెరుగుతాయి. బ్రెయిన్ ట్యూమర్ల పెరుగుదలకు సాధారణ కారణాలు... నిజానికి బ్రెయిన్ ట్యూమర్లు ఎందుకు పెరుగుతాయని చెప్పేందుకు నిర్దిష్టమైన కారణాలు లేకపోయినా... కొన్ని అంశాలు ట్యూమర్ పెరిగే ముప్పును పెంచుతాయి. అవి... రేడియేషన్: తరచూ రేడియోషన్‌కు ఎక్స్పోజ్ అయ్యేందుకు ఆస్కారం ఉన్న వృత్తుల్లో / పరిసరాల్లో ఉన్నవారికి మెదడులో గడ్డలు వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు చికిత్స కేంద్రాల్లో, వైద్య పరీక్ష కేంద్రాల్లో పనిచేసేవారికి, రేడియేషన్ వెలువడే పారిశ్రామిక ప్రాంతాల్లోని వారికి ఈ ముప్పు ఉంటుంది. జన్యుపరమైనవి: క్రోమోజోముల్లో వచ్చే కొన్ని మార్పులు మెదడులో గడ్డల పెరుగుదలను ప్రేరేపించవచ్చు. మానవుల్లో 23 జతల క్రోమోజోములు ఉంటాయన్న విషయం తెలిసిందే. వీటిల్లో... 1, 10, 13, 17, 19, 22 క్రోమోజోముల్లో ఏవైనా మార్పులు ఏర్పడినప్పుడు మెదడులో గడ్డలు వచ్చే ఆస్కారం ఎక్కువ. ఉదాహరణకు... 22వ క్రోమోజోములో మార్పుల వల్ల మెనింజియోమా తరహా గడ్డ ఏర్పడుతుంది. అయితే ఈ గడ్డ హానికరం కాదు. అయితే... 1, 19 క్రోమోజోముల్లో మార్పులొస్తే ఆలిగోడెండ్రోగ్లియోమా అనే క్యాన్సర్ గడ్డలు వచ్చే అవకాశం ఎక్కువ. కొన్ని రకాల జన్యుపరమైన లోపాలు ఉదాహరణకు న్యూరోఫైబ్రోమటోసిస్, వాన్ హిప్పెల్ లాండువా డిజీస్ వంటివి మెదడులో కణుతులకు కారణం కావచ్చు. మెదడులో ఏయే ప్రాంతాల్లో... ఎలాంటి సమస్యలు? మెదడులో గడ్డ వచ్చే ప్రాంతాన్ని బట్టి సమస్యలూ మారుతుంటాయి. ఉదాహరణకు... ఫ్రంటల్ లోబ్‌లో గడ్డలతో : కదలికల్లో లోపాలు తార్కికత లోపాలు ప్రవర్తనాలోపాలు జ్ఞాపకశక్తి మందగించడం నిర్ణయం తీసుకోలేకపోవడం వ్యక్తిత్వ లోపాలు ప్రణాళికలో లోపాలు విషయాలను సరిగ్గా అంచనా వేయలేకపోవడం తరచూ మారిపోయే మూడ్స్. పెరైటల్ లోబ్‌లో గడ్డలతో : విషయాలు సరిగా వివరించలేకపోవడం లెక్కలు సరిగా చేయలేకపోవడం స్పర్శజ్ఞానలోపం చదవలేకపోవడం రాయలేకపోవడం టెంపోరల్ లోబ్‌లో గడ్డలతో : భాషను అర్థం చేసుకోలేకపోవడం వినికిడి లోపాలు భావోద్వేగ పరమైన మార్పులు పిట్యూటరీ గ్రంథి ప్రాంతంలో గడ్డలవల్ల : హార్మోన్లలో మార్పులు ఎదుగుదల లోపాలు ప్రత్యుత్పత్తి లోపాలు / వంధ్యత్వం ఆక్సిపెటల్ లోబ్‌లో గడ్డలతో : చూపు మందగించడం సెరిబెల్లమ్ ప్రాంతంలో గడ్డలతో : శరీరాన్ని నిటారుగా ఉంచలేకపోవడం తూగుతూ నడవడం కొన్ని కండరాలపై నియంత్రణ కోల్పోవడం. బ్రెయిన్ స్టెమ్ ప్రాంతంలో గడ్డల వల్ల : శ్వాస సంబంధమైన లోపాలు రక్తపోటులో మార్పులు గుండె స్పందనల్లో మార్పులు మింగడంలో, మాట్లాడటంలో ఇబ్బందులు శస్త్రచికిత్స : బాధితులకు శస్త్రచికిత్స సిఫార్సు చేసే సందర్భాలు. వీలైనంత వరకు గడ్డను తొలగించేందుకు అవకాశం ఉండటం. గడ్డ ఏ తరహాకు చెందినదనే అంశం స్పష్టంగా, నిర్ధారణగా తెలిసిపోవడం. గడ్డను తొలగించడం అక్కడి ఒత్తిడి (ఇంట్రాక్రేనియల్ ప్రెషర్) తగ్గి మంచి ఉపశమనం లభిస్తుందని తెలిసినప్పుడు లేదా మిగతా గడ్డను రేడియేషన్ / కీమోథెరపీతో తేలిగ్గా నిర్మూలించగలమని తెలవడం. మైక్రోన్యూరోసర్జరీ : ఇటీవల అందుబాటులోకి వచ్చిన అధునాతన ఇమేజింగ్ (లోపలి గడ్డలను ఫొటో తీసి చూసే ప్రక్రియ), మైక్రోస్కోపిక్ విధానాలు, మ్యాపింగ్‌లతో న్యూరోసర్జన్లు అతి సూక్ష్మమైన గడ్డలను తొలగించగలుగుతున్నారు. గతంలో శస్త్రచికిత్స ద్వారా చేరలేని ప్రదేశాల్లోకి చేరుకుని సైతం కొన్ని గడ్డల తొలగింపు ఇప్పుడు సాధ్యమవుతోంది. రేడియేషన్ థెరపీ : మెదడులోని కొన్ని రకాల క్యాన్సర్ గడ్డలనూ / క్యాన్సర్ తరహాకు చెందని గడ్డలను తొలగించడానికి రేడియేషన్ థెరపీ మంచి మార్గం. ఇందులో గడ్డను పూర్తిగా నిర్వీర్యం చేయడంతో పాటు పెరుగుదలనూ అరికట్టవచ్చు. కీమో థెరపీ : చిన్న తరహా హానికరమైన గడ్డలూ (మెలిగ్నెంట్ ట్యూమర్స్)కు కీమోథెరపీ బాగా పనిచేస్తుంది. ఇక కొన్ని రకాల క్యాన్సర్ గడ్డలు రేడియేషన్ తో పాటు కీమోథెరపీ ఇస్తేనే చికిత్సకు బాగా లొంగుతాయి. కొన్నిసార్లు నేరుగా గడ్డలోకి మందు వెళ్లేలా కూడా కీమోథెరపీ ఇస్తారు.\ నిర్ధారణ కోసం చేసే వైద్య పరీక్షలు... సీటీ స్కాన్ : మెదడులో గడ్డలు ఉన్నట్లుగా అనుమానిస్తే తొలుత అవసరమైన పరీక్ష సీటీ స్కాన్. ఎమ్మారై : మెదడులో గడ్డ ఏ ప్రాంతంలో ఉంది, అది ఏ తరహాకు చెందినది, సైజు, అది మెదడులో ఏ మేరకు చొచ్చుకుపోయింది వంటి అంశాలపై స్పష్టంగా తెలిసే సమాచారంతో శస్త్రచికిత్స ప్రక్రియలో కూడా ఎమ్మారై టెక్నిక్ చాలా ఉపయోగపడుతుంది. పెట్ స్కాన్ : వాస్తవ గడ్డలకూ, గడ్డలుగా కనిపించేవాటికి (ట్యూమర్స్కూ, నాన్ట్యూమర్స్కు) మధ్య తేడాలు తెలిపేందుకు ఉపయోగపడే పరీక్ష. లక్షణాలు గడ్డ మెదడులోని ఏ ప్రాంతంలో వచ్చిందన్న అంశంపై ఆధారపడి ఈ లక్షణాలు మారుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మెదడులో గడ్డ ఉన్నప్పటికీ బయటకు ఎలాంటి లక్షణాలూ కనిపించకపోవచ్చు.సాధారణ లక్షణాలివి... నలభై ఏళ్లకు పైబడిన వారిలో లేదా ఆరేళ్లలోపు వారిలో తీవ్రమైన తలనొప్పి అకస్మాత్తుగా వాంతి కావడం ∙ఫిట్స్ రావడం మెదడులో గడ్డ వచ్చిన ప్రదేశాన్ని బట్టి... స్పర్శజ్ఞానం కోల్పోవడం లేదా ఏదైనా అవయవపు కదలికల్లో మార్పులు చూపు మసగ్గా మారడం మాట ముద్దగా రావడం లేదా మాటలో స్పష్టత లేకపోవడం డిప్రెషన్ ప్రవర్తనలో మార్పులు..హార్మోన్ స్రావాల్లోనూ మార్పులు (ఎండోక్రైన్ డిస్ఫంక్షన్). మందులతో చేసే చికిత్స గడ్డ ఉన్న ప్రాంతంల్లోని వాపు తగ్గించడానికి కొన్నిసార్లు స్టెరాయిడ్స్‌తో చికిత్స అందిస్తారు. దీనివల్ల రోగికి తలనొప్పి వంటివాటితో పాటు ఇతర భౌతిక లక్షణాలూ తగ్గుతాయి.గడ్డల కారణంగా ఫిట్స్ వస్తే వాటిని తగ్గించేందుకు మందులు ఇస్తారు. -
అభిమానికి బ్రెయిన్ క్యాన్సర్: ధైర్యం చెప్పిన కమల్
మనం అభిమానించే నటులు మనతో మాట్లాడితే కలిగే సంతోషమే వేరు. ఆ ఆనందాన్నే తన అభిమానికి కలిగించారు నటుడు కమలహాసన్. కెనడాకు చెందిన సాకేత్ అనే వ్యక్తి కమల్‌హాసన్‌కు వీరాభిమాని. అతను మెదడు క్యాన్సర్‌తో బాధపడుతూ మూడో స్టేజ్‌కు చేరుకున్నాడు. తన అభిమాన నటుడు కమల్‌హాసన్ ఒక్కసారైనా మాట్లాడాలన్న కోరికను మిత్రులకు తెలిపాడు. ఈ విషయాన్ని వారు సామాజిక మాధ్యమాల ద్వారా వైరల్ చేశారు. అది కమల్‌హాసన్ దృష్టికి వచ్చింది. దీంతో కమల్ బుధవారం జూమ్ కాల్ ద్వారా కెనడాలోని సాకేత్, అతని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అదే విధంగా క్యాన్సర్ వ్యాధిపై పోరాడి గెలవాలంటూ ధైర్యాన్ని, ఉత్సాహాన్ని నింపారు. అందుకు ధన్యవాదాలు తెలిపిన సాకేత్ తను చెన్నైకి వస్తే మిమ్మల్ని కలవచ్చా? అని అడిగాడు. దీంతో కమలహాసన్ తప్పకుండా కలవవచ్చు అని మాట ఇచ్చారు. Touching scenes! A whole load of positivity when #KamalHaasan sir spoke to his fan who is battling brain cancer. A nice gesture by Ulaganayagan, who made Mr. Saketh @sakethiyer feel very special👌❤️ pic.twitter.com/N1w46LnMdc — Kaushik LM (@LMKMovieManiac) June 23, 2021 చదవండి: సిగరెట్ కాలుస్తూ హీరో నిఖిల్.. -
బెన్ స్టోక్స్ ఇంట తీవ్ర విషాదం
వెల్లింగ్టన్ : ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. స్టోక్స్ తండ్రి గెరార్డ్ జేమ్స్ స్టోక్స్(65) బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతూ మంగళవారం మృతి చెందారు. ఆయన మరణ వార్తను క్లబ్ వర్కింగ్ టౌన్ ధృవీకరిచింది. కాగా మాజీ రగ్బీ ప్లేయర్ అయిన జేమ్స్ స్టోక్స్ వర్గింగ్ టౌన్ రగ్బీకి కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ సందర్భంగా వర్కింగ్ టౌన్ రగ్బీ క్లబ్ స్పందిస్తూ.. ' కోచ్ గెరార్డ్ స్టోక్స్ మరణం మమ్మల్ని తీవ్రంగా బాధించింది. ఆయన కుటుంబానికి ఇవే మా ప్రగాడ సానభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి 'అని ఓ ప్రకటనలో తెలిపింది. (చదవండి : టీ20 ప్రపంచకప్‌లో అతను కీలకం కానున్నాడు) ప్రస్తుతం స్టోక్స్ దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను ఇంగ్లండ్ వైట్‌వాష్ చేసింది. వన్డే సిరీస్‌కు ముందు హోటల్ సిబ్బందిలో కరోనా కేసులు వెలుగు చూడడంతో సిరీస్‌ను రద్దు వేసినట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. కాగా విషయం తెలుసుకున్న వెంటనే స్టోక్స్ న్యూజిలాండ్‌కు బయల్దేరగా.. ఇంగ్లండ్ జట్టు మాత్రం గురువారం ఇంగ్లండ్ వెళ్లనుంది. (చదవండి : మా ఆటగాళ్లకు వైరస్ లేదు: ఈసీబీ) కాగా బెన్ స్టోక్స్ 12 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు గెరార్డ్ జేమ్స్ స్టోక్స్ ఇంగ్లండ్‌కు వలస వచ్చారు. అక్కడే వర్కింగ్ టౌన్ రగ్బీ కోచ్‌గా పనిచేశారు. అయితే జేమ్స్ స్టోక్స్ అనారోగ్యం గురవడంతో 2013లో న్యూజిలాండ్‌కు తిరిగి వెళ్లిపోయారు. కానీ అప్పటికే స్టోక్స్ ఇంగ్లండ్‌కు ఆడుతుండడంతో అక్కడే ఉండిపోయాడు. ఇటీవలే తండ్రి ఆరోగ్యం మరింత క్షీణించడంతో పాకిస్థాన్ టెస్ట్ సిరీస్ నుంచి అర్థంతరంగా తప్పుకున్న స్టోక్స్ తండ్రికి అండగా ఉండేందుకు న్యూజిలాండ్ వెళ్లాడు. ఆ తర్వాత యూఏఈలో జరిగిన ఐపీఎల్ 13వ సీజన్లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. తన తండ్రి ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఐపీఎల్ ఆడడానికి వచ్చినట్టు స్టోక్స్ అప్పట్లో చెప్పుకొచ్చాడు.(చదవండి : అయ్యో! చహల్ ఎంత పని జరిగింది) -
మీది చాలా గొప్ప మనసు..!
క్యాన్సర్‌తో బాధ పడుతున్న చిన్నారికి మధురానుభూతులు మిగిల్చారు తోటి విద్యార్థుల తల్లిదండ్రులు. తనకు ఇష్టమైన ‘రెక్కల గుర్రం’ స్వారీ ఏర్పాటు చేసి.. సర్జరీకి వెళ్లేముందు రోజు అతడిని సర్ప్రైజ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సదరు బాలుడి కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అమెరికాకు చెందిన వ్యాట్ హాస్ అనే ఐదేళ్ల బాలుడు అరుదైన బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో నవంబరు 15న అతడికి సర్జరీ చేయాల్సి ఉంటుందని వైద్యులు వ్యాట్ తల్లిదండ్రులకు చెప్పారు. తమ పిల్లల ద్వారా ఈ విషయం తెలుసుకున్న వ్యాట్ స్నేహితుడి తల్లి జెన్నిఫర్ నీల్సన్.. అతడికి ఊరట కలిగించాలని భావించారు. ఇందుకోసం.. వ్యాట్‌కు ఇష్టమైన యూనికార్న్ థీమ్‌తో డిజైన్ చేసిన గుర్రాల దగ్గరికి అతడిని తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు. వ్యాట్ తల్లిదండ్రులతో పాటు వ్యాట్ క్లాస్మేట్లకు తమ ప్లాన్ గురించి వివరించారు. ఈ క్రమంలో తమను కలవడానికి పార్కుకు రావాల్సిందిగా వ్యాట్‌తో పాటు అతడి తల్లిదండ్రులకు ఆహ్వానం పంపించారు. ఇక అక్కడికి వెళ్లగానే స్నేహితులతో పాటుగా.. యూనికార్న్‌ను చూసిన వ్యాట్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. గుర్రంపై పార్కు అంతటా తిరుగుతూ సందడి చేశాడు. ఈ విషయాన్ని వ్యాట్ తల్లిదండ్రులు ఫేస్బుక్లో పంచుకున్నారు. ‘ మేమొక అద్భుతమైన చోటుకు వెళ్లాము. వాళ్లకు ఎంతగానో రుణపడి ఉంటాం. మీతో ఈ ఫొటోలు పంచుకోవడం సంతోషంగా ఉంది’ అని పేర్కొన్నారు. ఇక పదిహేను రోజుల క్రితం షేర్ చేసిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో నీల్సన్పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ‘వ్యాట్ ఎంతగా సంతోష పడుతన్నాడో అతని కళ్లలో తెలిసిపోతోంది. అతడి ఆరోగ్యం బాగుపడాలని.. మేము కూడా కోరుకుంటాం. మీది చాలా గొప్ప మనసు’ అని కామెంట్లు చేస్తున్నారు. -
సూర్యకు బతుకునిచ్చిన సాక్షి
సాక్షి, కోరుట్ల: ‘బాబుకు.. బతుకునివ్వరూ’ శీర్షికన ఈ నెల 8వ తేదిన సాక్షిలో ప్రచురితమైన కథనానికి పలువురు స్పందించారు. పట్టణంలోని అంబేద్కర్ నగర్‌కు చెందిన గొడిసెల సూర్య(14) అనే బాలుడు బ్రెయిన్ ఫీవర్‌తో బాదపడుతున్నాడు. తల్లిదండ్రులకు వైద్యం చేయించడం భారంగా మారింది. ఈ క్రమంలో సాక్షి ఆ కుటుంబ దయనీయ స్థితిపై కథనం ప్రచురించింది. ఈ కథనానికి స్పందించిన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు రూ.15 వేలు విరాళం అందించారు. జగిత్యాల జిల్లా బీజేపీ కార్యదర్శి ఇందూరి సత్యం రూ.5 వేలు విరాళం అందించారు. కోరుట్ల ప్రెస్‌క్లబ్ తరపున రూ.10వేల విరాళం ప్రకటించారు. ఆదుకున్న అర్వింద్ ఫౌండేషన్ బ్రెయిన్ ఫీవర్‌తో బాధపడుతున్న సూర్య వైద్య సాయం కోసం అర్వింద్ ఫౌండేషన్ నిర్వహాకులు స్పందించారు. కోరుట్ల బీజేపీ నాయకులు ఇందూరి సత్యం సూర్య పరిస్థితిని అర్వింద్ ఫౌండేషన్ దృష్టికి తీసుకెళ్లగా.. గురువారం ఫౌండేషన్ నిర్వహాకులు ధర్మపురి ప్రియాంక రెయిన్బో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సూర్యను పరామర్శించారు. సూర్య వైద్యానికి ఆసుపత్రిలో అయిన ఖర్చులో దాదాపు రూ.68 వేలు ఫౌండేషన్ నుంచి చెల్లించేందుకు ఏర్పాట్లు చేశా రు. కుమారుని అనారోగ్యం విషయంలో మానవతా దృక్పథంతో స్పందించిన అర్వింద్ ఫౌండేషన్ నిర్వహకులు, ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావుకు సూర్య తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు. -
‘లెమన్ ఫేస్ ఛాలెంజ్’
-
ఇంటర్నెట్లో మరో ఛాలెంజ్ వైరల్
సాక్షి, న్యూఢిల్లీ : ఒకప్పుడు ఇంటర్నెట్లో సంచలనం సృష్టించిన ‘ఐస్ బకెట్ ఛాలెంజ్’ లాగా ఇప్పుడు ‘లెమన్ ఫేస్ ఛాలెంజ్’ సంచలనం సష్టిస్తోంది. ఇందులో చేయాల్సిందల్లా సగం కోసిన నిమ్మకాయ ముక్కను తీసుకొని పళ్లతో కొరికి కొంత రసాన్ని మింగాలి. అప్పుడు ముఖంలో కలిగే హావభావాలను వీడియోలో రికార్డు చేసి ఇంటర్నెట్లో పోస్ట్ చేయాలి. ఇతరులను పోటీకీ ఛాలెంజ్ చేయాలి. ఈ ఛాలెంజ్‌ను ఒంటరిగానైనా స్వీకరించవచ్చు. ఇంటిల్లిపాది స్వీకరించవచ్చు. లేదా మిత్ర బందంతో కలిసి ఛాలెంజ్ చేయవచ్చు. డీఐపీజీగా వ్యవహరించే ఒకరకమైన ప్రాణాంతక బ్రెయిన్ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న ‘అబ్రైగ్ ఆర్మీ’ ఈ ఛాలెంజ్‌ను సృష్టించిందని అమెరికా నుంచి వెలువడుతున్న ‘ది అమెరికా పోస్ట్’ పత్రిక వెల్లడించింది. గుడ్‌మార్నింగ్ బ్రిటన్స్ రిపోర్టర్ అరెక్స్ బెరెస్ఫోర్డ్ కూడా ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన తన రియాక్షన్‌ను ఆన్లైన్లో పోస్ట్ చేశారు. ఛాలెంజ్ స్వీకరించడం మరి ఇంత ఈజీ ఏమీ కాదు. ఎందుకంటే ఛాలెంజ్ చేసిన వాళ్లు ఎంతోకొంత కరెన్సీ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న ఆర్మీకి విరాళంగా ఇవ్వాలి. -
ఆ దోమ కాటు మంచిదే
వాషింగ్టన్ : జికా వైరస్ మానవాళికి చెడు కంటే మంచే ఎక్కువ చేస్తుందా?. గత రెండేళ్లుగా గర్భంలో ఉన్న పిండంపై పెను ప్రభావం చూపుతూ జికా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. కానీ, జికా వైరస్‌లో ఉన్న ఓ మంచి లక్షణాన్ని తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించారు. బ్రెయిన్ క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేసేందుకు జికా వైరస్ ఉపయోగపడుతుందని జర్నల్ ఆఫ్ ఎక్స్పరిమెంటర్ మెడిసిన్‌లో పేర్కొన్నారు. మెదడుపై జికా వైరస్ ఎలా ప్రభావం చూపుతుందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్న శాస్త్రవేత్తలకు బ్రెయిన్ క్యాన్సర్ సెల్స్‌ను అది పూర్తిగా నాశనం చేయడం గమనించారు. ఇదే సందర్భంలో సాధారణ మెదడు కణాలపై ఎలాంటి ప్రభావం చూపడం లేదని గుర్తించారు. బ్రెయిన్ క్యాన్సర్ సోకిన 18 చిట్టెలుకలకు జికా వైరస్, ఉప్పునీటిని ఇంజెక్షన్ల ద్వారా ఎక్కించారు. రెండు వారాల అనంతరం చిట్టెలుకల స్థితిని పరిశీలించిన శాస్త్రవేత్తలకు జికా వైరస్ ఇంజెక్షన్లు చేసిన చిట్టెలుకల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినట్లు గుర్తించారు. అనంతరం మానవ మెదడుపై పరిశోధన కోసం జికా వైరస్ ఇంజెక్షన్‌కు ఎక్కించగా.. కొద్దిరోజుల తర్వాత బ్రెయిన్ క్యాన్సర్ కణాలు నాశనమైనట్లు గుర్తించారు. అయితే, జికా వైరస్ ప్రాథమిక లక్షణం(గర్భస్త పిండంపై తీవ్ర ప్రభావం చూపడం) వల్ల కేవలం వయసులో పెద్దవారిలోనే బ్రెయిన్ క్యాన్సర్‌ను నయం చేయడానికి అవకాశం కలుగుతుందని జర్నల్‌లో పరిశోధనా బృందం పేర్కొంది. -
బొజ్జా తారకంకు హైకోర్టు ఘన నివాళి
సాక్షి, హైదరాబాద్: ఇటీవల మృతి చెందిన సీనియర్ న్యాయవాది బొజ్జా తారకంకు ఉమ్మడి హైకోర్టు మంగళవారం ఘనంగా నివాళులు అర్పించింది. తారకంకు నివాళులు అర్పించేందుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలో న్యాయమూర్తులందరూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో తారకం కుటుంబ సభ్యులు, తెలంగాణ అదనపు ఏజీ రామచంద్రరావు, ఏపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోసాని వెంకటేశ్వర్లు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. న్యాయవ్యవస్థకు తారకం చేసిన సేవలను ఈ సందర్భంగా వారు కొనియాడారు. అణగారిన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేశారని ఏసీజే అన్నారు. తారకం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం అంతా రెండు నిమిషాల పాటు మౌనం పాటించి సంతాపం తెలిపారు. -
బొజ్జాతారకం మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం
హైదరాబాద్: పౌర హక్కుల నేత, రచయిత, ప్రముఖ న్యాయవాది, దళిత ఉద్యమ నేత, తెలంగాణ ప్రజాస్వామిక వేదిక కన్వీనర్ బొజ్జాతారకం(77)మృతి పట్ల వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్ది తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నాలుగేళ్లుగా బ్రెయిన్ కేన్సర్‌తో బాధపడుతున్న బొజ్జాతారకం శుక్రవారం రాత్రి 10.20 గంటలకు హైదరాబాద్ అశోక్‌నగర్‌లోని తన స్వగృహంలో మృతి చెందారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సందర్శకుల కోసం ఆయన భౌతికకాయాన్ని ఉంచుతారు. 4 గంటలకు ఫిలింనగర్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. -
హక్కుల సేనాని అస్తమయం
⇒ బ్రెయిన్ కేన్సర్‌తో కన్నుమూసిన బొజ్జా తారకం ⇒ దళిత హక్కుల కోసం జీవితాంతం పరితపించిన నేత ⇒ సీఎం కేసీఆర్ సహా పలువురి సంతాపం.. నేడు అంత్యక్రియలు సాక్షి, హైదరాబాద్: హక్కుల సేనాని ఇక లేరు. పౌర హక్కుల నేత, రచయిత, ప్రముఖ న్యాయవాది, దళిత ఉద్యమ నేత, తెలంగాణ ప్రజాస్వామిక వేదిక కన్వీనర్ బొజ్జాతారకం(77) శుక్రవారం రాత్రి కన్నుమూశారు. నాలుగేళ్లుగా బ్రెయిన్ కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన రాత్రి 10.20 గంటలకు హైదరాబాద్ అశోక్‌నగర్‌లోని తన స్వగృహంలో మృతి చెందారు. పది రోజుల కిందట ఆయనను కిమ్స్ ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకువచ్చారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సందర్శకుల కోసం ఆయన భౌతికకాయాన్ని ఉంచుతారు. 4 గంటలకు ఫిలింనగర్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. 1939 జూన్ 27న తూర్పుగోదావరి జిల్లా అమలాపురం సమీపంలోని కందికుప్పలో బొజ్జా మావూళ్లమ్మ, అప్పలస్వామికి బొజ్జా తారకం జన్మించారు. ఆయనకు భార్య విజయభారతి, కూతురు డాక్టర్ మహిత, కుమారుడు రాహుల్ బొజ్జా (హైదరాబాద్ కలెక్టర్) ఉన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కారంచేడు ఘటనపై తారకం.. దళిత పక్షాన నిలబడి సుప్రీంకోర్టులో కేసు వేసి పోరాడారు. దోషులకు శిక్షపడేలా చేశారు. తోట త్రిమూర్తులు దళితులకు శిరోముండనం చేయించిన కేసుకు సంబంధించి ఎమినిది నెలల కిందట వైజాగ్ స్పెషల్ కోర్టుకు వెళ్లారు. అదే సందర్భంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అక్కడ్నుంచి తీసుకువచ్చి హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చేర్పించారు. ఆగస్టు 15 నుంచి జొబ్జా తారకం నోటి నుంచి మాట రావడం లేదు. అంబేడ్కర్ రచించిన ‘రాముడు, కృష్ణుడు ర హస్యాలు’ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించిన తారకం.. అంబేడ్కర్ స్థాపించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీలో కీలకంగా పనిచేశారు. ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖను రిజిస్టర్ చేయించారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలుకు ఏర్పాటు చేసిన కేంద్ర కమిటీలో తారకం కీలకంగా పనిచేశారు. ‘పోలీసులు అరెస్టుచేసే’్త‘ కులం-వర్గం’, ‘నేల-నాగలి-మూడెద్దులు’‘పంచతంత్రం’ (నవల)‘నది పుట్టిన గొంతుక’ వంటి రచనలు చేశారు. సీఎం సంతాపం బొజ్జా తారకం మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. కవిగా, రచయితగా, న్యాయవాదిగా బహుముఖ సేవలందించిన బొజ్జా తారకం అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేశారన్నారు. ఆంధ్ర ప్రాంతానికి చెందినవారైనప్పటికీ తెలంగాణ ఉద్యమంలో ధర్మాన్ని గుర్తించి, తనకు, ఉద్యమానికి మద్దతుగా నిలిచారని గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విరసం నేత వరవరరావు తదితరులు కూడా సంతాపం తెలిపారు. -
మొబైల్ ఫోన్లతో ఆ ముప్పులేదు!
మెల్ బోర్న్: మొబైల్ ఫోన్స్ వాడితే చాలా రకాల సమస్యలు ఎదురవుతాయని యూజర్లు భావిస్తుంటారు. అయితే ఈ విషయంపై ఆస్ట్రేలియాకు చెందిన సిడ్నీ శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేసి వాటి ఫలితాలను వెల్లడించారు. మొబైల్ ఫోన్లు వాడకానికి బ్రెయిన్ క్యాన్సర్ కు అసలు సంబంధమే లేదని తేల్చేశారు. ఫోన్లు వాడకం వల్లే బ్రెయిన్ క్యాన్సర్ రావడం లాంటివి జరగవని తెలిపారు. 20 వేల మంది పురుషులు, 14వేల మంది స్త్రీలను సంప్రదించి కొన్ని ప్రశ్నలు వేసి ఈ విషయాలను నిర్ధారించుకున్నారు. 1982-2012 మధ్య బ్రెయిన్ క్యాన్సర్ బారిన పడ్డ ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తుల వివరాలు, 1987-2012 మధ్య కాలంలో మొబైల్ ఫోన్లు వాడుతున్న వారి డేటాను సిడ్నీ రీసెర్చర్స్ సేకరించారు. ఈ డేటాను పరిశీలించగా ఫోన్ల వాడకం వల్ల బ్రెయిన్ క్యాన్సర్ పెరుగుతుందన్న సూచనలు తమకు కనిపించలేదని రీసెర్చ్ బృందం వెల్లడించింది. 60,70 ఏళ్ల వయసున్న వారిలో మాత్రమే బ్రెయిన్ క్యాన్సర్ లక్షణాలు కనిపించాయట. మొబైల్ ఫోన్ల వాడకం వల్ల చాలా తక్కువ శక్తి విడుదలవుతుందని దానివల్ల మనకు జరిగే నష్టమేంలేదని తాజా సర్వేలో వెల్లడైంది. -
గర్భనిరోధక మాత్రలు వాడే మహిళలూ... జాగ్రత్త!
కొత్త పరిశోధన దీర్ఘకాలం పాటు గర్భనిరోధక మాత్రలు వాడే మహిళలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు డేనిష్ పరిశోధనవేత్తలు. హార్మోన్లతో కూడిన గర్భనిరోధక మాత్రలు వాడే మహిళలు వాటిని చాలాకాలం పాటు వాడుతుంటే వారిలో చాలామందికి ‘గ్లియోమా’ అనే అరుదైన మెదడు క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువని డేనిష్ పరిశోధనవేత్తలు పేర్కొంటున్నారు. ‘గ్లియోమా’ అనే మెదడు క్యాన్సర్‌తో బాధపడుతున్న 50 ఏళ్ల లోపు మహిళల్లో చాలా మందిని పరిశీలిస్తే, వారిలో 90% మంది గతంలో హార్మోనల్ కాంట్రసెప్టివ్ పిల్స్ (హార్మోన్లతో కూడిన గర్భనిరోధక మాత్రలు) వాడినవారేనని తేలింది. మాత్రలు వాడిన వ్యవధి పెరుగుతున్న కొద్దీ ‘గ్లియోమా’ రిస్క్ కూడా పెరుగుతుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఈ అధ్యయన ఫలితాలన్నీ ‘బ్రిటిష్ జర్నల్ ఆఫ్ క్లినికల్ ఫార్మకాలజీ’ అనే మెడికల్ జర్నల్‌లో ప్రచురితమైనట్లు పరిశోధనవేత్తలు వెల్లడించారు. -
మూలకణాలతో మెదడు కేన్సర్ నిర్మూలన!
హూస్టన్: ప్రాణాంతక మెదడు కేన్సర్‌ను మూలకణాలతోనే నిర్మూలించేందుకు ఉపయోగపడే కొత్త విధానాన్ని భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త ఖలీద్ షా కనుగొన్నారు. హార్వార్డ్ స్టెమ్‌సెల్ ఇన్స్టిట్యూట్కు చెందిన ఖలీద్ షా ఎలుకలపై ప్రయోగం నిర్వహించి విజయం సాధించారు. ఎలుకల్లో మూలకణాలకు జన్యుపరంగా మార్పులు చేసిన ఆయన.. ఆ కణాలు కేన్సర్ కణాలను నిర్మూలించే విషాన్ని తట్టుకుంటూనే, ఆ విషాన్ని కేన్సర్ కణాల వద్ద మాత్రమే విడుదల చేసేలా అభివృద్ధిపర్చారు. జన్యుమార్పు చేసిన ఈ మూలకణాలు కేన్సర్ కణాలను మాత్రమే చంపుతూ, ఆరోగ్యకరణ కణాలకు ఎలాంటి హాని కలిగించకపోవడం విశేషం. -
యంగ్ పికాసో!
జార్జ్ పొచెస్తోవ్ పదకొండు నెలల వయసులో ఉన్నప్పుడు వాళ్ల నాన్న బ్రెయిన్ కాన్సర్‌తో చనిపోయాడు. చావు గురించి జార్జ్‌కు తెలిసే వయసేమీ కాదు అది. కానీ, ఆ చిట్టి కళ్లు తండ్రి కోసం వెదుకుతున్నట్లు తల్లి కనిపెట్టింది. పిల్లాడిని దారి మళ్లించడానికి అన్నట్లు అతని ముందు పెయింటింగ్ సామాగ్రి ముందు పెట్టేది. వాటితో తనకు తోచిన గీతలేవో గీసేవాడు జార్జ్. అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఉక్రెయిన్ దంపతులకు జన్మించిన జార్జ్ పదిహేడు సంవత్సరాల వయసులో కారు బొమ్మను అద్భుతంగా గీశాడు. వయసుతో పాటు అతనిలో చిత్రకళా ప్రతిభ పెరగడం ప్రారంభమైంది. బ్రైట్ కలర్ స్కీమ్‌లతో రకరకాల ప్రయోగాలు చేశాడు. గురువంటూ ఎవరూ లేకపోయినా చిత్రకళను తనకు తానే స్వయంగా నేర్చుకున్నాడు. జార్జ్ గీసిన చిత్రాలకు బ్రహ్మాండమైన మార్కెట్ ఉంది. త్రీ-డైమన్షల్ కాన్వాస్ మీద దృష్టి పెట్టినా, ఇ్రంపెషనిస్టిక్ ఆర్ట్ మీద దృష్టి పెట్టినా...తనదైన శైలిని ఎప్పుడు కోల్పోలేదు జార్జ్. హిల్లరీ క్లింటన్ నుంచి మైఖెల్ జోర్డన్(ప్రముఖ బాస్కెట్‌బాల్ ప్లేయర్) వరకు జార్జ్‌కు అభిమానులు ఉన్నారు. ఇంగ్లండ్, ఫ్రాన్స్, కొరియా, దక్షిణ అమెరికా, నెదర్లాండ్స్, రష్యా, ఉక్రేయిన్లలో ఎక్కువగా జార్జ్ చిత్రాలు ప్రదర్శితమవుతుంటాయి. జార్జ్‌పై ‘ఏ బ్రష్ విత్ డెస్టినీ’ అనే డాక్యుమెంటరీ రూపుదిద్దుకుంది. ఇది నాలుగు ఎమ్మీ అవార్డ్లు గెలుచుకుంది. చిత్రకళ మాత్రమే కాకుండా సామాజిక సేవా సంస్థలకు సహాయపడడం అంటే కూడా జార్జ్‌కు ఎంతో ఇష్టమైన పని. ఇరవెరైండు సంవత్సరాల జార్జ్ పొచెస్తోవ్ను మీడియా ముద్దుగా ‘యంగ్ పికాసో’ అని పిలుస్తుంది. నిజానికది భారీ పొగడ్తే కావచ్చు, కానీ చిత్రకళలో జార్జ్ మెరుపులు చూస్తుంటే ఆ మాత్రమైనా అనకుంటే ఎలా అనిపిస్తుంది! జార్జ్‌పై ‘ఏ బ్రష్ విత్ డెస్టినీ’ అనే డాక్యుమెంటరీ రూపుదిద్దుకుంది. ఇది నాలుగు ఎమ్మీ అవార్డ్లు గెలుచుకుంది. చిత్రకళ మాత్రమే కాకుండా సామాజిక సేవా సంస్థలకు సహాయపడడం అంటే కూడా జార్జ్‌కు ఎంతో ఇష్టమైన పని.