బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న పావని
సాక్షి, జమ్మలమడుగు: గాలిపోతుల పావని. కేవలం పదేళ్ల వయసు గల పాప. ప్రైవేట్ పాఠశాలలో చదువుతూ ఉన్న పాపను.. తల్లి గాలిపోతుల సునీత ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించింది. ప్రస్తుతం బాలికల ఉన్నత పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. ఇటీవల గాలిపోతుల పావనికి జ్వరం రావడంతో.. తిరుపతికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. అక్కడ రక్త పరీక్షలు చేసి బ్లడ్ క్యాన్సర్ అని గుర్తించారు.
కొంత కాలం హైదరాబాద్‌లోని బసవతారకం ఆసుపత్రిలో చికిత్స చేయించారు. పాప కోలుకుందంటూ తిరిగి జమ్మలమడుగు వచ్చేశారు. పాపకు బాగుంది అనుకునేలోపే తిరిగి అనారోగ్యానికి గురి కావడంతో మళ్లీ బసవతారకం ఆసుపత్రిలో చూపించారు. బ్రెయిన్ క్యాన్సర్ అని గుర్తించారు. దీంతో తల్లి గాలిపోతుల సునీత ఎటూపోలేక పాపకు చికిత్స చేయించలేని ఆర్థిక పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది.
భర్త ఉన్నా తప్పని కష్టాలు
గాలిపోతుల సునీతకు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని చాగలమర్రి మండలం చింతలచెరువు గ్రామవాసి అయిన బాబుతో వివాహం జరిగింది. ఆయన బేల్దారి పని చేస్తూ వచ్చిన డబ్బుతో మద్యం తాగుతూ కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశారు. దీంతో రెండేళ్ల నుంచి సునీత తనకున్న ఇద్దరు పిల్లలను పోషించుకుంటూ వస్తోంది. తన బిడ్డకు ఆరోగ్యం సక్రమంగా లేకపోవడంతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతుండటంతో.. చింతల చెరువులోని అంగన్వాడీ కేంద్రంలో ఆయాగా ఉన్న సునీతను తొలగించేశారు.
దీంతో అక్కడ సునీతను, పిల్లలను పట్టించుకునే వారు లేకపోవడంతో పుట్టినిల్లు అయిన జమ్మలమడుగుకు వచ్చి చేరింది. అయితే ఇక్కడ కూడా నిరాదరణకు గురైంది. దీంతో తన బిడ్డను కాపాడుకునేందుకు నానా ఇబ్బందులు పడుతోంది. తన పాప పావనిని కాపాడాలంటూ తల్లి సునీత వేడుకుంటోంది. సాయం చేయదలచిన వారు సెల్ నంబర్: 9121393846ను సంప్రదించాలని ఆమె కోరుతోంది.
Comments
Please login to add a commentAdd a comment