వాషింగ్టన్ : జికా వైరస్ మానవాళికి చెడు కంటే మంచే ఎక్కువ చేస్తుందా?. గత రెండేళ్లుగా గర్భంలో ఉన్న పిండంపై పెను ప్రభావం చూపుతూ జికా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. కానీ, జికా వైరస్‌లో ఉన్న ఓ మంచి లక్షణాన్ని తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించారు. బ్రెయిన్ క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేసేందుకు జికా వైరస్ ఉపయోగపడుతుందని జర్నల్ ఆఫ్ ఎక్స్‌పరిమెంటర్ మెడిసిన్‌లో పేర్కొన్నారు.
మెదడుపై జికా వైరస్ ఎలా ప్రభావం చూపుతుందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్న శాస్త్రవేత్తలకు బ్రెయిన్ క్యాన్సర్ సెల్స్‌ను అది పూర్తిగా నాశనం చేయడం గమనించారు. ఇదే సందర్భంలో సాధారణ మెదడు కణాలపై ఎలాంటి ప్రభావం చూపడం లేదని గుర్తించారు. బ్రెయిన్ క్యాన్సర్ సోకిన 18 చిట్టెలుకలకు జికా వైరస్, ఉప్పునీటిని ఇంజెక్షన్ల ద్వారా ఎక్కించారు. రెండు వారాల అనంతరం చిట్టెలుకల స్థితిని పరిశీలించిన శాస్త్రవేత్తలకు జికా వైరస్ ఇంజెక్షన్లు చేసిన చిట్టెలుకల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినట్లు గుర్తించారు.
అనంతరం మానవ మెదడుపై పరిశోధన కోసం జికా వైరస్ ఇంజెక్షన్‌కు ఎక్కించగా.. కొద్దిరోజుల తర్వాత బ్రెయిన్ క్యాన్సర్ కణాలు నాశనమైనట్లు గుర్తించారు. అయితే, జికా వైరస్ ప్రాథమిక లక్షణం(గర్భస్త పిండంపై తీవ్ర ప్రభావం చూపడం) వల్ల కేవలం వయసులో పెద్దవారిలోనే బ్రెయిన్ క్యాన్సర్‌ను నయం చేయడానికి అవకాశం కలుగుతుందని జర్నల్‌లో పరిశోధనా బృందం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment