చిన్నారిలో ఆ లక్షణాలున్నా వైద్యశాఖకు సమాచారం ఇవ్వని మంత్రి ఆస్పత్రి
బాధ్యతారాహిత్యంగా ప్రైవేట్ ల్యాబ్‌కు నమూనాలు
ముంబై ప్రైవేట్ ల్యాబ్ పరీక్షల్లో బాలుడిలో వెలుగుచూసిన వైరస్
నిర్ధారణ కోసం పూణేకు మరోసారి నమూనాలు పంపిన వైద్యశాఖ
సాక్షి, అమరావతి : దేశంలో అరుదుగా నమోదవుతున్న జికా వైరస్ లక్షణాలను గుర్తించిన వెంటనే వైద్య, ఆరోగ్య శాఖకు కనీస సమాచారం ఇవ్వకుండా మంత్రి నారాయణకు చెందిన నెల్లూరులోని నారాయణ ఆస్పత్రి తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఆరేళ్ల బాలుడిలో లక్షణాలు గుర్తించినప్పటికీ ముంబైలోని ప్రైవేట్ ల్యాబ్‌కు నమూనాలు పంపింది. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో జికా వైరస్ అని తేలింది. వాస్తవానికి.. గతనెల 30న జ్వరంతో బాధపడుతున్న బాలుడికి నారా యణ ఆస్పత్రిలో చికిత్స అందించారు.
ఈనెల 7న జ్వరంలో ఫిట్స్ రావడంతో తిరిగి మరో మారు తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. చికిత్స అందిస్తున్నా ఆరోగ్య సమస్యలు తగ్గకపోవడం, డెంగీ, మలేరియా పరీక్షలు కూడా నెగిటివ్ రావడంతో జికా ఏమోనని వైద్యులు అనుమానించి ఈనెల 13న నేరుగా ముంబైకు నమూనాలు పంపారు. 16న వెలువడిన ఫలితాల్లో జికా వైరస్ ఆనవాళ్లను గుర్తించినట్లు తేలింది.
ఇలా అరుదైన వ్యాధి లక్షణాలు గుర్తించిన వెంటనే వైద్యశాఖలోని ఎపిడమాలజీ విభాగానికి సమాచారం ఇస్తే ప్రత్యేక బృందాలు బాలుడి నమూనాలను నేరుగా పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ వైరాలజీ (ఎన్‌ఐవీ) ల్యాబ్‌కు పంపేవారు. దీంతోపాటు కేంద్ర మార్గదర్శకాల ప్రకారం వ్యాధి వ్యాప్తి నియంత్రణకు వేగంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
కానీ, నారాయణ ఆస్పత్రి బాధ్యతారాహిత్యం కారణంగా ఇప్పుడు ఈ వ్యవహారంలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు.. ప్రైవేట్ ల్యాబ్ ఫలితాల ఆధారంగా జికా వైరస్ అని నిర్ధారణకు రాలేని వైద్యశాఖ.. బాలుడితో పాటు, తల్లిదండ్రులు, గ్రామంలోని మరికొందరి నమూనాలను పూణేలోని ఎన్‌ఐవీ ల్యాబ్‌కు గురువారం పంపింది.
గర్భస్థ శిశువులపై తీవ్ర ప్రభావం..
డెంగీ, చికున్‌గున్యా మాదిరిగానే జికా వైరస్ పగటిపూట కుట్టే ఎడిస్ జాతి దోమ కాటు ద్వా రా వ్యాపిస్తుంది. ఇది సోకిన గర్భిణుల ద్వారా పుట్టే శిశువుల్లో మైక్రోసెఫలీ సమస్య ఎదురవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు స్ప ష్టం చేశాయి. దీంతో.. శిశువు మెదడుపై ప్రభా వం పడి నరాలు, కండరాల సమస్యలు, పక్షవాతం, బలహీనత లక్షణాలు ఎదురవుతాయి.
సాధారణ వ్యక్తుల్లో సైతం కండరాలు బిగుసుకుపోవడం, దృశ్య లోపాలు, పక్షవాతం సంభవించే అవకాశం ఉంటుంది. రక్తం, వీర్యం, జననాంగ స్రవాల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాధి సోకుతుంది. ఈ ఏడాది జూలైలో దేశంలో జికా వైరస్ కేసులు వెలుగు చూశాయి. దీంతో అప్పట్లో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక మార్గదర్శకాలను ఇచ్చింది. జికా వైరస్ సోకిన ప్రాంతాల్లోని గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ ఉంచాలని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment