మహారాష్ట్రలో జికా వైరస్ కేసులో ఆందోళన రేపుతున్నాయి. పుణెలో ఇప్పటి వరకు ఆరు కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ సోకిన వారిలో ఇద్దరు గర్బిణీలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మహారాష్ట్రలో జికా వైరస్ కేసుల పెరుగుల దృష్ట్యా అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీ చేసింది.
గర్భిణీ స్త్రీలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలను కోరింది. నిరంతరం వైరస్ పరీక్షలు నిర్వహించాలని తెలిపింది. జికా వైరస్ పాజిటివ్‌గా పరీక్షించిన తల్లుల పిండాల పెరుగుదలను పర్యవేక్షించడం ద్వారా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కోరింది.
బాధిత గర్భిణీ స్త్రీ పిండంలో జికా మైక్రోసెఫాలీ నాడీ సంబంధిత పరిణామాలతో సంబంధం కలిగి ఉన్నందున, పర్యవేక్షణ కోసం వైద్యులను అప్రమత్తం చేయాలని సూచించింది. ఇంటి ఆవరణలో ఏడిస్ దోమలు లేకుండా చూసేందుకు నోడల్ అధికారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించింది.
నివాస ప్రాంతాలు, కార్యాలయాలు, పాఠశాలలు, నిర్మాణ స్థలాలు, సంస్థలు, ఆరోగ్య సౌకర్యాల్లో కీటకాలు లేకుండా నిఘా పెంచాలని, నియంత్రణ కార్యకలాపాలను తీవ్రతరం చేయాలని రాష్ట్రాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
ప్రజల్లో భయాందోళనలను తగ్గించడానికి సోషల్ మీడియా, ఇతర ఫ్లాట్‌ఫారమ్‌లలో ముందు జాగ్రత్తగా సందేశాలు పంపి అవగాహన కల్పించాలని రాష్ట్రాలు కోరింది. కాగా జులై 1న పూణెలో ఇద్దరు గర్భిణులు సహా ఆరుగురికి జికా వైరస్ పాజిటివ్ తేలిన విషయం తెలిసిందే. అరంద్వానే ప్రాంతంలో నాలుగు, ముండ్వా ప్రాంతంలో రెండు కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
జికా వైరస్ సోకిన ఆడ ఎడిస్ దోమ కుట్టడం వల్ల వ్యాధి సంక్రమిస్తుంది. ఈ వైరస్‌ను తొలిసారి 1947లో ఉగాండా అడవుల్లోని ఓ కోతిలో గుర్తించారు. ఆ తర్వాత ఆఫ్రికన్ దేశాలతోసహా భారత్, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్, వియత్నాం లాంటి ఆసియా దేశాలకూ ఈ వ్యాధి వ్యాప్తి చెందింది. ఈ వైరస్ సోకినవారిలో జ్వరం, చర్మంపై దద్దుర్లు, కండరాలు, కీళ్ల నొప్పులు, తలనొప్పి, జీర్ణకోశ సంబంధ సమస్యలు, గొంతు నొప్పి, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment