
నాన్న.. పిల్లలకు కంటి రెప్ప, నాన్న.. పిల్లల భవిష్యత్ కు భరోసా, నాన్న..పిల్లలకు నడత నేర్పించే మార్గదర్శి.. అన్నింటీకి మించి నాన్న అంటే వెనుక ఉండి నడిపించే శక్తి. మరి అటువంటి నాన్న అత్యంత కర్కశంగా తన బిడ్డను చంపేసుకుంటే ఏమనాలి. రాక్షసుడు అనే పదం సరిపోదేమో. నాన్నే తన పాలిట రాక్షసుడై జీవితాన్నే ఛిదిమేస్తే.. ఆ నరక యాతన ఎంతలా ఉంటుంది. ‘నాన్నా.. నేనేం నేరం చేశాను’ అని అసువులు బాసేముందు మూగరోదన తప్ప.
ఈ తరహా ఘటనలు ఎన్నో ప్రతీ రోజూ ఏదొకటి మనకు తారసపడుతూనే ఉన్నాయి. తాజాగా మహారాష్ట్రలోని పుణెలో తన కన్న కొడుకునే పొట్టబెట్టుకున్నాడు తండ్రి.. అభం శుభం తెలియని మూడున్నరేళ్ల చిన్నారి బాలుడిని దారుణంగా చంపేశాడు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా చేస్తున్న ఆ తండ్రి.. ఆ బాలుడి పాలిట యముడయ్యాడు. భార్యపై అనుమానంతో కొడుకును హత్య చేశాడు.
అతి దారుణంగా హత్య..
ఆ బాలుడి గొంతును కోసేసి, ఆ తర్వాత అటవీ ప్రాంతంలో పడేశాడు కర్కశ తండ్రి. మాధవ్ తికేతీ, స్వప్నాలకు హిమ్మాత్ మాధవ్ ఒకే ఒక్క కొడుకు. ఎంతో గారంగా పెరగాల్సిన ఆ చిన్నారి.. తల్లి దండ్రుల మనస్పర్థలకు బలయ్యాడు. ఒకవైపు భార్యపై అనుమానం పెంచుకున్నాడు మాధవ్ తికేతి. ఇదే విషయంలో వీరిద్దరికి తీవ్రమైన ఘర్షణ ఈ గురువారం జరిగింది. దాంతో కొడుకును తీసుకుని వెళ్లిపోయాడు మాధవ్ తికేతి. అయితే తిరిగిరాలేదు.
కొడుకును హత్య చేసి పుణేలోని చందాన్ నగర్ ఫారెస్ట్ ఏరియాలో పడేశాడు. భర్త, కొడుకును తీసుకుని వెళ్లి ఇంకా తిరిగి రాలేదని భార్య స్వప్ప ఆందోళన చెందింది. పోలీసులకు సమాచారం అందించింది. దీనిపై మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆ పసిబాలుడు హత్యకు గురైనట్లు గుర్తించారు.
హత్య చేసిన రోజు’(గురువారం) ఇంటి నుంచి మధ్యాహ్నం గం. 12.30 నిం.లకు కొడుకును తీసుకుని బయటకు వెళ్లిన మాధవ్ తివేతి.. ఆ తరువాత అదే రోజు గం. 2.30ని.లకు ఒక చోట పిల్లాడితో కనిపించినట్లు సీసీ టీవీ ఫుటేజ్ లో నమోదైంది. ఆపై అదే రోజు గం. 5.30 ని.లకు ఒంటరిగా వస్త్ర దుకాణంలో దుస్తులు కొనుగోలు చేసినట్లు సీసీ టీవీల ఫుటేజ్ ల ఆధారంగా గుర్తించారు. అంటే ఆ బాలుడ్ని గం. 2.30ని.ల నుంచి గం. 5.30 ని.ల మధ్యలో హత్య చేసి ఫారెస్ట్ ఏరియాలో పడేశాడు.
దీనిపై గత రాత్రి(శుక్రవారం) ఆ బాలుడి తల్లి, మాధవ్ భార్య స్వప్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త.. కుమారుడిని తీసుకువెళ్లి ఇంటికి రాలేదని ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈరోజు(శనివారం) పిల్లాడు హత్య గావించబడిన విషయాన్ని గుర్తించారు. అదే సమయంలో మాధవ్‌ను అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకున్నారు. అయితే కొడుకును తానే చంపినట్లు మాధవ్ ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంకా కేసును దర్యాప్తు చేస్తున్నామని, హత్యా అభియోగాలు కింద కేసు కింద నమోదు చేసి విచారణ జరుపుతున్నామని ఒక సీనియర్ పోలీస్ అధికారి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment