గర్భనిరోధక మాత్రలు వాడే మహిళలూ... జాగ్రత్త!
కొత్త పరిశోధన
దీర్ఘకాలం పాటు గర్భనిరోధక మాత్రలు వాడే మహిళలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు డేనిష్ పరిశోధనవేత్తలు. హార్మోన్లతో కూడిన గర్భనిరోధక మాత్రలు వాడే మహిళలు వాటిని చాలాకాలం పాటు వాడుతుంటే వారిలో చాలామందికి ‘గ్లియోమా’ అనే అరుదైన మెదడు క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువని డేనిష్ పరిశోధనవేత్తలు పేర్కొంటున్నారు.
‘గ్లియోమా’ అనే మెదడు క్యాన్సర్‌తో బాధపడుతున్న 50 ఏళ్ల లోపు మహిళల్లో చాలా మందిని పరిశీలిస్తే, వారిలో 90% మంది గతంలో హార్మోనల్ కాంట్రసెప్టివ్ పిల్స్ (హార్మోన్లతో కూడిన గర్భనిరోధక మాత్రలు) వాడినవారేనని తేలింది. మాత్రలు వాడిన వ్యవధి పెరుగుతున్న కొద్దీ ‘గ్లియోమా’ రిస్క్ కూడా పెరుగుతుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఈ అధ్యయన ఫలితాలన్నీ ‘బ్రిటిష్ జర్నల్ ఆఫ్ క్లినికల్ ఫార్మకాలజీ’ అనే మెడికల్ జర్నల్‌లో ప్రచురితమైనట్లు పరిశోధనవేత్తలు వెల్లడించారు.