keemo theraphy
-
Health: ఆరోగ్యకరమైన కణాలకు నష్టం కలగకుండా.. క్యాన్సర్ కణానికే తగిలేంత కచ్చితత్త్వంతో..
క్యాన్సర్ కణాన్ని తుదముట్టించడానికి సర్జరీ, కీమో, రేడియేషన్ లాంటి ఎన్నో ప్రక్రియలున్నాయి. ఈ ప్రక్రియలన్నింటిలోనూ ఆరోగ్యకరమైన కణాలకు ఎంతోకొంత నష్టం జరిగే అవకాశముంది. మరీ ముఖ్యంగా కీమోలో. అదే క్యాన్సర్‌ను చంపేసే అదే రసాయనాన్ని చాలా కచ్చితత్త్వంతో కేవలం క్యాన్సర్ కణంపైనే ప్రయోగించేలా చూడగలిగితే...? అదే ‘ప్రెసిషన్ ఆంకాలజీ’!! అంటే క్యాన్సర్ కణానికే తగిలేంత కచ్చితత్త్వంతో రసాయనాన్ని గురిపెట్టి కొట్టడమనే ఆ ‘ప్రెసిషన్ ఆంకాలజీ’ అంటే ఏమిటో తెలుసుకుందాం. క్యాన్సర్ కణాలను తొలగించడానికి సర్జరీలు, రేడియేషన్, కిమో చికిత్సలు అందుబాటులో ఉన్నప్పటికీ... వాటిల్లో ఆరోగ్యవంతమైన కణాలకు ఎంతకొంత ముప్పు ఉంది కాబట్టి... ఆ అనర్థాలను తప్పిస్తూ... సరిగ్గా క్యాన్సర్ కణాన్నే గురిపెట్టేలాంటి (టార్గెట్ చేసేలాంటి) మందుల పైనా, చికిత్స ప్రక్రియలపైనా మొదట్నుంచీ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కచ్చితంగా క్యాన్సర్ కణాన్నే దెబ్బతీసేలాంటి చికిత్స కాబట్టి... దీన్ని ‘ప్రెసిషన్ ఆంకాలజీ’ అంటారు. కేవలం క్యాన్సర్ కణాన్నే లక్ష్యంగా చేసుకుంటుంది కాబట్టి టార్గెటెడ్ థెరపీ అంటున్నారు. భవిష్యత్తులో ఆరోగ్యకరమైన కణానికి ఏమాత్రం దెబ్బతగలకుండానో లేదా అత్యంత తక్కువగా నష్టం జరిగేలాగానో జరిగే మందులు రానున్నాయి. అది కూడా కొంత బాధాకరమైన కీమోలోలా రక్తనాళంలోకి ఎక్కించడం కాకుండా... సింపుల్‌గా నోటి ద్వారా తీసుకునే మాత్ర రూపంలో అందుబాటుకి ఇప్పటికే వచ్చాయి, ఇంకా రానున్నాయి. దెబ్బతిన్న జన్యువుకు గురిపెట్టి, క్యాన్సర్‌ను మొగ్గలోనే తుంచేయడం ఎలా? ఈ సహస్రాబ్దం మొదట్లో అంటే 2001లో మానవ జన్యుపటలాన్ని పూర్తిగా నిర్మించడం సాధ్యమైంది. ఈ జన్యుపటలంలో ని ఏ కణమైతే దెబ్బతిన్నదో, అది ఇష్టం వచ్చినట్లుగా అపరిమితంగా అనారోగ్యకరంగా పెరిగి క్యాన్సర్ గడ్డలకు కారణమవుతుంటుంది. ఇప్పుడు మొత్తం మానవ జన్యుపటలంలో సరిగ్గా నిర్దిష్టంగా ఏ కణం తాలూకు జన్యువు దెబ్బతిని, అక్కడ్నుంచి అది క్యాన్సర్‌గా మారుతుందో తెలుసుకుని, సరిగ్గా అపరిమితమైన కచ్చితత్త్వంతో దాన్ని మాత్రమే తుదముట్టించేలా ఔషధాన్ని ప్రయోగించామనుకోండి. అప్పుడు పెరగబోయే క్యాన్సర్ గడ్డను సమూలంగా నాశనం చేయడం సాధ్యమవుతుంది. దాంతో క్యాన్సర్ గడ్డ పెరగదు. ఇది స్థూలంగా ‘టార్గెటెడ్ థెరపీ’ తాలూకు సిద్ధాంతం. ఇందుకు ఉపయోగపడేదే ‘నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్’ తల్లిదండ్రుల తాలూకు వీర్యకణం, అండం కలిసి పిండం ఏర్పడి... అదే తర్వాత బిడ్డగా ఎదుగుతుంది. ఓ జీవరాశి కలిగి ఉన్న వ్యక్తికి కణం ఎలా మూలమో, ఓ కణానికి దాని తాలూకు జన్యువులు అలా మూలం. ఆ జన్యుపటలంలో ఏదైనా జన్యువు దెబ్బతిని ఉంటే... ఆ తర్వాతి తరం వ్యక్తిలో అది క్యాన్సర్‌కు కారణం కావచ్చు. అందుకే తర్వాతి తరం బిడ్డకు ఎలాంటి జీవకణాలు రాబోతున్నాయో తెలుసుకునేందుకు ఓ పరీక్ష ఉపయోగపడుతుంది. అదే ‘నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్’ పరీక్ష. దీన్నే సంక్షిప్తంగా ‘ఎన్జీఎస్’ అంటారు. దీనితో భవిష్యత్తులో బిడ్డపై క్యాన్సర్ వచ్చే అవకాశం ఎంతగా ఉందో తెలుస్తుంది. అలా క్యాన్సర్ గనకా వస్తే అది భారమే కదా. అందుకే ఆ భారాన్ని ‘ఎన్జీఎస్ ట్యూమర్ మ్యుటేషనల్ బర్డెన్’గా పేర్కొంటారు. ఇలా రాబోయే తరాల్లో ఎవరెవరికి క్యాన్సర్ రానుందో తెలుసుకుని... సరిగ్గా క్యాన్సర్‌ను కలగజేయబోయే ఆ నిర్దిష్ట జన్యువుకు తగిలేలా చికిత్స అందించడం అన్నదే ఈ ప్రక్రియ వెనకనున్న సిద్ధాంతం. ఈ ప్రెసిషన్ ఆంకాలజీ అన్నది కేవలం ఆరంభం మాత్రమే. భవిష్యత్తులో జన్యువు తీరును బట్టి ప్రత్యేకమైన చికిత్స (టైలర్ మేడ్) చికిత్సలూ సాధ్యం కానున్నాయి. అప్పుడు నొప్పి, బాధాలేని అనేక దీర్ఘకాలిక క్యాన్సర్లను తేలిగ్గా తగ్గించే రోజు త్వరలోనే రానుంది. ‘ప్రెసిషన్ ఆంకాలజీ’కి మంచి ఉదాహరణ ఊపిరితిత్తుల, రొమ్ము క్యాన్సర్ పదేళ్ల కిందట నాలుగో దశలోని లంగ్ క్యాన్సర్ అంటే ఇక అది మరణంతో సమానం. కేవలం 7 శాతం మంది మాత్రమే బతికేందుకు అవకాశం ఉండేది. కానీ ఇప్పడు ‘ప్రెసిషన్ ఆంకాలజీ’ ప్రక్రియ ద్వారా ఏ జన్యువులు దెబ్బతిన్నాయో వాటిని మార్చడం వల్ల బతికి బయటపడే వారు 40 శాతానికి పెరిగారు. పూర్తిగా ఆశవదిలేసుకున్న బాధితులు సైతం కనీసం ఐదేళ్లకు మించి ఆయుష్షు పొందారు. అంతేకాదు... వీళ్లు సాధారణ కీమోతో మిగతా అవయవాలకూ, కణాలకూ జరిగే నష్టాన్ని, తద్వారా వాళ్లకు కలిగే అమితమైన బాధనుంచి విముక్తమయ్యారు. రొమ్యు క్యాన్సర్ నుంచి విముక్తం కావడం కూడా ప్రెసిషన్ ఆంకాలజీకి ఓ మంచి ఉదాహరణ. ఈ క్యాన్సర్‌లో ‘హర్ 2’ అనేది ఓ రకం. దీనికి గురైనవారిలో తొలిదశలో క్యాన్సర్ కణాలు చాలా చురుగ్గా, దూకుడుగా పెరుగుతాయి. వేగంగా ఇతర కణాలకు వ్యాపిస్తాయి. అయితే అమితమైన కచ్చితత్త్వంతో మంచి కణాలను వదిలేసి, కేవలం క్యాన్సర్ కణాలను మాత్రమే దెబ్బతీసే టార్గెట్ థెరపీ మందులు రొమ్ముక్యాన్సర్ చికిత్సలో ఓ విప్లవాన్నే తీసుకొచ్చాయి. -డాక్టర్ సాద్విక్ రఘురామ్ వై. సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ –హెమటో ఆంకాలజిస్ట్ -
అకస్మాత్తుగా వాంతి ,ఫిట్స్ రావడం జరుగుతుందా.. ఆలస్యం చేయకండి
గడ్డ దేహంలో ఎక్కడ వచ్చినా అంత పెద్దగా సమస్య ఉండకపోవచ్చు గానీ... మెదడు నిర్వహించే కీలకమైన విధుల రీత్యా అక్కడ గడ్డలు వస్తే ప్రమాదంగా పరిణమించవచ్చు. అది క్యాన్సరస్ గడ్డ అయితే మరీ ప్రమాదం... కానీ ఒకవేళ అది క్యాన్సరస్ గడ్డ కాకపోయినప్పటికీ ఏదైనా అవయవాన్ని నియంత్రించే భాగాన్ని అది నొక్కివేస్తే... మన శరీరంలోని ఆ భాగం విధుల నిర్వహణలో తేడాలు రావచ్చు. దాంతో అవయవం ఆరోగ్యవంతంగా ఉన్నప్పటికీ... మెదడులో ఏర్పడ్డ గడ్డ కారణంగా దాని కదలికలు మందగించడం, అది చచ్చుబడిపోయినట్లుగా కావడం, పూర్తిగా పనిచేయకుండానే పోవడం జరుగుతుంది. మెదడులో గడ్డల వల్ల ఎదురయ్యే సమస్యలు, అందుబాటులో ఉన్న చికిత్సలను తెలుసుకుందాం. అసాధారణంగా పెరిగే కణజాలం ఓ గడ్డ ఆకృతి దాలుస్తుంది. ఆ గడ్డలే మెదడులో పెరిగితే వాటిని మెదడులో గడ్డల (బ్రెయిన్ ట్యూమర్స్)ని అంటారు. స్థూలంగా వీటిని రెండు రకాలుగా చెప్పవచ్చు. మొదటివి హానీ చేయని గడ్డలు (బినైన్). రెండోవి ప్రమాదకరమైన క్యాన్సర్ (మెలిగ్నెంట్) గడ్డలు. బినైన్ గడ్డల వల్ల సాధారణంగా మెదడుకు ప్రమాదం ఉండదు. మెల్లగా పెరుగుతాయి. గడ్డ ఏ మేరకు పెరిగిందనే విషయానికి తెలుసుకోడానికి వీలుగా దానికి స్పష్టమైన అంచులు ఉంటాయి కానీ క్యాన్సరస్ (మెలిగ్నెంట్) గడ్డలు నిర్దిష్టంగా ఫలానా చోటే అంతమైనట్లుగా స్పష్టమైన అంచులుండవు. పెరుగుదల వేగం కూడా చాలా ఎక్కువ. దాంతో అంచులు గుర్తించడానికి వీల్లేకుండా చుట్టుపక్కల కణజాలంలోకి చొచ్చుకుపోయేలా పెరుగుతాయి. బ్రెయిన్ ట్యూమర్ల పెరుగుదలకు సాధారణ కారణాలు... నిజానికి బ్రెయిన్ ట్యూమర్లు ఎందుకు పెరుగుతాయని చెప్పేందుకు నిర్దిష్టమైన కారణాలు లేకపోయినా... కొన్ని అంశాలు ట్యూమర్ పెరిగే ముప్పును పెంచుతాయి. అవి... రేడియేషన్: తరచూ రేడియోషన్‌కు ఎక్స్పోజ్ అయ్యేందుకు ఆస్కారం ఉన్న వృత్తుల్లో / పరిసరాల్లో ఉన్నవారికి మెదడులో గడ్డలు వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు చికిత్స కేంద్రాల్లో, వైద్య పరీక్ష కేంద్రాల్లో పనిచేసేవారికి, రేడియేషన్ వెలువడే పారిశ్రామిక ప్రాంతాల్లోని వారికి ఈ ముప్పు ఉంటుంది. జన్యుపరమైనవి: క్రోమోజోముల్లో వచ్చే కొన్ని మార్పులు మెదడులో గడ్డల పెరుగుదలను ప్రేరేపించవచ్చు. మానవుల్లో 23 జతల క్రోమోజోములు ఉంటాయన్న విషయం తెలిసిందే. వీటిల్లో... 1, 10, 13, 17, 19, 22 క్రోమోజోముల్లో ఏవైనా మార్పులు ఏర్పడినప్పుడు మెదడులో గడ్డలు వచ్చే ఆస్కారం ఎక్కువ. ఉదాహరణకు... 22వ క్రోమోజోములో మార్పుల వల్ల మెనింజియోమా తరహా గడ్డ ఏర్పడుతుంది. అయితే ఈ గడ్డ హానికరం కాదు. అయితే... 1, 19 క్రోమోజోముల్లో మార్పులొస్తే ఆలిగోడెండ్రోగ్లియోమా అనే క్యాన్సర్ గడ్డలు వచ్చే అవకాశం ఎక్కువ. కొన్ని రకాల జన్యుపరమైన లోపాలు ఉదాహరణకు న్యూరోఫైబ్రోమటోసిస్, వాన్ హిప్పెల్ లాండువా డిజీస్ వంటివి మెదడులో కణుతులకు కారణం కావచ్చు. మెదడులో ఏయే ప్రాంతాల్లో... ఎలాంటి సమస్యలు? మెదడులో గడ్డ వచ్చే ప్రాంతాన్ని బట్టి సమస్యలూ మారుతుంటాయి. ఉదాహరణకు... ఫ్రంటల్ లోబ్‌లో గడ్డలతో : కదలికల్లో లోపాలు తార్కికత లోపాలు ప్రవర్తనాలోపాలు జ్ఞాపకశక్తి మందగించడం నిర్ణయం తీసుకోలేకపోవడం వ్యక్తిత్వ లోపాలు ప్రణాళికలో లోపాలు విషయాలను సరిగ్గా అంచనా వేయలేకపోవడం తరచూ మారిపోయే మూడ్స్. పెరైటల్ లోబ్‌లో గడ్డలతో : విషయాలు సరిగా వివరించలేకపోవడం లెక్కలు సరిగా చేయలేకపోవడం స్పర్శజ్ఞానలోపం చదవలేకపోవడం రాయలేకపోవడం టెంపోరల్ లోబ్‌లో గడ్డలతో : భాషను అర్థం చేసుకోలేకపోవడం వినికిడి లోపాలు భావోద్వేగ పరమైన మార్పులు పిట్యూటరీ గ్రంథి ప్రాంతంలో గడ్డలవల్ల : హార్మోన్లలో మార్పులు ఎదుగుదల లోపాలు ప్రత్యుత్పత్తి లోపాలు / వంధ్యత్వం ఆక్సిపెటల్ లోబ్‌లో గడ్డలతో : చూపు మందగించడం సెరిబెల్లమ్ ప్రాంతంలో గడ్డలతో : శరీరాన్ని నిటారుగా ఉంచలేకపోవడం తూగుతూ నడవడం కొన్ని కండరాలపై నియంత్రణ కోల్పోవడం. బ్రెయిన్ స్టెమ్ ప్రాంతంలో గడ్డల వల్ల : శ్వాస సంబంధమైన లోపాలు రక్తపోటులో మార్పులు గుండె స్పందనల్లో మార్పులు మింగడంలో, మాట్లాడటంలో ఇబ్బందులు శస్త్రచికిత్స : బాధితులకు శస్త్రచికిత్స సిఫార్సు చేసే సందర్భాలు. వీలైనంత వరకు గడ్డను తొలగించేందుకు అవకాశం ఉండటం. గడ్డ ఏ తరహాకు చెందినదనే అంశం స్పష్టంగా, నిర్ధారణగా తెలిసిపోవడం. గడ్డను తొలగించడం అక్కడి ఒత్తిడి (ఇంట్రాక్రేనియల్ ప్రెషర్) తగ్గి మంచి ఉపశమనం లభిస్తుందని తెలిసినప్పుడు లేదా మిగతా గడ్డను రేడియేషన్ / కీమోథెరపీతో తేలిగ్గా నిర్మూలించగలమని తెలవడం. మైక్రోన్యూరోసర్జరీ : ఇటీవల అందుబాటులోకి వచ్చిన అధునాతన ఇమేజింగ్ (లోపలి గడ్డలను ఫొటో తీసి చూసే ప్రక్రియ), మైక్రోస్కోపిక్ విధానాలు, మ్యాపింగ్‌లతో న్యూరోసర్జన్లు అతి సూక్ష్మమైన గడ్డలను తొలగించగలుగుతున్నారు. గతంలో శస్త్రచికిత్స ద్వారా చేరలేని ప్రదేశాల్లోకి చేరుకుని సైతం కొన్ని గడ్డల తొలగింపు ఇప్పుడు సాధ్యమవుతోంది. రేడియేషన్ థెరపీ : మెదడులోని కొన్ని రకాల క్యాన్సర్ గడ్డలనూ / క్యాన్సర్ తరహాకు చెందని గడ్డలను తొలగించడానికి రేడియేషన్ థెరపీ మంచి మార్గం. ఇందులో గడ్డను పూర్తిగా నిర్వీర్యం చేయడంతో పాటు పెరుగుదలనూ అరికట్టవచ్చు. కీమో థెరపీ : చిన్న తరహా హానికరమైన గడ్డలూ (మెలిగ్నెంట్ ట్యూమర్స్)కు కీమోథెరపీ బాగా పనిచేస్తుంది. ఇక కొన్ని రకాల క్యాన్సర్ గడ్డలు రేడియేషన్ తో పాటు కీమోథెరపీ ఇస్తేనే చికిత్సకు బాగా లొంగుతాయి. కొన్నిసార్లు నేరుగా గడ్డలోకి మందు వెళ్లేలా కూడా కీమోథెరపీ ఇస్తారు.\ నిర్ధారణ కోసం చేసే వైద్య పరీక్షలు... సీటీ స్కాన్ : మెదడులో గడ్డలు ఉన్నట్లుగా అనుమానిస్తే తొలుత అవసరమైన పరీక్ష సీటీ స్కాన్. ఎమ్మారై : మెదడులో గడ్డ ఏ ప్రాంతంలో ఉంది, అది ఏ తరహాకు చెందినది, సైజు, అది మెదడులో ఏ మేరకు చొచ్చుకుపోయింది వంటి అంశాలపై స్పష్టంగా తెలిసే సమాచారంతో శస్త్రచికిత్స ప్రక్రియలో కూడా ఎమ్మారై టెక్నిక్ చాలా ఉపయోగపడుతుంది. పెట్ స్కాన్ : వాస్తవ గడ్డలకూ, గడ్డలుగా కనిపించేవాటికి (ట్యూమర్స్కూ, నాన్ట్యూమర్స్కు) మధ్య తేడాలు తెలిపేందుకు ఉపయోగపడే పరీక్ష. లక్షణాలు గడ్డ మెదడులోని ఏ ప్రాంతంలో వచ్చిందన్న అంశంపై ఆధారపడి ఈ లక్షణాలు మారుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మెదడులో గడ్డ ఉన్నప్పటికీ బయటకు ఎలాంటి లక్షణాలూ కనిపించకపోవచ్చు.సాధారణ లక్షణాలివి... నలభై ఏళ్లకు పైబడిన వారిలో లేదా ఆరేళ్లలోపు వారిలో తీవ్రమైన తలనొప్పి అకస్మాత్తుగా వాంతి కావడం ∙ఫిట్స్ రావడం మెదడులో గడ్డ వచ్చిన ప్రదేశాన్ని బట్టి... స్పర్శజ్ఞానం కోల్పోవడం లేదా ఏదైనా అవయవపు కదలికల్లో మార్పులు చూపు మసగ్గా మారడం మాట ముద్దగా రావడం లేదా మాటలో స్పష్టత లేకపోవడం డిప్రెషన్ ప్రవర్తనలో మార్పులు..హార్మోన్ స్రావాల్లోనూ మార్పులు (ఎండోక్రైన్ డిస్ఫంక్షన్). మందులతో చేసే చికిత్స గడ్డ ఉన్న ప్రాంతంల్లోని వాపు తగ్గించడానికి కొన్నిసార్లు స్టెరాయిడ్స్‌తో చికిత్స అందిస్తారు. దీనివల్ల రోగికి తలనొప్పి వంటివాటితో పాటు ఇతర భౌతిక లక్షణాలూ తగ్గుతాయి.గడ్డల కారణంగా ఫిట్స్ వస్తే వాటిని తగ్గించేందుకు మందులు ఇస్తారు. -
యుద్ధం ముగిసిపోలేదు!
నటి సోనాలీ బింద్రే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. కొంతకాలంగా ఆమె న్యూయార్క్‌లో ఉంటూ కీమోథెరపీ చేయించుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో తన అనుభూతులను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటుంటారు. తాజాగా తాను ముంబై రానున్నట్లు సోషల్ మీడియా ద్వారా ఓ పోస్ట్‌ను షేర్ చేశారామె. దాని సారాంశం ఇలా ఉంది.. ‘‘ఇంటికి దూరంగా న్యూయార్క్‌లో ఉన్నప్పుడు చాలా విభిన్నమైన స్టోరీలు నా చుట్టూ ఉన్నాయని తెలుసుకున్నాను. దేనికదే విభిన్నం. నా స్టోరీలో భాగంగా ఇప్పుడు నేను ఇంటికి వెళుతున్నాను. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేక పోతున్నాను. నేను న్యూయార్క్‌లో ఉన్నప్పటికీ నా మనసు మాత్రం నా కుటుంబసభ్యులు, స్నేహితుల మధ్యనే ఉంది. వారందర్నీ తిరిగి కలవబోతున్నందుకు హ్యాపీగా ఉంది. నా యుద్ధం ఇంకా ముగిసిపోలేదు (క్యాన్సర్ చికిత్సను ఉద్దేశిస్తూ). కానీ హ్యాపీగానే ఉన్నా. ఈ హ్యాపీ ఇంట్రవెల్ కోసం ఎదురుచూస్తున్నాను. ఇప్పుడు మరికొన్ని కొత్త విషయాలు నేర్చుకోవాల్సిన సమయం వచ్చింది. జీవితంలో నేను చేసే సాహసాలు ఇంకా కొనసాగుతూనే ఉంటాయి’’ అన్నారు సోనాలి. -
నాతో పాటు మీరూ చదువుతారు కదూ?
క్యాన్సర్ వ్యాధికి న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్నారు నటి సోనాలీ బింద్రే. తన ఆరోగ్య విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారామె. ప్రస్తుతం ఎక్కువ సమయాన్ని పుస్తకాలు చదవడానికే కేటాయిస్తున్నారు. అయితే, ఈ మధ్య పుస్తకాలు చదవడానికి చాలా కష్టంగా ఉంటోంది అంటున్నారామె. ‘‘ఇంతకు ముందు చదివిన పుస్తకాన్ని పూర్తిచేయడానికి చాలా సమయం పట్టింది. కీమో థెరపీ వల్ల కంటి చూపు సరిగ్గా సహకరించడం లేదు. అందుకే పుస్తకాలు చదవడానికి కొంచెం విరామం ఇచ్చాను. ఇప్పుడు మళ్లీ మామూలుగానే ఉంది. ‘ఎ లిటిల్ లైఫ్’ అనే కొత్త పుస్తకం చదవడం మొదలెట్టాను. నాతో పాటు మీరూ చదువుతారు కదూ’’ అంటూ ఈ ఫొటో పోస్ట్ చేశారు. -
ఆదర్శం... ఆ ముగ్గురి ధైర్యం..!
చిన్నపాటి తలనొప్పికే చాలామంది పెద్ద రోగం ఏదో వచ్చినట్లుగా బాధపడిపోతారు. ఇక, మెల్లి మెల్లిగా శరీరాన్ని తినేసే కేన్సర్ అంటే, ఆ బెంగతోనే తనువు చాలించేస్తారు కొంతమంది. కానీ, గౌతమి, మమతా మోహన్‌దాస్, మనీషా కొయిరాలా అలాంటివాళ్లు కాదు. బ్రెస్ట్ కేన్సర్ అని తెలియగానే గౌతమి బెంబేలుపడిపోలేదు. దశలవారీగా ఎంతో ఓపికగా చికిత్స చేయించుకున్నారు. కీమోథెరపీ కూడా జరిగింది. జీవితంలో బాధాకరమైన ఆ రోజులను ఓ సవాల్‌గా తీసుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో బయటపడ్డారామె. తన ఆరోగ్యం బాగుపడిందని ఆమె సంతృప్తి చెందలేదు. కేన్సర్ వ్యాధి పట్ల అవగాహన కల్పించడానికి నడుం బిగించారు. అప్పట్నుంచి ఈ రోగానికి సంబంధించిన సదస్సులకు హాజరై, చికిత్సా విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తున్నారు. ఇక, మమతా మోహన్‌దాస్ కూడా మానసికంగా ఎంతో ధైర్యవంతురాలు. సినిమాలతో తీరిక లేకుండా ఉన్నప్పుడే, కేన్సర్ విషయం బయటపడింది. ఓసారి చికిత్స చేయించుకుని, ఇక భయం లేదనుకున్నారామె. రెండోసారి తిరగబెట్టింది. మామూలుగా బలహీన మనస్కులైతే కుంగిపోతారు. కానీ, మమత ఈసారి కూడా ధైర్యంగా ఢీకొన్నారు. ఇటీవలే చికిత్స ముగిసింది. ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారామె. మనీషా కొయిరాలా కూడా డాషింగే. ఒవేరియన్ కేన్సర్ సోకిందామెకు. ముంబయ్‌లో పరీక్షల అనంతరం యూఎస్ వెళ్లి, చికిత్స చేయించుకున్నారు ఈ నేపాలీ బ్యూటీ. ఇటీవలే కొత్త జీవితాన్ని ఆరంభించారు. తమలా కేన్సర్ మహమ్మారికి గురైనవారిలో ఆత్మవిశ్వాసం పెంచడమే ఈ ముగ్గురి ప్రధాన లక్ష్యం. కేన్సర్ వ్యాధికి సంబంధించిన అవగాహనా సదస్సుల్లో పాల్గొని, తమ అనుభవాలను వివరిస్తుంటారు. ఈ ముగ్గురు కథానాయికలూ ఎంతోమందికి ఆదర్శప్రాయం.