ఆదర్శం... ఆ ముగ్గురి ధైర్యం..!
చిన్నపాటి తలనొప్పికే చాలామంది పెద్ద రోగం ఏదో వచ్చినట్లుగా బాధపడిపోతారు. ఇక, మెల్లి మెల్లిగా శరీరాన్ని తినేసే కేన్సర్ అంటే, ఆ బెంగతోనే తనువు చాలించేస్తారు కొంతమంది. కానీ, గౌతమి, మమతా మోహన్‌దాస్, మనీషా కొయిరాలా అలాంటివాళ్లు కాదు. బ్రెస్ట్ కేన్సర్ అని తెలియగానే గౌతమి బెంబేలుపడిపోలేదు. దశలవారీగా ఎంతో ఓపికగా చికిత్స చేయించుకున్నారు.
కీమోథెరపీ కూడా జరిగింది. జీవితంలో బాధాకరమైన ఆ రోజులను ఓ సవాల్‌గా తీసుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో బయటపడ్డారామె. తన ఆరోగ్యం బాగుపడిందని ఆమె సంతృప్తి చెందలేదు. కేన్సర్ వ్యాధి పట్ల అవగాహన కల్పించడానికి నడుం బిగించారు. అప్పట్నుంచి ఈ రోగానికి సంబంధించిన సదస్సులకు హాజరై, చికిత్సా విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తున్నారు. ఇక, మమతా మోహన్‌దాస్ కూడా మానసికంగా ఎంతో ధైర్యవంతురాలు. సినిమాలతో తీరిక లేకుండా ఉన్నప్పుడే, కేన్సర్ విషయం బయటపడింది. ఓసారి చికిత్స చేయించుకుని, ఇక భయం లేదనుకున్నారామె. రెండోసారి తిరగబెట్టింది. మామూలుగా బలహీన మనస్కులైతే కుంగిపోతారు. కానీ, మమత ఈసారి కూడా ధైర్యంగా ఢీకొన్నారు. ఇటీవలే చికిత్స ముగిసింది. ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారామె.
మనీషా కొయిరాలా కూడా డాషింగే. ఒవేరియన్ కేన్సర్ సోకిందామెకు. ముంబయ్‌లో పరీక్షల అనంతరం యూఎస్ వెళ్లి, చికిత్స చేయించుకున్నారు ఈ నేపాలీ బ్యూటీ. ఇటీవలే కొత్త జీవితాన్ని ఆరంభించారు. తమలా కేన్సర్ మహమ్మారికి గురైనవారిలో ఆత్మవిశ్వాసం పెంచడమే ఈ ముగ్గురి ప్రధాన లక్ష్యం. కేన్సర్ వ్యాధికి సంబంధించిన అవగాహనా సదస్సుల్లో పాల్గొని, తమ అనుభవాలను వివరిస్తుంటారు. ఈ ముగ్గురు కథానాయికలూ ఎంతోమందికి ఆదర్శప్రాయం.