ఉదయం వేళలో ఎక్కువగా తలనొప్పి..! | Neuro counseling | Sakshi
Sakshi News home page

ఉదయం వేళలో ఎక్కువగా తలనొప్పి..!

Published Sat, May 14 2016 1:42 PM | Last Updated on Sat, Oct 20 2018 7:38 PM

ఉదయం వేళలో ఎక్కువగా తలనొప్పి..! - Sakshi

ఉదయం వేళలో ఎక్కువగా తలనొప్పి..!

న్యూరో కౌన్సెలింగ్


మా బాబు వయసు 12 ఏళ్లు. ఈమధ్య వాడికి ఉదయం పూట తీవ్రమైన తలనొప్పి వస్తోంది. దాంతోపాటు వాంతులు కూడా అవుతున్నాయి. రోజురోజూకూ నొప్పి పెరుగుతోంది. ఇంటి దగ్గర డాక్టర్‌కు సంప్రదిస్తే మందులు రాసిచ్చారు. వాడాము. కానీ ఏమాత్రం తగ్గలేదు. దీంతో స్పెషలిస్ట్‌ను కలిశాం. పిల్లాడికి బ్రెయిన్ ట్యూమర్ ఉందేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. మాకు విపరీతమైన బెంగ పట్టుకుంది. బ్రెయిన్ సీటీ చేయించమని సలహా ఇచ్చారు. రిపోర్ట్స్ బట్టి నిర్ధారణకు రాగలమని అంటున్నారు. అసలు బ్రెయిన్ ట్యూమర్ ఎందుకు వస్తుంది? అది నయం చేయలేని వ్యాధా? ఒకవేళ మా బాబుకు బ్రెయిన్ ట్యూమర్ అని తేలితే వాడి భవిష్యత్తు ఏమిటి? దయచేసి మాకు తగిన సలహా ఇవ్వండి.  - జయలక్ష్మి, సోమాజీగూడ

మీరు చెబుతున్న లక్షణాలు కొంచెం ఆందోళనకరంగానే ఉన్నాయి. మీరు ఎంతమాత్రమూ ఆలస్యం చేయకుండా బ్రెయిన్ సీటీ తీయించుకని డాక్టర్‌ను కలవండి. ఈమధ్యకాలంలో బ్రెయిన్ ట్యూమర్ అనేది పిల్లల్లో కూడా చలా ఎక్కువగా మనకు కనపడుతోంది. ఈ ట్యూమర్ కణజాలం మెదడులో అసాధారణంగా పెరుగుతూ దాని పనితీరును అడ్డుకుంటుంది. దానివల్ల మెదడుపై ఒత్తిడి పెరిగి అది తలనొప్పి రూపంలో బయటపడుతుంది. క్రమేణా మెదడుపై ఒత్తిడి తీవ్రమవుతున్న కొద్దీ తలనొప్పి భరించలేనంతగా పెరుగుతుంది. అంతేకాకుండా దీనికి వాంతులు కూడా తోడవుతాయి.

బ్రెయిన్ ట్యూమర్ బారిన పడ్డవాల్లకు మీరు చెప్పిన లక్షణాలు ఉదయం పూట ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇలాంటి సమయంలో వెంటనే డాక్టర్‌ను సంప్రదిస్తే వారు తగిన పరీక్షలు చేయించి, బాబుకు అందించాల్సిన చికిత్స విషయంలో తగిన నిర్ధారణకు రాగలుగుతారు. మీరు ఆందోళన చెందుతున్నట్లుగా బ్రెయిన్ ట్యూమర్ అనేది అంత భయపడాల్సిన వ్యాధి కాదు. కాకపోతే మెదడులో ట్యూమర్ ఉన్న స్థానం, దాని పరిమాణం అనే అంశాలను బట్టి చికిత్స, ఫలితాలు ఉంటాయి. అన్ని ట్యూమర్లూ ప్రాణాంతకమైనవి కావు.

క్యాన్సర్ కారకాలు కావు. మీ అబ్బాయికి ట్యూమర్ మొదటి దశలోనే ఉంటే, దానిని సమూలంగా తొలగించవచ్చు. ఇప్పుడు అందుబాటులో ఉన్న అత్యాధునిక బ్రెయిన్ సర్జరీ ప్రక్రియలతో, నిపుణులైన న్యూరో సర్జన్ ఆధ్వర్యంలో శస్త్రచికిత్స జరిగితే మీ బాబుకు వచ్చిన సమస్యనూ పూర్తిగా నయం చేయవచ్చు. మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదు.
- డాక్టర్ పి.రంగనాథమ్ సీనియర్ న్యూరో సర్జన్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్
 
కిడ్నీ కౌన్సెలింగ్
నా వయసు 35 ఏళ్లు. నాకు ఏ విధమైన ఇబ్బందులూ లేవు. కానీ జ్వరం వచ్చినప్పుడు ఒకసారి డాక్టర్‌కు చూపించుకుంటే బీపీ 170 / 120 అని చెప్పి, మందులు వాడాలన్నారు. మందులు వాడకపోతే భవిష్యత్తులో కిడ్నీ సమస్య వచ్చే అవకాశం ఉందా?  - రవిందర్, పాల్వంచ

 
ఈ వయసులో ఏ కారణం లేకుండా బీపీ రావడం చాలా అరుదు. ముఫ్ఫై ఏళ్లలోపు బీపీ ఇంత ఎక్కువగా ఉన్నప్పుడు కిడ్నీ సమస్య ఏమైనా ఉందేమోనని చూడాలి. మీరు ముందుగా యూరిన్ టెస్ట్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్, క్రియాటినిన్‌తో పాటు కొన్ని ఇతర పరీక్షలు చేయించుకోండి. ఏ లక్షణాలూ లేనప్పటికీ బీపీ నియంత్రణలో ఉండటానికి మందులు వాడాలి. లేకపోతే భవిష్యత్తులో కిడ్నీ దెబ్బతినే అవకాశం ఉంది. మందులు వాడటమే కాకుండా, ఆహారంలో ఉప్పు తగ్గించడం వంటి జీవనశైలికి సంబంధించిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. రోజూ క్రమం తప్పకుండా ఒక గంటకు తగ్గకుండా వాకింగ్ చేయాలి. బరువు ఎక్కువగా ఉన్నట్లయితే, మీ ఎత్తుకు తగినట్లుగా దాన్ని నియంత్రించుకోవాలి. పొగతాగే అలవాటు ఉంటే తప్పనిసరిగా మానేయాలి.
 
నా వయసు 32 ఏళ్లు. గత ఐదేళ్ల నుంచి అప్పుడప్పుడు మూత్రం ఎర్రగా వస్తోంది. ప్రతిసారి రెండు మూడు రోజుల తర్వాత తగ్గిపోతోంది. నొప్పి ఏమీ లేదు. ఇలా రావడం వల్ల భవిష్యత్తులో నాకు ఏదైనా సమస్య వస్తుందా? ఈ లక్షణాలు కనిపిస్తున్నాయంటే కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉందా? - అప్పారావు, నరసన్నపేట
 
మీరు చెప్పినట్లుగా మూత్రంలో చాలాసార్లు రక్తం పోతూ ఉంటే, ఏ కారణం వల్ల అలా జరుగుతోందన్న విషయాన్ని తెలుసుకుని, దానికి అనుగుణంగా చికిత్స తీసుకోవాలి. ఇలా జరగడానికి కిడ్నీలో రాళ్లు గానీ, ఇన్ఫెక్షన్ గానీ, లేదా కిడ్నీ సమస్యగానీ ఉండటం కారణం కావచ్చు. ఒకసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్‌తో పాటు మూత్రపరీక్ష చేయించుకోండి. కిడ్నీలో రాళ్లుగానీ, ఇన్ఫెక్షన్‌గానీ లేకుండా ఇలా రక్తం పోతూ ఉంటే మూత్రంలో ప్రోటీన్ పోతుందేమో అని పరీక్ష చేయించుకోవాలి. రక్తంతో పాటు ప్రోటీన్లు కూడా మూత్రంతో పాటు పోతూ ఉంటే, కిడ్నీ బయాప్సీ చేయించుకొని, ఆ రిపోర్టులను బట్టి కిడ్నీలు దెబ్బతినకుండా మందులు వాడాల్సి ఉంటుంది.
 - డాక్టర్ విక్రాంత్‌రెడ్డి  కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్
 
పల్మునాలజీ కౌన్సెలింగ్
మా అబ్బాయి వయసు 12 ఏళ్లు. అతడు ఎప్పుడూ పొడి దగ్గుతో బాధపడుతున్నాడు. గత రెండు నెలలుగా కొద్దిపాటి జ్వరం ఉంటోంది. వాడికి శ్వాస సరిగా ఆడటం లేదు. మాకు దగ్గర్లోని డాక్టర్‌ను సంప్రదించి మందులు వాడినా సమస్య తగ్గడం లేదు. మావాడి సమస్యకు పరిష్కారం చెప్పండి. - సీతారామయ్య, కొత్తగూడెం

 
మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ అబ్బాయి కాఫ్ వేరియంట్ ఆస్తమాతో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. ఇది ఆస్తమాలోనే ఒక రకం. ఇది వచ్చిన వారిలో  తెమడ వంటివి పడకుండా పొడిదగ్గు వస్తూ ఉంటుంది. పిల్లికూతలు లాంటి లక్షణాలు కూడా మొదట్లో ఉండవు. దీన్నే ‘క్రానిక్ కాఫ్’ (దీర్ఘకాలిక దగ్గు) అని కూడా అంటారు. రాత్రీ పగలూ  తేడా లేకుండా దాదాపు రెండు నెలలపాటు దగ్గుతుంటారు. దాంతో రాత్రివేళ  నిద్ర కూడా పట్టదు. ఈ రోగులు తమకు సరిపడని ఘాటైన వాసనలు, దుమ్ము, ధూళి వంటి వాటికి ఎక్స్‌పోజ్ అయితే ఆ అలర్జెన్స్ ఆస్తమాను మరింతగా ప్రేరేపిస్తాయి.  

కాఫ్ వేరియెంట్ ఆస్తమా సమస్య ఎవరికైనా, ఏ వయసులోనైనా రావచ్చు. ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఇది ఎక్కువ. ఇది ఆ తర్వాత సాధారణ ఆస్తమాకు దారితీస్తుంది. అంటే శ్వాస అందకపోవడం, పిల్లికూతలు వంటి లక్షణాలు తర్వాతి దశలో కనిపిస్తాయి. సాధారణ ఆస్తమా లాగే కాఫ్ వేరియెంట్ ఆస్తమాకు కూడా కారణాలు అంతగా తెలియవు. కాకపోతే సరిపడని పదార్థాలు, చల్లగాలి దీనికి కారణాలుగా భావిస్తుంటారు. కొందరిలో అధిక రక్తపోటు, గుండెజబ్బులు, హార్ట్‌ఫెయిల్యూర్, మైగ్రేన్, గుండెదడ (పాల్పిటేషన్స్) వంటి జబ్బులకు వాడే మందులైన బీటా-బ్లాకర్స్ తీసుకున్న తర్వాత ‘కాఫ్ వేరియెంట్ ఆస్తమా’ మొదలు కావచ్చు.

కొందరిలో గ్లకోమా వంటి కంటిజబ్బులకు వాడే చుక్కల మందులోనూ బీటా బ్లాకర్స్ ఉండి, అవి కూడా ఆస్తమాను ప్రేరేపిస్తాయని కూడా అధ్యయనాలు చెబుతున్నాయి. కొందరిలో ఆస్పిరిన్ సరిపడకపోవడం వల్ల కూడా దగ్గుతో కూడిన ఆస్తమా రావచ్చు. కాఫ్ వేరియెంట్ ఆస్తమాలో కేవలం దగ్గు తప్ప ఇతర లక్షణాలేమీ కనిపించకపోవడం వల్ల దీని నిర్ధారణ ఒకింత కష్టమే. ఎందుకంటే కాఫ్ వేరియెంట్ ఆస్తమా విషయంలో సాధారణ పరీక్షలైన ఛాతీఎక్స్‌రే, స్పైరోమెట్రీ వంటి పరీక్షలూ నార్మల్‌గానే ఉంటాయి. మీరు వెంటనే మీకు దగ్గర్లో ఉన్న ఛాతీ నిపుణుడిని కలవండి.  వారు కొన్ని వైద్య పరీక్షలు చేయించి, వ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాత తగిన చికిత్స సూచిస్తారు.
 - డా. రమణ ప్రసాద్ ..కన్సల్టెంట్ పల్మునాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్ కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్
 
మా చిరునామా: వైద్యసలహా కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్- 34. ఈ మెయిల్: asksakshidoctor@gmail.com

 
నిర్వహణ: యాసీన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement