Neurological Disabilities
-
COVID-19 Vaccination టీకాతో సమస్యలు నిజం!
కొవిడ్-19 వాక్సినేషన్, గుండెపై ప్రభావానికి అనేక వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజా పరిశోధన సంచలన విషయాలను వెల్లడించింది. వివిధ దేశాల్లో ఈ టీకా తీసుకున్న వారిలో(భారత్ మినహా) గుండె సమస్యలు, మెదడు, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వంటి దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. గులియన్ బారే సిండ్రోమ్, మయోకార్డిటిస్, పెర్కిర్డిటిస్ , సెరిబ్రల్ వీనస్ సైనస్ థ్రాంబోసిస్ (CVST) లాంటి కేసులు కనీసం 1.5 రెట్లు పెరిగాయని ఈ స్టడీ వెల్లడించింది. బ్లూమ్‌బెర్గ్ న్యూస్ నివేదిక ప్రకారం, ఆక్లాండ్ విశ్వవిద్యాలయంలో COVID-19 టీకాతో తీవ్ర ప్రమాదం ఉందో లేదో నిర్ధారించేందుకు ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద వ్యాక్సిన్ అధ్యయనం అని తెలుస్తోంది. భారత్ మినహా, వివిధ దేశాల్లో 9.9 కోట్లమంది వాక్సిన్ తీసుకున్న వారిని విశ్లేషించారు. 13 రకాల ప్రభావాలను పరీశీలించారు. వివిధ దేశాల్లో 9.9 కోట్లమందిలో ద గ్లోబల్ కొవిడ్ సేఫ్టీ ప్రాజెక్ట్ పేరుతో ఈ పరిశోధన నిర్వహించింది. Rakul-Jackky Wedding : జాకీ స్పెషల్ సర్ప్రైజ్, ఫోటోలు వైరల్ ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ తాజా పరిశోధన కీలక డాటా సేకరించింది. మోడర్నా(mRNA),కోవిషీల్డ్ (ChadOX1) వ్యాక్సిన్ల తర్వాత ఊహించిన దానికంటే ఎక్కువ దుష్ప్రభావాలున్నాయని కనుగొంది. ముఖ్యంగా ఆస్ట్రాజెనెకా కోవిడ్-19 టీకా తీసుకున్నవారిలో చాలా అరుదైన రక్తం గడ్డకట్టే ప్రమాదం ఎక్కువగా ఉందని అధ్యయనం పేర్కొంది. రోగనిరోధక వ్యవస్థ నరాలపై దాడి చేసే Guillain-Barre సిండ్రోమ్‌ను గుర్తించారు ఇది కండరాలకు తీవ్ర హాని కలిగించవచ్చు, సుదీర్ఘ చికిత్స తీసుకోవాలి. ఒక్కోసారి ప్రాణాంతకం కావచ్చు. ఈ టీకా డోస్ తీసుకున్న వారిలో 6.9 రెట్లు ఎక్కువ ప్రమాదం ఉందని అధ్యయనం కనుగొంది. వెడ్డింగ్ సీజన్: ఇన్స్టెంట్ గ్లో, ఫ్రెష్ లుక్ కావాలంటే..! కోవిషీల్డ్ వ్యాక్సిన్‌తో గుండెపై తీవ్ర దుష్ప్రభావాలు, గుండెపోటు,పక్షవాతం,రక్తంలో గడ్డకట్టడం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో గుండె సమస్యలు, మెదడు రక్తనాళాల్లో గడ్డకట్టడం వంటివి 1.5 రెట్లు పెరిగాయట. ఈ తరహా టీకాలే భారత్‌లోనూ పెద్ద సంఖ్యలో తీసుకున్నారని, దీని ప్రభావం ఏంటన్నది మాత్రం శాస్త్రీయంగా బయటకు రాలేదనినిపుణులు చెబుతున్నారు. గ్లోబల్ కోవిడ్ వ్యాక్సిన్ సేఫ్టీ ప్రాజెక్ట్ కింద అర్జెంటీనా, న్యూ సౌత్ వేల్స్ , ఆస్ట్రేలియాలోని విక్టోరియా, బ్రిటిష్ కొలంబియా , కెనడా, డెన్మార్క్‌లోని అంటారియోతో సహా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, న్యూజిలాండ్ , స్కాట్లాండ్ పలు ప్రదేశాల్లో డి COVID-19 వ్యాక్సిన్లకు సంబంధించిన ప్రతికూల సంఘటనలపై ఎలక్ట్రానిక్ హెల్త్‌కేర్ డేటాను సేకరించింది. కాగా కరోనా మహమ్మారి ప్రారంభం తరువాత ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 13.5 బిలియన్ల కంటే ఎక్కువ టీకాలు తీసుకున్నట్టు సమాచారం. అయితే ఈ పరిశోధనపై వాక్సిన్ తయారీదారులు ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. -
మరోమారు సీఎం జగన్ మానవత్వం
సాక్షి, కడప: ఆపదలో ఉన్న ఓ అభాగ్యుడి కుటుంబానికి భరోసా కల్పించడం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. రోజూ కూలి పనికి వెళ్తూ జీవనం సాగిస్తున్న తనకు పెద్ద ఆపద వచ్చి పడిందని, తన కుమారుడు నరసింహ (12) నరాల సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నాడని భూమాయపల్లె గ్రామానికి చెందిన ఓబులేసు కడప పర్యటనలో ఉన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో శుక్రవారం గోడు వెళ్లబోసుకున్నాడు. వెంటనే స్పందించిన సీఎం.. బాలుడికి మెరుగైన చికిత్స కోసం ఎంత ఖర్చు అయినా ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. మంచి చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. తక్షణ సాయంగా రూ.లక్ష ఇవ్వాలని చెప్పారు. సీఎం మేలును తాము జీవితాంతం మరచిపోమని బాధిత కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది. చదవండి: (ఇదే నా రాష్ట్రం.. ఇక్కడే నా నివాసం) -
ట్విన్స్ పుట్టారన్న ఆనందం మాయదారి రోగంతో మాయం, 17 ఏళ్లొచ్చినా!
17 ఏళ్లు అయినా ఇంకా పసిపిల్లల్లా పాకుతూనే ఉన్న కన్నబిడ్డల్ని చూసి తల్లిడిల్లిపోతున్న తల్లితండ్రుల ఆవేదన ఇది.. ‘మేమిద్దరం మాకిద్దరం’ అన్నట్టుగా ఇద్దరు కవల పిల్లలతోపాటు నలుగురు కుటుంబ సభ్యులూ హ్యాపీగా జీవితాన్ని గడుపుతున్నారు. కానీ మాయదారి వ్యాధి వారి జీవితాల్లో కల్లోలం నింపింది. దీంతో తమ కన్నబిడ్డల్ని ఎలాగైనా కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. దామోదరన్, అతని భార్యకు ఇద్దరు మగపిల్లలు కవలలుగా జన్మించారు. వారికి అల్లారుముద్దుగా రామర్ , లక్ష్మణన్ అని పేరు పెట్టుకున్నారు. పుట్టిన కొన్ని నెలల వరకు కుటుంబం అంతా ఆనంద క్షణాలను ఆస్వాదించారు. కానీ.. నెలలు పెరిగే కొద్దీ తమ బిడ్డల్లో ఎదుగుదల లోపం ఉన్నట్టు గుర్తించారు. సరైన చికిత్స అందించేందుకు ఎన్నో ఆస్పత్రులు చుట్టూ తిరిగారు. చివరికి వైద్యులు చెప్పిన సంగతి విని దామోదరన్ దంపతులు నిలువునా కుంగిపోయారు. భవిష్యత్తు భయంకరంగా తోచి వణికిపోయారు. ‘స్పాస్టిక్ డిప్లెజియా’ అనే అరుదైన వ్యాధి కారణంగానే వారికిలా జరుగుతోందని వైద్యులు నిర్ధారించారు. స్పాస్టిక్ డిప్లెజియా సెరిబ్రల్ పాల్సీ చిన్నపిల్లల్లో మెదడుకు వచ్చే అరుదైన పక్షవాతం. బాల్యంలో లేదా చిన్నతనంలో ఈ వ్యాధి కనిపిస్తుంది. ఇది కండరాల నియంత్రణ , సమన్వయాన్ని శాశ్వతంగా ప్రభావితం చేస్తుంది. మెదడు ఎదుగుదల సరిగా లేకపోవడం వల్లనే చూపు కూడా మందగించింది. వారి స్వంతంగా ఏమీ చేసుకోలేకపోతున్నారు. నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. కవలలకు చికిత్సకు రూ. 6,00,000 ($7359.03) ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో దామెదరన్ దంపతులు ఆందోళనలో పడిపోయారు. 65 ఏళ్ల రోజుకూలీగా పనిచేస్తున్న దామోదరన్ కూడా కొన్ని అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. అయినా ఉన్నదంతా తెగనమ్మి బిడ్డలకు వైద్యం చేయించారు. చికిత్స కోసం ఆసుపత్రుల చుట్టే తిరుగుతుండటంతో ఉన్న ఆ కాస్త రాబడి కూడా లేదు. మరోవైపు అప్పులు, వైద్య బిల్లులు కొండలా పేరుకు పోయాయి. ఈ నేపథ్యంలో దాతలు పెద్దమనసుతో తమను ఆదుకోవాలని కోరుతున్నారు దామోదరన్ దంపతులు. రోజులు గడిచే కొద్దీ, నిమిష నిమిషానికీ తమ బిడ్డల పరిస్థితి దారుణంగా మారుతోందని కన్నీరుమున్నీరవుతున్నారు. తమ కవల పిల్లలైన రామర్, లక్ష్మణన్ కోలుకోవాలంటే మీ ఆదరణే దిక్కు. దయచేసి పిల్లలను రక్షించడంలో మాకు సహాయం చేయమనివారు ప్రార్థిస్తున్నారు. (అడ్వర్టోరియల్) 👉 మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
కరోనా సోకిన రెండేళ్ల వరకు మానసిక సమస్యలు
లండన్: కోవిడ్ రోగుల్లో రెండేళ్ల తర్వాత కూడా మానసిక, నరాలకు సంబంధించిన వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని లాన్సెట్ తాజా అధ్యయనంలో వెల్లడైంది. బ్రిటన్‌లోని ఆక్స్ఫర్డ్ వర్సిటీ 12.5 లక్షల మంది కరోనా రోగులపై నిర్వహించిన అధ్యయనం వివరాలను లాన్సెట్ సైక్రియాట్రి జనరల్ తన తాజా సంచికలో ప్రచురించింది. కరోనా సోకినప్పుడు శ్వాసకోశ సంబంధింత వ్యాధులతో పాటుగా రెండేళ్ల వరకు సైకోసిస్, డిమెన్షియా, బ్రెయిన్ ఫాగ్ వంటి కొనసాగుతున్నాయని అధ్యయనం తేల్చింది. చిన్నారుల్లో కంటే పెద్దవారిలోనే ఈ సమస్యలు ఎక్కువగా వస్తున్నట్టు పేర్కొంది. మానసిక, నరాలకు సంబంధించిన వ్యాధులు కోవిడ్ సోకిన మొదటి ఆరు నెలల్లోనే వచ్చి రెండేళ్ల వరకు ఉంటున్నాయని అధ్యయనంలో పాల్గొన్న ప్రొఫెసర్ పాల్ హరిసన్ వివరించారు. -
బ్రెయిన్ స్ట్రోక్ / టీఐఏ ముప్పు ఎవరిలో ఎక్కువ?
కొన్ని జబ్బు లక్షణాలు వ్యాధి రాకముందే బయటపడతాయి. తాము రాబోతున్నామంటూ హెచ్చరికలు జారీచేస్తాయి. జాగ్రత్తపడమంటూ చెప్పి, నివారించుకునేందుకు అవకాశాలిస్తాయి. ఆ వార్నింగ్ సిగ్నల్స్‌ను ఎలా గుర్తించాలో ప్రముఖ న్యూరో ఫిజీషియన్ డాక్టర్ బి. చంద్రశేఖర్ రెడ్డి వివరిస్తున్నారు. వాటిని నిలువరించే మార్గాలూ చెబుతున్నారు. తెలుసుకుందాం... రండి. ప్రశ్న : వార్నింగ్ ఇచ్చి వచ్చే వ్యాధులేమైనా ఉన్నాయా? జ: న్యూరో విభాగానికి సంబంధించిన చాలా జబ్బులు ముందస్తు వార్నింగ్ ఇచ్చాకే వస్తాయి. ఉదాహరణకు మైగ్రేన్, ఫిట్స్, పక్షవాతం, అల్జైమర్స్ వంటివి. వీటిల్లో మైగ్రేన్ బాధాకరమే గానీ... చాలావరకు నిరపాయకరం. కానీ పక్షవాతం వల్ల అవయవాలు పనిచేయకపోయే ప్రమాదం ఉంది. ఇతరులపై జీవితాంతం ఆధారపడాల్సిన పరిస్థితి రావచ్చు. ఫిట్స్ కూడా ప్రమాదమే. అందుకే ముందస్తు హెచ్చరికలు చేసే ఆ వ్యాధుల వార్నింగ్ సిగ్నల్స్ అర్థం చేసుకోవడం వల్ల చాలా అనర్థాలను నివారించుకోవచ్చు. ప్రశ్న : పక్షవాతం ముందస్తు సిగ్నల్స్ ఇస్తుందా? అదెలా? జ: పక్షవాతం (బ్రెయిన్ స్ట్రోక్)లో చేయిగానీ, కాలుగానీ, లేదా రెండూ పడిపోవడం గానీ, ఒకవైపు చూపు తగ్గిపోవడం, మూతి వంకరపోవడం, మాట పడిపోవడం, మింగడం కష్టం కావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి తాత్కాలికంగా పది నిమిషాల నుంచి ఒక గంట లోపు వస్తే దాన్ని ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ అటాక్ (టీఐఏ) అంటారు. ఈ టీఐఏ లక్షణాలు... అసలు పక్షవాతం కంటే కొంత ముందుగానే కనపడవచ్చు. ముందుగా వచ్చే ఈ ‘టీఐఏ’ తర్వాత బాధితులు పూర్తిగా కోలుకుంటారు. కానీ ఆ సిగ్నల్స్ పెడచెవిన పెట్టి... అసలు పక్షవాతం వచ్చే వరకు నిర్లక్ష్యం చేస్తే కోలుకోడానికి చాలా టైమ్ పట్టవచ్చు లేదా ఆ నష్టం జీవితాంతం బాధించవచ్చు. ప్రశ్న : బ్రెయిన్ స్ట్రోక్ / టీఐఏ ముప్పు ఎవరిలో ఎక్కువ? జ: సాధారణంగా 50 ఏళ్లు దాటి... షుగరు, హైబీపీ ఉన్నవారికి స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. పొగతాగడం, మద్యం వంటి దురలవాట్లు ఈ ముప్పును మరింత పెంచుతాయి. రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారికీ, ఊబకాయం ఉన్నవారికీ స్ట్రోక్ ముప్పు ఎక్కువ. ప్రశ్న : మైగ్రేన్‌లో ఏయే ముందస్తు లక్షణాలు కనిపిస్తాయి? జ: మైగ్రేన్ తలనొప్పి రెండు విధాలుగా వస్తుంది. మొదటిదానిలో తలనొప్పికి ముందర కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. దీన్ని ‘మైగ్రేన్ విత్ ఆరా’ అంటారు. దాదాపు 20శాతం మందిలో ‘ఆరా’ కనిపిస్తుంది. రెండో రకంలో నేరుగా తలనొప్పి వస్తుంది. ‘మైగ్రేన్ ఆరా’లో కనిపించే లక్షణాలు ఇలా ఉంటాయి. ∙తలనొప్పి వచ్చే గంటలోపు చూపు కొద్దిగా మందగిస్తుంది. ∙కళ్ల ముందు మెరుపులు మెరిసినట్లుగా అనిపించడం, వెలుగు చూడలేకపోవడం, శబ్దాలు వినడంలో ఇబ్బంది కలగడం, కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ∙చుట్టూరా ఉన్నవి కనిపించకుండా, ముందు ఉన్నవే కనిపిస్తాయి. దీన్ని టెలిస్కోపిక్ విజన్ అంటారు. ∙అరుదుగా ఏదో ఓ పక్క కాలు / చేతిలో బలం తగ్గడం. ∙త్వరగా కోపం రావడం, చికాకు పడటం వంటివి కనిపించిన గంట లేదా రెండు గంటల్లోపు అసలు తలనొప్పి మొదలవుతుంది. ప్రశ్న : మైగ్రేన్‌కు చికిత్స ఎలా? జ: దీనికి రెండు రకాలుగా చికిత్స అందిస్తారు. మొదటిది తీక్షణంగా వచ్చే తలనొప్పిని తగ్గించడానికి ఇచ్చే మందులు. ఇవి ఎంత త్వరగా తీసుకుంటే, అంత త్వరగా ఉపశమనం కలుగుతుంది. రెండోవి... మళ్లీ రాకుండా ఉండేందుకు ఇచ్చే మందులు. ప్రశ్న : ఫిట్స్‌లో కూడా ముందస్తు సిగ్నల్స్ కనిపిస్తాయా? జ: మూర్ఛను వైద్యపరిభాషలో ఫిట్స్ అనీ, ఆ జబ్బును ఎపిలెప్సీ అని అంటారు. ఆరు నెలల నుంచి ఆరేళ్ల వయసున్న పిల్లల్లో జ్వరం వచ్చినప్పుడు ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉంది. అప్పుడు చల్లటి నీటితో ఒళ్లు తుడుస్తూ, శరీర ఉష్ణోగ్రత తగ్గించి ఫిట్స్ రాకుండా నివారించుకోవచ్చు. కొంతమందిలో ఫిట్స్ వచ్చే కొన్ని నిమిషాల నుంచి గంటల ముందుగా తలనొప్పి, కళ్లు తిరగడం, ఒళ్లు జలదరించడం (జర్క్స్), కనురెప్పలు కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లలు ఈ లక్షణాలను గమనించలేరు. కాబట్టి పెద్దలే వాటిని గమనించాలి. ముఖ్యంగా ముందురోజు నిద్ర సరిపోకపోవడం, తీవ్ర ఒత్తిడికి లోనవ్వడం వంటి పరిస్థితుల్లో ఫిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ప్రశ్న : అల్జైమర్స్ జబ్బును ముందస్తుగా గుర్తుపట్టడం ఎలా? జ: అల్జైమర్స్‌లో ముఖ్యమైన మొట్టమొదటి లక్షణం – కొన్ని సెకండ్ల నుంచి నిమిషాలకు ముందుగా జరిగిపోయిన విషయాలను మరచిపోతుండటం. (వీళ్లలో చిన్నప్పటి విషయాలు మాత్రం బాగా గుర్తుండవచ్చు). తర్వాత క్రమంగా దారులు, తేదీలు, పండుగలు మరచిపోతారు. కొత్త విషయాలు ఏవీ గుర్తుపెట్టుకోలేరు. క్రమంగా ప్రవర్తనలో కూడా మార్పు రావచ్చు. సరైన సమయంలోనే ఈ లక్షణాలను గుర్తించలిగితే... సరైన చికిత్సతో... వ్యాధి పెరుగుదలనూ, తీవ్రతనూ నియంత్రించవచ్చు. ఇక్కడ చెప్పిన ఏ వార్నింగ్ కనిపించినా వెంటనే ‘న్యూరో ఫిజీషియన్’ను సంప్రదించి, తగిన పరీక్షలూ, వాటి ఆధారంగా తగిన చికిత్స తీసుకుంటే... ఈ జబ్బులను చాలావరకు రాకముందే నివారించవచ్చు. - డాక్టర్ బి. చంద్రశేఖర్ రెడ్డి సీనియర్ న్యూరో ఫిజీషియన్ -
చిన్నారి మెదడు చితుకుతోంది!
సాక్షి,సిటీబ్యూరో: అల్లారుముద్దుగా చూసుకుంటున్న పిల్లలు అనుకోని ప్రమాదంలో పడుతున్నారు. అది గుర్తించేలోగా పరిస్థితి చేయి దాటిపోతోంది. గ్రేటర్లో ప్రతి వంద మంది చిన్నారుల్లో ఒకరు మెదడు, న్యూరో సమస్యలతో బాధపడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (ఐఐపీహెచ్) సంస్థ తాజాగా చేసిన అధ్యయనంలో ఈ అంశాన్ని గుర్తించారు. ఈ సమస్యలను ‘న్యూరో డెవలప్మెంటల్డిజార్డర్స్’(ఎన్డీడీ)గా పిలిచే ఈ తరహా సమస్యలతో 2–9 ఏళ్ల వయసున్న వారే ఎక్కువగా బాధపడుతున్నట్టు స్టడీలో తేలింది. సంస్థకు చెందిన నిపుణులు గ్రేటర్‌లోని 5 వేల మంది చిన్నారులపై అధ్యయనం చేయగా మెదడు, నరాలకు సంబంధించిన సమస్యలతో పలువురు అవస్థలు పడుతున్నట్లు గుర్తించారు. వీరిలో ‘దృష్టి లోపం, ఎపిలెప్సి, న్యూరోమోర్టార్ సమస్యలు, సెరిబ్రల్ పాల్సీ, చెవుడు, సరిగా మాట్లాడలేకపోవడం, ఆటిజం, మానసిక పరిపక్వత లేకపోవడం’ వంటి న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్స్ వెలుగు చూశాయి. చాలా మంది చిన్నారులకు తరగతి గదుల్లో పాఠాలు సరిగా వినిపించకపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నట్లు తేలింది. ఈ విషయంలో జాతీయ స్థాయి సగటు కంటే గ్రేటర్లో అధిక శాతం మంది ఉన్నట్టు తేల్చారు. ఇక్కడి పిల్లలు ఏదో ఒక న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్‌తో బాధపడుతున్నట్లువెల్లడించారు. వయసు వారీగా బాధితులు.. ♦ గ్రేటర్లో 2–6 ఏళ్ల చిన్నారుల్లో 2.9 శాతం నుంచి 18.7 శాతం మంది ఎన్డీడీ సమస్యలతో బాధపడుతున్నారట. ♦ 6–9 ఏళ్ల మధ్యనున్న వారిలో 6.5 నుంచి 18.5 శాతం మంది బాధుతులున్నారు. ఈ వయోగ్రూపులో చాలామంది ఒకటి రెండు సమస్యలు సర్వసాధారణంగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ♦ జాతీయ స్థాయిలో 2–6 ఏళ్లలోపు వారి 9.2 శాతం బాధితులు ఉండగా, 6–9 ఏళ్లలోపు వారిలో 13.6 శాతం మంది ఉన్నారు. ఐఐపీహెచ్ అధ్యయనంలో పాల్గొన్నవారు ♦ ఈ అధ్యయనంలో పాలుపంచుకున్నవారిలో 18 ప్రతిష్టాత్మక సంస్థలకు చెందిన చిన్నపిల్లల వైద్యనిపుణులు, నరాల వైద్యులు, ఎపిడెమాలజీ, పబ్లిక్‌హెల్త్, సోషల్ సైన్స్, బయో స్టాటిస్టిక్స్, చైల్డ్ సైకాలజీ, ఈఎన్టీ, కంటి వైద్యులు సభ్యులుగా ఉన్నారు. ముందుగా ఇలా గుర్తించాలి.. ఎన్డీడీ సమస్యలను చిన్నతనంలోనే ఎలా గుర్తించాలో ఈ అధ్యయనం తెలిపింది. ఇళ్లలో ప్రసవాలు జరగడం, పుట్టిన సమయంలో వెంటనే ఏడవక పోవడం, శ్వాస కష్టంగా తీసుకోవడం, పుట్టిన వెంటనే అనారోగ్యానికి గురికావడం, రెండు కిలోల కంటే తక్కువ బరువుతో జన్మించడం, నెలలు నిండకముందే జన్మించిన వారిలో ఇలాంటి సమస్యలు కనిపిస్తాయని నిపుణులు వెల్లడించారు. ఇక న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్స్‌తో బాధపడుతున్న చిన్నారులకు ఎక్స్‌రే, సీటీ బ్రెయిన్, ఎంఆర్ఐ బ్రెయిన్, రక్త పరీక్షల ద్వారా గుర్తించాల్సి ఉంటుందని ప్రకటించారు. ఆదిలోనే గుర్తించి నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తే ఎన్డీడీ సమస్యల నుంచి చిన్నారులకు విముక్తి లభిస్తుందని అధ్యయన బృందం పేర్కొంది. న్యూరో సమస్యలకు కారణాలివీ.. చాలా ప్రాంతాల్లో వసతులున్న ఆస్పత్రుల్లో ప్రసవాలు జరగడం లేదు. కొన్నిసారు బిడ్డ పుట్టిన వెంటనే అనారోగ్యానికి గురవుతుంటారు. మెదడుకు వివిధ రకాల ఇన్ఫెక్షన్లు సోకడం, తక్కువ బరువుతో పుట్టడం, నెలలు నిండకముందే జన్మించడం వంటి కారణలతో పాటు కొందరిలో జన్యుపరమైన లోపాలు సైతం ఉంటున్నాయి. -
తప్పక తప్పుకున్నా
ఇర్ఫాన్ ఖాన్ హెల్త్ కండీషన్ సడెన్‌గా అప్సెట్ అవ్వడంతో ఇండస్ట్రీ జనాలతో పాటు ఆయన ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యారు. చాలా ప్రాజెక్ట్స్ ఆగిపోయాయి. న్యూరో ఎండోక్రైమ్ ట్యూమర్ ట్రీట్మెంట్ నిమిత్తం ప్రస్తుతం ఇర్ఫాన్ ఖాన్ లండన్‌లో ఉన్నారు. ఈ కారణంగా తాను అప్పటికే నటిస్తోన్న ఓ వెబ్ సిరీస్ ఆగిపోయిందని ఇర్ఫాన్ పేర్కొన్నారు. ఈ విషయం గురించి ఇర్ఫాన్ మాట్లాడుతూ – ‘‘గోర్మింట్’ అనే సెటైరికల్ వెబ్ సిరీస్ కోసం కొన్ని నెలలు షూటింగ్ చేశా. ప్రస్తుతం నేనున్న పొజిషన్ చూస్తుంటే ఈ వెబ్ సిరీస్‌లో ఇక భాగం అవ్వలేనని అర్థం అయింది. చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఆ సిరీస్ ఐడియా నన్ను చాలా థ్రిల్ చేసింది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తప్పక తప్పుకుంటున్నా. ఫైనల్ ప్రొడక్ట్ చూడాలని చాలా ఆత్రుతగా ఉన్నాను. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అని పేర్కొన్నారు. -
ఇంటి తాళం ఇచ్చేశాడు
న్యూరో ఎండోక్రైన్ క్యాన్సర్‌తో ఇర్ఫాన్ ఖాన్ బాధపడుతున్న సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ను ప్రస్తుతం లండన్‌లో తీసుకుంటున్నారు. అయితే ట్రీట్మెంట్ కోసం ఇర్ఫాన్ లండన్‌లో ఎన్ని నెలలుంటారో తెలియదు. కానీ లండన్‌లో ఆయనకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని షారుక్ లండన్‌లోని తన ఇంటి తాళాలను స్నేహితుడు ఇర్ఫాన్ చేతికి అందించారట. ట్రీట్మెంట్కి ప్రయాణమయ్యే కొన్ని రోజుల ముందు షారుక్‌ని ఇంటికి ఆహ్వానించారట ఇర్ఫాన్ భార్య సుతపా. రెండు గంటలు మాట్లాడుకున్న ఈ స్నేహితులు, సంభాషణ ఆఖర్లో షారుక్ తన లండన్ ఇంటి కీస్‌ని ఇర్ఫాన్‌కి అందించారట. లండన్‌లో స్నేహితుడు ఎటువంటి ఇబ్బంది పడకూడదని, ఇంటి వాతావరణం మిస్ అవ్వకూడదని షారుక్ ఇలా చేసి ఉంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. -
మా హీరో అనారోగ్యంతో మీకు పబ్లిసిటీనా..
ముంబయి : న్యూరో ఎండోక్రిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఏ ఆయుర్వేధ వైద్యుడిని సంప్రదించడం లేదని ఆయన వ్యక్తిగత అధికారిక ప్రతినిధి స్పష్టం చేశారు. ఒకసారి మాత్రం ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు వైద్య బాలెందు ప్రకాష్‌తో ఫోన్లో మాట్లాడారని ఆతర్వాత, వారిద్దరి మధ్య ఎలాంటి పరస్పర సంభాషణలు లేవని చెప్పారు. 'అంతకుముందు మీడియాలో వచ్చినట్లు ఆయన వైద్యబాలేందు ప్రకాష్‌ను సంప్రదించడం లేదు. కానీ, ఒకసారి మాత్రం ఫోన్లో మాట్లాడారు. ఆ తర్వాత వారి మధ్య ఎలాంటి సంభాషణలు గానీ, సంప్రదింపులుగానీ జరగలేదు. అయితే, మీకు వ్యక్తిగత ప్రయోజనాలకోసం, పబ్లిసిటీ కోసం ఒకరి అనారోగ్యంపై మీకు ఇష్టం వచ్చినట్లుగా ప్రచారం చేయడం ఏమాత్రం అంగీకరించదగినది కాదు' అని ఆయన అన్నారు. ఇర్ఫాన్ ఖాన్ న్యూరో సంబంధ క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యంపై పలు విధాలుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. -
తన వ్యాధి పేరు బయటపెట్టిన ఇర్ఫాన్ ఖాన్
సాక్షి, ముంబయి : ముందు చెప్పినట్లుగానే ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ తన వ్యాధి గురించి బయటపెట్టారు. తనకు నాడీ సంబంధమైన అంత:స్రావి గ్రంధిలో ట్యూమర్ (న్యూరో ఎండోక్రిన్ ట్యూమర్) ఉందని, ఇది అత్యంత అరుదైనదని పేర్కొన్నారు. దీనికోసం తాను విదేశాల్లో వైద్యానికి వెళుతున్నట్లు కూడా చెప్పారు. ఇర్ఫాన్ ఖాన్ తన అధికారిక ట్విటర్ పేజీలో ఈ మేరకు పోస్ట్ చేశారు. అత్యంత అరుదైన వ్యాధితో ఇర్ఫాన్ బాధపడుతున్నారని, అదొక క్యాన్సర్ అంటూ విపరీతమైన ఊహాగానాలతో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో న్యూరో అంటే బ్రెయిన్‌కు సంబంధించినది మాత్రమే ఉండబోదని తెలిపారు. అంతకుముందు ఇదే నెల (మార్చి) 5న సోషల్ మీడియా ద్వారానే ఇర్ఫాన్ తనకు అరుదైన వ్యాధి ఉందని, దీనిపై అందరూ వేరే ప్రచారం చేయొద్దని, ఆ వ్యాధి ఏమిటనే వివరాలు పది రోజుల్లో వెల్లడిస్తానని చెప్పారు. అన్న ప్రకారమే ఆయన నేడు తన ట్విటర్ ఖాతా ద్వారా తనకు న్యూరో ఎండోక్రిన్ ట్యూమర్ అనే వ్యాధి ఉందని తెలిపారు. ‘మనం ఊహించినదేది జీవితం మనకు ఇవ్వదు’ అంటూ మార్గరెట్ మిచెల్ చెప్పిన కొటేషన్‌ను చెబుతూ.. ‘ఒక్కోసారి మనం ఊహించనిది మనల్ని పెద్ద వాళ్లను చేస్తుంది. నాకు న్యూరోఎండోక్రిన్ ట్యూమర్ ఉందని తెలుసుకున్నప్పుడు అంగీకరించేందుకు కష్టంగా అనిపించింది. భరించలేకపోయాను. కానీ, నా చుట్టూ ఉన్న వారి ప్రేమ, బలం నన్ను కొత్త ఆశలోకి తీసుకొచ్చాయి. ఈ ప్రయాణం నన్ను దేశం వెలుపలికి తీసుకెళుతోంది. మీ అందరి దీవెనలు నాకు పంపిస్తునే ఉండండి. నా మాటలకోసం ఎదురుచూసేవారందరికి మరిన్ని విషయాలు చెప్పేందుకు తిరిగొస్తానని ఆశిస్తున్నాను’ -- ఇర్ఫాన్ న్యూరో ఎండోక్రిన్ ట్యూమర్ అంటే ఏమిటీ? ఈ నాడీకి సంబంధమైన కణితి (ట్యూమర్) వేగంగా లేదా నెమ్మదిగా లేదా ఊహించని విధంగా పెరగొచ్చు. శరీరంలోని ఇతర భాగాలకు కూడా పాకొచ్చు. చాలామందికి దీని లక్షణాలు అంత త్వరగా తెలియవు గుర్తించలేరు. ఏదైన సంఘటన జరిగి దాని ద్వారా పరీక్షలు చేస్తే బయటపడుతుంది. చర్మం కందిపోయినట్లుగా కనిపించడం, లేదా రక్తంలో షుగర్ లెవల్స్ అమాంతం పెరిగిపోవడం జరుగుతాయి. ఇక వైద్యం అనేది కణితి తీవ్రతను బట్టి ఉంటుంది. రేడియేషన్ లేదా కీమోథెరపీ ద్వారా మాత్రమే చికిత్సకు వెళ్లాల్సి ఉంటుంది. 🙏🏻 pic.twitter.com/IDThvTr6yF — Irrfan (@irrfank) March 16, 2018 -
36 శాతం పెరిగిన న్యూరో మృతుల సంఖ్య
మాస్కో: గడిచిన 25 ఏళ్ల కాలంలో ప్రపంచవ్యాప్తంగా నరాల సంబంధిత వ్యాధుల వల్ల మృతిచెందిన వారి సంఖ్య 36.7 శాతం పెరిగినట్లు తాజా అధ్యయనంలో తేలింది. 1990–2015 మధ్య వైకల్యం బారిన పడిన వారి సంఖ్య 7.4 శాతం పెరిగినట్లు వెల్లడైంది. పెరుగుతున్న జనాభా, అధిక ఒత్తిడి తదితర కారణాల వల్ల నరాల సంబంధిత వ్యాధులు వస్తున్నట్లు వెల్లడించింది. జీవన ప్రమాణాలు మెరుగుపరచుకోవడం, ఆరోగ్య సంరక్షణ పాటించడంతో సమస్య నుంచి బయటపడవచ్చని పేర్కొంది. నరాల వ్యాధులు రావడానికి దీర్ఘ ఆయుర్దాయం కూడా ఓ కారణమని రష్యాలోని నేషనల్ రీసెర్చ్ వర్సిటీ ప్రొఫెసర్ వెస్లీ వ్లాసోవ్ తెలిపారు. -
ఎలిఫెంట్ మ్యాన్: వైద్య శాస్త్రానికి ఓ సవాల్!
బీజింగ్: వైద్య శాస్త్రానికి అతడు ఓ అంతు చిక్కని ప్రశ్నగా మిగిలాడు. ఎలిఫెంట్ మ్యాన్ గా చైనా అంతటా ఆయన పరిచయం అక్కర్లేని వ్యక్తి. ఆయన పేరు హువాంగ్ చుంకాయ్(39). అత్యంత అరుదైన న్యూరోఫిబ్రోమాటోసిస్ సిండ్రోమ్ తో గత 35 ఏళ్లుగా ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్నాడు. హువాంగ్ కు నాలుగేళ్లున్నప్పుడు ఈ సమస్య మొదలైంది. డాక్టర్లను సంప్రదించగా దీనిని అరుదైన వ్యాధిగా గుర్తించారు. దీని వల్ల చర్మం ఉబ్బడం, చర్మం సాగడం జరుగుతుంది. ఇతడి ఆరోగ్య సమస్యలపై కొన్నేళ్ల నుంచి పరిశోధనలు జరుగుతున్నాయి. కొన్ని డాక్యుమెంటరీలు కూడా చేశారు. ఈ వ్యాధిని నయం చేసేందుకు వైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెల్ కాలేకపోతున్నారు. ఇప్పటివరకూ నాలుగు మేజర్ సర్జరీలు జరిగినా ప్రయోజనం కనిపించలేదట. విరాళాలు సేకరించి 2007లో తొలిసారిగా సాగిన చర్మాన్ని తొలగించుకునే యత్నం చేశాడు. ఆపై మరో మూడు సర్జరీలు జరిగాయి. అయితే ఇందుకు చికిత్స ఏంటన్నది వైద్య చరిత్రలో ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. ముఖానికి సంబంధించిన అరుదైన వ్యాధితో సతమతమవుతున్న హువాంగ్ చాలా అరుదుగా జనాల మధ్యకి వస్తాడు. తమ సినిమాలలో భయంకరమైన రాక్షసుడిగా చూపిస్తామని సినీ ఇండస్ట్రీకి చెందిన కొందరు తనను కలవగా వారి ఆఫర్లను రిజెక్ట్ చేశాడు. తన వింత ఆకారాన్ని చూసి తోటి విద్యార్థులు భయాందోళనకు గురువుతున్నారని చదువు మధ్యలోనే మానేసిన తనకు ఇలాంటివి ఇష్టం లేదన్నాడు. ఆపరేషన్ చేసి పెరుగుతున్న చర్మాన్ని తొలగిస్తున్న మళ్లీ పెరిగిపోవడంతో పూర్వ ముఖ రూపం వస్తుంది. హువాంగ్ ప్రస్తుతం తన తల్లిదండ్రులు, తోబుట్టువులతో కలిసి ఉంటున్నాడు. తన వ్యాధికి చికిత్స ఉండకపోతుందా.. ఏదైనా ఓరోజు పూర్వ అందరిలా మామూలు మనిషి అవుతానని ధీమా ఆయనలో ఉంది. న్యూరోఫిబ్రోమాటోసిస్ లక్షణాలేంటి? న్యూరోఫిబ్రోమాటోసిస్ అంటే ఓ జన్యుసంబంధమైన విచిత్ర పరిస్థితి. మానవ శరీరం నుంచి ఏదైనా భాగం నుంచి ఎముకలు, చర్మంలో పెరుగుదల కన్పించడమే ఈ వ్యాధి లక్షణం. కొన్ని సందర్భాలలో తలలోని కణాలు, ఎముకలు పెరుగుతాయి. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఇందుకు బీజం పడుతుందని వైద్య నిపుణుల అభిప్రాయం. న్యూరోఫిబ్రోమాటోసిస్ టైప్ వన్(ఎన్ఎఫ్ 1), ప్రోటిస్ సిండ్రోమ్ సమస్యల కారణంగా హువాంగ్ ముఖం అలా వికృతంగా తయారయి ఉండొచ్చునని 2001లో అతడిని పరీక్షించిన వైద్యులు తెలిపారు. -
పాపం చిన్నారి.. పోరాడి ఓడింది!
-
పాపం చిన్నారి.. పోరాడి ఓడింది!
అభం శుభం ఎరుగని చిన్నారి ఆమె. ముద్దుముద్దు మాటలతో అందరినీ అలరించే ఆ పాప.. ప్రపంచంలోనే అత్యంత అరుదైన కేన్సర్ బారిన పడింది. బ్రిటన్‌లోని లాంక్షైర్ ప్రాంతానికి చెందిన జెస్సికా ఫొటోలను ఆమె తండ్రి ఆండ్రూ వీలన్ ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఆమె బోలెడంత మంది అభిమానులను సంపాదించుకుంది. ఆమె ప్రాణాలతో ఉండాలని ఎంతమంది ఎన్నిరకాలుగా ప్రార్థనలు చేసినా ఫలితం లేకపోయింది. చిన్నారి జెస్సికా మరణించిన విషయాన్ని ఆమె తండ్రి తెలిపారు. జెస్సికా వీలన్కు అత్యంత అరుదైన 'న్యూరోబ్లాస్టోమా' అనే రకం కేన్సర్ వచ్చింది. చాలా అరుదుగా వచ్చే ఈ వ్యాధి చంటి పిల్లల్లోను, ఐదారేళ్ల వయసు లోపు పిల్లల్లోను కనిపిస్తుంది. ఆమె చికిత్స పొందుతూ జుట్టంతా రాలిపోయినా కూడా ఆనందంగా నవ్వుతూనే ఉన్న ఫొటోలను ఆయన పోస్ట్ చేయడంతో.. ఆ చిన్నారికి బోలెడంత మంది అభిమానులు ఏర్పడ్డారు. జెస్సికా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయినందుకు ఒకవైపు బాధగా ఉన్నా, మరోవైపు ఆమె మాత్రం బాధ నుంచి విముక్తి పొందినందుకు ప్రశాంతంగా ఉందని ఆమె తండ్రి బరువెక్కిన హృదయంతో పేర్కొన్నారు. -
విజయవాడ లిబర్టీ ఆసుపత్రి వద్ద ఆందోళన
విజయవాడ: విజయవాడ ఆటోనగర్‌లోని లిబర్టీ ఆసుపత్రి వద్ద రోగి బంధువులు ఆందోళనకు దిగారు. వివరాలు.. నగరంలోని చెక్‌పోస్ట్ సెంటర్‌కు చెందిన భార్యాభర్తల మధ్య నిన్న గొడవ జరిగింది. ఈ ఘటనలో భర్త చేయి చేసుకోవడంతో భార్య మహ్మద్ శమ్మా తలకు గాయమైంది. చికిత్స నిమిత్తం దగ్గరలో ఉన్న లిబర్టీలో ఆసుపత్రిలో చేరగా..అక్కడ న్యూరో సర్జన్ ఆమెతో అసభ్యంగా ప్రవర్థించాడు. ఈ రోజు ఉదయం కూడా అలాగే మాట్లాడటంతో ఈ విషయం కుటుంబసభ్యులకు తెలిపింది. దీంతో కుటుంబసభ్యులు, బంధువులు, ముస్లిం సంఘాల నాయకులు లిబర్టీ ఆసుపత్రి వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. న్యూరోసర్జన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు న్యూరోసర్జన్తో శమ్మాకు క్షమాపణ చెప్పించినా ఆందోళన ఆగలేదు. అక్కడున్న వారందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు అక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. -
కట్ చేస్తే.. మూడేళ్ల తర్వాత
అద్భుతాలు అన్నిసార్లూ జరగవు.. జరిగినప్పుడు తెలుసుకోవాలి.. దాన్ని చూసేయాలి.. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న విషయం కూడా ఒక అద్భుతంలాంటిదే. ముందు ఈ ఫొటోలను ఓసారి చూడండి.. ఈ రెండూ ఒకరివే!! ఈమె పేరు జొయన్నా.. పోలండ్‌లో ఉంటోంది. ‘న్యూరోఫైబ్రోమెటాసిస్’ అనే జన్యుపరమైన వ్యాధి వల్ల ఆమె ముఖం ఇలా కణితులతో నిండిపోయి.. అందవికారంగా తయారైపోయింది. మాట్లాడాలన్నా.. తినాలన్నా.. నరక ం కనిపించేది. కళ్లు సరిగా కనిపించేవి కావు.. చెవులు కూడా వినిపించేవి కావు.. అలాంటి దుర్భర పరిస్థితిలో మూడేళ్ల క్రితం ఆమెకు డాక్టర్ మెకజ్యూస్కీ నేతృత్వంలోని వైద్యుల బృందం ముఖమార్పిడి ఆపరేషన్ చేసింది.. ఇది ఆ దేశంలోనే రెండో ముఖమార్పిడి శస్త్రచికిత్స అట.. 23 గంటలపాటు జరిగిన ఈ ఆపరేషన్‌లో భాగంగా జొయన్నా ముఖం మీద చర్మంలో 80 శాతాన్ని మార్చేశారు. తర్వాత చిన్నచిన్న చికిత్సలు జరిగాయి.. కట్ చేస్తే.. మూడేళ్ల తర్వాత ఇదిగో ఇలా అద్భుతం ఆవిష్కృతమైంది.. -
సకాలంలో చికిత్స అందిస్తే పక్షవాతాన్ని నియంత్రించవచ్చు!
న్యూరో కౌన్సెలింగ్ మా అమ్మగారి వయసు 45 ఏళ్లు. ఇటీవల ఆమెకు పక్షవాతం వచ్చింది. అయితే ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లడం ఆలస్యమైంది. ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయిస్తే మా అమ్మగారికి బ్రెయిన్లో రక్తం క్లాట్ అవ్వడంతో స్ట్రోక్ వచ్చిందని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం మా అమ్మగారు మాట్లాడలేకపోతున్నారు. ఆమెను క్రమం తప్పకుండా ఆసుపత్రికి తీసుకెళ్ల చికిత్స అందిస్తున్నాం. పక్షవాతం వస్తే అది పూర్తిగా నయం కాదా? ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారకుండా ఉండటానికి ఎలాంటి చికిత్సను అందించాలో దయచేసి తగిన సలహా ఇవ్వగలరు. - కళ్యాణి, చిత్తూరు శరీరంలోని అన్ని అవయవాలను నియంత్రించేది మెదడు ఒక్కటే. శరీరానికి బ్రెయిన్ ఒక కంట్రోల్ రూమ్ లాంటిది అలాంటి మెదడులో క్లాట్ ఏర్పడటం అంటే అది శరీరంలోని అవయవాలపై నేరుగా ప్రభావం చూపడమే. ఈ సమస్య వల్ల కొన్ని అవయవాలపై మెదడు తన నియంత్రణను కోల్పోతుంది. అయితే మెదడులో క్లాట్ ఏర్పడటం అరుదైన విషయమేమీ కాదనే చెప్పాలి. వయసు, స్ట్రెస్, మానసిక ఆందోళన, జీవనశైలి, డయాబెటిస్, స్థూలకాయం, బీపీ, జన్యుపరమైన ఇతరత్రా కారణాల వల్ల ఈ సమస్య బారిన పడే అవకాశం ఉంది. పక్షవాతం బారిన పడటానికి ముందస్తుగా ప్రతి ఒక్కరిలో కొన్ని లక్షణాలు బయటపడతాయి. ఈ ప్రమాద ఘంటికలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదిస్తే చాలా వరకు సమస్యలను అధిగమించవచ్చు. మెదడులో రక్తసరఫరా ఆగిన చోటును బట్టి లక్షణాలు ఆధారపడి ఉంటాయి. మూతి వంకరపోవడం, ముఖం, చేతులు బలహీనపడటం, నడకలో తేడా రావడం, అస్పష్టంగా కనిపించడం, మాట్లాడటంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. హెచ్చరికల్లాంటి ఈ లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. అలా కాకుండా స్ట్రోక్ వచ్చి ఆలస్యమైనప్పటికీ ఎలాంటి ఆందోళనకు గురికాకుండా అన్ని వైద్య సదుపాయాలున్న ఆసుపత్రిలో నిపుణులైన న్యూరోసర్జన్ లేదా న్యూరాలజిస్ట్లను సంప్రదిస్తే మంచి ఫలితం ఉంటుంది. మీ అమ్మగారి చికిత్స విషయంలో మీకు ఎలాంటి భయాలూ అవసరం లేదు. వైద్యశాస్త్రంలో వచ్చిన అధునాతనమైన సాంకేతిక పురోగతితో మీ అమ్మగారి సమస్యను కరెక్టుగా గుర్తించి న్యూరో నావిగేషన్, మినిమల్లీ ఇన్వేజిక్, అవేక్ సర్జరీ లాంటి అత్యాధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మెరుగైన వైద్యాన్ని అందించి, ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారకుండా కాపాడుకోవచ్చు. అలాగే బ్రెయిన్ ట్యూమర్, బ్రెయిన్ హ్యామరేజి, మల్టిపుల్ క్లాట్స్, బ్రెయిన్ ఎన్యురిజమ్స్ లాంటి తీవ్రమైన మెదడుకు సంబంధించిన ప్రాణాపాయ వ్యాధులను సమర్థంగా ఎదుర్కొనే అవకాశమూ ఉంది. మీకు ఎలాంటి భయాందోళనలూ అవసరం లేదు. అలాగే మీ అమ్మగారికి పక్షవాతం వచ్చింది కాబట్టి మీరు, మీ తోబుట్టువులు కూడా మరింత జాగ్రత్తగా ఉండాలి. మీకు గానీ, మీ తోబుట్టువులకు గాని డయాబెటిస్, రక్తపోటు, స్థూలకాయం (ఒబేసిటీ) లాంటి సమస్యలు ఉంటే వాటిని అదుపులో ఉంచుకోవడం అవసరం. - డాక్టర్ ఆనంద్ బాలసుబ్రమణ్యం, సీనియర్ న్యూరో సర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ పీసీఓడీని నయం చేయవచ్చా? హోమియో కౌన్సెలింగ్ మా అమ్మాయి వయసు 26 ఏళ్లు. తనకు నెలసరి క్రమంగా రాదు. బరువు కూడా పెరుగుతోంది. ఇంకో 2 నెలల్లో వివాహం చేయాలనుకుంటున్నాం. డాక్టర్‌ను సంప్రదిస్తే అన్ని పరీక్షలు చేసి పీసీఓడీ అని చెప్పారు. దీని గురించి మాకు అవగాహన లేదు. అంతేకాదు... ఆ టాబ్లెట్లు వేసుకుంటున్నప్పటి నుంచి బరువు మరింతగా పెరిగిపోతోంది. దీనికి హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా? - సంతోషమ్మ, విజయవాడ అండాశయంలో ద్రవంతో నిండిన చిన్న చిన్న నీటి బుడగల్లాంటి సంచులు వస్తాయి. అవి అండం విడుదలకు అడ్డుపడటం వల్ల వచ్చే సమస్యను పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ అంటారు. కొన్నిసార్లు అవి 1 నుంచి 12 వరకు ఉండవచ్చు. లక్షణాలు అండం విడుదల ఆగిపోవడం వల్ల నెలసరి సరిగా రాకపోవడం లేదా 2 - 3 నెలలకు ఒకసారి రావడం నెలసరి వచ్చినా తక్కువ రక్తస్రావం కావడం కొన్నిసార్లు పూర్తిగా ఆగిపోవడం వల్ల గర్భం దాల్చే పరిస్థితిక కూడా ఉండకపోవచ్చు సాధారణంగా ఈ సమస్య ఉన్న కొందరిలో అవాంఛిత రోమాలు, ముఖంపై మొటిమలు, జుట్టు ఊడటం, బరువు పెరగడం వంటివి కనిపిస్తాయి దీనివల్ల ఆత్మవిశ్వాసం తగ్గి ఒత్తిడికి లోనవుతారు. లక్షణాలు అందరిలోనూ ఒకేలా ఉండకపోవచ్చు. కొందరిలో సాధారణ స్థాయిలో ఉంటే మరికొందరిలో తీవ్రస్థాయిలో ఉండవచ్చు. కొందరిలో అసలు ఏ విధమైన లక్షణాలూ కనిపించకపోవచ్చు. ఈ వ్యాధి వల్ల కలిగే ఇతర సమస్యలు పీసీఓడీ వ్యాధి ఉన్నా హార్మోన్లపై అది ప్రభావం చూపనప్పుడు దీనివల్ల ఎలాంటి ఇబ్బందీ ఉండదు. అయితే ఈ వ్యాధి హార్మోన్లపై ప్రభావం చూపినప్పుడు హార్మోన్ల అసమతుల్యత కలిగి సమస్యలు మొదలవుతాయి. వాటిలో ముఖ్యంగా డయాబెటిస్ నెలసరి ఇబ్బందులు సంతాన సాఫల్య సామర్థ్యం తగ్గిపోవడం అవాంఛిత రోమాలు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు బరువు తగ్గాలి. కానీ అదే సమయంలో కడుపు మాడ్చుకోకూడదు. కేవలం మంచి ఆహార నియమాలు పాటిస్తూ ఆరోగ్యకరంగా బరువు తగ్గాల్సి ఉంటుంది. అలా జరగకపోతే చికిత్స తీసుకున్నా ప్రయోజనం ఉండకపోగా సమస్య అధికమయ్యే అవకాశం ఉంటుంది అవాంఛిత రోమాలను నివారించేందుకు వాక్సింగ్, హెయిర్ రిమూవల్ క్రీమ్‌లు వాడకపోవడం మంచిది నెలసరి రావడం కోసం అధికంగా హార్మోన్ ట్యాబ్లెట్లు వాడకపోవడం మంచిది ఒకవేళ గర్భం దాల్చినట్లయితే క్రమం తప్పకుండా డాక్టర్ పర్యవేక్షణలో ఉండాలి. లేదంటే గర్భస్రావం అయ్యేందుకు అవకాశాలు ఎక్కువ. చికిత్స హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా రోగి శారీరక, మానసిక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స ఇస్తారు. దీనివల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి, హార్మోన్ల సమతౌల్యత సాధారణ స్థాయికి వచ్చి వ్యాధి తగ్గుతుంది. - డాక్టర్ ఎ.ఎం. రెడ్డి సీనియర్ డాక్టర్, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
ఆ ఎంజైమ్ లోపంతోనే తాగుడు!
లండన్: ఓ ఎంజైమ్ లోపం వల్ల తాగుడు (ఆల్కహాల్)కు బానిసలు అవుతారని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మెదడు ముందు భాగంలోని నాడీ కణాల్లో పీఆర్డీఎం2 ఎంజైమ్ ఉత్పత్తి ఆగిపోవడం వల్ల తాగుడుకు బానిస అవుతారని గుర్తించారు. కేన్సర్‌కు సంబంధించి ఇది ఎలాంటి పాత్ర పోషించడం లేదని తేలిందని స్వీడన్‌లోని లింకోపింగ్ యూనివర్సిటీకి చెందిన మార్కస్ హీలిగ్ తెలిపారు. ఆల్కహాల్‌కు, మెదడుకు సంబంధంపై ఎప్పటినుంచో పరిశోధనలు జరుగుతున్నా యూనివర్సిటీ ఆఫ్ మియామి, లింకోపింగ్ యూనివర్సిటీ పరిశోధకులు తొలిసారిగా దీన్ని ఛేదించింది. -
బతికి ఉండగానే అచేతనం అవుతారు!
హోమియో కౌన్సెలింగ్ మావారి వయసు 55 ఏళ్లు. ఈమధ్య హైబీపీతో బాధపడుతూ, పని ఒత్తిడితో మందులు సరిగా వేసుకోలేదు. అకస్మాత్తుగా ఒకవైపు కాళ్లు, చేతులు పనిచేయలేదు. పక్షవాతం (స్ట్రోక్) వచ్చిందన్నారు. హోమియోలో దీనికి చికిత్స ఉందా? - సుమతి, కాకినాడ మీవారికి వచ్చిన పక్షవాతం అన్నది సమస్య నాడీ సంబంధిత వ్యాధి. శరీరంలోని ఒక భాగం లేదా సగభాగం ప్రయత్నపూర్వకంగా కదలించలేకపోవడాన్ని పక్షవాతం అంటారు. మూతివంకరపోవడం, కాళ్లు, చేతులు మెలిదిరిగిపోవడం, గుండె కూడా సరిగా పనిచేయకపోవడం... ఇలా శరీరంలోని ప్రతి అవయవంపై దీని ప్రభావం ఉంటుంది. మనిషి బతికి ఉండగానే అచేతనం అయిపోయే విచిత్ర స్థితి పక్షవాతం. గతంలో ఇది వృద్ధుల్లోనే కనిపించేది. ఇటీవల చిన్న వయసు వారు సైతం దీనికి గురవుతున్నారు. పక్షవాతం వచ్చినప్పుడు ప్రతి సెకండ్‌కు 32 వేల నాడీకణాలు చనిపోతాయి. ఆ లెక్కన నిమిషానికి దాదాపు 19 లక్షల నాడీకణాలు చచ్చుబడిపోతాయి. మెదడుకు రక్తాన్ని చేరవేసే ధమనుల్లో జరిగే రక్తప్రవాహంలో రక్తపు గడ్డలు అడ్డుపడతాయి. దాంతో మెదడుకు రక్తప్రసారం తగ్గిపోయి అది పక్షవాతానికి దారితీస్తుంది. పక్షవాతంలో మెదడుకు తీరని నష్టం కలిగే అవకాశం ఉంది. అలా నష్టం కలిగే సమయంలో మృతిచెందే కణాలపైనే పక్షవాతం తీవ్రత ఆధారపడి ఉంది. అందుకే పక్షవాతం లక్షణాలు కనిపించిన వెంటనే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం చాలా అవసరం. కారణాలు: అధిక రక్తపోటు; అధిక బరువు డయాబెటిస్ పొగతాగడం, మద్యం వంటి అలవాట్లు కొలెస్ట్రాల్, గుండెజబ్బులు... ఇవి ఉన్నవారికి పక్షవాతం వచ్చే అవకావం ఉంది. లక్షణాలు: తిమ్మిర్లు; ఒక కాలు, చేతిలో శక్తి తగ్గినట్లు అనిపిస్తుంది మాట్లాడలేకపోవడం; ఇతరులు చెప్పింది అర్థం చేసుకోలేకపోవడం చూపు మసకబారుతుంది కాళ్లు, చేతులు వెనక్కుతిరిగిపోతాయి; మూతి వంకర తిరుగుతుంది. వ్యాధి నిర్ధారణ: ఎక్స్-రే, సీటీ స్కాన్, ఎమ్మారై స్కాన్, మైలోగ్రఫీ, ఎలెక్ట్రోమైలోగ్రఫీ. చికిత్స: పక్షవాతానికి హోమియోలో మంచి వైద్యచికిత్స అందుబాటులో ఉంది. ఈ చికిత్సతో పాటు ఫిజియోథెరపీ తీసుకుంటూ హోమియో మందులు వాడుతుంటే మంచి ఫలితాలను చూడవచ్చు. కాస్టికమ్, జెల్సీమియం, ప్లంబంమెట్ వంటి చాలా రకాలు హోమియోలో ఉన్నాయి. వీటిని డాక్టర్ పర్యవేక్షణలో వాడాలి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ హితంగా... మితంగా తినాలి డయాబెటిక్ కౌన్సెలింగ్ మా అమ్మగారి వయసు 64 ఏళ్లు. గత పదేళ్లుగా ఆమె డయాబెటిస్తో బాధపడుతున్నారు. డయాబెటిస్ అదుపులో లేకపోతే అనేక సమస్యలు వస్తాయని ఈమధ్య మా డాక్టర్ చెప్పారు. డయాబెటిస్‌ను అదుపులో ఉంచడానికి ఏం తినాలి? ఎలాంటి వ్యాయామం చేయాలి? - నరేశ్, మంచిర్యాల డయాబెటిస్ ఏ మేరకు అదుపులో ఉందో తెలుసుకోడానికి ఎఫ్బీఎస్, పీఎల్బీఎస్ వంటి పరీక్షలు నిర్వహిస్తారు. ముఖ్యంగా హెచ్‌బీఏ1సీ అనే పరీక్ష చేస్తారు. దీని ఫలితాలు 7 శాతం కంటే తక్కువగా ఉంటే డయాబెటిస్ అదుపులో ఉందని అర్థం. మీ అమ్మగారి వయసు ప్రకారం 7.5 శాతం ఉన్నా పర్వాలేదు. బీపీ మాత్రం 130 / 80 లోపల ఉండటం శ్రేయస్కరం. ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ 100 ఎంజీ/డీఎల్ కంటే తక్కువగా ఉండాలి. భోజన నియమాలకు వస్తే అన్నం, వైట్ బ్రెడ్ వంటివి మితంగా తినాలి. గోధుమ, జొన్న, పండ్లు, కూరగాయలు ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. ఉడకబెట్టినవి, ఆవిరి మీద ఉడికించినవి తినాలి. వేపుళ్లు చాలా తక్కువగా తినాలి. కొవ్వు ఎక్కువగా ఉండే మాంసం తీసుకోవద్దు. ఈ ఆహార నియమాలతో పాటు రోజుకు కనీసం 30 నిమిషాల తేలికపాటి వ్యాయామం చేయాలి. ఇలా వ్యాయామం చేయడం వల్ల ఎముకల క్షీణత తగ్గడంతో పాటు రక్తంలోని గ్లూకోజ్ పాళ్లు అదుపులోకి వస్తాయి. వీటి వల్ల శరీరం బరువు పెరగకుండా నివారించవచ్చు. వ్యాయామం మొదలుపెట్టే ముందర డాక్టర్ సలహా తీసుకోవాలి. డాక్టర్ వి. శ్రీ నాగేష్ కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ అండ్ డయాబెటాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్,హైదరాబాద్ . -
ఉదయం వేళలో ఎక్కువగా తలనొప్పి..!
న్యూరో కౌన్సెలింగ్ మా బాబు వయసు 12 ఏళ్లు. ఈమధ్య వాడికి ఉదయం పూట తీవ్రమైన తలనొప్పి వస్తోంది. దాంతోపాటు వాంతులు కూడా అవుతున్నాయి. రోజురోజూకూ నొప్పి పెరుగుతోంది. ఇంటి దగ్గర డాక్టర్‌కు సంప్రదిస్తే మందులు రాసిచ్చారు. వాడాము. కానీ ఏమాత్రం తగ్గలేదు. దీంతో స్పెషలిస్ట్‌ను కలిశాం. పిల్లాడికి బ్రెయిన్ ట్యూమర్ ఉందేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. మాకు విపరీతమైన బెంగ పట్టుకుంది. బ్రెయిన్ సీటీ చేయించమని సలహా ఇచ్చారు. రిపోర్ట్స్ బట్టి నిర్ధారణకు రాగలమని అంటున్నారు. అసలు బ్రెయిన్ ట్యూమర్ ఎందుకు వస్తుంది? అది నయం చేయలేని వ్యాధా? ఒకవేళ మా బాబుకు బ్రెయిన్ ట్యూమర్ అని తేలితే వాడి భవిష్యత్తు ఏమిటి? దయచేసి మాకు తగిన సలహా ఇవ్వండి. - జయలక్ష్మి, సోమాజీగూడ మీరు చెబుతున్న లక్షణాలు కొంచెం ఆందోళనకరంగానే ఉన్నాయి. మీరు ఎంతమాత్రమూ ఆలస్యం చేయకుండా బ్రెయిన్ సీటీ తీయించుకని డాక్టర్‌ను కలవండి. ఈమధ్యకాలంలో బ్రెయిన్ ట్యూమర్ అనేది పిల్లల్లో కూడా చలా ఎక్కువగా మనకు కనపడుతోంది. ఈ ట్యూమర్ కణజాలం మెదడులో అసాధారణంగా పెరుగుతూ దాని పనితీరును అడ్డుకుంటుంది. దానివల్ల మెదడుపై ఒత్తిడి పెరిగి అది తలనొప్పి రూపంలో బయటపడుతుంది. క్రమేణా మెదడుపై ఒత్తిడి తీవ్రమవుతున్న కొద్దీ తలనొప్పి భరించలేనంతగా పెరుగుతుంది. అంతేకాకుండా దీనికి వాంతులు కూడా తోడవుతాయి. బ్రెయిన్ ట్యూమర్ బారిన పడ్డవాల్లకు మీరు చెప్పిన లక్షణాలు ఉదయం పూట ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇలాంటి సమయంలో వెంటనే డాక్టర్‌ను సంప్రదిస్తే వారు తగిన పరీక్షలు చేయించి, బాబుకు అందించాల్సిన చికిత్స విషయంలో తగిన నిర్ధారణకు రాగలుగుతారు. మీరు ఆందోళన చెందుతున్నట్లుగా బ్రెయిన్ ట్యూమర్ అనేది అంత భయపడాల్సిన వ్యాధి కాదు. కాకపోతే మెదడులో ట్యూమర్ ఉన్న స్థానం, దాని పరిమాణం అనే అంశాలను బట్టి చికిత్స, ఫలితాలు ఉంటాయి. అన్ని ట్యూమర్లూ ప్రాణాంతకమైనవి కావు. క్యాన్సర్ కారకాలు కావు. మీ అబ్బాయికి ట్యూమర్ మొదటి దశలోనే ఉంటే, దానిని సమూలంగా తొలగించవచ్చు. ఇప్పుడు అందుబాటులో ఉన్న అత్యాధునిక బ్రెయిన్ సర్జరీ ప్రక్రియలతో, నిపుణులైన న్యూరో సర్జన్ ఆధ్వర్యంలో శస్త్రచికిత్స జరిగితే మీ బాబుకు వచ్చిన సమస్యనూ పూర్తిగా నయం చేయవచ్చు. మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. - డాక్టర్ పి.రంగనాథమ్ సీనియర్ న్యూరో సర్జన్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ కిడ్నీ కౌన్సెలింగ్ నా వయసు 35 ఏళ్లు. నాకు ఏ విధమైన ఇబ్బందులూ లేవు. కానీ జ్వరం వచ్చినప్పుడు ఒకసారి డాక్టర్‌కు చూపించుకుంటే బీపీ 170 / 120 అని చెప్పి, మందులు వాడాలన్నారు. మందులు వాడకపోతే భవిష్యత్తులో కిడ్నీ సమస్య వచ్చే అవకాశం ఉందా? - రవిందర్, పాల్వంచ ఈ వయసులో ఏ కారణం లేకుండా బీపీ రావడం చాలా అరుదు. ముఫ్ఫై ఏళ్లలోపు బీపీ ఇంత ఎక్కువగా ఉన్నప్పుడు కిడ్నీ సమస్య ఏమైనా ఉందేమోనని చూడాలి. మీరు ముందుగా యూరిన్ టెస్ట్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్, క్రియాటినిన్‌తో పాటు కొన్ని ఇతర పరీక్షలు చేయించుకోండి. ఏ లక్షణాలూ లేనప్పటికీ బీపీ నియంత్రణలో ఉండటానికి మందులు వాడాలి. లేకపోతే భవిష్యత్తులో కిడ్నీ దెబ్బతినే అవకాశం ఉంది. మందులు వాడటమే కాకుండా, ఆహారంలో ఉప్పు తగ్గించడం వంటి జీవనశైలికి సంబంధించిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. రోజూ క్రమం తప్పకుండా ఒక గంటకు తగ్గకుండా వాకింగ్ చేయాలి. బరువు ఎక్కువగా ఉన్నట్లయితే, మీ ఎత్తుకు తగినట్లుగా దాన్ని నియంత్రించుకోవాలి. పొగతాగే అలవాటు ఉంటే తప్పనిసరిగా మానేయాలి. నా వయసు 32 ఏళ్లు. గత ఐదేళ్ల నుంచి అప్పుడప్పుడు మూత్రం ఎర్రగా వస్తోంది. ప్రతిసారి రెండు మూడు రోజుల తర్వాత తగ్గిపోతోంది. నొప్పి ఏమీ లేదు. ఇలా రావడం వల్ల భవిష్యత్తులో నాకు ఏదైనా సమస్య వస్తుందా? ఈ లక్షణాలు కనిపిస్తున్నాయంటే కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉందా? - అప్పారావు, నరసన్నపేట మీరు చెప్పినట్లుగా మూత్రంలో చాలాసార్లు రక్తం పోతూ ఉంటే, ఏ కారణం వల్ల అలా జరుగుతోందన్న విషయాన్ని తెలుసుకుని, దానికి అనుగుణంగా చికిత్స తీసుకోవాలి. ఇలా జరగడానికి కిడ్నీలో రాళ్లు గానీ, ఇన్ఫెక్షన్ గానీ, లేదా కిడ్నీ సమస్యగానీ ఉండటం కారణం కావచ్చు. ఒకసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్‌తో పాటు మూత్రపరీక్ష చేయించుకోండి. కిడ్నీలో రాళ్లుగానీ, ఇన్ఫెక్షన్గానీ లేకుండా ఇలా రక్తం పోతూ ఉంటే మూత్రంలో ప్రోటీన్ పోతుందేమో అని పరీక్ష చేయించుకోవాలి. రక్తంతో పాటు ప్రోటీన్లు కూడా మూత్రంతో పాటు పోతూ ఉంటే, కిడ్నీ బయాప్సీ చేయించుకొని, ఆ రిపోర్టులను బట్టి కిడ్నీలు దెబ్బతినకుండా మందులు వాడాల్సి ఉంటుంది. - డాక్టర్ విక్రాంత్‌రెడ్డి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ పల్మునాలజీ కౌన్సెలింగ్ మా అబ్బాయి వయసు 12 ఏళ్లు. అతడు ఎప్పుడూ పొడి దగ్గుతో బాధపడుతున్నాడు. గత రెండు నెలలుగా కొద్దిపాటి జ్వరం ఉంటోంది. వాడికి శ్వాస సరిగా ఆడటం లేదు. మాకు దగ్గర్లోని డాక్టర్‌ను సంప్రదించి మందులు వాడినా సమస్య తగ్గడం లేదు. మావాడి సమస్యకు పరిష్కారం చెప్పండి. - సీతారామయ్య, కొత్తగూడెం మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ అబ్బాయి కాఫ్ వేరియంట్ ఆస్తమాతో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. ఇది ఆస్తమాలోనే ఒక రకం. ఇది వచ్చిన వారిలో తెమడ వంటివి పడకుండా పొడిదగ్గు వస్తూ ఉంటుంది. పిల్లికూతలు లాంటి లక్షణాలు కూడా మొదట్లో ఉండవు. దీన్నే ‘క్రానిక్ కాఫ్’ (దీర్ఘకాలిక దగ్గు) అని కూడా అంటారు. రాత్రీ పగలూ తేడా లేకుండా దాదాపు రెండు నెలలపాటు దగ్గుతుంటారు. దాంతో రాత్రివేళ నిద్ర కూడా పట్టదు. ఈ రోగులు తమకు సరిపడని ఘాటైన వాసనలు, దుమ్ము, ధూళి వంటి వాటికి ఎక్స్పోజ్ అయితే ఆ అలర్జెన్స్ ఆస్తమాను మరింతగా ప్రేరేపిస్తాయి. కాఫ్ వేరియెంట్ ఆస్తమా సమస్య ఎవరికైనా, ఏ వయసులోనైనా రావచ్చు. ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఇది ఎక్కువ. ఇది ఆ తర్వాత సాధారణ ఆస్తమాకు దారితీస్తుంది. అంటే శ్వాస అందకపోవడం, పిల్లికూతలు వంటి లక్షణాలు తర్వాతి దశలో కనిపిస్తాయి. సాధారణ ఆస్తమా లాగే కాఫ్ వేరియెంట్ ఆస్తమాకు కూడా కారణాలు అంతగా తెలియవు. కాకపోతే సరిపడని పదార్థాలు, చల్లగాలి దీనికి కారణాలుగా భావిస్తుంటారు. కొందరిలో అధిక రక్తపోటు, గుండెజబ్బులు, హార్ట్‌ఫెయిల్యూర్, మైగ్రేన్, గుండెదడ (పాల్పిటేషన్స్) వంటి జబ్బులకు వాడే మందులైన బీటా-బ్లాకర్స్ తీసుకున్న తర్వాత ‘కాఫ్ వేరియెంట్ ఆస్తమా’ మొదలు కావచ్చు. కొందరిలో గ్లకోమా వంటి కంటిజబ్బులకు వాడే చుక్కల మందులోనూ బీటా బ్లాకర్స్ ఉండి, అవి కూడా ఆస్తమాను ప్రేరేపిస్తాయని కూడా అధ్యయనాలు చెబుతున్నాయి. కొందరిలో ఆస్పిరిన్ సరిపడకపోవడం వల్ల కూడా దగ్గుతో కూడిన ఆస్తమా రావచ్చు. కాఫ్ వేరియెంట్ ఆస్తమాలో కేవలం దగ్గు తప్ప ఇతర లక్షణాలేమీ కనిపించకపోవడం వల్ల దీని నిర్ధారణ ఒకింత కష్టమే. ఎందుకంటే కాఫ్ వేరియెంట్ ఆస్తమా విషయంలో సాధారణ పరీక్షలైన ఛాతీఎక్స్‌రే, స్పైరోమెట్రీ వంటి పరీక్షలూ నార్మల్‌గానే ఉంటాయి. మీరు వెంటనే మీకు దగ్గర్లో ఉన్న ఛాతీ నిపుణుడిని కలవండి. వారు కొన్ని వైద్య పరీక్షలు చేయించి, వ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాత తగిన చికిత్స సూచిస్తారు. - డా. రమణ ప్రసాద్ ..కన్సల్టెంట్ పల్మునాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్ కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ మా చిరునామా: వైద్యసలహా కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్- 34. ఈ మెయిల్: asksakshidoctor@gmail.com నిర్వహణ: యాసీన్ -
వేసవిలోనూ సైనసైటిస్ సమస్య..!
కిడ్నీ కౌన్సెలింగ్ నా వయసు 40 ఏళ్లు. నేను ఉద్యోగరీత్యా చాలా దూర ప్రయాణాలు చేస్తుంటాను. ఇప్పటివరకు నాకెలాంటి ఆరోగ్య సమస్యా రాలేదు. కానీ గత రెండు మూడు నెలల నుంచి దూరప్రయాణాలు చేసి వచ్చిన తర్వాత నా రెండు కాళ్లు వాస్తున్నాయి. అలాగే మూత్రం నురగగా వస్తోంది. అంతేకాకుండా రాత్రిళ్లు ఎక్కువగా మూత్రం వస్తోంది. అసలు ఇలా ఎందుకు జరుగుతోంది. ఇప్పటివరకు ఈ సమస్యపై ఏ డాక్టర్‌నూ కలవలేదు. దయచేసి నా అనుమానాలను నివృత్తి చేయండి. - గోపాల్, హైదరాబాద్ మూత్రపిండాల సమస్యలో ఐదు దశలు ఉంటాయి. మొదటి దశ, రెండో దశలో అసలు వ్యాధి లక్షణాలు కనిపించవు. మూడో దశలో ఆకలి మందగించడం, నీరసం, ముఖం వాచినట్లుగా ఉండటం, కాళ్లలో వాపు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నాలుగో దశ, ఐదో దశలో కన్ను చుట్టూ వాపు రావడం, జబ్బు ఎక్కువవుతున్న కొద్దీ వాపు ఎక్కువవుతుండటం, మూత్రం తగ్గిపోవడం, ఫిట్స్ రావడం, కొన్ని సందర్భాల్లో నడుము నొప్పి రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక ఐదో దశ వచ్చేసరికి కిడ్నీ పనితీరు బాగా తగ్గిపోతుంది. దురదృష్టవశాత్తు చాలామందిలో వ్యాధి ఈ దశకు చేరుకున్న తర్వాతనే వైద్యులను సంప్రదిస్తున్నారు. వ్యాధి ఐదో దశకు చేరిన తర్వాత మళ్లీ దానిని సాధారణ స్థితికి తీసుకురాలేము. అందువల్ల క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదిస్తూ చికిత్స కొనసాగించడం ఒక్కటే మార్గం. అయితే మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చేస్తుంటే మీ కిడ్నీలో ఏవో అసాధారణ మార్పులు చోటుచేసుకుటున్నాయని చెప్పవచ్చు. కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారిలో మీరు చెప్పిన లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా నిపుణులైన వైద్యులను సంప్రదించండి. మీకు తగిన పరీక్షలు నిర్వహించి చికిత్స చేస్తారు. ఆలస్యం చేయకూడదు. గుండెజబ్బులాగా కిడ్నీ సంబంధిత వ్యాధులకు కూడా సమయమే అత్యంత కీలకం. వ్యాధి మొదటి దశలో ఉంటే మీకు సులువుగా చికిత్స నిర్వహించే అవకాశం ఉంది. అలాగే మీ కిడ్నీ కూడా పదిలంగా ఉంటుంది. అలా కాకుండా పరీక్షలలో ఏదైనా సివియారిటీ కనిపిస్తే కూడా మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. అందుబాటులోకి వచ్చిన నూతన వైద్య ప్రక్రియలతో మీ కిడ్నీ సంబంధిత వ్యాధులను సమూలంగా పరిష్కరించే అవకాశం ఉంది. న్యూరో కౌన్సెలింగ్ నా వయసు 45 ఏళ్లు. నేను గత మూడు నెలలుగా నడుము నొప్పితో బాధపడుతున్నాను. పదిరోజులుగా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాను. ఎటూ కదలలేకుండా అవుతోంది. నడుము నుంచి పాదాల వరకు తిమ్మిర్లు వస్తున్నాయి. మూడు రోజులుగా మూత్రం కూడా ఆగి, ఆగి వస్తోంది. ఎమ్మారై స్కానింగ్ చేయించాను. కొంతమంది సర్జరీ అవసరమని, మరి కొంతమంది వద్దంటున్నారు. సర్జరీ చేయించుకుంటే కాలు పడిపోవచ్చని మా కొలీగ్స్ భయపడుతున్నారు. నాకు తగిన సలహా ఇవ్వగలరు. - నరేంద్రనాథ్, రాజమండ్రి మీరు ఎల్5 /ఎస్ 1 ర్యాడికులోపతి అనే సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే నొప్పి మాత్రమే ఉన్నవారిలో, నముడుకు బెల్ట్ వేసుకోవడం, మందులు తీసుకోవడం, రెస్ట్ తీసుకోవడంతో ఈ సమస్య తీవ్రతను తగ్గించవచ్చు. దాదాపు 80 శాతం మందిలో ఇలా తగ్గించడం సాధ్యమవుతుంది. మిగతా వారిలో సర్జరీ అవసరం పడవచ్చు. కాళ్లకి సంబంధించిన నరాలు, మలవిసర్జన, మూత్ర విసర్జనకు అవసరమైన నరాలు అన్నీ నడుము నుంచే కిందికి వెళ్తాయి. అయితే నడుము ఎముకలు అరిగినప్పుడు డిస్క్‌లు జారి, నరాలు ఒత్తుకోవడం వల్ల నడుము నొప్పి, తిమ్మిర్లు, మూత్రంలో ఇబ్బంది రావచ్చు. ఒక్కోసారి కాళ్లలో బలం తగ్గిపోయినా, మూత్రవిసర్జనలో ఇబ్బంది ఎదురైనా వెంటనే శస్త్రచికిత్స చేయించుకోవడం అవసరం. సమయం గడుస్తున్నకొద్దీ పరిస్థితి మరింత జటిలం అవుతుంది. మీరు చెబుతున్న లక్షణాలను బట్టి న్యూరోసర్జన్ చేత మీరు ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మైక్రోస్కోప్ ద్వారా కేవలం గంట కంటే తక్కువ సమయంలోనే సర్జరీ చేయించుకోవచ్చు. మూడు రోజులలో నడుచుకుంటూ ఇంటికి కూడా వెళ్లిపోవచ్చు. అయితే అన్ని వసతులు, వైద్య సౌకర్యాలు ఉన్న హాస్పిటల్లోనూ, నిపుణులు, అనుభవజ్ఞులైన న్యూరోసర్జన్ చేత మీరు ఆపరేషన్ చేయించుకుంటే మీకు ఎలాంటి ఇబ్బందీ తలెత్తదు. హోమియో కౌన్సెలింగ్ నా వయసు 40 ఏళ్లు. ఎండ వేడికి తట్టుకోలేక ఇంట్లో కూలర్ వాడుతున్నాం. శీతల పానియాలూ ఎక్కువగానే తాగాను. దాంతో జలుబు వచ్చింది. తల అంతా భారంగా ఉంది. ఎంతకీ తగ్గడం లేదు. హోమియోలో చికిత్స ఉందా? - సురేశ్‌కుమార్, ఖమ్మం కొన్ని రకాల వ్యాధులు సాధారణంగా కొన్ని కాలాలలోనే ఎక్కువగా కనిపిస్తుంటాయి. వాటిలో సైనసైటిస్ ఒకటి. గతంలో వానాకాలం, చలికాలంలో ఉద్ధృతమయ్యే ఈ సమస్య కొందరిలో వేసవిలోనూ కనిపిస్తోంది. ఇందుకు వాతావరణంతో పాటు జీవనశైలిలోని మార్పులూ కారణమవుతున్నాయి. మన తలలో ముక్కు పక్కన, నుదుటి దగ్గర ఉండే నాలుగు జతల గదులను ై‘సెనస్’లు అంటారు. ముఖంలోని గాలి గదుల్లో వచ్చే వాపునే వైద్యపరిభాషలో సైనసైటిస్ అంటారు. ఈ వాపే కొన్ని సందర్భాల్లో బ్యాక్టీరియా, వైరస్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్గా మారే అవకాశాలు ఉంటాయి. ఈ ఇన్ఫెక్షన్లలో ‘అక్యూట్ సైనసైటిస్’, ‘క్రానిక్ సైనసైటిస్’ అనే రెండు రకాలు ఉంటాయి. రెండో రకంలో సమస్య దీర్ఘకాలంపాటు ఉంటుంది. సాధారణంగా ఎవరికైనా జలుబు చేసినప్పుడు మందులు వాడి, దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తారు. కొన్నిసార్లు జలుబు మందులతో తగ్గిపోవచ్చు లేదా తగ్గినట్లే తగ్గి మళ్లీ తిరగబెట్టవచ్చు. ఇలా పదే పదే జలుబు వేధిస్తుంటే సైనసైటిస్ ఉన్నట్లుగా భావించవచ్చు. ప్రస్తుతం వేసవిలో కూడా సైనసైటిస్ ఎక్కువగానే బాధిస్తున్న కేసులు వస్తున్నాయి. కాలుష్యం, దుమ్ము, పొగ వంటి అంశాలతో ఇది వేసవి సీజన్లోనూ కనిపిస్తోంది. వేసవిలో సైనసైటిస్‌కు కారణాలు : అలర్జిక్ తత్వం ఉన్నవారు వేసవిలో కూల్‌డ్రింక్స్, చల్లటి ఫ్రిజ్ నీళ్లు తాగడం వల్ల అలర్జిక్ రైనైటిస్, అలర్జిక్ సైనసైటిస్‌కు గురయ్యే అవకాశం ఉంది. వేసవిలో వర్షాలు కురిసినప్పుడు ఉష్ణోగ్రతల్లో చోటు చేసుకునే విపరీతమైన మార్పుల వల్ల కూడా సైనస్‌లు ప్రభావితమవుతాయి వేసవి సీజన్లో ఈతకొలనులలో ఎక్కువసేపు గడపడం జనసమ్మర్థం ఎక్కువగా ఉండే ప్రదేశాలలో (సినిమా థియేటర్లు, కళ్యాణమండపాలు) ఎక్కువగా గడపడం కూడా సైనసైటిస్ వ్యాప్తికి కారణమే వేసవిలో ఎయిర్‌కూలర్స్ వాడటం, వాటిలోని నీళ్లను మార్చకపోవడం, నిల్వ నీటినే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండటం వల్ల ఆ నీళ్లు కలుషితం కావడం కూడా ఈ సమస్యకు దారితీయవచ్చు. అలాగే కూలర్స్లోని మ్యాట్స్‌లో ఉండే ఫంగస్ చేరి ఫంగల్ సైనసైటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. లక్షణాలు : కనురెప్పల వాపు వాసనలు తెలియకపోవడం తరచూ వచ్చే జ్వరం తలనొప్పి ముక్కుదిబ్బడ చిక్కటి పసుపుపచ్చ / ఆకుపచ్చ రంగులో ముక్కుస్రావాలు నోటి దుర్వాసన వ్యాధి నిర్ధారణ : సైనస్ ఎండోస్కోపీ, నోటి పరీక్ష, ఊపిరితిత్తుల పరీక్ష, ఎక్స్-రే, సీటీ స్కాన్, సైనస్ కల్చర్ వంటి పరీక్షలు సమస్య నిర్ధారణకు తోడ్పడతాయి. చికిత్స : సైనసైటిస్‌కు హోమియోలో అద్భుతమైన చికిత్స అందుబాటులో ఉంది. మందుల ద్వారా నివారణ మాత్రమే గాక... వ్యాధి నిరోధక శక్తిని పెంచి మళ్లీ మళ్లీ రాకుండా చేయవచ్చు. సైనసైటిస్‌కు హోమియోలో కాలి సల్ఫ్, హెపార్ సల్ఫ్, మెర్క్‌సాల్, సాంగ్యునేరియా, లెమ్నా మైనర్, స్పైజీలియా వంటి మందులు మంచి ఫలితాలు ఇస్తాయి. అయితే వీటిని అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. -
నడుం నొప్పికి ఆపరేషనా?
న్యూరో కౌన్సెలింగ్ నా వయసు 38 ఏళ్లు. నాకు ఇద్దరు పిల్లలు. ప్రతి రోజూ ఆఫీసుకు వెళ్లడానికీ, అక్కడ్నుంచి రావడానికి అంటూ దాదాపు 50 కి.మీ. పైనే బైక్ మీద తిరుగుతుంటాను. ఇటీవల తీవ్రంగా నడుము నొప్పి బాధిస్తోంది. దీంతో ఆర్థోపెడిక్ డాక్టర్‌ను సంప్రదించారు. ఆయన ఏకంగా నడుముకు శస్త్రచికిత్స చేయాలన్నారు. కేవలం నడుము నొప్పి అంటే సర్జరీ అంటున్నారేమిటి? నాకు చాలా ఆందోళనగా ఉంది. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి. - రజనీ, తార్నాక (హైదరాబాద్) ఈమధ్య కాలంలో చాలా మందిని ఈ సమస్య పట్టి పీడిస్తోంది. వివిధ రకాల ఒత్తిడి, జీవన విధానంలో మార్పులు, అధిక బరువులెత్తడం చాలాసేపు ఒకే భంగిమలో ఉండటం, ముందుకు ఒంగి పనిచేయడం, రోజూ చాలా దూరం బైక్‌పై ప్రయాణం చేయడం వంటి కారణాలతో వెన్నెముక మీద ఒత్తిడి ఏర్పడి ఈ సమస్య తలెత్తుతోంది. మీరు ఇటు ఇంట్లో పని చేసుకుంటూ ఆపై ఆఫీసుకు బండి మీద వెళ్లి అక్కడ కూడా శ్రమపడుతున్నారు. అంటే మీరు శారీరక ఒత్తిడికి అధికంగా లోనవుతున్నట్లు అర్థమతువోతంది. మీరు వెన్నుపూసకు ఎక్స్‌రే తీయించారా? ఆ పరీక్ష ఫలితాలను చూసి డాక్టర్ మీకు సర్జరీ చేయించమని సలహా ఇచ్చినట్లయితే మీరు ‘స్పాండిలోలిస్తెసిస్’ అనే సమస్యతో తీవ్రంగా బాధపడుతున్నట్లు నిర్ధారణ చేయవచ్చు. ఈ సమస్యతో బాధపడుతున్నవారిలో కొంతమందికి మందులతోనే నయమైతే, మరికొందరికి నడు కింది భాగంలో బెల్ట్ పెట్టుకోవాల్సి వస్తుంది. అవసరాన్ని బట్టి వైద్యులు వాకింగ్, యోగా లాంటి వ్యాయామాలు సూచిస్తారు. అప్పటికీ తగ్గకపోతే శస్త్రచికిత్స నిర్వహించి, వెన్నుపూస లోపల జారిపోయిన ఎముకను సాధారణ స్థితికి తీసుకువచ్చి స్క్రూస్, రాడ్స్ బిగించి, నరాలు ఒత్తిడికి గురికాకుండా చేస్తారు. ఈ విషయంలో మీరు ఆందోళనపడాల్సిందేమీ లేదు. వెన్నుకు ఆపరేషన్ చేసే విధానాలలో సురక్షితమైన శస్త్రచికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. వెన్నెముక సమస్య ఎక్కడ ఉందో తెలుసుకొని, మిగతా భాగాలు దెబ్బతినకుండా మినిమల్లీ ఇన్వేసివ్ విధానంలో తక్కువ కోతతో ఆపరేషన్ నిర్వహించగలుగుతారు. ఈ విధానంలో వెన్నుపాముకి ఒక అంగుళం లేదా అంతకన్నా తక్కువ పరిమాణంలో ఒక చిన్న రంధ్రం పెడతారు. దీన్నే కీ-హోల్ అంటారు. శరీరంపై చిన్న కోత మాత్రమే ఉంటుంది కాబట్టి గాయం త్వరగా మానిపోతుంది. శస్త్రచికిత్స నిర్వహించిన రోజున లేదా మర్నాడు రోగిని ఇంటికి పంపించేస్తారు. కాబట్టి మీ ఉద్యోగానికి కూడా ఎక్కువ రోజులు సెలవు పెట్టుకోనవసరం లేదు. - డాక్టర్ ఆనంద్ బాలసుబ్రహ్మణ్యం సీనియర్ న్యూరో సర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
తలనొప్పి తగ్గేదెలా..?
న్యూరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 23 ఏళ్లు. నేను గత పదేళ్లుగా తలనొప్పితో బాధపడుతున్నాను. తలనొప్పి వచ్చే ముందు చూపు సరిగా కనిపించడం లేదు. తలనొప్పితోబాటు వాంతులు కూడా అవుతున్నాయి. ఏ చిన్న శబ్దం విన్నా, ఎండ చూసినా తట్టుకోలేకపోతున్నాను. మా అమ్మగారికి కూడా ఇలాగే తలనొప్పి వస్తుండేది. దయచేసి నాకు సరైన సలహా ఇవ్వండి. -హారిక, వరంగల్ మీరు మైగ్రేన్ అనే జబ్బుతో బాధపడుతున్నారు. ఇది ముఖ్యంగా యుక్తవయస్కులలో ఎక్కువగా వస్తుంటుంది. వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంది. మైగ్రేన్ ఉన్నవారు వేళకు భోజనం చేయడం, నిద్రపోవడం, ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉండటం మంచిది. ఈ వ్యాధి ఉన్నవారు టీవీ ఎక్కువ చూడటం, బాగా ఎండలోగానీ / చలిలోగాని బయటకు వెళ్లడం చేయకూడదు. పని ఒత్తిడి ఎక్కువైనా ఈ తలనొప్పి రావచ్చు. సరైన పొజిషన్లో కూర్చొని పనిచేయడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా కూడా దీన్ని అదుపు చేయవచ్చు. ఈ జాగ్రత్తలు పాటిస్తూ, కొన్ని మందులు వాడటం వల్ల జబ్బు పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంది. మీకు దగ్గర్లోని న్యూరాలజిస్ట్‌ను సంప్రదించండి నాకు 26 ఏళ్లు. గత మూడు నెలలుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నాను. తల చుట్టూ తాడు బిగించినట్లుగా నొప్పి వస్తోంది. ఒక్కోసారి రోజంతా కూడా ఉంటుంది. పరిష్కారం చెప్పండి. - తుషార్, హైదరాబాద్ మీరు చెప్పినదాన్ని బట్టి మీరు టెన్షన్ తలనొప్పితో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. ఆలోచనలు ఎక్కువ కావడం, మానసిక ఒత్తిడి, పని ఒత్తిడి ఎక్కువైనా, మానవ సంబంధాలలో మార్పుల వల్ల కూడా తలనొప్పి రావచ్చు. ఒత్తిడి తగ్గించే రిలాక్సేషన్ థెరపీ, కౌన్సెలింగ్ వంటి వాటి ద్వారా కొన్ని మందులు వాడటం వల్ల కూడా ఈ తరహా తలనొప్పిని కొంతవరకు తగ్గించవచ్చు. అయితే మీ తలనొప్పికి ఇతర కారణాలు కూడా ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోడానికి ఒకసారి డాక్టర్‌కు చూపించండి. - డా.మురళీధర్ రెడ్డి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్,కేర్ హాస్పిటల్, బంజారాహిల్స్,హైదరాబాద్ -
‘న్యూరోలైఫ్’ తో న్యూ లైఫ్
న్యూయార్క్: ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అద్భుతమైన ‘స్మార్ట్’ పరికరాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ పరికరం పేరు‘ న్యూరోలైఫ్’. వెన్నుపూస దెబ్బతిని మంచానికే పరిమితమైన వారిలో ఈ పరికరాన్ని ఉపయోగించి కదలికను తీసుకొచ్చారు. ఓహియో స్టేట్ వర్సిటీ వేక్స్నర్ మెడికల్ సెంటర్‌కు చెందిన న్యూరో శాస్త్రవేత్తలతో కలిసి బట్టేల్లే రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఈ ప్రయోగం చేసింది. వెన్నుపూస దెబ్బతిని మంచానికే పరిమితమైన 24 ఏళ్ల యువకుడి మీద ఈ ప్రయోగం చేసి విజయం సాధించారు. అతని మెదడులో చిన్న కంప్యూటర్ చిప్‌ను ఉంచి ఎలక్ట్రానిక్ న్యూరల్ బైపాస్ ద్వారా మెదడు నుంచి సంకే తాలను కండరాలకు చేరి తద్వారా కదలికలను వీరు గమనించారు. -
అది పక్షవాతం కాదు... బెల్స్పాల్సీ
న్యూరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 50 ఏళ్లు. నాకు ఉన్నట్టుండి మూడు రోజులుగా కుడివైపు మూతి వంకరపోతోంది. కనురెప్ప మూసుకుపోవడం లేదు. ఇది పక్షవాత లక్షణమా? - నిరంజనరావు, కర్నూలు మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు ‘బెల్స్ పాల్సీ’ అనే జబ్బుతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ముఖానికి వెళ్లే ఒక నరం దెబ్బతినడం వల్ల, వైరల్ జ్వరాల కారణంగా కూడా ఇది రావచ్చు. అయితే ఇది పక్షవాతం అనే అపోహ ఉంది. అది నిజం కాదు. కొన్ని రకాల మందులతో దీన్ని తగ్గించవచ్చు. ముఖానికి ఫిజియోథెరపీ చేయడంతోనూ, ఫేషియల్ స్టిమ్యులేషన్తోనూ ఇది తగ్గే అవకాశం ఉంది. ఈ జబ్బు వచ్చిన 80 శాతం మందిలో రెండు నెలల్లోనే నయమవుతుంది. కొంతమందిలో ఇది రెండోవైపు కూడా వచ్చి చేతులు, కాళ్లు కూడా చచ్చుబడ్డట్టు ఉండవచ్చు. అలా జరిగితే ఆసుపత్రిలో అడ్మిట్ అయి వైద్యం చేయించుకోవాలి. ఆందోళనపడనక్కరలేదు. డాక్టరును సంప్రదించి సరైన మందులు, ఫిజియోథెరపీ తీసుకోండి. బెల్స్ పాల్సీ తప్పక నయమవుతుంది. మా అబ్బాయి వయసు 15 ఏళ్లు. ఏడాది నుంచి చాలా నీరసంగా కనిపిస్తున్నాడు. ఏ పని చేయాలన్నా చాలా సమయం తీసుకుంటున్నాడు. ఒక్కోసారి చేతులు, మెడ వంకర్లు పోతున్నాయి. తగిన సలహా ఇవ్వండి. - ఆనందరావు, నూజివీడు ఈ వయసులో ఉన్న పిల్లల్లో ‘విల్సన్ డిసీజ్’ అనే జబ్బు రావచ్చు. ఈ జబ్బు వచ్చిన వారిలో చేతులు, కాళ్లు వంకర్లు పోవడం, మాట స్పష్టంగా రాకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నీళ్లు కూడా మింగలేకపోవడం జరగవచ్చు. ఈ జబ్బును ‘స్లిట్ లాంప్’ పరీక్ష, కొన్ని రక్తపరీక్షలు, ఎమ్మారై స్కానింగ్ పరీక్షలతో నిర్ధారణ చేయవచ్చు. మన శరీరంలో ‘కాపర్’ ఎక్కువగా పేరుకుపోవడం వల్ల ఈ జబ్బు వస్తుంది. దీన్ని కొన్ని మందులతో తగ్గించవచ్చు. చేతులు కాళ్లు వంకరలు తగ్గడానికి కూడా మందులు ఉంటాయి. అయితే కొన్ని నెలలు మొదలుకొని, కొన్నేళ్ల వరకు వాడాల్సి రావచ్చు. ఇది జన్యుపరమైన జబ్బు కాబట్టి ఒకే కుటుంబంలోని చాలా మంది పిల్లల్లోనూ వచ్చే అవకాశం ఉంది. దీన్ని నివారించాలంటే దగ్గరి సంబంధాల్లో పెళ్లిళ్లు చేసుకోకపోవడమే మంచిది. డర్మటాలజీ కౌన్సెలింగ్ ఎండలోకి వెళ్లినప్పుడల్లా నా ముఖం, మెడ భాగాలు ఎర్రగా మారుతున్నాయి. ఈ ఎర్రమచ్చల్లో దురదగా ఉంటోంది. గత పది రోజుల నుంచి ఈ పరిణామాన్ని గమనిస్తున్నాను. దయచేసి నా సమస్యకు పరిష్కారం చెప్పండి. - వనజ, గుంటూరు మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీకు సన్‌బర్న్స్ వస్తున్నట్లు అనిపిస్తోంది. ఇది ‘ఫొటోసెన్సిటివిటీ’ ఉన్నవారిలో ఈ వేసవిలో ఇది చాలా సాధారణ సమస్య. దీనికోసం ఈ కింది సూచనలు పాటించండి. ► ఆ ఎర్రమచ్చల మీద ‘డెసోనైడ్’ అనే మైల్డ్ స్టెరాయిడ్ ఉన్న క్రీము ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం రాసుకుంటూ పదిరోజుల పాటు వాడండి. ► ఎండలో బయటకు వెళ్లే ముందు 50 ప్లస్ ఎస్పీఎఫ్ ఉన్న సన్ స్క్రీన్ రాయండి. ప్రతిరోజూ ఉదయం రాసుకొని బయటకు వెళ్లడంతో పాటు ప్రతి రెండు గంటలకు ఒకసారి సన్‌స్క్రీన్ క్రీమ్ రాసుకుంటూ ఉండాలి. ► ప్రతిరోజూ యాంటీ ఆక్సిడెంట్స్ ట్యాబ్లెట్లను ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత తీసుకోండి. ఇవి కనీసం మూడు నెలల పాటు వాడండి. మంచి రంగు ఉండే తాజా పండ్లు ఎక్కువగా తినండి. అలాగే ముదురు ఆకుపచ్చరంగులో ఉండే ఆకుకూరలు ఎక్కువగా వాడాలి. ► అలాగే క్యారట్, క్యాప్సిక ం (పసుపు పచ్చరంగులో ఉండేవి) ఎక్కువగా తీసుకోవాలి. ► పైన పేర్కొన్న జాగ్రత్తలతో పాటు రోజూ కనీసం 20 నిమిషాలు వ్యాయామం చేయడం వల్ల మన ప్రతి కణం పునరుత్తేజం పొందుతుంది. పై సూచనలు పాటించాక కూడా సమస్య పరిష్కారం కాకపోతే ఒకసారి డర్మటాలజిస్ట్‌ను సంప్రదించండి. హోమియో కౌన్సెలింగ్ నా వయసు 45 సంవత్సరాలు. కొంతకాలంగా మూత్రంలో మంట, అప్పుడప్పుడు చీము, రక్తం పడటం, నడుంనొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నాను. డాక్టర్ని సంప్రదిస్తే కిడ్నీలు ఇన్ఫెక్షన్కి గురైనాయని చెప్పారు. మందులు వాడుతున్నా, సమస్య పూర్తిగా తగ్గడం లేదు. హోమిమో చికిత్స ద్వారా నా సమస్యకి పరిష్కారం లభిస్తుందా? సలహా ఇవ్వగలరు. - అపర్ణ, విజయవాడ మన శరీరంలో మూత్రపిండాలది అత్యంత కీలకమైన పాత్ర. అవి నిరంతరం రక్తాన్ని వడపోసి, శరీరంలోని మలినాలను, అధిక నీటిశాతాన్ని మూత్రం ద్వారా బయటకు పంపించడమే కాకుండా శరీరానికి అవసరమయ్యే లవణాల సమతుల్యతనూ కాపాడతాయి. అలాగే రక్త పీడనాన్ని కూడా నియంత్రిస్తుంటాయి. నేటి ఆధునిక జీవనశైలి వలన ఎక్కువ మంది తరచు మూత్రపిండాల ఇన్ఫెక్షన్లకు గురౌతున్నారు. మూత్రపిండాలు, మూత్రనాళాలు, మూత్రాశయం అన్నీ వస్తాయి. సాధారణంగా రక్తప్రవాహం ద్వారా కానీ, మూత్రకోశ ఇన్ఫెక్షన్స్ ద్వారా కానీ మూత్రపిండాలకు ఇన్ఫెక్షన్ సంభవిస్తుంది. కారణాలు:మూత్ర వ్యవస్థకు సంబంధించిన ఇన్ఫెక్షన్ కలగడానికి 80 శాతం వరకు బ్యాక్టీరియా, 15 శాతం వరకు వైరస్లు మరికొంత శాతం ఫంగల్, కొన్ని పరాన్నజీవులు కారణం. మూత్రం ఎక్కువ సమయం విసర్జించకుండా ఉన్న సమయంలో బ్యాక్టీరియా అధికంగా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. మూత్ర వ్యవస్థలో రాళ్లు మూత్రవిసర్జనకు అడ్డుగా నిలిచి ఈ సమస్య ఉత్పన్నం అవడానికి తోడ్పడతాయి. పురుషుల్లో పోలిస్తే స్త్రీలలో మూత్రకోశం ఇన్ఫెక్షన్లను ఎక్కువగా గమనించవచ్చు. ముఖ్యంగా రజస్వల అయ్యే సమయంలోనూ, ప్రసూతి సమయంలో కూడా ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం వీరిలో ఎక్కువగా ఉంటుంది. కృత్రిమ మూత్ర గొట్టాలు(క్యాథెటర్స్), స్టెంట్స్, థైరాయిడ్ సమస్యలు, డయాబెటిస్, హార్మోన్ల అసమతుల్యత, మలబద్దకం వలన కూడా మూత్ర మార్గం ఇన్ఫెక్షన్లు క లుగుతాయి. లక్షణాలు: మూత్రపిండాల ఇన్ఫెక్షన్ల వలన రోగికి తరచు జ్వరం, కడుపు నొప్పి వస్తుంటాయి. ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉన్నప్పుడు కడుపునొప్పి నడుముకు లేదా గజ్జలలోకి, అటుపైన తొడల వరకు కూడా పాకుతుంది. కొన్ని సందర్భాల్లో మూత్రంలో చీము, రక్తం కూడా పడటం గమనించవచ్చు. ఆకలి లేకపోవడం, ఒళ్ళు నొప్పులు, నీరసంతో పాటు మూత్రంలో చీము, రక్తం పడటం వంటి ఇతర మూత్రకోశ సమస్యలూ ఉంటాయి. జాగ్రత్తలు: వ్యక్తిగత శుభ్రత పాటించ డం, ఎక్కువ నీరు తాగటం, మూత్రాన్ని నియంత్రించకుండా ఉండటం, కృత్రిమ గర్భనిరోధక సాధనాలు వాడేటప్పుడు జాగ్రత్త వహించడం, మలబద్దకం ఏర్పడకుండా చూసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ వ్యాధి కలగకుండా నియంత్రించుకోవచ్చు. హోమియో చికిత్స: హోమియోకేర్ ఇంటర్నేషనల్‌లో జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా రోగనిరోధక శక్తిని ప్రేరేపించడం వల్ల ఇన్ఫెక్షన్ తాలూకు సమస్యలు సంపూర్ణంగా పరిష్కరించబడతాయి. -
జీర్ణక్రియాసనాలు
1. ఉత్థానాసన తాడాసనం (సమస్థితి)లో నిలబడి చేతులు రెండు తుంటిమీద ఉంచాలి. శ్వాస మెల్లగా వదులుతూ తుంటికీలు నుండి (నడుము నుండి కాకుండగా ఇంకా క్రిందభాగం నుండి) ముందుకు వంగాలి. నడుము ఆ పై భాగాలను బాగా సాగదీస్తూ, వీలైనంత వరకు మోకాళ్ళను ముందుకు వంచకుండా నిటారుగా ఉంచాలి. చేతులను తుంటిమీద నుండి కిందకు, చేతివేళ్ళను కిందకు అరచేతులను నేలమీద ఉంచితే ‘పాద హస్తాసనము’అంటారు. అదే, చేతివేళ్ళతో కాలి బొటనవేళ్లను పట్టుకున్నట్లయితే ‘పాదాంగుష్టాసనం’ అంటారు. చేతులు రెండూ కలిపి వెనకకు తీసుకువెళ్లినట్లయితే ‘ఉత్థానాసనం’ అంటారు. 3 లేదా 5 సాధారణ శ్వాసలు తరువాత శ్వాస తీసుకుంటూ తిరిగి తాడాసన స్థితికి రావాలి. ఒక వేళ రెండు చేతులు నేలమీదకు తీసుకురాలేనివారు చేతులు కింద రెండు ఇటుకలను కావల్సిన ఎత్తులో ఉంచి వాటి సపోర్ట్ తీసుకోవచ్చు. జాగ్రత్తలు: ప్రారంభ సాధకులు, ఔ1 ఔ5 ప్రాంతంలో సమస్య ఉన్నవారు మోకాళ్లు ముందుకు వంచాలి. ఉపయోగాలు: కేంద్ర నాడీ మండల వ్యవస్థకు, ఉదర భాగాలైన కాలేయం, జీర్ణాశయం, క్లోమగ్రంధికి మంచిది. మైగ్రేయిన్, తలనొప్పి, నిద్రలేమి మెనోపాజ్ వంటి సమస్యలకు పరిష్కారం. స్పాండిలైటీస్కి పరీక్ష: చేతులు రెండు వెనుక భూమికి సమాంతరంగా వచ్చినట్లయితే స్పాండిలైటీస్ సమస్యలేనట్లు. కొంచెం ఆకాశం వైపునకు ఉన్నట్లయితే సమీప భవిష్యత్తులో స్పాండిలైటీస్ వస్తుందని, పూర్తిగా ఆకాశంవైపునకు ఉన్నట్లయితే స్పాండిలైటీస్తో బాధపడుతున్నట్లు గమనించగలరు. 2. ఉపవిష్ట కోణాసన/ భూనమనాసన ఉత్థానాసనంలో నుండి ప్రసారిత పాదోత్థానాసనంలోకి రావాలి. అంటే కాళ్లు రెండు బాగా స్ట్రెచ్ చేసి 4 లేదా 5 అడుగులు దూరం ఉంచి ముందుకి వంగాలి. తల నేలమీదకు తీసుకువచ్చి మాడు భాగం భూమి మీద పెట్టి చేతులు రెండూ వెనుకకు తీసుకువెళ్ళి, అరచేతులు ఇంటర్‌లాక్ చేసి పైకి సాగదీయాలి. 3 లేదా 5 సాధారణ శ్వాసల తరువాత శ్వాస తీసుకుంటూ తలను పైకి లేపి, శ్వాస వదులుతూ సీటు భాగాన్ని భూమి మీదకి తీసుకువచ్చి కూర్చోవాలి. కాళ్లు రెండు వైపులకు స్ట్రెచ్ చేసిన స్థితిలోనే ఉంచి, శ్వాస తీసుకుంటూ చేతులు రెండూ పైకి తీసుకువెళ్ళి శ్వాస వదులుతూ నడుము క్రింద భాగం నుండి సాగదీస్తూ ముందుకు వంగి రెండు పాదాలను రెండు చేతులుతో పట్టుకొని, తలను భూమికి దగ్గరగా తీసుకురావాలి. వీలైతే ఛాతి భాగం, ఉదరభాగం కూడా భూమి మీద ఆనించే ప్రయత్నం చేయవచ్చు. జాగ్రత్తలు: ప్రారంభ సాధకులు ముందు భాగంలో ఒక బాలిస్టర్ను ఉంచి శ్వాస వదులుతూ పూర్తిగా బాలిస్టర్ మీదకు వంగి విశ్రాంత స్థితిలో ఉండవచ్చు. ఇంకా కష్టంగా ఉన్నట్లయితే సీటు క్రింద సమంగా ఉన్న ఒక దిండును పెట్టుకోవచ్చు. ఉపయోగాలు: గ్రాయిన్ భాగంలో స్టిఫ్నెస్ తగ్గుతుంది. కాళ్లు, తొడల భాగాలు బాగా స్ట్రెచ్ అవుతాయి. జీర్ణవ్యవస్థకు మంచిది. 3. పరివృత్త జానుశిరాసన పై ఆసనం తరువాత కుడికాలును మడచి, కుడిపాదం మడమను పెరీనియం (జననేంద్రియం)కు దగ్గరగా తీసుకురావాలి. శ్వాస తీసుకుంటూ అరచేతులు రెండూ ఆకాశంవైపునకు చూపిస్తూ పైకి తీసుకెళ్లాలి. నడుము క్రిందిభాగం నుండి పైకి శరీరాన్ని లాగుతూ, శ్వాస వదులుతూ ఎడమవైపుకి వంగి, ఎడమపాదాన్ని రెండు చేతులతో పట్టుకోవాలి. నడుమును పూర్తిగా ట్విస్ట్ చేస్తూ ఎడమకాలును నిటారుగా ఉంచి ఆకాశం వైపు చూస్తూ (వీలైతే) 3 లేదా 5 సాధారణ శ్వాసల తరువాత శ్వాస తీసుకుంటూ పైకి లేవాలి. శ్వాస వదులుతూ చేతులు రెండూ ప్రక్క నుండి క్రిందకు తీసుకురావాలి. ఎడమ మోచేతిని భూమి మీద పెట్టే ప్రయత్నం చేయవచ్చు. ఇదే విధంగా రెండోవైపు కూడా చేయాలి. జాగ్రత్తలు: పై విధంగా చేయడం సాధ్యపడని వారు మోకాలి సమస్య ఉన్నవారు మోకాలి క్రింద భాగంలో ఒక దిండును ఉపయోగించి మోకాలును పైకి లేపి ఉంచవచ్చ్చు. నడుము పైకి లాగటం, ట్విస్ట్ చేయడం మీద పూర్తిగా దృష్టి ఉంచడం చాలా ముఖ్యం. ఉపయోగాలు: పొట్టభాగాలు, పక్కటెముకలు, ఛాతీపై భాగాలకు మంచి టోనింగ్ జరుగుతుంది. జీర్ణవ్యవస్థకు, రక్తప్రసరణ వ్యవస్థకు, శ్వాసకోశ వ్యవస్థకు చక్కటి ఆసనం. యోగావగాహన ఆచారం: జీవనశైలికి సంబంధించిన 6 అంశాలలో గతవారం పేర్కొన్న ఆహారం, విహారం, వ్యవహారం, విచారం ఈనాల్గింటిని అనునిత్యం ఆచరిస్తూ భక్తి, కర్మ, జ్ఞాన, రాజయోగ మార్గానుసారం అవిద్యను తీసివేసే దిశగా పనిచేయాలి. గ్రహచారం: ఈ ఆచారమే మన గ్రహచారాన్ని నిర్ణయించి కైవల్యప్రాప్తిని కల్గిస్తుంది. అవిద్య అనగా: అనిత్యమైన దానిని నిత్యమనుకోవడం (శరీరం అనిత్యం. కానీ దానిని నిత్యమని భ్రమించడం) అశుచియైన దానిని శుచి అనుకోవడం దుఃఖాన్ని సుఖమనుకోవడం (జననం దుఃఖం, మరణం దుఃఖం - దీనిని గ్రహించి కైవల్యప్రాప్తికి ప్రయత్నించకుండా సుఖజీవనం గడపడం) అనాత్మను ఆత్మ అనుకోవడం (ఆత్మకాని ఐహిక సంబంధాలు, సుఖాలు పట్ల రాగం, మోహం పెంచుకుంటూ అదే ఆత్మ అని భ్రమించుడం) సమన్వయం: ఎస్. సత్యబాబు, సాక్షి ప్రతినిధి -
తలనొప్పి... తగ్గేదెలా?
న్యూరో కౌన్సెలింగ్ నా వయసు 39 ఏళ్లు. తరచూ తలనొప్పి వస్తోంది. దీని నుంచి విముక్తి పొందడానికి తగిన మార్గాలు చెప్పండి. - నవీన, కరీంనగర్ * మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు మైగ్రేన్‌తో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. తలనొప్పి తగ్గడానికి మీరు ఈ కింద పేర్కొన్న సూచనలు పాటించండి. * ఎక్కువ శబ్దం, కాంతి లేని చోట విశ్రాంతి తీసుకోండి. విపరీతమైన శబ్దం, శక్తిమంతమైన వెలుగు వంటి అంశాలు తలనొప్పిని మరింత ప్రేరేపిస్తాయి. * ఘాటైన వాసనలకు దూరంగా ఉండండి. సరిపడని పర్ఫ్యూమ్ల వల్ల తలనొప్పి ఎక్కువ కావచ్చు. * తలనొప్పి తగ్గుతుందనే అపోహతో టీ, కాఫీలను పరిమితికి మించి తాగడం మంచిది కాదు. * చాక్లెట్లు, కెఫిన్ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవడం మానేయాలి. కెఫిన్ ఉండే శీతలపానీయాల నుంచి దూరంగా ఉండాలి. * ఎక్కువ సమయం కంప్యూటర్ ముందు పనిచేయాల్సి వచ్చినప్పుడు యాంటీగ్లేర్ గ్లాసెస్ ధరించడం మంచిది. ప్రతి అరగంటకు ఒకసారి కనీసం ఐదు నిమిషాల పాటు రిలాక్స్ కావాలి. కనురెప్ప కొట్టకుండా అదేపనిగా కంప్యూటర్ స్క్రీన్‌ను చూడటం సరికాదు. * కంటికి ఒత్తిడి కలిగించే పనులు చేయకూడదు. కుట్లు, అల్లికలు వంటి పనులు చేసేవారు మధ్య మధ్య కాస్త విశ్రాంతి తీసుకుంటూ ఉండాలి. * తలనొప్పితో పాటు వాంతులు, తలతిరగడం వంటివి కనిపిస్తుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. - డాక్టర్ మురళీధర్‌రెడ్డి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ హోమియో కౌన్సెలింగ్ నా వయసు 34 సంవత్సరాలు. ఈమధ్య కాళ్లు నొప్పిగా ఉండి, నడుముభాగం నుంచి కాలివేళ్ల వరకు లాగినట్లుగా ఉంటోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే సయాటికా అన్నారు. సయాటికా అంటే ఏమిటో తెలియజేస్తూ, హోమియోపతిలో దీనికి పరిష్కారం సూచించగలరు. -ఏనుగుల శ్రీనివాసరావు, మెదక్ సయాటికా అనేది ఒకరకపు నొప్పి. ఇది ముఖ్యంగా తుంటినుండి మొదలై కాలివరకు నొప్పి వస్తుంది. సయాటిక్ నరంలోకి వచ్చే అసాధారణ లోపాల వల్ల ఇది వస్తుంది. ఈ సయాటిక్ నరం నడుములోని వెన్నుపాము నుంచి ప్రారంభమై దిగువకు ప్రయాణించి పాదాలను చేరుకుంటుంది. కాలిలో ఉండే అనేక కండరాలను, ఇతర నిర్మాణాలను నియంత్రిస్తుంది. సయాటిక్ నరం ప్రయాణించే మార్గంలో అడ్డంకులు లేదా అవరోధాలు ఏర్పడటం లేదా నరం నలగడం లేదా వత్తుకుపోవడం వల్ల తీవ్రమైన నొప్పి వస్తుంది. కారణాలు: ప్రధాన కారణం హెర్నియేటెడ్ డిస్క్. అంటే వెన్నుపూసల మధ్య ఉండే డిస్క్ వెలుపలికి చొచ్చుకొని వచ్చి, వెన్నుపామును నొక్కడం వల్ల సయాటిక్ నరం ఒత్తుకుపోయి నొప్పి వస్తుంది. వెన్నుపూసల మధ్య ఉండే డిస్కు అరిగిపోవడం లేదా దానిలో ఉండే జిగురు వంటి పదార్థం తగ్గిపోవడం వల్ల కూడా బయటి నుంచి సయాటిక్ నరంపై ఒత్తిడి పడి నొప్పి వస్తుంది. లాంబార్ స్పైనల్ స్టీనోసిస్: ఏ కారణం చేత అయినా వెన్నుపాము ప్రయాణించే మార్గం ఇరుకుగా మారితే దానిని స్టీనోసిస్ అంటారు. దీనివల్ల నరాలపై వత్తిడి పెరుగుతుంది. నొప్పి వస్తుంది. ఫైరీ ఫార్మిస్ సిండ్రోమ్: ఫైరీ ఫార్మిస్ అనే కండరం సయాటిక్ కండరంపై అమరి ఉంటుంది. ఒకవేళ ఈ కండరంలో ఒత్తిడి పెరిగితే సయాటిక్ నరం పైన కూడా ఒత్తిడి పెరిగి, నొప్పి వస్తుంది. ఇది ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల లేదా మోటారు వాహనాల యాక్సిడెంట్లు, జారిపడటం వంటి వాటివల్ల కూడా వస్తుంది. లక్షణాలు: ఎక్కువసేపు కూర్చోలేకపోవడం, నడవలేకపోవడం, చేతివేళ్లు, కాలివేళ్లు తిమ్మిరి పట్టినట్లు అవడం, కాళ్లు, పాదాలలో సూదులతో గుచ్చినట్లు ఉండటం, ఒక్కోసారి నొప్పితోబాటు కరెంట్ షాక్ కొట్టినట్లు అనిపించడం వంటివి సయాటికాలో ముఖ్యలక్షణాలు. నిర్ధారణ: ఎక్స్‌రే, నొప్పి లక్షణాల ఆధారంగా. నివారణ: పోషకాహారం తీసుకోవడం, మజిల్ రిలాక్సేషన్ ఎక్సర్సైజులు చేయడం, విశ్రాంతి తీసుకోవడం ద్వారా. హోమియో చికిత్స: హోమియోలో కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా వ్యాధిని అదుపు చేయడం జరుగుతుంది. మీరు హోమియో వైద్య నిపుణులను సంప్రదించండి. - డాక్టర్ ఎ.ఎం. రెడ్డి సీనియర్ డాక్టర్ పాజిటివ్ హోమియోపతి,హైదరాబాద్ బ్లడ్ క్యాన్సర్ కౌన్సెలింగ్ మా అమ్మగారికి 40 ఏళ్లు. ఈమధ్య కొన్ని పరీక్షలు చేయించినప్పుడు ఆమెకు బ్లడ్‌క్యాన్సర్ అని తెలిసింది. బ్లడ్ క్యాన్సర్ రావడానికి కారణాలు చెప్పండి. - లక్ష్మిసుప్రియ, నిడదవోలు రక్తకణాల ఉత్పత్తి ప్రభావితం కావడం వల్ల బ్లడ్ క్యాన్సర్ వస్తుంది. ఇది ప్రధానంగా బోన్ మ్యారో (ఎముకమజ్జ /మూలగ)లో ప్రారంభమవుతుంది. ఇక్కడి మూలకణాలు వృద్ధిచెంది... అవి ఎర్ర, తెల్ల కణాలుగానూ, ప్లేట్లెట్స్గానూ తయారవుతాయి. బ్లడ్ క్యాన్సర్ వచ్చినవారిలో తెల్లరక్తకణాలు నియంత్రణ లేకుండా పెరిగిపోతాయి. దాంతో ఎర్ర రక్తకణాల ఉత్పత్తి తగ్గుతుంది. ఇలా అనియంత్రితంగా రక్తకణాలు పెరగడాన్ని బ్లడ్‌క్యాన్సర్‌గా చెప్పుకోవచ్చు. ఇలా నియంత్రణ లేకుండా పెరిగిన కణాలు మిగతా వాటిని పనిచేయనివ్వవు. ఫలితంగా రోగనిరోధక శక్తి కోల్పోతారు. బ్లడ్ క్యాన్సర్స్‌లో ప్రధానంగా మూడు రకాలు ఉంటాయి. అవి... 1) లుకేమియా 2) లింఫోమా 3) మైలోమా లక్షణాలు: బ్లడ్‌క్యాన్సర్‌లో పరిపక్వం కాని తెల్లరక్తకణాలు అధిక సంఖ్యలో ఉత్పత్తి అవుతుంటాయి. వీటివల్ల గాయాలైనప్పుడు రక్తాన్ని గడ్డకట్టించడానికి అవసరమైన ప్లేట్లెట్స్ తగ్గుతాయి. ఫలితంగా క్యాన్సర్ రోగులలో గాయాలైనప్పుడు అధిక రక్తస్రావం, శరీరం కమిలినట్లుగా కనపడటం, చర్మం మీద ఎర్రగా దద్దుర్లు కనిపిస్తుంటాయి. తెల్ల రక్తకణాలు వ్యాధి కారక సూక్ష్మజీవులతో పోరాడుతూ ఉండే తెల్లరక్తకణాల పనితీరు దెబ్బతింటుంది. దాంతో అవి తమ విధులను సక్రమంగా నెరవేర్చలేవు. పైగా అవి విపరీతంగా పెరగడం వల్ల ఎర్రరక్తణాలు తగ్గిపోవడంతో రోగికి రక్తహీనత రావచ్చు. దాంతో వాళ్లకు ఆయాసం కూడా రావచ్చు. ఇతర జబ్బులలో కూడా ఈ లక్షణాలు ఉండవచ్చు. అందుకే కొన్ని లక్షణాలు కనిపించినప్పుడు బోన్‌మ్యారో పరీక్ష చేసి వ్యాధి నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. ఇతర లక్షణాలు: జ్వరం, వణుకు, రాత్రుళ్లు చెమటలు పోవడం, ఇన్ఫ్లుయెంజా, అలసట, ఆకలి లేకపోవడం, చిన్నగాయం నుంచి అధిక రక్తస్రావం, తలనొప్పి, కాలేయం, స్ప్లీన్ వాడు, ఎముకల నొప్పి, సాధారణంగా బ్లడ్ క్యాన్సర్ ఉన్నవారికి ప్రధానంగా మందులతో (కీమోథెరపీ) చికిత్స చేస్తారు. మీ అమ్మగారి విషయంలో మీ డాక్టర్ చెప్పిన సూచనలు పాటించి, తగిన చికిత్స అందించండి. - డాక్టర్ శైలేశ్ ఆర్ సింగీ,సీనియర్ హిమటో ఆంకాలజిస్ట్, బీఎమ్‌టీ స్పెషలిస్ట్, సెంచరీ హాస్సిటల్స్, హైదరాబాద్ -
ఆమె పాట మూగపోరాదు!
మెక్సికో సిటీ: ఆవ్ మారియా...ఆవ్ మారియా అని ఆమె పాడుతూ ఉంటే ఆకాశం నుంచి అమృతగానం ఆలకిస్తున్నట్లు అనిపిస్తుంది. జగతిని మరచి దిగంతాల్లో విహరిస్తున్నట్లు ఉంటుంది. ఆమె పాట పోప్‌ను కూడా కన్నీటి పర్యంతం చేసింది. ఆమే15 ఏళ్ల అలెక్సియా గార్డు. ఆమె సంగీత విద్వాంసురాలు కాదు. ఎప్పుడూ సంగీత పాఠాలు కూడా నేర్చుకోలేదు. డిస్నీ సినిమాల్లో వచ్చే పాటలను అనుకరిస్తూ తనలో తాను పాడుకునేది. కనీసం కుటుంబ సభ్యుల ముందు కూడా పాడేందుకు ఎన్నడూ సాహసించలేదు. పోప్ ఫ్రాన్సిస్ ఇటీవల మెక్సికో సిటీకి వచ్చినప్పుడు ఉద్వేగంతో పాట అందుకున్నారు. పోప్ కదిలిపోయారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. నిండు నూరేళ్లు బతకాలంటూ ఆ అమ్మాయిని దీవించి వెళ్లారు. అవును అంతటి ఆమె పాట మూగపోకూడదు. బోన్ మారో కేన్సర్‌తో బాధపడుతున్న ఆమెకు ఫిబ్రవరి 25వ తేదీనే ఆపరేషన్. బోన్ మారో కేన్సర్ ప్రాణాంతమైనదైనప్పటికీ తొలి దశలోనే ఉన్నందున ఆమె ప్రాణానికి ఎలాంటి అపాయం ఉండకపోవచ్చని ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. నగరంలోని చిల్డ్రన్స్ ఆస్పత్రిలో మొన్నటి వరకు అందరిలాగే అలెక్సియాను చూసిన డాక్టర్లు, నర్సులు, సిబ్బంది ఇప్పుడు ఆమెను సెలబ్రిటీలా చూసుకుంటున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. మెక్సికో సిటీ పర్యటన సందర్భంగా పోప్ ఫ్రాన్సిస్ తమ ఆస్పత్రిని సందర్శించినప్పుడు అలెక్సియా పాడిన పాటకు వారంతా మంత్రముగ్ధులయ్యారు. ఆమె పాట విని పోప్ కూడా కన్నీళ్లు పెట్టుకోవడంతో అలెక్సియా గురించి తొలిసారిగా ప్రపంచానికి తెల్సింది. పోప్ దీవెనలతో తనకు ఎనలేని ధైర్యం వచ్చిందని, కేన్సర్‌ను తప్పకుండా జయసిస్తాననే విశ్వాసం కలిగిందని అలెక్సియా మీడియాకు వివరించారు. ఆ రోజు పోప్ ముందు పాడాల్సిందిగా తనను ఎవరూ కోరలేదని, అనుకోకుండా నోటి వెంట పాట దానంతట అదే జాలువారిందని ఆమె చెప్పారు. తాను పాడుతున్నప్పుడు లోకం ఎవరూ లేరని, తాను, పోప్ మాత్రమే ఉన్నట్టు, ఆయన కోసమే తాను పాడుతున్నట్టు అనిపించిందని ఆమె తెలిపారు. ఆత్మవిశ్వాసంతో గురువారం ఆపరేషన్‌కు వెళతానని చెప్పారు. నగరంలోని విస్టా హెర్మోసా అనే ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న అలెక్సియా గత నవంబర్‌లో కాలు నిలవక పడిపోయారు. కాలు నొప్పి తీవ్రమైంది. ముందుగా మామూలు జబ్బనుకున్నారు. తర్వాత పరీక్షల్లో ఆమెకు బోన్ కేన్సర్ అని తేలింది. -
ఒంటికి పని చెప్తే కంటి నిండా నిద్ర!
హోమియో కౌన్సెలింగ్ డయాబెటిస్ వ్యాధి హోమియో విధానంలో తగ్గుతుందా? - రవిచంద్ర, చీరాల డయాబెటిస్ రక్తంలో చక్కెరపాళ్లు అధికం కావడం వల్ల వచ్చే వ్యాధి. ఇందులో మూత్రం ఎక్కువగా రావడం, ఆకలి, దాహం పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇందులోని కొన్ని ముఖ్యమైన రకాలుంటాయి. శరీరం ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేకపోవడాన్ని టైప్-1 అనీ, ఉత్పత్తి చేసిన ఇన్సులిన్‌ను కణాలు సక్రమంగా వినియోగించలేకపోవడాన్ని టైప్-2 అనీ, గర్భధారణ సమయంలో వచ్చే డయాబెటిస్‌ను జెస్టెషనల్ డయాబెటిస్ అని అంటారు. టైప్-1 డయాబెటిస్: ఈ రకం వ్యాధి ఉన్న వారిలో క్లోమగ్రంథిలో ఉండే బీటా కణాలు ఇన్సులిన్ ఉత్పత్తి చేయకపోవడం వల శరీరంలో చక్కెరపాళ్లు పెరుగుతూ ఉంటాయి. వీళ్లలో రోగనిరోధక వ్యవస్థను రక్షించే టీ-సెల్స్ ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. ఇది ఎక్కువగా చిన్నపిల్లల్లో కనిపిస్తుంది. కానీ పుట్టినప్పుడు వాళ్లు నార్మల్‌గానే ఉండవచ్చు. రానురానూ గ్లూకోజ్ పాళ్లు పెరగడంతో పిల్లలు బలహీనపడతారు. దీన్నే ‘జువెనైల్ డయాబెటిస్’ అని కూడా అంటారు. టైప్-2 డయాబెటిస్: ఇది ఎక్కువగా నడివయసు వారిలో కనిపిస్తుంటుంది. తల్లిదండ్రుల్లో ఈ వ్యాధి ఉన్నప్పుడు పిల్లల్లోనూ ఇది వచ్చే అవకాశాలు ఎక్కువ. మానసిక ఒత్తిడి, ఆందోళనలు పెరిగినప్పుడు రక్తంలో చక్కెరపాళ్లు అధికమై బయటపడవచ్చు. జెస్టెషనల్ డయాబెటిస్: గర్భధారణ సమయంలో వచ్చిన డయాబెటిస్ చాలామందిలో ప్రసవం తర్వాత తగ్గిపోతుంది. అయితే అది మళ్లీ భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉన్నందున ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. డయాబెటిస్తో వచ్చే దుష్ర్పభావాలు చాలా ఎక్కువే. దీనివల్ల రక్తనాళాలు దెబ్బతినడం, గుండె సంబంధిత వ్యాధులు రావడం, కంటిలోని సున్నితమైన రక్తనాళాలు దెబ్బతిని (డయాబెటిస్ రెటినోపతి), చూపు కోల్పోవడం కూడా జరగవచ్చు. కిడ్నీలపై (డయాబెటిస్ నెఫ్రోపతి) దుష్ర్పభావం పడటం, నరాలు దెబ్బతినడం వల్ల వేళ్ల చివర్లకు చీమలు పాకినట్లు ఉండటం, స్పర్శ తగ్గడం, అరికాళ్ల నొప్పుల వంటి సమస్యలు రావచ్చు. హోమియోలో డయాబెటిస్‌కు మంచి మందులు ఉన్నాయి. తీపిని ఇష్టపడేవారు, ఆధ్యాత్మికత ఉన్నవారికి సల్ఫర్, స్థూలకాయం ఉండి, త్వరగా కన్నీళ్లు వచ్చేవారికి కాల్కేరియా కార్బ్, తేలిగ్గా ఉద్వేగాలకు గురై, త్వరగా కోపం వచ్చేవారు, ఘాటైన మసాలా ఆహారాలను ఇష్టపడేవారికి నక్స్ వామికా వంటి ఎన్నో మంచి మందులు హోమియోలో అందుబాటులో ఉన్నాయి. - డాక్టర్ ఎ.ఎం. రెడ్డి సీనియర్ డాక్టర్,పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ న్యూరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 36 ఏళ్లు. నేను సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. నాకు ఉద్యోగరీత్యా ఒత్తిళ్ల వల్ల తలనొప్పి వస్తోందని అనుకున్నాను. ఇటీవల మరిన్నిసార్లు రావడంతో డాక్టర్‌ను కలిశాను. ఆయన మైగ్రేన్‌గా గుర్తించారు. దయచేసి నాకు తగిన పరిష్కారం చూపించండి. - సుహాస్, హైదరాబాద్ అనేక రకాల తలనొప్పుల్లో మైగ్రేన్ ఒకటి. ఇది 15 శాతం మంది యువతుల్లో, 6 శాతం మంది యువకుల్లో కనిపిస్తుంది. కొందరిలో ఇది తలకు ఒకవైపునే కనిపిస్తే, మరికొందరిలో తల మొత్తంలో నొప్పి వస్తుంటుంది. కడుపులో తిప్పడం, వాంతి కావడం, శబ్దాలను - కాంతిని భరించలేకపోవడం వంటి లక్షణాలు ఈ తలనొప్పుల్లో కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో మైగ్రేన్ జన్యుపరంగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. మైగ్రేన్ తలనొప్పిని ప్రేరేపించే అంశాలు చాలా ఉంటాయి. వాటిని ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అంటారు. అవి... నిద్ర సరిగా లేకపోవడం, ఎండలో తిరగడం, చాక్లెట్లు, ఐస్‌క్రీములు ఎక్కువగా తీసుకోవడం వంటివి నొప్పిని తక్షణం మొదలయ్యేలా చేసే ట్రిగరింగ్ ఫ్యాక్టర్లలో కొన్ని. మనలో ఏ అంశం నొప్పిని ప్రేరేపిస్తోందో కనుగొంటే... చాలావరకు మైగ్రేన్‌ను నివారించవచ్చు. దాంతోపాటు సరైన పోషకాహారం తీసుకోవడం, మంచి ఆహార అలవాట్లు పాటించండం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, కెఫిన్, ఆల్కహాల్‌కు దూరంగా ఉండటం వంటివి మైగ్రేన్‌ను నివారించే కొన్ని అంశాలు. మైగ్రేన్ చికిత్సలో రెండు రకాల మందులు ఉపయోగిస్తారు. మొదటివి... తలనొప్పి వచ్చినప్పుడు తక్షణం నొప్పి నుంచి ఉపశమనం కలిగించే మందులు. వీటిని నోటి ద్వారా ఇస్తారు. ఒకవేళ రోగికి వాంతులు అవుతుంటే ముక్కు ద్వారాగానీ లేదా ఇంజెక్షన్ ద్వారా గానీ ఈ తరహా మందులు ఇవ్వవచ్చు. ఇక రెండో రకమైనవి... మున్ముందు నొప్పి రాకుండా ఉండటం కోసం దీర్ఘకాలం వాడాల్సిన మందులు. మీరు డాక్టర్‌ను సంప్రదించి మైగ్రేన్ పునరావృతం కాకుండా కోసం వాడాల్సిన దీర్ఘకాలిక మందులను వాడితే ఇది తిరగబెట్టే అవకాశాలు తక్కువ. డాక్టర్ నీలేశ్ విజయ్ చౌధురీ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్. లైఫ్‌స్టయిల్ కౌన్సెలింగ్ నేను కూర్చొని చేసే వృత్తిలో ఉన్నాను. రాత్రిపూట సరిగా నిద్రపట్టడం లేదు. ఒళ్లు అలిసేలా వ్యాయామం చేయమనీ, దాంతో బాగా నిద్రపడుతుందని ఫ్రెండ్స్ చెబుతున్నారు. వ్యాయామం చేసేవాళ్లకు అంతగా నిద్రపట్టదని మరికొందరు చెబుతున్నారు. నాకు వాస్తవాలు వివరించండి. - ధన్‌రాజ్, నకిరేకల్ మీరు చెప్పిన రెండు అంశాలూ నిజమే. నిద్రకు ఉపక్రమించబోయే మూడు గంటల ముందుగా వ్యాయామం అంత సరికాదు. అలా చేస్తే నిద్రపట్టడం కష్టమే. అయితే రోజూ ఉదయంగానీ లేదా ఎక్సర్‌సైజ్‌కూ, నిద్రకూ చాలా వ్యవధి ఉండేలా గానీ వ్యాయామం చేస్తే మంచి నిద్ర పడుతుంది. ఒళ్లు అలిసేలా వ్యాయామంతో ఒళ్లెరగని నిద్రపడుతుంది. ఉదయం చేసే వ్యాయామంతో ఒత్తిడి నుంచి దూరమవుతారు. అయితే ఉదయం వేళ చేసే వ్యాయామం పగటి వెలుగులో అయితే మరింత ప్రభావపూర్వకంగా ఉంటుంది. మీరు ఉదయం వేళలో వ్యాయామం చేయలేకపోతే అది సాయంత్రం వేళ అయితే మంచిది. మీ రోజువారీ పనుల వల్ల అప్పటికి మీ శరీర ఉష్ణోగ్రత కూడా కాస్త పెరిగి ఉంటుంది. ఇక నిద్రవేళకు మన శరీర ఉష్ణోగ్రత కాస్త తగ్గుతుంటంది. కానీ వ్యాయామంతో మళ్లీ శరీరాన్ని ఉత్తేజపరచడం జరుగుతుంది. ఇక కార్డియోవాస్క్యులార్ వ్యాయామాల వల్ల గుండె స్పందనల వేగం, రేటు పెరుగుతాయి. శరీర ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. వీటన్నింటి ఉమ్మడి ప్రభావాల వల్ల నిద్ర తగ్గుతుంది. అంతేకాదు... వ్యాయామం ముగిసిన 20 నిమిషాల తర్వాతగానీ గుండె కండరాల రక్తం పంపింగ్ ప్రక్రియ సాధారణ స్థితికి రాదు. అందుకే వ్యాయామానికీ, నిద్రకూ మధ్య వ్యవధి ఉండేలా చూసుకోవాలన్న మాట. ఇక స్ట్రెచింగ్ వ్యాయామాలు, బలాన్ని పెంచుకనే స్ట్రెంగ్త్ ట్రెయినింగ్ తరహా వ్యాయామాలూ శరీరానికి మేలు చేసినా... అవేవీ కార్డియోవాస్క్యులార్ వ్యాయామాలకు సాటిరావు. యోగా ప్రధానంగా తనువునూ, మనసునూ రిలాక్స్ చేసే ప్రక్రియ. మీ ఫ్రెండ్స్‌లో కొందరు చెప్పినట్లుగా దీర్ఘకాలిక నిద్రలేమికి వ్యాయామం విరుగుడు. అందుకే మరీ తీవ్రంగా (విగరస్‌గా) కాకుండా... మరీ చేసీచెయ్యనట్లు (మైల్డ్)గా కాకుండా... మాడరేట్ ఎక్సర్సైజ్ చేయండి. కంటినిండా నిద్రపోండి. వాకింగ్, జాగింగ్, జంపింగ్, స్విమ్మింగ్, టెన్నిస్ ఆడటం, డాన్స్ చేయడం లాంటి ఏ ప్రక్రియ అయినా వ్యాయామానికి మంచిదే. అయితే మీకు గుండెజబ్బులూ, స్థూలకాయం, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఉంటే వ్యాయామాలు మొదలుపెట్టే ముందు ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి, మీకు తగిన వ్యాయామాలు సూచించమని అడగడం మేలు. డాక్టర్ సుధీంద్ర ఊటూరి కన్సల్టెంట్, లైఫ్‌స్టైల్ అండ్ రీహ్యాబిలిటేషన్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ మా చిరునామా: వైద్యసలహా కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్- 34. ఈ మెయిల్: asksakshidoctor@gmail.com నిర్వహణ: యాసీన్ -
ఫిట్స్‌ను ఆపరేషన్తోనూ తగ్గించవచ్చా?
న్యూరో కౌన్సెలింగ్ నా మిత్రుడికి 24 సం॥గత 14 సం॥ఫిట్స్‌తో బాధపడుతున్నాడు. చాలామంది డాక్టర్లకు చూపించి ఎన్నిరకాల మందులు వాడినా ఫలితం లేదు. వారానికి 4-6 సార్లు ఫిట్స్ వస్తాయి. ఈ మధ్య ఫిట్స్‌కు ఆపరేషన్ చేసి తగ్గిస్తున్నారని ఎవరో స్నేహితుల ద్వారా తెలుసుకున్నాను. ఫిట్స్‌కు ఆపరేషన్ చేసి తగ్గించడానికి వీలవుతుందా? దయచేసి తెలియజేయండి. - రామకృష్ణ, నిడదవోలు మి మిత్రుడికి ఉన్న సమస్యను ఎపిలెప్సీ అని అంటారు. ఇది వంద మందిలో ఒకరికి ఉంటుంది. అందులో మూడో వంతు వ్యాధిగ్రస్తులకు ఎన్ని మందులు వాడినా ఫలితం ఉండదు. అటువంటి వారికి శస్త్ర చికిత్స ద్వారా మంచి ఫలితం ఉంటుంది. ఫిట్స్ ఉన్న ఆ పేషెంట్ శస్త్ర చికిత్సకు సరిపోతాడో లేదో బ్రెయిన్ ఎమ్మారై, ఎపిలెప్సీ ప్రొటోకాల్ వంటి పరీక్షలు చేసి తెలుసుకుంటారు. మొదట ఎమ్మారై తీసిన తరువాత వీడియో ఈఈజీ పరీక్ష చేస్తారు. దీనికోసం పేషెంట్‌ని 24 గంటలు హాస్పిటల్లో ఉంచి, ఈఈజీ మెషిన్‌తో గమనిస్తారు. దాని ద్వారా అతనిలో వచ్చే మార్పులను ఆ వీడియోలో రికార్డ్ చేస్తారు. ఈ విధంగా ఎమ్మారై, వీడియో ఈఈజీ పరీక్ష రిపోర్టులు ఆధారంగా పేషెంట్‌కు ఆపరేషన్ సరిపోతుందో లేదో తెలుస్తుంది. ఆపరేషన్‌కు సరిపోయే పేషెంట్స్‌తో ఆపరేషన్ చేసిన తరువాత చాలామంచి ఫలితాలు కనిపిస్తాయి. చాలామందిలో చాలా తక్కువ వ్యవధిలో పూర్తిగా తగ్గిపోతాయి. మా తమ్ముడికి 47 సం॥గత మూడు సంవత్సరాలుగా కుడి దవడలో తీవ్రమైన నొప్పితో బాధ పడుతున్నాడు. డెంటల్ సర్జన్‌ను కలిస్తే మూడు దంతాలు తీయవలసి వస్తుందని తీసేశారు. ఏమన్నా చల్లని పదార్థాలు తిన్నప్పుడు కరెంట్ షాక్‌లా నొప్పి వచ్చి 30 సెకన్స్‌లో తగ్గడం జరుగుతుంది. డెంటల్ సర్జన్ ఎడ్వైజ్ మీద న్యూరాలజిస్ట్‌ను కలిశాం.. మందులతో తగ్గకపోవడం వల్ల ఆపరేషన్ అడ్వైజ్ చేశారు. దయచేసి సలహా ఇవ్వగలరు. - ఈఎమ్మార్ ప్రసాద్, వైరా మీరు చెప్పిన దాన్ని బట్టి మీ తమ్ముడు ట్రైజెమినల్ న్యూరాల్జియాతో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. మెదడులో రక్తనాళానికీ, ట్రైజెమినల్ నర్వ్‌కు జరిగే సంఘర్షణ వలన ఈ జబ్బు వస్తుంది. మొదట మీ తమ్ముడికి బ్రెయిన్ ఎమ్మారై చేయవలసి ఉంటుంది. బ్రెయిన్ ఎమ్మారైలో ఇదే విషయం నిర్ధారణ అయితే ముందుగా మందులతో ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఒకవేళ టాబ్లెట్ వల్ల రిలీఫ్ రాకపోతే ఆపరేషన్ చేయవలసి ఉంటుంది. ఆపరేషన్ వల్ల చాలా మంచి రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు వెంటనే న్యూరాలజిస్ట్ లేదా న్యూరోసర్జన్‌ను కలసి సలహా పొందగలరు. డాక్టర్ టి.వి.ఆర్.కె. మూర్తి సీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్ కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా బాబు వయస్సు ఎనిమిదేళ్లు. ఈమధ్య వాడికి నోట్లో పొక్కులు వస్తున్నాయి. దాంతో ఏమీ తినలేక చాలా బాధపడుతున్నాడు. వాడి విషయంలో తగిన సలహా ఇవ్వండి. - సోమేశ్వరరావు, విజయనగరం మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీ బాబుకు ఉన్న కండిషన్ యాఫ్తస్ అల్సర్స్ లేదా యాఫ్తస్ స్టొమటైటిస్ అనిపిస్తోంది. ఈ పొక్కులు ముఖ్యంగా నోట్లో, పెదాల వద్ద, గొంతుపై భాగం (అప్పర్ థ్రోట్)లో ఎక్కువగా వస్తుంటాయి. ఓరల్ క్యావిటీలో ఇవి ఎక్కడైనా రావచ్చు. నోటిలో ఉండే పొర (మ్యూకస్ మెంబ్రేన్)లో పగుళ్లు రావడం వల్ల ఈ అల్సర్ వస్తాయి. ఈ కండిషన్ తరచూ (రికరెంట్గా) వస్తూ ఉండవచ్చు. ఫ్యామిలీ హిస్టరీలో ఇవి ఉన్నవారి కుటుంబాల్లో పిల్లల్లోనూ ఇవి కనిపించడం సాధారణం. ఈ సమస్య మగపిల్లల్లో కంటే ఆడపిల్లల్లో ఎక్కువ. దీనికి ప్రత్యేకంగా ఇదీ కారణమంటూ ఇదమిత్థంగా ఏమీ చెప్పలేం. కాని పులుపు పదార్థాలు ఎక్కువగా తిన్నప్పుడు, బాగా కారంగా, ఎక్కువ మసాలాలతో ఉండే ఆహారం తీసుకున్నప్పుడు ఇవి కనిపించడం చాలా సాధారణం. కొందరిలో ఇవి విటమిన్ బి12, ఐరన్, ఫోలిక్ యాసిడ్, జింక్ లోపాలతోనూ రావచ్చు. సాంద్రత ఎక్కువగా ఉండే టూత్‌పేస్టులు వాడేవారిలో, ఎక్కువ మానసిక ఒత్తిడి (స్ట్రెస్)కి గురయ్యేవారిలోనూ ఇవి కనిపిస్తాయి. కొందరిలో బాగా అలసిపోయిన (ఫెటిగ్) సందర్భాల్లో అవి కనిపించడం మామూలే. మరికొందరిలో జబ్బుపడ్డప్పుడు కనిపిస్తాయి. కొన్ని హార్మోన్ల అసమతౌల్యత వల్ల, జీర్ణకోశవ్యాధులు ఉన్న సందర్భాల్లోనూ ఇవి కనిపించవచ్చు. నివారణ మార్గాలు: బాగా పుల్లగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండటం. కరకరలాడే ఆహారపదార్థాలు (ఆబ్రేసివ్ ఫుడ్స్) తీసుకోకపోవడం నోటి పరిశుభ్రత (ఓరల్ హైజీన్) పాటించడం వంటివి చేయాలి. ఈ సమస్య మరీ ఎక్కువగా ఉన్నప్పుడు లోకల్ అనస్థిటిక్ జెల్స్, కార్టికోస్టెరాయిడ్స్‌తో పాటు కొన్ని సందర్భాల్లో అవసరాన్ని బట్టి ఓరల్ యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది. బాబు విషయానికి వస్తే నోటిని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు అతడికి ఆహారంలో విటమిన్ బి12, జింక్ సప్లిమెంట్స్ ఇవ్వండి. లోకల్ అనస్థిటిక్ జెల్స్ కూడా వాడవచ్చు. సమస్య మరీ తీవ్రంగా ఉంటే మీ పిల్లల వైద్య నిపుణుడిని కలిసి చికిత్స తీసుకోండి. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ డర్మటాలజీ కౌన్సెలింగ్ నా వయసు 25 ఏళ్లు. చాలారోజులుగా చుండ్రు సమస్యతో బాధపడుతున్నాను. ప్రతి వారం రెండుసార్లు తలస్నానం చేస్తాను. ఈ సమస్య తగ్గడానికి వారానికి మూడు సార్లు గానీ, రోజు విడిచి రోజుగానీ తలస్నానం చేస్తే జుట్టుకు ఏదైనా హాని జరుగుతుందా? దయచేసి వివరించండి. - ఎస్కె. కరీముల్లా మీరు వివరించిన అంశాలను బట్టి మీరు మాడు మీద సెబోరిక్ డర్మటైటిస్ అనే సమస్యతో బాధపడుతున్నట్లుగా అనిపిస్తుంది. మీ మాడు మీద ఉండే సీబమ్ అనే నూనెలాంటి స్రావాన్ని వెలువరించే గ్రంథులు అతిగా పనిచేయడం వల్ల మీరు పేర్కొంటున్న సమస్య వస్తుంది. మీరు జడ్‌పీటీఓ, కీటోకోనజోల్ ఉండే షాంపూను వాడండి. మీరు ఈ షాంపూను రోజు విడిచి రోజు వాడవచ్చు. ఆ తర్వాత వారానికి రెండు రోజులు షాంపూ వాడాలి. ఇక నోటి ద్వారా తీసుకోవాల్సిన ఇట్రాకొనజోల్ టాబ్లెట్లను ఉదయం రెండు, రాత్రి రెండు చొప్పున రెండు రోజుల పాటు వాడాలి. ఈ మోతాదును స్టాట్ డోస్ అంటారు. అంటే ఇది మీ సమస్యకు తక్షణం పనిచేసే మోతాదు అన్నమాట. అప్పటికీ సమస్య తగ్గకపోతే నోటి ద్వారా తీసుకునే ఐసోట్రెటినాయిన్ అనే మందును వాడవచ్చు. నా వయసు 39 ఏళ్లు. నా తొడల వద్ద మడతలలోనూ, మోకాళ్ల వద్ద మడతలలోనూ నలుపు రంగు మచ్చలు వస్తున్నాయి. వాటి పరిమాణం పెరుగుతోంది. చెమటలు పట్టినప్పుడు వాటిలో చాలా దురద కూడా ఉంటుంది. నాకు తగిన సలహా ఇవ్వండి. - శ్రీధర్, భువనగిరి మీరు చెబుతున్న అంశాలను బట్టి మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్ సమస్య మాటిమాటికీ తిరగబెడుతున్నట్లు అనిపిస్తోంది. మీరు ఇట్రకొనజోల్-100 ఎంజీ మాత్రలను పదిరోజుల పాటు నోటి ద్వారా తీసుకోవాలి. అలాగే మచ్చలున్న చోట మొమాటోజోన్, టర్బినఫిన్ ఉన్న క్రీమును 15 రోజులు రాయాలి. దీంతోపాటు ప్రతిరోజూ మీరు మల్టీవిటమిన్ టాబ్లెట్లు కూడా తీసుకుంటూ ఉండాలి. డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ చీఫ్ డర్మటాలజిస్ట్, త్వచ స్కిన్ క్లినిక్, గచ్చిబౌలి, హైదరాబాద్ -
హెపటైటిస్-సి మందులతో తగ్గుతుందా?
హోమియో కౌన్సెలింగ్ మా అమ్మాయి వయసు 24 ఏళ్లు. గత ఆర్నెల్లుగా పరధ్యానంగా ఉంటోంది. ఎవరితోనూ సరిగా మాట్లాడటం లేదు. ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటోంది. ఆమెకు సరైన హోమియో మందు సూచించండి. - సరళ, చెన్నై మీరు చెబుతున్న లక్షణాలు డిప్రెషన్ వ్యాధిని సూచిస్తున్నాయి. డిప్రెషన్‌ను మనసుకు సంబంధించిన ఒక రకమైన రుగ్మతగా పేర్కొనవచ్చు. దీనికి గురైన వారు విచారం, నిస్సహాయత, అపరాధభావం, నిరాశలలో ఉంటారు. భావోద్వేగాలు సహజంగా మారుతుంటాయి. శారీరకంగానూ కొన్ని మార్పులు కనిపిస్తాయి. ఒక వ్యక్తి అకస్మాత్తుగా బరువు కోల్పోవడం లేదా పెరగడం, చికాకు పడుతుండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరు నిర్దిష్టంగా కొన్ని కాలాలలో డిప్రెషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. ఈ వ్యాధితో బాధపడేవారు పూర్తి డిప్రెషన్లోకి కూరుకుపోయేలోపే చికిత్స అందించడం మంచిది. హోమియో విధానంలో దీనికి పరిపూర్ణ చికిత్స ఉంది. డిప్రెషన్‌ను 1950-60లలో రెండు రకాలుగా విభజించారు. ఒకటి వంశపారంపర్యంగా వచ్చేది. రెండోది న్యూరోటిక్ డిప్రెషన్. ఇవి... మన చుట్టూ ఉండే వాతావరణం, సంఘంలో అసమానతలు, ఉద్యోగం కోల్పోవడం, ఎవరైనా దగ్గరివాళ్లు దూరం కావడం లేదా చనిపోవడం, తీవ్రస్థాయి మానసిక వేదన... వంటి ఎన్నో అంశాల వల్ల రావచ్చు. వివిధ పరిశోధనల ద్వారా ఈ ఆధునిక కాలంలో దీన్ని డిప్రెసివ్ డిజార్డర్‌గా పేర్కొన్నారు. దీనిలో రకాలు : మేజర్ డిప్రెషన్ : ఇందులో డిప్రెషన్ లక్షణాలు తీవ్రస్థాయిలో ఉంటాయి. ఆకలి లేకపోవడం, నిద్రలేకపోవడం, పనిలో శ్రద్ధ లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. డిస్థిమిక్ డిజార్డర్: రోగి తక్కువస్థాయి డిప్రెషన్లో దీర్ఘకాలం పాటు ఉంటాడు. అయితే కొన్నిసార్లు రోగి నార్మల్‌గా ఉన్నట్లుగా అనిపించి, తిరిగి డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తాయి. సైకియాటిక్ డిప్రెషన్ : డిప్రెషన్‌తో పాటు భ్రాంతులు కూడా కనిపిస్తుంటాయి. పోస్ట్ నేటల్ డిప్రెషన్: మహిళల్లో ప్రసవం తర్వాత దీని లక్షణాలు కనిపిస్తుంటాయి. సీజనల్ ఎఫెక్టివ్ డిప్రెషన్ : సూర్యరశ్మి తగ్గడం వల్ల కొంతమందిలో సీజనల్‌గా డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తుంటుంది. బైపోలార్ డిజార్డర్: ఈ డిప్రెషన్లో కొంతమంది పిచ్చిగా, కోపంగా, విపరీతమైన ప్రవర్తనను కనబరుస్తుంటారు. కొంత ఉద్రేకం తర్వాత నార్మల్ అయిపోతారు. హోమియో వైద్యవిధానంలో నేట్రమ్మూర్, ఆరమ్‌మెట్, సెపియా, ఆర్సినిక్ ఆల్బ్, సిమిసిఫ్యూగో వంటి మందులు డిప్రెషన్ తగ్గించడానికి బాగా పనిచేస్తాయి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ వాస్క్యులర్ కౌన్సెలింగ్ నా వయసు 46 ఏళ్లు. వృత్తిరీత్యా ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఇటీవల నేను నడిచేటప్పుడు పాదాలలో, పిక్కల్లో నొప్పి ఎక్కువగా వస్తోంది. నడుస్తుంటే కండరాలు పట్టేసినట్లుగా ఉండి, నడకలో ఇబ్బంది అనిపిస్తోంది. కొంతదూరం నడవగానే కొద్దిసేపు ఆగాల్సి వస్తోంది. ‘అదే తగ్గిపోతుందిలే’ అని వేచిచూశాను. కానీ మూడు నెలలుగా ఆ నొప్పి తగ్గకపోగా రోజురోజుకూ క్రమంగా పెరుగుతోంది. దయచేసిన నా సమస్యకు కారణమేమిటో తెలిపి, సరైన పరిష్కారం చూపించగలరు. - డి. నాగేశ్వరరావు, కర్నూలు మీరు తెలిపిన వివరాలను బట్టి కాలిలోని రక్తనాళాలలో పూడిక ఉన్నట్లు తెలుస్తోంది. పూడిక ఏర్పడటం వల్ల వచ్చే నొప్పిని పెరిఫెరల్ వాస్క్యులర్ డిసీజ్ (పీవీడీ) అంటారు. మీకు మొదటిసారి ఈ సమస్య వచ్చిందా లేక ఇది వరకు ఉన్న సమస్య మళ్లీ కనిపిస్తోందా అనే వివరాలు మీరు తెలపలేదు. మీరు ఎక్కువగా ప్రయాణాలు చేయడంతో పాటు సిగరెట్ తాగడం వంటి అలవాటు ఉంటే త్వరగా ఈ సమస్య ఉత్పన్నం అయ్యే అవకాశం ఉంటుంది. మధుమేహంతో బాధపడుతున్నవారు, అధిక బరువు ఉన్నవారు, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు లేనివారిలో ఈ తరహా సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా కాళ్లకు రక్తసరఫరా తగ్గడం వల్ల ఈ నొప్పి వస్తుంది. రక్తనాళాల్లో పూడికలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకునేందుకు కొన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుంది. కాళ్లలో రక్తప్రవాహాన్ని తెలుసుకోవడం ద్వారా పీవీడీని అంచనా వేయవచ్చు. వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. మీరు తాజా కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవడంతో పాటు ప్రతి రోజూ వాకింగ్ చేయడం మంచిది. అలాగే దూరప్రయాణాలు చేసే సమయంలో కాలి వ్యాయామాలు చేయడం మంచిది. ఇలా చేయడం రక్తనాళాల్లో పూడిక ఏర్పడకుండా ఉండటానికి దోహదపడుతుంది. సిగరెట్, గుట్కా, పాన్ వంటి పొగాకును నమిలే అలవాటు ఉండే వెంటనే మానేయండి. వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదించి సరైన పరీక్షలు చేయించుకోండి. నిర్లక్ష్యం చేస్తే వ్యాధి మరింత పెరిగే అవకాశం ఉంది. వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ, తగిన చికిత్స తీసుకుంటే మీ సమస్యను సులువుగా అధిగమించవచ్చు. డాక్టర్ దేవేందర్ సింగ్ సీనియర్ వాస్క్యులర్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్ మా నాన్నగారికి హెచ్‌సీవీ వచ్చింది. ముందు కామెర్లు వచ్చాయి. వైద్యపరీక్షలు, స్కానింగ్ తర్వాత హెచ్‌సీవీ జీనోటైప్ 3 అని చెప్పారు. ఇటీవలే నెల క్రితం మళ్లీ పరీక్షలు చేయిస్తే లివర్ సిర్రోసిస్, కాలేయం కుడితమ్మె కుంచించుకుపోయిందనీ (రైట్లోబ్ ష్రంకెన్), లెఫ్ట్ లోబ్ ఎన్లార్జ్ అయిందనీ చెప్పారు. కామెర్లు తగ్గాయి కదా అని మా నాన్నగారికి ఫ్యాటీ ఫుడ్ పెట్టాం. దాంతో ఈ సమస్య వచ్చిందా? గత 20 రోజులుగా ఫ్యాటీ ఫుడ్ మానేసి, అంతా ఉడికించిన ఆహారమే (ఉప్పు లేకుండా) ఇస్తున్నాం. ఆయనకు హెచ్‌సీవీ, లివర్ సిర్రోసిస్ మందులతో తగ్గుతుందా? - మాతాశ్రీ, ఈ-మెయిల్ మీరు తెలిపిన వివరాలను బట్టి చూస్తే మీ నాన్నగారికి హెపటైటిస్-సి వ్యాధి వల్ల సిర్రోసిస్ వచ్చినట్లుగా తెలుస్తోంది. సాధారణంగా లివర్ సిర్రోసిస్ వల్ల వచ్చే కామెర్లు చాలావరకు నయం కావు. ఇప్పుడు మీరు లివర్ సిర్రోసిస్ ఏ దశలో ఉందో తెలుసుకోవడం అవసరం. అందుకోసం తప్పనిసరిగా డాక్టర్‌ను కలిసి, హెపటైటిస్-సి కి సంబంధించిన పరీక్షలు చేయించుకొని, తగిన మందులు వాడాల్సి ఉంటుంది. డాక్టర్ల పర్యవేక్షణలో మందులు వాడితే, హెపటైటిస్-సి వ్యాధిని అదుపులో పెట్టవచ్చు. నా వయసు 65 ఏళ్లు. డయాబెటిస్తో బాధపడుతున్నాను. కిడ్నీలు కూడా సరిగా పనిచేయడం లేదు. గత ఆర్నెల్లుగా డయాలసిస్ చేయించుకుంటున్నాను. కడుపులో నొప్పి, వాంతులు అవుతుంటే ఎండోస్కోపీ చేశారు. గ్యాస్ట్రయిటిస్ ఉందని చెప్పారు. ఈ వ్యాధి తగ్గడానికి మందులు వాడవచ్చా? వాటి వల్ల కిడ్నీలు ఇంకా దెబ్బతినే అవకాశం ఉందా? - సిహెచ్. సుబ్బారావు, ఒంగోలు మీరు డయాబెటిస్ నెఫ్రోపతీ, గ్యాస్ట్రయిటిస్ సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకోవాల్సిన దశలో ఉన్నారు. అంటే మూత్రపిండాలు పూర్తిగా చెడిపోయి ఉన్నాయి. మీకు గ్యాస్ట్రయిటిస్ వల్ల వస్తున్న కడుపులో నొప్పి తగ్గాలంటే ఇప్పుడు వాడుతున్న అల్సర్ మందులు వాడండి. వీటిని ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటారు. ఈ మాత్రలు కిడ్నీ ఫెయిల్ అయిన వారికి కూడా ఇవ్వవచ్చు. అవి చాలా సురక్షితం. కాబట్టి మీరు ఎలాంటి ఆందోళన లేకుండా డాక్టర్ ఇచ్చిన మందులు వాడండి. డాక్టర్ భవానీరాజు, సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
మెదడుకు మళ్లీ ప్రాణం పోస్తే..!
బ్రెయిన్ ప్రిజర్వేషన్పై పెరుగుతున్న ఆసక్తి మానవ మస్తిష్కం. దాదాపు 10 వేల కోట్ల న్యూరాన్ల సముదాయం. శరీర కదలికల్ని, సామర్థ్యాల్ని, అంచనాకందని ఆలోచనల్ని నియంత్రించే.. లక్షలాది జ్ఞాపకాలను నిక్షిప్తం చేసుకునే భాండాగారం. అందులోని ఒక్కో న్యూరాన్.. ఒక్కో సమాచార కేంద్రం. న్యూరాన్లు కూడా సాధారణ కణాల్లాంటివే. అయితే, సాధారణ కణాలను, న్యూరాన్లను వేరు పర్చేది.. న్యూరాన్లలోని విద్యుత్స్రాయన సంకేత(ఎలక్ట్రోకెమికల్ సిగ్నల్) సామర్థ్యం. ఆ సామర్థ్యంతోనే అవి సమాచారాన్ని సేకరించడం, మార్పిడి చేయడం చేస్తుంటాయి. జీవితకాలం విషయంలోనూ ఇవి ప్రత్యేకమైనవే. అయితే, మనిషి చనిపోయిన క్షణాల్లోనే ఈ న్యూరాన్ వ్యవస్థ కూడా శిథిలమవడం ప్రారంభమవుతుంది. చనిపోయాక కూడా బ్రెయిన్‌ను సజీవంగా ఉంచగలిగితే.. దాన్లోని న్యూరాన్లు నాశనం కాకుండా కాపాడగలిగితే.. భవిష్యత్తులో సైన్స్ అభివృద్ధి చెందిన తరువాత ఆ మస్తిష్కం పనితీరును, దానిలోని న్యూరాన్లలో దాగిన సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా అద్భుతాలు చేయవచ్చు. ఇప్పుడు మన మేధను భద్రపరిచే సాంకేతిక వ్యవస్థపై విశ్వవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతోంది. న్యూయార్క్‌లోని 23 ఏళ్ల కిమ్సోజీ తనకు కేన్సర్ సోకి చనిపోయే పరిస్థితి తలెత్తడంతో తన మెదడును భద్రపరచటం ద్వారా.. తన భావాలను, అనుభూతులను, అనుభవాలను శాశ్వతం చేసుకోవాలని సంకల్పించింది. ఈ రోజు కాకపోయినా కొన్ని దశాబ్దాల తరువాతైనా అభివృద్ధి చెందిన శాస్త్రసాంకేతికత సాయంతో మస్తిష్కాన్ని, దాన్లోని న్యూరాన్లను స్కాన్ చేసి, కోడింగ్ చేసి, ఆ న్యూరాన్ల ప్రత్యేక సామర్థ్యాలను ముందు తరాలకు అందించాలనుకుంది. అయితే ఇందుకోసం కనీసం 80వేల పౌండ్లు(రూ.82 లక్షలు) ఖర్చవుతాయి. కిమ్ తన తండ్రిని అడిగితే అంత డబ్బును సమకూర్చలేనన్నాడు. దీంతో ఆమె ఫేస్బుక్ ద్వారా విరాళాల రూపంలో ఆ మొత్తాన్ని సేకరించింది. అయితే ఈ మస్తిష్క సంరక్షణ అంత సులువు కాదు. ముందుగా, వ్యక్తి చనిపోవడానికి క్షణాల ముందే ఈ ప్రక్రియ ప్రారంభం కావాలి. అంతకుముందే క్రయోనిక్స్ టీం(శరీర భాగాలను భద్రపరిచి, చెడిపోకుండా సంరక్షించే బృందం)ను అప్రమత్తం చేయాలి. చనిపోగానే మెదడుకు ఆక్సిజన్ సరఫరాను కొనసాగించాలి. బ్రెయిన్లో రక్తం గడ్డకట్టకుండా చూసుకోవాలి. మెదడును వేరు చేసి, తరలించి, మైనస్ 300 డిగ్రీల ఉష్ణోగ్రతలో, ద్రవరూప నైట్రోజన్‌లో భద్రపరచాలి. ఆమె మరణానికి కొద్ది గంటల ముందు.. బ్రెయిన్ ప్రిజర్వేషన్‌లో అమెరికాకు చెందిన ‘అల్కొర్ లైఫ్ ఎక్స్టెన్షన్ ఫౌండేషన్’ కిమ్ మెదడును అలా భద్రపరచింది. ఈ సంస్థే ప్రముఖ బాస్కెట్ బాల్ ప్లేయర్ టెడ్ విలియమ్స్ మెదడును భద్రంగా సంరక్షిస్తోంది. -
నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటే..?
న్యూరాలజీ కౌన్సెలింగ్ కండరాలు పట్టేయడానికి కారణాలు అనేకం! నా వయసు 30 ఏళ్లు. గత కొంతకాలంగా నాకు కాళ్లూ, చేతుల కండరాలు బిగుసుకుపోయినట్లుగా పట్టుకుపోతున్నాయి. తీవ్రమైన నొప్పి వస్తోంది. కొన్నిసార్లు కంప్యూటర్‌పై పనిచేస్తున్నప్పుడు, మరికొన్నిసార్లు నిద్రలో ఇలా జరుగుతోంది. అలా బిగుసుకుపోయినప్పుడు, నొప్పి తగ్గడానికి కాస్త మసాజ్ చేసుకుంటూ ఉంటాను. ఈ సమస్యనుంచి బయట పడటానికి మార్గం చెప్పండి. - కె. రాంబాబు, హైదరాబాద్ ఇలా కాళ్లు, చేతుల కండరాలు బిగుసుకుపోయినట్లుగా పట్టేయడానికి (క్రాంప్స్‌కు), నొప్పికి చాలా కారణాలు ఉంటాయి. మీరు తీవ్రమైన అలసటకు గురైనప్పుడు ఇలాంటి లక్షణాలు కనిపించవచ్చు. మీరు వ్యాయామం చేయని కారణంగా కండరాలు బలహీనమైపోయి, తీవ్రమైన అలసట కలగడం అనేది చాలా అరుదైన సందర్భాల్లో జరిగే పరిణామం. దీనివల్ల కూడా మీరు చెప్పిన లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సమయాల్లో సాధారణంగా పిక్కలు పట్టేస్తాయి. ఇలాంటివారు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, మీ కండరాలను బలపరచుకోవాల్సి ఉంటుంది. ఇక కొందరిలో సోడియమ్, పొటాషియమ్, చక్కెరపాళ్లు, క్యాల్షియమ్, మెగ్నీషియమ్ వంటి ఖనిజ లవణాలు గణనీయంగా తగ్గడం గానీ లేదా పెరగడం గానీ జరిగినా ఇవే లక్షణాలు కనిపిస్తాయి. ఇక కొందరిలో కాలేయం, మూత్రపిండాలు సరిగా పనిచేయకపోతే కూడా ఇవే లక్షణాలు కనిపిస్తాయి. అయితే కొందరిలో తమ శరీరంలోని నీటి నిల్వలు తగ్గినా (సింపుల్ డీహైడ్రేషన్ వల్ల ) కూడా ఇవే లక్షణాలు వ్యక్తమవుతాయి. ఇక కొందరిలో విటమిన్ బి12, విటమిన్ డి తగ్గడం వల్ల, థైరాయిడ్, అడ్రినల్ గ్రంథులు సరిగా పనిచేయకపోవడం వల్ల కూడా ఇవే లక్షణాలు ప్రస్ఫుటమవుతాయి. కొందరిలో కొన్నిసార్లు సాధారణ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు కూడా ఇవే లక్షణాలు కనిపించవచ్చు. అలాగే కొందరిలో పెరిఫెరల్ నర్వ్స్ అనే నరాలు, వెన్నెముక లోపాలతోనూ ఈ లక్షణాలు కనిపించవచ్చు. అందుకే ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా న్యూరాలజిస్ట్‌ను కలిసి, విపులంగా రక్త పరీక్షలు చేయించుకొని, లక్షణాలకు అసలు కారణాన్ని కనుక్కోవాలి. సమస్యను కనుగొంటే దాన్ని బట్టి చికిత్స ఉంటుంది. లైఫ్‌స్టైల్ కౌన్సెలింగ్ పొగాకు, మద్యంతోనూ వెన్నునొప్పి వస్తుంది! నా వయసు 35 ఏళ్లు. చాలాసేపు కూర్చొని ఉంటాను. దాంతో వెన్నునొప్పి వస్తోందని భావించి ఇటీవల డాక్టర్‌ను కలిశాను. అక్కడ ఆయన చెప్పిన విషయం విని ఆశ్చర్యపోయాను. నిజానికి నా కూర్చుని ఉండే అలవాటు ఇటీవలి వృత్తులు చేసే చాలామందికి ఉంటుందనీ, దానితో పాటూ నా విపరీమైన పొగతాగడం, మద్యపానం అలవాట్ల వల్ల కూడా వెన్నునొప్పి తీవ్రమవుతోందని డాక్టర్ చెబితే విని ఆశ్చర్యపోయాను. ఆయన చెప్పేది వాస్తవమేనా? వివరంగా చెప్పండి. - కృష్ణచైతన్య, హైదరాబాద్ మీ డాక్టర్ చెప్పిన విషయాలు వినడానికి మీకు ఆశ్చర్యంగా అనిపించినా, జీవనశైలి నిపుణులమైన మాకు మాత్రం ఏమాత్రం ఆశ్చర్యకం కాదు. ఆయన చెప్పింది పూర్తిగా వాస్తవమే. వెన్నునొప్పికి మూడు ప్రధానమైన అంశాలు దోహదపడతాయి. అవి... ఊబకాయం, విపరీతమైన పొగతాగడం, అత్యధిక స్థాయిలో మద్యం తీసుకోవడం. పొగతాగడం, మద్యం తీసుకోవడం వల్ల ఎముకల సాంద్రత (బోన్ డెన్సిటీ) గణనీయంగా తగ్గుతంది. నిజానికి ఎముకల్లో ఎంత ఖనిజాల సాంద్రత (నార్మల్ మినరల్ డెన్సిటీ) ఉండాలో అంత ఉంటేనే... అవి పటిష్టంగా ఉండి, చిన్న చిన్న దెబ్బలకే విరగకుండా ఉండటం (రెసిస్టెన్స్ టు ఫ్రాక్చర్స్) కోసం తయారై ఉంటాయి. కానీ ఇలా పొగతాగడం, మద్యం తీసుకోవడం వల్ల వాటిలో సాంద్రత తగ్గగానే అవి చిన్న చిన్న దెబ్బలకే విరగడం మొదలవుతాయి. ప్రధానంగా ఈ లక్షణం మన శరీరం బరువును తీసుకునే ఎముకలు, వెన్నెముకలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇక రోజూ మూడు పెగ్గుల కంటే ఎక్కువగా మద్యం తీసుకునే వారిలో ఎముకల సాంద్రత తగ్గడం స్పష్టంగా కనిపిస్తుంటుంది. పైగా పొగతాగడం, మద్యం తీసుకోవడం అనే చర్యలు మనం ఆహారం ద్వారా తీసుకునే క్యాల్షియమ్ జీర్ణక్రియ ద్వారా మన ఎముకలకు అందకుండా చేస్తాయి. కొత్త ఎముక పెరిగే ప్రక్రియనూ ఆలస్యం చేస్తాయి. ఎముకకు రక్తసరఫరానూ తగ్గిస్తాయి. దాంతో ఎముకలు బలహీనపడతాయి. ఫలితంగా మీరు వెన్నెముకలోనూ సాంద్రత తగ్గినందువల్లనూ, మీ బరువు దానిపై పడుతుండటం వల్లనూ వెన్నునొప్పి వస్తుంటుంది. అయితే ఈ నొప్పిని అధిగమించడం చాలా సులభం. మీరు మీ పొగతాగే అలవాటు, మద్యపానం అలవాట్లను మానేసి, మీ జీవనశైలిని మెరుగుపరచుకొని రోజూ క్రమం తప్పకుండా పోషకాహారాలతో కూడిన పదార్థాలు తీసుకుంటూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల స్థూలకాయం తగ్గడంతో పాటు, వెన్నునొప్పీ తగ్గుతుంది. నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటే..? మా అమ్మాయికి ఎనిమిదేళ్లు. గత కొద్దికాలంగా కళ్లు వాచి కనిపిస్తున్నాయి. కాళ్లలో కూడా వాపు కనిపిస్తోంది. యూరిన్ టెస్ట్ చేయిస్తే ప్రోటీన్ మూడు ప్లస్ అని తేలింది. ఇంత చిన్న వయసులో మా పాపకు ఏ సమస్య వచ్చింది? దీనికి ఏ విధమైన మందులు వాడాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దయచేసి తగిన సలహా ఇవ్వగలరని ప్రార్థన. - రాజేశ్వరరావు, తెనాలి మీరు తెలిపిన వివరాల ప్రకారం, మీరు వివరిస్తున్న లక్షణాల ప్రకారం చూస్తే మీ పాపకు నెఫ్రోటిక్ సిండ్రోమ్ అనే వ్యాధి ఉన్నట్లు అనిపిస్తోంది. నెఫ్రోటిక్ సిండ్రోమ్ వ్యాధితో బాధపడుతున్న వారిలో సీరమ్ ఆల్బుమిన్ తక్కువగా ఉండి, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. ఇది చిన్న పిల్లల్లో చాలా సాధారణంగా కనిపించే సమస్య. ఇలాంటి సమస్య ఉన్న పిల్లల్లో మూత్రంలో ఎక్కువగా ప్రోటీన్లు పోతూ ఉంటాయి. అయితే ముందుగా మీ పాప విషయంలో వ్యాధి నిర్ధారణ జరగాలి. ఇందుకోసం మీ పాపకు 24 గంటల యూరిన్ ప్రోటీన్ పరీక్ష, సీరల్ ఆల్బ్యుమిన్ పరీక్ష, కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించాలి. మీ పాపకు ఉన్నది నెఫ్రోటిక్ సిండ్రోమ్ అనే సమస్య అని నిర్ధారణ అయిన తర్వాత మొదటిసారి మూడు నెలల పాటు మీ పాపకు స్టెరాయిడ్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ స్టెరాయిడ్స్ వాడే ముందర మీ పాపకు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా చూసుకోవాలి. సాధారణంగా ఈ వ్యాధి తగ్గిన తర్వాత కూడా పదిహేను సంవత్సరాల వరకు మళ్లీ మళ్లీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మొదటిసారి వచ్చినప్పుడే సరైన చికిత్సను పూర్తికాలంపాటు తీసుకోవాలి. అలాచేస్తే మళ్లీ మళ్లీ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇక మీ పాప విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వస్తే... మీ పాపకు ఇచ్చే ఆహారంలో ఉప్పు, కొవ్వు పదార్థాల పాళ్లు చాలా తక్కువగా ఉండేటట్లుగా చూసుకోవాలి. ఇంత చిన్న పాపకే సమస్య వచ్చిందేమిటి అంటూ మీరు ఆందోళన చెందకుండా, పైన పేర్కొన్న పరీక్షలను చేయించి, మీకు సమీపంలోని నెఫ్రాలజిస్టును కలిసి మీ పాపకు తగిన చికిత్స తీసుకోండి. పెద్దపేగు క్యాన్సర్‌పై అవగాహన పెంచుకోండి! మా నాన్న వయసు 56 ఏళ్లు. కొంతకాలంగా జీర్ణసంబంధ సమస్యతో బాధపడుతున్నారు. ఇటీవల మలవిసర్జన సమయంలో రక్తం పడుతుండటంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లి పరీక్షలు చేయించాం. ఆయన పెద్దపేగుకు క్యాన్సర్ (కొలోన్ క్యాన్సర్) సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? లక్షణాలు, చికిత్స విధానాలు ఏమిటి? - విజయభాస్కర్, వనపర్తి జీర్ణవ్యవస్థలోని ప్రధాన అవయవాల్లో పెద్దపేగు (కొలోన్) ఒకటి. మనం తినే ఆహారంలోని అనేక ముఖ్యమైన పోషకాలను జీర్ణం చేయడంలోనూ, వ్యర్థాలను మలం రూపంలో విసర్జించడంలోనూ ఇది ముఖ్య భూమిక పోషిస్తుంది. మిగతా అవయవాల్లాగే ఇదీ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. మారుతున్న జీవనశైలి, ఆహారంలో పీచుపదార్థాలు తగ్గడం, కొవ్వుల వాడకం పెరగడం, శారీరక శ్రమ తగ్గడం వంటి అంశాల వల్ల దీని విస్తృతి పెరుగుతోందని భావిస్తున్నారు. దీనితో పాటు పెద్దపేగులో పెరుగుతున్న క్యాన్సర్ రహిత పాలిప్స్, జన్యులోపాలు, పేగులు వాచిపోయే వ్యాధులు, ఊబకాయం, పొగతాగడం వంటివి కూడా ఈ వ్యాధికి దోహదం చేసే అంశాలే. పెరిగే వయసు కూడా పెద్దపేగు క్యాన్సర్‌కు ఒక ప్రధాన రిస్క్ ఫ్యాక్టర్. పెద్దపేగులో నియంత్రించలేనంత స్థాయిలో కణాలు పుట్టలు పుట్టలుగా పెరుగుతాయి. వీటిలో చిన్నపాటి, క్యాన్సర్హ్రిత ట్యూమర్లు అత్యధికం. వీటినే పాలిప్స్ అంటారు. ఇవి పెద్దపేగు లోపలి గోడల్లో ఏర్పడతాయి. ఈ పాలిప్స్ క్రమంగా ట్యూమర్లు (గడ్డలు)గా వేళ్లూనుకున్న తర్వాత ఆ పరిసర ప్రాంతంలోని ఆరోగ్యవంతమైన కణజాలాన్నీ ధ్వంసం చేయడం మొదలుపెడతాయి. ఈ వ్యాధి బారిన పడ్డవారికి మొదట్లో ఎలాంటి స్పష్టమైన లక్షణాలూ కనిపించవు. కానీ క్యాన్సర్ తీవ్రత పెరిగేకొద్దీ డయారియా లేదా మలబద్దకం పెరుగుతుంది. మలవిసర్జన క్రమం తప్పుతుంది. మలంలో నెత్తురుతో పాటు పొత్తికడుపులోని గ్యాస్ కారణంగా మలవిసర్జన సమయంలో తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతుంటారు. తరచూ మలవిసర్జన చేయాలనిపించడం, నీరసం, నిస్సత్తువ ఆవరిస్తుంది. అకస్మాత్తుగా బరువు కోల్పోతారు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే కొలనోస్కోపీ అనే పరీక్ష చేసి పేద్ద పేగులోపలి నుంచి పాలిప్స్‌ను సేకరిస్తారు. అవి క్యాన్సరస్ పాలిప్సా లేదా అని నిర్ధారణ చేయడానికి బయాప్సీ పరీక్షకు పంపుతారు. అలాగే వ్యాధి ఏ మేరకు పాకిందో నిర్ధారణ చేయడానికి కొన్ని స్కాన్లు కూడా అవసరమవుతాయి. ఇక చికిత్స ప్రణాళిక అనేది వ్యాధి ఏ దశలో ఉంది అన్న అంశంపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా కొలోన్ క్యాన్సర్ ఆరంభదశలో ఉంటే శస్త్రచికిత్స ద్వారా పెద్దపేగు మొత్తాన్ని కూడా తొలగిస్తారు. అవసరాన్ని బట్టి పేషెంట్‌కు రేడియోథెరపీ, కీమోథెరపీ కూడా ఇస్తారు. ఇక వ్యాధి బాగా ముదిరిన దశలో ఉంటే టార్గెటెడ్ థెరపీ, కీమోథెరపీల ద్వారా వ్యాధి తీవ్రత నుంచి ఉపశమనం కలిగిస్తారు. -
డయాబెటిస్ కౌన్సెలింగ్
షుగర్ ఉంటే పాదాలపై అంత శ్రద్ధ ఎందుకు? నా వయసు 65. దాదాపు ఐదేళ్ల క్రితం నుంచి డయాబెటిస్తో బాధపడుతున్నాను. గుండె పరీక్షలు చేయించుకోడానికి వెళ్లినప్పుడు మా డాక్టర్‌గారు పాదాలను జాగ్రత్తగా చూసుకొమ్మని పదే పదే హెచ్చరించారు. ఆయన ఎందుకంత నిర్దిష్టంగా అడిగారు? వివరించండి. - కోటేశ్వరరావు, నరసరావుపేట డయబెటిస్ వ్యాధి దీర్ఘకాలంలో శరీరంలోని వివిధ రక్తనాళాలను, నరాలను దెబ్బతీస్తుంది. తొలిదశలో నరాలు మాత్రమే దెబ్బతింటాయి. అప్పుడప్పుడూ కాళ్లు తిమ్మిరెక్కడం, మొద్దుబారడం జరుగుతుంది. షుగర్ వచ్చిన 5 నుంచి 10 ఏళ్ల తర్వాత పాదాలకు స్పర్శ కోల్పోవడం, దానివల్ల తెలియకుండానే చెప్పులు కాలి నుంచి జారిపోవడం వంటి లక్షణాలు చూస్తాం. వ్యాధి తీవ్రమైతే స్పర్శ చాలావరకు కోల్పోయి కాలికి దెబ్బతగిలినా లేక వేడి వస్తువులు తాకినా నొప్పి తెలియదు. ఇలా నొప్పి తెలియకుండా అయిన గాయాలు, పెద్దవవుతాయి. వీటిని న్యూరోపథిక్ అల్సర్స్ అంటారు. అంటే నరాలు దెబ్బతినడం వల్ల నొప్పి తెలియకపోవడం వల్ల పెరిగిపోయిన పుండు అన్నమాట. షుగర్ వ్యాధి పదేళ్ల కంటే ఎక్కువ రోజులు ఉంటే కాలి నరాలతో పాటు రక్తనాళాలు కూడా దెబ్బతింటాయి ఇంతకు ముందు ఏర్పడ్డ న్యూరోపథిక్ గాయం తగ్గాలంటే నరాలు పునరుత్తేజితం కావాలి. నరాలకు ఈ శక్తి రావాలంటే రక్తప్రసరణ కీలకం. కానీ షుగర్ వ్యాధిగ్రస్తులలో రక్తనాళాల్లో కొవ్వు చేరడం వల్ల కరండాలు కూడా శక్తి కోల్పోతాయి. కాలి కండాల నరాలలో బలం, సమతౌల్యత లోపించడం వల్ల పాదం వంకరపోతుంది. ఇలా పాదం వంకరపోయిన చోట ఒత్తిడి పెరిగి పుండు ఏర్పడే అవకాశం ఎక్కువవుతుంది. దీన్నే వైద్యపరిభాషలో చార్కాట్ ఫుట్ అంటారు. నరాలు, రక్తనాళాలు... ఈ రెండూ దెబ్బతినడం వల్ల ఏర్పడ్డ పుండును న్యూరోఇస్కిమిక్ అల్సర్ అంటారు. ఇలాంటి న్యూరోపతిక్ అల్సర్లను షుగర్ వ్యాధి వచ్చిన 5 ఏళ్ల నుంచి పదేళ్ల సమయంలో ఎక్కువగా చూస్తుంటాము. ఈ పరిస్థితి ముదిరి కాలిగాయాన్ని నిర్లక్ష్యం చేస్తే పాదం కుళ్లిపోయే అవకాశం ఉంది. ఈ కండిషన్‌ను గ్యాంగ్రీన్ అంటారు. ఇది జరిగితే కాలిని తొలగించాల్సిన పరిస్తితి వస్తుంది. అందుకే మీ డాక్టర్ పాదం గురించి శ్రద్ధ తీసుకొమ్మని మరీ మరీ చెప్పారు. షుగర్ వ్యాధి తీవ్రత వల్ల ప్రపంచంలో ప్రతి 20 క్షణాలకు ఒకరు కాలిని కోల్పోతున్నారు. మనదేశంలోనూ షుగర్ వ్యాధిగ్రస్తులు చాలా ఎక్కువసంఖ్యలో పెరుగుతున్నారు. కాబట్టి మీ డాక్టర్ చెప్పిన సలహాలు పాటించి పాదాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. -
ఓ తల్లి ఆవేదన
'లోకంలో చాలామంది మగపిల్లల్నే కనాలనుకుంటారు. నాకు, మా ఆయనకు మాత్రం అమ్మాయి కావాలనుండేది. బహుషా ఈ రోజు నేను చనిపోవాలని కోరుకోవడానికి.. నా పిల్లల్ని చంపేయమని అడగలేక అడగడానికి బహుషా అదే కారణమేమో! నాకిప్పుడు 36 ఏళ్లు. ఇంకో నాలుగైదు సంవత్సరాలకంటే ఎక్కువ కాలం బతకనని తెలుసు. నా ఒంట్లో శక్తిమొత్తం హరించుకుపోయింది. దాదాపు 14 ఏళ్ల నుంచి సరిగా నిద్రపోలేదు కూడా. బంధువులు చనిపోయినా, వాళ్లింట్లో పెళ్లిళ్లయినా నేను మాత్రం ఇల్లు కదలను. సొంత తమ్ముడి పెళ్లి కూడా నేను లేకుండానే జరిగిపోయింది.. సూర్యుడు బయటికిరాకముందే 18 ఏళ్ల నా పెద్దకొడుకు సులేమ్ నిద్రలేచి అరుస్తూఉంటాడు.. టాయిలెట్‌కు తీసుకెళ్లమని! ఇల్లూడుస్తున్న చీపురును అక్కడే పడేసి వాణ్ని బాత్రూమ్ కి తీసుకెళతా. ప్యాంట్ విప్పి, మూత్రం పోయించి, శుభ్రంగా కాళ్లు కడుగుతా. నేనుగానీ ఇలా చెయ్యకుంటే వాడు పక్క తడిపేస్తాడు. కనీసం జిప్ తీసుకోవడం కూడా రాదు వాడికి. ఆ అలికిడికి 16 ఏళ్ల సుహేబ్కు మెలకువొస్తుంది. లేచింది మొదలు 'అమ్మా.. ఆకలి' అంటూ చంపుతాడు. బ్రషింగ్ చేయించేలోగా వాడి నానమ్మ పాలు, బిస్కెట్లు తినిపించడానికి రెడీ అవుతుంది. బిస్కెట్లు పాలలో పూర్తిగా నాననివ్వాలి. ఘనపదార్థాలను వాడు తినలేడు. అంతలోనే అసిమ్ (14), ఖషిఫ్ (12) నిద్రలేచి పక్కమీదే అటూ ఇటూ దొర్లుతూఉంటారు. అలా దొర్లడంతప్ప కూర్చోవడం, నిల్చోవడం, అన్నం తినడంలాంటివి చేయలేరు. ఎనిమిదేళ్ల కవలలు అవాన్, తైబాలదీ ఇలాంటి పరిస్థితే. ఒకరితర్వాత ఒకరికి ఏదోఒక సేవ చేస్తుండగానే పొద్దుగూకుతుంది. కొద్దిగా కన్నంటుతుందోలేదో.. కాలకృత్యాలు తీర్చమని పిలుస్తారు. పెద్దకొడుకు కుహేబ్ (20), చిన్నమ్మాయి ఉల్తాఫ్ (5) మాత్రం ఆరోగ్యంగా ఉన్నారు. ఈ ఆరుగురు కూడా మొదటి ఐదేళ్లవరకు బాగానే ఉన్నారు. ఆ తరువాతే వారిలో ఎదుగుదల లేకుండాపోయింది. ఒంట్లో సత్తువ ఉండదు. ఎక్కడపడితే అక్కడ కూలబడిపోతారు. వీళ్లకి నయం చేయించడానికి నేను, నా భర్త తిరగని ఊరంటూలేదు. నా ఆరుగురు పిల్లలకు అరుదైన నాడీ సంబంధిత వ్యాధి ఉందని డాక్టర్లు తేల్చారు. మరి నయమవుతుందా అంటే మాత్రం సరైన సమాధానం ఎవరూ చెప్పట్లేదు. చాలామందైతే ఈ పిల్లలు బతకరని చెబుతున్నారు. ఈ మధ్యే మా బంధువులు కొందరు మరణభిక్షకు అర్జీ పెట్టుకోమని సలహా ఇచ్చారు. ఏం చెప్పను.. 'నా పిల్లల్ని చంపేయండి' అని ఏ తల్లైనా అనగలదా!' అంటూ విదారకంగా తన గాథ చెబుతోంది ఆగ్రాకు చెందిన తబసుమ్. ఇస్లాం ధర్మం అంగీకరించినందున వరుసకు సోదరుడయ్యే మహమ్మద్ నజీర్‌తో 1995లో ఆమె పెళ్లయింది. ఆగ్రాలోని ఓ హల్వా దుకాణంలో పనిచేస్తోన్న నజీర్.. రోజుకు 250 రూపాయలు సంపాదిస్తాడు. తిప్పికొడితే ఇద్దరు పిల్లలకికూడా సరైన వైద్యపరీక్షలు చేయించేంత స్తోమతలేదు అతనికి. ఇక ప్రభుత్వ సహాయమంటారా.. గతంలో ఓసారి ఆగ్రా ఎమ్మెల్యే సూచనమేరకు ఆరుగురు పిల్లల్ని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి వాతావరణం, వైద్యుల నిర్లక్ష్యం భరించలేక పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చుకున్నారు. ఈ మధ్యే ముంబైకి చెందిన ఓ ఎన్జీవో పిల్లలకి నయం చేయిస్తామని ముందుకొచ్చింది. అయితే అంతదూరం పంపాలో లేదో తేల్చుకోలేకపోతున్నారు తల్లిదండ్రులు. 'ఏ డాక్టర్లూ నా పిల్లలకు నయం చేయలేరు. అల్లా ఒక్కడే ఆ పని చేయగలడని నమ్ముతున్నా. ఒకవేళ అలా జరగకుంటే ఆయనే (దేవుడే) వాళ్ల ప్రాణాలు తీసేసుకుంటాడు. నేను మాత్రం నాపిల్లలకు మరణభిక్ష పెట్టమని ప్రభుత్వాన్ని అడగదల్చుకోలేదు' అంటాడు 42 ఏళ్ల నజీర్. -
వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోండి
బాగేపల్లి : గ్రామాల్లో నిర్వహించే వైద్య శిబిరాలను గ్రామీణులు సద్వినియోగం చేసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే ఎస్ఎన్ సుబ్బారెడ్డి పిలుపు నిచ్చారు. పట్టణంలోని నేషనల్ కళాశాల మైదానంలో ఎస్ఎన్ సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్ట్, డీ దేవరాజు అరసు వైద్య కళాశాల సంయుక్తంగా శనివారం నిర్వహించిన ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడారు. కరువు వల్ల ఈ ప్రాంతం అన్ని రంగాల్లో వెనుకబడి ఉందని, గ్రామీణులు ఆర్థికంగా చాలా చితికిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం అనారోగ్యానికి గురైతే వైద్యుల వద్దకు వెళ్లేందుకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాంటి వారి కోసమే గ్రామాల్లో వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి శిబిరాలను గ్రామీణులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆర్ఎల్ జాలప్ప ఆస్పత్రి వ్యవస్థాపకుడు మాజీ ఎంపీ, ఆర్ఎల్ జాలప్ప మాట్లాడుతూ.. ధనవంతులు తన ధనంలో కొంత సొమ్మును పేదల కోసం ఖర్చు చేయాలని సూచించారు. ఈ శిబిరంలో నరాల బలహీనత, కేన్సర్, పళ్ళు, మధుమేహం, గర్భకోశం, మానసిక వ్యాధులు తదితర వాటితో బాధపడుతున్న వారికి చికిత్స అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎల్ జాలప్ప ఆస్పత్రి కార్యదర్శి నాగరాజు, వైద్యులు శ్రీరాములు, కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
చెవిలో గుయ్‌ఁ మని ఒకటే హోరు..?
నా వయసు 30 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా చెవిలో విపరీతమైన శబ్దం వస్తోంది. ఏ పనీ చేయలేకపోతున్నాను. రాత్రి సమయాల్లో హోరు ఎక్కువగా ఉంటోంది. వైద్యులను సంప్రదిస్తే నరాల బలహీనత ఉంది అని కొన్ని మందులు ఇచ్చారు. కానీ అంతగా ఫలితం లేదు. ఈ సమస్యతో ఉద్యోగం సరిగా చేయలేకపోతున్నాను. నాకు హైబి.పి కూడా ఉంది. ఏమవుతుందోనని భయంగా ఉంది. నా సమస్యకు పరిష్కారం తెలియచేయగలరు. - ఎస్. వినోద్, హైదరాబాద్ మీరు చెప్పిన వివరాలను బట్టి చూస్తే మీ సమస్యను‘టినైటస్’ అంటారు. ఇలా చెవిలో శబ్దాలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. టినైటస్ చాలా వరకు వినికిడికి సంబంధించిన వ్యవస్థలోని లోపాల వల్ల వస్తుంది. చెవిలో ఇన్ఫెక్షన్లు ఒటోస్ల్కెరోసిస్ వంటి కారణాల వల్ల కూడా వస్తుంది. వీటితోపాటుగా వినికిడి వ్యవస్థలోని లోపలి భాగమైన కాక్లియా సంబంధిత భాగాలకు రక్తసరఫరా సరిగా జరగకపోవడం, వినికిడి నరంలో లోపం, కాక్లియాకు సంబంధించిన ఇతర లోపాల వలన కూడా టినైటస్ రావచ్చు. మీకు అధిక రక్తపోటు ఉందంటున్నారు కాబట్టి వాస్కులర్ సిస్టమ్‌లో లోపాల వలన కూడా మీకు ఈ సమస్య వచ్చి ఉండవచ్చు. మీరు వెంటనే నిపుణులైన ఇ.ఎన్.టి వైద్యులను సంప్రదించి వారి సూచనల మేరకు ఆడియాలజిస్టునూ, న్యూరాలజిస్టునూ సంప్రదించి వారి సలహా మేరకు వినికిడి పరీక్షలు చేయించుకోండి. సాధారణంగా మీకు టినైటస్ ప్రశ్నావళి, లిపిడ్ ప్రొఫైల్, ఎం.ఆర్ఐ (బ్రెయిన్, ఐఎసి) మొదలైన పరీక్షలు (అన్నీ కాని లేదా వీటిలో కొన్ని) అవసరం కావచ్చు. స్వయంగా పరీక్షించిన డాక్టరు సూచన మేరకు చేయించుకున్న పరీక్షల నివేదిక ఆధారంగా మీ సమస్య పట్ల కచ్చితంగా ఒక నిర్ధారణకు రావచ్చు. ఆ తర్వాత మీకు చికిత్స పట్ల ఒక అవగాహన కలుగుతుంది. ఈ సమస్య మందులతో నయమవుతుంది. కొన్ని సందర్భాల్లో శస్త్రచికిత్స అవసరం పడవచ్చు. చాలామందికి టినైటస్ రీ ట్రైనింగ్ థెరపీ, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ ద్వారా ఉపయోగం ఉంటుంది. వినికిడి లోపం ఉన్న వారికి వినికిడి మిషన్ల ద్వారా ఉపశమనం కలుగుతుంది. - డాక్టర్ ఇ.సి. వినయ్‌కుమార్, ఇ.ఎన్.టి. నిపుణులు -
కడుపు తీపి అంటారందుకే!
అన్ని బంధాల కంటే పేగు బంధమే బలమైనదంటారు. అందుకే నేమో... బిడ్డ తనది కాకపోయినా, తన కడుపున మోసినందుకు గుండెకు హత్తుకుందా తల్లి. బ్రిటన్‌కు చెందిన క్రిస్టల్ కెల్లీ (32)కి పెళ్లై పిల్లలు ఉన్నారు. అయితే ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక తన గర్భాన్ని అద్దెకిచ్చేందుకు సిద్ధపడింది. పిల్లలు లేని ఓ దంపతుల కోసం సరొగేట్ మదర్‌గా మారింది. కవలలకు జన్మ నిచ్చింది. అయితే ఇద్దరు పాపల్లో ఒక పాపకి నరాల వ్యాధి ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. దాంతో తల్లిదండ్రులు ఆ పాపను వదిలేసి, ఆరో గ్యంగా ఉన్న పాపను తీసుకుని వెళ్లిపోయారు. పాపను తీసుకెళ్లమని కబురు పెట్టినా... తమకు అక్కర్లేదని చెప్పేశారు. కానీ కెల్లీ అలా చేయలేకపోయింది. కడుపున మోసినందుకో ఏమో... మమతను చంపుకోలేకపోయింది. అనారోగ్యంగా ఉన్న బిడ్డను తీసుకెళ్లి పెంచుకుంటోంది. అమ్మ అనే పదానికి అసలైన అర్థాన్ని చెప్తోంది! -
55 రోజులు 17 వేల కిలోమీటర్లు
విశాఖపట్నం... లాసన్స్‌బే కాలనీలోని ‘బేక్ మై విష్’ కాఫీ షాప్. ముగ్గురు మిత్రులు కాఫీ సిప్ చేస్తున్నారు. ‘బైక్‌పై లాంగ్ రైడ్ చేస్తా... మీరొస్తారా?’ తాగేసిన కాఫీ కప్పును టేబుల్‌పై పెడుతూ అన్నాడు కిషోర్... ‘వావ్... సూపర్బ్ ఐడియా.. వియార్ రెడీ... ఎన్నాళ్లు... ఎక్కడికెళ్దాం?... ఎప్పుడొద్దాం?’... బుల్లెట్ స్పీడ్‌తో ప్రశ్నించారు కర్ణ రాజ్, సుధీర్. ‘ఫ్రం హోం.. టు హోం... వయా ఇండియా. ఇంటి నుంచి బయల్దేరాలి. భారతదేశాన్ని క్లోజప్‌లో చూడాలి. రెండు నెలల్లో ఇంటికి రావాలి’... ప్లాన్ వివరించాడు కిషోర్. ‘ఓకే డన్..’ అన్నారు కర్ణ రాజ్, సుధీర్. ముగ్గురూ బైక్‌లపై దూసుకుపోయారు. కన్యాకుమారిలో అందమైన సాయం త్రం. హిమాలయాల్లో రక్తం గడ్డ కట్టే చలితో సహవాసం. లేహ్‌లో మంచువానలో స్నానం. కొండచరియలు విరిగిపడుతున్నా చెదరని ఆత్మవిశ్వా సం. సైనికుల బంకర్లలో ఆతిథ్యం. ఇన్ని అనుభవాలు మిగిల్చిన ఆ దూరం అక్షరాలా 17 వేల కిలోమీటర్లు... 55 రోజులు. విశాఖపట్నం నుంచి సుదూర యాత్ర... బైక్‌పై సుదూర యాత్ర చేయాలన్నది కిషోర్ చిరకాల వాంఛ. దీనికి కర్ణ, సుధీర్ తోడయ్యారు. రెండు నెలల సెలవుకు కర్ణ, కిషోర్ దరఖాస్తు చేశారు. వాళ్ల బాస్‌లు కుదరదన్నారు. అంతే... ఇద్దరూ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. జూన్ తొమ్మి దిన.. కిషోర్, కర్ణ, సుధీర్ బైకుల్ని సిద్ధం చేసుకున్నారు. విశాఖపట్నం నుంచి బైక్ యాత్ర మొదలైంది. మూడోరోజు ఉదయానికి ముగ్గురూ చెన్నై చేరుకున్నారు. అక్కడ చెన్నై బుల్స్ (బుల్లెట్ రైడర్స్) అసోసియేషన్ సభ్యులు వీరికి ఘన స్వాగతం పలికారు. ముగ్గురూ మర్నాడు బయల్దేరి కన్యాకుమారి చేరుకున్నారు. అక్కడ ఒకరోజు ఉండి మర్నాడు కొచ్చిన్ మీదుగా వయనాడ్ జిల్లా కల్పెట్టా చేరుకున్నారు. అప్పుడే కేరళలో రుతుపవనాలు ప్రవేశించాయి. ఆహ్లాదకర వాతావ రణంలో కల్పెట్టాలో రెండ్రోజులు హాయిగా గడిపారు. ఒకప్పటి వీరప్పన్ సామ్రాజ్యం మీదుగా... అప్పుడే కర్ణ రాజ్ ఓ ఐడియా చెప్పాడు. హైవేపై జర్నీ బోర్ కొడుతోంది.... ఘాట్ రోడ్ అయితే మజా ఉంటుందన్నాడు. వెంటనే ముగ్గురూ కర్ణాటక వైపు బయల్దేరారు. బండిపురా చందనపు అడవుల్లోంచి సాగిపోయారు. ఒకప్పుటి చందనం స్మగ్లర్ వీరప్పన్ సామ్రాజ్యమది. అడవి అందాలను తిలకిస్తూనే మైసూరు మీదు గా బెంగళూరు చేరారు. అక్కడ మూడు రోజులుండి హైదరాబాద్, అటు నుంచి మహారాష్ట్రకు వెళుతూ సాగర్‌కు సమీపంలో ఓ దాబా దగ్గర టీ తాగారు. బాగా అలసిపోవడంతో ఆ దాబాలోనే ఆ రాత్రి నిద్రపోయారు. ‘ఓ రాత్రంతా ఉన్నా మని అద్దె డబ్బులివ్వబోతే దాబా యజమాని పండిట్జీ తీసుకోలేదు. ఆయన చూపిన అభిమానాన్ని మరిచిపోలేం’ అన్నాడు కర్ణ రాజ్. జీరో మైల్స్టోన్ నాగపూర్ పట్టణంలో నుంచి వెళ్తున్నప్పుడు ఓ స్థూపం కనిపించింది. దాన్ని జీరో మైల్స్టోన్ అంటారు. ఇది ఇండియాకు సెంటర్ పాయింట్. నాగపూర్ దాటాక షజాపూర్‌లో ఆగారు. ఆ ఊరి మీదుగా కర్కాటక రేఖ (ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్) వెళ్తోంది. ఈ విషయం అక్కడ ఎవరికీ తెలియదు. ముగ్గురు బైకర్లూ ఆగ్రా, ఢిల్లీ, కర్నాల్ మీదుగా చండీగఢ్ చేరుకున్నారు. చండీగఢ్ పట్టణంలో బైకులకు క్లచ్ వైరును టైట్ చేయించుకున్నారు. అక్కడి నుంచి బయల్దేరి హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలీలో చల్లని వాతావరణంలో సేదదీరారు. అడుగడుగునా తనిఖీలు మనాలీ నుంచి శ్రీనగర్ వైపు బైకులు బయల్దేరాయి. అక్కడి నుంచే అసలైన ప్రయాణం మొదలు. హిమాలయాల్లో ఎత్తయిన కచ్చా రోడ్లపై ప్రయాణం అతి కష్టం. సాయంత్రానికి తండి అనే ప్రాంతం చేరుకుని, అక్కడి పెట్రోల్ బంకులో బైకుల ట్యాంకుల్ని నింపుకొన్నారు. తండి తర్వాత 360 కిలోమీటర్ల వరకూ పెట్రోల్ బంకు లేదు. ముప్ఫయ్, నలభై కిలోమీటర్లకు ఒక ఆర్మీ పోస్టు ఎదురయ్యేది. వివరాలన్నీ సరిపోతేనే ముందుకు పంపేవారు. దారి పొడవునా కొండచరియలు విరిగిపడేవి. ఆర్మీకి చెందిన బీఆర్వో (బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్) సిబ్బంది ప్రొక్లయినర్లతో రాళ్లను తొలగించాక ముందుకు కదిలేవారు. ఇంచుమించు రోజూ వర్షం. దానికితోడు చలి గాలి. రక్తం గడ్డ కట్టుకుపోయేది. ‘ఆ సమయంలో ఆర్మీ అధికారులు, జవాన్ల ఆతిథ్యం అద్భుతం. ఏమైనా సాయం కావాలా? అని స్నేహపూర్వకంగా అడిగేవార’ని కిషోర్ చెప్పాడు. ఆర్మీ బంకర్లో ఓ రాత్రి కిల్లార్ నుంచి కిష్ట్వార్ మార్గంలో ప్రయాణం నరకాన్ని తలపించింది. ఒకరోజు రాత్రిపూట ఓ ఆర్మీ చెక్‌పోస్టు వద్ద ఆగారు. అక్కడి అధికారి బైకర్ల వివరాలు తెలుసుకున్నారు. ముందు రోడ్డు బాగా లేదనీ, అంతకుముందే ఓ వాహనం లోయలో పడిపోయి 18 మంది చనిపోయారనీ చెప్పారు. తర్వాత వచ్చే ఆర్మీ పోస్టు బంకర్లో ఆ రాత్రి విశ్రాంతి తీసుకోమని చెప్పి... వెంటనే అక్కడి అధికారితో వైర్లెస్ సెట్లో మాట్లాడాడు. ‘ముగ్గురం అష్టకష్టాలు పడుతూ గంట తర్వాత సింతన్ మైదాన్ చెక్‌పోస్టుకు చేరుకున్నాం. మా కోసం అప్పటికే రోడ్డుపై నిరీక్షిస్తున్న ఓ ఆర్మీ అధికారిని చూసి ఆశ్చర్యపోయాం. అతను వేడిగా చపాతీలు, బంగాళదుంప కూరతో భోజనం పెట్టారు. బంకర్లో వెచ్చగా నిద్రపోయాం. ఆ ఆతిథ్యాన్ని మరిచిపోలేం’ అన్నారు సుధీర్. జై జవాన్ నాలుగు రోజుల ప్రయాణం తర్వాత శ్రీనగర్, ద్రాస్ మీదుగా కార్గిల్ వార్ మెమోరియల్‌ను చేరుకున్నారు. ‘అమర జవాన్ల త్యాగాలు గుర్తొచ్చి, మా మనసంతా బరువెక్కిపోయింది. నివాళులర్పించి వెనక్కి వచ్చామ‘ని కర్ణరాజ్ చెప్పాడు. లేహ్ నుంచి 48 కిలోమీటర్లు ప్రయాణించి ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రవాణా మార్గం కర్దూంగ్లా పాస్, అటు నుంచి భారత్-పాక్ సరిహద్దుల్లోని త్యాక్షి చేరుకుని టెంట్లలో బస చేశారు. కిరోసిన్ ఇచ్చి ఆదుకున్న ఆర్మీ అధికారి త్యాక్షి నుంచి ముగ్గురూ సియాచిన్‌కు ముందున్న ససోమా ఆర్మీ పోస్టుకు చేరుకున్నారు. ఇది భారత్-చైనా సరిహద్దులకు సమీపంలో ఉంది. ‘అప్పటికి మా బైకుల్లో పెట్రోల్ తక్కువగా ఉంది. వెంటనే ఆర్మీపోస్టు అధికారి ప్రతాప్‌సింగ్ లీటర్ పెట్రోల్, ఏడు లీటర్ల కిరోసిన్ ఇచ్చారు. మేం దాన్నే జాగ్రత్తగా వాడుకుంటూ హుండర్, లేహ్ మీదుగా సాగిపోయాం’ అన్నాడు కర్ణరాజ్. లేహ్ నుంచి మనాలీ వైపు 80 కిలోమీటర్లు ప్రయాణించి ప్యాంగాంగ్ లేక్ చేరుకున్నారు. ఇది భారత్‌లో 48 కిలోమీటర్లు, టిబెట్‌లో 58 కిలోమీటర్లు, చైనాలో 50 కిలోమీటర్లు విస్తరించి ఉంది. ‘ఈ లేక్ శీతకాలంలో పూర్తిగా గడ్డ కడుతుంది. ఆ సమయంలో జీపులో సరస్సుపై నుంచి వెళ్లొచ్చు. ఇక్కడి నుంచి చైనా పోస్టులు కనిపిస్తాయి’ అని కిషోర్ చెప్పాడు. త్సోమొరారీ, హన్లే లేక్‌లను కూడా చూశాక ముగ్గురూ మనాలీ మీదుగా ఢిల్లీ చేరుకున్నారు. రెండు మార్గాల్లో యాత్ర ముగింపు ఢిల్లీ చేరాక యాత్రలో స్వల్ప మార్పులు చేశారు. కర్ణ రాజ్ లక్నో, పాట్నా, కోల్‌కతా మీదుగా, కిషోర్, సుధీర్‌లు హైదరాబాద్ మీదుగా విశాఖ రావాలని నిర్ణయించుకున్నారు. ఆ ప్రకారం బయల్దేరారు. ఎప్పటికప్పుడు ఫోన్లో అందుబాటులో ఉన్నారు. ఆగస్టు 3న ముగ్గురూ ఒకేసారి విశాఖపట్నం చేరుకున్నారు. - ఎ.సుబ్రహ్మణ్య శాస్త్రి (బాలు) సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం ఏం పోగొట్టుకున్నామో తెలిసింది! ‘‘యాత్ర పూర్తయ్యేసరికి ఒక్కొక్కరికి రూ.2 లక్షలు ఖర్చయింది. కానీ మేం పొందిన ఆనందం ముందు అదెంత? ఎన్నో జీవితాలను దగ్గర నుంచి చూశాం. ప్రకృతి అందాన్నీ... ఆగ్రహాన్నీ కూడా చవిచూశాం. ఎందరో మంచి స్నేహితులయ్యారు. మా సుదీర్ఘయాత్రలో మేమెక్కడా పర్యావరణానికి హాని కలిగించలేదు. బిస్కెట్లు, చాక్లెట్ల రేపర్లను ఎక్కడపడితే అక్కడ పారేయలేదు. ప్రకృతి లేకుండా మనుగడ లేదని అనుభవపూర్వకంగా అర్థం చేసుకున్నాం. ఇన్నాళ్లూ జీవితంలో ఏం పోగొట్టుకున్నామో తెలుసుకున్నాం. మా జీవితాల్లో ఇంతకన్నా మించిన ఆనందం లేదని మనసారా నమ్ముతున్నాం. మా యాత్ర గురించి చదివిన కుర్రాళ్లు ఉత్సాహంతో దుస్సాహసాలు చేయొద్దని మనవి. మేమెంతో ప్రణాళికాబద్ధంగా... అంతకు మించిన అనుభవంతో సాగిపోవడం వల్లే యాత్ర విజయవంతమైంది. బహుశా ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు.’’ - సాహస బైకర్లు కిషోర్, కర్ణ, సుధీర్ -
3డీబ్రెయిన్... ఎలుక మెదడులా పనిచేస్తుంది!
అచ్చం ఎలుక మెదడు మాదిరిగా పనిచేసే కృత్రిమ త్రీడీ మెదడు ఇది. ఆప్టికల్ మైక్రోస్కోపు ద్వారా తీసిన ఈ చిత్రాన్ని బోస్టన్లోని టఫ్ట్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు విడుదల చేశారు. చిత్రంలో ఆకుపచ్చ, పసుపు రంగుల్లో కనిపిస్తున్నవి నాడీకణాలు కాగా.. నీలి రంగులో ఉన్నది పట్టుతో తయారుచేసిన మూస. మెదడు కణజాలాన్ని పోలినట్లు కృత్రిమ కణజాలంతో శాస్త్రవేత్తలు ఇలా నాడీకణాలను అభివృద్ధిచెందించారు. మూస రంధ్రాలు(నల్లరంగులో ఉన్నవి) గుండా వ్యాపించి, ఒకదానితో ఒకటి అల్లుకున్న ఈ నాడీకణాలు మెదడులోని నాడీకణాల మాదిరిగానే పనిచేస్తాయట. ఇంతవరకూ ఇలాంటి నాడీకణాలను చిన్నచిన్న గాజు గిన్నెల్లో, అదీ 2డీ రూపంలో మాత్రమే రూపొందించారు. ఇలా 3డీ నాడీకణాలను, కణజాలాన్ని తయారుచేయడం మాత్రం ఇదే తొలిసారట. ఈ 3డీ మెదడు రెండు నెలలకుపైనే సజీవంగా ఉంటుందట. మెదడు కణజాలానికి దెబ్బ తగిలినప్పుడు ఎలాంటి మార్పులు, నష్టం కలుగుతాయి? ఆ గాయాన్ని మాన్పేందుకు వివిధ మందులు వాడినప్పుడు మెదడు కణజాలం ఎలా ప్రతిస్పందిస్తుంది? అన్నది అధ్యయనం చేసేందుకు ఈ త్రీడీ మెదడును సృష్టించారట. తమ పరిశోధనతో మెదడు గాయాలకు, నాడీ వ్యాధులకు కొత్త చికిత్సలను కనుగొనేందుకు వీలుకానుందని వర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. -
విద్యుత్ తుపాను!
మెదడులో ఒకేసారి 80 వేల నాడీకణాలు స్పందిస్తే అచ్చం ఇలాగే.. విద్యుత్ తుపాను చెలరేగినట్లుగా ఉంటుందట. అయితే ఈ ఫొటో మనిషి మెదడుకు సంబంధించినది కాదులెండి.. జీబ్రాఫిష్ మెదడుది. జీబ్రా చేప మెదడులోకి కాంతిని ప్రతిఫలింపచేసే రసాయనాలను ఎక్కించి, తర్వాత దాని మెదడులో జరిగే ప్రతిస్పందనలను ‘లైట్-షీట్ ఇమేజింగ్’ అనే కొత్త టెక్నిక్ ద్వారా లేజర్ కాంతిని ప్రసరింపచేసి రికార్డు చేశారు. దీంతో చేప మెదడులో ఒకేసారి వేలాది నాడీకణాలు స్పందించినప్పుడు ఇలా వేలాది బల్బులు ఒకేసారి వెలిగినట్లుగా విద్యుత్ ప్రసారం జరిగిందట. ఈ రకమైన అధ్యయనం వల్ల జీబ్రా చేప మెదడు రూల్స్ తెలుస్తాయని, అది అటూఇటూ కదిలేందుకు, ఈదేందుకు, వివిధ పనులు చేసేందుకు మెదడులో ఏ భాగంలో, ఎలాంటి మార్పులు కలుగుతాయో తెలుసుకోవచ్చని వర్జీనియాలోని హోవార్డ్ హగ్స్ మెడికల్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
నిమ్స్‌కు సుస్తీ
న్యూరో, యూరో విభాగంలో పేషెంట్ల పడిగాపులు సీటీసర్జరీ, స్పైన్ విభాగాల్లో పని చేయని యంత్రాలు మృత్యువాత పడుతున్న క్షతగాత్రులు, హృద్రోగులు సాక్షి, సిటీబ్యూరో : మహబూబ్‌నగర్‌కు చెందిన ఎ.వెంకటయ్య ప్రమాదవశాత్తూ నిద్రలో మంచంపై నుంచి కింద పడిపోవడంతో వెన్నుపూస దెబ్బతి ంది. చికిత్స కోసం రెండు రోజుల క్రితం నిమ్స్‌కు తీసుకొచ్చారు. ఆస్పత్రిలో సియరమ్ పరికరం పనిచేయడం లేదని, శస్త్రచికిత్స చేయడం కుదరదని వైద్యులు స్పష్టం చేయడంతో మరో ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న గుంటూరుకు చెందిన శౌరిని చికిత్స కోసం నిమ్స్‌కు తీసుకొచ్చారు. సీటీ సర్జరీ(కార్డియో థొరాసిక్) విభాగంలో ఛాతీపై కోత కోసే ఓ చిన్న యంత్రం పాడైపోవడంతో సకాలంలో చికిత్స అందక ఆయన ఇటీవల నిమ్స్ ముందే మృతి చెందారు. చిన్నచిన్న వైద్య పరికరాలు పని చేయడం లేదనే సాకుతో ఆపదలో అత్యవసర విభాగానికి చేరుకుంటున్న క్షతగాత్రులకు, హృద్రోగులకు చికిత్సకు నిరాకరిస్తుండటంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కోమాలో స్పైన్ విభాగం సుమారు వెయ్యి పడకల సామర్థ్యం ఉన్న ఆస్పత్రి అవుట్ పేషంట్ విభాగానికి ప్రతి రోజూ 1500 మంది రోగులు వస్తుంటారు. వీరి లో రోజుకు సగటున 100-150 మంది అడ్మిట్ అవుతుంటారు. మిగతా విభాగాలతో పోలిస్తే, ఆర్థో, న్యూరో సర్జరీ, యూరాలజీ, గుండె జబ్బుల విభాగాలకు రోగుల తాకిడి ఎక్కువ. దెబ్బతిన్న వెన్నుపూస జాయింట్లను సరిచేయాలంటే సియరమ్ అనే వైద ్య పరికరం అవసరం. ఆస్పత్రిలోని ఈ పరికరం నెల రోజుల క్రితం పాడైపోయింది. రిపేరు చేయించే అవకాశం ఉన్నా సంబంధిత విభాగం వైద్యులు పట్టించుకోవడం లేదు. శస్త్రచికిత్స చేసేందుకు అవసరమైన వైద్యపరికరం తమ వద్ద లేదని చెబుతూ రోగులను చేర్చుకోకుండా తిప్పి పంపుతున్నారు. యూరో, న్యూరో సేవల్లో తీవ్ర జాప్యం ఇక తలకు బలమైన గాయాలై ఆస్పత్రికి చేరుకున్న క్షతగాత్రులు, పక్షవాతంతో బాధపడుతున ్న రోగులకు ఆస్పత్రిలో అడ్మిషన్ కూ డా దొరకడం లేదు. న్యూరో సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆరోగ్యశ్రీ రోగులను ప్రైవేటు ఆస్పత్రులు నిరాకరిస్తుండటం తో వీరంతా నిమ్స్‌కు పరుగులు తీస్తున్నారు. ప్రస్తుతం న్యూరో సర్జరీ విభాగంలో సర్జరీ చేయించుకోవాలంటే నెల రోజులు ఆగాల్సి వస్తోంది. హృద్రోగులకు సర్జరీ చేసే సీటీ విభాగంలో ఛాతీపై కోత కోసే మిషన్ పనిచేయక పోవడంతో శస్త్రచికిత్సల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. సకాలంలో సర్జరీ చేయక పోవడంతో హృద్రోగంతో బాధపడుతున్న వారు ఆస్పత్రిలోనే మృత్యువాత పడుతున్నారు. ఇక యూరాలజీ విభాగాలో రోగుల నిష్పత్తికి తగినంత మంది వైద్యుల్లేక పోవడంతో చికిత్సల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీనికి తోడు ఇక్కడ రోగులకు పడకలు కూడా దొరకడం లేదు. -
మానసిక ఒత్తిడి, ఆందోళనలో న్యూరోట్రాన్స్మిటర్స్ పాత్ర!
మానవ మెదడులో 10 బిలియన్ల న్యూరాన్లు (మెదడు కణాలు) ఉంటాయి. ప్రతి ఒక్క కణం, తక్కిన కణాలతో రసాయనికంగా అనుసంధానించబడి ఒకదానితో ఒకటి సందేశాలను మార్చుకొంటూ ఉంటాయి. ఈ అనుసంధానకాలను న్యూరోట్రాన్స్మిటర్లు లేదా రసాయనిక ప్రసారకాలు (Neurotransmeter or Chemical messengers) అంటారు. మన ఆవేశ అనుభూతులను న్యూరోట్రాన్స్మిటర్లు అదుపుచేస్తాయి. మెదడులోని ఆవేశకేంద్రం (Emotion Center) లో ఐదు రకాల రసాయనిక పదార్థాలు లేదా న్యూరోట్రాన్స్మిటర్లు ఉంటాయి. అధికమైన స్ట్రెస్‌ను ఎదుర్కోవడానికి ఎండార్ఫిన్ల శాతం అధికంగా కావలసి ఉంటుంది. ఈ విధంగా అధికమైన న్యూరోట్రాన్స్మిటర్లకు, ఇతర న్యూరో ట్రాన్స్మిటర్ల మధ్యన ఉండవలసిన నిష్పత్తిలో తేడా వచ్చి రసాయనిక సమతుల్యత చెడుతుంది. ఈ దశలోనే మనకు ఎక్కువగా స్ట్రెస్ అనుభవంలోకి వస్తుంది. దీని ఫలితంగా శరీరంలో విడుదలైన హానికరమైన రసాయనిక పదార్థాలు, శరీర కణాలకు హాని చేసి మరింత స్ట్రెస్ పెరుగుదలకు కారణమవుతుంది. ఈ విధంగా వరుసగా వచ్చే క్లిష్ట రసాయనిక మార్పులను ‘స్ట్రెస్ చక్రం’ (Stress Cycle) అంటారు. దీని ఫలితంగా ఆవేశపరమైన నిస్త్రాణ (Emotional Fatigue), డిప్రెషన్ అనుభవంలోకి వస్తాయి. ఆవేశ అనుభూతులను అదుపు చేసే న్యూరోట్రాన్స్మిటర్లు మెదడులోని కణాల మధ్య ఆవేశ-అనుభూతులను ఒక దానికొకటి సందేశాలను మార్చుకొనడంలో ప్రధానపాత్ర వహించే రసాయనిక సంధానకాలను న్యూరోట్రాన్స్మిటర్ లేదా నాడీరసాయనిక ప్రసారకాలు అంటారని ఇప్పటికే తెలుసుకున్నాం కదా! ప్రధానంగా న్యూరోట్రాన్స్మిటర్ వ్యవస్థలను క్రింది విధంగా విభజించవచ్చు. న్యూరోట్రాన్స్మిటర్పై స్ట్రెస్ ప్రభావం ఎలా ఉంటుంది? రోజువారీ స్ట్రెస్‌ను ఎండార్ఫిన్లు నిభాయిస్తాయి. వీటిని సద్భావ నాడీ రసాయనిక ప్రసారకాలు Feel good transmiter (సద్భావ న్యూరో ట్రాన్స్మిటర్లు) అని కూడా అంటారు. అధికమైన లేదా పరిమితికి మించిన స్ట్రెస్‌ను తట్టుకోవడానికి ఎక్కువ మొత్తంలో ఎండార్ఫిన్లను మెదడు కణాలు ఉత్పత్తి చేయవలసి ఉంటుంది. దీనితో ఇతర న్యూరోట్రాన్స్ మిటర్లతో ఎండార్ఫిన్ల మధ్యన ఉన్న నిష్పత్తిలో తేడాలు అధికమై రసాయనిక అసమతుల్యత ఏర్పడుతుంది. ఆకస్మికంగా ఎదుర్కొనే స్ట్రెస్ (acute stress) దానిని ఎదుర్కొనే సందర్భంలో వచ్చే ఆతురత, అత్యవసర ప్రేరణలు స్ట్రెస్ పాళ్లను మరింత పెంచుతాయి. ఈ ప్రక్రియలో అనవసర లేదా హానికర రసాయనిక పదార్థాలు విడుదలై శరీరానికి మరింత నష్టం జరుగుతుంది. వరుసక్రమంలో వచ్చే ఈ క్లిష్ట రసాయనిక మార్పులను స్ట్రెస్ చక్రం- Stress Cycle అంటారు. శరీర అవయవాలపై స్ట్రెస్ ప్రభావం ఎలా ఉంటుంది? శరీరంలోని అన్ని అవయవాలు, వాటి పనితీరుపై స్ట్రెస్ ప్రభావం ఉంటుంది. శరీరంపై స్ట్రెస్ ప్రభావం పెరిగినకొద్దీ ఒక వరుస క్రమంలో శరీర సాధారణ క్రియలలో మార్పులు వస్తాయి. ప్రధానంగా ఎడ్రినాలిన్ ఉత్పత్తి పెరుగుతుంది. రక్తప్రసరణల లేదా రక్తపోటు పెరుగుదల, గుండెచలన రేటుతో పాటు కండరాలపై ఒత్తిడి పెరుగుతుంది. జీర్ణ ప్రక్రియ తగ్గుదల లేదా ఆగిపోవటం జరుగుతుంది. అడ్రినాలిన్ ఉత్పత్తి అధికమైనకొద్దీ శరీరానికి కావలసిన అధికశక్తిని అందించ టానికి ప్రొటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్ల మెటబాలిజమ్ అధికమవుతుంది. శరీరం లోని పిట్యుటరీగ్రంథి ఎడ్రినా కార్బికో ట్రోఫిక్ హార్మోను-ACTH ఉత్పత్తిని అధికం చేస్తుంది. ఈ హార్మోను కార్టిజోన్, కార్టిజోన్ హార్మోన్ల విడుదలకు ప్రేరణ కలిగిస్తుంది. ఈ హార్మోన్లు రోగక్రిములతో పోరాడే రక్తంలోని తెల్లకణాల ఉత్పత్తిని నిరోధిస్తాయి. రోగరక్షక వ్యవస్థ, రోగనిరోధక వ్యవస్థ తాలూకు విధులను నిర్వహించకుండా నిరోధిస్తాయి. ఇటీవల చూస్తున్న అనేక ప్రధాన రోగాలలో 80 శాతం స్ట్రెస్ కారణంగానే వస్తున్నాయని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికాలోని ఆరోగ్య వైద్య సంస్థ ప్రస్తుతం చూస్తున్న అన్నిరకాల రుగ్మతలకు 75 శాతం రోగకారణం స్ట్రెస్ అనే గుర్తించారు. వైద్యులు రోజువారి చూసే రోగులలో 75-90 శాతం మందికి స్ట్రెస్ కారణంగా వచ్చే రోగాలకు చికిత్సను అందిస్తున్నట్లు ఒక అంచనా. ఆకస్మిక స్ట్రెస్ శరీర రసాయనికస్థితిని విచ్ఛిన్నం చేస్తుంది. స్ట్రెస్ కారకం దీర్ఘకాలం కొనసాగుతుంటే శారీరక, మానసిక ఆరోగ్యం క్షీణిస్తుంది. శరీరరోగ రక్షణ వ్యవస్థ బలహీనపడి క్యాన్సర్, డయాబెటిస్, రుమాటిజమ్, జీర్ణకోశవ్యాధుల తీవ్రత పెరుగుతుంది. స్ట్రెస్... రోగముల తీవ్రతను పెంచటానికే కాక, రోగం తగ్గడాన్ని, రోగం తగ్గిన తరువాత కోలుకోవడాన్ని కూడా నిరోధిస్తుంది. ఏ విధంగా చూసినా శారీరక ఆరోగ్య సంక్షేమంలో స్ట్రెస్ కీలకపాత్ర పోషిస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు. అందుచే తప్పనిసరిగా అదనపు, అధికస్ట్రెస్ బాధలను ఎప్పటికప్పుడు తగ్గించుకోవాల్సి ఉంటుంది. హోమియో చికిత్స న్యూరోట్రాన్స్మిటర్ల రసాయనిక చర్య, ప్రతిచర్యలను పరిగణనలోకి తీసుకొని దానికి ఏమైనా లక్షణాలు ఉన్నాయా, ఆ మనిషి ఏ విధంగా దీన్ని తట్టుకోగలుగుతున్నాడు, ఈ న్యూరోట్రాన్స్మిటర్స్ ప్రభావం శారీరకంగా, మానసికంగా ఎంతవరకు రోగలక్షణాలకు కారణం అవుతున్నాయి, జబ్బుకు ఎంజైమ్ కారణం అవుతుందో నిర్ణయించుకొని రోగి సొరా, సైకోసిస్, సిఫిలిస్లలో మియజంలో ఉన్నాడని దానికి తగ్గ మందులు ఎంత పొటెన్సీలతో ఇవ్వాలన్నది హోమియో డాక్టర్ క్షుణ్ణంగా పరిశీలించి ఇవ్వవలసి ఉంటుంది. డాక్టర్ మురళి అంకిరెడ్డి, ఎం.డి (హోమియో), స్టార్ హోమియోపతి, సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్, కూకట్పల్లి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, కర్ణాటక www.starhomeo.com ph: 7416107107 / 7416109109 -
ప్రతిదానికీ విపరీతమైన భయం... ఆందోళన..!
నా వయసు 33. నాదో చిత్రమైన సమస్య. నాకు విపరీతమైన భయం, ఆందోళన. ఎప్పుడూ ఏదో అనర్థమో, వైపరీత్యమో సంభవించబోతోందన్న భావనతో ఇంటిలోనుంచి కాలు బయటకు పెట్టాలంటే భయం. కొత్తవారితో కలవాలంటే బెరుకు. దీంతో నేను వ్యాపారం కూడా మానుకుని ఇంటిలో కూర్చుంటున్నాను. నావల్ల నా కుటుంబసభ్యులంతా బాధపడుతున్నారు. దయచేసి తగిన సలహా చెప్పగలరు. - ఒక సోదరుడు, అనంతపురం మీదొక మానసిక సమస్య. మెదడు నరాలలో చోటు చేసుకునే కొన్ని అసాధారణ రసాయన మార్పుల వల్ల ఇలా జరుగుతుంది. శరీరంలోని ఇతర అవయవాలకు వచ్చేటట్లే... మెదడుకు వచ్చే సమస్య ఇది. మెదడు సరిగా పని చేయకపోవడం వల్ల తెలియకుండానే సహజశైలికి, ప్రవర్తనకు భిన్నంగా వ్యవహరిస్తూ, చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. అది చూసేవారికి అసాధారణంగా అనిపిస్తుంది. మానసిక సమస్యలకు మన ప్రవర్తనలోని లోపాలే నిదర్శనంగా నిలుస్తాయి తప్పించి, దానిని నిర్థారించడానికి ప్రత్యేకమైన పరీక్షలేవీ ఉండవు. అందువల్ల ఎవరైనా చెప్పేంతవరకు లేదా తమ ప్రవర్తనలోని లోపాలను తమంతట తామే గుర్తించినప్పటికీ మానసికవైద్యుని సంప్రదిస్తే తమను ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని జాప్యం చేయడం వల్ల సమస్య మరింత ముదురుతుంది. మీది యాంగ్జైటీ, ఫోబియా కలగలిసిన పరిస్థితి. దీనినే తెలుగులో భయాందోళనలకు లోనవడం అంటారు. దీనిని నిర్లక్ష్యం చేసినకొద్దీ పరిస్థితి మరింత తీవ్రమై, దైనందిన జీవితం దుర్భరమవుతుంది. చాలా సందర్భాలలో కొందరు రోగులలో ఇది డిప్రెషన్తోపాటుగా ఉండటం వల్ల ఇతరులు చాలా సులువుగా చేయగలిగినది, ఇతరుల దృష్టిలో అసలు సమస్యే కానిది వీరికి మాత్రం చాలా కష్టంగా అనిపిస్తాయి. దీనివల్ల రోగితోపాటు కుటుంబసభ్యులందరూ బాధపడలసి వస్తుంది. ఇది ఒకే నాణానికి ఉండే బొమ్మబొరుసులా ఉంటుంది. విపరీతంగా చెమటలు పట్టడం, గుండెదడ, చేతులు వణకడం, గొంతు తడారిపోవటం, కడుపులో తీవ్రమైన నొప్పి, ఊపిరి అందనట్లు అనిపించడం వంటి సమస్యలు ... మరోవైపు అసలు పనికి ఉపక్రమించకమునుపే అందులో వైఫల్యం చెందుతున్నట్టు, ప్రతి ఒక్కరూ తమనే గమనిస్తున్నట్టు, ఇతరులు తమకేదో హాని తలపెడుతున్నట్టు...ఇలా తీవ్రమైన ప్రతికూల భావనలతో బాధపడతారు. ఇక మూడవదశలో ఇటువంటి సమస్య తమకొక్కరికే ఉందని, ఇక దానికి పరిష్కారమే లేదని భావిస్తూ, తమ సమస్యలను లేదా భావనలను ఇతరులకు చెప్పుకుంటే నవ్వుతారేమోనన్న భయంతో అసలు బయటికి చెప్పరు. మీరు వెంటనే సైకియాట్రిస్ట్‌ను కలవడం మంచిది. ఆందోళనకు మంచి మందులున్నాయి. మీ సమస్య మందులతో తప్పకుండా నయమవుతుంది. దీనికితోడు సైకాలజిస్టులు చేసే కౌన్సెలింగ్ వల్ల మీలో రోజురోజుకీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు మీ కుటుంబంలోని అత్యంత సన్నిహితులైన వ్యక్తి అంటే భార్య లేదా తల్లిదండ్రుల సాయం తీసుకోండి. సైకియాట్రిస్ట్ మీకిచ్చే మందులు ముందు తక్కువ డోసులో ఇస్తారు. అవి మీమీద చూపే ప్రభావాన్ని బట్టి డోసును మెల్లగా పెంచటం లేదా తగ్గించడం చే స్తారు. వీటికితోడు మీ జీవనశైలిలో కూడా తగిన మార్పులు చేసుకుంటే మరింత గుణం కనిపిస్తుంది. ధైర్యంగా ఉండండి. మీకు అంతే మంచే జరుగుతుంది. డాక్టర్ కల్యాణ్‌చక్రవర్తి సైకియాట్రిస్ట్, మెడిసిటీహాస్పిటల్స్, హైదరాబాద్ -
మానసిక ఒత్తిడి, ఆందోళనలో న్యూరోట్రాన్స్మీటర్స్ పాత్ర!
మానవ మెదడులో 10 బిలియన్ల న్యూరాన్లు (మెదడు కణాలు) ఉంటాయి. ప్రతి ఒక్క కణం, తక్కిన కణాలతో రసాయనికంగా అనుసంధానించబడి ఒకదానితో ఒకటి సందేశాలను మార్చుకొంటూ ఉంటాయి. ఈ అనుసంధానకాలను న్యూరో ట్రాన్స్మిటర్లు లేదా రసాయనిక ప్రసారకాలు (Neurotransmeter or Chemical messengers) అంటారు. మన ఆవేశ అనుభూతులను న్యూరోట్రాన్స్మిటర్లు అదుపుచేస్తాయి. మెదడులోని ఆవేశ కేంద్రం (Emotion Center) లో ఐదు రకాల రసాయనిక పదార్థాలు లేదా న్యూరోట్రాన్స్మిటర్లు ఉంటాయి. అధికమైన న్యూరోట్రాన్స్మిటర్లకు, ఇతర న్యూరో ట్రాన్స్మిటర్ల మధ్యన ఉండవలసిన నిష్పత్తిలో తేడా వచ్చి రసాయనిక సమతుల్యత చెడుతుంది. ఈ దశలోనే మనకు ఎక్కువగా స్ట్రెస్ అనుభవంలోనికి వస్తుంది. దీని ఫలితంగా శరీరంలో విడుదలైన హానికరమైన రసాయనిక పదార్థాలు, శరీర కణాలకు హాని చేసి మరింత స్ట్రెస్ పెరుగుదలకు కారణమవుతంది. ఈ విధంగా వరుసగా వచ్చే క్లిష్ట రసాయనిక మార్పులను స్ట్రెస్ చక్రం (Stress Cycle) అంటారు. దీని ఫలితంగా ఆవేశపరమైన నిస్త్రాణ (Emotional Fatigue), డిప్రెషన్ అనుభవంలోకి వస్తాయి. మన ఆవేశ అనుభూతులకు అదుపు చేసే న్యూరోట్రాన్స్మిటర్లు మెదడులోని కణాల మధ్య ఆవేశ-అనుభూతులను ఒక దానికొకటి సందేశాలను మార్చుకొనడంలో ప్రధానపాత్ర వహించే రసాయనిక సంధానకాలను న్యూరోట్రాన్స్మిటర్ లేదా నాడీరసాయనిక ప్రసారకాలు అంటారన్న విషయం తెలిసిందే. ప్రధానంగా న్యూరోట్రాన్స్మిటర్ వ్యవస్థలను క్రింది విధంగా విభజించవచ్చు. న్యూరోట్రాన్స్మిటర్పై స్ట్రెస్ ప్రభావం ఎలా ఉంటుంది? రోజువారి స్ట్రెస్‌ను ఎండార్ఫిన్లు నిభాయిస్తాయి. వీటిని సద్భావ నాడీ రసాయనిక ప్రసారకాలు Feel good transmiter (సద్భావ న్యూరో ట్రాన్స్మిటర్లు) అని కూడా అంటారు. అధికమైన లేదా పరిమితికి మించిన స్ట్రెస్‌ను తట్టుకోడానికి ఎక్కువ మొత్తంలో ఎండార్ఫిన్లను మెదడు కణాలు ఉత్పత్తి చేయవలసి ఉంటుంది. దీనిలో ఇతర న్యూరోట్రాన్స్‌మిటర్‌లతో ఎండార్ఫిన్ల మధ్యన ఉన్న నిష్పత్తిలో తేడాలు అధికమై రసాయనిక అసమతుల్యత ఏర్పడుతుంది. ఆకస్మికంగా ఎదుర్కొనే స్ట్రెస్ (acute stress) దానిని ఎదుర్కొనే సందర్భంలో వచ్చే ఆతురత, అత్యవసర ప్రేరణలు స్ట్రెస్ పాళ్లను మరింత పెంచుతాయి. ఈ ప్రక్రియలో అనవసర లేదా హానికర రసాయనిక పదార్థాలు విడుదలై శరీరానికి మరింత నష్టం జరుగుతుంది. వరుసక్రమంలో వచ్చే ఈ క్లిష్ట రసాయనిక మార్పులను స్ట్రెస్ చక్రం-Stress Cycle అంటారు. శరీర అవయవాలపై స్ట్రెస్ ప్రభావం ఎలా ఉంటుంది? శరీరంలోని అన్ని అవయవాలు, వాటి పని తీరుపై స్ట్రెస్ ప్రభావం ఉంటుంది. శరీరంపై స్ట్రెస్ ప్రభావం పెరిగినకొద్దీ ఒక వరుస క్రమంలో శరీర సాధారణ క్రియలలో మార్పులు వస్తాయి. ప్రధానంగా ఎడ్రినాలిన్ ఉత్పత్తి పెరుగుతుంది. రక్తప్రసరణల లేదా రక్తపోటు పెరుగుదల, గుండె చలన రేటుతో పాటు కండరాలపై ఒత్తిడి పెరుగుతుంది. జీర్ణ ప్రక్రియ తగ్గుదల లేదా ఆగిపోవటం జరుగుతుంది. ఆడ్రినాలిన్ ఉత్పత్తి అధికమైనకొద్దీ శరీరానికి కావలసిన అధికశక్తిని అందించటానికి ప్రొటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్ల మెటబాలిజమ్ అధికమవుతుంది. శరీరంలోని పిట్యుటరీగ్రంథి ఎడ్రినా కార్బికో ట్రోఫిక్ హార్మోను-ACTH ఉత్పత్తిని అధికం చేస్తుంది. ఈ హార్మోను కార్టిజోన్, కార్టిజోన్ హార్మోన్ల విడుదలకు ప్రేరణ కలిగిస్తుంది. ఈ హార్మోన్లు రోగక్రిములతో పోరాడే రక్తంలోని తెల్లకణాల ఉత్పత్తిని నిరోధిస్తాయి. రోగరక్షక వ్యవస్థ, రోగనిరోధక వ్యవస్థ తాలూకు విధులను నిర్వహించకుండా నిరోధిస్తాయి. ఇటీవల చూస్తున్న అనేక ప్రధాన రోగాలలో 80 శాతం స్ట్రెస్ కారణంగానే వస్తున్నాయని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికాలోని ఆరోగ్య వైద్య సంస్థ ప్రస్తుతం చూస్తున్న అన్నిరకాల రుగ్మతలకు 75 శాతం రోగ కారణం స్ట్రెస్ అనే గుర్తించారు. వైద్యులు రోజువారి చూసే రోగులలో 75-90 శాతం మందికి స్ట్రెస్ కారణంగా వచ్చే రోగాలకు చికిత్సను అందిస్తున్నట్లు ఒక అంచనా. ఆకస్మిక స్ట్రెస్ శరీర రసాయనిక స్థితిని విచ్ఛిన్నం చేస్తుంది. స్ట్రెస్ కారకం దీర్ఘకాలం కొనసాగుతుంటే శారీరక, మానసిక ఆరోగ్యం క్షీణిస్తుంది. శరీరరోగ రక్షణ వ్యవస్థ బలహీనపడి క్యాన్సర్, డయాబెటిస్, రుమాటిజమ్, జీర్ణకోశవ్యాధుల తీవ్రత పెరుగుతుంది. స్ట్రెస్ అన్నది రోగాల తీవ్రతను పెంచటానికే కాక, రోగం తగ్గడాన్ని, రోగం తగ్గిన తరువాత కోలుకోవడాన్ని కూడా నిరోధిస్తుంది. ఏ విధంగా చూసినా శారీరక ఆరోగ్య సంక్షేమంలో స్ట్రెస్ లేకపోవడం అన్నది చాలా కీలకపాత్ర పోషిస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు. అందువలన తప్పనిసరిగా అదనపు అధిక స్ట్రెస్ బాధలను ఎప్పటికప్పుడు తగ్గించుకోవాల్సి ఉంటుంది. హోమియో చికిత్స ఈ న్యూరోట్రాన్స్మిటర్ల రసాయనిక చర్య, ప్రతిచర్యలను పరిగణనలోకి తీసుకొని, లక్షణాలను బట్టి, ఆ మనిషి ఏ విధంగా దీన్ని తట్టుకోగలుగుతున్నాడు, ఈ న్యూరోట్రాన్స్మిటర్స్ ప్రభావం ఎంతవరకు రోగలక్షణాలకు కారణం అవుతున్నాయి, జబ్బుకు ఏ మియజమ్ కారణం అవుతుంది, మూడు మియాజమ్లైన సొరా, సైకోసిస్, సిఫిలిస్లలో ఏది ప్రభావితమవుతోంది, దానికి తగ్గ మందులు ఎంత పొటెన్సీలతో ఇవ్వాలన్నది హోమియో డాక్టర్ క్షుణ్ణంగా పరిశీలించి ఇవ్వవలసి ఉంటుంది. డాక్టర్ మురళి అంకిరెడ్డి, ఎం.డి (హోమియో), స్టార్ హోమియోపతి, సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్, కూకట్పల్లి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, కర్ణాటక www.starhomeo.com ph: 7416107107 / 7416109109