హోమియో కౌన్సెలింగ్
మావారి వయసు 55 ఏళ్లు. ఈమధ్య హైబీపీతో బాధపడుతూ, పని ఒత్తిడితో మందులు సరిగా వేసుకోలేదు. అకస్మాత్తుగా ఒకవైపు కాళ్లు, చేతులు పనిచేయలేదు. పక్షవాతం (స్ట్రోక్) వచ్చిందన్నారు. హోమియోలో దీనికి చికిత్స ఉందా? - సుమతి, కాకినాడ
మీవారికి వచ్చిన పక్షవాతం అన్నది సమస్య నాడీ సంబంధిత వ్యాధి. శరీరంలోని ఒక భాగం లేదా సగభాగం ప్రయత్నపూర్వకంగా కదలించలేకపోవడాన్ని పక్షవాతం అంటారు. మూతివంకరపోవడం, కాళ్లు, చేతులు మెలిదిరిగిపోవడం, గుండె కూడా సరిగా పనిచేయకపోవడం... ఇలా శరీరంలోని ప్రతి అవయవంపై దీని ప్రభావం ఉంటుంది. మనిషి బతికి ఉండగానే అచేతనం అయిపోయే విచిత్ర స్థితి పక్షవాతం. గతంలో ఇది వృద్ధుల్లోనే కనిపించేది. ఇటీవల చిన్న వయసు వారు సైతం దీనికి గురవుతున్నారు. పక్షవాతం వచ్చినప్పుడు ప్రతి సెకండ్‌కు 32 వేల నాడీకణాలు చనిపోతాయి. ఆ లెక్కన నిమిషానికి దాదాపు 19 లక్షల నాడీకణాలు చచ్చుబడిపోతాయి. మెదడుకు రక్తాన్ని చేరవేసే ధమనుల్లో జరిగే రక్తప్రవాహంలో రక్తపు గడ్డలు అడ్డుపడతాయి. దాంతో మెదడుకు రక్తప్రసారం తగ్గిపోయి అది పక్షవాతానికి దారితీస్తుంది. పక్షవాతంలో మెదడుకు తీరని నష్టం కలిగే అవకాశం ఉంది. అలా నష్టం కలిగే సమయంలో మృతిచెందే కణాలపైనే పక్షవాతం తీవ్రత ఆధారపడి ఉంది. అందుకే పక్షవాతం లక్షణాలు కనిపించిన వెంటనే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం చాలా అవసరం.
కారణాలు: అధిక రక్తపోటు; అధిక బరువు డయాబెటిస్ పొగతాగడం, మద్యం వంటి అలవాట్లు కొలెస్ట్రాల్, గుండెజబ్బులు... ఇవి ఉన్నవారికి పక్షవాతం వచ్చే అవకావం ఉంది.
లక్షణాలు: తిమ్మిర్లు; ఒక కాలు, చేతిలో శక్తి తగ్గినట్లు అనిపిస్తుంది మాట్లాడలేకపోవడం; ఇతరులు చెప్పింది అర్థం చేసుకోలేకపోవడం చూపు మసకబారుతుంది కాళ్లు, చేతులు వెనక్కుతిరిగిపోతాయి; మూతి వంకర తిరుగుతుంది.
వ్యాధి నిర్ధారణ: ఎక్స్-రే, సీటీ స్కాన్, ఎమ్మారై స్కాన్, మైలోగ్రఫీ, ఎలెక్ట్రోమైలోగ్రఫీ.
చికిత్స: పక్షవాతానికి హోమియోలో మంచి వైద్యచికిత్స అందుబాటులో ఉంది. ఈ చికిత్సతో పాటు ఫిజియోథెరపీ తీసుకుంటూ హోమియో మందులు వాడుతుంటే మంచి ఫలితాలను చూడవచ్చు. కాస్టికమ్, జెల్సీమియం, ప్లంబంమెట్ వంటి చాలా రకాలు హోమియోలో ఉన్నాయి. వీటిని డాక్టర్ పర్యవేక్షణలో వాడాలి.
డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి
ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్
హితంగా... మితంగా తినాలి
డయాబెటిక్ కౌన్సెలింగ్
మా అమ్మగారి వయసు 64 ఏళ్లు. గత పదేళ్లుగా ఆమె డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. డయాబెటిస్ అదుపులో లేకపోతే అనేక సమస్యలు వస్తాయని ఈమధ్య మా డాక్టర్ చెప్పారు. డయాబెటిస్‌ను అదుపులో ఉంచడానికి ఏం తినాలి? ఎలాంటి వ్యాయామం చేయాలి? - నరేశ్, మంచిర్యాల
డయాబెటిస్ ఏ మేరకు అదుపులో ఉందో తెలుసుకోడానికి ఎఫ్‌బీఎస్, పీఎల్‌బీఎస్ వంటి పరీక్షలు నిర్వహిస్తారు. ముఖ్యంగా హెచ్‌బీఏ1సీ అనే పరీక్ష చేస్తారు. దీని ఫలితాలు 7 శాతం కంటే తక్కువగా ఉంటే డయాబెటిస్ అదుపులో ఉందని అర్థం. మీ అమ్మగారి వయసు ప్రకారం 7.5 శాతం ఉన్నా పర్వాలేదు. బీపీ మాత్రం 130 / 80 లోపల ఉండటం శ్రేయస్కరం. ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ 100 ఎంజీ/డీఎల్ కంటే తక్కువగా ఉండాలి. భోజన నియమాలకు వస్తే అన్నం, వైట్ బ్రెడ్ వంటివి మితంగా తినాలి. గోధుమ, జొన్న, పండ్లు, కూరగాయలు ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. ఉడకబెట్టినవి, ఆవిరి మీద ఉడికించినవి తినాలి. వేపుళ్లు చాలా తక్కువగా తినాలి. కొవ్వు ఎక్కువగా ఉండే మాంసం తీసుకోవద్దు. ఈ ఆహార నియమాలతో పాటు రోజుకు కనీసం 30 నిమిషాల తేలికపాటి వ్యాయామం చేయాలి. ఇలా వ్యాయామం చేయడం వల్ల ఎముకల క్షీణత తగ్గడంతో పాటు రక్తంలోని గ్లూకోజ్ పాళ్లు అదుపులోకి వస్తాయి. వీటి వల్ల శరీరం బరువు పెరగకుండా నివారించవచ్చు. వ్యాయామం మొదలుపెట్టే ముందర డాక్టర్ సలహా తీసుకోవాలి.
డాక్టర్ వి. శ్రీ నాగేష్
కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ అండ్ డయాబెటాలజిస్ట్,
కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్,హైదరాబాద్ .