బాగేపల్లి : గ్రామాల్లో నిర్వహించే వైద్య శిబిరాలను గ్రామీణులు సద్వినియోగం చేసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే ఎస్‌ఎన్ సుబ్బారెడ్డి పిలుపు నిచ్చారు. పట్టణంలోని నేషనల్ కళాశాల మైదానంలో ఎస్‌ఎన్ సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్ట్, డీ దేవరాజు అరసు వైద్య కళాశాల సంయుక్తంగా శనివారం నిర్వహించిన ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడారు. కరువు వల్ల ఈ ప్రాంతం అన్ని రంగాల్లో వెనుకబడి ఉందని, గ్రామీణులు ఆర్థికంగా చాలా చితికిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం అనారోగ్యానికి గురైతే వైద్యుల వద్దకు వెళ్లేందుకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.
అలాంటి వారి కోసమే గ్రామాల్లో వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి శిబిరాలను గ్రామీణులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆర్‌ఎల్ జాలప్ప ఆస్పత్రి వ్యవస్థాపకుడు మాజీ ఎంపీ, ఆర్‌ఎల్ జాలప్ప మాట్లాడుతూ.. ధనవంతులు తన ధనంలో కొంత సొమ్మును పేదల కోసం ఖర్చు చేయాలని సూచించారు.
ఈ శిబిరంలో నరాల బలహీనత, కేన్సర్, పళ్ళు, మధుమేహం, గర్భకోశం, మానసిక వ్యాధులు తదితర వాటితో బాధపడుతున్న వారికి చికిత్స అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎల్ జాలప్ప ఆస్పత్రి కార్యదర్శి నాగరాజు, వైద్యులు శ్రీరాములు, కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోండి
Published Sun, Oct 12 2014 1:57 AM | Last Updated on Sun, Apr 7 2019 4:37 PM
Advertisement
Advertisement