medical camps
-
వైఎస్ జయమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్
సాక్షి, అమరావతి: క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి, బాధితులకు పూర్తిస్థాయిలో చికిత్స అందేలా కృషి చేసి, ప్రాణాపాయం నుంచి రక్షించేందుకు వైఎస్ జయమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ట్రస్టీ వైఎస్ రవీంద్రనాథ్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ (జీసీఎఫ్) సహకారంతో అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు రెవెన్యూ డివిజన్లోని అన్ని పీహెచ్‌సీలు, పలు విలేజ్ క్లినిక్‌ల పరిధిలో ఈ ఏడాది మే 27 నుంచి సోమవారం వరకు 60 క్యాంప్‌లు నిర్వహించినట్లు తెలిపారు. ఈ శిబిరాల్లో బ్రెస్ట్ క్యాన్సర్, సరై్వకల్ క్యాన్సర్, నోటి క్యాన్సర్ వంటి వ్యాధులను ముందుగానే గుర్తించే పలు పరీక్షలు చేసినట్లు తెలిపారు. 7,554 మందికి పరీక్షలు చేసినట్టు వెల్లడించారు. వీరిలో 2,314 మంది పురుషులు, 5,240 మంది మహిళలు ఉన్నారన్నారు. శిబిరాలకు వచ్చిన మహిళల్లో 1,764 మందికి మామోగ్రామ్, 2,285 మందికి పాప్‌స్మియర్ పరీక్షలు చేశామన్నారు. వ్యాధి లక్షణాలు కనిపించిన 100 మందికిపైగా ప్రజలను అరకు, పాడేరు ఆస్పత్రులకు పంపి, అక్కడ అ్రల్టాసౌండ్ స్కానింగ్, బయాప్సీ చేయించినట్లు వివరించారు. బయాప్సీలో వ్యాధి నిర్ధారణ అయిన వారిని హోమీ బాబా క్యాన్సర్ ఆస్పత్రికి తరలిస్తున్నట్లు చెప్పారు. క్యాన్సర్ ఉన్నట్లు అనుమానాలు ఉన్న 23 మందికి నేరుగా బయాప్సీ పరీక్షలు చేయిస్తున్నట్లు చెప్పారు. గత నాలుగు రోజులుగా పాడేరు ప్రభుత్వ ఆస్పత్రి, అరకు, చింతపల్లి ఏరియా ఆసుపత్రుల్లోని వైద్యులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ఉచిత స్క్రీనింగ్ శిబిరాలు నిర్వహించినట్లు తెలిపారు. నేడు అభినందన సభ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులను విజయవంతంగా నిర్వహించి, ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో భాగస్వాములైన వైఎస్ జయమ్మ మెమోరియల్ ట్రస్ట్, జీసీఎఫ్ బృందాలను బుధవారం సాయంత్రం 4 గంటలకు పాడేరు ప్రభుత్వ ఆస్పత్రిలో అభినందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఈ బృందాల సభ్యులకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు బహూకరించనున్నట్లు చెప్పారు. తాము చేపట్టిన ప్రజా సేవా కార్యక్రమానికి విశేష సహాయ సహకారాలు అందించిన జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవో, తదితరులను కూడా ఈ వేదికపై సత్కరించనున్నట్లు రవీంద్రనాథ్‌రెడ్డి ఆ ప్రకటనలో తెలిపారు. -
‘జగనన్న ఆరోగ్య సురక్ష’ రెండో దశలో 13,818 క్యాంపులు
గుంటూరు రూరల్: జగనన్న ఆరోగ్య సురక్ష రెండో దశ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 13,818 వైద్య శిబిరాలను నిర్వహించనున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష రెండో దశ మెడికల్ క్యాంపులు ప్రారంభమయ్యాయి. గుంటూరు రూరల్ మండలం చినపలకలూరులో నిర్వహించిన క్యాంపునకు మంత్రి విడదల రజిని హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మండలాల వారీగా గ్రామాల్లో ప్రతి మంగళవారం, శుక్రవారం వారానికి రెండురోజుల చొప్పున వైద్య శిబిరాలు నిర్వహిస్తామని చెప్పారు. పట్టణాల్లో వార్డు సచివాలయాల పరిధిలో ప్రతి బుధవారం, గురువారం ఈ శిబిరాలు ఉంటాయని పేర్కొన్నారు. మొత్తం 10,032 గ్రామ సచివాలయాలు, 3,786 వార్డు సచివాలయాల పరిధిలో 13,818 వైద్య శిబిరాలు నిర్వహిస్తామని వివరించారు. అనారోగ్య సమస్యలు ఉన్నవారిని వైద్య శిబిరాలకు తీసుకురావడం, ప్రభుత్వ వైద్యుల ఆధ్వర్యంలో పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. మెరుగైన వైద్యం అవసరం ఉన్నవారిని పెద్ద ఆస్పత్రులకు పంపి ఉచితంగా అందేలా చేయడం ఈ కార్యక్రమంలో ఒక భాగమని ఆమె వెల్లడించారు. రోగి పూర్తిగా కోలుకునే వరకు ఆరోగ్యమిత్ర, ఏఎన్ఎంల పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. ఇలాంటి గొప్ప కార్యక్రమాలను దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదని, ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే చేస్తోందని తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్యాన్ని ఉచితంగా, వేగంగా అందించాలనే గొప్ప లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పనిచేస్తుండటం వల్లే వైద్య, ఆరోగ్య రంగంలో కనీవిని ఎరుగని సంస్కరణలను ప్రవేశపెట్టారని రజిని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు ఆరోగ్యశ్రీ ద్వారా అందుతున్న చికిత్సల సంఖ్యను ఏకంగా 3,257కు జగనన్న పెంచారని పేర్కొన్నారు. వైద్య ఖర్చును రూ.25లక్షలకు పెంచారని తెలిపారు. ఆరోగ్యశ్రీ కార్డులను కూడా కొత్తవి మంజూరు చేసి జగనన్న ఆరోగ్య సురక్ష–2లో భాగంగా ఇంటింటికీ వెళ్లి అందజేస్తున్నామని చెప్పారు. ఆరోగ్య ఆసరా అనే గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టి రోగులకు చికిత్సకాలంలో ఆర్థిక సాయం అందజేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ మాత్రమే అని ప్రశంసించారు. జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో డీకే బాలాజీ, డీఎంఈ నర్సింహం, డీఎంఅండ్‌హెచ్‌వో శ్రావణ్‌బాబు పాల్గొన్నారు. -
జగనన్న ఆరోగ్య సురక్షతో సంచలన ఫలితాలు
చిలకలూరిపేట: రాష్ట్రంలో అమలు చేస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం సంచలన ఫలితాల దిశగా దూసుకుపోతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. చిలకలూరిపేటలోని పురుషోత్తమపట్నంలో మంగళవారం నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని మంత్రి విడదల రజిని సందర్శించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీ వరకు అంటే తొలి పది రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 4,041 వైద్య శిబిరాల్లో ఏకంగా 13.7 లక్షల ఓపీ సేవలు నమోదయ్యాయని చెప్పారు. మొత్తం 10,057 వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ శిబిరాల్లో వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు నుంచి ఐదు వేల మంది స్పెషలిస్టు వైద్యులను నియమించామన్నారు. ఇప్పటి వరకు 34 వేల మంది రోగులకు మెరుగైన వైద్యం అవసరం ఉందని గుర్తించి, పెద్ద ఆస్పత్రులకు సిఫార్సు చేశామని పేర్కొన్నారు. వీరందరికీ ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వమే ఉచితంగా వైద్యం అందిస్తుందని తెలిపారు. వీరి ఆరోగ్య పరిస్థితులపై ఎప్పటికప్పుడు డీఎంఅండ్‌హెచ్‌వోలు, ఆయా గ్రామాల సీహెచ్‌వోలు, ఏఎన్ఎంలు పర్యవేక్షిస్తుంటారని పేర్కొన్నారు. వీరు ఆరోగ్యంగా తిరిగి వచ్చేవరకు ఫాలోఅప్ ఉంటుందని, ఆ తర్వాతే వారి కేసు ఆన్లైన్లో ముగుస్తుందని వెల్లడించారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనలో భాగమే ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అని ఆమె వివరించారు. -
జగనన్న ఆరోగ్య సురక్షతో ఆరోగ్యాంధ్రప్రదేశ్
మద్దిలపాలెం (విశాఖపట్నం): జగనన్న ఆరోగ్య సురక్షతో ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధించామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. విశాఖ నగరం 16వ వార్డులోని ఇసుకతోట అర్బన్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్యశిబిరాన్ని ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ, మేయర్ గొలగాని హరివెంకటకుమారితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జగనన్న ఆరోగ్య సురక్ష వైద్యశిబిరాలకు విశేషస్పందన లభిస్తోందన్నారు. రాష్ట్రంలో 10,032 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, 542 పట్టణ ఆరోగ్యకేంద్రాల్లో 45 రోజులపాటు 10,574 జగనన్న ఆరోగ్య సురక్ష వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత నెల 30న వైద్యశిబిరాలు ప్రారంభం కాగా.. రాష్ట్రవ్యాప్తంగా 611 శిబిరాలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ శిబిరాల్లో 1.57 లక్షలమందికి వైద్యపరీక్షలు చేశామని, వీరిలో 6,089మందికి మెరుగైన వైద్యచికిత్స కోసం రిఫరల్ ఆస్పత్రులకు సిఫార్సు చేశామని వివరించారు. వీరందరికీ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం అందిస్తామన్నారు. ఈ శిబిరాల్లో నాలుగువేల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు చెందిన స్పెషలిస్టు వైద్యులు హాజరవుతున్నట్లు చెప్పారు. ఇదో చరిత్రాత్మక ఘట్టమన్నారు. పల్లెలు, కాలనీల్లోని ప్రభుత్వ ఆరోగ్యకేంద్రాలకు స్పెషలిస్ట్ వైద్యులు వచ్చి వైద్యం చేయడం రాష్ట్రంలో మునుపెన్నడూ చూడలేదని చెప్పారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ 3,257 వ్యాధులకు వర్తింపజేశామని, వైద్యంతోపాటు చికిత్స తర్వాత దినసరి భత్యం అందిస్తున్నట్లు తెలిపారు. నాడు–నేడు కింద రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కళాశాలలకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారన్నారు. వీటిలో ఇప్పటికే ఐదు కళాశాలలను ప్రారంభించారని గుర్తుచేశారు. నాలుగేళ్ల పాలనలో కేవలం వైద్యానికి రూ.3,600 కోట్లకుపైగా ఖర్చుచేశామని ఆమె చెప్పారు. -
జగనన్న ఆరోగ్య సురక్ష ఏర్పాట్లు పక్కాగా చేపట్టండి
సాక్షి, అమరావతి: జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలు రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నుంచి ప్రారంభించేందుకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అధికారులను ఆదేశించారు. ఉన్నతాధికారులతో కలిసి గురువారం డీఎంహెచ్వోలతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐదు దశల్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. శనివారం వైద్య శిబిరాలు ప్రారంభించే ప్రాంతాల్లో ఇప్పటికే గ్రామాల్లో తొలి దశ సర్వే పూర్తయిందన్నారు. రెండు, మూడో దశ సర్వేలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇంటింటి సర్వేలను పక్కాగా నిర్వహించాలన్నారు. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకంపై ప్రజలకు సమగ్రంగా అవగాహన కల్పించాలన్నారు. ప్రత్యేకంగా రూపొందించిన ఆరోగ్యశ్రీ కరపత్రాలను ప్రతి ఇంటికీ అందజేయాలని స్పష్టం చేశారు. అదే విధంగా ఆరోగ్యశ్రీ మొబైల్ యాప్‌ను స్మార్ట్ ఫోన్లలో డౌన్లోడ్ చేయించి వినియోగంపై అవగాహన కల్పించాలన్నారు. వైద్య శిబిరాలు నిర్వహించే తేదీలకు సంబంధించి గ్రామాల్లో దండోరా వేయించాలని చెప్పారు. క్యాంపులకు స్పెషలిస్టు వైద్యులు వస్తున్నారనే విషయం ప్రజలకు తెలిసేలా చూడాలన్నారు. ఆర్థోపెడిక్ వైద్య నిపుణుడి అవసరం ఉందనే విజ్ఞప్తులు ప్రజల నుంచి ఎక్కువగా వస్తున్నాయని, క్యాంపులలో వీలైనంతవరకు ఆర్థోపెడిక్ వైద్యులు ఉండేలా చూడాలని సూచించారు. డీఎంహెచ్వోలు, ఇతర ఉన్నతాధికారులు వైద్య శిబిరాలను క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. సమీక్షలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ జె.నివాస్, ఆరోగ్యశ్రీ సీఈవో హరేందిరప్రసాద్, ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ రామిరెడ్డి పాల్గొన్నారు. మారిన వైద్య రంగం ముఖచిత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య రంగం ముఖచిత్రం మారిపోయిందని మంత్రి విడదల రజిని అన్నారు. వివిధ కార్యక్రమాల అమలులో జాతీయ స్థాయిలో రాష్ట్రం అగ్రస్థానంలో నిలుస్తోందన్నారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ అకౌంట్లకు అత్యధిక రికార్డులను లింక్ చేసి రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచి అవార్డు కైవసం చేసుకోవడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో రాష్ట్రానికి వచ్చిన అవార్డులను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ నివాస్, ఆరోగ్యశ్రీ సీఈవో హరేందిరప్రసాద్ మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయంలో గురువారం మంత్రి రజినికి అందజేశారు. ఈ సందర్భంగా అధికారులను ఆమె అభినందించారు. -
ఏజెన్సీకి వైద్యాధికారులు
సాక్షిప్రతినిధి, వరంగల్: ఏజెన్సీలో ప్రబలుతున్న విషజ్వరాలపై శుక్రవారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో ‘ఏజెన్సీకి ఫీవర్’ శీర్షికన ప్రచురితమైన కథనానికి వైద్యాధికారులు స్పందించారు. జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. మహాముత్తారం మండలకేంద్రంతోపాటు అటవీ గ్రామాలైన సింగారం, పోలారం ప్రేమ్‌నగర్ తండాల్లో మండల వైద్యాధికారి సందీప్ ఆధ్వర్యంలో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేశారు. ఇంటింటి సర్వే నిర్వహించి జ్వరాల బారిన పడిన వారి వివరాలు సేకరించారు. ములుగు జిల్లా వాజేడు మండలం ఇప్పగూడెంలో వైద్యశిబిరం నిర్వహించి 100మందికి మందుల కిట్ అందజేశారు. వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్ఓ అప్పయ్య సందర్శించి రోగులను పరీక్షించారు. తాడ్వాయి పీహెచ్సీ ఆధ్వర్యంలో మేడారం, గంగారం గ్రామాల్లో, కొడిశాల పీహెచ్సీ ఆధ్వర్యంలో ఎల్బాక, పడిగాపూర్ గ్రామాల్లో వైద్యశిబిరాలు నిర్వహించారు. మంగపేట మండలంలోని నర్సింహాసాగర్, అకినేపల్లిమల్లారంలో వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి రక్త నమూనాలు సేకరించారు. అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. -
గిరిజన పల్లెల చెంతకు మెడికల్ క్యాంపులు
-
18 నుంచి 22వ తేదీ వరకు వైద్య శిబిరాలు
సాక్షి, అమరావతి: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఈనెల 18 నుంచి 22వ తేదీల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లోని ఎంపిక చేసిన 52 మండలాల్లో వైద్య శిబిరాలు నిర్వహించడానికి వైద్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. 45 ఏళ్లు పైబడిన వారికి మధుమేహం, రక్తపోటు, ఇతర జీవన శైలి జబ్బులకు సంబంధించిన స్క్రీనింగ్‌ను ఉచితంగా నిర్వహించనున్నారు. అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. అదే విధంగా ప్రజలకు డిజిటల్ ఐడీ సృష్టించడం వంటి ఇతర సేవలను అందించనున్నారు. వైద్య శిబిరాల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని డీఎంహెచ్వోలను ఆదేశించినట్లు వైద్య, ఆరోగ్య శాఖ డైరెక్టర్ నివాస్ తెలిపారు. -
వైద్యులు అందుబాటులో ఉండాలి: ఆళ్ల నాని
సాక్షి, పశ్చిమగోదావరి: ఏలూరు ఘటనపై ప్రభుత్వాసుపత్రిలో డిప్యూటీ సీఎం, వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే అబ్బాయ చౌదరి, కలెక్టర్, వైద్యాధికారులు హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ ఈ తరహా కేసులను పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు కృషిచేయాలని సూచించారు. తొమ్మిది వార్డులకు ప్రత్యేక డాక్టర్‌ను నియమించడంతో పాటు.. ప్రతి 9 బెడ్లకు ఒక డాక్టర్ అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించారు. (చదవండి: సర్కారు బాసట.. కోలుకుంటున్నారు) 84 వైద్య శిబిరాలు ప్రజలకు అందుబాటులో ఉండాలని, వారం పాటు ఏలూరు పరిసర ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో శానిటేషన్ చేయాలన్నారు. విజయవాడ, గుంటూరు ప్రభుత్వాస్పత్రుల్లో నోడల్ ఆఫీసర్స్ నియమించడంతో పాటు, మందులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలని అధికారులను ఆళ్ల నాని ఆదేశించారు. ‘‘చికిత్సపొందుతున్న బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి. అన్ని గ్రామ సచివాలయాల్లో వైద్య శిబిరాలు కొనసాగించాలి. అన్నివిధాలా సిద్ధంగా ఉండాలని వైద్యులకు మంత్రి ఆళ్ల నాని సూచించారు. (చదవండి: మనం కట్టేవి ఇళ్లు కావు.. ఊళ్లు: సీఎం జగన్) -
ఫిబ్రవరిలో ఈఎన్టీ పరీక్షలు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి నుంచి చెవి, ముక్కు, గొంతు (ఈఎన్టీ) సహా దంత పరీక్షల నిర్వహణకు సంబంధించి తగిన కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో వైద్య, ఆరోగ్య రంగంపై సీఎస్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి శాంతికుమారి, ఆరోగ్యశ్రీ సీఈఓ మాణిక్‌రాజ్, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్పేర్ యోగితారాణా, డీఎంఈ రమేశ్‌రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శ్రీనివాస్‌రావు, అధికారులు అలుగు వర్షిణి, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. ఈఎన్టీ పరీక్షల నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లు, వైద్య నిపుణుల అందుబాటు, నిధుల అవసరం తదితర అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని అధికారులకు సూచించారు. డెంటల్ చైర్స్, హియరింగ్ ఏఐడీఎస్పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. వైద్య శిబిరాల నిర్వహణకు సంబంధించి పైలట్ పద్ధతిలో క్యాంపులు నిర్వహించి అవగాహనకు రావాలన్నారు. వైద్య శిబిరాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రజల అభిప్రాయాన్ని సేకరించేలా ఏర్పాట్లు ఉండాలన్నారు. వైద్య పరీక్షలకు సంబంధించి నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రజల హెల్త్ ప్రొఫైల్‌కు సంబంధించి ప్రైవేటు ఆసుపత్రులు తమ సమాచారాన్ని ఫీడ్ చేసేలా ఏర్పాట్లు ఉండాలన్నారు. వైద్య, ఆరోగ్య రంగానికి సంబంధించి వివిధ విభాగాల్లో ఇంటిగ్రేటెడ్ పోర్టల్‌ను తయారు చేయడం అభినందనీయమని కొనియాడారు. ఈ డేటా ద్వారా అవసరమైన చర్యలు తీసుకోవడానికి తగిన యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలని అధికారులకు సూచించారు. కామన్ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించుకోవాలని, వైద్య, ఆరోగ్య శాఖకు అవసరమైన నిధులపై నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలకోసం అవసరమైన నిపుణులైన డాక్టర్ల సంఖ్యను అంచనా వేయాలన్నారు. వైద్య శాఖలో రీసెర్చ్ విభాగాన్ని ఏర్పాటు చేసి ప్రభావాన్ని అంచనా వేయాలని అధికారులకు సూచించారు. -
‘వెలుగు’లో కష్టాలు
నిజామాబాద్‌అర్బన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమంలో వైద్య సిబ్బందికి ఇబ్బందులు తప్పడం లేదు. వైద్య శిబిరాల నిర్వహణ సమయంలో భోజన వసతి కల్పించాల్సి ఉండగా చాలా చోట్ల పట్టించుకోవడం లేదు. భోజన ఏర్పాట్లకు నిధులు కూడా మంజూరు అయ్యాయి. గతనెల 15న జిల్లా వ్యాప్తంగా 35 ప్రాంతాల్లో కంటి వెలుగు వైద్యశిబిరాలు ప్రారంభమయ్యా యి. 35 వైద్య బృందాలను ఏర్పాటు చేశా రు. ఇందులో జనరల్ వైద్యులతో పాటు కంటి వైద్య నిపుణులు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు ఇద్దరు, స్థానిక ఏఎన్ఎంలు ఇద్ద రు, ఆశకార్యకర్తలు , ఇద్దరు సూపర్వైజ ర్లు ఉంటారు. వీరికి మధ్యాహ్న వేళలో భోజనం, రెండు పూటల టీ , శిబిరం వద్ద టెంట్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేశారు. ఒక్కో శిబిరానికి మొదట రూ. 1500 మంజూరు చేయగా సరిపోవడంలేదని రూ. 2,500 పెంచారు. కంటి వెలుగు శిబిరం నిర్వహణకు జిల్లాకు ఒక రూ. కోటి 9 లక్షలు మంజూరు అయ్యాయి. ఇందులో నుంచి ఖర్చుకు కేటాయిస్తున్నారు. అయితే కంటి వెలుగు శిబిరాల్లో వైద్యసిబ్బందికి భోజనాలు అందించకుండా, ఇంటి నుంచే తెచ్చుకోవాలని వైద్యాధికారులు సూచించడం గమనార్హం. కనీసం రెండు పూటల టీ అందించడం లేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని నాలుగు వైద్యశిబిరాల్లో భోజనాన్ని స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులతో ఏర్పాటు చేయిస్తున్నారు. కేటాయించిన నిధులను మాత్రం ఖర్చు చేయడం లేదు. మరోవైపు వైద్యశిబిరాలను మహిళ సంఘాలు, కుల సంఘాలు, కమ్యూనిటీ కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. టెంట్ ఖర్చు కూడా మిగిలిపోతోంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వైద్యశిబిరాలు కొనసాగుతున్నాయి. దీంతో శిబిరంలో పాల్గొనే సిబ్బంది భోజన వసతి కల్పించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పీహెచ్సీ వైద్యసిబ్బంది జిల్లా వైద్యాధికారి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 50 రోజుల వరకు శిబిరాల నిర్వహణ సమయంలో భోజన వసతి కోసం నిధులు ముందుగానే ప్రభుత్వం మంజూరు చేసింది. స్థానికంగా మెడికల్ ఆఫీసర్లు డబ్బులు ఖర్చు చేయకపోవడంపై అధికారులు మండిపడుతున్నారు. గ్రామాల్లో గ్రామ అభివృద్ధి కమిటీలు , ప్రజాప్రతినిధుల ద్వారా భోజన వసతి కల్పిస్తున్నారే తప్ప వైద్యాధికారులు నిధులు ఖర్చు చేయడం లేదు. ఇప్పటికే దాదాపు 70 వేల మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వైద్యశిబిరాలకు ప్రజల తాకిడి ఎక్కువగా ఉండడంతో వైద్యసిబ్బందికి కనీస సౌకర్యాలు కల్పించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. నిధులు మంజూరు అయ్యాయి : జిల్లా ఇన్చార్జి వైద్యాధికారి డా సుదర్శనం కంటి వెలుగు నిర్వహణకు సంబంధించి సంబంధిత సెంటర్లకు నిధులు ముందస్తుగానే విడుదల అయ్యాయి. సిబ్బందికి భోజన, ఇతర ఖర్చులకు ఎలాంటి లోటు లేకుండా నిధులు అందుబాటులో ఉన్నాయి. ఎవరైన భోజన వసతి కల్పించకుంటే చర్యలు తీసుకుంటాం. మంజూరు అయిన నిధుల ప్రకారం తప్పకుండా కనీస సౌకర్యాలు, భోజన వసతి వైద్యాధికారులు కల్పిలంచాలి. -
మరో నాలుగు డయేరియా కేసులు
కారంపూడి మండలం మిరియాల గ్రామంలో గురువారం మరో నాలుగు డయేరియా కేసులు నమోదయ్యాయి. దారెడ్డి కరుణాకరరెడ్డి అనే బాలుడి పరిస్థితి విషమంగా ఉండడంతో నరసరావుపేట ఏరియా ఆస్పత్రికి తరలిం చారు. ఇప్పటి వరకు గ్రామంలో 57 మందికి డయేరియా సోకింది. మిరియాల (కారంపూడి): మండలంలోని మిరియాల గ్రామంలో గురువారం మరో నాలుగు డయేరియా కేసులు నమోదయ్యాయి. వీరికి డాక్టర్లు ఆంజనేయులు నాయక్, లక్ష్మీశ్రావణి వైద్య సేవలు అందిస్తున్నారు. కొత్తగా వ్యాధి సోకిన వారిలో దారెడ్డి కరుణాకరరెడ్డి అనే బాలుని పరిస్థితి విషమంగా ఉండడంతో నరసరావుపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరితో కలిపి ఇప్పటి వరకు గ్రామంలో మొత్తం 57 మందికి డయేరియా సోకింది. వ్యాధి వచ్చిన వారిలో 30 మందికి పూర్తిగా తగ్గిపోయిందని, మిగిలిన వారి ఆరోగ్యం కూడా మెరుగవుతోందని, కొత్త కేసులు నమోదు కాకుంటే పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తుందని వైద్యులు తెలిపారు. డీఎల్పీవో కృష్ణమోహన్ గురువారం గ్రామంలో పర్యటించి పారిశుద్ధ్య చర్యలను పరిశీలించారు. గ్రామంలో వారం రోజులుగా కొనసాగుతున్న వైద్య శిబిరంలో సీహెచ్‌వో వి.రామాంజనేయులు, సూపర్ వైజర్ పట్టాభి, కారంపూడి పీహెచ్సీ సిబ్బంది దానమ్మ, రమణ, హెచ్వీ సరిత తదితరులు సేలందిస్తున్నారు. ఆర్డీవో, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. పరిస్థితి అదుపులోనే ఉంది ఒక బాలుని పరిస్థితి విషమంగా ఉంటే అంబులెన్స్‌లో నరసరావుపేట ఆస్పత్రికి తరలించారని, మిగిలిన వారు కోలుకుంటున్నారని తహసీల్దార్ సాయిప్రసాద్ తెలిపారు. డ్రైనేజిలో మురుగు పూడిక తీత పనులు పూర్తయ్యాయని, వాటిలో బ్లీచింగ్ చల్లుతున్నారని చెప్పారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఓవర్‌హెడ్ ట్యాంకులను శుభ్రం చేయిస్తున్నారని, ట్యాంకుల ద్వారా నీటి సరఫరా కొనసాగుతోందని తెలిపారు. -
విశాఖలో ‘ఆటా’ మెడికల్ క్యాంప్ సక్సెస్
సాక్షి, విశాఖపట్నం: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుసగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో తాజాగా విశాఖపట్నంలో మెడికల్ క్యాంపుతో పాటు స్వచ్ఛందంగా సామాజిక సేవలు అందించింది. ఆటా ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా మెడికల్ హెల్త్ క్యాంపు సక్సెస్ అయింది. 200 మందికి పైగా పేషెంట్లకు ట్రీట్మెంట్ చేసి మెడిసిన్ అందజేశారు. అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు పలు జాగ్రత్తలు వైద్యులు సూచించారు. కొందరు చిన్నారులకు ఆట వస్తువులు అందజేసి వారిలో నూతన ఉత్సాహాన్ని నింపారు. హెల్త్ క్యాంపులో స్థానికులు అడిగిన సందేహాలు విని డాక్టర్లు పలు సూచనలు, సలహాలిచ్చారు. కాగా, ఇటీవల తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం పడ్కల్ గ్రామంలో మెడికల్ క్యాంపునకు విశేష స్పందన వచ్చింది. అదే విధంగా జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం చిన్నఆముదాలపాడులో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆటా బృందం నిర్వహించిన విషయం తెలిసిందే. -
తెలుగు రాష్ట్రాల్లో ఆటా సేవా కార్యక్రమాలు
అమెరికా తెలుగు సంఘం(ఆటా) తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. డిసెంబర్ 1 నుంచి 23 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో వైద్య పరమైన సేవా కార్యక్రమాలను చేపట్టనున్నట్టు ఆటా ప్రెసిడెంట్ కరుణాకర్ ఆసిరెడ్డి, ప్రెసిడెంట్ ఎలక్ట్ పర్మేష్ భీంరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆటా కార్యనిర్వాహక సభ్యులందరూ అమెరికా నుంచి భారత్ వచ్చి సేవా కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొననున్నట్టు పర్మేష్ భీంరెడ్డి పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో జిల్లాల వారీగా నిర్వహించనున్న ఈ సేవా కార్యక్రమాల తేదీల వివరాలు త్వరలోనే ప్రకటించనున్నట్టు పర్మేష్ భీంరెడ్డి తెలిపారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా మారుమూల గ్రామాల్లో ఉండే నిరుపేదలకు కంటి పరీక్షలు, దంత పరీక్షలు, వైద్య సహాయంతోపాటూ మందుల పంపిణీ కూడా చేయనున్నట్టు ఆయన చెప్పారు. ఇప్పటికే మహబూబ్ నగర్ జిల్లాలోని గట్టు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో తెలంగాణ ప్రభుత్వం సహకారంతో వివిధ కార్యక్రమాల నిర్వహణ చేపడుతున్నట్టు తెలిపారు. ఆటా కార్యనిర్వాహక బృంద సభ్యులు కరుణాకర్ రెడ్డి ఆసిరెడ్డి(ఆటా ప్రెసిడెంట్), పర్మేష్ భీంరెడ్డి(ప్రెసిడెంట్ ఎలక్ట్), కిరణ్ రెడ్డి పాశం, అనిల్ బొద్ది రెడ్డి, వేణు పిస్కె, వెంకట్ వీరనేని, శ్రీధర్ తిరుపతి, శివకుమార్ రామడ్లులు సమావేశమై ఈ సేవా కార్యక్రమాలని ప్రజలు ఉపయోగించుకోవాలని సూచించారు. -
ఉత్తుత్తి ‘టెస్టులు’!
రూ.200లకే అన్ని రకాల వైద్య పరీక్షలంటూ మోసం ♦ పల్లెల్లో సరికొత్త దోపిడీకి తెరలేపిన ముఠా ♦ స్వచ్ఛంద సంస్థ పేరిట వైద్య శిబిరాల ఏర్పాటు ♦ కేవలం వేలిముద్రలు తీసుకుని రోగాల నిర్ధారణ ♦ లేని రోగాలు ఉన్నట్టు చూపుతూ రిపోర్టులు ♦ నకిలీ మందులు ఇస్తూ డబ్బులు గుంజుతున్న వైనం ‘రూ. 200 చెల్లిస్తే చాలు.. సకల రోగాలను పసిగడతాం.. వాటి నివారణకు కారుచౌకగా మందులిస్తాం’ అంటూ ఊళ్లు తిరుగుతోంది ఓ ముఠా. స్వచ్ఛంద సంస్థ ముసుగులో పల్లె పల్లెకూ తిరుగుతోంది. గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తోంది. ఒక్క స్పర్శతో అన్ని రకాల వైద్య పరీక్షలు చేస్తామంటూ.. బొటన వేలు ముద్ర తీసుకుని ఫలానా రోగం ఉందంటూ ఖాయం చేసేస్తోంది. అంతటితో ఆగకుండా.. మీకున్న జబ్జుకు ఈ మందులేసుకోవాలంటూ నకిలీ మందులను అంటగట్టి.. అందినకాడికి గుంజేసి జారుకుంటోంది. సాక్షి, రంగారెడ్డి జిల్లా : గ్రామీణ ప్రజల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటున్నారు కొందరు మాయగాళ్లు. కంప్యూటర్లు, కొత్త కొత్త పరికరాలను చూపించి వారిని మోసపుచ్చుతున్నారు. తక్కువ రుసుముతో వైద్య పరీక్షలు చేసి వ్యాధులను నిర్ధారిస్తామని చెబుతున్నారు. గత పక్షం రోజుల్లో జిల్లాలో పలుచోట్ల ఇలాంటి వైద్య పరీక్ష శిబిరాలు కొనసాగాయి. కొన్నిచోట్ల రెండు, మూడు రోజులపాటు ఈ శిబిరాల్లో జన ం కిక్కిరిసిపోవడం గమనార్హం. ఈ క్యాంపునకు వచ్చిన ప్రజలకు ఒక పరికరంతో అన్నిరోగాలను గుర్తించొచ్చని చెబుతూ వారికి లేనిపోని రోగాలున్నట్లు రిపోర్టులిస్తున్నారు. కనీసం రక్త నమూనాలు, మూత్ర నమూనాలు తీసుకోకుండా కేవలం వేలిముద్రల సాయంతో అన్ని రకాల పరీక్షలు చేయడం విశేషం. ఆదివారం కందుకూరు మండలం దెబ్బడగూడలో వెలిసిన ఈ క్యాంపు.. గుట్టు రట్టవుతుందనుకున్న సమయంలో క్షణాల్లో బిచానా ఎత్తేశారు. ఈ క్రమంలో పలు గ్రామాల్లోనూ ఇలాంటి వైద్యశిబిరాలు వెలసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామ పంచాయతీ సాక్షిగా.. గ్రామాల్లో వెలుస్తున్న నకిలీ వైద్య శిబిరాలన్నీ ఏకంగా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లోనే వెలుస్తున్నాయి. గ్రామ పెద్దతో పరీక్షలు ప్రారంభించి తక్కిన వారందరికీ క్షణాల్లో పరీక్షలు నిర్వహించి ఫలితాల్ని ప్రింటెడ్ కాపీల రూపంలో అందిస్తున్నారు. కందుకూరు మండలం దెబ్బడగూడలో దయా ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాదాపు వందమందికి పైగా పరీక్షలు నిర్వహించి ఫలితాలను ఇచ్చారు. గతవారం మంచాల మండలం ఆరుట్ల, మంచాల గ్రామాల్లోనూ న్యూట్రివెల్త్ అనే సంస్థ ఆధ్వర్యంలో రెండొందల మందికిపైగా పరీక్షలు నిర్వహించారు. అంతేకాకుండా పలువురికి వ్యాధులున్నాయని చెబుతూ వాటిని నయం చేసేందుకుగాను ఒక్కో వ్యక్తి నుంచి రూ.300, 500, 1000 చొప్పున వసూలు చేశారు. ఇబ్రహీంపట్నం మండలంలోని కొంగరకలాన్, ఎలిమినేడు గ్రామాల్లోనూ ఇదేతరహాలో మూడురోజులపాటు క్యాంపులు నిర్వహించి ప్రజలనుంచి భారీగా దండుకున్నారు. ఆ మందులు ఫేక్! వైద్య శిబిరాల పేరుతో వచ్చి మందులు పంపిణీ చేసిన వాటిలో చాలావరకు నకిలీ మందులున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. దండోరా వేయించి దండుకున్నారు.. వైద్య శిబిరం ఏర్పాట్లు చేస్తున్నట్లు ఊర్లో దండోరా వేశారు. దీంతో పంచాయతీ కార్యాలయం వద్దకు వెళ్లా. పరీక్షలు నిర్వహించి మూత్ర పిండాలకు సంబంధించిన వ్యాదులున్నట్లు చెప్పారు. కొంత ఆందోళనకు గురయ్యా. అంతలోనే మందులిస్తాం.. తగ్గిపోతుందని చెప్పడంతో రూ.300 ఇస్తే ఈ మాత్రలిచ్చారు. ఇవి నకిలీ మందులని మందుల దుకాణాదారుడు చెప్పడంతో వాటిని వాడకుండా వదిలేశా. - భద్రారెడ్డి, మంచాల అనుమతి లేదు.. వైద్య శిబిరం నిర్వహించాలంటే మండల అధికారులనుంచి అనుమతి తీసుకోవాలి. వైద్య, ఆరోగ్య శాఖకు సమాచారం ఇవ్వాలి. కానీ మంచాల, ఆరుట్ల గ్రామాల్లో నిర్వహించిన వైద్య శిబిరాలకు సంబంధించి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. నకిలీ వైద్య శిబిరాలతో ప్రజలు అప్రమత్తమై ఉండాలి. - విజయలలిత, మెడికల్ ఆఫీసర్, మంచాల -
'జ్వరాలు అదుపు చేసేందుకే వైద్య శిబిరాలు'
సత్తుపల్లి రూరల్ (ఖమ్మం) : జ్వరాలు వ్యాపించకుండా అదుపు చేసేందుకే అన్ని గ్రామాలలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని సత్తుపల్లి క్లస్టర్ ఆఫీసర్ డాక్టర్ ఎల్.భాస్కర్ అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం అంబేద్కర్‌నగర్‌లో శనివారం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. జ్వరపీడితుల నుంచి రక్తనమూనాలు సేకరించి మందులు అందించారు. ఈ కార్యక్రమంలో గంగారం పీహెచ్సీ వైద్యాధికారిణి వైఎల్ ప్రశాంతి, హెచ్వీ అన్నమ్మ, హెచ్ఎస్ నర్సింహారావు, హెచ్ఈఈ శ్రీనివాస్, ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. -
విషజ్వరాలతో గ్రామాలు విలవిల
మంగళగిరి : విష జ్వరాలు విసృ్తతంగా వ్యాపిస్తున్నాయి. దీంతో రాజధాని గ్రామాలు మంచం పడుతున్నాయి. తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాలతో పాటు దుగ్గిరాల మండలంలోని పలు గ్రామాలలో విష జ్వరాలు ప్రబలడంతో ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ప్రధానంగా గ్రామాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో ఇంటికి ఒకరిద్దరు చొప్పున విష జ్వరాలతో బాధ పడుతున్నారు. మంగళగిరి మండలంలో నిడమర్రు, బేతపూడి, కురగల్లు గ్రామాలతో పాటు తాడేపల్లి, ఉండవల్లి, వడ్డేశ్వరం తుళ్లూరు మండలం పెదపరిమి, మందడం, దుగ్గిరాల మండలం మంచికలపూడిలతో పాటు పలు గ్రామాలలో జ్వరాలు ప్రబలడంతో ప్రజలు భయాందోళన లు వ్యక్తం చేస్తున్నారు. కామెర్లతో ముగ్గురు మృతి.. దుగ్గిరాల మండలం మంచికలపూడిలో వైద్యశిబిరాలు కొనసాగుతుండగా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో గత పది రోజుల వ్యవధిలో జ్వరాలు, కామెర్లతో ముగ్గురు మృతి చెందారు. ఆయా గ్రామాల నుంచి జ్వరాలతో తాడేపల్లి మండలంలో 72 మంది, దుగ్గిరాల మండలంలో 200 మంది, మంగళగిరి మండలంలో 64 మంది, తుళ్లూరు మండలంలో 42 మంది వెరసి మొత్తం 378 మంది జ్వరాలతో బాధ పడుతున్నట్లు అధికారిక లెక్కలే చెబుతుండగా, మరో 300కుపైగా రోగులు వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. జ్వరంతో ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తే ఇదే అదనుగా డెంగీ అని భయపెడుతూ పరీక్షలు, చికిత్సల పేరుతో దోచుకుంటున్నారు. ఆర్ఎంపీ వైద్యుడు దగ్గరికి వెళ్లినా పరీక్షలు చేయించుకోవాలని అతనికి తెలిసిన ఆసుపత్రిలో చేరుస్తూ కమీషన్లు వసూల్ చేసుకుంటున్నారు. డెంగీ, చికెన్‌గున్యా, మలేరియా పేర్లతో ఆయా ఆసుపత్రుల్లో దోపిడీ చేస్తున్నారని పేద రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టించుకోని పంచాయతీలు.. పది రోజులుగా గ్రామాల్లోని ప్రజలు జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధ పడుతున్నా ఆరోగ్య సిబ్బందిగానీ, పంచాయతీ సిబ్బందిగానీ పట్టించుకున్న దాఖలాల్లేవు. ఆయా కాలనీల్లో డ్రైనేజి కాలువలు సక్రమంగా లేకపోవడంతో వర్షం నీరు, మురుగునీరు ఎక్కడికక్కడే రోడ్లపై నిలిచిపోయాయి. వర్షాల కారణంగా తాగునీరు సైతం కలుషితం అయ్యాయి. ప్రజలు బోర్ల నీటినే తాగుతున్నారు. బావుల్లో కనీసం బ్లీచింగ్ కూడా చల్లటం లేదు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి గ్రామాల్లోని ఎస్సీ,ఎస్టీ కాలనీలతో పాటు బీసీ కాలనీల్లో వందలాది మంది విష జ్వరాలతో బాధపడుతున్నారు. అధ్వానంగా ఉన్న పారిశుద్ధ్యం కారణంగా దో మలు పెరిగి జ్వరాలు వ్యాపిస్తున్నాయి. తక్షణమే ఆయా గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్మూలనకు చర్యలు తీసుకోవాలి. ప్రత్యే క వైద్య శిబిరాలు నిర్వహించి మందులు పంపిణీ చేయాలి. అందుబాటులో ఉన్న పీహెచ్‌సీల్లో అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి. జిల్లా వైద్యాధికారి, కలెక్టర్ దృష్టికి కూడా సమస్యను తీసుకెళ్లాం. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరాను. - ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే, మంగళగిరి -
పల్లెకు జ్వరం
పల్లెలు పడకేస్తున్నాయి. జిల్లాలో వ్యాధులు విజృంభిస్తున్నాయి. విషజ్వరాలు, డెంగీ, మలేరియా, టైఫాయిడ్ బాధితులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. అధ్వానంగా ఉన్న పారిశుధ్యం, దీంతో ఉధృతమవుతున్న దోమలు, మరోవైపు పాలకులు, అధికారుల నిర్లక్ష్యం... వెరసి గ్రామాలు ‘గజగజ’ వ ణికిపోతున్నాయి. - జిల్లాలో ఆందోళన కలిగిస్తున్న విషజ్వరాలు - మంచికలపూడిలో ఇంటింటికీ జ్వరపీడితులు - ఈపూరులో రెండురోజుల కిందట జ్వరంతో ఇద్దరు మృతి - ఆలస్యంగా వైద్యశిబిరాల ఏర్పాటు - నిర్లిప్తంగా అధికారులు సాక్షి నెట్వర్క్: జిల్లాలో జ్వరాలు ప్రబలుతున్నాయి. పదిరోజులుగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలలు జ్వరపీడితులతో నిండిపోతున్నాయి. ముఖ్యంగా తెనాలి డివిజన్, ఈపూరు, పెదకూరపాడు, అమరావతి ప్రాంతాల్లో చిన్నాపెద్దా తేడా లేకుండా విషజ్వరాలకు విలవిల్లాడుతున్నారు. దుగ్గిరాల మండలంలోని మంచికలపూడిలో సుమారు 100మందికి పైగా జ్వరాల బారిన పడ్డారు. వీరిలో కొందరు తెనాలి ప్రభుత్వ వైద్యశాలతో చికిత్స పొందుతుండగా, మరికొందరు ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరారు. రెండ్రోరోజుల నుంచి ఇక్కడ వైద్యశిబిరం ఏర్పాటుచేసి వైద్యసేవలు అందిస్తున్నారు. ఆదివారం డీఎంహెచ్‌వో పద్మజరాణి ఈ శిబిరానికి వచ్చి బాధితులను పరామర్శించారు. కొల్లిపర సామాజిక ఆరోగ్యకేంద్రానికి రోజుకు 50మందికి పైగా జ్వరపీడుతులు వస్తున్నారు. వేమూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి రోజుకు సుమారు 20 మంది, తెనాలి మండలం సంగంజాగర్లమూడి పీహెచ్సీ పరిధిలో రోజూ 125మంది జ్వరపీడితులు చికి త్స కోసం వస్తున్నారు. కొలకలూరు పీహెచ్సీ పరిధిలో అదే పరిస్థితి నెలకొంది.ప్రైవేటు ఆస్పత్రుల్లో రోజులు 200 మంది చికిత్స పొందుతున్నట్లు సమాచారం. పిట్టలవానిపాలెం, భవనంవారిపాలెంలో సీజనల్ జ్వరాలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. వారంరోజులుగా ప్రజలు జ్వరాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండడం లేదు. గ్రామంలోని రామమందిరం సమీపంలోని రెండు వీధుల్లో అధికశాతం మంది టైఫాయిడ్ జ్వరాలతో బాధపడుతున్నారు. గ్రామానికి చెందిన ఓ కుటుంబంలోని సభ్యులకు జ్వరం రావడంతో ప్రైవేట్ వైద్యులతో చికిత్స చేయించుకున్నారు. అయినా తగ్గకపోవడంతో హైదరాబాద్ వెళ్లి అక్కడ వైద్యపరీక్షలు చేయించుకోగా తెల్లరక్తకణాల సంఖ్య తగ్గిందని వైద్యులు చికిత్స చేస్తున్నట్లు సమాచారం. పెదకూరపాడు నియోజకవర్గంలో విషజ్వరాలు బెంబేలెత్తిస్తున్నాయి. రెండ్రోజుల కిందట జిల్లా మలేరియా అధికారులు 75త్యాళ్ళూరులో పర్యటించి డెంగీవ్యాధికి కారణమయ్యే దోమల లార్వా ఇక్కడ అధికంగా ఉందని తేల్చారు. పరిశుభ్రంగా ఉండే 75త్యాళ్ళూరులోనే ఈ పరిస్థితి నెలకొంటే పునరావాస కేంద్రాలు, తండా, శివారు గ్రామాల్లో ఎలాంటి పరిస్థితి ఉంటుందో అర్ధమవుతుంది. అచ్చంపేట, బెల్లంకొండ మండలాల్లో తండా గ్రామాల్లో విషజ్వరాలు అధికంగా ఉన్నాయి. ఈపూరు మండలంలోని ఊడిజర్ల కాలనీలో విషజర్వాలతో మంచానపట్టారు. పలువురు వినుకొండ, నర్సరావుపేట, గుంటూరుల్లోని ప్రైవేటు వైద్యశాలల్లో చికిత్స పొంతుతున్నారు. రెండ్రోజుల కిందట గ్రామానికి చెందిన నంబూరి మరియదాస్(35) గుంటూరులోని జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇదే కాలనీకి చెందిన కాకాని తిరుపల్(30) జ్వరంతో అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతి చెందాడు. ఈ క్రమంలో కాలనీలో వైద్యులు వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఇంటింటికీ తిరిగి రక్త నమూనాలు సేకరిస్తున్నారు. కూలికి వెళ్లలేక.. జ్వరాలతో బాధపడుతున్న వారిలో ఎ క్కువమంది వ్యవసాయ కూలీలే ఉన్నా రు. వారంతా అనారోగ్యంతో పనులకు వెళ్లలేక, ఇల్లు గడవడం కష్టంగామారి తీవ్ర ఇబ్బందులుఎదుర్కొంటున్నారు. ప్రజలూ ఇవి పాటించాలి.. - ఇంటిలోపల బయట నీటి నిల్వలు లేకుండా చూడాలి. - ప్రతి శుక్రవారం వీక్లీ డ్రైడేగా పాటించాలి. ఇంటి ఆవరణలో కొబ్బరిబోండాలు, పాతటైర్లు, రోళ్లలో నీటినిల్వలు ఉండకుండా చూడాలి. - నీటి గుంతలో కిరోసిన్, మడ్డి ఆయిల్ చల్లించాలి. పందులు జనావాసాలకు దూరంగా ఉంచాలి - దోమతెరలు వాడాలి. దోమలు కుట్టకండా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాధుల బారినపడితే వైద్యులను సంప్రదించాలి. -
వణుకుతున్న మాజేరు
అదుపులోకి రాని విషజ్వరాలు 244 మందికి వైద్య పరీక్షలు 35 మందికి సెలైన్లతో చికిత్స మచిలీపట్నానికి ఇద్దరి తరలింపు కొత్తమాజేరు (చల్లపల్లి) : మండలంలోని కొత్తమాజేరులో విషజ్వరాలు ఇంకా అదుపులోకి రాలేదు. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సోమవారం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించారు. 244 మందికి పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. వారిలో 45 మందికి విషజ్వరాల తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వారికి వైద్య శిబిరంలోనే చికిత్స చేశారు. వారిలో 35 మందికి సెలైన్లు పెట్టి చికిత్స చేస్తున్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో 108 వాహనంలో మచిలీపట్నంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఇరుకు గదుల్లో చికిత్స చేస్తుండటంతో రోగులు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఘంటసాల, ఘంటసాలపాలెం, పురిటిగడ్డ, శ్రీకాకుళం ప్రభుత్వ వైద్యశాలల నుంచి డాక్టర్లు వచ్చి చికిత్స నిర్వహించారు. డీఎంహెచ్‌వో నాగమల్లేశ్వరి, ఇన్చార్జి డీపీవో ఎన్వీవీ సత్యనారాయణతో పాటు పలువురు జిల్లా అధికారులు ఈ వైద్యసేవలను పర్యవేక్షించారు. మంత్రుల సందర్శన కొత్త మాజేరు గ్రామాన్ని రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర సోమవారం సందర్శించారు. బాధితులను పరామర్శించారు. అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ బాబు.ఎ సాయంత్రానికి గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి, నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు తదితరులు గ్రామంలో పర్యటించి, బాధితులను పరామర్శించారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
జనం లేని జన్మభూమి
- తూతూమంత్రంగా గ్రామసభలు - అర్జీల స్వీకరణకే పరిమితం - వైద్య శిబిరాలకు స్పందన కరువు విజయవాడ సెంట్రల్ : జన్మభూమి గ్రామ సభలు అధికారుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రజల నుంచి అర్జీలు తీసుకొనేందుకే సభలు పరిమితం అయ్యాయి. సామాజిక పింఛన్లు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేస్తున్నారు. ఈక్రమంలో రెండు గంటల పాటు అర్జీలు ఇచ్చే జనం కోసం అధికారులు ఎదురు చూడాల్సి వస్తోంది. జనం లేక పోవడంతో సభలు బోసిపోతున్నాయి. గురువారం పశ్చిమ నియోజకవర్గంలోని 27, 35, 36, సెంట్రల్ నియోజక వర్గంలో 42, 21, 43, 44, తూర్పు నియోజక వర్గంలో 1, 2, 3, 11, 17 డివిజన్లలో గ్రామసభలు నిర్వహించారు. 21, 17 డివిజన్లలో ప్రజారోగ్యశాఖ అధికారులు వైద్య శిబిరాలు చేపట్టారు. బృంద నాయకులు ఎ.ఉదయ్‌కుమార్, పి.మధుకుమార్, ఎం.రవికుమార్, పి.గంగరాజు, జె.శ్రీనివాసరావు, ఎం.ఐజాక్‌బాబు, ఎ.నాగకుమార్ తదితరులు పాల్గొన్నారు. నేటి షెడ్యూల్ ఇదీ.. జన్మభూమి-మాఊరులో భాగంగా శుక్రవారం పశ్చిమ నియోజక వర్గంలోని 28వ డివిజన్ ప్రియదర్శిని కాలనీ రిజర్వాయర్, 37వ డివిజన్ కేబీఎస్ కళాశాల వెనుక రాఘవరెడ్డి రోడ్డులో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, 38వ డివిజన్ చేపల మార్కెట్ వెనుక శిల్పా ఆశ్రమం రోడ్డులో ఉదయం 10.15 నుంచి 12.15 వరకు సభల నిర్వహించనున్నారు. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో 45వ డివిజన్ మధురానగర్ రిజర్వాయర్ వద్ద, 46వ డివిజన్ గొట్టుముక్కల సూర్యనారాయణ మునిసిపల్ స్కూల్లో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, 47వ డివిజన్ ఏకేటీపీ స్కూల్లో, 51వ డివిజన్ అయోధ్యనగర్ సూర్య పబ్లిక్ స్కూల్లో ఉదయం 10 నుంచి 12.15 వరకు గ్రామసభలు జరగనున్నాయి. తూర్పు నియోజకవర్గంలో 4వ డివిజన్ బెతల్హమ్నగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద, 12వ డివిజన్ దర్శిపేట రాజరాజేశ్వరీ కల్యాణమండం వద్ద, 24వ డివిజన్ కృష్ణలంక గంగానమ్మ గుడివద్ద, ఉదయం 8నుంచి 10 గంటల వరకు, 6వ డివిజన్ చుట్టగుంట చైతన్య కళాశాల రోడ్డు, 13వ డి విజన్ ఫకీర్‌గూడెం కమ్యూనిటీ హాల్లో ఉదయం 10.15 నుంచి మధ్యాహ్నం 12.15 వరకు జన్మభూమి సభలు నిర్వహించనున్నట్లు నగరపాలక సంస్థ అధికారులు తెలిపారు. -
సేవకు సలామ్
మనిషికి ఎలాంటి శారీరక, మానసిక సమస్య ఎదురైనా తలచుకునేది దైవాన్ని.. కలుసుకునేది వైద్యుడిని. అలాంటి వైద్య వృత్తికే వన్నె తెచ్చారు సిటీకి చెందిన యువ డాక్టర్లు. నేపాల్ భూకంపంలో క్షతగాత్రులైనవారికి సేవలు అందించేందుకు ముందుకు రావాలని ‘క్యూరోఫి’ యాప్‌లో పోస్ట్ వచ్చింది. ఇది చూసిన సిటీకి చెందిన ‘ఆకృతి, విశిష్ట, యశ్వంత్’ స్పందించారు. కామినేని ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్న ఆకృతి, నిమ్స్‌లో ఫిజియోథెరపిస్ట్‌గా సేవలందిస్తున్న విశిష్ట, శ్రీకాకుళం జీఎంఎస్ ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్న యశ్వంత్ ఇక్కడి నుంచి పయనమయ్యారు. వీరికి భోపాల్ నుంచి ముగ్గురు డాక్టర్లు, ముంబై, ఢిల్లీ నుంచి ఒక్కో వైద్యుడు చేయందించారు. విపత్కర పరిస్థితుల్లో ఉన్న నేపాల్ ప్రజలకు వైద్య సేవలు అందించారు. అక్కడ తాము ఎదుర్కొన్న అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు ఆకృతి, విశిష్ట, యశ్వంత్. ఆ వివరాలు వారి మాటల్లోనే.. - సాక్షి, సిటీబ్యూరో - నేపాల్ భూకంప ప్రాంతంలో వైద్యశిబిరాలు - ప్రాణాలను పణంగా పెట్టి సిటీ వైద్యుల సేవలు ఇలా మొదలైంది.. ‘మే 6న కాట్మాండ్‌కు బయలుదేరాం. ఏడున అక్కడ మెడికల్ క్యాంప్ పూర్తయింది. మరుసటి రోజు మధ్యాహ్నానికి సింధుపాల్ చౌక్ ప్రాంతానికి చేరుకున్నాం. నేపాల్‌లో ఎక్కడ భూకంపం వచ్చినా ఆది సింధుపాల్ చౌక్ నుంచి మొదలువుతుందని విన్నాం. అక్కడ పరిస్థితి భయానకంగా ఉంది. సమీప ప్రాంతాల్లో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశాం. రక్తపు మడుగుల్లో ఉన్నవారిని చూస్తే బాధేసింది. పోలీసులు, నేపాల్ ఆర్మీతో కలిసి క్షతగాత్రులకు వైద్యం అందించాం. అప్పటికే కొండచరియలు విరిగిపడటంతో మెడిసిన్ బ్యాగులను మోసుకుంటూ కొండలపైకి వెళ్లాం. 10,11 తేదీల్లో గ్రామాల్లో మెడికల్ క్యాంప్ చేశాం. ఆ తర్వాత లమసాంగ్ నుంచి 11.5 కిలోమీటర్ల దూరంలో ఉండే నేపాల్, చైనా బార్డర్‌కు బయలుదేరాం. ఈ సమయంలోనే మా కళ్ల ముందే మరోసారి భూకంపం వచ్చి కొండచరియలు విరిగిపడ్డాయి’ సమయం: మే 13 ఉదయం.. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్య మరోసారి భూకంపం వస్తుందని ప్రకటించారు. ఆర్మీ అధికారులు వెంటనే కాట్మాండ్ బయలుదేరమన్నారు. లమ్సాంగ్ నుంచి కాట్మాండ్‌కు 2.30 గంటలు పడుతుంది. మధ్యలో అన్నీ కొండలే. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఎలాగైతేనేం సాయంత్రానికి కాట్మాండ్ చేరుకున్నాం. మరుసటి రోజు అక్కడి పోలీసు అకాడమీలో వైద్య శిబిరం నిర్వహించాం. ఆ రోజు రాత్రికే మమ్మల్ని ఢిల్లీకి పంపించారు. అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకున్నాం. సేవ ముందు మా ప్రాణ భయం మోకరిల్లింది’ అంటూ ముగించారు. క్షణక్షణం భయం భయం.. ‘జంబూ విలేజ్‌కు చేరుకోగానే కొండచరియ విరిగిపడటంతో ముందుకు వెళ్లలేని పరిస్థితి. ఆ పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం భూకంపం వచ్చింది. కొండలు పడిపోయాయి. చాలా మంది చనిపోయారు. జంబూ కొండ దిగువనున్న గంగా నది వద్ద రెండు గంటలు పాటు ఉన్నాం. అప్పటికే సాయంత్రమైంది. మేం వైద్యులమని తెలియగానే జంబూ గ్రామస్తులు సమూహంగా మా వద్దకు వచ్చారు. వారందరికి వైద్యం చేశాం. అప్పటికి ఆర్మీ రోడ్డును క్లియర్ చేసింది. జంబూలోని విరిగిపడిన పెద్ద కొండను పెకలించాలంటే బాంబు పెట్టాలి. అప్పటికే సమయం దాటిపోయింది. దీంతో రోడ్డుపై పడిన కొండ ఎక్కి, దూకాం. రోడ్డు ఇరువైపులా ఉన్న కొండలు ఏ సమయంలోనైనా పడిపోవచ్చనే సమాచారంతో సుమారు ఎనిమిది కిలోమీటర్లు పరుగుపెట్టాం. రాత్రి ఎనిమిది గంటల సమయంలో అటువైపుగా వచ్చిన ఆర్మీ జీపు ఎక్కి లమసాంగ్‌కు వెళ్లాం. అప్పటికే మాకు కేటాయించిన గెస్ట్‌హౌస్ కకావికలమైంది. ఆ రోజు రాత్రంతా కొండ ఊగింది.. ఎవరికీ నిద్ర లేదు. ఇంత భయంలోనూ మా వైద్య సేవలు ఆపలేదు. మేం ఎక్కడ ఉంటే అక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహించాం. -
సమస్యలు అనంతం
ఎండల తీవ్రతకు అల్లాడుతున్న జనం గ్రామాల్లో జాడలేని వైద్య శిబిరాలు ఉపాధి పనుల వద్ద నీడ కరువు అతీగతీ లేని విత్తన పంపిణీ నేడు జెడ్పీ సర్వసభ్య సమావేశం అనంతపురం సెంట్రల్ : జిల్లా ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వరుస కరువులతో పంటలు పండలేదు. తాగేందుకూ గుక్కెడు నీరు దొరకడం లేదు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను పాలకులు అటకెక్కించారు. కరువు జిల్లాను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. గ్రామాల్లో ప్రజలు ఉండలేని పరిస్థితి దాపురిస్తోంది. సోమవారం జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్యసమావేశం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా సమస్యలపై ‘సాక్షి’ ఫోకస్... కొన్ని రోజులుగా భానుడు ఉగ్రరూపాన్ని చూపుతున్నాడు. ఆదివారం శింగనమలలో రికార్డు స్థాయిలో 44.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. యల్లనూరు 42.3 డిగ్రీలు, అనంతపురం, గార్లదిన్నె 42.2 డిగ్రీలు, తాడిమర్రిలో 42 డిగ్రీలు నమోదయ్యాయి. ఎండ వేడిమికి తోడు వడగాలులు వీస్తుండడంతో పలువురు చనిపోయారు. ఎండ వల్ల కలిగే ప్రమాదంపై ప్రజలను అప్రమత్తం చేయాల్సిన వైద్య,ఆరోగ్యశాఖ నిద్రమత్తులో జోగుతోంది. కనీసం గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్న ధ్యాస కూడా ఆ శాఖ అధికారులకు లేదు. జిల్లాలో కూలీలకు గత్యంతరం లేక ఉపాధి పనులకు వెళుతున్నారు. పనులు జరిగే ప్రదేశంలో కూలీలకు ఏమాత్రమూ మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు. నీడ కోసం షామియానాలు లేవు. మంచినీరు సరఫరా చేయడం లేదు. గతంలో పంపిణీ చేసిన షామియానాలన్నీ ఎప్పడో పక్కదారి పట్టాయి. ముంగారు కాలం ముంచుకొస్తున్నా వ్యవసాయశాఖ అధికారుల్లో చలనం లేదు. ఖరీఫ్‌లో 3.28 లక్షల విత్తన వేరుశనగ అవసరం కాగా.. ఇప్పటి వరకూ 10 వేల క్వింటాళ్లు మాత్రమే జిల్లాకు చేరాయి. వేరుశనగతో పాటు అంతర పంటలుగా సాగు చేసే కంది, ఆముదంతో పాటు ప్రత్యామ్నాయ విత్తనాల పంపిణీపై కసరత్తు ప్రారంభించలేదు. రైతు, డ్వాక్రా రుణమాఫీలు గందరగోళంగా మారాయి. లక్ష మందికి పైగా రైతులు రుణమాఫీకి నోచుకోలేదు. జిల్లా వ్యాప్తంగా అన్ని ఆర్డీఓ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన రుణమాఫీ ఫిర్యాదుల స్వీకరణ కౌంటర్లు కిటకిటలాడుతున్నాయి. డ్వాక్రా రుణమాఫీదీ ఇదే పరిస్థితి. తొలుత సభ్యురాలికి రూ.10 వేలు అన్న ప్రభుత్వం ప్రస్తుతం మూడు విడతల్లో రూ. 3 వేల చొప్పున మంజూరు చేస్తోంది. ఈ మొత్తం కూడా వాడుకోవడానికి వీల్లేదని మెలిక పెట్టడంతో మహిళలు తీవ్రంగా మండిపడుతున్నారు. జిల్లాలో తాగునీటి ఎద్దడి జఠిలమవుతోంది. 300 గ్రామాలకు పైగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాలని ప్రభుత్వం నిధులు విడుదల చేసినా... ఎక్కువశాతం పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలున్నాయి.మండల స్థాయిలో రాజకీయ జోక్యం ఎక్కువ కావడంతో అధికారులు పారదర్శకంగా పనిచేయలేకపోతున్నారు. ప్రజా సంక్షేమం కోసం గతంలో జెడ్పీలో అనేక తీర్మానాలు చేశారు. పండ్ల తోటల సాగుకు 10 ఎకరాల వరకూ అవకాశం కల్పించాలని, శాశ్వత కరువు జిల్లాగా గుర్తించాలని, రూ. 100 కోట్ల ప్యాకేజీ ప్రకటించాలని, తదితర తీర్మానాలు చేశారు. ఇందులో ఏ ఒక్కటీ ఆచరణకు నోచుకోలేదు. -
అమ్మకు ‘గిన్నిస్’ పట్టం
సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత సారథ్యంలోని ఆ పార్టీ అనుబంధ మహిళా విభాగానికి గిన్నిస్ రికార్డు వరించింది. ఆ విభాగం నేతృత్వంలో నిర్వహించిన మహిళా వైద్య శిబిరానికి వచ్చిన విశేష స్పందన గిన్నిస్ బుక్‌లోకి ఎక్కింది.ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్నాడీఎంకే మహిళా విభాగం నేతృత్వంలో వైద్య శిబిరాల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. సేవ కార్యక్రమాల రూపంలో కాకుండా మహిళలకు ఎదురవుతున్న బ్రెస్ట్ క్యాన్సర్ నివారణ లక్ష్యంగా వైద్య శిబిరాల్ని అన్ని జిల్లాల్లోనూ ఏర్పాటు చేశారు. ఈ శిబిరాలకు విశేష స్పందన వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20 వేల మంది వరకు మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధిత పరీక్షలు నిర్వహించారు. ఇందులో ధర్మపురిలో నిర్వహించిన వైద్య శిబిరం రికార్డుకు ఎక్కింది. ఇది వరకు ఒకే రోజు వైద్య శిబిరం ద్వారా ఒకే ప్రాంతంలో 971 మంది మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధిత పరీక్షలు చేయించుకున్నారు. ఇది గిన్నిస్ రికార్డులు చోటు దక్కించుకుని ఉంది. అయితే, అన్నాడీఎంకే మహిళా విభాగం నేతృత్వంలో ధర్మపురిలో నిర్వహించిన శిబిరంలో ఏకంగా 2037 మంది మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధిత పరీక్షలు నిర్వహించుకున్నారు. ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు దృష్టికి చేరింది. అన్నాడీఎంకే మహిళా విభాగం ధర్మపురిలో నిర్వహించిన శిబిరాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు వర్గాలు పరిశీలించాయి. గతంలో ఉన్న రికార్డును తిరగ రాస్తూ, ఈ వైద్య శిబిరంలో పరీక్షలు నిర్వహించడంతో తాజా శిబిరం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కింది. ఇందుకు తగ్గ సర్టిఫికెట్‌ను అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు ప్రకటించారు. ఆ సర్టిఫికెట్‌ను స్వయంగా అందించేందుకు ఆ రికార్డు ప్రతినిధి లూషియా సిలికాక్ లిజీ చెన్నైకు వచ్చారు. అయితే, జయలలితను కలుసుకునే అవకాశం లేని దృష్ట్యా, ఆమె తరపున ఆ రికార్డును మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎంపీ శశికళ పుష్పకు అందజేశారు. ఉదయం రాయపేటలోని పార్టీ కార్యాలయంలో ఈ రికార్డును శశికళ పుష్పకు అందించినానంతరం లూషియా సిలికాక్ లిజీ మాట్లాడుతూ, బ్రెస్ట్ క్యాన్సర్ వైద్య శిబిరాన్ని కోసం ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే వర్గాలు చేస్తున్న సేవలను గుర్తు చేస్తూ, ప్రశంసలు కురిపిం చారు. ఈ కార్యక్రమంలో అన్నాడీఎంకే నాయకురాలు విశాలాక్షి నెడుం జెలియన్, మంత్రులు పళనియప్పన్, గోకుల ఇందిర, వలర్మతి, విజయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
పసుపుచొక్కాల ఫోజులు !
సాక్షి, చిత్తూరు: ప్రభుత్వం చేపట్టిన జన్మభూమి - మా ఊరు కార్యక్రమం పసుపు చొక్కాల ప్రచారంగా ముగిసింది తప్ప ప్రజాసమస్యల పరిష్కారం కోసం మాత్రం ఉపయోగపడలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్టోబర్ రెండు నుంచి నేటి వరకు రెండు విడతలుగా జరిగిన జన్మభూమి కార్యక్రమంలో కేవలం అరకొర పింఛన్లు పంపిణీ చేయడంతప్ప ఒరగబెట్టింది లేదు. గ్రామాల్లో చిన్నపాటి తాగునీటి పంపులు రిపేరు చేయమన్నా పైసలు లేవంటూ అధికారుల తప్పించుకోవడం చూస్తే జన్మభూమి ఎలా జరిగిందో తెలుస్తుంది. తాగునీరు,రోడ్లు, పక్కాగృహాలు,పంటలు కోల్పోయిన రైతులకు పరిహారం తదితర సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఇచ్చిన వినతిపత్రాలకు చూస్తాం- చేస్తామంటూ దేశం ప్రజా ప్రతినిధులు,మంత్రులు,అధికారులు తప్పించుకునేందుకు నానా పాట్లు పడ్డారు. ఇక దేశం నేతలు ప్రొటోకాల్ పక్కకు నెట్టి జన్మభూమి సభల్లో ఫొటోలకు ఫోజులిచ్చారు. అధికారులు మాత్రం తమకేమీ సంబంధం లేదనట్లు మిన్నకుండి పోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఇతర పార్టీ మద్దతుదారులంటూ అర్హులైన వారి పింఛన్లు తొలగించడంపై సభల్లో పలుచోట్ల ప్రజలు దేశం నేతలను,ప్రజాప్రతినిధులను నిలదీశారు. జిల్లాలో తాగేందుకు గుక్కెడు నీళ్లివ్వలే నపుడు సభలు,సమావేశాలు ఎందుకంటూ ప్రజలు ప్రజాప్రతినిధులను నిలదీశారు. డ్వాక్రా మహిళలు ,రైతులు రుణమాఫీ ఏదంటూ ప్రశ్నించారు. అన్నింటికీ మౌనమే సమాధానమైంది. జన్మభూమి సభలు పోలీసుల రక్షణవలయంలో నడిపించడం చూస్తే అవి జరిగిన తీరు స్పష్టమవుతుంది. మొత్తంగా జన్మభూమి - మా ఊరు ప్రజాసమస్యల పరిష్కారం కోసం కాకుండా దేశం నేతల ప్రచార కార్యక్రమంగా ముగిసింది. ఇక అధికారులు మాత్రం జన్మభూమిలో చేసింది చూడండంటూ గణాంకాలు విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన గ్రామ సభలను కేవలం పింఛన్ల పంపిణీ, దరఖాస్తుల సేకరణతోనే సరిపెట్టారు. దీంతో పాటు వైద్యశిబిరాలు, పశువుల వైద్యశిబిరాలను కూడా నిర్వహించినప్పటికీ లక్ష్యాలు మాత్రం పూర్తి చేయలేక పోయారు. పోనీ పింఛన్లు అయినా పూర్తిగా పంపిణీ చేశారా ? అంటే అదీలేదు. జిల్లాలో వికలాంగులు, వితంతువులు 308305 మందికి రూ.41కోట్లను పంపిణీ చేయాల్సి ఉండగా, కేవలం రూ.23.42కోట్లను మాత్రమే పంపిణీ చేశారు. వీటితో పాటు పశువైద్యశిబిరాలు,హెల్త్ క్యాంపులు, పేదరికంపై గెలుపు కార్యక్రమంలో భాగంగా నైపుణ్యం కలిగిన యువత గుర్తింపు, వ్యక్తిగత మరుగుదొడ్ల ఏర్పాటుకు రాయితీ ప్రచారం అంటూ రకరకాల గణాంకలతో ఎట్టకేలకు జన్మభూమి - మా ఊరును ముగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోండి
బాగేపల్లి : గ్రామాల్లో నిర్వహించే వైద్య శిబిరాలను గ్రామీణులు సద్వినియోగం చేసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే ఎస్ఎన్ సుబ్బారెడ్డి పిలుపు నిచ్చారు. పట్టణంలోని నేషనల్ కళాశాల మైదానంలో ఎస్ఎన్ సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్ట్, డీ దేవరాజు అరసు వైద్య కళాశాల సంయుక్తంగా శనివారం నిర్వహించిన ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడారు. కరువు వల్ల ఈ ప్రాంతం అన్ని రంగాల్లో వెనుకబడి ఉందని, గ్రామీణులు ఆర్థికంగా చాలా చితికిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం అనారోగ్యానికి గురైతే వైద్యుల వద్దకు వెళ్లేందుకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాంటి వారి కోసమే గ్రామాల్లో వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి శిబిరాలను గ్రామీణులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆర్ఎల్ జాలప్ప ఆస్పత్రి వ్యవస్థాపకుడు మాజీ ఎంపీ, ఆర్ఎల్ జాలప్ప మాట్లాడుతూ.. ధనవంతులు తన ధనంలో కొంత సొమ్మును పేదల కోసం ఖర్చు చేయాలని సూచించారు. ఈ శిబిరంలో నరాల బలహీనత, కేన్సర్, పళ్ళు, మధుమేహం, గర్భకోశం, మానసిక వ్యాధులు తదితర వాటితో బాధపడుతున్న వారికి చికిత్స అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎల్ జాలప్ప ఆస్పత్రి కార్యదర్శి నాగరాజు, వైద్యులు శ్రీరాములు, కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.