పల్లెకు జ్వరం
పల్లెలు పడకేస్తున్నాయి. జిల్లాలో వ్యాధులు విజృంభిస్తున్నాయి. విషజ్వరాలు, డెంగీ, మలేరియా, టైఫాయిడ్ బాధితులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. అధ్వానంగా ఉన్న పారిశుధ్యం, దీంతో ఉధృతమవుతున్న దోమలు, మరోవైపు పాలకులు, అధికారుల నిర్లక్ష్యం... వెరసి గ్రామాలు ‘గజగజ’ వ ణికిపోతున్నాయి.
- జిల్లాలో ఆందోళన కలిగిస్తున్న విషజ్వరాలు
- మంచికలపూడిలో ఇంటింటికీ జ్వరపీడితులు
- ఈపూరులో రెండురోజుల కిందట జ్వరంతో ఇద్దరు మృతి
- ఆలస్యంగా వైద్యశిబిరాల ఏర్పాటు
- నిర్లిప్తంగా అధికారులు
సాక్షి నెట్‌వర్క్: జిల్లాలో జ్వరాలు ప్రబలుతున్నాయి. పదిరోజులుగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలలు జ్వరపీడితులతో నిండిపోతున్నాయి. ముఖ్యంగా తెనాలి డివిజన్, ఈపూరు, పెదకూరపాడు, అమరావతి ప్రాంతాల్లో చిన్నాపెద్దా తేడా లేకుండా విషజ్వరాలకు విలవిల్లాడుతున్నారు. దుగ్గిరాల మండలంలోని మంచికలపూడిలో సుమారు 100మందికి పైగా జ్వరాల బారిన పడ్డారు. వీరిలో కొందరు తెనాలి ప్రభుత్వ వైద్యశాలతో చికిత్స పొందుతుండగా, మరికొందరు ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరారు. రెండ్రోరోజుల నుంచి ఇక్కడ వైద్యశిబిరం ఏర్పాటుచేసి వైద్యసేవలు అందిస్తున్నారు. ఆదివారం డీఎంహెచ్‌వో పద్మజరాణి ఈ శిబిరానికి వచ్చి బాధితులను పరామర్శించారు.
కొల్లిపర సామాజిక ఆరోగ్యకేంద్రానికి రోజుకు 50మందికి పైగా జ్వరపీడుతులు వస్తున్నారు. వేమూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి రోజుకు సుమారు 20 మంది, తెనాలి మండలం సంగంజాగర్లమూడి పీహెచ్‌సీ పరిధిలో రోజూ 125మంది జ్వరపీడితులు చికి త్స కోసం వస్తున్నారు. కొలకలూరు పీహెచ్‌సీ పరిధిలో అదే పరిస్థితి నెలకొంది.ప్రైవేటు ఆస్పత్రుల్లో రోజులు 200 మంది చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
పిట్టలవానిపాలెం, భవనంవారిపాలెంలో సీజనల్ జ్వరాలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. వారంరోజులుగా ప్రజలు జ్వరాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండడం లేదు. గ్రామంలోని రామమందిరం సమీపంలోని రెండు వీధుల్లో అధికశాతం మంది టైఫాయిడ్ జ్వరాలతో బాధపడుతున్నారు. గ్రామానికి చెందిన ఓ కుటుంబంలోని సభ్యులకు జ్వరం రావడంతో ప్రైవేట్ వైద్యులతో చికిత్స చేయించుకున్నారు. అయినా తగ్గకపోవడంతో హైదరాబాద్ వెళ్లి అక్కడ వైద్యపరీక్షలు చేయించుకోగా తెల్లరక్తకణాల సంఖ్య తగ్గిందని వైద్యులు చికిత్స చేస్తున్నట్లు సమాచారం.
పెదకూరపాడు నియోజకవర్గంలో విషజ్వరాలు బెంబేలెత్తిస్తున్నాయి. రెండ్రోజుల కిందట జిల్లా మలేరియా అధికారులు 75త్యాళ్ళూరులో పర్యటించి డెంగీవ్యాధికి కారణమయ్యే దోమల లార్వా ఇక్కడ అధికంగా ఉందని తేల్చారు. పరిశుభ్రంగా ఉండే 75త్యాళ్ళూరులోనే ఈ పరిస్థితి నెలకొంటే పునరావాస కేంద్రాలు, తండా, శివారు గ్రామాల్లో ఎలాంటి పరిస్థితి ఉంటుందో అర్ధమవుతుంది. అచ్చంపేట, బెల్లంకొండ మండలాల్లో తండా గ్రామాల్లో విషజ్వరాలు అధికంగా ఉన్నాయి.
ఈపూరు మండలంలోని ఊడిజర్ల కాలనీలో విషజర్వాలతో మంచానపట్టారు. పలువురు వినుకొండ, నర్సరావుపేట, గుంటూరుల్లోని ప్రైవేటు వైద్యశాలల్లో చికిత్స పొంతుతున్నారు. రెండ్రోజుల కిందట గ్రామానికి చెందిన నంబూరి మరియదాస్(35) గుంటూరులోని జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇదే కాలనీకి చెందిన కాకాని తిరుపల్(30) జ్వరంతో అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతి చెందాడు. ఈ క్రమంలో కాలనీలో వైద్యులు వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఇంటింటికీ తిరిగి రక్త నమూనాలు సేకరిస్తున్నారు. కూలికి వెళ్లలేక.. జ్వరాలతో బాధపడుతున్న వారిలో ఎ క్కువమంది వ్యవసాయ కూలీలే ఉన్నా రు. వారంతా అనారోగ్యంతో పనులకు వెళ్లలేక, ఇల్లు గడవడం కష్టంగామారి తీవ్ర ఇబ్బందులుఎదుర్కొంటున్నారు.
ప్రజలూ ఇవి పాటించాలి..
- ఇంటిలోపల బయట నీటి నిల్వలు లేకుండా చూడాలి.
- ప్రతి శుక్రవారం వీక్లీ డ్రైడేగా పాటించాలి. ఇంటి ఆవరణలో కొబ్బరిబోండాలు, పాతటైర్లు, రోళ్లలో నీటినిల్వలు ఉండకుండా చూడాలి.
- నీటి గుంతలో కిరోసిన్, మడ్డి ఆయిల్ చల్లించాలి. పందులు జనావాసాలకు దూరంగా ఉంచాలి
- దోమతెరలు వాడాలి. దోమలు కుట్టకండా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాధుల బారినపడితే వైద్యులను సంప్రదించాలి.