వైఎస్‌ జయమ్మ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ | Free Cancer Screening under YS Jayamma Trus | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జయమ్మ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్‌ స్క్రీనింగ్‌

Published Wed, Aug 21 2024 5:44 AM | Last Updated on Wed, Aug 21 2024 5:44 AM

Free Cancer Screening under YS Jayamma Trus

పాడేరు డివిజన్‌లో 60 వైద్య శిబిరాలు 

7,554 మందికి పరీక్షలు 

100 మందికి అ్రల్టాసౌండ్, బయాప్సీ 

వ్యాధి నిర్ధారణ అయిన వారు హోమీ బాబా క్యాన్సర్‌ ఆస్పత్రికి తరలింపు 

ప్రభుత్వ ఆస్పత్రుల సిబ్బందికి ప్రత్యేకంగా 4 రోజులు శిబిరం 

సాక్షి, అమరావతి: క్యాన్సర్‌ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి, బాధితులకు పూర్తిస్థాయిలో చికిత్స అందేలా కృషి చేసి, ప్రాణాపాయం నుంచి రక్షించేందుకు వైఎస్‌ జయమ్మ మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ట్రస్టీ వైఎస్‌ రవీంద్రనాథ్‌ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రేస్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌ (జీసీఎఫ్‌) సహకారంతో అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు రెవెన్యూ డివిజన్‌లోని అన్ని పీహెచ్‌సీలు, పలు విలేజ్‌ క్లినిక్‌ల పరిధిలో ఈ ఏడాది మే 27 నుంచి సోమవారం వరకు 60 క్యాంప్‌లు నిర్వహించినట్లు తెలిపారు. 

ఈ శిబిరాల్లో బ్రెస్ట్‌ క్యాన్సర్, సరై్వకల్‌ క్యాన్సర్, నోటి క్యాన్సర్‌ వంటి వ్యాధులను ముందుగానే గుర్తించే పలు పరీక్షలు చేసినట్లు తెలిపారు. 7,554 మందికి పరీక్షలు చేసినట్టు వెల్లడించారు. వీరిలో 2,314 మంది పురుషులు, 5,240 మంది మహిళలు ఉన్నారన్నారు. శిబిరాలకు వచ్చిన మహిళల్లో 1,764 మందికి మామోగ్రామ్, 2,285 మందికి పాప్‌స్మియర్‌ పరీక్షలు చేశామన్నారు. వ్యాధి లక్షణాలు కనిపించిన 100 మందికిపైగా ప్రజలను అరకు, పాడేరు ఆస్పత్రులకు పంపి, అక్కడ అ్రల్టాసౌండ్‌ స్కానింగ్, బయాప్సీ చేయించినట్లు వివరించారు. 

బయాప్సీలో వ్యాధి నిర్ధారణ అయిన వారిని హోమీ బాబా క్యాన్సర్‌ ఆస్పత్రికి తరలిస్తున్నట్లు చెప్పారు. క్యాన్సర్‌ ఉన్నట్లు అనుమానాలు ఉన్న 23 మందికి నేరుగా బయాప్సీ పరీక్షలు చేయిస్తున్నట్లు చెప్పారు. గత నాలుగు రోజులుగా పాడేరు ప్రభుత్వ ఆస్పత్రి, అరకు, చింతపల్లి ఏరియా ఆసుపత్రుల్లోని వైద్యులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ఉచిత స్క్రీనింగ్‌ శిబిరాలు నిర్వహించినట్లు తెలిపారు. 

నేడు అభినందన సభ 
క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ క్యాంపులను విజయవంతంగా నిర్వహించి, ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో భాగస్వాములైన వైఎస్‌ జయమ్మ మెమోరియల్‌ ట్రస్ట్, జీసీఎఫ్‌ బృందాలను బుధవారం సాయంత్రం 4 గంటలకు పాడేరు ప్రభుత్వ ఆస్పత్రిలో అభినందించనున్నట్లు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ చేతుల మీదుగా ఈ బృందాల సభ్యులకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు బహూకరించనున్నట్లు చెప్పారు. తాము చేపట్టిన ప్రజా సేవా కార్యక్రమానికి విశేష సహాయ సహకారాలు అందించిన జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవో, తదితరులను కూడా ఈ వేదికపై సత్కరించనున్నట్లు రవీంద్రనాథ్‌రెడ్డి ఆ ప్రకటనలో తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement