Cancer Disease
-
మా చావులకు ఎవరూ కారణం కాదు..
ఉప్పల్: భార్యకు కేన్సర్ అని తేలడంతో భర్త తల్లడిల్లిపోయాడు. అనారోగ్యంతో భార్య రోజురోజుకూ కుంగిపోతోంది. ఈ పరిస్థితుల్లో మానసిక వ్యధకు గురైన దంపతులు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలుకానగర్ డివిజన్ ధర్మపురి కాలనీకి చెందిన దుర్వాసుల సూర్యనారాయణ శాస్త్రి (60), జగదీశ్వరి (56) భార్యాభర్తలు. సూర్యనారాయణ ఎన్టీపీసీలో జీఎంగా పని చేసి మూడేళ్ల క్రితం స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. వీరి కుమారుడు సుశాంత్ గచ్చిబౌలిలో ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల జగదీశ్వరి కేన్సర్ వ్యాధికి గురయ్యారు. దీంతో భార్యాభర్తలిద్దరూ తీవ్రంగా కలత చెందారు. ఈ క్రమంలో ఈ నెల 3న సూర్యనారాయణ శాస్త్రి తన కుమారుడికి ఫోన్ చేసి తాను ఓ సెమినార్ కోసం బయటకు వెళ్తున్నానని, అమ్మను కూడా తీసుకెళ్తున్నాను.. నాలుగు రోజుల వరకు రాను అని చెప్పారు. ఆ తర్వాత వారం రోజులుగా ఎలాంటి ఫోన్ రాకపోవడంతో బుధవారం కుమారుడు తండ్రికి ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. సెమినార్కూ వెళ్లలేదని తెలిసింది. దీంతో హుటాహుటిన బుధవారం ఉదయం ఉప్పల్‌లోని ఇంటికి వచ్చి చూడగా గేట్‌కు తాళం వేసి ఉంది. పని మనిషికి ఫోన్ చేసి పిలిపించి తాళం తీసి వెళ్లగా ఇంటి తలుపులు లోపలి నుంచి లాక్ చేసి ఉన్నాయి. కిటికీలోంచి చూడగా దుర్వాసన రావడంతో వెంటనే తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే కుళ్లిన స్థితిలో మృతదేహాలు పడి ఉన్నాయి. మృతదేహాల పక్కన, ఇంకా రెండు చోట్ల మూడు సూసైడ్ నోట్లను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. ‘అనారోగ్య కారణాల చేత సూసైడ్ చేసుకుంటున్నాం. మా చావులకు ఎవరూ కారణం కాదు’ అంటూ రెండు లైన్లు తెలుగులో నోట్ రాసి ఉంది. దీంతో కుమారుడు సుశాంత్ ఉప్పల్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాల్ని స్వాదీనం చేసుకున్నారు. సుశాంత్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. వారం రోజుల క్రితమే సూర్యనారాయణ శాస్త్రి, జగదీశ్వరి దంపతులు గుర్తు తెలియని మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.లోన్ యాప్ వేధింపులకు యువకుడి బలి -
Cancer Disease: తీయని కేక్ తింటే తంటా
సాక్షి, బెంగళూరు: కేక్ అనగానే అందరికీ నోరూరుతుంది. ఏ శుభ సందర్భం వచ్చినా కేక్ ముక్కలు కావాల్సిందే. అంతగా కేక్ జీవితంలో భాగమైపోయింది. అయితే నాణేనికి మరోవైపు ఇంకోలా ఉంది. కేక్‌ల తయారీలో ఉపయోగించే పదార్థాల్లో క్యాన్సర్ కారక అంశాలు ఉన్నట్లు రాష్ట్ర ఆహార భద్రత, నాణ్యత శాఖ తెలిపింది. కొన్ని రోజుల క్రితమే గోబీ మంచరియా, కబాబ్, పానిపూరీ తయారీలో ఉపయోగించే పదార్థాల్లో క్యాన్సర్ కారకాలు ఉన్నట్లు గుర్తించినట్లు ఈ శాఖ హెచ్చరించడం తెలిసిందే. ఇప్పుడు కేక్‌ల గురించి ప్రకటన చేసింది. 12 రకాల కేక్‌లలో ముప్పు బెంగళూరులోని కొన్ని బేకరీలలో కేక్‌లను పరీక్షించగా 12 రకాల కేక్‌లల్లో క్యాన్సర్‌ను కలిగించే కారకాలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపింది. వాటిలో వాడే రంగులు ప్రమాదకరమని తెలిపింది. కేక్‌ల తయారీలో ఆహార భద్రత, నాణ్యత ప్రమాణాలను పాటించాలని బేకరీలకు ఆ సంబంధిత శాఖ హెచ్చరించింది. క్యాన్సరే కాకుండా శారీకర, మానసిక అనారోగ్యాలకూ కారణమవుతాయని తేల్చారు. రెడ్ వెల్వెట్, బ్లాక్ ఫారెస్ట్‌లో ఎక్కువ ఈ సమాచారంతో కేక్ ప్రియుల్లో కలవరం ఏర్పడింది. అందరూ కూడా ఎప్పుడో ఒకసారి కేక్‌ను తినేవారే. రెడ్ వెల్వెట్, బ్లాక్ ఫారెస్ట్ సహా అనేక కేకులు ఆకర్షణీయంగా ఉండేలా పలు రంగులను కలుపుతారు. ఈ కృత్రిమ రంగుల వల్ల అనారోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతాయి. ఈ కృత్రిమ రంగులను వాడకూడదని, ఆరోగ్య సూత్రాలను పాటించాలని పలుమార్లు దుకాణ యజమానులను హెచ్చరించినా వాటిని బేఖాతరు చేస్తున్నారని ఆహార భద్రత అధికారులు తెలిపారు. చాలా కేకుల్లో క్యాన్సర్ కారకాలను అధికారులు గుర్తించారు. ప్రధానంగా రెడ్వెల్వెట్ , బ్లాక్‌ఫారెస్ట్ కేకుల్లో ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: మంత్రి ప్రతి నెలా ఆహార పదార్థాలను పరీక్షలకు పంపించి నివేదికలు తీసుకుంటాం. హోటల్, బేకరీలల్లో నుంచి శాంపుల్స్‌ను సేకరించి తనిఖీలు చేస్తాం. ఆహారం నాణ్యతగా ఉండాలి. ఒకవేళ నాణ్యత పాటించకపోతే చర్యలు తీసుకుంటాం. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి అని వైద్యారోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూరావు చెప్పారు.ఏయే ప్రమాదకర రంగులు, వాటి పర్యవసానాలుఅలూర రెడ్– అలర్జీ, ఆస్తమా, జీర్ణక్రియ సమస్యలు, తలనొప్పి సన్‌సెట్ ఎల్లో ఎఫ్‌సీఎఫ్– అలర్జీ, హైపర్ యాక్టివిటీ, క్రోమోజోమ్ డ్యామేజీ, థైరాయిడ్ సమస్య, మానసిక ఒత్తిడి పొనుయా 4ఆర్– పిల్లల ప్రవర్తనలో మార్పులు, అలర్జీ, ఆస్తమా టార్టాజైన్ – చర్మంపై దద్దుర్లు, శ్వాసకోశ సమస్యలు, మైగ్రేన్ తలనొప్పి, ఒత్తిడి, నిరాశ, దృష్టి లోపాలు, నిద్రహీనత, గ్యా్రస్టిక్ సమస్య కార్మొసియాన్ – చర్మంపై వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, హైపర్ సెన్సిటివిటీ -
వైఎస్ జయమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్
సాక్షి, అమరావతి: క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి, బాధితులకు పూర్తిస్థాయిలో చికిత్స అందేలా కృషి చేసి, ప్రాణాపాయం నుంచి రక్షించేందుకు వైఎస్ జయమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ట్రస్టీ వైఎస్ రవీంద్రనాథ్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ (జీసీఎఫ్) సహకారంతో అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు రెవెన్యూ డివిజన్లోని అన్ని పీహెచ్‌సీలు, పలు విలేజ్ క్లినిక్‌ల పరిధిలో ఈ ఏడాది మే 27 నుంచి సోమవారం వరకు 60 క్యాంప్‌లు నిర్వహించినట్లు తెలిపారు. ఈ శిబిరాల్లో బ్రెస్ట్ క్యాన్సర్, సరై్వకల్ క్యాన్సర్, నోటి క్యాన్సర్ వంటి వ్యాధులను ముందుగానే గుర్తించే పలు పరీక్షలు చేసినట్లు తెలిపారు. 7,554 మందికి పరీక్షలు చేసినట్టు వెల్లడించారు. వీరిలో 2,314 మంది పురుషులు, 5,240 మంది మహిళలు ఉన్నారన్నారు. శిబిరాలకు వచ్చిన మహిళల్లో 1,764 మందికి మామోగ్రామ్, 2,285 మందికి పాప్‌స్మియర్ పరీక్షలు చేశామన్నారు. వ్యాధి లక్షణాలు కనిపించిన 100 మందికిపైగా ప్రజలను అరకు, పాడేరు ఆస్పత్రులకు పంపి, అక్కడ అ్రల్టాసౌండ్ స్కానింగ్, బయాప్సీ చేయించినట్లు వివరించారు. బయాప్సీలో వ్యాధి నిర్ధారణ అయిన వారిని హోమీ బాబా క్యాన్సర్ ఆస్పత్రికి తరలిస్తున్నట్లు చెప్పారు. క్యాన్సర్ ఉన్నట్లు అనుమానాలు ఉన్న 23 మందికి నేరుగా బయాప్సీ పరీక్షలు చేయిస్తున్నట్లు చెప్పారు. గత నాలుగు రోజులుగా పాడేరు ప్రభుత్వ ఆస్పత్రి, అరకు, చింతపల్లి ఏరియా ఆసుపత్రుల్లోని వైద్యులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ఉచిత స్క్రీనింగ్ శిబిరాలు నిర్వహించినట్లు తెలిపారు. నేడు అభినందన సభ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులను విజయవంతంగా నిర్వహించి, ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో భాగస్వాములైన వైఎస్ జయమ్మ మెమోరియల్ ట్రస్ట్, జీసీఎఫ్ బృందాలను బుధవారం సాయంత్రం 4 గంటలకు పాడేరు ప్రభుత్వ ఆస్పత్రిలో అభినందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఈ బృందాల సభ్యులకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు బహూకరించనున్నట్లు చెప్పారు. తాము చేపట్టిన ప్రజా సేవా కార్యక్రమానికి విశేష సహాయ సహకారాలు అందించిన జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవో, తదితరులను కూడా ఈ వేదికపై సత్కరించనున్నట్లు రవీంద్రనాథ్‌రెడ్డి ఆ ప్రకటనలో తెలిపారు. -
పల్లె కడుపున రాచపుండు!
సాక్షి, కామారెడ్డి: కేన్సర్ వ్యాధి రాచపుండులా మా రి పల్లెల్ని వణికిస్తోంది. ఏమవుతోందో తెలుసుకు నే లోపే ప్రాణాలను కబళిస్తోంది. కుటుంబాలను వీధిపాలు చేస్తోంది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామం కొన్నాళ్లుగా కేన్సర్ తో అల్లాడుతోంది. గత మూడేళ్లలోనే ఇక్కడ పన్నె ండు మంది కేన్సర్‌తో చనిపోయారని.. మరో పది మందికిపైగా చికిత్స పొందుతున్నారని గ్రామ స్తులు చెప్తున్నారు. ఈ వ్యాధి బారిన పడుతున్న వారిసంఖ్య మరింతగా పెరుగుతుండటం ఆందోళన రేపుతోంది. కొందరు బాధితులు మానసికంగా, శారీరకంగా దెబ్బతిని జీవచ్ఛవాల్లా బతుకుతున్నారు. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా కేన్సర్ బారినపడుతున్నారు. ఒక్క ఊరిలోనే ఇంతమంది కేన్సర్ బాధితులు ఉండటం ఆందోళన రేపుతోంది. వరుసగా మరణాలతో కలవరం మద్దికుంట గ్రామానికి చెందిన భారతి అనే మహిళ మూడేళ్ల కింద కేన్సర్ బారినపడి చికిత్స పొందుతూ మృతిచెందింది. తర్వాత ప్రమీల, లక్ష్మి, భూమవ్వ, భాగ్య, రాజవ్వ.. ఇలా మూడేళ్లలో పది మందికిపైగా కేన్సర్ బారినపడి చికిత్స పొందుతూ చనిపోయారు. వీరిలో కొందరు రొమ్ము కేన్సర్, గర్భాశయ ముఖద్వార (సర్వైకల్) కేన్సర్‌తో చనిపోయినట్టు గ్రామస్తులు చెప్తున్నారు. ఐదారుగురు మగవారు ఊపిరితిత్తుల (లంగ్స్) కేన్సర్, నోటి కేన్సర్లతో మరణించారు. మరికొందరు చికిత్స పొందుతున్నారు. ఓ మహిళకు రొమ్ము కేన్సర్ సమస్య తీవ్రం కావడంతో వైద్యులు ఆపరేషన్ చేసి ఆ భాగాన్ని తొలగించారు. మరో మహిళ ఇదే సమస్యతో చికిత్స పొందుతోంది. ఇంకో ఇద్దరు మహిళలు సర్వైకల్ కేన్సర్‌తో బాధపడుతున్నారు. అయితే పొరుగువారు, గ్రామస్తులు ఎలా స్పందిస్తారో, తమను ఎక్కడ దూరం పెడతారోనన్న ఆందోళనతో బాధితులు తాము కేన్సర్ బారినపడ్డ విషయాన్ని బయటికి వెల్లడించడం లేదు. గ్రామస్తుల్లో ఆందోళన ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు అప్పటి కలెక్టర్ యోగితారాణా జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లో మహిళలకు సర్వైకల్ కేన్సర్ పరీక్షలు చేయించారు. పదుల సంఖ్యలో బాధితులను గుర్తించారు. చాలా మందికి ఇది ప్రారంభ దశలోనే ఉండటంతో వైద్యం అందించారు. పరీక్షలు చేయించుకోనివారు, చేయించుకున్నా బయటికి చెప్పకుండా ఏవో మందులు వాడుతున్నవారు తర్వాత ఇబ్బందిపడుతున్నారు. ఇలా మద్దికుంటలో ఎక్కువ మంది బాధితులు కనిపిస్తున్నారు. తరచూ గ్రామంలో ఎవరో ఒకరు పెద్దాస్పత్రులకు వెళ్లి చికిత్స చేయించుకోవడం, వారిలో కొందరు చనిపోతుండటం చూసి గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో గ్రామంలో ప్రత్యేకంగా స్క్రీనింగ్ క్యాంప్ ఏర్పాటు చేసి పరీక్షించాలని.. బాధితులను గుర్తించి మెరుగైన చికిత్స అందించాలని కోరుతున్నారు. ఎంతో అవస్థ పడి కోలుకుంటున్నా.. ఏడాది కింద కడుపులో నొప్పి మొదలైంది. ఆర్ఎంపీ వద్ద చూపించుకుని, మందులు వాడినా తగ్గలేదు. కామారెడ్డిలోని ఆస్పత్రికి వెళ్తే.. స్కానింగ్ చేసి కడుపులో కేన్సర్ సమస్య ఉందని చెప్పి హైదరాబాద్‌కు పంపించారు. బసవతారకం ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్నాను. ఆరోగ్యశ్రీ పథకం కింద ఆపరేషన్ చేసి గడ్డను తొలగించారు. మొన్నటి దాకా కెమో థెరపీ చేశారు. ఏడాది పాటు ఎంతో అవస్థ పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. పరీక్షలు, మందులు, రాకపోకలకు రూ.2 లక్షల దాకా ఖర్చయ్యాయి. – కుమ్మరి లత, మద్దికుంట, కామారెడ్డి జిల్లా కేన్సర్‌పై అవగాహన కల్పిస్తున్నాం నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) గురించి అవగాహన కల్పించేందుకు తరచూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి ఆయా వ్యాధులపై అవగాహన కల్పిస్తున్నారు. ఎవరికైనా ఇబ్బంది ఉందని తెలిస్తే తగిన వైద్యసేవలు అందిస్తున్నాం. ఇటీవల దోమకొండ, భిక్కనూరులలో క్యాంపులు నిర్వహించాం. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పాలియేటివ్ థెరపీ ఏర్పాటు చేశాం. ఆరు బెడ్లతో సేవలు అందిస్తున్నాం. మద్దికుంటకు సంబంధించిన కేసులను పరిశీలించి, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. – చంద్రశేఖర్, డిప్యూటీ డీఎంహెచ్‌వో, కామారెడ్డి -
World Health Organization: భారత్‌లో 9 లక్షల క్యాన్సర్ మరణాలు
న్యూఢిల్లీ: భారత్‌ను క్యాన్సర్ మహమ్మారి కబళిస్తున్న తీరును ప్రపంచ ఆరోగ్య సంస్థ తన తాజా గణాంకాల్లో వెల్లడించింది. ది ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ గణాంకాల ప్రకారం 2022లో భారత్‌లో 14.1 లక్షల క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. క్యాన్సర్ కారణంగా 9.1 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. పురుషల్లో పెదవులు, నోటి, ఊపిరితిత్తుల క్యాన్సర్లు సర్వసాధారణమయ్యాయి. రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు మహిళల్లో ఎక్కువయ్యాయి. మొత్తం కొత్త కేసుల్లో 27 శాతం బ్రెస్ట్, 18 శాతం సెరి్వక్స్ యుటెరీ క్యాన్సర్లు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ సోకి ఐదేళ్లుగా బాధపడుతున్న వారి సంఖ్య 5.3 కోట్లకు చేరిందని నివేదికలో పేర్కొన్నారు. -
మహమ్మారికి మందు
గుంటూరు మెడికల్: పూర్వం రాచపుండుగా పిలువబడే క్యాన్సర్ వ్యాధి వస్తే వారికి మరణమే శరణ్యం. నేడు ఆధునిక వైద్య విజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందటంతో క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేస్తున్నారు. వ్యాధి ఎలా సోకుతుంది, ఎలా గుర్తించాలి తదితర ప్రాథమిక విషయాలపై అవగాహన ఏర్పరచి ప్రజల్లో క్యాన్సర్ పట్ల ఉన్న అపోహలు పోగొట్టేందుకు 2000 ఫిబ్రవరి 4న ప్యారిస్‌లో ప్రపంచ దేశాల క్యాన్సర్ వైద్యుల సమావేశం జరిగింది. నాటి నుంచి ప్రతి ఏడాదీ ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 4 వరల్డ్ క్యాన్సర్ డేగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి ’అందిస్తున్న ప్రత్యేక కథనం. రాష్ట్రంలో మొదటి క్యాన్సర్ సెంటర్ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్యాన్సర్ వైద్య సేవలను అందించేందుకు ప్రభుత్వం, నాట్కో ట్రస్టు సంయుక్త ఆధ్వర్యంలో సుమారు రూ.45 కోట్లతో అత్యాధునిక వైద్య సౌకర్యాలతో వంద పడకలతో క్యాన్సర్ వార్డు నిర్మించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 1–7–2020న వర్చువల్ విధానంలో నన్నపనేని లోకాదిత్యుడు, సీతారావమ్మ స్మారక క్యాన్సర్ సెంటర్‌ను ప్రారంభించారు. అంతర్జాతీయ వైద్య సౌకర్యాలతో ప్రత్యేకంగా క్యాన్సర్ వార్డు నిర్మించిన మొట్టమొదటి ఆస్పత్రిగా గుంటూరు జీజీహెచ్ రికార్డు సృష్టించింది. క్యాన్సర్ రోగులకు తొలి రిఫరల్ ఆస్పత్రిగా కూడా గుంటూరు జీజీహెచ్ రికార్డుల్లోకి ఎక్కింది. ఆపరేషన్ల కోసం ప్రత్యేకంగా రూ.60లక్షలతో థియేటర్స్ నిర్మించారు. జీజీహెచ్ క్యాన్సర్ వార్డు ప్రత్యేకతలు ప్రపంచస్థాయి వైద్య ప్రమాణాలతో ఐదు అంతస్తుల్లో క్యాన్సర్ సెంటర్ నిర్మాణం జరిగింది. రేడియేషన్ ఆంకాలజి, మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, న్యూక్లియర్ మెడిసిన్ డిపార్టుమెంట్, రేడియోథెరఫీ డిపార్టుమెంట్, సర్జికల్ ఐసీయూ, మెడికల్ ఐసీయూ గదులు ఏర్పాటు చేశారు. ఆధునిక వైద్య పరికరాలు క్యాన్సర్ రోగులకు ఆధునిక వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం కోట్ల రూపాయల ఖరీదు చేసే వైద్య పరికరాలను జీజీహెచ్‌కు అందజేసింది. సుమారు రూ.15 కోట్లు ఖరీదు చేసే లీనియర్ యాక్సిలేటర్ వైద్య పరికరాన్ని, రూ.2 కోట్లు ఖరీదు చేసే బ్రాకీథెరపీ, రూ.5.50 కోట్ల సీటీ స్టిమ్యులేటర్ వైద్య పరికరాలు ప్రభుత్వం విదేశాల నుంచి తెప్పించింది. సుమారు రూ.15 కోట్లు ఖరీదు చేసే పెట్ సీటీ వైద్య పరికరాన్ని సైతం మంజూరు చేసింది. త్వరలోనే వైద్య పరికరం ఆస్పత్రికి రానుంది. నాట్కో ట్రస్ట్ కోటి రూపాయలతో మామోగ్రామ్ వైద్య పరికరం అందుబాటులోకి తెచ్చింది. అన్ని రకాల ఆపరేషన్లు చేసేందుకు కోటి రూపాయలతో మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ నిర్మాణం చేశారు. అందుబాటులో ఆధునిక వైద్యం క్యాన్సర్‌ను నయం చేసే ఆధునిక వైద్య పద్ధతులు గుంటూరు జీజీహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాన్సర్ నివారణే లక్ష్యంగా వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు. మంత్రి విడదల రజిని, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టి.కృష్ణబాబు, డీఎంఈ డాక్టర్ నరసింహం, జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. – డాక్టర్ ఏకుల కిరణ్‌కుమార్, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ 100 పడకలతో మరో క్యాన్సర్ భవనం నాట్కో క్యాన్సర్ సెంటర్లో అందుతున్న వైద్యసేవలను ప్రభుత్వం గుర్తించి లెవల్–1 క్యాన్సర్ సెంటర్‌గా అప్‌గ్రేడ్ చేసింది. ప్రభుత్వం ఇటీవల కాలంలో 1250 గజాల స్థలాన్ని నాట్కో ట్రస్టుకు కేటాయించింది. ఆ స్థలంలో సుమారు రూ.12 కోట్లతో 100 పడకలతో మరో భవన నిర్మించేందుకు రంగం సిద్ధం చేస్తున్నాం. ప్రభుత్వానికి నాట్కో ట్రస్ట్ ఎల్లప్పుడు సహాయ సహకారాలు అందిస్తోంది. – నన్నపనేని సదాశివరావు, నాట్కో ట్రస్ట్ వైస్ చైర్మన్ ఉచితంగా క్యాన్సర్ మందులు క్యాన్సర్ రోగులకు నాట్కో ట్రస్ట్ ప్రతి ఏడాదీ రూ.2 కోట్ల ఖరీదు చేసే మందులు ఉచితంగా అందిస్తుంది. రోగులకు మెరుగైన వైద్యం, కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించేందుకు ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ వీసీ నన్నపనేని కార్యక్రమాలు చేస్తున్నారు. – యడ్లపాటి అశోక్‌కుమార్, నాట్కో ట్రస్ట్ కోఆర్డినేటర్ -
క్యాన్సర్ నుంచి బయటపడొచ్చు.. సైంటిస్టులు కనిపెట్టిన కొత్త రీసెర్చ్
క్యాన్సర్.. ఈ పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకంటే ఇదో ప్రాణాంతక వ్యాధి. సరైన సమయంలో ట్రీట్మెంట్ తీసుకోకపోతే ప్రాణాలు పోతాయి.అయితే క్యాన్సర్ నుంచి బయట పడేందుకు సైంటిస్టులు ఇప్పుడో కొత్త మార్గాన్ని ఆవిష్కరించారు. క్యాన్సర్ కణాల ఎదుగుదలకు, వ్యాప్తికి సాయపడే పోషకాల స్థానంలో ఉత్తుత్తి పోషకాలను అందిస్తే వ్యాధి వ్యాప్తి నిలిచిపోతుందని, కణితి సైజు తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు నిరూపించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ బర్న్‌హామ్ ప్రీబిస్ మెడికల్ డిస్కవరీ ఇన్స్టిట్యూట్ జరిపిన ప్రయోగం ప్రకారం..ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కణితి ఎదుగుదలకు, వ్యాధి వ్యాప్తికి కారణమయ్యే పోషకాల స్థానంలో డమ్మీ పోషకాలు ఇవ్వడం ద్వారా క్యాన్సర్‌ను నియంత్రించవచ్చు. క్యాన్సర్లలో ఎన్నో రకాలుంటాయన్నది తెలిసిందే. క్లోమగ్రంథి (పాంక్రియాటిక్)కి వచ్చే క్యాన్సర్ కొంచెం ముదురుటైపు. దీని బారిన పడ్డవారు కోలుకోవడం అసాధారణమే. ఏటా దాదాపు 14 లక్షల మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. సాధారణంగా 35-39, 85-89 ఏళ్ల మధ్య వయసు వారిలో ఈ క్యాన్సర్ ఎక్కువ. క్లోమ గ్రంథి క్యాన్సర్ వచ్చిన వారిలో మూడు-మూడున్నరేళ్లకు మించి జీవించి ఉండేవారు పది శాతానికి మించి లేరని పరిశోధనలో వెల్లడైంది. జన్యు కారకాలు, వయస్సు, జీవనశైలి కారణంగా ఈ క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్లో అదే కీలకం క్లోమగ్రంథి క్యాన్సర్ సాధారణంగా గ్లుటామైన్ అనే పోషకంపై ఎక్కువగా అధారపడి ఉంటుంది. కాబట్టి దీన్ని అందకుండా చేస్తే క్యాన్సర్ వ్యాప్తి చెందకుండా ఉంటుంది. గ్లుటమైన్ అందుబాటులో లేనప్పుడు క్యాన్సర్ కణాలు ఆస్పరాజైన్‌తో సహా ఇతర పోషకాలపై కాబట్టి ఈ రెండు పోషకాలు అందకుండా చేస్తే వ్యాధిని కట్టడి చేయవచ్చు. ఇందుకోసం శాస్త్రవేత్తలు అచ్చం గ్లుటమైన్ మాదిరిగానే ఉండే 6-డయాజో-5-ఆక్సో-ఎల్-నార్లూసిన్ (DON)ను, ఇప్పటికే ఊపిరితిత్తుల క్యాన్సర్ చికిత్సకు ఉపయోగిస్తున్న L-ఆస్పరాగినేస్లను కలిపి ఎలుకలపై ప్రయోగాలు చేశారు. L-ఆస్పరాగినేస్ అనేది ఆస్పరాజైన్ను విచ్ఛిన్నం చేసే కీమోథెరపీ ఔషధం. ఇది క్యాన్సర్ కణాలను వృద్ది చెందకుండా అడ్డుకుంటుంది. రెండింటినీ కలిపి వాడినప్పుడు ఎలుకల్లోని క్యాన్సర్ కణితి సైజు తగ్గిపోయినట్లు.. వ్యాధి వ్యాప్తి కూడా ఎక్కువ జరగనట్లు తేలింది. క్యాన్సర్ కణాల ప్రొటీన్ ఉత్పత్తికి, కొత్త కణాల తయారీకి ఆస్పరాజైన్ అవసరం. DONను ఇప్పటికే ఊపరితిత్తుల క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఉపయోగిస్తున్నారు కానీ... రెండింటినీ కలిపి వాడటం ఇదే మొదటిసారి. ఇప్పుడు ఇదే పద్ధతిని అంటే రెండు రకాల డమ్మీ పోషకాలను కలిపి వాడటం క్లోమగ్రంథి క్యాన్సర్ చికిత్సకూ వాడవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సైలంట్ కిల్లర్... ప్యాంక్రియాటిక్ క్యాన్సర్.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వెలుగు చూస్తున్న క్యాన్సర్లలో ఇది కూడా ఒకటి.అలసట, ఆకలి లేకపోవడం,ఉబ్బినట్లు అనిపించడం వంటి అజీర్ణం లక్షణాలు,అకస్మాత్తుగా బరువు తగ్గడం, శరీరంలో రక్తం గడ్డ కట్టడం వెన్ను నొప్పి, కామెర్లు, విపరీతంగా కడుపునొప్పి వంటివన్నీ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లక్షణాలు. ధూమపానం, మధుమేహం ఎక్కువగా సేవించడం, కుటుంబంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇతర క్యాన్సర్ల మాదిరిగానే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ క్లోమ గ్రంథిలో కణాల అసాధారణ పెరుగుదల వల్ల వస్తుంది. ప్యాంక్రియాస్ (క్లోమం) కడుపులో ముఖ్యమైన భాగం. ఇది చిన్న పేగు దగ్గర ఉండే పొడవైన గ్రంథి.ఇది జీర్ణక్రియకు సహాయపడే పదార్థాలు లేదా ఎంజైమ్‌లను ఉత్పత్తి చేయడంలో సహాయపడటమే కాకుండా, రక్తప్రవాహంలో చక్కెర పరిమాణాన్ని నియంత్రించే హార్మోన్లను విడుదల చేయడంలో కూడా సహాయపడుతుంది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ను సైలెంట్ కిల్లర్ క్యాన్సర్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది వ్యాధి తీవ్రం అయ్యేవరకు ఎలాంటి లక్షణాలను చూపించదు. ఈ రకమైన క్యాన్సర్ చాలా తొందరగా శరీరంలోని ఇతర అవయవాలకి వ్యాపిస్తుంది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లు తరచుగా పొత్తికడుపు, కాలేయానికి వ్యాప్తి చెందుతాయి. అంతేకాకుండా ఊపిరితిత్తులు, ఎముకలు, మెదడుతో పాటి ఇతర అవయవాలకు కూడా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. -
కేన్సర్ వచ్చిందేమోనని.. యువకుడి ఆత్మహత్య
హైదరాబాద్: తనకు కేన్సర్ వచ్చిందేమోననే భయంతో ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జీడిమెట్ల పీఎస్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ పవన్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చింతల్‌కు చెందిన సత్యనారాయణ కుమారుడు శరత్(19) స్థానిక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మూడు రోజుల క్రితం అతడికి రక్తంతో కూడిన వాంతి అయ్యింది. దీంతో తనకు కేన్సర్ సోకిందేమోనని శరత్ ఆందోళనకు గురైన శరత్ ఈ విషయాన్ని తల్లి లక్ష్మిభాయికి చెప్పగా, తెలపగా వినాయక చవితి మరుసటి రోజు మంచి అస్పత్రిలో పరీక్షలు చేయిస్తానని చెప్పింది. అయినా శరత్ తనలో తాను మదన పడేవాడు. సోమవారం లక్ష్మిబాయి వినాయకుడి పూజ నిమిత్తం మండపం వద్దకు వెళ్లింది. రాత్రి 7 గంటలకు ఆమెకు ఫోన్ చేసిన శరత్ త్వరగా ఇంటికి రావాలని చెప్పి ఫోన్ పెట్టేశాడు. లక్ష్మి ఇంటికి చేరుకోగానే తలుపులు మూసి ఉన్నాయి. తలుపులు తెరచి లోపలికి వెళ్లి చూడగా శరత్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడు. స్థానికుల సహాయంతో అతడిని కిందకు దింపి చూడగా అప్పటికే మృతిచెంది ఉన్నాడు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ఒంటిరితనాన్ని భరించలేకపోయాను.. చనిపోతాననుకున్నా : హీరోయిన్
యమదొంగ సినిమాతో టాలీవుడ్‌కు పరిచమైన మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ తర్వాత హోమం, కృష్ణార్జున , కింగ్, చింతకాయల రవి వంటి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్న సమయంలోనే క్యాన్సర్ బారిన పడింది. ఒక్కసారి కాదు రెండుసార్లు క్యాన్సర్ బారిన పడి పోరాడి గెలిచింది. ఆరోగ్యం పూర్తిగా కోలుకొని తిరిగి సినిమాల్లో నటిస్తున్న సమయంలో ‘విటిలిగో’ అనే అరుదైన వ్యాధి బారిన పడింది. ప్రస్తుతం దాన్నుంచి కోలుకుంటుంది. తాజాగా ఓ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తాను అనుభవించిన మానసిక క్షోభను బయటపెట్టింది. నాకు క్యాన్సర్ సోకినప్పుడు నా ఫ్రెండ్స్, సన్నిహితులతో సమస్య గురించి చెప్పుకున్నాను. వారు చాలా ధైర్యం ఇచ్చారు. కానీ నాకు 'విటిలిగో' అనే ఆటో ఇమ్యూన్ వ్యాధి బారిన పడ్డానని తెలియగానే ఒంటరిగా కూర్చుని ఏడ్చేదాన్ని. ఎప్పుడూ కెమెరా ముందు ఉండే నేను ఇంటరితనాన్ని భరించలేకపోయాను. చనిపోతానేమో అని భయమేసింది. అందుకే ఈ సమస్యను అందరికీ తెలిసేలా చేశాను. దీంతో కాస్త రిలీఫ్ అనిపించింది. ఎవరైనా నా శరీరంపై ఆ మచ్చలేంటని అడిగితే నా ఇన్‌స్టా చూడమని నిర్మొహమాటంగా చెబుతున్నా అంటూ చెప్పుకొచ్చింది. -
షాకింగ్ వివరాలు.. దేశంలో క్యాన్సర్ విజృంభణ.. 2022లో 8 లక్షల మంది మృతి
సాక్షి, అమరావతి: దేశంలో క్యాన్సర్ మహమ్మారి విజృంభిస్తోంది. గత మూడేళ్లలో (2020–22) దేశంలో 42.88 లక్షల మంది క్యాన్సర్ బారినపడ్డారు. మృతుల సంఖ్య కూడా ఏటా పెరుగుతోంది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్‌లో ఈ వివరాలు పొందుపరిచింది. 2020 నుంచి 2022 మధ్య రాష్ట్రాలవారీగా ఐసీఎంఆర్ వెల్లడించిన క్యాన్సర్ కేసులు, మరణాలను ఇటీవల కేంద్ర వైద్య శాఖ మంత్రి మాండవీయా లోక్‌సభలో వివరించారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. దేశవ్యాప్తంగా 2020లో 13,92,179 కేసులు నమోదవగా 2021లో 14,26,447 కేసులు, 2022లో 14,61,427 కేసులు నమోదయ్యాయి. ఇదే కాలంలో మరణాల సంఖ్య కూడా భారీగానే ఉంది. 2020లో దేశవ్యాప్తంగా 7.70 లక్షలు, 2021లో 7.89 లక్షలు, 2022లో 8.08 లక్షల మరణాలు నమోదయ్యాయి. కేసులు, మరణాలు ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా ఉన్నాయి. 2022లో ఉత్తరప్రదేశ్‌లో 2,10,958 కేసులు, 1,16,818 మరణాలు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. ఏపీలో 73,536 క్యాన్సర్ కేసులు నమోదవగా, 40,307 మంది మరణించినట్లు ఆ గణాంకాలు తెలిపాయి. అత్యల్పంగా లక్షద్వీప్‌లో 28 కేసులు, 14 మరణాలు నమోదయ్యాయి. క్యాన్సర్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి రాష్ట్రంలో క్యాన్సర్ వ్యాధి నియంత్రణ, చికత్సకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలోకి చేర్చింది. ఇప్పటివరకు క్యాన్సర్ చికిత్సలకే రూ. వెయ్యి కోట్లకు పైగా ఖర్చు చేశారు. మరోవైపు ప్రభుత్వ రంగంలో క్యాన్సర్ చికిత్స సదుపాయాలను మెరుగుపరుస్తోంది. దీనివల్ల క్యాన్సర్ బాధితులు వ్యయప్రయాసలకోర్చి వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన పని ఉండదు. ఇందులో భాగంగా తొలి దశలో ప్రస్తుతం ఉన్న ఏడు ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో క్యాన్సర్ చికిత్స సదుపాయాల మెరుగుపరుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే రూ.119.58 కోట్లు కేటాయించింది. వ్యాధి నియంత్రణ చర్యల్లో భాగంగా నోటిఫైడ్ జబ్బుల జాబితాలోకి క్యాన్సర్‌ను చేర్చింది. ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తించి, ప్రాణాపాయ పరిస్థితులను తప్పించడానికి సామూహిక క్యాన్సర్ స్క్రీనింగ్ చేపడుతోంది. -
క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల్లో... గేమ్ చేంజర్
సాక్షి, నేషనల్ డెస్క్: క్యాన్సర్ ప్రాణాంతక రోగమని, మొదట్లోనే గుర్తించకుంటే బతకడం కష్టమని అందరికీ తెలుసు. కొన్నిసార్లు వ్యాధిని గుర్తించేలోగానే పరిస్థితి చేయి దాటిపోతుంది. కొన్నిరకాల క్యాన్సర్లను కనిపెట్టేందుకు పరీక్షలు కూడా లేవు. అయితే ఒకే ఒక రక్తపరీక్షతో చాలారకాల క్యాన్సర్లను ఇట్టే కనిపెట్టేయొచ్చంటే? హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటాం కదా. సరిగ్గా అలాంటి మల్టీ క్యాన్సర్ అర్లీ డిటెక్షన్ (ఎంసీఈడీ) రక్తపరీక్షను సైంటిస్టులు కనిపెట్టేశారు. ఎలాంటి లక్షణాలూ కనిపించని క్యాన్సర్లను కూడా ఈ పరీక్ష ద్వారా నిర్ధారించగలగడం ఇందులో పెద్ద విశేషం. ఊపిరి పీల్చుకోదగ్గ విషయం కూడా! ఒకరకంగా ఎంసీఈడీ పరీక్షను వైద్యశాస్త్రంలో, ముఖ్యంగా క్యాన్సర్ నిర్ధారణలో గేమ్ చేంజర్‌గా చెప్పొచ్చు. క్యాన్సర్ స్క్రీనింగ్‌లో కొత్త విధానాలను కనుగొనేందుకు కృషి చేస్తున్న గ్రెయిల్ అనే హెల్త్ కేర్ సంస్థ ఈ సరికొత్త పరీక్ష విధానాన్ని అభివృద్ధి చేసింది. అధ్యయనంలో భాగంగా ఈ సంస్థ 6,662 మంది వ్యక్తులపై ఈ పరీక్ష నిర్వహించింది. వీళ్లంతా 50, అంతకన్నా ఎక్కువ వయసు వ్యక్తులే కావడం గమనార్హం. ప్యారిస్‌లో ఇటీవల జరిగిన యూరోపియన్ సొసైటీ ఫర్ మెడికల్ అంకాలజీ (ఈస్‌ఎంఓ) కాంగ్రెస్‌లో గ్రెయిల్ తమ పరిశోధన వివరాలను సమర్పించింది. ఆరువేల పై చిలుకు మందిపై పరీక్ష నిర్వహిస్తే వారిలో దాదాపు ఒక శాతం మందికి క్యాన్సర్ ఉన్నట్టు తేలింది. వీటిలో కొన్ని ఇప్పటిదాకా పరీక్షలకు దొరకని క్యాన్సర్ రకాలు కూడా ఉండటం విశేషం. దీన్ని క్యాన్సర్ పరిశోధనలను సమూలంగా మార్చివేసే పరీక్ష విధానంగా భావిస్తున్నారు. ఇప్పటిదాకా అందుబాటులో ఉన్న క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష అయిన గాలెరీ (ఎంసీఈడీ–ఈ)ని మరింతగా ఆధునీకరించి వ్యాధిని మరింత కచ్చితంగా గుర్తించేలా రూపొందించారు. గాలెరీ పరీక్ష ద్వారా పదుల సంఖ్యలో క్యాన్సర్లను గుర్తించే వీలుంది. వాటిలో లక్షణాలు కనపడని క్యాన్సర్లు కూడా ఉన్నాయి. అయితే ఎంసీఈడీ పరీక్ష పద్ధతిలో దాదాపు రెట్టింపు స్థాయిలో క్యాన్సర్లను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించే వీలుంది. గాలెరీ పరీక్ష ద్వారానే కాలేయం, చిన్న పేగు, యుటెరస్, పాంక్రియాటిక్ స్టేజ్–2, బోన్ క్యాన్సర్ వంటివాటిని లక్షణాలు లేని స్థాయిలోనే గుర్తించే వీలుంది. అయితే కొత్త పద్ధతి మరిన్ని రకాల క్యాన్సర్లను మరింత కచ్చితత్వంతో గుర్తిస్తుంది. కొత్త పరీక్ష (ఎంసీఈడీ)లో 92 మందిలో క్యాన్సర్ లక్షణాలను గుర్తించారు. పైగా 97 శాతం కచ్చితత్వముంది. ఇలా గుర్తించిన 36 రకాల క్యాన్సర్లలో 71 శాతం క్యాన్సర్లను నిర్ధారించే అవకాశం ఇప్పటిదాకా ఉండేది కాదు. ప్రాథమిక దశలోనే క్యాన్సర్‌ను గుర్తించడం వల్ల చికిత్సా విధానంలో కూడా పెను మార్పులు రానున్నాయి. అయితే ఇది క్లినికల్‌గా ఇంకా అందుబాటులోకి రావాల్సి ఉంది. ఇదీ చదవండి: శాస్త్రవేత్తలను సైతం కలవరపాటుకు గురిచేసిన విచిత్ర జీవి: వీడియో వైరల్ -
AP: రాష్ట్రంలోనే క్యాన్సర్‌కు చెక్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో క్యాన్సర్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వ చర్యలు బాగున్నాయని ప్రముఖ వైద్య నిపుణులు, రాష్ట్ర ప్రభుత్వ క్యాన్సర్ కేర్ సలహాదారు నోరి దత్తాత్రేయుడు ప్రశంసించారు. క్యాన్సర్ చికిత్స కోసం రాష్ట్రం విడిచి వెళ్లాల్సిన అవసరం లేకుండా చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నారని కొనియాడారు. ఈ మేరకు రాష్ట్రంలో క్యాన్సర్ కట్టడికి మెరుగైన చర్యలు చేపడుతున్నారని అభినందించారు. ఈ మేరకు నోరి దత్తాత్రేయుడు ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. క్యాన్సర్ వ్యాధికి చికిత్స అందించడంలో ప్రపంచంలోనే గొప్ప వైద్యుడిగా పేరు తెచ్చుకున్న నోరి దత్తాత్రేయుడు చెబుతున్న వివరాలు ఆయన మాటల్లోనే.. సీఎం జగన్ ఒక్కటే మాట చెప్పారు.. గతేడాది సీఎం జగన్‌ను కలిశాను. ఈ సందర్భంగా ‘రాష్ట్ర ప్రజలు క్యాన్సర్ చికిత్సకు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన పనిలేకుండా ఇక్కడ ఏ విధమైన చర్యలు తీసుకోవాలో సూచించండి’ అని నాతో అన్నారు. దీంతో రాష్ట్ర వైద్య శాఖతో కలిసి క్యాన్సర్ చికిత్స వనరులను బలోపేతం చేశాం. ఇంకోవైపు వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచడం, ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తించడం కోసం స్క్రీనింగ్ నిర్వహించడం వంటి వివిధ అంశాలపై ప్రణాళిక రూపొందించాం. అమెరికా తరహాలో నోటిఫైడ్ జబ్బుల జాబితాలో.. క్యాన్సర్‌ను సమర్థవంతంగా కట్టడి చేసేందుకు ఈ వ్యాధిని ప్రభుత్వం నోటిఫైడ్ జబ్బుల జాబితాలో చేర్చింది. దీంతో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్‌లలో ఎక్కడ కొత్తగా క్యాన్సర్ కేసును గుర్తించినా, చికిత్స అందించినా వైద్య శాఖకు తప్పనిసరిగా రిపోర్ట్ చేయాల్సి ఉంది. ఈ విధానం వల్ల ప్రభుత్వం వద్ద రాష్ట్రంలో నమోదయ్యే క్యాన్సర్ కేసుల సమాచారం పక్కాగా ఉంటుంది. తద్వారా కేసుల నమోదుకు అనుగుణంగా వైద్య సదుపాయాల కల్పన, నియంత్రణ చర్యలకు ఆస్కారం ఉంటుంది. అమెరికా వంటి దేశాల్లో ఈ తరహా విధానాన్ని అవలంబిస్తున్నారు. ఏటా 1.3 మిలియన్ క్యాన్సర్ కేసులు.. దేశంలో ఏటా 1.3 మిలియన్ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. ఇందులో 60 శాతం కేసులు నియంత్రించదగ్గవే. ప్రజల్లో వ్యాధి పట్ల అవగాహన పెంచితే నియంత్రణ సాధ్యమవుతుంది. మరో 20 శాతం కేసులను స్క్రీనింగ్ ద్వారా తొలి దశలోనే గుర్తించవచ్చు. పెద్ద ఎత్తున స్క్రీనింగ్ నిర్వహించడం ద్వారా తొలి దశలోనే క్యాన్సర్ కేసులు గుర్తించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుండటం శుభపరిణామం. క్యాన్సర్‌పై విజయమే లక్ష్యం – వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి రజని క్యాన్సర్‌పై పూర్తి స్థాయి విజయం సాధించడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ పనిచేస్తున్నారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని వైద్య, ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో సోమవారం మంత్రితో ఏపీ ప్రభుత్వ క్యాన్సర్ కేర్ సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి రజని మాట్లాడుతూ.. వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా తొలి దశలోనే క్యాన్సర్ కేసులను గుర్తించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రజలకు వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని చెప్పారు. క్యాన్సర్ స్క్రీనింగ్‌పై గ్రామస్థాయి సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామన్నారు. త్వరలో తీసుకొస్తున్న ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా గ్రామ స్థాయిలోనే క్యాన్సర్‌కు విస్తృత స్క్రీనింగ్ చేపడతామని తెలిపారు. క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తిస్తే సులభంగా నయం చేయవచ్చన్నారు. ఈ సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్ కుమార్ పాల్గొన్నారు. క్యాన్సర్ చికిత్సకు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో స్విమ్స్.. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్)ను క్యాన్సర్ వ్యాధి చికిత్స, పరిశోధనకు సంబంధించి ప్రపంచ స్థాయి ప్రమాణాలతో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. మరోవైపు రాష్ట్రంలో రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రల్లో పూర్తి స్థాయిలో సమగ్ర క్యాన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఈ చర్యలతో క్యాన్సర్ వైద్యాన్ని ప్రభుత్వం వేరే స్థాయికి తీసుకెళ్లబోతోంది. నేషనల్ క్యాన్సర్ గ్రిడ్‌లోకి ఏపీ.. ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందిన క్యాన్సర్ రోగుల డేటా ఆధారంగా రాష్ట్రంలో ఏ జిల్లాలో..ఏ రకం క్యాన్సర్ కేసులు అధికంగా నమోదవుతున్నాయో వైద్య శాఖ అధ్యయనం చేసింది. మరోవైపు నోటిఫైడ్ జబ్బుల జాబితాలో క్యాన్సర్‌ను చేర్చడం ద్వారా డేటాను సేకరిస్తోంది. ఈ డేటాను నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ (ఎన్సీజీ)తో పంచుకుంటోంది. అలాగే అక్కడి డేటాను మనం పొందేలా ఎన్సీజీలోకి ఏపీ చేరింది. ఇది ఎంతో ఉపయుక్తం. ఏఎంఆర్‌పై ప్రత్యేక కార్యాచరణ యాంటీబయోటిక్స్ అతి వినియోగంతో శరీరంలో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) పెరిగి ప్రాణాంతక వ్యాధులు సోకిన సమయంలో మందులకు జబ్బు లొంగని పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఏఎంఆర్‌పై ప్రత్యేక కార్యాచరణను రాష్ట్ర వైద్య శాఖ రూపొందించింది. ప్రపంచ నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుని అధికారులు ముందుకు వెళుతున్నారు. 5 నుంచి 10 రోజుల్లో తగ్గిపోయే వైరల్ ఫీవర్స్‌కు కూడా అవసరం లేకపోయినా యాంటీబయోటిక్స్ వాడుతున్నారు. అయితే వీటిని ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి.. ఎందుకు వాడాలి.. అని ప్రజలను చైతన్యపరిచేలా కార్యక్రమాలు చేపట్టడం హర్షణీయం. -
AP: క్యాన్సర్‌కు కళ్లెం
క్యాన్సర్ రోగులకు మెరుగైన వైద్యాన్ని ఇకపై రాష్ట్రంలోనే అందుబాటులోకి తేవడంతో పాటు, వ్యాధి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం బ్లూప్రింట్ సిద్ధంచేసింది. రాష్ట్ర విభజనతో క్యాన్సర్ చికిత్స మౌలిక సదుపాయాలను ఏపీ కోల్పోయింది. అలాగే, గత టీడీపీ ప్రభుత్వం వైద్య రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది.దీంతో క్యాన్సర్ వైద్యానికి రోగులు ఇరుగు పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సిన దుస్థితి. ఈ నేపథ్యంలో.. ప్రజారోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వ రంగంలోనే క్యాన్సర్‌కు మంచి వైద్యం అందించాలని సంకల్పించారు. ఇందుకోసం ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడుని ప్రభుత్వ సలహా దారుగా నియమించి ఆయన సలహాలు, సూచనల మేరకు చర్యలు చేపడుతున్నారు. – సాక్షి, అమరావతి మెజారిటీ శాతం ప్రైవేట్ ఆసుపత్రులకే.. ముందుగా.. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను సీఎం జగన్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చారు. ఇందుకోసం 2019 నుంచి క్యాన్సర్ చికిత్సకు రూ.926 కోట్లు ఖర్చుచేసింది. ఈ మొత్తంలో 86 శాతం ప్రైవేట్ ఆసుపత్రులకే చేరింది. ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక వసతులు సరిగ్గా లేకపోవడంతోనే బాధితులు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తోందని ప్రభుత్వం గుర్తించింది. దీంతో ప్రభుత్వ రంగంలోనే క్యాన్సర్ వైద్యాన్ని బలోపేతానికి చర్యలు తీసుకుంటోంది. గుంటూరులోనే ఆధునిక యంత్రం రాష్ట్రవ్యాప్తంగా 11 ప్రభుత్వ బోధనాసుపత్రులు ఉన్నాయి. వీటిలో కేవలం గుంటూరు జీజీహెచ్‌లో మాత్రమే క్యాన్సర్ చికిత్సకు వినియోగించే అధునాతన లీనియర్ యాక్సిలేటర్ మిషన్‌తో కూడిన ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాకే ఇది అందుబాటులోకి వచ్చింది. నాలుగుచోట్ల పాత కోబాల్ట్ మెషీన్ సహాయంతో క్యాన్సర్ చికిత్స అందిస్తుండగా.. మిగిలిన కాలేజీల్లో కేవలం డే–కేర్ కీమోథెరపీ మాత్రమే అందుతోంది. దీంతో బోధనాసుపత్రుల్లో వసతుల కల్పనపై ముఖ్యమంత్రి దృష్టిసారించారు. ఈ క్రమంలో రెండు లీనియర్ యాక్సిలేటర్ మిషన్లను కొనుగోలు చేస్తున్నారు. ఇటీవలేరాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తిరుపతిలో శ్రీవేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్, అడ్వాన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభమైంది. ఏరియా, జిల్లా ఆసుపత్రుల్లోనూ చికిత్స మరోవైపు క్యాన్సర్ బాధితుల ఇబ్బందులకు చెక్ పెట్టాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఇందులో భాగంగా.. పౌరుల ఆవాసానికి 50కి.మీ పరిధిలో 2030లోపు క్యాన్సర్ చికిత్సను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏరియా, జిల్లా ఆసుపత్రులకు ఈ చికిత్సను విస్తరించనున్నారు. దీంతో క్యాన్సర్ నివారణ, బేసిక్ రేడియేషన్, కీమోథెరపీ, ఉపశమన సేవలు చేరువవుతాయి. అలాగే, ఏరియా, జిల్లా, పాత, కొత్త మెడికల్ కాలేజీ ఆసుపత్రుల్లో 43 క్యాన్సర్ కేర్ సెంటర్లను అభివృద్ధి చేయనున్నారు. విశాఖపట్నం, గుంటూరు జిల్లా చిన కాకానిలో కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ సెంటర్ (సీసీసీ)లను అధునాతన మౌలిక సదుపాయాలు, స్పెషాలిటీ వైద్యులతో ఏర్పాటుచేస్తారు. దీంతో ఇక్కడ అనేక రకాల క్యాన్సర్ వ్యాధులకు ఉచితంగా చికిత్స అందుతుంది. తిరుపతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటర్నేషనల్ క్యాన్సర్ కేర్ సెంటర్ (ఐసీసీ) అభివృద్ధి చేపడతారు. దీనిద్వారా పీడియాట్రిక్ కేన్సర్ కేర్ సేవలతో పాటు, జీనోమిక్ రీసెర్చ్ సర్వీసులు, బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ సర్వీసులు అందించడమే లక్ష్యం. వీటితో పాలియేటివ్ హాస్పైస్ సెంటర్లను ఏర్పాటుచేయాలన్నది లక్ష్యం. ఈ మొత్తం ప్రక్రియను నాలుగు దశల్లో చేపడతారు. నివారణకు పెద్దఎత్తున స్క్రీనింగ్ నిజానికి.. ప్రారంభంలోనే వ్యాధిని గుర్తిస్తే ప్రాణాపాయం, చికిత్సకయ్యే ఖర్చు తగ్గుతుంది. స్క్రీనింగ్ ద్వారా రొమ్ము, గర్భాశయ, నోటి తదితర రకాలను ప్రారంభ దశలోనే గుర్తించవచ్చు. ఇందులో భాగంగా రాష్ట్రంలో పెద్దఎత్తున స్క్రీనింగ్ పరీక్షల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లాలోని దొండపాడులో పైలెట్ ప్రాజెక్టు కింద స్క్రీనింగ్ పూర్తయింది. త్వరలో ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా చేపట్టనున్నారు. అనంతరం.. 44 మామో బస్సుల సాయంతో 11,162 గ్రామ సచివాలయాల పరిధిలో 254 రోజుల్లో స్క్రీనింగ్ పరీక్షల నిర్వహణకు ప్రణాళికలు రచిస్తున్నారు. అడ్వాన్స్డ్ స్టేజ్ చికిత్స అవసరం రాకుండా.. 2030 నాటికి రాష్ట్రంలో ఏ ఒక్కరికీ అడ్వాన్స్డ్ స్టేజ్ చికిత్స అవసరం రాకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తించడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. ప్రివెన్షన్, ట్రీట్మెంట్, పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్ మీద దృష్టిసారించాం. పెరుగుతున్న రోగుల సంఖ్య ఆధారంగా డాక్టర్లను తయారుచేసేలా సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రణాళిక రచించాం. – నవీన్‌కుమార్, ప్రత్యేక కార్యదర్శి వైద్య, ఆరోగ్య శాఖ -
క్యాన్సర్ లెక్క తేల్చేలా..
సాక్షి, అమరావతి: క్యాన్సర్ వ్యాధిని ఇప్పటికే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చి సాంత్వన చేకూరుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బాధితుల లెక్కలు పక్కాగా నిర్ధారించి సమగ్రంగా చికిత్స అందించేందుకు సిద్ధమైంది. క్యాన్సర్‌ను నోటిఫై జబ్బుల జాబితాలోకి చేర్చేలా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈమేరకు త్వరలో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం నోటిఫై చేసిన జబ్బులు 31 వరకు ఉండగా జాబితాలో ఎయిడ్స్, మలేరియా, డెంగ్యూ, హెపటైటిస్ లాంటివి ఉన్నాయి. గతేడాది కరోనా రోగుల్లో వెలుగు చూసిన బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ను కూడా నోటిఫైడ్ జబ్బుల జాబితాలో చేర్చారు. వివరాలు లేక అస్పష్టత క్యాన్సర్ మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తోంది. క్యాన్సర్ రిజిస్ట్రీ గణాంకాల ప్రకారం ఏటా దేశంలో ఎనిమిది లక్షలకు పైగా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలో క్యాన్సర్ కేసులకు సంబంధించి రిజిస్ట్రీ అంటూ ఇప్పటి వరకూ లేదు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద క్యాన్సర్ చికిత్స పొందుతున్న రోగుల గణాంకాల ఆధారంగా ఏటా 53 వేల కొత్త కేసులు నమోదు అవుతున్నట్టు అంచనా. ప్రైవేట్ ఆసుపత్రుల్లో సొంతంగా క్యాన్సర్‌కు చికిత్స పొందుతున్న వారి వివరాలు అందుబాటులో లేవు. దీంతో ఏ ప్రాంతాల్లో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి? ఏ రకం క్యాన్సర్ కేసులు ఎక్కువగా ఉంటున్నాయి? అనే వివరాలు తెలియకపోవడంతో వ్యాధి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టత కొరవడింది. ఎప్పటికప్పుడు ఆన్లైన్లో.. ఒక జబ్బును నోటిఫై చేస్తే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం కింద రిజిస్టర్ అయిన ప్రైవేట్ ఆస్పత్రులు, డయోగ్నోస్టిక్ కేంద్రాలు సంబంధిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్స వివరాలను ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియజేయాలి. చికిత్సకు నిర్దేశిత ప్రొటోకాల్ అనుసరించాలి. నిబంధనలను అతిక్రమిస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. క్యాన్సర్ వ్యాధిని నోటిఫై చేయడం వల్ల ఎక్కడైనా ఆసుపత్రి, డయాగ్నోస్టిక్ సెంటర్లో కేసును కొత్తగా గుర్తించినా, చికిత్స అందించినా ఆ వివరాలు వెంటనే ప్రభుత్వానికి చేరతాయి. తద్వారా డిజిటల్ క్యాన్సర్ రిజిస్ట్రీని వైద్య శాఖ నిర్వహిస్తుంది. ఇందుకు వెబ్ అప్లికేషన్‌ను రూపొందిస్తున్నారు. ఇందులో అన్ని రిజిస్టర్ ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్స్ సెంటర్లకు లాగిన్ ఇస్తారు. దీనివల్ల ఎప్పటికప్పుడు కొత్తగా నమోదైన క్యాన్సర్ కేసులు, చికిత్స పొందిన రోగుల వివరాలు ఆన్లైన్లో వైద్య శాఖకు చేరతాయి. ఈ వివరాలను రాష్ట్ర స్థాయిలో కమాండ్ కంట్రోల్ రూమ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ విధానాల్లో విశ్లేషించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)కు పంపుతారు. దేశంలోనే తొలిసారి.. సమర్థంగా క్యాన్సర్‌ను నియంత్రించాలన్న సీఎం జగన్ ఆశయాల మేరకు నోటిఫై జాబితాలో చేర్చాలని నిర్ణయించాం. డిజిటల్ క్యాన్సర్ రిజిస్ట్రీని దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలో ప్రారంభించనున్నాం. వెబ్ అప్లికేషన్ రూపొందిస్తున్నాం. రిజిస్ట్రీ నిర్వహించడం వల్ల కేసులకు అనుగుణంగా వైద్యులు, వైద్య సదుపాయాలు సమకూర్చుకునేందుకు ఆస్కారం ఉంటుంది. క్యాన్సర్‌కు అధునాతన వైద్య చికిత్స అందించేలా ప్రణాళికలు రచిస్తున్నాం. – నవీన్‌కుమార్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆరంభంలోనే గుర్తిస్తే.. క్యాన్సర్ కేసులను పక్కాగా నమోదు చేయడం వల్ల సమర్థంగా నియంత్రించే అవకాశాలుంటాయి. వయసు, లింగం, ప్రాంతాల వారీగా ఏ వర్గాల్లో, ఏ రకం క్యాన్సర్లు ఎక్కువగా నమోదవుతున్నాయో తెలుస్తుంది. తద్వారా స్క్రీనింగ్ నిర్వహించి ప్రారంభ దశలోనే గుర్తించి నియంత్రించే వీలుంటుంది. ఉదాహరణకు గుంటూరు జిల్లాలో జీర్ణాశయ క్యాన్సర్, ఉత్తరాం«ధ్రలో ఓరల్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా ఉంన్నట్లు వైద్య శాఖ అంచనా వేస్తోంది. ఇలాంటివన్నీ నోటిఫైతో పక్కాగా తెలుస్తాయి. ఎక్కువగా నమోదయ్యే క్యాన్సర్లపై అధ్యయనం, పరిశోధనలకు ఆస్కారం ఉంటుంది. నూతన వైద్య విధానాల దిశగా అడుగులు వేసే వీలుంటుంది. -
పోరాడాలి గెలవాలి
-
తెలంగాణ: ఆందోళన కలిగిస్తోన్న కేన్సర్ కేసులు, మరణాలు
కేన్సర్ మరణశిక్ష కాకూడదు కేన్సర్ ఎక్కడా, ఎవరికీ మరణశిక్ష కాకూడదు. వ్యాధిని ముందుగా గుర్తించేలా ప్రజలు నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. కాలేయ క్యాన్సర్‌ను నివారించడానికి ప్రభుత్వాలు హెపటైటిస్ బీ టీకాలు వేయాలి. – డబ్ల్యూహెచ్ఓ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కేన్సర్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఏటా కేసుల సంఖ్య పెరుగుతుండగా, మరణాలు సైతం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో గత ఏడాది వరకు మూడేళ్ల వ్యవధి (2018–20 మధ్య)లో 1.39 లక్షల మంది కేన్సర్ బారిన పడగా.. అదే కాలంలో 76,234 మంది మరణించడం వ్యాధి విస్తరిస్తున్న తీరును, దాని తీవ్రతను స్పష్టం చేస్తోంది. గతేడాది దేశవ్యాప్తంగా నమోదైన కేన్సర్ మరణాల్లో తెలంగాణ 13వ స్థానంలో ఉండటం గమనార్హం. దేశంలో ఈ మూడేళ్లలో 40.75 లక్షల మంది కేన్సర్ బారినపడ్డారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. రొమ్ము, నోరు, గర్భాశయం, ఊపిరితిత్తులు, కడుపు, పెద్దపేగు, కాలేయ క్యాన్సర్లు ఎక్కువగా నమోదవుతున్నాయని తెలిపింది. ఇలావుండగా కేన్సర్ కేసుల్లో 25 శాతం పొగాకు సంబంధించినవేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పేర్కొంటోంది. కాగా రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద జరుగుతున్న చికిత్సల్లో ఈ మహమ్మారే మొదటి స్థానంలో ఉంది. ► రాష్ట్రంలో మూడేళ్లలో మృతులు 76,234 ► 2018–20 మధ్య మొత్తం కేసులు 1.39 లక్షలు పొగాకు వాడకాన్ని నియంత్రించాలి: డబ్ల్యూహెచ్ఓ పురుషులలో పొగాకు సంబంధిత కేన్సర్ కేసులు అధికంగా వెలుగు చూస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పేర్కొంటోంది. పొగాకు వాడకాన్ని నియంత్రించడం అవసరమని సూచిస్తోంది. మహిళల్లో గర్భాశయ కేన్సర్ ఎక్కువగా ఉందని తెలిపింది. అధిక బరువు, తక్కువ స్థాయి శారీరక శ్రమ, జీవనశైలిలో వచ్చిన మార్పుల వల్ల కేన్సర్ కేసులు పెరుగుతున్నాయని వివరించింది. గత రెండు దశాబ్దాలలో కేన్సర్ ప్రమాదం పెరిగిందని వెల్లడించింది. ఇలాగే కొనసాగితే రాబోయే రెండు దశాబ్దాలలో ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు 60 శాతం పెరుగుతాయని హెచ్చరించింది. ఎక్కువ శాతం కేన్సర్ చికిత్సలే.. తెలంగాణలో ఆరోగ్యశ్రీ కింద 2016–17లో మొత్తం 2.74 లక్షల మందికి వివిధ రకాల వ్యాధులకు శస్త్రచికిత్సలు జరిగితే, అందులో 64,845 మంది కేన్సర్ రోగులు ఉన్నారు. అంటే 23.61 శాతం కేన్సర్ చికిత్సలేనన్న మాట. అలాగే 2017–18లో 3.09 లక్షల మందికి చికిత్సలు జరిగితే, అందులో 71,273 మంది కేన్సర్ బాధితులు ఉన్నారు. అంకాలజిస్టులు 100 మందే రాష్ట్రంలోని పీహెచ్‌సీల్లో ఉన్న వైద్యులకు కేన్సర్ నిర్ధారణపై ఎటువంటి అవగాహన ఉండక పోవడంతో వ్యాధిని ముందస్తుగా గుర్తించలేక పోతున్నారు. కేన్సర్ నిర్ధారణ, చికిత్స చేసేందుకు అవసరమైన వైద్య సిబ్బంది కూడా రాష్ట్రంలో లేరు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కేవలం 100 మంది వరకు మాత్రమే ఆంకాలజిస్టులు ఉన్నారు. అందులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేవలం 30 మందే ఉన్నారు. ప్రత్యేక శిక్షణకు కేంద్రం నిర్ణయం కేన్సర్‌ను గుర్తించలేదని పరిస్థితిని అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ) మొదలు ఏరియా ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, బోధనాసుపత్రుల వరకు అన్నిచోట్లా పనిచేసే ప్రభుత్వ వైద్యులకు క్యాన్సర్‌పై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. అవగాహన పెరగాలి కేన్సర్‌పై ప్రజల్లో అవగాహన పెరగాల్సి ఉంది. డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక ప్రకారం.. మన దేశంలో కేన్సర్ శరవేగంగా విస్తరిస్తోంది. ప్రతి 10 మంది భారతీయులలో ఒకరు క్యాన్సర్ బారిన పడతారని, ప్రతి 15 మందిలో ఒకరు మరణిస్తారని సంస్థ హెచ్చరించింది. అందువల్ల ప్రజలు తమ జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. శారీరక శ్రమ చేయాలి. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. – డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ -
కేన్సర్‌తో ఆస్పత్రిలో చేరి.. కరోనాతో..!
సాక్షి, నాగర్‌కర్నూల్: కేన్సర్ వ్యాధితో హాస్పిటల్లో చేరిన వ్యక్తి కరోనా వైరస్‌తో మృతి చెందినా.. రిపోర్ట్లు రాకముందే మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అంటగట్టి చేతులు దులుపుకోవడంతో అధికారులు, మృతుని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం వీరంరాజ్‌పల్లికి చెందిన ఓ వ్యక్తి(52) 15 ఏళ్ల క్రితం గ్రామం నుంచి హైదరాబాద్ వలస వెళ్లి అల్వాల్ ప్రాంతంలోని నేతాజీనగర్‌లో భార్యాపిల్లలతో నివాసం ఉంటున్నాడు. ఈయన ఈ నెల 14న అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్లో చేర్పించగా.. గొంతు కేన్సర్‌గా గుర్తించారు. దీంతో కుటుంబ సభ్యులు లక్డికాపూల్ ఎంఎన్‌జేæ కేన్సర్ హాస్పిటల్లో చికిత్స నిమిత్తం చేర్పించారు. కాగా అతని రక్త నమూనాలను ఈ నెల 5న సేకరించి టెస్టులకు పంపించగా.. 6వ తేదీ ఉదయం 7 గంటలకు ఆయన మృతిచెందాడు. దీంతో హాస్పిటల్ నిర్వాహకులు, సిబ్బంది మృతదేహాన్ని వెంటనే తీసుకెళ్లాలని అతని కుమార్తెకు తెలియజేయడంతో ఆమె తన బంధువు సాయంతో అంబులెన్స్‌లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు స్వగ్రామమైన వీరంరాజుపల్లికి తీసుకొచ్చింది. గ్రామంలో కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి మధ్యాహ్నం 2:30 గంటలకు మృతదేహాన్ని ఖననం చేశారు. అంత్యక్రియల్లో కుటుంబ సభ్యులతో పాటు వివిధ గ్రామాలకు చెందిన బంధువులు 46 మంది కార్యక్రమంలో పాల్గొన్నారు. దహన సంస్కారాల అనంతరం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో హాస్పిటల్ నుంచి అతనికి కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్లు సమాచారం వచ్చింది. ఈ విషయం ఆదివారం సర్పంచ్ భర్త మనోహర్‌కు తెలియడంతో ఆయన అధికారులకు సమాచారం అందించారు. చదవండి: చేస్తున్నది అటెండర్ ఉద్యోగం.. చేసేది కలెక్టర్ సంతకం వివరాలు సేకరించిన డీఎంహెచ్ఓ 22 మందిని క్యారంటైన్‌కు తరలించే చర్యలు తీసుకుంటున్నామని, మిగతా వారిని హోం క్వారంటైన్లో ఉంచడంతో పాటు, గ్రామం మొత్తం జనం ఇళ్ల నుంచి బయటికి రాకుండా 14 రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉంచాలని ఎస్ఐతో పాటు డాక్టర్లకు సూచించారు. ఈ సంఘటనతో గ్రామంలోని జనం బిక్కుబిక్కు మంటూ బయటికి రావడానికి జంకుతున్నారు. గ్రామాన్ని సందర్శించిన డీఎంహెచ్ఓ కరోనా పాజిటివ్ కేసు వ్యక్తి మృతదేహానికి అత్యక్రియలు జరిగిన విషయాన్ని తెలుసుకున్న జిల్లా వైద్యాధికారి సుధాకర్లాల్, తహసీల్దార్ రాధాకృష్ణ, ఎస్ఐ వీరబాబు, డాక్టర్లు సురేష్, శ్రావణ్‌లతో పాటు వైద్య సిబ్బంది ఆదివారం గ్రామాన్ని సందర్శించారు. మృతుని కుమార్తె, భార్యతో హాస్పిటల్లో చోటుచేసుకున్న పరిణామాలను తెలుసుకున్నారు. కేన్సర్‌తోనే మా తండ్రి మృతి చెందినట్లు ఎంఎన్‌జె హాస్పిటల్ సిబ్బంది, డాక్టర్లు తెలుపడంతో మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు చేశామని తెలియజేశారు. అంత్యక్రియల్లో 46 మంది పాల్గొనగా.. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మృతదేహాన్ని తాకినట్లు వెల్లడించారు. అంత్యక్రియల అనంతరం తమకు హాస్పిటల్ నుంచి మా నాన్నకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు అల్వాల్ పోలీసుల ద్వారా సమాచారం అందినట్లు వివరించారు. -
కార్ల్ జూన్‌కు ‘జినోమ్’ అవార్డు
సాక్షి, హైదరాబాద్: కేన్సర్ మహమ్మారికి వినూత్న చికిత్సను అందుబాటులోకి తెచ్చిన అమెరికా శాస్త్రవేత్త డాక్టర్ కార్ల్ హెచ్.జూన్, ప్రజారోగ్య రంగంలో విశేష కృషి చేసిన అంతర్జాతీయ ఫార్మా కంపెనీ నోవార్టిస్ సీఈవో డాక్టర్ వాస్ నరసింహన్‌లకు ఈ ఏడాది జినోమ్ వ్యాలీ ఎక్సలెన్సీ అవార్డులు అందించనున్నట్లు బయో ఆసియా నిర్వాహకులు ప్రకటిం చారు. తెలంగాణ ప్రభుత్వం ఏటా నిర్వహించే బయో ఆసియా ఇప్పటికే ఆసియా మొత్తానికి అతిపెద్ద జీవశాస్త్ర సంబంధిత వేదికగా పరిణమించిన సంగతి తెలిసిందే. ఫార్మా రంగంతోపాటు, ప్రజారోగ్యానికి సంబంధించిన అంశాలను విస్తృతంగా చర్చించే బయో ఆసియా ఆయా రంగాల్లో విశిష్ట కృషి చేసిన వారికి జినోమ్ వ్యాలీ ఎక్సలెన్సీ అవార్డులు అందిస్తోంది. ఈ ఏడాది బయో ఆసియా సమావేశం ఫిబ్రవరి 17 నుంచి మూడు రోజులపాటు జరగనుంది. ఈ నేపథ్యంలో కార్ల్ హెచ్.జూన్‌కు జినోమ్ వ్యాలీ ఎక్సలెన్సీ అవార్డు ఇస్తున్నట్లు బయో ఆసియా నిర్వాహకులు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆరోగ్య రంగంలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టిన వాస్ నరసింహన్‌లకు బయో ఆసియా తొలిరోజున అవార్డులు అందిస్తామని వివరించింది. ఇమ్యూనోథెరపీ ద్వారా.. కేన్సర్ వ్యాధికి ప్రస్తుతం మూడు చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి శస్త్రచికిత్స, రెండు రేడియో థెరపీ, మూడు కీమో థెరపీ. ఈ మూడింటితోనూ చాలా సమస్యలున్నాయి. కీమో, రేడియో థెరపీలతో జుట్టు ఊడిపోవడం మొదలుకొని ఆరోగ్యకరమైన కణాలూ నాశనమై అనేక దుష్ప్రభావాలు చూపుతాయన్నది మనకు తెలిసిందే. కేన్సర్ కణాలు రోగ నిరోధక శక్తి కణాలను దృష్టిని తప్పించుకోవడం ద్వారా శరీరమంతా వ్యాపిస్తుంటాయి. అయితే కార్ల్ జూన్ ఈ రోగ నిరోధక వ్యవస్థ కణాల్లో (టి–సెల్స్) కొన్ని మార్పులు చేయడం ద్వారా అవి కేన్సర్ కణాలను గుర్తించి మట్టుబెట్టేలా చేయగలిగారు. కచ్చితంగా చెప్పాలంటే టి–సెల్స్ ఉపరితలానికి కైమెరిక్ యాంటిజెన్ రిసెప్టర్లను అనుసంధానిస్తారు. ఫలితంగా ఇవి కేన్సర్ కణాలను గుర్తించే శక్తిని పొందుతాయన్నమాట. దీన్నే ఇమ్యూనోథెరపీ అని పిలుస్తారు. ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చిన మెరుగైన కేన్సర్ చికిత్స ఇది. కార్ల్ జూన్ పరిశోధనల ఆధారంగా అభివృద్ధి చెందిన టిసాజెన్లిక్లుయి అనే ఎఫ్‌డీఏ ఆమోదిత జన్యు చికిత్స అందుబాటులోకి వచ్చింది. -
మెరుగవుతున్న మెట్రానమిక్స్ థెరపీ!
ఒక శతాబ్దకాలంగా వైద్యరంగంలో అత్యంత వినూత్యమైన మార్పులు వస్తూ ఉన్నప్పటికీ ప్రపంచంలోనే అత్యంత భయానకమైన వ్యాధుల్లో ఒకటిగా పేరొందిన క్యాన్సర్‌కు మాత్రం ఇంకా మందు కనుక్కోలేకపోయాం. కానీ ఈ రంగంలోని పురోగతే రోగుల జీవితాన్ని మరింత సౌకర్యంగా మారుస్తోంది. అందుకు ఆధునిక విజ్ఞానానికి మనమెంతగానో రుణపడి ఉండాల్సిందే. ఏదైనా ఒక పరిశోధన జరిగిందనుకోండి. అదెంతవరకు సఫలమైందో చెప్పడానికి ఓ అంచనా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశకాలే ఆ పరిశోధనకు గీటురాయి. రోగి పరిస్థితి ఎలా ఉందో అంచనావేసేందుకు... అతడి అంతర్గత అవయవాల కార్యకలాపాలు (ఫిజియలాజికల్ స్టేటస్), రోగి ఎంతగా బాగున్నాడు (ఫిట్నెస్) అనే అంశాలు ఆ పరిశోధన ఏ మేరకు సత్ఫలితాలు సాధించిందో చెబుతాయి. ఈ రకంగా రోగి జీవితం/పరిస్థితి (పర్ఫార్మెన్స్ స్టేటస్) బాగుంటే పరిశోధన విజయవంతమైనట్లే. కానీ క్యాన్సర్‌కు మనం చికిత్స చేసే సమయంలో కొన్ని సందేహాలు మనల్ని (అంటే డాక్టర్లనీ, రోగి కుటుంబ సభ్యులనూ) వెంటాడుతుంటాయి. అవేమిటంటే... ►ఇప్పటికే జబ్బు కారణంగా రోగి శరీరమెంతో కృశించి పోయి ఉంది. ఇలాంటప్పుడు చికిత్స (ఉదాహరణకు కీమోథెరపీలాంటివి) ఇచ్చి అతడిని మరింత కుంగిపోయేలా చేయవచ్చా? దాంతో అతడి జీవితం (పెర్ఫార్మెన్స్ స్టేటస్) బాగుపడేదెంత? ►అమ్మో... ఈ చికిత్స తీవ్రతను రోగి శరీరం తట్టుకోలేదేమో అంటూ అతడికి చికిత్స ఇవ్వకుండా ఉంచడం ఏ మేరకు సరైనది అంటూ కొందరికి చికిత్స అందించడం కంటే అలా వదిలేయడమే మంచిదంటారు. కానీ ►అందరిలాగే అతడికీ ఓ జబ్బులేని జీవితం, సుదీర్ఘకాలం బతికే అవకాశం ఇవ్వద్దా? ఈ ప్రశ్నలకు మనమే అంటే మన భారతీయ సైంటిస్టులే ప్రపంచానికి ఓ జవాబు చెబుతున్నారు. అనాదిగా మనకు తెలిసిన విజ్ఞానాన్ని ఉపయోగించి ‘మెట్రానామిక్స్ థెరపీ’ ద్వారా పై సందేహాలకు సమాధానం చెబుతున్నారు. క్యాన్సర్ చికిత్సలో కొత్తవెలుగు ఒకరికి క్యాన్సర్ వ్యాధి ఉంది. సాధారణంగా క్యాన్సర్ వ్యాధుల్లో అది ఏ మేరకు పాకింది, దాని తీవ్రత ఎంత అన్న అంశం ఆధారంగా స్టేజ్–1, స్టేజ్–2, స్టేట్–3, స్టేజ్–4 అని నాలుగు దశలుగా విభజిస్తారన్న విషయం తెలిసిందే. సాధారణంగా స్టేజ్–1, స్టేజ్–2 వ్యాధిగ్రస్తులకు చికిత్స అందిస్తారు. స్టేజ్–3, స్టేజ్–4 ఉన్నవారిలో వ్యాధి ముదిరిందనీ, చికిత్స ఇవ్వడం కంటే అలా వదిలేయడమే మంచిదని చాలా సందర్భాల్లో అంటుంటారు. అంటే వారికి చికిత్స ఇవ్వడంలోని బాధలు భరిస్తూ... జీవితాన్ని కొనసాగించడం కంటే... ఆ జీవించి ఉన్న కాలంలోనే అలాంటి బాధలేమీ లేకుండా హాయిగా బతికితే మంచిదంటూ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంటారు. కానీ ఇలాంటి వారికీ ఒక్కోసారి జీవితాన్ని పొడిగిస్తే అది మంచి పరిణామానికి దారితీసే అవకాశాలు ఉండవచ్చు. ఉదాహరణకు బాధాకరమైన చికిత్స ఇవ్వడం ద్వారా ఒకరి జీవితాన్ని కేవలం ఆరు నెలలు మాత్రమే పొడిగించే అవకాశం ఉందనుకుందాం. అలా చేయకపోతే ఏ మూడు నుంచి నాలుగు నెలలు ఎలాంటి బాధా లేకుండా జీవింవచ్చనుకుందాం. అలాంటప్పుడు ఆ అదనపు మూడు నెలల జీవితకాలం కోసం ఆ ప్రాణిని అంతగా బాధపెట్టాలా అన్న భావన చాలామందిలో రావచ్చు. కానీ వైద్యవిజ్ఞానంలో చాలావేగంగా ఇప్పుడు చోటు చేసుకుంటున్న పురోగతి కారణంగా మూడు నెలల చికిత్స తర్వాత ఆ వ్యక్తి మరో మూడు నెలలు అదనంగా బతికిడానుకోండి. ఆ వ్యవధిలో మరేదైనా పురోభివృద్ధి కారణంగా మరో అద్భుతమైన ఔషధమో, ప్రక్రియో అందుబాటులోకి వస్తే ఆ రోగి జీవితకాలాన్ని మరిన్ని ఏళ్లు పొడిగించే అవకాశం దొరుకుతుంది కదా అన్నది ఓ భావన. దానికి ఉపయోగపడేదే ఈ మెట్రానమిక్స్ థెరపీ. మెట్రానమిక్స్ థెరపీ అంటే... ఇందులో కీమోథెరపీకి ఇచ్చే మందులనే... వాటి దుష్ప్రభావాలు పడనంతటి చిన్న చిన్న మోతాదుల్లో ఇస్తారు. ఇలా చిన్న చిన్న మోతాదుల్లో ఇవ్వడం అన్నది దానికోసం ఇచ్చే సాధారణ షెడ్యూల్‌కు అనుగుణంగా కాకుండా చాలా సుదీర్ఘకాలం పాటు కొనసాగిస్తూ ఉంటారు. దీని ప్రభావం కేవలం క్యాన్సర్ కణం మీద మాత్రమే గాక... ఆ క్యాన్సర్ కణాలుండే ప్రాంతపు పరిసరాల (మైక్రో ఎన్విరాన్మెంట్) మీద కూడా పడుతుంది. దాంతో ఈ మందు అక్కడి ఎండోథీలియన్ కణజాలం మీద కూడా పనిచేస్తూ అక్కడ యాంటీ–యాంజియోజెనిక్ ప్రభావం చూపుతుంది. అంటే... ఉదాహరణకు ఎండోథీలియమ్ అంటే ఒక రక్తనాళమో ఏదైనా పైప్లాంటిదో ఉందనుకోండి. అలాంటి దానికింద ఏర్పడే ఒక పొరలాంటిది అనుకోవచ్చు. ఏదైనా క్యాన్సర్ కణం... పొరుగునున్న కణజాలం కంటే ఎక్కువ ఆహారాన్ని లాక్కోవడం కోసం కొత్త కొత్త రక్తనాళాలను పుట్టించుకుంటూ... ఆ కొత్త రక్తనాళమార్గాల ద్వారా మరింత ఆహారాన్ని, పోషకాలను గ్రహిస్తుంటాయి. ఈ చిన్నమోతాదుల్లో ఇచ్చే మందులు ఆ యాంజియోజెనిక్ ప్రక్రియను ఆపేయడం ద్వారా కొత్త రక్తనాళాలు పుట్టడానికి ఆస్కారమివ్వవు. ఇలా కొత్తరక్తనాళాలను పుట్టనివ్వని ప్రక్రియనే ‘యాంటీ–యాంజియోజెనిక్’ ప్రభావంగా చెప్పవచ్చు. ఈ మెట్రానమిక్ థెరపీలో వాడే మందులు కేవలం యాంటీ–యాంజియోజెనిసిస్‌ను మాత్రమేగాక చాలావరకు రోగిలోని రోగనిరోధక శక్తిని పెంచే పనిని కూడా చేస్తుంటాయి. ఈ ఇమ్యునలాజికల్ యాక్షన్ వల్ల రోగిలో క్యాన్సర్ వ్రణం క్రమంగా తన తీవ్రతను తగ్గించుకుంటూ పోతుంటుంది. ఇలాంటి సమయంలో ఈ మెట్రానమిక్ థెరపీలో వాడే మందులకు తోడుగా... నిర్దిష్టంగా కణాన్నే లక్ష్యంగా ఎంచుకుని తుదముట్టించే టార్గెట్ థెరపీ మందులనూ, రోగనిరోధక శక్తిని పెంచే మందులనూ కలిపి ఇవ్వడం ద్వారా రోగి జీవితకాలాన్ని పెంచవచ్చు. గత పదిహేనేళ్ల వ్యవధిలో చాలా రకాల క్యాన్సర్లకు ఇవ్వాల్సిన మెట్రానమిక్థెరపీ మీద చాలా అధ్యయనాలే జరిగాయి. అయితే దురదృష్టవశాత్తు... ఒక మందు తాలూకు ప్రభావాన్ని నిర్ణయించే రెండు అంశాలైన... అంతర్గత అవయవాల కార్యకలాపాలు (ఫిజియలాజికల్ స్టేటస్), రోగి ఎంతగా బాగున్నాడు (ఫిట్నెస్) అనేవి అంతగా మెరుగ్గా కనిపించలేదు. దుష్ప్రభావాలూ దాదాపుగా ఉండవు... అయితే మెట్రానమిక్ థెరపీలో వాడే మందుల మోతాదు చాలా స్వల్పం కావడం వల్ల వాటి దుష్ప్రభావాలు (సైడ్ఎఫెక్ట్స్) సైతం చాలా తక్కువగా ఉండటం లేదా అస్సలు లేకపోవడం జరుగుతుంది. ఇలాంటి మందులకు ఆమోదం (ఎథికల్ అప్రూవల్స్) లభించిన తర్వాత కొందరు యువ సైంటిస్టులు వాటిని రోగుల మీద ప్రయోగించి చూశారు. దాంతో అంతకుముందు తప్పనిసరిగా మరణిస్తారని భావించిన రోగుల్లో దాదాపు 29% మంది తాలూకు జీవితకాలం పెరిగింది. దాంతో వారి ఆయుష్షును పొడిగించినట్లయ్యింది. ఈ రోగుల్లో కొందరైతే వారు బతుకుతారనుకున్న దానికంటే దాదాపు 489 రోజులు అదనంగా జీవించారు. అది కూడా మంచి నాణ్యమైన జీవితాన్ని అనుభవిస్తూ! అందువల్ల పైన పేర్కొన్న రెండంశాలలో ఒక అంశం మాత్రం పూర్తిగా సాధించినట్లయ్యింది. అది కూడా ఎలాంటి తీవ్రమైన చికిత్సా ఇవ్వకుండానే. ఇక దీని విశిష్టత ఏమిటంటే... సాధారణంగా కీమోలో కనిపించే ఎలాంటి అసౌకర్యాలూ, ఇబ్బందులూ ఉండవు. ఈ మందు వాడిన ప్రతి 10 మందిలో ముగ్గురి జీవనం అలా స్థిరంగా గడవడమో లేదా మరింత మెరుగుపడటమో జరిగింది తప్ప మెట్రానమిక్స్ వల్ల ఇతర నష్టాలేమీ లేవు. దీని ఆధారంగా రోగి ఏ మేరకు మెరుగుపడే అవకాశం ఉంది, మరెంత కాలం జీవించేందుకు అవకాశం ఉంది... అనే అంశాలను నిర్ణయించేందుకు ఎన్నెన్నో రకాల క్యాన్సర్లలో ఎన్నెన్నో వేర్వేరు లెక్కలను రూపొందించడం జరుగుతోంది. ఈ రకరకాల క్యాన్సర్లలో ప్రోస్టేట్, పెద్దపేగు/మలద్వార (కోలోరెక్టల్), రొమ్ము క్యాన్సర్లతో పాటు మెలనోమా వంటి చర్మక్యాన్సర్లపై అధ్యయనాలు జరుగుతున్నాయి. అందువల్ల ప్రస్తుతం జరుగుతున్న ఈ అధ్యయన కాలాన్ని చాలా కీలకమైన సమయంగా ఎంచాలి. అయితే కొంతమంది వ్యక్తులు క్యాన్సర్ రోగులకు కీమో ఇవ్వడం కంటే వారిని అలా ప్రశాంతంగా... ఏ బాధలూ, ఇబ్బందులూ లేకుండా బతికినంత కాలం బతికి చనిపోయేలా చేయడం మంచిదనే శుష్కప్రియాలు చెబుతుంటారు. ఇలాంటి వదంతులూ, వృథాకబుర్లు చెప్పేవారంతా ప్రయోగాత్మకంగా నిర్వహితమవుతున్న ఈ కొత్త ప్రక్రియ గురించి మాట్లాడకుండా ఉంటూ.. తమ పుకార్లను అదుపు చేసుకోవాలనీ, ఈ అధ్యయనాలు ఒక కొలిక్కి వచ్చేవరకు తమ వదంతులకు ఫుల్స్టాప్ వేయాలంటూ శాస్త్రవేత్తలతో పాటు సైంటిఫిక్ కమ్యూనిటీకి చెందిన ఇతర సిబ్బంది ‘‘స్టాప్ మిత్ స్ప్రెడింగ్’’ అంటూ ఆశావాదులంతా పిలుపునిస్తున్నారు. డాక్టర్ ఏవీఎస్ సురేశ్, సీనియర్ కన్సల్టెంట్, మెడికల్ అండ్ హిమటో ఆంకాలజిస్ట్, సెంచరీ హాస్పిటల్స్, హైదరాబాద్ -
ఆ గ్రామంలో పెరుగుతున్న క్యాన్సర్, కిడ్నీ మరణాలు
సాక్షి, ఇంద్రవెల్లి(ఖానాపూర్): మండలంలోని శంకర్‌గూడ గ్రామస్తులను క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు పట్టి పీడీస్తున్నాయి. 15 ఏళ్లుగా గ్రామంలో సాధారణ మరణాల కంటే క్యాన్సర్, కిడ్నీ మరణాలే అధికంగా ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. క్యాన్సర్, కిడ్నీ వ్యా ధులతో తక్కువ వయస్సు ఉన్న వారు మృతి చెందుతుండడంతో శంకర్‌గూడ గ్రామస్తులు భ యాందోళనకు గురవుతున్నారు. అంతేకా కుం డా వ్యాధులు రావడానికి కారణాలు తె లియక సతమతమవుతున్నారు. మరణాలపై దృష్టి సారించాల్సిన వైద్య శాఖ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గత 15 ఏళ్లలో క్యాన్సర్‌తో 16 మంది.. మండలంలోని శంకర్‌గూడ గ్రామ జనాభా సుమారు 450. గిరిజన గిరిజనేతర 95 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఈ గ్రామంలో గడిచిన 15 సంవత్సరాల కాలంలో వావల్కార్ లలితబాయి (45), గుట్టె ప్రకాష్(52), గుట్టె రామరావ్(62), దేవ్కతే అంజనాబాయి (45), అబ్దుల్ హక్(40), జాధవ్ దర్గాజీ (60), గుబ్నార్ నిలాబాయి(45), కోరెంగా మెగ్నాథ్(41), వవాల్కర్ లలిత(40), మదినే ముక్తబాయి (60), పెం దోర్ శ్యామ్‌బాయి(45), ఆడ కర్ణుబాయి(50)లు క్యాన్సర్ వ్యాధితో మృతి చెందడంతో పాటు ఒకే కుటుంబానికి చెందిన తల్లి, కొడుకు, కోడలు జవాదే బార్జబాయి(60), జవాదే బా లాజీ(42), జవాదే శకుంతలబాయి(40)లు సహితం క్యాన్సర్ బారిన పడి మృతి చెందారు. కాగా ఈ నెల 12న గుబ్నార్ సతీష్(34)లు క్యా న్సర్‌తో మృతి చెందాడు. వీరే కాకుండా పలు వురు క్యాన్సర్‌తో పోరాటం చేస్తున్నారు. దుర్గం పోశమ్మబాయి(60) క్యాన్సర్ వ్యాధితో మంచం ప ట్టగా, వవాల్కార్ గాయబాయి(50) క్యాన్సర్ బారిన పడి హైదరాబాద్ యశోధ ఆస్పత్రిలో చి కిత్స పొందుతున్నారు. కిడ్నీ వ్యాధితో ముగ్గురు మృతి.. అదేవిధంగా కిడ్నీ వ్యాధితో కుడా ఇప్పటి వరకు చరక్ వెంకటి(45), జయబాయ్ కొండబాయి(50), వవాల్కర్ సందిపాన్(45)లు మరణిం చారు. చరక్ విష్ణుకాంత్(40), మదినే ప్రేమ్బా యి(50), అర్జునే మలాన్బాయి(52), పాండ్గే రుఖ్మబాయి(48)లు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. కొందరు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా మరికొందరి ఆరో గ్యం విషమించి గ్రామంలో మంచాలకు పరి మితమయ్యారు. తక్కువ వయస్సులోనే అనేక మంది మృతి చెందడంతో అనేక కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయాయని వాపోతున్నారు. వ్యాధులు రావడానికి కారణాలు..? క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు రావడానికి అసలు కారణాలు తెలియకపోవడంతో శంకర్‌గూడ గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. అయితే గ్రామంలో వ్యాధులు రావడానికి ముఖ్యంగా చేతిపంపుల కలుషిత నీరే కారణమని, గ్రామంలో ఉన్న చేతి పంపుల్లో సున్నపు (తెల్లని) రంగుతో కూడిన బురద నీరు వస్తుందని, ఆ నీరు తాగిన వారు అనారోగ్యానికి గురి కావడంతో పాటు క్యాన్సర్, కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారని, పరిస్థితి విషమిస్తే మరణిస్తున్నారని గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారులు ఇప్పటివరకు మరణాలకు గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఇప్పటికైన జిల్లా అధికారులు దృష్టి సారించి గ్రామంలో వ్యాధులు రావడానికి గల కారణాలను తెలుసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. వైద్య నిపుణులు నీటిని పరీక్షించాలి మా గ్రామంలో ప్రతి ఏడాది క్యాన్సర్, కిడ్నీ వ్యాధుల మరణాలు పెరుగుతున్నాయి. ఇప్పటికైన జిల్లా అధికారులు దృష్టి సారించి వైద్య నిపుణులతో గ్రామంలో తాగు నీటిని పరిక్షించాలి. వ్యాధులు రావడానికి గల అసలు కారణాలను గుర్తించాలి. – ఆత్రం అశోక్, గ్రామస్తుడు వైద్య ఖర్చులు భరించలేకపోతున్నాం మా తల్లి వవాల్కర్ గాయబాయి గత రెండేళ్లుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంది. అనేక ఆస్పత్రుల్లో వైద్యం చేయించాను. ప్రస్తుతం హైదరాబాద్‌లోని యశోధ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. వైద్యం ఖర్చులు భరించలేక పోతున్నాం. మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి. – వవాల్కర్ రమాకాంత్, గ్రామస్తుడు -
కేన్సర్ ఆస్పత్రిని ఏర్పాటు చేయండి
కొండపాక (గజ్వేల్)/సిద్దిపేటటౌన్: కేన్సర్ వ్యాధి నివారణకు ప్రత్యేకంగా ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు సత్యసాయి సేవా ట్రస్టు నిర్వాహకులను కోరారు. సిద్దిపేట జిల్లా కొండపాక శివారులోని సత్యసాయి సేవా సంస్థ ప్రశాంతి నికేత న్ ఉచిత బాలికల జూనియర్ కళాశాల వార్షికోత్సవంలో శనివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. ఆస్పత్రి ఏర్పాటుకు కావాల్సిన అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని వారికి భరోసానిచ్చారు. కొండపాకలో ప్రశాంతి ప్రగతి నికేతన్ బాలికల జూనియర్ కళాశాల ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంతపిల్లలకు మన సంస్కృతీ సంప్రదాయాలను నేర్చుకునే అవకాశం లభించిందన్నారు. సత్యసాయి సేవా సమితి కర్ణాటక, తెలంగాణలో 22 విద్యా సంస్థలను నడుపుతూ ఎంతో మంది పేద విద్యార్థుల బతుకుల్లో వెలుగులు నింపుతోందన్నా రు. హరీశ్‌రావు కోరిన విధం గా కేన్సర్ వ్యాధి నివారణ కోసం మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామని సత్యసాయి సేవా సంస్థ ప్రతినిధి భగవాన్ మధుసూదన్ నాయుడు తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, చిట్టి దేవేందర్‌రెడ్డి, వంటేరు ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, మెదక్–సిద్దిపేట–హుస్నాబాద్ మీదుగా ఎల్కతుర్తి వరకు, సిరిసిల్ల–సిద్దిపేట–చేర్యాల మీదుగా జనగామకు వెళ్లేందుకు జాతీయ రహదారుల ఏర్పాటుపై కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని హరీశ్ ఆర్అండ్బీ అధికారులకు సూచించారు. -
బంగారు నానోకణాలతో వ్యాధి నిర్థారణ చవక
కేన్సర్ వ్యాధి నిర్ధారణకు చవకైన కొత్త పద్ధతి ఒకదాన్ని అభివృద్ధి చేశారు క్వీన్స్‌ల్యాండ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. ఒకట్రెండు రకాలకు కాకుండా అన్ని రకాల కేన్సర్లకూ ఈ పద్ధతిని ఉపయోగించగలగడం ఇంకో విశేషం. కేన్సర్ నిర్ధారణకు చౌకైన, మెరుగైన పద్ధతిని ఆవిష్కరించేందుకు ఇప్పటికే పలు ప్రయత్నాలు జరుగుతుండగా అన్ని రకాల కేన్సర్లను ఒకే పద్ధతితో గుర్తించడం మాత్రం ఇప్పటివరకూ వీలు కాలేదు. ఈ నేపథ్యంలో తాము కేన్సర్ కణాల డీఎన్ఏ పోగులపై ప్రత్యేకదృష్టి పెట్టామని అందులోని మిథైల్ పరమాణువుల అమరిక ప్రత్యేక రీతిలో ఉండటాన్ని గుర్తించామని ద్రవంలో ఉంచినప్పుడు ఈ కేన్సర్ డీఎన్ఏ పోగులు ఉండ చుట్టుకుపోయే పద్ధతి కూడా ప్రత్యేకంగా ఉండటాన్ని గుర్తించామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త అబూ సినా తెలిపారు. ఈ మార్పులను గుర్తించేందుకు తాము బంగారు నానో కణాలను ఉపయోగించామని 200 మందిపై ప్రయోగాలు చేయగా 90 శాతం కచ్చితత్వంతో కేన్సర్‌ను గుర్తించగలిగామని వివరించారు. పైగా కేవలం పది నిమిషాల్లోనే పరీక్ష ఫలితాలు వెల్లడవుతాయని కాకపోతే ప్రస్తుతానికి ఈ పరీక్ష కేన్సర్ ఉన్నట్లు మాత్రమే నిర్ధారించగలదని అది రొమ్ము కేన్సరా? లేక ఇంకో రకమైందా? మాత్రం గుర్తించలేదని వివరించారు. -
నా భర్త క్యాన్సర్‌తో బాధపడుతున్నారు
తన భర్త క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారని జల్లువారిపేటకు చెందిన షేక్ రాజాబీ జగన్ వద్ద వాపోయింది. యేడాది కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారని వైద్యానికి సహకారం అందించాలని విజ్ఞప్తి చేసింది. -
కేన్సర్ చికిత్సకు మరో మార్గం!
కేన్సర్ వ్యాధికి సమర్థమైన చికిత్సను కనుగొనేందుకు శాస్త్రవేత్తలు చేస్తున ప్రయత్నాల్లో మరో ముందడుగు పడింది. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం చిలగడదుంపలకు ఆశించే శిలీంధ్రాలు ఉత్పత్తి చేసిన ఓ రసాయన మూలకం కేన్సర్ కణితుల పెరుగుదలను సమర్థంగా అడ్డుకోగలదని డ్యూక్ కేన్సర్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు గుర్తించారు. సుమారు వందేళ్ల క్రితం ఒట్టో వార్బర్గ్ అనే శాస్త్రవేత్త కేన్సర్ కణాల గురించి ఓ ఆసక్తికరమైన అంశాన్ని ప్రతిపాదించారు. సాధారణ కణాలు ఆక్సిజన్ సాయంతో చక్కెరలను విడగొట్టి శక్తిని పొందుతుంటే...కేన్సర్ కణాలు చక్కెరలను పులియబెట్టడం ద్వారా ఆ పని చేస్తున్నాయని వార్బర్గ్ గుర్తించారు. అయితే ఇలా ఎందుకు జరుగుతోందో మాత్రం చెప్పలేకపోయారు. తాజాగా డ్యూక్ శాస్త్రవేత్తల పరిశోధనల్లో ఈ గుట్టు కాస్తా వీడిపోయింది. జీఏడీపీహెచ్ అనే ఓ ఎంజైమ్ కేన్సర్ కణాల్లో చక్కెరలు విడిపోయే వేగాన్ని నియంత్రిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఎంజైమ్ పనితీరును అడ్డుకునే రసాయన మూలకాలేవైనా ఉన్నాయా? అని వెతికినప్పుడు కోనిన్‌జిక్ యాసిడ్ (కేఏ) గురించి తెలిసింది. చిలగడదుంపల్లోని చక్కెరలను బ్యాక్టీరియా తీసుకెళ్లిపోకుండా అడ్డుకునేందుకు ఒక రకమైన శిలీంధ్రం ఈ కేఏను ఉత్పత్తి చేస్తుంది. మరిన్ని పరిశోధనల ద్వారా కేన్సర్ కణాలపై కేఏ ప్రభావాన్ని నిర్ధారణ చేసుకోగలిగితే కణితుల పెరుగుదలను సమర్థంగా అడ్డుకోవచ్చునని అంచనా. -
కేన్సర్ బాధితులం.. ఆదుకోండి!
కేకే.నగర్: కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారు దాతల ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారు. వైద్య చికిత్స నిమిత్తం ఆర్థిక సాయం అందించి తమను ఆదుకోవాలని అర్థిస్తున్నారు. చికిత్స కోసం కేన్సర్ బాధితులు రోషిణి(14), సుదందరదేవి క్రౌడ్ ఫండింగ్ సంస్థను ఆశ్రయించారు. రోషిణి: టీనేజ్‌లో ఆడుతూ పాడుతూ గడపాల్సిన జీవితాన్ని రోషిణి విషాదంగా వెళ్లదీస్తోంది. లింపో ప్లాస్టిక్, లింపోమా అనే కేన్సర్ బాధితురాలు రోషిణి. బాలిక చెన్నై అడయారులోని కేన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇంకా రెండేళ్ల పాటు చికిత్స అందించాల్సిన అవసరం ఉందని వైద్యులు తెలిపారు. ఇందుకుగాను సుమారు రూ.10 లక్షలు ఖర్చు అవుతుంది. రోషిణి వైద్య ఖర్చుల కోసం మిలాప్ ఆర్గనైజేషన్ ద్వారా నిధి సేకరిస్తున్నారు. బాలికకు సహాయం చేయాలని అనుకునే దాతలు 9677989830 అనే ఫోన్ నంబర్లో సంప్రదించవచ్చు. సుదంధర దేవి: బ్లడ్‌కేన్సర్ బాధితురాలు సుదంధరదేవి(32) మధ్యతరగతి కుటుంబానికి చెందింది. ఈమె తల్లి గతేడాది మృతి చెందింది. తండ్రి విశ్రాంత బ్యాంకు ఉద్యోగి. సుదందరదేవికి బ్లడ్‌కేన్సర్ వ్యాధికి కీమో థెరపి చికిత్స నిమిత్తం రూ.15 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. వీరిద్దరి చికిత్సల కోసం దాతలు తమకు తోచినంత ఆర్థిక సాయాన్ని చేయాలని బాధితులు కోరుతున్నారు. వారికి సహాయం చేయదలచిన వారు జ్టి్టpట://ఝజీ ్చ్చp.ౌటజ/p్చyఝ్ఛn్టటఅనే వెబ్సైట్లో నియమ నిబంధనలను అనుసరించి సాయం చేయాలని సూచించారు. అత్యాచారం కేసులో వ్యక్తికి రెండు యావజ్జీవ శిక్షలు అన్నానగర్: నామక్కల్ జిల్లాలో వివాహితపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఓ వ్యక్తికి నామక్కల్ మహిళా హైకోర్టు రెండు యావజ్జీవ శిక్షలను విధిస్తూ బుధవారం సంచలన తీర్పు ఇచ్చింది. నామక్కల్, కాచ్చినల్లూర్ సమీపంలో వినాయకపురానికి చెందిన వివాహితను చిన్నాన్న వరుసగల కృష్ణన్ 2010వ సంవత్సరంలో అత్యాచారం చేశాడు. ఈ సంఘటనపై ఆమె కుటుంబ సభ్యులు నామక్కల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కృష్ణన్ అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ కేసు మహిళా హైకోర్టులో విచారణ జరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో బుధవారం కేసు విచారణకు వచ్చింది. ఇందులో కూతురు వరుస గల వివాహితను అత్యాచారం చేసిన కేసులో నేరం రుజువుకావడంతో కృష్ణన్‌కి రెండు యావజ్జీవ శిక్షలు విధిస్తూ మహిళా కోర్టు తీర్పు ఇచ్చింది.