
పదేళ్ల ముందే కేన్సర్‌ను గుర్తించవచ్చు
లక్షణాలేవీ పెద్దగా కనిపించకపోయినా కేన్సర్ వ్యాధిని పదేళ్ల ముందే గుర్తించే వినూత్న పరీక్షను శాస్త్రవేత్తలు రూపొందించారు. కేన్సర్‌ను ముందుగానే గుర్తించడం వల్ల తగిన చర్యలు తీసుకోవడంతోపాటు మెరుగైన చికిత్సకూ మార్గం సుగమమవుతుందని వారు చెబుతున్నారు. స్వాన్‌సీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ సరికొత్త పరీక్షకు అయ్యే ఖర్చు కూడా రూ.4,000 కంటే తక్కువ కావడం విశేషం. ధూమపానం, మద్య పానం, రేడియో ధార్మికత, కాలుష్యం వంటి కారణాలతో కణాల్లోని డీఎన్‌ఏలో మార్పులు జరుగుతాయని.. అది శ్రుతి మించి కణం నియంత్రణ లేకుండా విడిపోవడం ప్రారంభమై కేన్సర్ వస్తుంది.
అయితే ఇలా డీఎన్‌ఏలో వచ్చే మార్పులు చాలాకాలం ముందు నుంచే రక్త కణాల్లో కనిపిస్తాయని స్వాన్‌సీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త హసన్ హబౌబీ పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన వారిలో ఈ మార్పులు ఒక స్థాయిలో ఉంటే, కేన్సర్ వచ్చే అవకాశాలున్నవారిలో మరో స్థాయిలో ఉంటాయని... వాటిని గుర్తిస్తే పదేళ్ల తరువాత కేన్సర్ వచ్చే అవకాశాలను గుర్తించవచ్చని తెలిపారు. ఆహారనాళ కేన్సర్‌కు సంబంధించి తాము జరిపిన పరిశోధనలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు. కేవలం చుక్క రక్తంతోనే ఈ పరీక్ష చేయవచ్చని.. ఇతర కేన్సర్లను గుర్తించేందుకు కూడా ఇది తోడ్పడుతుందని భావిస్తున్నామని తెలిపారు.