సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో క్యాన్సర్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వ చర్యలు బాగున్నాయని ప్రముఖ వైద్య నిపుణులు, రాష్ట్ర ప్రభుత్వ క్యాన్సర్ కేర్ సలహాదారు నోరి దత్తాత్రేయుడు ప్రశంసించారు. క్యాన్సర్ చికిత్స కోసం రాష్ట్రం విడిచి వెళ్లాల్సిన అవసరం లేకుండా చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నారని కొనియాడారు.
ఈ మేరకు రాష్ట్రంలో క్యాన్సర్ కట్టడికి మెరుగైన చర్యలు చేపడుతున్నారని అభినందించారు. ఈ మేరకు నోరి దత్తాత్రేయుడు ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. క్యాన్సర్ వ్యాధికి చికిత్స అందించడంలో ప్రపంచంలోనే గొప్ప వైద్యుడిగా పేరు తెచ్చుకున్న నోరి దత్తాత్రేయుడు చెబుతున్న వివరాలు ఆయన మాటల్లోనే..
సీఎం జగన్ ఒక్కటే మాట చెప్పారు..
గతేడాది సీఎం జగన్‌ను కలిశాను. ఈ సందర్భంగా ‘రాష్ట్ర ప్రజలు క్యాన్సర్ చికిత్సకు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన పనిలేకుండా ఇక్కడ ఏ విధమైన చర్యలు తీసుకోవాలో సూచించండి’ అని నాతో అన్నారు. దీంతో రాష్ట్ర వైద్య శాఖతో కలిసి క్యాన్సర్ చికిత్స వనరులను బలోపేతం చేశాం. ఇంకోవైపు వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచడం, ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తించడం కోసం స్క్రీనింగ్ నిర్వహించడం వంటి వివిధ అంశాలపై ప్రణాళిక రూపొందించాం.
అమెరికా తరహాలో నోటిఫైడ్ జబ్బుల జాబితాలో..
క్యాన్సర్‌ను సమర్థవంతంగా కట్టడి చేసేందుకు ఈ వ్యాధిని ప్రభుత్వం నోటిఫైడ్ జబ్బుల జాబితాలో చేర్చింది. దీంతో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్‌లలో ఎక్కడ కొత్తగా క్యాన్సర్ కేసును గుర్తించినా, చికిత్స అందించినా వైద్య శాఖకు తప్పనిసరిగా రిపోర్ట్ చేయాల్సి ఉంది. ఈ విధానం వల్ల ప్రభుత్వం వద్ద రాష్ట్రంలో నమోదయ్యే క్యాన్సర్ కేసుల సమాచారం పక్కాగా ఉంటుంది. తద్వారా కేసుల నమోదుకు అనుగుణంగా వైద్య సదుపాయాల కల్పన, నియంత్రణ చర్యలకు ఆస్కారం ఉంటుంది. అమెరికా వంటి దేశాల్లో ఈ తరహా విధానాన్ని అవలంబిస్తున్నారు.
ఏటా 1.3 మిలియన్ క్యాన్సర్ కేసులు..
దేశంలో ఏటా 1.3 మిలియన్ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. ఇందులో 60 శాతం కేసులు నియంత్రించదగ్గవే. ప్రజల్లో వ్యాధి పట్ల అవగాహన పెంచితే నియంత్రణ సాధ్యమవుతుంది. మరో 20 శాతం కేసులను స్క్రీనింగ్ ద్వారా తొలి దశలోనే గుర్తించవచ్చు. పెద్ద ఎత్తున స్క్రీనింగ్ నిర్వహించడం ద్వారా తొలి దశలోనే క్యాన్సర్ కేసులు గుర్తించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుండటం శుభపరిణామం.
క్యాన్సర్‌పై విజయమే లక్ష్యం
– వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి రజని
క్యాన్సర్‌పై పూర్తి స్థాయి విజయం సాధించడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ పనిచేస్తున్నారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని వైద్య, ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో సోమవారం మంత్రితో ఏపీ ప్రభుత్వ క్యాన్సర్ కేర్ సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి రజని మాట్లాడుతూ.. వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా తొలి దశలోనే క్యాన్సర్ కేసులను గుర్తించేందుకు కృషి చేస్తున్నామన్నారు.
ప్రజలకు వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని చెప్పారు. క్యాన్సర్ స్క్రీనింగ్‌పై గ్రామస్థాయి సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామన్నారు. త్వరలో తీసుకొస్తున్న ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా గ్రామ స్థాయిలోనే క్యాన్సర్‌కు విస్తృత స్క్రీనింగ్ చేపడతామని తెలిపారు. క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తిస్తే సులభంగా నయం చేయవచ్చన్నారు. ఈ సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్ కుమార్ పాల్గొన్నారు.
క్యాన్సర్ చికిత్సకు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో స్విమ్స్..
తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్)ను క్యాన్సర్ వ్యాధి చికిత్స, పరిశోధనకు సంబంధించి ప్రపంచ స్థాయి ప్రమాణాలతో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. మరోవైపు రాష్ట్రంలో రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రల్లో పూర్తి స్థాయిలో సమగ్ర క్యాన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఈ చర్యలతో క్యాన్సర్ వైద్యాన్ని ప్రభుత్వం వేరే స్థాయికి తీసుకెళ్లబోతోంది.
నేషనల్ క్యాన్సర్ గ్రిడ్‌లోకి ఏపీ..
ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందిన క్యాన్సర్ రోగుల డేటా ఆధారంగా రాష్ట్రంలో ఏ జిల్లాలో..ఏ రకం క్యాన్సర్ కేసులు అధికంగా నమోదవుతున్నాయో వైద్య శాఖ అధ్యయనం చేసింది. మరోవైపు నోటిఫైడ్ జబ్బుల జాబితాలో క్యాన్సర్‌ను చేర్చడం ద్వారా డేటాను సేకరిస్తోంది. ఈ డేటాను నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ (ఎన్‌సీజీ)తో పంచుకుంటోంది. అలాగే అక్కడి డేటాను మనం పొందేలా ఎన్‌సీజీలోకి ఏపీ చేరింది. ఇది ఎంతో ఉపయుక్తం.
ఏఎంఆర్‌పై ప్రత్యేక కార్యాచరణ
యాంటీబయోటిక్స్ అతి వినియోగంతో శరీరంలో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) పెరిగి ప్రాణాంతక వ్యాధులు సోకిన సమయంలో మందులకు జబ్బు లొంగని పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఏఎంఆర్‌పై ప్రత్యేక కార్యాచరణను రాష్ట్ర వైద్య శాఖ రూపొందించింది.
ప్రపంచ నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుని అధికారులు ముందుకు వెళుతున్నారు. 5 నుంచి 10 రోజుల్లో తగ్గిపోయే వైరల్ ఫీవర్స్‌కు కూడా అవసరం లేకపోయినా యాంటీబయోటిక్స్ వాడుతున్నారు. అయితే వీటిని ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి.. ఎందుకు వాడాలి.. అని ప్రజలను చైతన్యపరిచేలా కార్యక్రమాలు చేపట్టడం హర్షణీయం.
Comments
Please login to add a commentAdd a comment