
సాక్షి, అమరావతి: దేశంలో క్యాన్సర్ మహమ్మారి విజృంభిస్తోంది. గత మూడేళ్లలో (2020–22) దేశంలో 42.88 లక్షల మంది క్యాన్సర్ బారినపడ్డారు. మృతుల సంఖ్య కూడా ఏటా పెరుగుతోంది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్‌లో ఈ వివరాలు పొందుపరిచింది. 2020 నుంచి 2022 మధ్య రాష్ట్రాలవారీగా ఐసీఎంఆర్ వెల్లడించిన క్యాన్సర్ కేసులు, మరణాలను ఇటీవల కేంద్ర వైద్య శాఖ మంత్రి మాండవీయా లోక్‌సభలో వివరించారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. దేశవ్యాప్తంగా 2020లో 13,92,179 కేసులు నమోదవగా 2021లో 14,26,447 కేసులు, 2022లో 14,61,427 కేసులు నమోదయ్యాయి.
ఇదే కాలంలో మరణాల సంఖ్య కూడా భారీగానే ఉంది. 2020లో దేశవ్యాప్తంగా 7.70 లక్షలు, 2021లో 7.89 లక్షలు, 2022లో 8.08 లక్షల మరణాలు నమోదయ్యాయి. కేసులు, మరణాలు ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా ఉన్నాయి. 2022లో ఉత్తరప్రదేశ్‌లో 2,10,958 కేసులు, 1,16,818 మరణాలు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. ఏపీలో 73,536 క్యాన్సర్ కేసులు నమోదవగా, 40,307 మంది మరణించినట్లు ఆ గణాంకాలు తెలిపాయి. అత్యల్పంగా లక్షద్వీప్‌లో 28 కేసులు, 14 మరణాలు నమోదయ్యాయి.
క్యాన్సర్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
రాష్ట్రంలో క్యాన్సర్ వ్యాధి నియంత్రణ, చికత్సకు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలోకి చేర్చింది. ఇప్పటివరకు క్యాన్సర్ చికిత్సలకే రూ. వెయ్యి కోట్లకు పైగా ఖర్చు చేశారు. మరోవైపు ప్రభుత్వ రంగంలో క్యాన్సర్ చికిత్స సదుపాయాలను మెరుగుపరుస్తోంది. దీనివల్ల క్యాన్సర్ బాధితులు వ్యయప్రయాసలకోర్చి వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన పని ఉండదు.
ఇందులో భాగంగా తొలి దశలో ప్రస్తుతం ఉన్న ఏడు ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో క్యాన్సర్ చికిత్స సదుపాయాల మెరుగుపరుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే రూ.119.58 కోట్లు కేటాయించింది. వ్యాధి నియంత్రణ చర్యల్లో భాగంగా నోటిఫైడ్ జబ్బుల జాబితాలోకి క్యాన్సర్‌ను చేర్చింది. ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తించి, ప్రాణాపాయ పరిస్థితులను తప్పించడానికి సామూహిక క్యాన్సర్ స్క్రీనింగ్ చేపడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment