
క్యాన్సర్‌ను ఓడించిన ఫిట్‌నెస్ ట్రైనర్
ఓటమిని అంగీకరించని ఫర్జానా బేగం
ఎన్ని మేఘాలొచ్చినా..ఆకాశం కదలదు..ఎన్ని తుఫానులైనా..సముద్రం నిలిచిపోదు.. ఎదురయ్యే బాధలన్నీ..ఎగసి పడే తరంగాలే..ఆపదల గాలి ఎంత వేగంగా వీచినా, దృఢమైన మనసు చలించదు. కోల్పోయినవేమీ కన్నీటి కథలవ్వవు..ఎలాంటి కష్టాలు ఎదురొచ్చినా ధైర్యం చేతిలో తలవంచక తప్పదు..నీ ధైర్యమే నీ గెలుపు పతాకం..తట్టుకొనే శక్తి ముందు, ఏ గెలుపైనా తక్కువే. వాడిపోయిన పువ్వుల్లా రాలిపోతాయి..కష్టానికి పూచే పూలే నిజమైన..విజయాలై వికసిస్తాయి. అచ్చం ఫర్జానా బేగంలా..క్యాన్సర్ వచ్చిందని ఆమె కుంగిపోలేదు. ఆత్మస్థైర్యంతో ముందడుగు వేసింది. ఆమె సంకల్పం ముందు క్యాన్సర్ ఓడిపోయింది.
ఆనందంగా..ఆరోగ్యకరంగా సాగుతున్న జీవితం. శారీరక వ్యాయామ, పోషకాహార నిపుణురాలిగా అందరికీ సూచనలిచ్చే వ్యక్తి. ఇద్దరు కుమార్తెలతో సంతోషంగా సాగుతున్న కుటుంబం. ఒక్కసారిగా ఆమె శరీరంలోకి క్యాన్సర్ మహమ్మారి ప్రవేశించింది. భయపడిన ఆమె వైద్యులు చెప్పిన మాట విని అంతలోనే తేరుకుంది. మనోధైర్యాన్ని సడలనివ్వలేదు. క్యాన్సర్‌ను ధైర్యంగా ఎదుర్కొంది. వైద్యుల సూచనలు పాటిస్తూ ముందుకు సాగింది. కాన్సర్ బారిన పడి దానిని అధిగమించి నూతన జీవితాన్ని పొందాలనేవారికి స్ఫూర్తిగా నిలిచారు..నగరానికి చెందిన ఫిట్‌నెస్ ట్రైనర్ ఫర్జానా బేగం.
ఆనందంగా సాగుతున్న జీవితంలో..
గృహిణిగా తన కుటుంబాన్ని, సొంత ఫిట్‌నెస్ సెంటర్‌ను నిర్వహిస్తూ ఆనందంగా సాగుతున్న బేగం జీవితంలో 2017 నుంచి కష్టాలు ప్రారంభమయ్యాయి. షోల్డర్ పెయిన్‌తో వైద్యుల వద్దకు వెళ్లిన ఆమె ఎంఆర్‌ఐ లో ట్యూమర్ ఉన్నట్లు గుర్తించారు. ఆ ట్యూమర్ రిబ్స్‌లోని వెళ్లినట్లు వైద్యులు గుర్తించారు. వైద్యులు సర్జరీ చేశారు. అనంతరం 2019లో తిరిగి తీవ్రమైన ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరారు. ఆమె ఛాతీ పక్కటెముకలు రెండూ ట్యూమర్ కారణంగా పూర్తిగా దెబ్బతిన్నట్లు వైద్యులుగుర్తించారు. వైద్యులు బయాప్సీ చేసి క్యాన్సర్‌గా నిర్ధారించారు.
కష్టం వచ్చినప్పుడు పోరాడాలి
ఇద్దరు కుమార్తెలకు తాను ఒక ఉదాహరణగా నిలవాలని ఫర్జానా నిర్ణయించుకున్నారు. కష్టం వచ్చినపుడు పోరాడాలని, ఎప్పుడూ వెనకడుగు వెయ్యకూడదని భావించి, ఆచరణలో చూపారు. సమస్యలు జీవితంలో నిత్యం వస్తుంటాయని, పోరాటం మానకూడదంటారు ఫర్జానా. నేను గెలవాలి అనే బలమైన ఆకాంక్ష సంపూర్ణ ఆరోగ్యంతో తయారయ్యేలా చేసిందన్నారు. నేడు ఎందరో క్యాన్సర్ బాధితులకు ఆమె జీవితం ఒక స్ఫూర్తిదాయక పాఠం. ఇటీవల ఆమె బాలకృష్ణ నిర్వహించే అన్‌స్టాపబుల్ షోలో కూడా పాల్గొని తన జీవిత ప్రయాణాన్ని, క్యాన్సర్‌ను జయించిన విధానాన్ని ప్రజలతో పంచుకున్నారు.
ధైర్యం కోల్పోలేదు
తొలుత కాస్త భయపడినా కొద్దిరోజుల్లోనే ఆత్మస్థైర్యంతో ధైర్యంగా చికిత్సకు వెళ్లారు. కిమో థెరపీ తీసుకున్నారు. కిమో థెరపీ పర్యవసనాలు ఫలితంగా అనేక ఆరోగ్య సమస్యలను చవిచూశారు. వాటన్నింటినీ భరిస్తూ, అధిగమిస్తూ పూర్తిస్థాయిలో చికిత్స తీసుకున్నారు. మనసునిండా మనోబలం, దైవంపై నమ్మకంతో చికిత్సకు సానుకూల ఆలోచనలతో వెళ్లారు. అదే సమయంలో తనకు సంబంధించిన ఫిట్‌నెస్ జిమ్‌లో తన వృత్తిని యథావిధిగా కొనసాగించారు.
వారే నా ధైర్యం
క్యాన్సర్ వచ్చిందని తెలిసిన సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, తన వద్ద శిక్షణ తీసుకున్న ఫిట్‌నెస్ ట్రైనర్లు అందించిన మానసిక స్థైర్యం వ్యాధి నుంచి త్వరగా కోలుకొనేలా చేసింది. మానసిక ఆరోగ్యం దెబ్బతినకుండా, మనోధైర్యం కోల్పోకుండా ముందుకు సాగడం వలనే త్వరగా కోలుకోవడం సాధ్యపడింది. అదే సమయంలో వైద్యులు, వైద్య సిబ్బంది అందించిన స్థైర్యం మరవలేనిదని ఆమె చెప్పారు. చికిత్స సమయంలో రోజుకో విధంగా శరీరం స్పందించడం, అనేక సందేహాలు రావడం జరిగేది. వీటిని వైద్యులకు వివరిస్తూ వారి సూచనలను స్వీకరిస్తూ ముందుకు సాగారు.
Comments
Please login to add a commentAdd a comment