పొగాకు ప్రేమికులు మా ప్రియతమ నేతలు
* శరద్‌పవార్ నుంచి ఆర్‌ఆర్ పాటిల్ వరకు గుట్కా బాధితులే
* పొగతాగే వారిలో మంత్రులు, ప్రజా ప్రతినిధులు
* డాక్టర్ పీసీ గుప్తా పరిశోధనలో బట్టబయలు
సాక్షి, ముంబై: చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వేదికలనెక్కి ఉపన్యాసాలు దంచే అనేక మంది రాజకీయ ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు దురలవాట్లకు బానిసలేనన్న ఆశ్చర్యకరమైన విషయం ఓ అధ్యయనంలో వెలుగులోకి వచ్చింది. చట్టాలను అమలు చేయాల్సిన నేతలే వాటిని తుంగలో తొక్కుతున్నారు. అనేక మంది ప్రస్తుత, మాజీ మంత్రులు, విధానసభ సభ్యులకు పాన్, గుట్కా, తంబాకు, సిగరెట్, బీడి వంటి వ్యసనాలున్నాయని ఆ అధ్యయన నివేదిక వెల్లడించింది.
టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ కోసం పనిచేసిన డాక్టర్ పి.సి.గుప్తా మహారాష్ట్రలో తంబాకు సేవనంపై పరిశోధన చేశారు. ప్రస్తుతం హెలీజ్ సిక్సారియా ఇన్‌స్టిట్యూట్ ఫర్ పబ్లిక్ రీసెర్చ్ కోసం పనిచేస్తున్న డాక్టర్ గుప్తా తన పరిశోధన వివరాలను వెల్లడించారు. ఇందులో పలువురు రాజకీయ నాయకుల విషయాలు కూడా బయటపడ్డాయి.
ప్రస్తుతం బాంద్రాలోని లీలావతి ఆస్పత్రిలో క్యాన్సర్ వ్యాధికి చికిత్స పొందుతున్న మాజీ హోం మంత్రి ఆర్.ఆర్.పాటిల్ కూడా తంబాకు సేవించేవారని తెలిసింది. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు, కేంద్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్‌కు కూడా క్యాన్సర్ ఉంది. గుట్కా అతిగా తినడంవల్ల నోటికి సోకిన క్యాన్సర్‌ను సర్జరీ ద్వారా తొలగించుకున్నారు.
ఎన్సీపీకి చెందిన ప్రఫుల్ పటేల్‌కు సిగరెట్ తాగే అలవాటు చాలా ఉండేది. అయితే ప్రస్తుతం పొగ తాగడం మానుకున్నానని తెలిపారు. పొగాకు తయారిలో దేశంలోనే అగ్రగామిగా ఉన్న సి.జె.గ్రూప్ ప్రఫుల్ పటేల్ కుటంబానికి చెందినదే. ఈ కంపెనీ ద్వారా యేటా నాలుగు వేల కోట్ల డాలర్ల లావాదేవీలు జరుగుతాయి. బీజేపీకి చెందిన గిరీష్ బాపట్, రెవెన్యూ శాఖ మంత్రి ఏక్‌నాథ్ ఖడ్సేకు సిగరెట్ తాగే అలవాటుంది. కానీ ప్రస్తుతం ఆ అలవాటు మానుకున్నట్లు చెబుతున్నారు.
గుట్కా, ఖైనీ, పాన్ మసాలా వంటి పొగాకు ఉత్పత్తులను ప్రభుత్వం నిషేధించింది. అయినప్పటికీ రాజకీయ ప్రముఖులతో పాటు సామాన్యులకు కూడా ఇవి అందుబాటులోనే ఉన్నాయి. రాష్ట్రంలో ప్రతీరోజు 2.50 కోట్ల మందికి పైగా ప్రజలు పొగాకును వివిధ రూపాల్లో సేవిస్తున్నారు. వీరిలో తంబాకు తినేవారు కోటిన్నర మంది ఉన్నారు.
పొగాకును గుట్కా, ఖైనీ, పాన్ మసాల వంటి పదార్థాలుగా వీరు సేవిస్తున్నరు. ఇలా పొగాకుకు బానిసలైన ప్రతి 30 మందిలో ఒకరికి నోటి క్యాన్సర్ సోకే ప్రమాదం ఉందని ఈ అధ్యయనంలో పాల్గొన్న డాక్టర్ ప్రభాత్ ఝా తెలిపారు. 2010లో డాక్టర్ ప్రభాత్ ఝా వివిధ సేవా సంస్థల సాయంతో చేపట్టిన పరిశోధనలో భారత దేశంలో క్యాన్సర్ సోకిన వారిలో పురుషుల సంఖ్య 42 శాతం ఉండగా, మహిళల శాతం 18 ఉన్నట్లు పేర్కొన్నారు.