క్యాన్సర్ అనే జబ్బుకు చికిత్స చేయడం కోసం శస్త్రచికిత్స చేస్తారు...
పిల్లల కోసం ప్రత్యేకం
క్యాన్సర్ అనే జబ్బుకు చికిత్స చేయడం కోసం శస్త్రచికిత్స చేస్తారు. ఇలా క్యాన్సర్ గడ్డను తీసే సమయంలో అత్యంత చిన్న ముక్క మిగిలిపోయినా క్యాన్సర్ గడ్డ మళ్లీ పెరగవచ్చు. ఇక కీమోథెరపీ... దీని వల్ల జుట్టు రాలిపోవడం, మనిషి వికారంగా మారిపోవడం వంటి కొన్ని తాత్కాలిక దుష్ర్పభావాలుంటాయి. రేడియోథెరపీతో క్యాన్సర్ కణాలను కాల్చేసే సమయంలో ఆరోగ్యకరమైన కొన్ని కణాలూ నాశనమైపోవచ్చు. నిజానికి చెడ్డదీ, చెరుపు చేసేదీ క్యాన్సర్ కణమే. అదే చావాలి. మిగతా కణాలన్నీ ఆరోగ్యంగా ఉండాలి. దీనికోసం ఏం చేయగలమని పరిశోధించారు శాస్త్రవేత్తలు. చెడ్డ కణంలోనూ కణానికి సంబంధించిన భాగాలుంటాయి కదా. వాటి స్వరూపాన్ని కొన్ని ప్రక్రియల ద్వారా మార్చేస్తారు. అలా మార్చడంతో ఆ కణం తనకు తీవ్రమైన అవమానం జరిగినట్లు ఫీలవుతుంది. తనను తాను కుంచింపజేసుకుని ‘ఆత్మహత్య’ చేసుకుంటుంది. ఇలా ప్రోగ్రామ్ చేయడం ద్వారా క్యాన్సర్ కణం తనను తాను చంపేసుకునే ప్రక్రియను ‘ప్రోగ్రామ్ సెల్ డెత్’ అంటారు. దీని కోసమే ఉద్దేశించిన గ్రీకు మాట ‘అపాప్టోసిస్’. అంటే రెమ్మలా రాలిపోవడమని అర్థం. ఇలా ఒక కణం తనను తాను నాశనం చేసుకునేలా చేసే జన్యువులను గుర్తించినందుకు సిడ్నీ బెర్నర్, హార్విట్జ్, ఇసల్‌స్టన్ అనే శాస్త్రవేత్తలకు 2002లో నోబెల్ బహుమతి ఇచ్చారు.