
"సర్వేంద్రియాణాం నయనం ప్రధానం" అన్నారు పెద్దలు. కళ్లే లేకపోతే ఏం నేర్చుకోవాలన్న కష్టమే. అంధత్వంతో బాధపడేవాళ్లకు బాగా తెలుస్తోంది ఆ ఇబ్బంది ఏంటో. అయితే పుట్టుకతో కంటి చూపు కోల్పోయినా, లేదా ఏదైనా వ్యాధి కారణంగా కంటి చూపు కోల్పోయినా తిరిగి చూపు ప్రసాదించడం కాస్త కష్టం మవుతుంది. కంటి చూపుకి కారణమయ్యే, నరాలు, కార్నియా బాగుంటేనే అదంతా సాధ్యం. అలాంటిది వైద్యులు సరికొత్త వైద్య విధానంతో అంధత్వంతో భాధపడుతున్న వాళ్లకు సరికొత్త ఆశను అందించారు. కంటికి దంతం సాయంతో చూపుని ప్రసాదించారు వైద్యులు. ఇలాంటి ప్రక్రియ ద్వారా చూపుని ప్రసాదించిన తొలి కేసు ఇదేకావడం విశేషం.
కెనడియన్ మహిళ గెయిల్ లేన్‌కి 'టూత్ ఇన్ ఐ' అనే అరుదైన శస్త్ర వైద్య విధానంతో చూపుని ప్రసాదించారు. దీన్ని వాంకోవర్‌లోని మౌంట్ సెయింట్ జోసెఫ్ హాస్పిటల్ నిర్వహించింది. ఈ మేరకు డాక్టర్ గ్రెగ్ మోలోనీ శస్త్ర చికిత్స గురించి వివరిస్తూ..ఈ ప్రక్రియ గురించి చాలామంది వైద్యులకు తెలియదని అన్నారు.
ఇది క్రియాత్మక కార్నియాను సృష్టించడానికి రోగి పంటిలో లెన్స్‌ను అమర్చి చేస్తారని చెప్పారు. ఇది సంక్లిష్టమైన ప్రక్రియని, రెండు దశల్లో నిర్వహించినట్లు తెలిపారు. ముందుగా రోగి నోటిలో దంతాన్ని ఒకటి తీసి సరైన ఆకృతిలోకి మార్చి, దానిలో ప్లాస్టిక్ లెన్స్‌ని చొప్పిస్తారు.
ఈ సవరించిన దంతాన్ని ఆమె చెంపలో మూడు నెలలపాటు ఉంచుతారు. ఆ తర్వాత అవసరమైన కణాజాలాన్ని అభివృద్ధి చేసిన తర్వాత నేరుగా కంటిలో అమర్చుతామని వివరించారు. ఆమె చెంప నుంచి కణజాల అంటుకట్టుతో దీన్ని అమర్చడం సాధ్యమవుతుందని అన్నారు. ఎందుకంటే సహజ బంధన కణజాలం దంతంలో లేకపోవడంతో ఇలా చేయాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు.
అయితే ఈ ప్రక్రియ అన్ని దృష్టి సమస్యలకు సరిపోయే వైద్య విధానం మాత్రం కాదని డాక్టర్ మోలోనీ నొక్కి చెప్పారు. ఆటో ఇమ్యూన్ వ్యాధులు, రసాయన కాలిన గాయాలు లేదా ఇతర గాయాలు, కండ్లకలక మచ్చల వల్ల తీవ్రమైన కార్నియల్ అంధత్వంతో బాధపడుతున్న వ్యక్తులకు ఈ వైద్య విధానం ఉపయోగపడుతుందని అన్నారు.
ఈ శస్త్ర చికిత్స మంచి ఫలితం ఇవ్వాలంటే మాత్రం సదరు రోగులకు ఆరోగ్యకరమైన రెటీనా, ఆప్టిక్ నరాలను కలిగి ఉండాలని అన్నారు. చివరగా సదరు రోగి గెయిల్ లేన్ తాను పదేళ్లుగా చూడలేదని..ఇప్పుడూ గనుక ఈ ప్రక్రియ సఫలమైతే భయం, ఆశ రెండూ ఒకేసారి కలుగుతాయంటూ కన్నీళ్లు పెట్టుకుందామె. కంటి చూపు వస్తే మాత్రం తప్పక చూడాల్సిన అద్భుతాలు ఎన్నో ఉన్నయంటూ సంతోషభరితంగా చెబుతోంది లేన్.
(చదవండి: చికెన్ 65'కి ఆ పేరెలా వచ్చింది..? ఆ నెంబర్‌తో పిలవడానికి రీజన్..?)