![- - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/5/5544.jpg.webp?itok=ByliY4MH)
లబ్బీపేట(విజయవాడతూర్పు): యువతి పొట్టలో చుట్టుకుపోయి గొంతు వరకూ వ్యాప్తి చెందిన వెంట్రుకలను ప్రభుత్వ ఆస్పత్రి జనరల్ సర్జరీ వైద్యులు శస్త్ర చికిత్స చేసి తొలగించారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రి జనరల్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ కె.అప్పారావు తెలిపిన వివరాల ప్రకారం... కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం గడ్డిపాడు గ్రామానికి చెందిన ఇంటర్ చదువుతున్న 18 ఏళ్ల యువతి వెంట్రుకలు చుట్టుకుని మింగుతుండేది.
కొంతకాలానికి అవి పొట్టలో చుట్టుకుపోయి క్రమేణా గొంతులోకి వ్యాప్తి చెందాయి. దీంతో ఏమీ తినలేని, తాగలేని పరిస్థితుల్లో తీవ్రమైన కడుపునొప్పి, వాంతులతో బాధితురాలు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. తొలుత గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు పరీక్షించి ఎండోస్కోపీ ద్వారా తొలగించాలని ప్రయత్నించగా సాధ్యం కాలేదు.
దీంతో ఆమెకు శుక్రవారం సర్జన్‌లు దుర్గారాణి, చందన ప్రియాంక, గాయత్రి, ప్రవీణ్‌కుమార్‌లతో పాటు, ఎనస్థీషియన్‌లు ఏవీరావు, కిరణ్ బృందం శస్త్ర చికిత్స నిర్వహించారు. పొట్టలో చుట్టుకుపోయిన వెంట్రుకల చుట్టను తొలగించారు. ఈ సందర్భంగా డాక్టర్ కె.అప్పారావు మాట్లాడుతూ గొంతు వరకూ వ్యాప్తి చెందడంతో శస్త్ర చికిత్స క్లిష్టతరంగా మారిందన్నారు. ఈ తరహా కేసులను ట్రైకోబెజార్‌గా పిలుస్తామని, ఇలాంటి వాటిని చూడటం చాలా అరుదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment