
టెన్త్ టాపర్ బ్రదర్స్‌కు కలెక్టర్ ప్రశంస
చిలకలపూడి(మచిలీపట్నం): ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన ఇరువురు అన్నదమ్ములను కలెక్టర్ డీకే బాలాజీ శనివారం తన చాంబర్‌లో అభినందించారు. ఉంగుటూరు మండలం మధిరపాడు గ్రామానికి చెందిన ఇందుపల్లి జెడ్పీ హైస్కూల్‌లో పదో తరగతి విద్యార్థులు దుబ్బాకుల దుర్గా యశ్వంత్ 591 మార్కులు, దుబ్బాకుల వీర వెంకటనాగేంద్ర 589 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారిని ప్రత్యేకంగా ప్రశంసించారు. భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారని వారిని అడగ్గా ఒకరు చార్టర్డ్ అకౌంటెంట్, మరొకరు ఇంజినీర్ అవుతామని తెలిపారు. ఉంగుటూరు మండలం మధిరపాడు గ్రామానికి చెందిన ఈ విద్యార్థుల తల్లిదండ్రులు దుబ్బాకుల నరసింహారావు, నాగదుర్గ వ్యవసాయ కూలీలు. అనంతరం కలెక్టర్ అన్నదమ్ములిద్దరికీ సొంత నిధులతో స్మార్ట్ వాచ్‌లను బహూకరించారు. కార్యక్రమంలో డీఈవో పీవీజే రామారావు, విద్యార్థుల తల్లిదండ్రు లు దుబ్బాకుల నరసింహారావు, నాగదుర్గ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సీతారాం పాల్గొన్నారు.