
కూచిపూడి గ్రామాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
చిలకలపూడి(మచిలీపట్నం): కూచిపూడి గ్రామాన్ని రాష్ట్ర వారసత్వ సంపద గల ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర నివేదికను వారంలోగా తయారుచేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కూచిపూడి నాట్య కళకు మూలకేంద్రమైన గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ గ్రామాభివృద్ధిలో సినీ తారలు, వ్యాపార దిగ్గజాలను భాగస్వామ్యం చేసి వారి ద్వారా నిధులను సమకూర్చే ప్రయత్నం చేయాల్సి ఉందన్నారు. కూచిపూడి వెళ్లే రహదారి మార్గంలో రాకపోకలకు ఇబ్బంది లేకుండా గుంతలను పూడ్చివేయాలన్నారు. గ్రామాభివృద్ధి కోసం యునెస్కో వారికి ప్రతిపాదనలు పంపేందుకు డాక్యుమెంటేషన్ సిద్ధం చేయాలన్నారు. ప్రతి సంవత్సరం డిసెంబరు నెలలో కూచిపూడి వార్షికోత్సవాలను యక్షగాన వసంతం పేరుతో వారం రోజుల పాటు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. సొసైటీని ఏర్పాటు చేసి కూచిపూడి అభివృద్ధి పనులు, వార్షికోత్సవాల నిర్వహణ జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ వ్యవస్థను పటిష్టంగా పనిచేసేందుకు కార్పస్ నిధులు సమకూర్చుకునేందుకు చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో రాష్ట్ర పర్యాటకశాఖ ప్రాంతీయ సంచాలకురాలు ప్రసన్నలక్ష్మి, డీఆర్వో కె.చంద్రశేఖరరావు, ఉయ్యూరు ఆర్డీవో హేలషారోన్, జెడ్పీ సీఈవో కె.కన్నమనాయుడు, డీఆర్డీఏ పీడీ హరిహరనాఽథ్, డీపీవో జె.అరుణ, జిల్లా పర్యాటక అధికారి రామ్‌లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
వారసత్వ సంపద గల ప్రాంతంగా గుర్తింపు సినీ తారలు, వ్యాపార దిగ్గజాలను భాగస్వాములను చేస్తాం వారి ద్వారా నిధులు సమకూర్చేందుకు యత్నం వారం లోగా సమగ్ర నివేదికకు కలెక్టర్ ఆదేశాలు