
కానుగ కాయలతో జాతీయ జెండా
పెనమలూరు: కానుగ కాయలకు రంగు వేసి జాతీయ జెండాను రూపొందించాడు చిన్నారి లిషాన్. చిన్నారి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తన పేరు నమోదు చేసుకోవటానికి ప్రతిభ చాటాడు. తాడిగడప శివ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థి వినుకొండ లిషాన్‌కు నాలుగున్నర ఏళ్లు. పోరంకికి చెందిన శివప్రసాద్, శిరీష దంపతులు తమ కుమారుడి లిషాన్‌కు చిత్రకళపై మక్కువ ఉండటాన్ని గుర్తించి గిన్నీస్ బుక్ హోల్డర్, ప్రముఖ చిత్రకారుడు పామర్తి శివ వద్ద శిక్షణ ఇిప్పిస్తున్నారు. లిషాన్ ప్రపంచ రికార్డు ప్రయత్నంలో భాగంగా ఈ నెల 25వ తేదీన 1,211 కానుగ కాయలకు కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు వేసి జాతీయ జెండాను రూపొందించాడు. కాయలకు నీలిరంగు వేసి అశోక చక్రాన్ని తీర్చిదిద్దాడు. కానుగ కాయలతో జాతీయ జెండా రూపకల్పనను ఐదు గంటల 11 నిమిషాల్లో పూర్తి చేశాడు. ఈ జెండా 40 అంగుళాల ఎత్తు, 55 అంగుళాల వెడల్పుతో ఉంది. ఈ మేరకు వివరాలను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు, అసిస్ట్ వరల్డ్ రికార్డు సంస్థలకు పంపామని చిత్రకారుడు పామర్తి శివ తెలిపారు.