ఉప్పల్: భార్యకు కేన్సర్ అని తేలడంతో భర్త తల్లడిల్లిపోయాడు. అనారోగ్యంతో భార్య రోజురోజుకూ కుంగిపోతోంది. ఈ పరిస్థితుల్లో మానసిక వ్యధకు గురైన దంపతులు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలుకానగర్ డివిజన్ ధర్మపురి కాలనీకి చెందిన దుర్వాసుల సూర్యనారాయణ శాస్త్రి (60), జగదీశ్వరి (56) భార్యాభర్తలు. సూర్యనారాయణ ఎన్టీపీసీలో జీఎంగా పని చేసి మూడేళ్ల క్రితం స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. వీరి కుమారుడు సుశాంత్ గచ్చిబౌలిలో ఉంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల జగదీశ్వరి కేన్సర్ వ్యాధికి గురయ్యారు. దీంతో భార్యాభర్తలిద్దరూ తీవ్రంగా కలత చెందారు.
ఈ క్రమంలో ఈ నెల 3న సూర్యనారాయణ శాస్త్రి తన కుమారుడికి ఫోన్ చేసి తాను ఓ సెమినార్ కోసం బయటకు వెళ్తున్నానని, అమ్మను కూడా తీసుకెళ్తున్నాను.. నాలుగు రోజుల వరకు రాను అని చెప్పారు. ఆ తర్వాత వారం రోజులుగా ఎలాంటి ఫోన్ రాకపోవడంతో బుధవారం కుమారుడు తండ్రికి ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. సెమినార్‌కూ వెళ్లలేదని తెలిసింది. దీంతో హుటాహుటిన బుధవారం ఉదయం ఉప్పల్‌లోని ఇంటికి వచ్చి చూడగా గేట్‌కు తాళం వేసి ఉంది. పని మనిషికి ఫోన్ చేసి పిలిపించి తాళం తీసి వెళ్లగా ఇంటి తలుపులు లోపలి నుంచి లాక్ చేసి ఉన్నాయి. కిటికీలోంచి చూడగా దుర్వాసన రావడంతో వెంటనే తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు.
అప్పటికే కుళ్లిన స్థితిలో మృతదేహాలు పడి ఉన్నాయి. మృతదేహాల పక్కన, ఇంకా రెండు చోట్ల మూడు సూసైడ్ నోట్‌లను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. ‘అనారోగ్య కారణాల చేత సూసైడ్ చేసుకుంటున్నాం. మా చావులకు ఎవరూ కారణం కాదు’ అంటూ రెండు లైన్లు తెలుగులో నోట్ రాసి ఉంది. దీంతో కుమారుడు సుశాంత్ ఉప్పల్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాల్ని స్వాదీనం చేసుకున్నారు. సుశాంత్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. వారం రోజుల క్రితమే సూర్యనారాయణ శాస్త్రి, జగదీశ్వరి దంపతులు గుర్తు తెలియని మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
లోన్ యాప్ వేధింపులకు యువకుడి బలి
Comments
Please login to add a commentAdd a comment