సాక్షి, హైదరాబాద్: విద్యార్ధుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామరంగారెడ్డి, చైతన్యపురి కార్పొరేటర్ రంగా నర్సింహగుప్తా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చైతన్యపురి డివిజన్ మున్సిపల్ కాలనీలోని శకుంతల ఉన్నత పాఠశాల యాజమాన్యం కారణంగా నిద్రమాత్రలు మింగి ఓ విద్యార్ధిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలుసుకున్న కార్పొరేటర్, జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాఠశాల వద్దకు చేరుకున్నారు.
కరోనా కారణంగా ఫీజులు కట్టలేక ప్రభుత్వ పాఠశాలలో చేరిన ఏడో తరగతి విద్యార్థిణి తల్లి టీసీ కావాలని పాఠశాల యాజమాన్యానికి విజ్ఞప్తి చేసినా ఫీజు మొత్తం బకాయి కడితేనే టీసీ ఇస్తామని ఇబ్బందికి గురి చేయటంతో విద్యార్థిని తల్లిదండ్రులు, కాలనీలోని పిల్లల తల్లిదండ్రులు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. బాధితులకు న్యాయం చేసేవరకు ఉద్యమిస్తామని సామ రంగా రెడ్డి స్పష్టం చేశారు. మండల విద్యా శాఖ అధికారులు వెంటనే స్పందించి పాఠశాల అక్రమాలను బయటపెట్టి సీల్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపి జిల్లా ఉపాధ్యక్షుడు రుద్రారపు శంకర్, డివిజన్ అధ్యక్షుడు వినోద్‌యాదవ్ స్థానిక కాలనీవాసులు పాల్గొన్నారు.
చదవండి: ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డికి త్రుటిలో తప్పిన ప్రమాదం..
Comments
Please login to add a commentAdd a comment