సాక్షి, అమరావతి: క్యాన్సర్ వ్యాధిని ఇప్పటికే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చి సాంత్వన చేకూరుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బాధితుల లెక్కలు పక్కాగా నిర్ధారించి సమగ్రంగా చికిత్స అందించేందుకు సిద్ధమైంది. క్యాన్సర్‌ను నోటిఫై జబ్బుల జాబితాలోకి చేర్చేలా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈమేరకు త్వరలో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం నోటిఫై చేసిన జబ్బులు 31 వరకు ఉండగా జాబితాలో ఎయిడ్స్, మలేరియా, డెంగ్యూ, హెపటైటిస్ లాంటివి ఉన్నాయి. గతేడాది కరోనా రోగుల్లో వెలుగు చూసిన బ్లాక్ ఫంగస్ ఇన్‌ఫెక్షన్‌ను కూడా నోటిఫైడ్ జబ్బుల జాబితాలో చేర్చారు.
వివరాలు లేక అస్పష్టత
క్యాన్సర్ మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తోంది. క్యాన్సర్ రిజిస్ట్రీ గణాంకాల ప్రకారం ఏటా దేశంలో ఎనిమిది లక్షలకు పైగా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలో క్యాన్సర్ కేసులకు సంబంధించి రిజిస్ట్రీ అంటూ ఇప్పటి వరకూ లేదు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద క్యాన్సర్ చికిత్స పొందుతున్న రోగుల గణాంకాల ఆధారంగా ఏటా 53 వేల కొత్త కేసులు నమోదు అవుతున్నట్టు అంచనా. ప్రైవేట్ ఆసుపత్రుల్లో సొంతంగా క్యాన్సర్‌కు చికిత్స పొందుతున్న వారి వివరాలు అందుబాటులో లేవు. దీంతో ఏ ప్రాంతాల్లో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి? ఏ రకం క్యాన్సర్ కేసులు ఎక్కువగా ఉంటున్నాయి? అనే వివరాలు తెలియకపోవడంతో వ్యాధి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టత కొరవడింది.
ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో..
ఒక జబ్బును నోటిఫై చేస్తే క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం కింద రిజిస్టర్ అయిన ప్రైవేట్ ఆస్పత్రులు, డయోగ్నోస్టిక్ కేంద్రాలు సంబంధిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్స వివరాలను ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియజేయాలి. చికిత్సకు నిర్దేశిత ప్రొటోకాల్ అనుసరించాలి. నిబంధనలను అతిక్రమిస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. క్యాన్సర్ వ్యాధిని నోటిఫై చేయడం వల్ల ఎక్కడైనా ఆసుపత్రి, డయాగ్నోస్టిక్ సెంటర్‌లో కేసును కొత్తగా గుర్తించినా, చికిత్స అందించినా ఆ వివరాలు వెంటనే ప్రభుత్వానికి చేరతాయి.
తద్వారా డిజిటల్ క్యాన్సర్ రిజిస్ట్రీని వైద్య శాఖ నిర్వహిస్తుంది. ఇందుకు వెబ్ అప్లికేషన్‌ను రూపొందిస్తున్నారు. ఇందులో అన్ని రిజిస్టర్ ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్స్ సెంటర్‌లకు లాగిన్ ఇస్తారు. దీనివల్ల ఎప్పటికప్పుడు కొత్తగా నమోదైన క్యాన్సర్ కేసులు, చికిత్స పొందిన రోగుల వివరాలు ఆన్‌లైన్‌లో వైద్య శాఖకు చేరతాయి. ఈ వివరాలను రాష్ట్ర స్థాయిలో కమాండ్ కంట్రోల్ రూమ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ విధానాల్లో విశ్లేషించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)కు పంపుతారు.
దేశంలోనే తొలిసారి..
సమర్థంగా క్యాన్సర్‌ను నియంత్రించాలన్న సీఎం జగన్ ఆశయాల మేరకు నోటిఫై జాబితాలో చేర్చాలని నిర్ణయించాం. డిజిటల్ క్యాన్సర్ రిజిస్ట్రీని దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలో ప్రారంభించనున్నాం. వెబ్ అప్లికేషన్ రూపొందిస్తున్నాం. రిజిస్ట్రీ నిర్వహించడం వల్ల కేసులకు అనుగుణంగా వైద్యులు, వైద్య సదుపాయాలు సమకూర్చుకునేందుకు ఆస్కారం ఉంటుంది. క్యాన్సర్‌కు అధునాతన వైద్య చికిత్స అందించేలా ప్రణాళికలు రచిస్తున్నాం.
– నవీన్‌కుమార్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి
ఆరంభంలోనే గుర్తిస్తే..
క్యాన్సర్ కేసులను పక్కాగా నమోదు చేయడం వల్ల సమర్థంగా నియంత్రించే అవకాశాలుంటాయి. వయసు, లింగం, ప్రాంతాల వారీగా ఏ వర్గాల్లో, ఏ రకం క్యాన్సర్లు ఎక్కువగా నమోదవుతున్నాయో తెలుస్తుంది. తద్వారా స్క్రీనింగ్ నిర్వహించి ప్రారంభ దశలోనే గుర్తించి నియంత్రించే వీలుంటుంది. ఉదాహరణకు గుంటూరు జిల్లాలో జీర్ణాశయ క్యాన్సర్, ఉత్తరాం«ధ్రలో ఓరల్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా ఉంన్నట్లు వైద్య శాఖ అంచనా వేస్తోంది. ఇలాంటివన్నీ నోటిఫైతో పక్కాగా తెలుస్తాయి. ఎక్కువగా నమోదయ్యే క్యాన్సర్లపై అధ్యయనం, పరిశోధనలకు ఆస్కారం ఉంటుంది. నూతన వైద్య విధానాల దిశగా అడుగులు వేసే వీలుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment