
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న అన్ని క్యాన్సర్ ఆస్పత్రుల్లో పాలియేటివ్ కేర్ కోసం 5% పడకలను కచ్చితంగా కేటాయించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఆదేశించారు. బుధవారం వైద్య ఆరోగ్య శాఖ విభాగాధిపతులతో ఆమె మంగళగిరిలో సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ..ఆరోగ్యశ్రీ క్యాన్సర్ ఆస్పత్రులను హోమీబాబా క్యాన్సర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నడుస్తున్న క్యాన్సర్ గ్రిడ్‌కు అనుసంధానం చేయాలని అధికారులను ఆదేశించారు. దీనివల్ల ఏ ప్రాంతంలో ఎలాంటి, ఎక్కువ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయో ప్రభుత్వానికి తెలుస్తుందన్నారు.
ఐబ్రిస్ట్ స్క్రీనింగ్‌ను పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని చెప్పారు. రూ.10వేల ఆసరా పింఛన్లు పొందుతున్న వారికి ఉచిత బస్‌పాస్‌లు అందజేయాలని సీఎం ఆదేశించారని, ఆ మేరకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉద్దానం తాగునీటి ప్రాజెక్టుతో పాటు, పలాసలో కిడ్నీ కేర్ సెంటర్‌ను త్వరలో అందుబాటులోకి తెస్తామని తెలిపారు. పిడుగురాళ్ల, పులివెందులలో ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభించనున్న నేపథ్యంలో, ఆయా చోట్ల టీచింగ్ ఆస్పత్రుల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలన్నారు.
నేడు నులిపురుగుల నివారణ మందుల పంపిణీ
జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని పురస్కరించుకుని మంత్రి రజిని పోస్టర్‌ను ఆవిష్కరించారు. గురువారం గుంటూరులో నులిపురుగుల నివారణ మందులు పంపిణీ చేస్తామన్నారు. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ జె.నివాస్, ఆరోగ్యశ్రీ సీఈవో హరీందిరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment