క్యాన్సర్ రోగులకు మెరుగైన వైద్యాన్ని ఇకపై రాష్ట్రంలోనే అందుబాటులోకి తేవడంతో పాటు, వ్యాధి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం బ్లూప్రింట్ సిద్ధంచేసింది. రాష్ట్ర విభజనతో క్యాన్సర్ చికిత్స మౌలిక సదుపాయాలను ఏపీ కోల్పోయింది. అలాగే, గత టీడీపీ ప్రభుత్వం వైద్య రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది.దీంతో క్యాన్సర్ వైద్యానికి రోగులు ఇరుగు పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సిన దుస్థితి. ఈ నేపథ్యంలో.. ప్రజారోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వ రంగంలోనే క్యాన్సర్‌కు మంచి వైద్యం అందించాలని సంకల్పించారు. ఇందుకోసం ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడుని ప్రభుత్వ సలహా దారుగా నియమించి ఆయన సలహాలు, సూచనల మేరకు చర్యలు చేపడుతున్నారు.
– సాక్షి, అమరావతి
మెజారిటీ శాతం ప్రైవేట్ ఆసుపత్రులకే..
ముందుగా.. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను సీఎం జగన్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చారు. ఇందుకోసం 2019 నుంచి క్యాన్సర్ చికిత్సకు రూ.926 కోట్లు ఖర్చుచేసింది. ఈ మొత్తంలో 86 శాతం ప్రైవేట్ ఆసుపత్రులకే చేరింది. ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక వసతులు సరిగ్గా లేకపోవడంతోనే బాధితులు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తోందని ప్రభుత్వం గుర్తించింది. దీంతో ప్రభుత్వ రంగంలోనే క్యాన్సర్ వైద్యాన్ని బలోపేతానికి చర్యలు తీసుకుంటోంది.
గుంటూరులోనే ఆధునిక యంత్రం
రాష్ట్రవ్యాప్తంగా 11 ప్రభుత్వ బోధనాసుపత్రులు ఉన్నాయి. వీటిలో కేవలం గుంటూరు జీజీహెచ్‌లో మాత్రమే క్యాన్సర్ చికిత్సకు వినియోగించే అధునాతన లీనియర్ యాక్సిలేటర్ మిషన్‌తో కూడిన ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాకే ఇది అందుబాటులోకి వచ్చింది. నాలుగుచోట్ల పాత కోబాల్ట్ మెషీన్ సహాయంతో క్యాన్సర్ చికిత్స అందిస్తుండగా.. మిగిలిన కాలేజీల్లో కేవలం డే–కేర్ కీమోథెరపీ మాత్రమే అందుతోంది. దీంతో బోధనాసుపత్రుల్లో వసతుల కల్పనపై ముఖ్యమంత్రి దృష్టిసారించారు. ఈ క్రమంలో రెండు లీనియర్ యాక్సిలేటర్ మిషన్లను కొనుగోలు చేస్తున్నారు. ఇటీవలేరాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తిరుపతిలో శ్రీవేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్, అడ్వాన్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ప్రారంభమైంది.
ఏరియా, జిల్లా ఆసుపత్రుల్లోనూ చికిత్స
మరోవైపు క్యాన్సర్ బాధితుల ఇబ్బందులకు చెక్ పెట్టాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఇందులో భాగంగా.. పౌరుల ఆవాసానికి 50కి.మీ పరిధిలో 2030లోపు క్యాన్సర్ చికిత్సను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఏరియా, జిల్లా ఆసుపత్రులకు ఈ చికిత్సను విస్తరించనున్నారు. దీంతో క్యాన్సర్ నివారణ, బేసిక్ రేడియేషన్, కీమోథెరపీ, ఉపశమన సేవలు చేరువవుతాయి.
అలాగే, ఏరియా, జిల్లా, పాత, కొత్త మెడికల్ కాలేజీ ఆసుపత్రుల్లో 43 క్యాన్సర్ కేర్ సెంటర్లను అభివృద్ధి చేయనున్నారు.
విశాఖపట్నం, గుంటూరు జిల్లా చిన కాకానిలో కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ సెంటర్ (సీసీసీ)లను అధునాతన మౌలిక సదుపాయాలు, స్పెషాలిటీ వైద్యులతో ఏర్పాటుచేస్తారు. దీంతో ఇక్కడ అనేక రకాల క్యాన్సర్ వ్యాధులకు ఉచితంగా చికిత్స అందుతుంది.
తిరుపతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటర్నేషనల్ క్యాన్సర్ కేర్ సెంటర్ (ఐసీసీ) అభివృద్ధి చేపడతారు. దీనిద్వారా పీడియాట్రిక్ కేన్సర్ కేర్ సేవలతో పాటు, జీనోమిక్ రీసెర్చ్ సర్వీసులు, బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ సర్వీసులు అందించడమే లక్ష్యం.
వీటితో పాలియేటివ్ హాస్పైస్ సెంటర్లను ఏర్పాటుచేయాలన్నది లక్ష్యం.
ఈ మొత్తం ప్రక్రియను నాలుగు దశల్లో చేపడతారు.
నివారణకు పెద్దఎత్తున స్క్రీనింగ్
నిజానికి.. ప్రారంభంలోనే వ్యాధిని గుర్తిస్తే ప్రాణాపాయం, చికిత్సకయ్యే ఖర్చు తగ్గుతుంది. స్క్రీనింగ్ ద్వారా రొమ్ము, గర్భాశయ, నోటి తదితర రకాలను ప్రారంభ దశలోనే గుర్తించవచ్చు. ఇందులో భాగంగా రాష్ట్రంలో పెద్దఎత్తున స్క్రీనింగ్ పరీక్షల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లాలోని దొండపాడులో పైలెట్ ప్రాజెక్టు కింద స్క్రీనింగ్ పూర్తయింది. త్వరలో ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా చేపట్టనున్నారు. అనంతరం.. 44 మామో బస్సుల సాయంతో 11,162 గ్రామ సచివాలయాల పరిధిలో 254 రోజుల్లో స్క్రీనింగ్ పరీక్షల నిర్వహణకు ప్రణాళికలు రచిస్తున్నారు.
అడ్వాన్స్‌డ్ స్టేజ్ చికిత్స అవసరం రాకుండా..
2030 నాటికి రాష్ట్రంలో ఏ ఒక్కరికీ అడ్వాన్స్‌డ్ స్టేజ్ చికిత్స అవసరం రాకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తించడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. ప్రివెన్షన్, ట్రీట్‌మెంట్, పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్ మీద దృష్టిసారించాం. పెరుగుతున్న రోగుల సంఖ్య ఆధారంగా డాక్టర్లను తయారుచేసేలా సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రణాళిక రచించాం.
– నవీన్‌కుమార్, ప్రత్యేక కార్యదర్శి వైద్య, ఆరోగ్య శాఖ
Comments
Please login to add a commentAdd a comment