'లెటర్ ఆఫ్ క్రెడిట్ పత్రాన్ని' బాధిత కుటుంబానికి విప్ కాపు రామచంద్రారెడ్డి అందజేత
సాక్షి, అనంతపురం: కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న భర్త పదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి వరకూ గడప దాటి ఎరుగని ఇల్లాలిపై ఇద్దరు చిన్న పిల్లల పోషణ భారం పడింది. దిక్కుతోచని పరిస్థితి. అయినా బిడ్డల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని బతుకు పోరాటాన్ని సాగిస్తూ వచ్చింది. అయినా విధి ఆమె పట్ల వక్రీకరించింది. ఏడేళ్ల వయసున్న చిన్న కుమారుడు క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డాడు.
తన వద్ద ఉన్న ఆస్తి మొత్తం అమ్మినా.. చికిత్సకు అవసరమైన డబ్బు సమకూరదు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి స్పందించారు. చిన్నారి అంశాన్ని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి రూ.14 లక్షల ఆర్థిక సాయం అందేలా చొరవ తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని ఆదివారం బాధిత కుటుంబానికి విప్ అందజేసినప్పుడు నిస్సహాయురాలైన ఆ తల్లి భావోద్వేగానికి లోనైంది. ఆ వేదన ఆమె మాటల్లోనే...
చిన్న వయసులోనే పిల్లల తండ్రి పోయాడు..
నా పేరు వడ్డే లక్ష్మి. రాయదుర్గంలోని పదో వార్డులో నివాసముంటున్న వడ్డే లోకేష్‌తో నాకు వివాహమైంది. ఇద్దరు పిల్లలున్నారు. పెద్దొడు చిన్మయ్ 8వ తరగతి, చిన్నోడు లక్షిత్ 3వ తరగతి చదువుకుంటున్నారు. వీరిద్దరూ చిరుప్రాయంలో ఉన్నప్పుడే నా భర్త అనారోగ్యంతో మృతి చెందాడు. ఆ పరిస్థితుల్లో నాకు దిక్కు తోచలేదు. ఇద్దరు చిన్న పిల్లలను పట్టుకుని ఎలా బతకాలో అర్థం కాలేదు. అయినా పిల్లలిద్దరినీ ప్రయోజకులను చేయాలనే ఆశ నన్ను బతుకు పోరాటం సాగించేలా చేసింది.
రూ.20 లక్షలు అవుతుందన్నారు..
మా చిన్నోడు లక్షిత్ ఒక రోజు స్కూల్ నుంచి వస్తూ సొమ్మసిల్లి పోయాడు. ఏమైందోనని చాలా భయపడ్డాను. ఆస్పత్రికి తీసుకెళ్లా. పరీక్షించిన వైద్యులు అదేదో క్యాన్సర్ జబ్బు సోకిందన్నారు. నాకేమీ అర్థం కాలేదు. హైదరాబాద్‌లోని అమెరికన్ సిటిజన్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారు.
అతి కష్టంపై పిల్లాడిని తీసుకుని హైదరాబాద్‌కు వెళ్లా. ఆస్పత్రిలో పరీక్షించిన డాక్టర్లు పిల్లాడికి బోన్‌మ్యారో చికిత్స చేయాలని, ఇందు కోసం రూ.20 లక్షలు ఖర్చు అవుతుందంటూ ఓ లెటర్ చేతికి ఇచ్చారు. ఆలస్యం చేస్తే పిల్లాడి ప్రాణాలకు ముప్పు తప్పదన్నారు. ఆ సమయంలో అంత డబ్బు ఎలా తీసుకురావాలో అర్థం కాక నాలో నేను ఎంతగా ఏడ్చానో ఆ దేవుడికే తెలుసు.
దేవుడిలా మా బాధను అర్థం చేసుకున్నారు..
హైదరాబాద్ నుంచి తిరిగొచ్చిన నేను నెల రోజుల క్రితం మా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సార్‌ను కలిసేందుకు ఆయన ఇంటి వద్దకెళ్లా. అప్పటికే ఇంటి వద్ద చాలా మంది ఉన్నారు. కాసేపటి తర్వాత సార్ నన్ను చూసి ఆగారు. వెంటనే నేనెళ్లి బిడ్డ పరిస్థితి తెలిపి ప్రాణభిక్ష పెట్టాలని వేడుకున్నా. గొప్ప మనసుతో ఆయన మా బాధను అర్థం చేసుకున్నారు.
విషయాన్ని సీఎం జగనన్న దృష్టికి తీసుకెళ్లారు. దేవుడిలా మమ్మల్ని ఆదుకున్నారు. వైద్యం కోసం రూ.14 లక్షలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సంబంధిత ఆస్పత్రికి ఉత్తర్వులు పంపారని, నేరుగా అక్కడికెళ్లి పిల్లాడికి చికిత్స చేయించుకుని రమ్మని మా ఎమ్మెల్యే సార్ ధైర్యం చెప్పారు (ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ). లెటర్ కూడా నా చేతికి ఇచ్చారు. మాకు నిజమైన దసరా ఈ రోజే వచ్చింది. నా కుమారుడికి ప్రాణభిక్ష పెట్టిన సీఎం జగనన్న, విప్ కాపు రామచంద్రారెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాం.
చిన్మయ్‌కు అభినందన..
సీఎం కార్యాలయం నుంచి అందిన లెటర్ ఆఫ్ క్రెడిట్ పత్రాన్ని ఆదివారం తన క్యాంప్ కార్యాలయంలో బాధిత కుటుంబానికి విప్ కాపు రామచంద్రారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే గొప్ప మనసున్న సీఎం వైఎస్ జగన్ అని కొనియాడారు. సమస్యను వివరించగానే రూ.14 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరు చేయించారన్నారు. అంతేకాక బాధితుడికి అవసరమైన బోన్‌మ్యారో ఇవ్వడానికి ముందుకు వచ్చిన సోదరుడు చిన్మయ్‌ని అభినందించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు ఏటూరి మహేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment