Rama Chandra Reddy
-
సీఎం జగన్ సార్.. మా బిడ్డకు ప్రాణభిక్ష పెట్టారు! : బాధితురాలు లక్ష్మి
సాక్షి, అనంతపురం: కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న భర్త పదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి వరకూ గడప దాటి ఎరుగని ఇల్లాలిపై ఇద్దరు చిన్న పిల్లల పోషణ భారం పడింది. దిక్కుతోచని పరిస్థితి. అయినా బిడ్డల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని బతుకు పోరాటాన్ని సాగిస్తూ వచ్చింది. అయినా విధి ఆమె పట్ల వక్రీకరించింది. ఏడేళ్ల వయసున్న చిన్న కుమారుడు క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డాడు. తన వద్ద ఉన్న ఆస్తి మొత్తం అమ్మినా.. చికిత్సకు అవసరమైన డబ్బు సమకూరదు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి స్పందించారు. చిన్నారి అంశాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి రూ.14 లక్షల ఆర్థిక సాయం అందేలా చొరవ తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని ఆదివారం బాధిత కుటుంబానికి విప్ అందజేసినప్పుడు నిస్సహాయురాలైన ఆ తల్లి భావోద్వేగానికి లోనైంది. ఆ వేదన ఆమె మాటల్లోనే... చిన్న వయసులోనే పిల్లల తండ్రి పోయాడు.. నా పేరు వడ్డే లక్ష్మి. రాయదుర్గంలోని పదో వార్డులో నివాసముంటున్న వడ్డే లోకేష్‌తో నాకు వివాహమైంది. ఇద్దరు పిల్లలున్నారు. పెద్దొడు చిన్మయ్ 8వ తరగతి, చిన్నోడు లక్షిత్ 3వ తరగతి చదువుకుంటున్నారు. వీరిద్దరూ చిరుప్రాయంలో ఉన్నప్పుడే నా భర్త అనారోగ్యంతో మృతి చెందాడు. ఆ పరిస్థితుల్లో నాకు దిక్కు తోచలేదు. ఇద్దరు చిన్న పిల్లలను పట్టుకుని ఎలా బతకాలో అర్థం కాలేదు. అయినా పిల్లలిద్దరినీ ప్రయోజకులను చేయాలనే ఆశ నన్ను బతుకు పోరాటం సాగించేలా చేసింది. రూ.20 లక్షలు అవుతుందన్నారు.. మా చిన్నోడు లక్షిత్ ఒక రోజు స్కూల్ నుంచి వస్తూ సొమ్మసిల్లి పోయాడు. ఏమైందోనని చాలా భయపడ్డాను. ఆస్పత్రికి తీసుకెళ్లా. పరీక్షించిన వైద్యులు అదేదో క్యాన్సర్ జబ్బు సోకిందన్నారు. నాకేమీ అర్థం కాలేదు. హైదరాబాద్‌లోని అమెరికన్ సిటిజన్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. అతి కష్టంపై పిల్లాడిని తీసుకుని హైదరాబాద్‌కు వెళ్లా. ఆస్పత్రిలో పరీక్షించిన డాక్టర్లు పిల్లాడికి బోన్‌మ్యారో చికిత్స చేయాలని, ఇందు కోసం రూ.20 లక్షలు ఖర్చు అవుతుందంటూ ఓ లెటర్ చేతికి ఇచ్చారు. ఆలస్యం చేస్తే పిల్లాడి ప్రాణాలకు ముప్పు తప్పదన్నారు. ఆ సమయంలో అంత డబ్బు ఎలా తీసుకురావాలో అర్థం కాక నాలో నేను ఎంతగా ఏడ్చానో ఆ దేవుడికే తెలుసు. దేవుడిలా మా బాధను అర్థం చేసుకున్నారు.. హైదరాబాద్ నుంచి తిరిగొచ్చిన నేను నెల రోజుల క్రితం మా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సార్‌ను కలిసేందుకు ఆయన ఇంటి వద్దకెళ్లా. అప్పటికే ఇంటి వద్ద చాలా మంది ఉన్నారు. కాసేపటి తర్వాత సార్ నన్ను చూసి ఆగారు. వెంటనే నేనెళ్లి బిడ్డ పరిస్థితి తెలిపి ప్రాణభిక్ష పెట్టాలని వేడుకున్నా. గొప్ప మనసుతో ఆయన మా బాధను అర్థం చేసుకున్నారు. విషయాన్ని సీఎం జగనన్న దృష్టికి తీసుకెళ్లారు. దేవుడిలా మమ్మల్ని ఆదుకున్నారు. వైద్యం కోసం రూ.14 లక్షలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సంబంధిత ఆస్పత్రికి ఉత్తర్వులు పంపారని, నేరుగా అక్కడికెళ్లి పిల్లాడికి చికిత్స చేయించుకుని రమ్మని మా ఎమ్మెల్యే సార్ ధైర్యం చెప్పారు (ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ). లెటర్ కూడా నా చేతికి ఇచ్చారు. మాకు నిజమైన దసరా ఈ రోజే వచ్చింది. నా కుమారుడికి ప్రాణభిక్ష పెట్టిన సీఎం జగనన్న, విప్ కాపు రామచంద్రారెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాం. చిన్మయ్‌కు అభినందన.. సీఎం కార్యాలయం నుంచి అందిన లెటర్ ఆఫ్ క్రెడిట్ పత్రాన్ని ఆదివారం తన క్యాంప్ కార్యాలయంలో బాధిత కుటుంబానికి విప్ కాపు రామచంద్రారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే గొప్ప మనసున్న సీఎం వైఎస్ జగన్ అని కొనియాడారు. సమస్యను వివరించగానే రూ.14 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరు చేయించారన్నారు. అంతేకాక బాధితుడికి అవసరమైన బోన్‌మ్యారో ఇవ్వడానికి ముందుకు వచ్చిన సోదరుడు చిన్మయ్‌ని అభినందించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకుడు ఏటూరి మహేష్ పాల్గొన్నారు. -
భూముల రీ సర్వేకు జాతీయస్థాయి ప్రశంస
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నెలకొన్న భూ సమ స్యలన్నింటినీ పరిష్కరించే లక్ష్యంతో చేపట్టిన భూముల రీ సర్వే ప్రక్రియకు జాతీయస్థాయిలో ప్ర శంసలు లభిస్తున్నాయని మంత్రులు పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్రంలో వందేళ్ల తర్వాత జరుగుతున్న భూముల రీ సర్వేను అత్యంత శాస్త్రీయంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో మంగళవారం జగనన్న భూహక్కు–భూరక్ష పథకంపై మంత్రి పెద్దిరెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. మంత్రులు మాట్లాడుతూ ఇటీవలే కేంద్ర కార్యదర్శి, అడిషనల్, జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారులతోపాటు 5 రాష్ట్రాల నుంచి సర్వే విభాగానికి సంబంధించిన కమిషనర్లు రాష్ట్రంలో పర్యటించి, భూముల రీ సర్వే విధానాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. మొదటి, రెండు దశల్లో మొత్తం 4 వేల గ్రామాల్లో సర్వే ప్రక్రియ పూర్తి చేసి, భూ హక్కు పత్రాలను పంపిణీ చేసినట్లు అధికారులు మంత్రుల కమిటీకి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 13,072 గ్రామాల్లో డ్రోన్ ఫ్లైయింగ్ ప్రక్రియ పూర్తయ్యిందని తెలిపారు. 9 వేల గ్రామాలకు డ్రోన్ ఇమేజ్‌లను పంపించినట్లు చెప్పారు. మూడో దశకు సంబంధించి ఇప్పటికే 360 గ్రామాల్లో సర్వే పూర్తయ్యిందన్నారు. అర్బన్ ప్రాంతాల్లోనూ సర్వే ప్రక్రియను వేగవంతం చేశామని తెలిపారు. నాలుగు మున్సిపల్ ఏరియాల్లో సర్వే ప్రక్రియ పూర్తి చేసి, హక్కు పత్రాలను అందించాలనే లక్ష్యం మేరకు పనిచేయాలని మంత్రులు ఆదేశించారు. మూడో దశ సర్వేను వచ్చే ఏడాది జనవరి నెలాఖరు నాటికి పూర్తి చేయాలనే లక్ష్యానికి అనుగుణంగా అన్ని విభాగాల అధికారులు పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజేయ కల్లం, భూపరిపాలన ప్రధాన కమిషనర్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, మైనింగ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్, సర్వే సెటిల్మెంట్, భూమి రికార్డుల శాఖ కమిషనర్ సిద్దార్థ్ జైన్, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ సూర్యకుమారి పాల్గొన్నారు. -
బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు చిలకం మృతి
విజయపురం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేపీ మాజీ అధ్యక్షుడు చిలకం రామచంద్రారెడ్డి (85) శనివారం తమిళనాడులోని చెన్నై కింగ్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన వారం రోజులుగా కరోనా చికిత్స తీసుకుంటున్నట్టు సమాచారం. చిత్తూరు జిల్లా విజయపురం మండలం మంగళం గ్రామంలో చిలకం నర్సారెడ్డి, శంకరమ్మ దంపతులకు జన్మించిన రామచంద్రారెడ్డికి లక్ష్మమ్మతో వివాహం జరిగింది. ఆయనకు కుమారుడు ఈశ్వర్ప్రసాద్, కుమార్తెలు దాక్షాయణి, మాధవి ఉన్నారు. 1959–64 వరకు మంగళం సర్పంచ్‌గా, 1982–87 వరకు పిచ్చాటూరు సమితి అధ్యక్షుడిగా, 1999–2004 వరకు ఉమ్మడి ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగా, రైతు కమిషన్ మెంబర్‌గా విధులు నిర్వహించారు. ఆయన మృతి పట్ల ఎమ్మెల్యే ఆర్కే రోజా, మాజీ మంత్రి రెడ్డివారి చెంగారెడ్డి,తదితరులు సంతాపం తెలిపారు. ఆదివారం మంగళంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
అర్ధాంతరంగా ముగిసిన టీటీడీ బోర్డు సమావేశం
-
కొండపై రాజకీయం
సాక్షి, తిరుపతి/తిరుమల: టీటీడీ పాలకమండలి సభ్యుల పాచిక పారలేదు. పది మందికి తాత్కాలిక ఉద్యోగాలు ఇప్పించడం, కాంట్రాక్టు పనులు దక్కించుకోవడం కోసం ఏర్పాటు చేస్తున్నారంటూ విమర్శల నేపథ్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన పాలకమండలి సమావేశం చివరకు అర్ధంతరంగా ముగిసింది. టీటీడీ ఈవో, జేఈవో సమావేశాన్ని బహిష్కరించడంతో సభ్యుల వ్యూహం బెడిసికొట్టింది. తర్వాత పది నిముషాల్లో చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, సభ్యులు కూడా సమావేశాన్ని ముగించారు. టీటీడీ అధికారుల తీరుకు నిరసనగా పాలకమండలి సభ్యుడు చల్లా రామచంద్రారెడ్డి రాజీనామా చేశారు. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని చైర్మన్ పుట్టా చెప్పారు. తిరుమల జేఈవోపై విమర్శలు గత ప్రభుత్వం హయాంలో నియమించిన టీటీడీ పాలకమండలి సభ్యులు మంగళవారం సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా తిరుమల అన్నమయ్య భవన్లో సమావేశాన్ని ఏర్పాటుచేశారు. సమావేశం ప్రారంభం కాగానే తిరుమల జేఈవోపై పలువురు బోర్డు సభ్యులు దర్శన టికెట్లకోసం విమర్శలు చేయడంతో రసాభాసగా మారింది. దీంతో జేఈవో శ్రీనివాసరాజు బయటకు వచ్చేశారు. టికెట్ల విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని, అలాంటి విషయాలు జేఈవో పరిధిలోనిది అని బోర్డు సభ్యులకు ఈవో ఎకె సింఘాల్ వివరించారు. అనంతరం సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన కూడా బయటకు వచ్చారు. తర్వాత బోర్డు సభ్యుడు చల్లా రామచంద్రారెడ్డి బయటకు వచ్చి తన రాజీనామా లేఖను ఈవోకు ఇచ్చి వెళ్లిపోయారు. మరో పది నిమిషాల తర్వాత బోర్డు చైర్మన్ పుట్టా కూడా సమావేశ మందిరం నుంచి వెళ్లిపోయారు. కాగా ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చే వరకు పాలకమండలి కొనసాగుతుందని చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ప్రకటించారు. రాజీనామా చేసే యోచన తమకు లేదన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకే తాము నడుచుకుంటామని తెలిపారు. అంతవరకు టీటీడీ చైర్మన్ పదవిని వదిలే ప్రసక్తే లేదని చెప్పడం గమనార్హం. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
స్టేషన్ వెనకే డంప్ చేశారు
తిరుపతి పట్టణం శివారు ఎంఆర్‌పల్లె పోలీస్ స్టేషన్ సమీపంలో 53 ఎర్రచందనం దుంగలను అటవీ టాస్క్‌ఫోర్స్ అధికారులు సోమవారం ఉదయం పట్టుకున్నారు. ఓ లారీ, ఎస్కార్ట్ కారు స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ స్టేషన్ వెనుక ఉన్న ఓ ఇంట్లో ఉంచిన దుంగలను తరలించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు దాడి చేసి దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. -
గోదారి తీరాన.. గుబాళిస్తున్న ‘మానవత’
కంబాలచెరువు (రాజమండ్రి) :ఎన్నో వాగువంకలూ, చెలమలూ, సెలయేళ్లూ కలిస్తేనే అఖండ గోదావరి అవుతుంది. జాలులుగా, ప్రవాహాలుగా ఆ నదిలో చేరిన జలసిరికి.. దప్పిక గొన్న నోళ్లకు, నెర్రెలు తీసిన బీళ్లకు చేరితేనే నిజమైన సార్థకత. అదిగో.. ఆ స్ఫూర్తితోనే ఆ నదీతీరాన ఉన్న రాజమండ్రి నుంచి విలక్షణ సేవలు అందిస్తోంది ‘మానవత’ అనే స్వచ్ఛంద సేవాసంస్థ. ‘సమాజం నుంచి స్వీకరించడమే కాదు.. సమాజానికి సమర్పించడమూ మన కర్తవ్యం. అవసరమైన వారికి సేవ చేయడమే మానవత్వం’ అన్న లక్ష్యంతో నగరానికి చెం దిన కొందరు ప్రముఖులు 2012లో ప్రారంభించిన ఈ సంస్థ ప్రస్తుతం సేవలను విస్తరించే సంకల్పంతో ఉంది. 2002 నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్.రామచంద్రారెడ్డి అనే సేవాతత్పరుడు చేస్తున్న సేవలతో పొందిన స్ఫూర్తే ఈ తీరంలో ఆ తరహా సేవలకు అంకురార్పణ చేయించిందని నిర్వాహకులు అంటున్నారు. పేద కుటుంబాల్లో ఎవరైనా చనిపోయి, దూరాన ఉన్న ఆత్మీయులు రావలసిన సందర్భాల్లో భౌతికకాయాలను చెడిపోకుండా భద్రపరచడం భరించలేని వ్యయంతో కూడిన పని. దాంతో చాలామంది రావలసిన వారు రాకుండానే అంత్యక్రియలు నిర్వహిస్తుం టా రు. అలాంటి సందర్భాల్లో మృతదేహాలను చెడిపోకుండా పదిలపరిచే ‘ఫ్రీజర్ బాక్స్’లను పేదకుటుంబాలకు ఉచితంగా అందిస్తోంది ‘మానవత’. ప్రస్తుతం రాజమండ్రి, పరిసర ప్రాంతాల వరకు ఈ బాక్స్‌లను ఉచితంగా అందజేస్తున్నారు. జిల్లాలోని దూరప్రాంతాలకైతే కేవలం రవాణా చార్జీలు తీసుకుంటున్నారు. అలాగే రాజమండ్రి, పరిసరాల్లో చనిపోయిన వారిని రాజమండ్రిలోని కైలాసభూమికి తరలించేందుకు ఉచితంగా శాంతిరథాన్ని సమకూరుస్తున్నారు. ఈ వాహనాన్ని పద్మసాయి ఫైనాన్స్ సంస్థ సమకూర్చింది. కాగా స్కూళ్లలో చదువుతున్న పిల్లలు మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో చేతులు అపరిశుభ్రంగా ఉండడం చూసిన సంస్థ సభ్యుల్లో ఒకరైన మెహర్ మధు ఆ స్థితికి విరుగుడుగా ఏదైనా చేయాలనుకున్నారు. ప్రస్తుతం ఆయన నగరంలోని స్కూళ్లన్నింటికి లిక్విడ్ సోప్‌ను నిరంతరాయంగా ఉచితంగా అందిస్తున్నారు. తమ సంస్థ సేవలు వినియోగించుకోవాలంటే కేవలం ఒక్క ఫోన్ చేస్తే సరిపోతుందని మానవత నిర్వాహకులు చెపుతున్నారు. అవసరమైన వారు 93979 16060, 94913 86972, 92466 52620లో సంప్రదించవచ్చంటున్నారు. త్వరలో అంబులెన్స్, రక్తదాన శిబిరాలు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు 108 అందుబాటులేక కొందరికి ప్రాణాంతకమవుతోంది. అలాంటి స్థితిలో ఆపన్నులను ఆదుకునేందు కు అంబులెన్స్‌ను అందుబాటులోకి తీసుకురానుంది మానవత. త్వరలోనే ఈ సదు పాయం నగరవాసులకు కల్పించనుంది. అ లాగే సమయానికి రక్తం దొరకక చాలామంది రోగులకు విషమ పరిస్థితి ఎదురవుతోంది. ఆ దిశగా వారి కోసం ఉచిత రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్టు సంస్థ నిర్వాహుకులు తెలిపారు. నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారులు మెహర్‌మధు, రత్నాజీ (పద్మసాయి), బాబి, చింతా ప్రభాకరరడ్డి(సీపీ రెడ్డి), బలేష్ గుప్త, చక్కా త్రినాథ్, మద్దుల మురళీకృష్ణ, మన్యం బాబ్జి, గౌతమీ నేత్రాలయం మధు, పి.రామచంద్రయ్య, విక్రమ్‌జైన్‌లు సారథులుగా ముందుకు నడిపిస్తున్న ‘మానవత’ మరింత మందిలో మానవీయతను తట్టి లేపి, ఇతోధిక సేవలకు ప్రేరణ కావాలని ఆశిద్దాం. -
ఎన్నికల నియమావళి అతిక్రమిస్తే చర్యలు
ఆళ్లగడ్డ ఉప ఎన్నికల వ్యయ మానిటరింగ్ అధికారి ఆళ్లగడ్డటౌన్: ఎన్నికల నియమావళికి లోబడి విధులు నిర్వహించాలని అతిక్రమిస్తే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆళ్లగడ్డ ఉప ఎన్నికల వ్యయ మానిటరింగ్ అధికారి రామచంద్రారెడ్డి అన్నారు. ఉప ఎన్నికల నిర్వహణలో భాగంగా స్థానిక వైపీపీఎం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆదివారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుధాకర్‌రెడ్డి అధ్యక్షతన విధుల్లో పాల్గొనే వారికి ఎన్నికల సహాయ వ్యయ పరిశీలకులు (ఎఈఓ) సుబ్బారావు, వ్యయ మానిటరింగ్ అధికారి రామచంద్రారెడ్డి, మీడియా కోడ్ ఆఫ్ కండక్ట్ అధికారి రామసుబ్బు తదితరులు హాజరై అవగాహణ కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున బృందాలని విధుల్లో నిమగ్నంకావాలని ఆదేశిం చారు. ఓటర్లకు నగదు, మద్యం పంపిణీ చేస్తున్నారని సమాచారం అందిన వెంటనే ఫ్లయింగ్ స్క్వాడ్లు అక్కడకు చేరుకుని వీడియో చిత్రీకరించాలన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని తెలిస్తే వెంటనే మోడల్ కోడ్ ఆప్ కండక్ట్ బృందానికి నివేదించాలన్నారు. వీడియో సర్వే లెన్స్ బృందాలు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించాలని సూచిం చారు. చెక్ పోస్టుల దగ్గర తనిఖీల్లో పట్టుబడ్డ నగదుకు సం బంధించి సరియైన రుజువులు లేకుంటే ఆ నగదును ట్రెజరీలో భద్ర పరచాలన్నారు. మద్యం పట్టుబడితే ఎక్సైజ్ శాఖకు అప్పగించాలని సూచించారు. అభ్యర్థుల ఎన్నికల ఖర్చుల వివరాలు రికార్డుల్లో నమోదు చేయాలని.. చెక్‌పోస్టుల వద్ద నిర్వహించే తనిఖీల్లో సాధారణ వ్యక్తుల జనజీవనానికి ఎలాంటి ఆటంకం కలగ కుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏ రోజుకారోజు నివేదికలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించాలని..విధుల పట్ల నిర్లక్ష్యం, ఉదాసీనత వహించే అధికారులపై ప్రత్యేక నిఘా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో ఆరు మండలాల తహశీల్దార్లు, ఎంపీడీఓలు, డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
క్యాథ్‌ల్యాబ్ సిటీ
* డేంజర్ జోన్లో 25 లక్షల మంది యువత.. * 80 శాతం గుండెపోట్లు 40 ఏళ్ల లోపు వారికే గోల్కొండ, చార్మినార్, హుస్సేన్‌సాగర్.. బిరియానీ, హలీం..అంటే చాలు హైదరాబాద్ సిటీ గుర్తుకొస్తుంది. కానీ కొత్తగా ఈ నగరం తన సంస్కృతి, సంప్రదాయాలు మార్చుకుని ‘క్యాథ్‌ల్యాబ్’ సిటీగా మారిపోతోంది. క్యాథ్‌ల్యాబ్ అంటే గుండెపోటుకు వైద్యమందించే పరికరాలు. వాటిని వినియోగిస్తున్నవారు పెరిగిపోతుండడంతో ఆ బాధితుల నగరంగా రికార్డుల్లోకి ఎక్కుతోందన్నమాట. అందుకే ఇది అలా మారిపోరుు ఉండొచ్చని ప్రముఖ హృద్రోగ నిపుణులు డా.ఎం.ఎస్.ఎస్.ముఖర్జీ అంటున్నారు. నగరంలో 25 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులు 50 లక్షల మంది ఉంటే ఇప్పటికే 25 లక్షల మంది డేంజర్ జోన్లో ఉన్నారు. మరో పాతిక లక్షల మంది దానికి దగ్గరగా ఉన్నారు. గుండె పోటుకు గురయ్యే వారిలో 80 శాతం మంది 40 ఏళ్ల లోపు వారేనని వుుఖర్జీ చెబుతున్నారు. కారణాలివీ.. * విదేశాల్లో ఉన్న అనారోగ్యకర ఆహార ప్రభావం ఇప్పుడు నగరంపైనా పడుతోంది. * రెండుమూడేళ్లుగా సాఫ్ట్వేర్ రంగంలోనే ఎక్కువగా ఒత్తిడి అనుభవించేవారు. * ఇప్పుడు జీహెచ్ఎం లేబర్ నుంచి ఎలక్ట్రీషియన్ వరకూ ఒత్తిడిలోనే ఉంటున్నారు. దీనిక్కారణం తింటున్న తిండే. * సాధారణంగా రోజుకు మనిషికి 1500 కేలరీలతో కూడిన ఆహారం అవసరం. కానీ 2500 కేలరీలు తింటున్నారు. ఇందులో 400 కేలరీలు ఖర్చు చేయలేక పోతున్నారు. * అంతా సంపాదన, సెటిల్మెంట్మీద దృష్టి సారిస్తున్నారు. తినే ఆహారంపై చర్చ 2 శాతం కూడా సాగడం లేదు. * ఒత్తిడితో 30 ఏళ్లలోపే రక్తపోటు, మధుమేహం వస్తున్నాయి. * నికోటిన్ (పొగాకు) వాడకం హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉంది. ‘గుండె’ను ఎలా రక్షించుకోవాలి * రోజూ 45 నిమిషాలు వేగంగా నడవాలి. * అన్నంలో కూర కాదు. కూరలో అన్నం వేసుకుని తినే అలవాటు రావాలి. * తక్షణమే ఉప్పు, కారం, నూనె తగ్గించాలి. నూనె నెలకు ఒక మనిషికి అరకిలో చాలు. * పండ్లు..అంటే ఆపిల్ ఒక్కటే అని కాదు అన్ని రకాలవీ తీసుకోవాలి. * గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు లేని వాళ్లు రోజూ కనీసం 3 లీటర్ల నీళ్లు తాగాలి. * ఆలివ్ ఆయిల్ ఖరీదైనా మిగతా వాటికంటే మంచిది. * బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ)కి 25 కంటే తక్కువగా ఉండాలి. * రోజూ 6 నుంచి 8 గంటలు విధిగా నిద్రపోవాలి. * ఒత్తిడి నివారణకు యోగా తప్పనిసరి. వ్యాయామం కూడా అవసరమే. * గుండెజబ్బులు రాకుండా జాగ్రత్త పడేందుకు ఎలాంటి మందులూ అక్కర్లేదు.. వచ్చాక మందుల్లేకుండా మనగలగడం కష్టం. ప్రజెంటేషన్..: జి.రామచంద్రారెడ్డి -
నంద్యాల రూపురేఖలు మార్చేస్తా
నంద్యాల టౌన్: ఐదేళ్ల పదవీ కాలంలో నంద్యాల పట్టణ రూపురేఖలను మార్చేస్తానని ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి అన్నారు. ఎమ్మెల్యేగా విజయం సాధించాక తొలిసారిగా సోమవారం మునిసిపల్ కార్యాలయానికి విచ్చేసిన ఆయనకు కమిషనర్ రామచంద్రారెడ్డి, సిబ్బంది స్వాగతం పలికారు. భూమా మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి పలు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటానని, రాజకీయాలకు అతీతంగా సేవలు అందిస్తానన్నారు. ఆవులు రోడ్లపైన తిరగడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందని, ప్లాస్టిక్ తిని మృత్యువాత పడుతున్నాయని ప్రతి ఆవును ఎస్బీఐ కాలనీలోని గోశాలకు తరలించాలని శానిటరీ సూపర్వైజర్ జబ్బార్ మియాకు సూచించారు. క్లీన్ సిటీలో భాగంగా పట్టణంలో 450ఎకరాల ఖాళీ స్థలాల్లో కంపచెట్లు తొలగించినా, యజమానులు స్పందించడం లేదన్నారు. యజమానులు స్థలాల్లో మట్టి వేసుకొని, నీరు నిల్వ ఉండకుండా చదును చేసుకునేలా ఆదేశాలు జారీ చేయాలన్నారు. పట్టణంలో పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించాలన్నారు. అవసరమైతే కాంట్రాక్ట్ ప్రాతిపదికపై అదనంగా సిబ్బందిని తీసుకోవచ్చని సూచించారు. తక్షణమే రోడ్ల విస్తరణ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. రోడ్లపై బతికే చిల్లర వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపి తర్వాతే రోడ్లను విస్తరించాలన్నారు. పందులను నిర్మూలించడానికి ఏఆర్ కానిస్టేబుళ్లను రప్పించాలని కలెక్టర్‌ను కోరాలని కమిషనర్‌కు సూచించారు. కౌన్సిలర్లు శివశంకర్, కొండారెడ్డి, జేవీసీ హారిక, గోరె ముర్తుజా, కృపాకర్, విజయభాస్కర్‌రెడ్డి, పార్టీ నేతలు వడ్డెశీను, వడ్డెమనోజ్, మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు. నిధుల కోసం ప్రధానిని కలుస్తా: భూమా నంద్యాల : నియోజకవర్గ అభివృద్ధికి నిధుల విషయమై ప్రధాని నరేంద్రమోడీని కలుస్తానని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలో లేకపోయినా పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన అనుభవంతో నిధులను రాబట్టేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు. పట్టణంలోని పేదలకు 10 వేల ఇళ్ల నిర్మాణాలను ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నిర్మించి తీరుతామన్నారు. సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని.. అక్కడి నుంచి వచ్చే స్పందనను బట్టి కార్యాచరణ రూపొందిస్తానన్నారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ నిధుల విడుదల విషయమై ప్రధానితో పాటు కేంద్రంలో పరిచయం ఉన్న నేతలందరినీ కలుస్తానన్నారు. పందుల సమస్య జిల్లా వ్యాప్తంగా ఉందని.. ఈ విషయమై అసెంబ్లీలో చర్చిస్తానన్నారు. పట్టణంలో రోడ్లపై తిరుగాడే ఆవులను గోశాలకు తరలించాలని.. వీటి పోషణకు దాతలు సహకరించాలని కోరారు.