ఎన్నికల నియమావళి అతిక్రమిస్తే చర్యలు
ఆళ్లగడ్డ ఉప ఎన్నికల వ్యయ మానిటరింగ్ అధికారి
ఆళ్లగడ్డటౌన్:
ఎన్నికల నియమావళికి లోబడి విధులు నిర్వహించాలని అతిక్రమిస్తే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆళ్లగడ్డ ఉప ఎన్నికల వ్యయ మానిటరింగ్ అధికారి రామచంద్రారెడ్డి అన్నారు. ఉప ఎన్నికల నిర్వహణలో భాగంగా స్థానిక వైపీపీఎం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆదివారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుధాకర్‌రెడ్డి అధ్యక్షతన విధుల్లో పాల్గొనే వారికి ఎన్నికల సహాయ వ్యయ పరిశీలకులు (ఎఈఓ) సుబ్బారావు, వ్యయ మానిటరింగ్ అధికారి రామచంద్రారెడ్డి, మీడియా కోడ్ ఆఫ్ కండక్ట్ అధికారి రామసుబ్బు తదితరులు హాజరై అవగాహణ కల్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున బృందాలని విధుల్లో నిమగ్నంకావాలని ఆదేశిం చారు. ఓటర్లకు నగదు, మద్యం పంపిణీ చేస్తున్నారని సమాచారం అందిన వెంటనే ఫ్లయింగ్ స్క్వాడ్‌లు అక్కడకు చేరుకుని వీడియో చిత్రీకరించాలన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని తెలిస్తే వెంటనే మోడల్ కోడ్ ఆప్ కండక్ట్ బృందానికి నివేదించాలన్నారు. వీడియో సర్వే లెన్స్ బృందాలు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించాలని సూచిం చారు.
చెక్ పోస్టుల దగ్గర తనిఖీల్లో పట్టుబడ్డ నగదుకు సం బంధించి సరియైన రుజువులు లేకుంటే ఆ నగదును ట్రెజరీలో భద్ర పరచాలన్నారు. మద్యం పట్టుబడితే ఎక్సైజ్ శాఖకు అప్పగించాలని సూచించారు. అభ్యర్థుల ఎన్నికల ఖర్చుల వివరాలు రికార్డుల్లో నమోదు చేయాలని.. చెక్‌పోస్టుల వద్ద నిర్వహించే తనిఖీల్లో సాధారణ వ్యక్తుల జనజీవనానికి ఎలాంటి ఆటంకం కలగ కుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏ రోజుకారోజు నివేదికలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించాలని..విధుల పట్ల నిర్లక్ష్యం, ఉదాసీనత వహించే అధికారులపై ప్రత్యేక నిఘా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో ఆరు మండలాల తహశీల్దార్లు, ఎంపీడీఓలు, డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.