తిరుమలలో జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో మాట్లాడుతున్న పుట్టా
సాక్షి, తిరుపతి/తిరుమల: టీటీడీ పాలకమండలి సభ్యుల పాచిక పారలేదు. పది మందికి తాత్కాలిక ఉద్యోగాలు ఇప్పించడం, కాంట్రాక్టు పనులు దక్కించుకోవడం కోసం ఏర్పాటు చేస్తున్నారంటూ విమర్శల నేపథ్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన పాలకమండలి సమావేశం చివరకు అర్ధంతరంగా ముగిసింది. టీటీడీ ఈవో, జేఈవో సమావేశాన్ని బహిష్కరించడంతో సభ్యుల వ్యూహం బెడిసికొట్టింది. తర్వాత పది నిముషాల్లో చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, సభ్యులు కూడా సమావేశాన్ని ముగించారు. టీటీడీ అధికారుల తీరుకు నిరసనగా పాలకమండలి సభ్యుడు చల్లా రామచంద్రారెడ్డి రాజీనామా చేశారు. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని చైర్మన్ పుట్టా చెప్పారు.
తిరుమల జేఈవోపై విమర్శలు
గత ప్రభుత్వం హయాంలో నియమించిన టీటీడీ పాలకమండలి సభ్యులు మంగళవారం సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా తిరుమల అన్నమయ్య భవన్‌లో సమావేశాన్ని ఏర్పాటుచేశారు. సమావేశం ప్రారంభం కాగానే తిరుమల జేఈవోపై పలువురు బోర్డు సభ్యులు దర్శన టికెట్లకోసం విమర్శలు చేయడంతో రసాభాసగా మారింది. దీంతో జేఈవో శ్రీనివాసరాజు బయటకు వచ్చేశారు. టికెట్ల విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని, అలాంటి విషయాలు జేఈవో పరిధిలోనిది అని బోర్డు సభ్యులకు ఈవో ఎకె సింఘాల్ వివరించారు.
అనంతరం సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన కూడా బయటకు వచ్చారు. తర్వాత బోర్డు సభ్యుడు చల్లా రామచంద్రారెడ్డి బయటకు వచ్చి తన రాజీనామా లేఖను ఈవోకు ఇచ్చి వెళ్లిపోయారు. మరో పది నిమిషాల తర్వాత బోర్డు చైర్మన్ పుట్టా కూడా సమావేశ మందిరం నుంచి వెళ్లిపోయారు. కాగా ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చే వరకు పాలకమండలి కొనసాగుతుందని చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ప్రకటించారు. రాజీనామా చేసే యోచన తమకు లేదన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకే తాము నడుచుకుంటామని తెలిపారు. అంతవరకు టీటీడీ చైర్మన్ పదవిని వదిలే ప్రసక్తే లేదని చెప్పడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment