‘ఆ బంగారం’ లెక్క తేల్చేందుకేనా | Criticisms on the Today TTD governing council meeting | Sakshi
Sakshi News home page

‘ఆ బంగారం’ లెక్క తేల్చేందుకేనా

Published Tue, May 28 2019 4:50 AM | Last Updated on Tue, May 28 2019 8:09 AM

Criticisms on the Today TTD governing council meeting - Sakshi

సాక్షి, తిరుపతి: రాష్ట్రంలో మరో రెండ్రోజుల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న సమయంలో హడావుడిగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశాన్ని మంగళవారం నిర్వహించనుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్ధమని తెలిసినా.. సాంకేతికంగా నిర్వహించుకోవచ్చన్న సాకు చూపించి ఈ నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా ఎన్నికల్లో పాలక ప్రభుత్వం ఓడిపోతే దాని ద్వారా నియమితులైన పాలక మండళ్లు నైతికంగా రాజీనామా చేస్తాయి. కానీ, ఇక్కడ అందుకు విరుద్ధంగా టీటీడీ పాలక మండలి సమావేశాన్ని నిర్వహించటానికి రంగం సిద్ధంచేశారు. దీని వెనుక పెద్ద కుట్ర ఉన్నట్లు తిరుమలలో విస్తృత ప్రచారం జరుగుతోంది. తమిళనాడులో ఇటీవల పెద్దఎత్తున బంగారం పట్టుబడిన విషయం తెలిసిందే. దీనిపై టీటీడీ ఓ మాట.. బ్యాంకు అధికారులు మరోమాట చెప్పడంతో అనేకానేక అనుమానాలు తలెత్తాయి. వీటిని ఇటు టీటీడీ కానీ, అటు టీడీపీ సర్కారు కానీ నివృత్తి చేసిన దాఖలాల్లేవు. అదే విధంగా.. ప్రైవేటు బ్యాంకుల్లో నగదు, బంగారం డిపాజిట్ల వెనుక కొందరు పాలక మండలి సభ్యులతో పాటు ప్రభుత్వంలోని పలువురు పెద్దల పాత్ర ఉందనే ఆరోపణలున్న నేపథ్యంలో మంగళవారం నిర్వహించే పాలక మండలి సమావేశంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

బంగారం వివాదానికి క్లీన్‌చిట్‌? 
ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న సమయంలో ఏప్రిల్‌ 17న తమిళనాడు నుంచి తరలిస్తున్న 1381 కిలోల బంగారాన్ని అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఎటువంటి భద్రతా ఏర్పాట్లులేకుండా సాధారణ వాహనంలో సుమారు రూ.450 కోట్లు విలువ చేసే బంగారాన్ని తరలించడం.. దానిని తమిళనాడులో ఎన్నికల అధికారులు పట్టుకోవడం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. బంగారాన్ని పట్టుకున్న సమయంలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు అధికారులు అది టీటీడీదని అన్నారు. మరోవైపు.. ఆ బంగారం తమది కాదని టీటీడీ ఈఓ విస్పష్టంగా చెప్పారు. ఆ తరువాత కొంత సమయానికే ఆయన మాటమార్చి పట్టుబడ్డ బంగారం టీటీడీదేనని చెప్పుకొచ్చారు. దీంతో అక్రమ బంగారాన్ని సక్రమం చేశారనే ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి.

ఆ తరువాత కూడా టీటీడీ రకరకాల ప్రకటనలు చేసి ప్రజల్లో అనుమానాలకు ఆస్కారమిచ్చింది. దీంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఆదేశాల మేరకు ముఖ్య కార్యదర్శి మన్మోహన్‌సింగ్‌ తిరుపతిలో విచారణ చేపట్టారు. ఆ నివేదికను ప్రభుత్వానికి నివేదించారు. అయితే, అది ఇప్పటివరకు వెలుగుచూడలేదు. ఇలాగే.. టీటీడీకి సంబంధించిన బంగారం, నగదును ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్‌ చెయ్యటంపై అనేక ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వ పెద్దలు, కొందరు టీటీడీ అధికారులు, మరికొందరు పాలక మండలి సభ్యులు కమీషన్లకు కక్కుర్తిపడి కోట్ల రూపాయలను ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్‌ చేశారని ప్రచారంలో ఉంది. టీటీడీ పాలక మండలి సభ్యులు ప్రధానంగా ఎదుర్కొంటున్న ఈ రెండు ప్రధాన ఆరోపణల్లో వాస్తవంలేదని చెప్పుకునేందుకే ఈ టీటీడీ బోర్డు సమావేశం ఏర్పాటుచేస్తున్నట్లు సమాచారం.  

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


రాజీనామా చేయకుండా.. 
సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా పరాజయం పాలైన విషయం తెలిసిందే. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుచేయనున్న సందర్భంలో నైతిక బాధ్యత వహించి నామినేటెడ్‌ సంస్థల చైర్మన్లు, సభ్యులు రాజీనామా చేస్తున్నారు. కానీ, టీటీడీ పాలకమండలి మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. సాంకేతిక అంశం సాకుతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు విశ్వసనీయ సమాచారం. 

తాత్కాలిక నియామకాల కోసం.. 
ఓ పది మంది తాత్కాలిక ఉద్యోగుల నియామకానికి కూడా పచ్చజెండా ఊపేందుకు కూడా ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయంలో టీటీడీలో ఓ అధికారి.. ఇద్దరు బోర్డు సభ్యుల పాత్ర ఉన్నట్లు సమాచారం. ఆ పది మంది నుంచి గతంలోనే భారీగానే మామూళ్లు పుచ్చుకున్నట్లు ఆరోపణలున్నాయి. అదే విధంగా మరికొన్ని కాంట్రాక్టు పనులు ఖరారు చేసుకునేందుకు ఈ పాలక మండలి భేటీని కొందరు ఉపయోగించుకుంటున్నట్లు తెలిసింది.  

టీటీడీ బోర్డును రద్దు చేయాలి 
చంద్రబాబునాయుడు హయాంలో ఏర్పాటైన టీటీడీ పాలక మండలిని ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ రద్దుచెయ్యాలి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతి లేకుండా సమావేశాన్ని ఎలా నిర్వహిస్తారు? టీడీపీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఎస్వీబీసీ చైర్మన్‌గా ఉన్న కే రాఘవేంద్రరావు రాజీనామా చేయడం అభినందనీయం. ఆయనలాగే టీటీడీ చైర్మన్‌ పుట్టా సుధాకర్‌యాదవ్, పాలక మండలి సభ్యులు వెంటనే రాజీనామా చెయ్యాలి. అలా కాకుండా బోర్డు సమావేశం నిర్వహిస్తే అడ్డుకుంటాం.  
– నారాయణస్వామి, ఎమ్మెల్యే, గంగాధర నెల్లూరు  

గోవిందా.. ఇదేంటయ్యా..! 
గోవిందుని పాదాల చెంత నిరుపేదలకు వైద్య సేవలందిస్తున్న బర్డ్‌ ఆస్పత్రి పరువును బజారు పాలు చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టక ముందే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న బర్డ్‌ ఆస్పత్రి ట్రస్ట్‌ బోర్డు సమావేశాన్ని హడావుడిగా నిర్వహించారు. ఆస్పత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ జగదీష్‌ పదవీ కాలం ఇంకా ముగియకమునుపే మరో రెండేళ్ల పాటు పొడిగిస్తున్నట్లు బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే కొత్త బర్డ్‌ ట్రస్ట్‌ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోవాల్సివుంది. అయితే ప్రస్తుతం కొనసాగుతున్నది నామినేటెడ్‌ బోర్డు అన్న విషయాన్ని సభ్యులు మరిచి డైరెక్టర్‌ పదవీ కాలం పొడిగించడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. సార్వత్రిక ఎన్నికలు ఫలితాలు వెలువడ్డాయి. మరో రెండు రోజుల్లో కొత్త ప్రభుత్వం రానుంది. ఈ నేపథ్యంలో నామినేటెడ్‌ బోర్డు అయితే పాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోర్డుకు సాధారణంగా అధికారం ఉండదు... బోర్డు రద్దు అవుతుంది. అయితే సోమవారం తిరుపతిలోని శ్రీ పద్మావతి అతి«థి గృహంలో బర్డ్‌ ట్రస్ట్‌ బోర్డు సమావేశం హడావుడిగా జరిగింది. గంట పాటు వాడివేడిగా చర్చలు జరిగాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తరువాత తీసుకోవాల్సిన నిర్ణయాన్ని ఏకపక్షంగా తీసుకున్నారు. బర్డ్‌ ఆస్పత్రి డైరెక్టర్‌గా గత 20 ఏళ్లుగా డాక్టర్‌ జగదీష్‌ కొనసాగుతున్నారు. గత టీటీడీ బోర్డు సమావేశంలో ఆయన పదవీ కాలాన్ని పొడిగించాలని అజెండాలో చేర్చగా పలువురు తిరస్కరించారు.   

అత్యవసర సమావేశం ఎందుకు.? 
నామినేటెడ్‌ కిందకు వచ్చే బర్డ్‌ ట్రస్ట్‌ బోర్డు సమావేశాన్ని హడావుడిగా నిర్వహించారు. 450 పడకల అత్యంత ప్రతిష్టాత్మక బర్డ్‌ ఆస్పత్రికి డైరెక్టర్‌ పదవీ కాలం పొడిగింపు నిర్ణయానికి అత్యంత ప్రాధాన్యత వుంది. అటువంటి నిర్ణయం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత కొత్త సభ్యుల సమక్షంలో తీసుకోవాలి. అయితే డాక్టర్‌ జగదీష్‌ పదవీ కాలం మరో నెల రోజుల పాటు ఉంది. ఈ దశలో పదవీ కాలం పొడిగింపు నిర్ణయం తీసుకోవడం దుమారం రేపుతోంది.  

తొందర పాటు నిర్ణయం 
కొత్త ప్రభుత్వం ఏర్పడితే నామినేటెడ్‌ బోర్డులు రద్దు అవుతాయి. బోర్డు చైర్మన్‌తో పాటు సభ్యులు రాజీనామా చేయడం సాధారణం. టీడీపీ ఘోర పరాజయం తరువాత ఆ పార్టీ నియమించిన పలు బోర్డుల చైర్మన్లు, సభ్యులు రాజీనామాలు చేశారు. తిరుపతిలో తుడా చైర్మన్‌ నర్సింహయాదవ్‌ తన పదవీకి రాజీనామా చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో నామినేటెడ్‌ బర్డ్‌ ట్రస్ట్‌ బోర్డు సమావేశాన్ని నిర్వహించి డైరెక్టర్‌ పదవీ కాలాన్ని పొడిగిస్తూ తొందర పాటు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బోర్డు సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాల పట్ల టీటీడీ అధికారులు పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది. లేకుంటే కొత్త సమస్యలు తలెత్తే అవకాశం లేకపోలేదు. 

మీడియాను పక్కదారి పట్టించిన వైనం 
శ్రీ పద్మావతి అతిధి గృహంలో సోమవారం సాయంత్రం 5 గంటలకు బర్డ్‌ ట్రస్ట్‌ బోర్డు సమావేశం జరుగుతుందని మీడియాకు లీకు కావడంతో సభ్యులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా రు. సాయత్రం 4.50 గంటలకే బోర్డు సమావేశా న్ని ముగించారు. దీంతో సాయంత్రం 5 గంటల కు అతి«థి గృహం వద్దకు చేరుకున్న మీడియాకు సమావేశం ముగిసిందని అక్కడి వారు చెప్పడం తో అవాక్కయ్యారు.సమావేశంలో నిర్ణయాలను  గోప్యంగా ఉంచారు. టీటీడీ పీఆర్వో విభాగం అధికారులు సమావేశానికి హాజరైనా కనీసం  పత్రికా ప్రకటన విడుదల చేయలేదు. టీటీడీ అధికారులు పత్రికా ప్రకటన విడుల చేయొద్దని పీఆర్వో సెక్షన్‌ను ఆదేశించినట్లు తెలుస్తోంది. రహస్య సమావేశంలో బర్డ్‌ డైరెక్టర్‌ పదవీ కాలం పొడిగింపు, బర్డ్‌ ఆస్పత్రిలో ఫైనాన్స్‌ సెక్షన్‌లో పోస్టు భర్తీతోపాటు ఆస్పత్రి నిర్వహణ ఇకపై బోర్డు అధీనంలో జరగాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. టీటీడీ బోర్డు చైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ బోర్డు సమావేశాన్ని నడిపించినట్లు సమాచారం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement