తిరుమలలో క్యూ లైన్లను పరిశీలిస్తున్న టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్
తిరుమల: టోకెన్లు ఉన్న వారికే శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం లభిస్తుందని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. తిరుమలలో సోమవారం వైకుంఠ ఏకాదశి ఏర్పాట్ల పరిశీలన అనంతరం ఈవో మీడియాతో మాట్లాడారు. వైకుంఠ ద్వార దర్శనం జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు 10 రోజుల పాటు ఉంటుందన్నారు. ఇందుకోసం ఆన్‌లైన్ ద్వారా రూ.300 ఎస్‌ఈడీ టికెట్లు 2 లక్షలు కేటాయించినట్టు తెలిపారు.
తిరుపతిలో అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్, రైల్వేస్టేషన్ ఎదురుగా విష్ణునివాసం, రైల్వేస్టేషన్ వెనుక 2, 3 సత్రాలు, ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్, ఇందిరా మైదానం, జీవకోన జిల్లా పరిషత్ హైస్కూల్, బైరాగిపట్టెడలోని రామానాయుడు మున్సిపల్ హైస్కూల్, ఎమ్మార్‌పల్లి జెడ్పీ హైస్కూల్, రామచంద్ర పుష్కరిణి వద్ద ఏర్పాటు చేస్తున్న కౌంటర్లలో టోకెన్లు ఇస్తామన్నారు.
సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులు తిరుమలలోని కృష్ణతేజ విశ్రాంతి గృహం వద్ద రిపోర్ట్ చేయాలని సూచించారు. భక్తులు టీటీడీ వెబ్‌సైట్, ఎస్వీబీసీ, ఇతర మాధ్యమాల ద్వారా టికెట్ల లభ్యతను ముందే తెలుసుకుని తమ తిరుమల ప్రయాణాన్ని ఖరారు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
టోకెన్లపై కేటాయించిన ప్రాంతానికి నిర్దేశించిన సమయానికి మాత్రమే రావాలని కోరారు. తిరుమలలో వసతి సౌకర్యం తక్కువగా ఉన్నందున దర్శన టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే ముందు వచ్చిన వారికే ముందు అన్న ప్రాతిపదికపై వసతి సౌకర్యం కల్పిస్తామని చెప్పారు.
శ్రీవారి దర్శనానికి 30 గంటలు
తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. దర్శన టోకెన్లు లేని భక్తులకు 30 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. కాగా, తిరుమల శ్రీవారిని సోమవారం అపోలో చైర్మన్ ప్రతాప్ సిరెడ్డి, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కలవంతర్‌సింగ్, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామ్‌మనోహర్ నారాయణమిశ్రా, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నాగార్జున, జస్టిస్ సోమయాజులు, కరెంట్ గవర్నర్ ఫర్ వెస్ట్ న్యూ బ్రిటన్ ప్రొవియన్స్ శశిధరన్ ముత్తువెల్, తెలంగాణ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దర్శించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment