క్యాంపు రాజకీయాలతో ఎన్టీఆర్ నుంచి టీడీపీని చంద్రబాబు లాక్కోగా... అదే బాటలో ఆయన బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా నడుస్తున్నారు. 38 కౌన్సిల్ స్థానాలున్న హిందూపురం మున్సిపల్ చైర్మన్ పీఠం కోసం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు సిద్ధమయ్యారు. వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను తమవైపునకు తిప్పుకుని రిసార్ట్ రాజకీయం చేస్తున్నారు.
హిందూపురం: నోరు తెరిస్తే బ్లడ్డు...బ్రీడు అంటూ తన గురించి తాను గొప్పగా చెప్పుకునే ఎమ్మెల్యే బాలకృష్ణ నీచ రాజకీయానికి తెరతీశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరగానే హిందూపురం మున్సిపల్ పీఠంపై ఆయన కన్నేశారు. తనకు అనుకూలమైన వారిని చైర్మన్ పీఠంపై కూర్చోబెట్టేందుకు కుట్ర రాజకీయాలకు తెరలేపారు.
ప్రలోభాలు.. బెదిరింపులు
హిందూపురం మున్సిపాల్టీలో 38 వార్డులున్నాయి. గత మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ 30 స్థానాల్లో విజయదుందుభి మోగించింది. బీజేపీ ఒకటి, ఎంఐఎం మరో స్థానం దక్కించుకోగా... టీడీపీ అష్టకష్టాలు పడి ఆరింటితో సరిపెట్టుకుంది. పురంలో వైఎస్సార్ సీపీ అఖండ విజయం సాధించాక ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. చైర్మన్ స్థానం కోసం ఎంతోమంది పోటీపడగా..మహిళకు పెద్దపీట వేశారు. అందులోనూ బీసీలకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని భావించి తొలిసారి కౌన్సిలర్‌గా గెలిచిన బోయ ఇంద్రజకు చైర్‌పర్సన్‌గా అవకాశం కల్పించారు. బీసీ సంక్షేమంపై తనకున్న చిత్తశుద్ధిని చాటుకున్నారు. అయితే ఎమ్మెల్యే బాలకృష్ణ గిమ్మిక్కు రాజకీయాలు చేశారు.
ప్రలోభాలకు గురిచేసి ఇంద్రజను టీడీపీ వైపు లాగారు. ఈ నేపథ్యంలోనే ఆమె తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదంటూ చైర్‌పర్సన్ స్థానానికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలన్న ఉద్దేశంతో బాలకృష్ణ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు దిగజారి ప్రవర్తించారు. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రలోభాలకు తెరతీశారు. అందుకు లొంగని వారిని భయపెట్టారు. అంతిమంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు. ప్రస్తుతం హిందూపురం మున్సిపల్ కౌన్సిల్‌లో టీడీపీకి ఆరుగురు కౌన్సిలర్లు ఉండగా, బీజేపీ, ఎంఐఎం కౌన్సిలర్లను కలుపుకున్నారు. దీంతో టీడీపీ బలం 8కి చేరింది. దీంతో చైర్‌పర్సన్ ఇంద్రజతో పాటు మరికొంత మంది వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను తమవైపు లాక్కున్నారు.
రిసార్ట్ రాజకీయం..
టీడీపీ, బీజేపీ, ఎంఐఎం కౌన్సిలర్లతో పాటు వైఎస్సార్ సీపీ నుంచి ఫిరాయించిన కౌన్సిలర్లు, వారి కుటుంబీకులను ఎమ్మెల్యే బాలకృష్ణ హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్‌కు తరలించారు. రెండురోజుల్లో చైర్మన్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదల చేయించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. నోటిఫికేషన్ రాగానే కౌన్సిలర్లను నేరుగా కౌన్సిల్ సమావేశానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకున్నారు. ప్రజల సమస్యలు గాలికి వదిలేసి చైర్మన్ పీఠం దక్కించుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్న టీడీపీ నీచ రాజకీయాన్ని జనం చీదరించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment