అనంతపురం: రాష్ట్ర ప్రభుత్వం వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ, చేతి వృత్తిదారులకు ఇస్తున్న రూ.2,750 పింఛన్‌ను ఈ నెల నుంచి రూ.3వేలకు పెంచింది. ఈ నెల ఎనిమిదో తేదీ వరకు అన్ని మండల, మున్సిపాలిటీ కేంద్రాల్లో పింఛన్ పెంపు మహోత్సవాలు పండుగ వాతావరణంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ గౌతమి తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులందరూ పాల్గొనాలన్నారు. జనవరి నెలకు సంబంధించి 2,93,493 మంది పింఛన్‌దారులకు రూ.87.92 కోట్లు విడుదలైందన్నారు. ఇందులో కొత్తగా మంజూరైన పింఛన్లు 5,234 ఉన్నాయన్నారు. మొత్తం లబ్ధిదారుల్లో 2,31,513 మంది రూ.3వేల పింఛన్లు అందుకోనున్నారన్నారు. మండల, మున్సిపల్ కేంద్రాల్లో పింఛన్ పెంపు మహోత్సవాలు జరిగినప్పటి నుంచి పింఛన్ల పంపిణీ ఉంటుందన్నారు. ఈ మార్పును పింఛన్‌దారులు గమనించాలని కోరారు.
ఈ నెల మూడో తేదీ అనంతపురం అర్బన్, గార్లదిన్నె, గుమ్మఘట్ట, గుంతకల్లు రూరల్, గుంతకల్లు అర్బన్, కళ్యాణదుర్గం రూరల్, కూడేరు, నార్పల, రాప్తాడు, రాయదుర్గం రూరల్, శింగన మల, తాడిపత్రి అర్బన్, తాడిపత్రి రూరల్‌లో పింఛన్ పెంపు మహోత్సవాలు జరుగుతాయన్నారు. 4న బెళుగుప్ప, అనంతపురం రూరల్, బొమ్మనహాళ్, బుక్కరాయసముద్రం, డి.హీరేహాళ్, గుత్తి రూరల్, గుత్తి అర్బన్, కళ్యాణదుర్గం అర్బన్, పెద్దపప్పూరు, 5న ఆత్మకూరు, కణేకల్లు, పామిడి రూరల్, పామిడి అర్బన్, పుట్లూరు, రాయదుర్గం అర్బన్, శెట్టూరు, ఉరవకొండ, యాడికి, యల్లనూరు, విడపనకల్లు, 6న వజ్రకరూరు, బ్రహ్మసముద్రం, పెద్దవడుగూరు, కుందుర్పి, కంబదూరులో పింఛన్ పెంపు మహోత్సవాలు నిర్వహిస్తారన్నారు. వలంటీర్లందరూ లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పింఛన్ మొత్తాన్ని పంపిణీ చేస్తారన్నారు. పంపిణీ సమయంలో ముఖ్యమంత్రి లేఖను పింఛన్‌దారులకు అందజేస్తారన్నారు.
నూతన సంవత్సరంలో ‘సంక్షేమ’ జాతర
నూతన సంవత్సరంలో ‘సంక్షేమ’ జాతర జరగనుంది. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 14 వరకు పింఛన్ల పెంపు సహా మూడు ప్రధాన పథకాల ద్వారా అర్హులకు లబ్ధి చేకూరనుంది. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారత కల్పించేందుకు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం ‘ఆసరా’. ఈ నెల 23 నుంచి 31 వరకు ‘ఆసరా’ వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ పథకం కింద నాలుగో విడత ద్వారా జిల్లాలో 24,100 డ్వాక్రా సంఘాలకు రూ.183.59 కోట్ల లబ్ధి చేకూరనుంది. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా నాలుగో విడతలోనూ ఆర్థిక సాయం అందించేందుకు ఫిబ్రవరి 5 నుంచి 14 వరకు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 1,18,881 మంది మహిళలకు రూ.35.96 కోట్లు అందజేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment