మరింత నాణ్యమైన వైద్యం | - | Sakshi
Sakshi News home page

మరింత నాణ్యమైన వైద్యం

Published Sat, May 6 2023 12:22 PM | Last Updated on Sat, May 6 2023 12:23 PM

- - Sakshi

అనంతపురం క్రైం: అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిని పూర్తిస్థాయిలో బలోపేతం చేస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. రూ.300 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఎంసీహెచ్‌, సర్జికల్‌ బ్లాక్‌ పనులను వేగవంతం చేస్తామన్నారు. ప్రజాప్రతినిధులు, వైద్యవిభాగాధిపతుల విజ్ఞప్తుల మేరకు సౌకర్యాలు మెరుగుపరచి రోగులకు నాణ్యమైన వైద్యం అందేలా చూస్తామన్నారు. మంత్రి శుక్రవారం ప్రభుత్వ సర్వజనాస్పత్రి, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని తనిఖీ చేశారు. గైనిక్‌ ఓపీ గదులు, ఐసీయూ, చిన్నపిల్లల వార్డులను పరిశీలించి అక్కడ అందుతున్న సేవలపై రోగులు, వైద్యులతో ఆరా తీసి.. సంతృప్తి వ్యక్తం చేశారు. మెయిన్‌ ఓటీ సమీపంలో అనస్తీషియా విభాగం నూతనంగా ఏర్పాటు చేసిన పెయిన్‌ రిలీఫ్‌ క్లినిక్‌ను మంత్రి ప్రారంభించారు.

ఈ క్లినిక్‌ ప్రాముఖ్యతను సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రఘునందన్‌, అనస్తీషియా వైద్యులు మంత్రికి వివరించారు. ఆస్పత్రిలో రూ.3.46 కోట్లతో ఏర్పాటు కానున్న బర్న్స్‌ వార్డును మంత్రి పరిశీలించి, త్వరితగతిన అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులు, వైద్యులను ఆదేశించారు. బర్న్స్‌ వార్డు ఆవరణలో ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తదితరులతో కలిసి మంత్రి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రిని సూపరింటెండెంట్‌ రఘునందన్‌ సన్మానించారు. అనంతరం జేఎన్‌టీయూ సమీపంలోని సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలోని క్యాథల్యాబ్‌ను పరిశీలించారు. క్యాథల్యాబ్‌ సేవల గురించి డాక్టర్‌ సుభాష్‌చంద్రబోస్‌ వివరించారు. మంత్రి వెంట జెడ్పీ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ, యాదవ కార్పొరేషన్‌ చైర్మన్‌ హరీష్‌యాదవ్‌, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, బీసీ సెల్‌ జోనల్‌ ఇన్‌చార్జ్‌ రమేష్‌గౌడ్‌ తదితరులు ఉన్నారు.

ఇదే స్ఫూర్తి కొనసాగించండి
సీఎం జగన్‌ సంకల్పానికి అనుగుణంగా మీరందిస్తున్న వైద్య సేవలపై రోగులు సంతృప్తికరంగా ఉన్నారని, ఇదే స్ఫూర్తి కొనసాగించాలని వివిధ విభాగాధిపతులను మంత్రి విడదల రజిని ఆదేశించారు. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో హెచ్‌ఓడీలతో మంత్రి సమావేశమయ్యారు. డీఎంఈ డాక్టర్‌ కే సత్యవరప్రసాద్‌ వివిధ కళాశాలల్లో చేపట్టబోయే సంస్కరణలను వివరించారు. అనంతపురం జీజీహెచ్‌, సూపర్‌ స్పెషాలిటీలో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ గౌతమి మంత్రికి విన్నవించారు. జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ రఘునందన్‌, సూపర్‌ స్పెషాలిటీ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ సుబ్రమణ్యం, హెచ్‌ఓడీలు రామస్వామి నాయక్‌, బీమసేనాచార్‌, సుహాసిని, సురేష్‌ తదితరులు మాట్లాడుతూ.. సర్వజనాస్పత్రిలో మంచాల కొరత ఉందని, యూనిట్లు పెంచి వైద్య సేవలను విస్తృతం చేయాలని, రేడియాలజీలో డిజిటల్‌ ఎక్స్‌రే మిషన్‌, క్యాస్కెట్స్‌ ఏర్పాటు, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని మంత్రికి విన్నవించారు. డీఎంఈ డాక్టర్‌ సత్యవరప్రసాద్‌ను ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీదేవి, సూపరింటెండెంట్‌ రఘునందన్‌ సన్మానించారు. సమావేశంలో ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ, ఎండీ మురళీధర్‌రెడి, ఎస్‌ఈ కృష్ణారెడ్డి, ఈఈ మునిచంద్రారెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఆత్మారాం, ఆర్‌ఎంఓ డాక్టర్‌ వైవీ రావు పాల్గొన్నారు.

సదుపాయాలు మెరుగుపర్చాలి
జిల్లాలోని తాడిపత్రి, కళ్యాణదుర్గం గుంతకల్లు, రాయదుర్గం తదితర ఏరియా ఆస్పత్రులు, సీహెచ్‌సీల్లో సదుపాయాలు మెరుగుపరచి, రోగులు అక్కడే వైద్యం పొందేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ తలారి రంగయ్య మంత్రిని కోరారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో అవయవదానం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. యువతకు ఉపాధి కల్పించడంలో భాగంగా మెడికల్‌ డివైజెస్‌ పార్క్‌లు, ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేయాలని కోరారు.

వేర్వేరుగా బడ్జెట్‌ కేటాయించాలి
ప్రభుత్వ సర్వజనాస్పత్రి, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి వేర్వేరుగా బడ్జెట్‌ కేటాయించాలని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మంత్రి విడదల రజినిని కోరారు. ఎంసీహెచ్‌, సర్జికల్‌ బ్లాక్‌ పనులు వెంటనే ప్రారంభించాలని, 200 పడకల నుంచి ఎంసీహెచ్‌ బ్లాక్‌ను 600 పడకల సామర్థ్యానికి పెంచాలని, క్యాజువాలిటీ, ఏఎంసీలలో మంచాలు, గదులు పెంచాలని విజ్ఞప్తి చేశారు. సూపర్‌ స్పెషాలిటీలో గ్యాస్ట్రో ఎంట్రాలజీ తదితర సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేలా వైద్యులను నియమించాలని కోరారు.

జగన్‌ పాలన దేశానికే ఆదర్శం
వైద్య రంగంలో సీఎం వైఎస్‌ జగన్‌ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని, ‘నాడు–నేడు’ ద్వారా ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచి నాణ్యమైన వైద్యం అందేలా చూస్తున్నారని మంత్రి విడదల రజిని తెలిపారు. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ రోగులకు వైద్య సేవలు చేరువ చేసేందుకు ‘ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌’ ప్రవేశ పెట్టారని, రాష్ట్రంలో నూతనంగా 17 వైద్య కళాశాలలను తీసుకొచ్చి రోగులకు మరింత నాణ్యమైన వైద్యం అందించాలని సీఎం తీసుకున్న నిర్ణయం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. తమ ప్రభుత్వం వైద్య ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తోందన్నారు. లంచాలకు ఆస్కారం లేకుండా.. ప్రజలకు ఉచితంగా కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందించాలన్న సీఎం ఆశయానికి అనుగుణంగా అనంతపురం జీజీహెచ్‌లో సేవలందుతున్నాయన్నారు. చంద్రబాబు పాలనలో వైద్య రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఆదర్శ పాలన అందిస్తున్న జగన్‌ను విమర్శించడమే టీడీపీ నేతలు పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/2

ఎంపీ రంగయ్య, ఎమ్మెల్యే అనంతతో కలిసి ఆస్పత్రిలో పర్యటిస్తున్న మంత్రి రజిని2
2/2

ఎంపీ రంగయ్య, ఎమ్మెల్యే అనంతతో కలిసి ఆస్పత్రిలో పర్యటిస్తున్న మంత్రి రజిని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement