
గుమ్మనూరు నారాయణకు టీడీపీ నేత పవన్ గౌడ్ హితవు
గుంతకల్లు: తెలుగుదేశం పార్టీ అధిష్టానం గుంతకల్లు ఎమ్మెల్యే టికెట్ ఎవరికీ ప్రకటించక ముందే ఓవరాక్షన్ ఎందుకు చేస్తున్నారని గుమ్మనూరు నారాయణకు ఆ పార్టీ బీసీ సెల్ అధికార ప్రతినిధి ఆర్.పవన్‌కుమార్ గౌడ్ హితవు చెప్పారు. ఆలూరు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ గుమ్మనూరు నారాయణ శుక్రవారం సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేశారు.
శనివారం గుంతకల్లులో టీడీపీ కార్యాలయం ప్రారంభిస్తున్నామని, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని అందులో విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై స్పందించిన పవన్‌కుమార్ గౌడ్ విలేకరులతో మాట్లాడుతూ తమ పార్టీకి కొన్ని పద్ధతులు ఉన్నాయని, పరిధి దాటి ప్రవర్తించడం మంచిది కాదని హెచ్చరించారు. పార్టీ అధినేత చంద్రబాబు టికెట్ ఎవరికని ప్రకటించకముందే సొంత నిర్ణయాలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. మీకు అంత ఉత్సాహంగా ఉంటే ఆలూరులో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త విరూపాక్షి సవాల్ విసిరారు కదా.. అక్కడ పోటీ చేయాలని హితవు పలికారు.
లేదా గుంతకల్లు అభ్యర్థిగా మీ అన్న గుమ్మనూరు జయరాం పేరును ప్రకటించినప్పుడు మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి.. అంతేకానీ సొంత నిర్ణయాలు తీసుకుంటే గుంతకల్లులో నాయకులు, కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. పార్టీ పెద్దలు కూడా ఇలాంటి చర్యలకు ఫుల్‌స్టాప్ పెట్టేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో మాజీ కౌన్సిలర్ హనుమంతు, నాయకులు కేశవ తదితరులు పాల్గొన్నారు.