మీడియాతో మాట్లాడుతున్న విశ్వేశ్వరరెడ్డి,చిత్రంలో శంకరనారాయణ, పైలా నరసింహయ్య
అనంతపురం కార్పొరేషన్: ఉమ్మడి అనంతపురం జిల్లాకు సాగు, తాగునీరందించే హంద్రీ–నీవా ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తి చేసిన ఘనత వైఎస్సార్‌దేనని వైఎస్సార్‌సీపీ అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త మాలగుండ్ల శంకరనారాయణ, ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ఉరవకొండలో టీడీపీ సభలో ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు.
ఆదివారం వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో వారు మీడియా సమావేశం నిర్వహించారు. విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ 2014 ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను ఒక్కటీ నెరవేర్చలేకపోయారని, అప్పట్లో రెయిన్‌గన్ల పేరిట రూ.600 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందని, హంద్రీ–నీవా మిగిలిపోయిన పనులకు 200 శాతం అంచనాలు పెంచి స్వాహా చేశారని ధ్వజమెత్తారు.
ఇప్పుడు ఓట్ల కోసం ప్రతి ఎకరాకూ నీరిస్తామని, 20 లక్షల ఉద్యోగాలిప్పిస్తామని అబద్దపు హామీలతో వంచించాలని చూస్తున్నారని విమర్శించారు. ఈసారి ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పడంతో పాటు టీడీపీని బంగాళాఖాతంలో కలిపేస్తారని హెచ్చరించారు. ఉరవకొండలో సభకు జనం తక్కువ సంఖ్యలో హాజరయ్యే సరికి చంద్రబాబు ఫ్రస్ట్రేషన్‌కు గురయ్యాడన్నారు. టీడీపీ సభ అట్టర్‌ఫ్లాప్ అయ్యిందన్నారు.
పయ్యావులది సైంధవుడి పాత్ర..
ఉరవకొండలోని ఆమిద్యాల, రాకెట్ల లిఫ్ట్ ప్రాజెక్ట్‌లు, ఇప్పేరు, జీబీసీ కాలువకు నీరందకుండా అడ్డుకుని ఎమ్మెల్యే కేశవ్ సైంధవుడి పాత్ర పోషించాడని విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉరవకొండ నియోజకవర్గంలో ప్రాజెక్ట్‌ల కింద ఒక్క ఎకరాకై నా టీడీపీ హయాంలో నష్టపరిహారం చెల్లించారా అని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఏడాదిన్నరలోనే రైతులకు నష్టపరిహారం చెల్లించి, అధికారికంగా నీరందించేలా చర్యలు తీసుకున్నామన్నారు.
76 వేల ఎకరాలకు సాగునీరిచ్చేందుకు నిధులు విడుదల చేస్తామని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి బహిరంగ సభలో ప్రకటించారన్నారు. జీడిపల్లి రిజర్వాయర్ బాధితులకు పరిహారం ఇస్తామన్నారు. గుంతకల్లు, వజ్రకరూరు మండలాల్లోని చెరువులకు నీరందించేందుకు రూ.20 కోట్లు ఇస్తామని తెలియజేశారన్నారు. కూడేరులో త్వరలోనే పరిశ్రమలు రాబోతున్నాయని చెప్పారు.
టీడీపీ ప్రభుత్వంలో తక్కువ ధరతో భూములు కాజేసి, గాలిమరల కంపెనీతో రూ.కోట్లు కొల్లగొట్టారని కేశవ్‌పై విరుచుకుపడ్డారు. పీఏసీ చైర్మన్‌గా బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేశారన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, ఏడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ పామిడి వీరాంజేయులు పాల్గొన్నారు.
5 టీఎంసీలకు కుదించిన బాబు..
హంద్రీ–నీవా ప్రాజెక్టును ఆనాడు 40 టీఎంసీలతో ప్రతిపాదిస్తే చంద్రబాబు ఐదు టీఎంసీలకు కుదించి.. పైగా పనులేవీ ప్రారంభించకుండా ప్రజలను మోసం చేశారని మాలగుండ్ల శంకర నారాయణ మండిపడ్డారు.
వైఎస్సార్ హయాంలో రూ.6,500 కోట్లతో డీపీఆర్ తయారు చేసి, గుంతకల్లు నుంచి మడకశిర వరకు హంద్రీ–నీవా సుజల స్రవంతి ద్వారా తాగు, సాగునీరందించాలని, జీడిపల్లి, గొల్లపల్లి, చెర్లోపల్లి రిజర్వాయర్లతో పాటు కాలువల ద్వారా చెరువులకు నీరందిస్తూ ఆయకట్టును వృద్ధిలోకి తీసుకురావడానికి రూపకల్పన చేశారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment